జీవితం అంటే ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకి ప్రయాణం.----------------డిసెంబర్ నెలచలిచలిగా వుంది.రాత్రి పన్నెండు గంటలు దాటింది. లూనా మీద ఎవరో స్పీడుగా వస్తూ రోడ్డువారగా పడుకున్న కుక్కపిల్లను చూసుకోలేదు. ముడుచుకుని పడుకుందేమో, నిద్ర మత్తులో వుందేమో కుక్కపిల్లకీ ఆ అలికిడికి మెలకువ రాలేదు. దాంతో కుక్కపిల్ల కాలిమీదుగా లూనా పోవడంతో ఒక్కసారిగా బాధగా కుయ్యి మందది. దానరుపుని పట్టించుకోలేదు లూనా మీదున్న వ్యక్తి. తన ధ్యాసలో తానుండి వెళ్లిపోయాడు. అలావెళ్లిపోయిన వ్యక్తిని గుర్రుగా ఓసారి చూసి ‘మళ్లీ ఇట్రారా నీ సంగతి చెప్తాను’ అన్నట్లుగా తల విదిల్చి నొప్పి పెడుతున్న కాలిని మడిచి కుయ్యి కుయ్యి మంటూ ముందుకి ఎలక్ర్టికల్ పోల్ దగ్గరగా కుంటుకుంటూ వచ్చి, పోల్‌నానుకుని ముడుచుకుని మళ్లీ పడుకుంది కుక్కపిల్ల. లూనా రెండు మూడు మలుపులు తిరిగి శ్రీ సాయి కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ దాటి కన్యకా పరమేశ్వరి కోవెల దాటి రథం వీధి దాటి కుడివైపునకు తిరిగి అక్కడి పైకప్పులేని మొండి గోడలు వున్న పాడుబడిన ఇంట్లోకి ప్రవేశించి ఆగింది. లూనా ఆగీ ఆగడంతో పందికొక్కొకటి భయంభయంగా పరుగులు తీసి రాళ్ల మధ్యన చేరి దాగుంది. లూనా ఆఫ్ చేసి, కిందికి దిగి, చేతులనోసారి రబ్ చేసుకున్నాడా వ్యక్తి. అరకొరా వెలుగులో ఆ వ్యక్తిని జాగ్రత్తగా గమనిస్తే -అతనంత పొడవూ కాదు, పొట్టీ కాదు. మధ్యస్తంగా వున్నాడు. వైట్ అన్ వైట్- తెల్లలాల్చీ షరాయి మీదున్నాడు. అతని ఎడం చేతికి వాచీ వుంది. కుడిచేతి ఉంగరం వేలికి వుంగరం వుంది. అయితే అది బంగారంది కాదు, వెండిది.వేలికేదో ప్లాస్టర్ చుట్టినట్టుగా మాసిపోయి అసహ్యంగా వుందా వుంగరం. మెడలో ఒంటిపేటది వెండి గొలుసుంది. అదీ అంతే! పాతబడిపోయి చచ్చిన పాములా వుంది. గొంతులో రాయేదో ఇరుక్కున్నట్టుగా గొంతుముడి, జారుడు ముక్కు, లోతు కళ్లు, చక్కు దవళ్లు. మొత్తానికి మొహంలో మాంసాన్నీ, గాలినీ ఎవరో లాగేసినట్టుగా వున్నాడతను. ముప్పయ్యేళ్ల వయసుంటుందతనికి. అందులో అనుమానం లేదు. అయితే... తనకు పాతికేనంటూ చెప్పుకొస్తూ అసలు పేరు ‘కిష్టపల్లి కుక్కల నా కొడుకు’ ట్రిపుల్ కె ని. ‘కిష్టపల్లి కొంటె కిష్టుడ’ంటూ చెప్పి కిసుక్కున నవ్వుతాడతను. అతనికందరిలాగే రెండు కాళ్లున్నా ఒక కాలు కుంటిది. దాంతో అతను ఒక కాలు పోగొట్టుకున్న నిచ్చనలా పక్కకి ఒరిగి నిల్చుంటాడు.ఇప్పుడలాగే నిల్చున్నాడు ట్రిపుల్ కే. నిల్చుని షరాయి జేబులోంచి సిగరెట్ తీసి ముట్టించాడు. రెండు దమ్ములు లాగి ముక్కులోంచి కూడా పొగ నొదిలి, ఎవరి కోసమో చూస్తున్నట్టుగా చూస్తూ వెయిట్ చెయ్యసాగాడు.---------------గబగబా నడుస్తోంది లక్ష్మి. నడుస్తూ ఆయాసపడుతూ చెమటలు పట్టిపోతోంది. రాత్రి పన్నెండు గంటలు దాటినా డిసెంబర్ నెలయినా చలిచలిగా వున్నా, లక్ష్మి చెమట్లు పట్టిపోతోందంటే తనేదో చెయ్యరాని పనో, చెయ్యకూడని పనో చేస్తోంది. దాంతోనే భయంతోనూ, ఆందోళనతోనూ చెమట్లు పట్టిపోతోంది.లక్ష్మికి మొన్నటికి మొన్న దీపావళికి పదిహేడెళ్లి పద్ధెనిమిదేళ్లొచ్చాయి. పద్దెనిమిదేళ్ల లక్ష్మి పాండవ వనవాసం సినిమాలో హేమమాలినిలా సన్నగా, పొడుగ్గా చూడముచ్చటగా వుంటుంది. సంపెంగ ముక్కు, పెద్ద పెద్ద కళ్లు, చిన్న నోరు, చక్కనైన మెడ, సరసమైన గుండెలు... చెక్కినట్టుగా వుంటుంది. ‘ఈ గుంట ఎవడికి పడతాదో కాని, ఆడు బూర్ల గంపలో పడ్డట్టే...’ అన్నట్టుగా కూడా వుండి, అందరినీ ఊరిస్తూ వుంటుంది. బ్రాందీకి బీరు తోడైనట్టుగా ఇన్ని అందాల లక్ష్మికి నటన కూడా తోడవడంతో ఇక చెప్పేదేముంది? కాక్‌టెయిల్ అయ్యి అందరికీ కిక్కిచ్చేస్తోంది.లక్ష్మి ఇంటర్ ఫస్టియర్ వరకూ తెలుగు మీడియంలో చదువుకుంది. ‘వాటీజ్ యువర్ నేమ్ ’అనడిగితే ‘మై నేమ్ ఈజ్.. మై నేమీజ్ లక్ష్మీ’ అని సిగ్గుసిగ్గుగా చెప్పుకోగలిగే ఇంగ్లీషు కూడా వచ్చామెకు. ఇంటర్ సెకండి యర్ కూడా చదివేదే, కాకపోతే అప్పుడే ఓ చిన్న నాటికలో ఓ చిన్న వేషమేసింది. చెల్లెలి వేషం. బాధ్యత లేని అన్నయ్య తాగి వచ్చి చెల్లిని కొడితే, చెల్లెలిగా తాను బాధగా జీరగా ఏడుస్తూ-‘‘ఆడదాన్ని, పైగా చెల్లెలిని కొడుతున్నావ్, సిగ్గు లేదురా? ఇవ్వాళ నా మీద పడుతున్న ఒక్కొక్క దెబ్బా రేపు నీ మీద లాఠీలుగా విరుచుకు పడతాయి. పోలీసులు నిన్నలా కొడతారు. తప్పదు. ఇది నా శాపం’’ అన్నప్పుడు చప్పట్లతో హాలు హాలంతా మారుమోగిపోయింది. ‘వన్స్‌మోర్’ అన్నారెవరో. నాటిక అయిపోయింది.స్టేజీ వెనక ముఖం కడుక్కుంటుంటే ఎవరో పెద్దాయన, ప్రముఖ రంగస్థల నటుడట- ఆయనొచ్చి తన రెండు చేతులూ పట్టుకొని, చెమ్మగిల్లిన కళ్లతో, అదోరకమైన గొంతుతో -‘‘బాగా చేశావమ్మా! అద్భుతంగా నటించావ్. నీలో ఓ మహానటి దాగుంది. ఆ నటిని చదువులో పడి చంపకు. దయచేసి చంపకు’’ అనడంతో తనలో వున్న మహానటిని చంపడం ఇష్టం లేక ఆ నటిని కాపాడ్డం కోసం ఇంటర్ సెకండియర్ చదవడం మానుకుంది లక్ష్మి.పరీక్ష పోగొట్టుకుంది.పరీక్ష పోయిన రోజైతే తనలో వున్న నటిని లక్ష్మి కాపాడుకోగలిగిందేమో కానీ, తన్ను తాను కాపాడుకోలేకపోయింది. అన్నయ్య అంతలా ఆమె మీద రెచ్చిపోయాడు. ఆమె రెండు చెంపలూ వాయించేసి -‘‘ఏమనుకుంటున్నావే, నీ గురించి నువ్వేమనుకుంటున్నావ్? ఈ నాటకాలు కూడు పెడతాయనుకుంటున్నావా? పెట్టవే, పెట్టవు. కనీసం గొంతు తడుపుకునేందుకు ఇన్ని నీళ్లు కూడా ఇవ్వవు. చక్కగా చదువుకోవే అంటే చదువుకోక పరిషత్తులంటూ, పోటీలంటూ ఆ ఊరూ ఈ వూరూ తిరిగి పరీక్ష పోగొట్టుకుంటావా? నిన్నూ.... నిన్ను చంపినా పాపం లేదే’’ అన్నాడు. కళ్లంట నీళ్లు కూడా పెట్టుకున్నాడు.‘‘నాన్నేమయ్యాడో తెలీదు. పారిపోయిన మనిషి బతికాడో చచ్చాడో కూడా అంతు చిక్కడం లేదు. పుడుతూనే అమ్మను పొట్టన పెట్టుకున్నావ్. అన్నయ్యను కాబట్టి, తప్పదు కాబట్టి నిన్ను నా తలకెత్తుకున్నాను. ఏదో ఇంటర్ పాసయితే నీ బతుకు నువ్వు బతుకుతావనుకుంటే ఫెయిలవుతావా? ఛీ....’’ అని నెత్తికొట్టుకున్నాడు.తరువాత ఏమనుకున్నాడో ఏమో, దగ్గరగా వున్న తనని బలంగా, దురుసుగా, దూరంగా నెట్టేసి వెళ్లిపోయాడు.అన్నయ్య నెట్టిందానికి లక్ష్మి వెళ్లి గోడకు కొట్టుకునేదే! కొట్టుకుంటే తలకు బొప్పి కట్టేదే! కాకపోతే తన్ను తాను నిభాయించుకోవడంతో నిలదొక్కుకోగలిగింది. ఊపిరి పీల్చుకుంది. ఆ రాత్రంతా తిండి లేదు. అన్నయ్య మీద కోపంతో తిండి మానుకుంది. అయినా ఆకలి వేస్తుంటే దాన్ని తట్టుకోలేక నీళ్లు తాగుతుంటే గది కిటికీ అవతల ఆకాశం, చుక్కలు, చంద్రుడుతో బాటు చెట్టుకు చేరేసిన నిచ్చెనలా ‘త్రిబుల్’ (ట్రిపుల్ కెని లక్ష్మి ‘త్రిబుల్’ అని పిలుస్తుంది). కనిపించాడు.‘ఏంటిలా వచ్చావ’న్న లక్ష్మి చూపుకు సమాధానంగా‘‘సుందరం నిన్ను రమ్మంటున్నాడు’’ అన్నాడు త్రిబుల్ కిటికీ దగ్గరగా వచ్చి.‘‘ఎక్కడికి?’’ అడిగింది లక్ష్మి.‘‘కాలేజీ తోటలోకి’’ అన్నాడు.‘‘ఇప్పుడా? అన్నయ్య పడుకున్నాడు’’ అంది.‘‘అన్నయ్య పడుకున్నాడు కాబట్టే ఇప్పుడు రమ్మంటున్నాడు, పొద్దున మీ అన్నయ్య నిన్ను కొట్టడం ఇదే కిటికీలోంచి సుందరం చూశాట్ట. తట్టుకోలేక ఏడుస్తున్నాడు’’ చెప్పాడు.‘‘వస్తున్నానయితే’’ అంది లక్ష్మి.‘‘రా’’ అంటూ పక్కకి తప్పుకున్నాడు త్రిబుల్.సుందరానికి పాతికేళ్ల వయసుంటుంది. గట్టిగా, బలంగా వుంటాడతను. జీన్స్ పాంటూ షర్టులో హీరోలా వుంటాడు. కాలేజీలో క్లర్క్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. నాటకాలాడతాడు. వేసే ప్రతి నాటకానికీ అతనే హీరో. హీరోయిన్లే మారుతూ వుంటారు. లక్ష్మి హీరోయిన్ కాకముందు ఊరూ పేరూలేని వాళ్లంతా హీరోయిన్లయిపోయారు. లక్ష్మి ఎప్పుడయితే స్టేజెక్కిందో, అప్పటినుండి వాళ్లెవరికీ ఉనికి లేకుండా పోయింది. లక్ష్మికి చెల్లెలి వేషమిచ్చింది సుందరమే. మొదటి నాటికలోనే సుందరానికి లక్ష్మి చెల్లెలిగా నటించింది. తరువాత్తర్వాత అలాంటి పాత్రలు నటించలేదు. తను నటించలేదు అనేకంటే సుందరంనటింపజేయలేదంటే బావుంటుంది.‘‘ఏం చెల్లెలి వేషానికి నేను పనికిరానా?’’ సుందరాన్నడిగింది లక్ష్మి.‘‘ఎందుకు పనికిరావు, కాకపోతే నీలో నేను చెల్లిని చూడలేకపోతున్నాను’’ అన్నాడు సుందరం.అలా అని చెప్పడమే కాకుండా, మోచేతి దూరంలో వున్న లక్ష్మిని ఒక్కుదుటున ముందుకు లాక్కున్నాడు. భుజాల మీద చేతులుంచి ఆమె కళ్లల్లో కళ్లు పెట్టాడు. అప్పుడు సుందరం కళ్లని పరిశీలనగా చూసింది లక్ష్మి. ఆ కళ్లు చాలా విశాలంగా వున్నాయి. చెరువు నీళ్లలా చల్లగా వున్నాయి. గొడుగు నీడలా వెచ్చగా వున్నాయి. అంతే! ‘ఈ కళ్లు చాలు నా బతుక్కు’ అనుకుంది లక్ష్మి. మైమరుపుగా కళ్లు మూసుకుంది. అదే అదననుకున్నాడేమో లక్ష్మిని ముద్దుపెట్టుకున్నాడు సుందరం. అది మొదలు కష్టానికీ సుఖానికీ సుందరం కావాల్సొచ్చాడు ల క్ష్మికి.ఇద్దరూ ప్రేమలో పడ్డారు.ప్రేమికులకి ఏకాంతాలు కావాలి. ఆ ఏకాంతాలకి పార్కులు, తోటలూ కావాలి. అలాగే వాళ్లలా ఏకాంతంలో వుండేందుకు ప్లేసులు, పథకాలూ ఫిక్స్ చేస్తూ వాళ్లక్కావలసింది అందచేస్తూ వాళ్లనెవరూ చూడకుండా చేస్తూ కాపుగా ఓ మనిషి కావాలి. కావాలంటే అందుకు త్రిబుల్ గాడు రెడీ. అలా లక్ష్మికి దగ్గరయ్యాడు త్రిబుల్. సుందరానికి వాడింకా దగ్గర. అదలా వుంచితే-కొరికి పారేసిన రాక్షస గోరులా ఆకాశంలో చంద్రుడున్న వేళ, ఇంతింత కళ్లు చేసుకుని నక్షత్రాలు తీక్షణంగా చూస్తున్నట్టనిపించే సమయంలో, ఎక్కడో నక్కలు అరుస్తుండగా, మరెక్కడో గుడ్లగూబలు ఎగురుతూండగా, చీకటి చీకటి తోటలోకి త్రిబుల్ గాడితో రానే వచ్చింది లక్ష్మి. చూస్తూనే లక్ష్మిని అమాంతం కౌగిలించుకున్నాడు సుందరం. త్రిబుల్ చెట్టుచాటుకి తప్పుకున్నాడు.‘‘వద్దు లక్ష్మీ వద్దు. నువ్వీ ఊళ్లో వుండద్దు’’ బాధగా అన్నాడు సుందరం.‘‘మరెక్కడుండాలి?’’ దీనంగా అడిగింది లక్ష్మి.‘‘వుంటే గింటే నీలాంటి నటి హైదరాబాద్‌లో ఉండాలి, చైన్నైలో ఉండాలి. లేదంటే ముంబాయ్‌లో వుండాలి’’ అన్నాడు సుందరం.‘వుండాలంటే తెలిసిన వాళ్లు వుండాలి కదా’ అంది లక్ష్మి‘వున్నారు లక్ష్మీ! వున్నారు! హైదరాబాద్‌లో మా అక్క వుంది. అక్కంటే సొంతక్క కాదు. మా పిన్ని కూతురు. కృష్ణా నగర్‌లో వుంటుంది. వెళ్లిపో లక్ష్మీ! తన దగ్గరకు నువ్వెళ్లిపో’ ’అన్నాడు సుందరం.‘‘ఆవిడ అక్కడేంటి?’’ అడిగింది లక్ష్మి.‘‘ఏంటో నాకూ తెలీదు గానీ, అక్కకి పెద్ద పెద్ద సినిమా వాళ్లతో పెద్దపెద్ద పరిచయాలున్నాయి. తను తలుచుకుందంటే చాలు నిన్ను స్టార్‌ని చేసేస్తుంది. అందులో అనుమానం లేదు. వెళ్లిపో’’ అన్నాడు సుందరం.‘‘మరినువ్వు?’’‘నేనూ నీతోబాటే వచ్చేస్తాను. నువ్వు హీరోయిన్, నేను హీరో. హైదరాబాద్‌లో ఫిలిం నగరంతా మందే’ అన్నాడు. రామోజీ ఫిలిం సిటీ గురించి చెప్పాడు. రామానాయడు స్టూడియో గురించి చెప్పాడు. సారథిలో సెట్ల గురించి, పద్మాలయాలో ఫోర్ల గురించి చెప్పి-‘‘నీకేంటి లక్ష్మీ, నీకేం తక్కువ? నిన్నో పక్కనుంచి చూస్తే ఇలియానాలా కనిపిస్తావ్, మరో పక్క నుంచి చూస్తే కరీనాలా అనిపిస్తావ్. వద్దొద్దు. నువ్విక్కడ వుండద్దు, వెళ్లిపో! వెళ్లిపో! హైదరాబాద్ వె ళ్లిపో’’ అన్నాడు సుందరం. ‘సరే’నంది లక్ష్మి.‘‘రెండు మూడు రోజుల్లో మా అక్క ఇక్కడికి వస్తుంది. పరిచయం చేస్తాను. వీలయితే అక్కతోపాటు వెళ్లిపోదువుగాని’’ అన్నాడు.‘‘నువ్వు కూడా రావాలి’’ అంది లకి్క్ష.‘‘ఎందుకు రాను? నేనెప్పుడూ నీ పక్కనే వుంటాను’’ అన్నాడు.‘అన్నయ్య దెబ్బలకి తట్టుకోలేక పోయాను సుందరం’ బాధగా చెప్పింది లక్ష్మి.‘చూశాను. చూసిన నేనే తట్టుకోలేకపోయాను. దెబ్బలు తిన్న నీ సంగతి చెప్పాలా?’ అని ఆమె బుగ్గల మీద ముద్దులు కురిపించాడు సుందరం. మండుతున్న బుగ్గలు చల్లబడ్డట్టనిపించాయి లక్ష్మికి! కొన్నాళ్లు గడిచాయి.ఈ కొన్నాళ్లూ ఇంతే!వె ళ్లిపో! వెళ్లిపో! హైదరాబాద్ వెళ్లిపో!వెళ్లిపోవాలనే నిర్ణయించుకుంది లక్ష్మి. తనిలా నిర్ణయించుకుందో లేదో సుందరం ఇంటికి వాళ్ల హైదరాబాదక్కయ్య ఇట్టే వచ్చేసింది.వచ్చిన ఆ అక్కయ్య ఎలా వుందయ్యా అంటే -ఇంతింత జబ్బలతో, అంతంత కళ్లతో రిక్షా నిండుగా వుంది. జరీ అంచు తెల్లచీర కట్టిందేమో తెల్లతెల్లగా చల్లచల్లగా వుంది. చెవులకి జూకాలు, మేటీలు, చేతులకి డజను డజను గాజులు, మెళ్లో నల్లపూసలు, గంటల్లా పుస్తెలు, రవ్వల నెక్లెసు- ఓలమ్మోలమ్మో! వూరి అమ్మతల్లులు ఇప్పల పోలమ్మ, ఎర్రకంచమ్మల తోడబుట్టిన దానిలా, తొడగొట్టి, నడిబజార్లో నిలబడేదానిలా వుంది. నవ్వితే ఆయమ్మ నోట్లో ఇటు పన్ను మీద పన్నే కాదు, అటు బంగారపు పన్ను కూడా కనిపించేలా వుంది.పెద్దపెద్ద సూట్‌కేసులు- రెండు సూట్‌కేసులతో రిక్షా దిగిందామె.ఆ సూట్‌కేసులకి చక్రాలున్నాయి. లాగడానికి తాళ్లున్నాయి. తాళ్లుపట్టి ఆ సూట్‌కేసులు లాగుతూ వుంటే- రథాల్ని లాగుతోన్న లోకల్ వస్తాదులా వుంది.ఆమె పేరు వైజాగ్ శకుంతల. వైజాగ్ ఆమె ఇంటిపేరు కాదు. కాకపోతే ఒకప్పుడామె వైజాగ్‌లో వుండేది కాబట్టి ఇప్పుడంతా ఆమెను అలా పిలుస్తున్నారు.‘‘మా శకుంతలక్కొచ్చేసింది! మా శకుంతలక్కొచ్చేసింది’’ గోలచేశాడు సుందరం. అక్క వచ్చిన ఆనందంలో లక్ష్మిని మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు.‘‘నా మరదలు పిల్ల ఈ చక్కని చుక్కేనా?’’ లక్ష్మి పొడవు వెడల్పులు అంచనా కడుతూ అడిగింది శకుంతల.‘‘అవునక్కా’’ అని లక్ష్మిని వాళ్లక్కకి పరిచయం చేశాడు సుందరం.‘‘మంచి నటక్కా! ట్రాజెడీ, కామెడీ ఏదైనా చేసేస్తుంది! బాడీ లాంగ్వేజ్ అదిరిపోతుందనుకో’’‘‘అవునా’’ అంటూ ఆప్యాయంగా లక్ష్మి తల మీద చేయుంచి నిమిరింది శకుంతల.‘‘చూడక్కా! నువ్వే చూడు! ఎంత బావుందో’’ లక్ష్మిని కాస్తంత దూరంలో బొమ్మలా పెట్టి చూపించాడు సుందరం.లక్ష్మిని రకరకాలుగా చూసింది శకుంతల. రెండో ఎక్కాన్ని మీది నుంచి కిందకి, కిందనుంచి మీదకి అప్పజెప్పినట్టుగా చూసింది. గుత్తొంకాయ కూరను కొరికి రుచి చూసినట్టుగా చూసింది. ముత్యాల్ని అరచేతిలో వుంచుకొని మంచివా? కాదా? అన్నట్టుగా పరిశీలించినట్టుగా చూసింది. చూస్చూసి అంతా బాగుందన్నట్టుగా ‘భేష్’ అంది.‘‘పిల్లలో ఎంచడానికేం లేదుగాని- మీరిద్దరూ పెళ్లెప్పుడు చేసుకుంటున్నారు’’ అడిగింది.‘‘పెళ్లా? అప్పుడే పెళ్లేంటి’’ ఆశ్చర్యపోయాడు సుందరం.‘‘ ఇంకా రెండు మూడేళ్లు ప్రేమించుకోవడమే! పెళ్లి చేసుకుంటే మార్కెట్ పోదూ’’ అన్నాడు మళ్లీ.‘‘ముందు లక్ష్మి హీరోయిన్ కావాలి! తర్వాత నేను హీరో కావాలి. ఇద్దరం బాగా డబ్బు సంపాదించాలి. ఆ తర్వాతే మా పెళ్లి’’ అని నవ్వాడు.‘‘నీకో సంగతి తెలుసక్కా! ఇద్దరం ఇంత క్లోజ్‌గా వుంటున్నా ముద్దులు, కౌగిలింతలే తప్ప- మితిమీరి ప్రవర్తించడం లేదు! అంత పట్టుగా ఇద్దరం వున్నాం’’ అన్నాడు.‘‘ ఎంగిలి పడ్డం ఎంతసేపక్కా! కాని పద్ధతి! పద్ధతిగా వున్నాం’’ అన్నాడు గొప్పగా.సుందరం అన్ని మాటలకి ‘అవును’ అన్నట్టుగా సన్నగా నవ్వుతూ నిల్చుంది లక్ష్మి.‘‘చెడిపోడం, చెడగొట్టడం క్షణాల్లో పని! ఆ పని నేను నీ తమ్ముడిగా చెయ్యను గాక చెయ్యను’’ అన్నాడు సుందరం.‘‘హెల్ప్ చెయ్యక్కా! మా ల క్ష్మిని హీరోయిన్ను చెయ్యక్కా’’ అని శకుంతల చేతులు పట్టుకున్నాడు. కళ్లు చెమర్చుకున్నాడు. అది చూసి-‘‘ఛ ఛ!! ఏంట్రా!! ఏంటిది! ఏడుపెందుకూ?! నేనున్నాను! నేనంతా చూసుకుంటాను! లక్ష్మిని హీరోయిన్ని చేసే పూచీ నాది! బలేవాడివే’’ అంటూ సుందరాన్ని దగ్గరగా తీసుకుంది శకుంతల. పెంపుడు కుక్కపిల్లను తీసుకున్నట్టుగా సుందరాన్ని దగ్గరగా తీసుకుని, వాడితల మీద ముద్దు కూడా పెట్టింది శకుంతల. ఇదంతా చూసి చలించి పోయింది లక్ష్మి. ఆమె కళ్లల్లో ఆనంద బాష్పాలు చోటు చేసుకున్నాయి.ఆ రాత్రి-లక్ష్మికి శకుంతల హైదరాబాద్‌లో కొన్న చార్మినార్ గాజులనిచ్చింది. సుల్తాన్ బజార్ బొట్టుబిళ్లలిచ్చింది. ఎర్రగడ్డ సంతలో కొన్న వాక్‌మేనిచ్చింది. పుల్లారెడ్డి స్వీట్లిచ్చింది. ఇచ్చి ‘బాగున్నాయా’ అనడిగింది. ఆ అడగటం అమ్మలా అడిగింది. దానికేం చెప్పాలో తెలీక కన్నీళ్లు పెట్టుకుని శకుంతల్ని అల్లుకుపోయింది లక్ష్మి. పందిర్రాటకి మల్లెతీగ చుట్టుకున్నట్టుగా శకుంతల్ని చుట్టుకుపోయింది లక్ష్మి. తనని చుట్టుకుపోయిన లక్ష్మిని చూస్తూ-‘‘పిచ్చిపిల్ల’’ అంటూ నవ్వింది శకుంతల.తర్వాత మళ్లీ పూసల గొలుసిచ్చింది. స్కర్టూ, షర్టూ, బ్యాగిచ్చి వేసుకుని రమ్మంది. వేసుకొనొచ్చింది లక్ష్మి. వేసుకొచ్చిన లక్ష్మిని చూస్తూ వెర్రెత్తిపోయింది శకుంతల. ఆ డ్రస్సులో లక్ష్మి బంజారా హిల్స్ బడాబాబుల కూతుర్లా వుంది. జూబిలీ హిల్స్ సినీజనాల చెలికత్తెలా వుంది. బాగు బాగున్నదనుకుంది శకుంతల. బ్రహ్మాండం అనుకుంది.‘‘హైదరాబాద్ ఎప్పుడోస్తున్నావ్’’ అడిగింది.‘‘మీరెప్పుడంటే అప్పుడే’’ అంది లక్ష్మి.‘‘అయితే రేపెళ్లిపోదాం! మీ అన్నయ్యతో చెప్పి బయల్దేరు’’ అంది శకుంతల.‘‘అమ్మో! అన్నయ్యతోనా?! వద్దొద్దు! నేనేమీ అన్నయ్యకు చెప్పను! మనం వెళ్లిపోదాం! అంతే!’’ అంది లక్ష్మి.‘‘పాపం! మీ అన్నయ్య కంగారు పడతాడేమో’’‘‘పడితే పడనీయండి! నా బతుక్కి ఆయన అడ్డుపడకుండా వుంటే అంతే చాలు’’ అంది లక్ష్మి కోపంగా.‘‘సరే మరి! రేపు రాత్రి రెండుగంటలకి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్సుంది. దానికెళ్లిపోదాం! నువ్వు రెడీ అయిపో’’ అంది శకుంతల. అలాగేనంది లక్ష్మి.‘‘మీ అన్నయ్యకు తెలీకుండా వుండాలంటే అంతా గప్‌చీప్‌గా జరగాలి. రేపు రాత్రి పన్నెండున్నర, ఒంటిగంటకల్లా నువ్వు రథం వీధి దాటి రైట్ సైడ్లో వున్న పాడుబడ్డ ఇంటి దగ్గర కొచ్చావనుకో! అక్కడ నీకోసం వెయిట్చేస్తూ త్రిబుల్ గాడుంటాడు. వాడి లూనా నువ్వు ఎక్కావనుకో! నువ్వు హైదరాబాద్ వచ్చేసినట్టే’’ అని నవ్వింది శకుంతల. అందుకు ‘ఓకే’ అన్నట్టుగా తలూపింది లక్ష్మి. నిద్రొస్తున్నట్టుగా ఆవలింత కూడా తీసింది.ఆ రాత్రి గడిచింది.తెల్లారింది.మళ్లీ రాత్రయ్యింది.పన్నెండు గంటలు దాటింది. ఫలితంగానే ఇప్పుడు లక్ష్మి నడుస్తూ చెమటలు పట్టిపోతోంది. చేతిలో సూట్‌కేస్ బరువుగా వుందేమో- చేతిని లాగేస్తోందది. దాంతోపాటు ఇంటినుంచి బయల్దేరినప్పుడు ఎంత కాదనుకున్నా అన్నయ్య కదా! చిన్నప్పటి నుంచి పెంచి పోషించాడు కదా! పడుకున్న అన్నయ్యని కళ్లనిండుగా ఓసారి చూసుకుని వెళ్లిపోదాం అనుకొని, అన్నయ్య పడుకున్న గదిలోకి వెళ్లింది. అక్కడన్నయ్య మంచి నిద్రలోవున్నాడు. గుర్రుపెడుతున్నాడు. అన్నను చూస్తూ- ‘వెళ్లొస్తానన్నయ్యా’ మనసులోనే అంది లక్ష్మి. అన్నయ్య కాళ్లవైపు చూస్తూ ఆ కాళ్లకి నమస్కరిస్తున్నట్టుగా కళ్లార్చింది. అంతే! తన కాళ్లమీదుగా ఏదో పాకినట్టనిపిస్తే- ‘అమ్మో’ అంది గట్టిగా లక్ష్మి. అంతలోనే నోరు నొక్కుకుని తేరిపార చూసింది. బొద్దింక. బీరువా కిందికి పరుగు దీస్తూ కనిపించింది. ఇంతేకదా! అని తెప్పరిల్లేంతలో-‘‘ఏంటే గోల’’ నిద్రలోనే అడిగాడు అన్నయ్య.‘‘ ఏం లేదన్నయ్యా! ఏం లేదు’’ అని బైటపడింది లక్ష్మి. బైటపడిందేగాని- అన్నయ్య అంతా గమనిస్తున్నాడన్న భయంతో వుంది. ఆ భయంతోనే గుండెలార్చుకు పోతున్నాయి లక్ష్మికి.గబగబా నడుస్తోందేకాని ఆ నడకలో వేగం లేదు. ఆమె అడుగులు తడబడుతున్నాయి. అలా తడబడిన అడుగులకి - కాలికింద ఏదో మెత్తగా తగిలింది. అంతే! ‘కుయ్యి’ మంది కుక్కపిల్ల. లూనా తొక్కేసిన కాలిమీదే ఇప్పుడు లక్ష్మి కాలు కూడా పడడంతో గోలగోల పెట్టేస్తోందది.‘మీ అమ్మకడుపులు మాడ’ అన్నట్టుగా అరుస్తోంది. ‘ఎలక్ర్టికల్ పోల్ చాటు చేసుకుని పడుకున్నా తొక్కేస్తున్నారేంటర్రా’ అన్నట్టుగా గగ్గోలెత్తి పోతోంది.దాంతో బెంబేలెత్తి పోతూ చూసిన లక్ష్మికి ఎదురుగా అతను కనిపించాడు. షాకయిపోయిందామె. ఏం చెయ్యాలో తెలీక ఏడుస్తూ చేతిలో సూట్‌కేసు కింద పడేసింది.డబ్’న కింద పడ్డ సూట్‌కేస్‌ను ఏడుస్తున్న లక్ష్మిని రెండు మూడుసార్లు చూసి‘‘వద్దు లక్ష్మి! నువ్వు ఈ వూరొదిలి వెళ్లొద్దు’’ అన్నాడతను. అలా అంటున్నప్పుడు అతని గొంతు దుఃఖంతో బొంగురుపోయింది.లక్ష్మి ఏడుస్తోండడం, అతను కూడా ఏడుస్తూ మాట్లాడడం గమనించి, తన ఏడుపు ఇద్దరూ వినడంలేదని గ్రహించి కుంటికాలిని మరింతగా మడిచి కుంటుకుంటూ అటుగా దూరంగా వెళ్లిపోయింది కుక్కపిల్ల.‘‘నేనంతా గమనిస్తూనే వున్నాను. సుందరం నీకెందుకు వేషాలు ఇచ్చాడో కూడా నాకు తెలుసు. నిన్నెందుకు ప్రేమిస్తున్నాడో నాకు తె లుసు. సుందరం వాళ్ల అక్క ఇక్కడెందుకు వచ్చిందో నాకు తెలుసు. వద్దు లక్ష్మి...వద్దు... నువ్వు హైదరాబాద్ వెళ్లొద్దు’’ అన్నాడు అతను మళ్లీ.ఏం మాట్లాడాలో తెలియక అతని మాటలు వింటూ ఏడుస్తోంది లక్ష్మి.‘‘భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌కి నువ్వు హైదరాబాద్ వెళ్లిపోదామని అనుకుంటున్నావు. నీకు కోసం త్రిబుల్ గాడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు... అన్నీ తెలుసు...లక్ష్మీ...నాకన్నీ తెలుసు.. అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు అతను.అతనిది సుమారుగా లక్ష్మి వయస్సే. కాకపోతే లక్ష్మి కన్నా ఓ నాలుగైదు నెలలు పెద్దవాడై వుంటాడు. అంతే తేడా. నైట్ డ్రస్‌లో వున్నాడు. పొడుగ్గా అందంగా బాగున్నాడు. లేలేత మీసాలు. మెరుపులీనే బుగ్గలు, కొనదేలిన ముక్కు, కన్నీటి కళ్లు... చూడగానే ‘ ఈకుర్రాడు కరెంట్ ఆఫీసులో పనిచేసే ఆ పెద్దాయన కొడుకు ప్రసాద్ బాబు కదూ’ అనిపిస్తుంది.అనిపించడం కాదు అది నిజం కూడా...‘‘నువ్వు ఏడవకుండా వుంటే నీతో చాలా విషయాలు మాట్లాడాలి’’ అన్నాడు ప్రసాద్.‘నువ్వేమీ నాతో మాట్లాడొద్దు’ అన్నట్లుగా ఏడుస్తూనే వుంది లక్ష్మి. ఇలా కాదనుకున్నాడేమో ఓ చేత్తో కింద వున్న సూట్‌కేసును అందుకొని, మరో చేత్తో లక్ష్మిని చేయందుకొని ‘‘రా’’ అంటూ ముందుకి నడిచాడు ప్రసాద్. తనకిష్టం లేకపోయినా తప్పదన్నట్టుగా ప్రసాద్‌తో పాటుగా నడవసాగింది లక్ష్మి.ప్రసాద్, లక్ష్మి ఇద్దరూ ఇంతప్పట్నుంచీ స్నేహితులు. ఏడో తరగతి వరకూ వేర్వేరు స్కూళ్లల్లో చదువుకున్నా ఎనిమిదో తరగతి నుంచి ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకోసాగారు. జూనియర్ కాలేజీ కూడా ఇద్దరిదీ ఒక్కటే. కూడబలుక్కున్నట్లు ఇద్దరూ ఒకే గ్రూపు తీసుకున్నారు.ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మంచి మంచి గౌన్లు వేసుకొని వచ్చేది లక్ష్మి. నిక్కర్లో వుండేవాడు ప్రసాద్. పోలీస్ స్టేషన్ వీధిలోంచి లక్ష్మి, మునిసిపల్ ఆఫీసు పక్క సందులోంచి ప్రసాద్ నడిచొచ్చి కళామందిర్ సినిమా హాలు దగ్గర కలుసుకునేవారు.‘‘మా అన్నయ్య నాకు పావలా ఇచ్చాడు’’ అంటూ లక్ష్మి పావలా కాసు చూపిస్తే....‘‘మా అమ్మ నాకు రూపాయిచ్చింది’’ అంటూ ప్రసాద్ రూపాయినోటు చూపించేవాడు.రూపాయి పావలాతో ఇద్దరూ చాక్‌లెట్లు కొనుక్కునేవారు. శెనగలు కొనుక్కునేవారు. తేగలు, ఐస్‌క్రీములు, చాలా... చాలా... కొనుక్కుని, కాకెంగిలి చేసుకొంటూ ఇద్దరూ కలిసి తినేవాళ్లు.పదో తరగతి వరకూ తిండిగోలే! పదో తరగతి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వరకూ కూడా అదే గోల కొనసాగింది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఓ వారం రోజుల పాటు శెలవులు కూడా గడిచాయి. శెలవులు గడిచి స్కూలు తెరిచిన రోజు లక్ష్మి కొత్తకొత్తగా కనిపించింది ప్రసాద్‌కి. ఆ కొత్తదనం ఎలా వచ్చిందంటే... అప్పుడు లక్ష్మి గౌనులో లేదు. లంగా- ఓణీలో వుంది. కళ్లకి కాటుక పెట్టుకొని, కాళ్లకి పట్టీలు పెట్టుకొని, నుదుటున నిలువు బొట్టు పెట్టుకొని, రెండు జడలు వేసుకొని, జడలో గులాబీలు తురుముకొని, పదహారేళ్ల వయసు సినిమాలో హీరోయిన్ శ్రీదేవిలా పచ్చపచ్చగా కనిపించింది. దాంతో ప్రసాద్‌కి మతిపోయింది. లక్ష్మి పలకరించినా పలకలేదతను. కళ్లప్పగించి లక్ష్మిని చూస్తూ వుండిపోయాడు.‘ప్రసాద్! ప్రసాద్!’’ ప్రసాద్‌ను కుదిపి పిలిచింది లక్ష్మి.తేరుకొని ‘ఏంటన్నాడు’ ప్రసాద్.‘‘ఏంటలా అయిపోయావ్! ఈ డ్రస్సులో నేను బావులేనా?’’ అడిగింది లక్ష్మి.‘‘చ...చ... చాలా బావున్నావు’’ గొంతు తడారిపోతుండగా అన్నాడు ప్రసాద్.‘‘ఏమయింది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావ్’’ అడిగింది లక్ష్మి.దానికి ప్రసాద్ దగ్గర జవాబు లేదు. తనెందుకలా అయిపోతున్నాడో ప్రసాద్‌కి కూడా తెలియదు. దాంతో ‘ఏంలేదు’ అంటూ పరిగెత్తి పారిపోయాడు.పరిగెత్తి పారిపోతున్న ప్రసాద్‌ను చిత్రంగా చూస్తూండిపోయింది లక్ష్మి.అక్కడ లకి్క్ష దగ్గర నుంచి పరుగెత్తి పారిపోయిన ప్రసాద్ ఇంటికొచ్చి వాళ్లమ్మ దగ్గర ఆయాసపడుతూ నిల్చున్నాడు.‘‘ఏమైందిరా? ఎందుకంతగా ఆయాసపడుతున్నావు’’ అడిగింది వాళ్లమ్మ.‘‘నాకు అర్జంటుగా ప్యాంట్లు కొనిపెట్టే’’ అంటూ బావురుమన్నాడు ప్రసాద్. వేసుకున్న నిక్కరు తనకొద్దంటూ విప్పిపారేశాడు.‘‘సర్లే! నాన్నకి చెప్తాలే’’ అంది వాళ్లమ్మ.అమ్మా నాన్నకి చెప్పిన మీదటే అయ్యుంటుంది. నాన్న ప్రసాద్‌కి రెండు ప్యాంట్లు, రెండు ఫుల్ హ్యాండ్ షర్టులూ కొన్నాడు. వాటిలో ఓ జత వేసుకొని స్కూలుకి వెళ్లాడు ప్రసాద్. కావాలనే లక్ష్మికి ఎదురుగా నిల్చున్నాడు.లక్ష్మికెదురుగా ప్రసాద్ ఎక్కడ నిల్చున్నాడంటే...స్కూలు కబడ్డీ ప్లే గ్రౌండ్‌కి దూరంగా వున్న కానుగుచెట్టు నీడలో నిల్చున్నాడు. ఆ వేళప్పుడు కానుగచెట్టు నీడ చల్లగా వుంది. ఆకుల్తో నిండుగా వున్న కొమ్మలు కిందక వొంగి గొడుగు పట్టినట్లుగా వున్నాయి. పేరు తెలియని పిట్ట ఏదో పై కొమ్మ మీద వుండి, గాలికి కొమ్మ వూగుతుంటే తనూ వూగుతూ కిందకి లక్ష్మి, ప్రసాద్‌ల వంక చూస్తోంది.‘‘ఈ డ్రస్‌లో నేనెలా వున్నాను’’ అడిగాడు ప్రసాద్.‘‘బావున్నావు’’ అంది లక్ష్మి‘‘ఎంత బావున్నాను’’ అడిగాడు.సమాధానంగా ప్రసాద్ బుగ్గన ముద్దు పెట్టుకొంది లక్ష్మి. బిత్తరపోయాడు ప్రసాద్.నవ్వుతూ ఆ అమ్మాయి పరుగందుకొంది.‘లక్ష్మీ...లక్ష్మీ...’ అంటూ లక్ష్మిని వెంబడించబోయాడు ప్రసాద్. అయితే రెండంగలు వేశాడో లేదో అటుగా వచ్చిన తెలుగు మాస్టార్ని చూసి ఆగిపోయాడు.అటు పరుగెత్తిపోతున్న లక్ష్మిని, ఇటు పరుగులు తీయబోతూ తనని చూసి ఆగిపోయిన ప్రసాద్‌నూ గమనించి....‘‘ఏంట్రా! ఏం చేస్తున్నారిక్కడ’’ అడిగాడు మాస్టారు.‘‘పిట్ట! పిట్ట మాస్టారు... ఆ పిట్టని చూస్తున్నాం’’ అంటూ కొమ్మ మీద పేరు తెలియని పిట్టని చూపించాడు ప్రసాద్. వేలెత్తి తనని చూపించడంతో ఏదో ప్రమాదముందని గ్రహించి మనకెందుకొచ్చిన గొడవ అన్నట్లుగా అక్కడ నుంచి ఎగిరిపోయింది పిట్ట. దాంతో..‘‘పిట్ట ఎగిరిపోయింది కానీ, తమరు క్లాసుకి తగలడండి’’ అన్నాడు మాస్టారు.మాస్టారు చెప్పినట్లుగానే క్లాసుకి తగలడ్డాడు ప్రసాద్. క్లాసులో ఒక్క ముక్క అర్థమయితే ఒట్టు! ఏదో చెబుతున్నట్లుగా మాస్టార్ల పెదవులు కదులుతున్నాయి కానీ... వాళ్లేం చెబుతున్నారో తెలియడం లేదు. పదే పదే ఒకటే దృశ్యం.తన బుగ్గని లక్ష్మి ముద్దు పెట్టుకొంటోంది! అదే కనిపిస్తోంది. అది మొదలు లక్ష్మి అంటే ప్రసాద్‌కి ఎక్కడలేని ప్రేమా పుట్టుకొచ్చింది. ఆ ప్రేమతో లక్ష్మి కోసం చాలా సాహసాలు చేశాడు ప్రసాదు.ఆమె కోసం చిరంజీవి సినిమాకి చొక్కాని చించుకొని టిక్కెట్లు సంపాదించాడు. బ్లేడుతో చూపుడు వేలిని కోసుకొని ‘ఐ ఔౖగఉ ్గ్ౖఖ ఔఅగీకఐ’ అని రక్తాక్షరాలు రాశాడు. క్యారం బోర్డు కావాలంటే నాన్న జేబులోంచి వందనోటు దొంగతనం చేసి దాంతో కొనిచ్చాడు. ఇంటర్ ఫస్టియర్ వరకూ ఇలాంటివె న్నెన్నో చేసి... ఎప్పుడైతే సుందరం వాళ్ల నాటికలో లక్ష్మి చెల్లెలి వేషం వేసిందో అప్పుడు తన సాహసాలకి ఫుల్‌స్టాప్ పెట్టి ఆలోచనలో పడ్డాడు ప్రసాద్. అంతా గమనించసాగాడు. గమనించి గమనించీ ఈ రాత్రి వేళ ఇప్పుడు లక్ష్మిని అడ్డుకున్నాడు.చేయి పట్టి లక్ష్మిని తీసుకొని వచ్చి రావి చెట్టు నీడలో, రైసుమిల్లు గోడకాన్చి నిలబెట్టి....‘‘ఐ లవ్ యూ లక్ష్మి! ఐ లవ్ యూ! నువ్వెళ్లిపోకూ’’ అన్నాడు ప్రసాద్.ప్రసాద్ అంటే లక్ష్మికి ఇష్టమే! కాకపోతే ప్రసాద్ ఫ్రిజ్‌లో దాచిన యాపిల్‌లా వుంటాడు. అదే తనకిష్టం లేదు. సుందరం అలాకాదు. దొంగతనం చేసిన జాంకాయలా వుంటాడు. అందుకే అతనంటే ఇష్టం. పైగా సుందరం తనని సినిమా నటిని చెయ్యాలనుకుంటున్నాడు. సుందరాన్ని నమ్ముకుంటే కోట్ల...కోట్లు పడగలెత్తొచ్చు. అదే ప్రసాద్‌ని నమ్ముకుంటే పెళ్లి చేసుకొని, పెరట్లో వడియాలు పెట్టుకోవడమే! అదెంత మాత్రమూ లక్ష్మికి ఇష్టం లేదు. అయితే ఆ సంగతి ప్రసాద్‌కి చెప్పలేకనే ఏడుస్తోంది.‘‘కావాలంటే నీ కోసం డిగ్రీ చదవడం మానేస్తాను.! ఇద్దరం పేపర్లేసుకుంటూ, పాల ప్యాకెట్లు అమ్ముకుంటో బతికేద్దాం’’ అన్నాడు ప్రసాద్.ఆ మాట ప్రసాద్ అనకుండా వుంటే బావుండేది. ఇంకొంచెం సేపు ఏడుస్తూనైనా ప్రసాద్ చెంతనుండేది లక్ష్మి. ఎప్పుడైతే ప్రసాద్ ఆ మాటన్నాడో ఆశలన్నీ ఆవిరైనట్లనిపించి కలలన్నీ కాలిపోతున్నట్లనిపించి కోపంతో...‘‘షటప్’’ అని ప్రసాద్ చేతిలోని సూట్‌కేస్ అందుకొని పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది లక్ష్మి. పిలిచినా పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి చూడను కూడా చూడలేదు.సుందరం గురించి, వైజాగ్ శకుంతల గురించి, త్రిబుల్ గురించి లక్ష్మికి ప్రసాద్ ఏం చెప్పదలుచుకున్నాడో అదంతా ప్రసాద్ గుండెల్లోనే వుండిపోయింది. ఏం పాలుపోక ఏడుస్తూ తలపట్టుకొన్నాడు ప్రసాద్.-------------------------------పై కప్పులేని మొండిగోడలున్న పాడుబడిన ఇంట్లో నిల్చునున్న త్రిబుల్ మరింక నిలబడలేక కాళ్లు లాగడంతో సగం నిలబడి, సగం లూనా మీద కూర్చొని శేష తల్పం మీద మహావిష్ణువు సెటిలైనట్లుగా సెటిలయ్యాడు. అలా సెటిలయ్యి చేతి వాచీ కేసి చూశాడు. సరిగ్గా ఒంటిగంటయ్యింది.‘ఈ లక్ష్మేంటి? ఇంకా రానేదు! కొంపదీసి ప్రోగ్రాం మార్సుకుందేంటి’ అనుకొని తన ఆలోచనకి తానే భయపడ్డట్టుగా ఒక్కసారిగా జలదరించాడు త్రిబుల్. అంతలోనే...‘వస్తాదొస్తాది! పిట్టమీద అలాటిలాటి వలా...నైలాన్ వలన ఇసిరినాం గదా...పడతాది...పడతాది! అనుమానం నేదు’ అనుకొన్నాడు. ఇంకో సిగరెట్ తీసి ముట్టించాడు. అగ్గిపుల్ల గీసి ముట్టించాడో లేదో... ఆ వెలుగులో ‘భగ్గు’మన్నాడు పోలీసు రామ్మూర్తి. మంటలో మంటగా కనిపించాడు.ఓ చేతిలో లాఠీ, ఇంకో చేతిలో టార్చి, మెళ్లో మఫ్లరు, గుండెల మీద ఎర్రెర్రని స్వెట్టరూ వేసుకొని పాడుబడ్డ ఇంట్లోకి పిశాచం ప్రవేశిస్తున్నట్లుగా ప్రవేశించాడు.‘‘లోపల ఎవరండీ బాబూ! ఎవరూ’’ అని వస్తోన్న రామ్మూర్తితో...‘‘నానండీ! త్రిబుల్‌గాడ్ని’’ అన్నాడు త్రిబుల్. చేతిలోని సిగరెట్‌ని దూరంగా విసిరేసి..‘‘తమరేంటి సేస్తున్నారు సార్ ఇక్కడ’’ అడిగాడు రామ్మూర్తి.‘‘సి...సి...సిగరెట్ కాల్సుకుందావని...’’ విసిరేసిన సిగరెట్‌ని చూపించాడు త్రిబుల్.‘‘సిగరెట్ కాల్సుకుందావనా? అని ఆశ్చర్యపోయి అంతలోనే తేరుకుంటూ సిగరెట్ కాల్సుకోడానికి ఈ లోకేసన్ తప్ప ఇంకో లొకేసన్ దొరకలేదట్రా నీకు? కబుర్లు సెప్పకు! కతలోకి రా’’ అన్నాడు రామ్మూర్తి.‘‘ఇంట్లో నిద్దరఅట్టట్లేద్సార్! ఓపాలి అటూ ఇటూ తిరిగితే నిద్దరడతాదేమోనని ఇలాగొచ్చినాను’’‘‘సికారుకొచ్చారన్నమాట తమరు’’‘‘అద్గదీ! పోల్సేసినారు’’‘‘సికారికెవరైనా తోటకెల్తాడు!పార్కుకెల్తాడు! ఇలాటి పాడుబడ్డ ఇంటికి రాడు గానీ...వొచ్చీ...వొచ్చీ..కతలోకొచ్చీ’’‘‘అయినా నిద్దరట్టకపోడానికి ఇదేవైౖనా ఏసవేట్రా! సలికాలం!సలికాలంలో నిద్దరట్టకపోడవేటి? రెండు పెగ్గులేసి, రగ్గు తగిలిస్తే ఎవరికోసం నిద్దర్రాదుగానీ...కతేటసలు! ముందు కతసెప్పు’’ అన్నాడు మళ్లీ రామ్మూర్తి.‘‘సెప్పక తప్పదా’’ భయం భయంగా అడిగాడు త్రిబుల్.‘‘తప్పదు’’తెగేసి చెప్పాడు రామ్మూర్తి. అయినా చెప్పాలా? వద్దా? అన్న సందిగ్ధంలో వున్న త్రిబుల్‌ని చూస్తూ...‘‘నాకంతా తెలుసురా! నాటకాల పిల్ల లచ్మిని మీరీ రాత్రి లెగదీసుకుపోతున్నారు! అవునా?’’ అడిగాడు రామ్మూర్తి.అవునా? కాదా? ఏం చెప్పాలో తోచట్లేదు త్రిబుల్‌కి. కానీ వాడు ఒక్కటి మాత్రం తెలుసుకున్నాడు.పోలీసోడికి అందరిలా రెండు కళ్లు కాదు. ఇంద్రుడిలా వొళ్లంతా కళ్లే! అడిసూపుకి అందనిది ఈ బూపెపంచకంలో ఏదీ వుండదు.--------------------------రైల్వే స్టేషన్ దగ్గరకొచ్చి ఆగింది రిక్షా. రిక్షాని, రిక్షాలో కూర్చున్న వైజాగ్ శకుంతల్ని, సుందరాన్ని అంతెత్తు కొండ ఎక్కించి మళ్లీ కిందికి ,రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకురాడంతో ప్రాణాలు పోయినట్టయి, అంత చలిలోనూ చెమటలు కక్కుతూ...‘‘వొచ్చేసింది తల్లీ!టేసనొచ్చేసింది! దిగండమ్మా’’ అన్నాడు రిక్షావాలా.‘‘దిగుతున్నాం’’ అంటూ సుందరంతో పాటుగా దిగింది శకుంతల. డబ్బుల కోసం చేయి జాచిన రిక్షావాలాతో...‘‘ముందు సూట్‌కేసుల్రెండూ ప్లాట్ ఫారమ్మీదపెట్టు’’ అంది.‘చచ్చినో’ అంటూ సూట్‌కేసుల్రెండూ తలకెత్తుకున్నాడు రిక్షావాలా. వాడితో పాటుగా నడిచారు శకుంతలా, సుందరాలు. ముగ్గురూ ‘త్రాగునీరు’ కుళాయి దాటారు. బంగర్రాజు శారీ సెంటర్ బోర్డు దాటారు. తురాయి చెట్టు దాటారు. రావిచెట్టు దగ్గరగా వచ్చారు.‘‘ఇక్కడేనక్కా! ఎస్ ఫైవ్ కోచ్ ఇక్కడే ఆగుతుంది’’ చెప్పాడు సుందరం.ఆ మాటకి ‘బతికించావ్’అన్నట్లుగా సూట్‌కేసుల్రెండూ ప్లాట్‌ఫారమ్మీద వుంచి, డబ్బుల కోసం మళ్లీ చేయి జాచాడు రిక్షావాలా.పర్సు తీసి, పదిరూపాయల నోటు వాడి చేతిలో వుంచింది శకుంతల.‘‘మరయిదు రూపాయలిప్పించండమ్మా’’ దీనంగా అడిగాడు రిక్షావాలా.‘‘ఎల్రా! ఎక్కువడక్కు’’ కళ్లెర్రజేసింది శకుంతల. దాంతో తప్పయిపోయిందన్నట్లుగా తలవొంచుకొని, పదిరూపాయలే చాలన్నట్లుగాచేతిలో వున్న నోటుని గుప్పెటపట్టి జాగ్రత్త చేసుకొంటూ వెళ్లిపోయాడు రిక్షావాలా.‘‘ఇడియెట్! డబ్బులూరకనే వస్తాయనుకొంటున్నాడు’’ వెళ్లిపోతున్న రిక్షావాలాని ఉద్దేశిస్తూ నవ్వుతూ శకుంతలతో అన్నాడు సుందరం.ఆ మాటని విన్పించుకున్నా వినిపించుకోనట్టుగానే పర్సులోకి చూసుకుంటోంది శకుంతల.ప్లాట్‌ఫారానికి ఈ చివరగా రావిచెట్టునీడలో వున్నారిద్దరూ. ఆ ఇద్దరే తప్ప ఇక అటెవరూలేరు. వున్న నలుగురైదుగురు ప్రయాణికులూ ఆ చివరున్నారు. జనరల్ కంపార్టుమెంట్ ఆగేది అక్కడే! అందుకే ఆ నలుగురైదుగురూ అటుగా వున్నారు.‘‘ఏంటక్కా! ఏం చూస్తున్నావ్’’ అడిగాడు సుందరం.‘‘ఏం లేదుగానీ! నీ సంగతి చెప్పు’’ అంది శకుంతల.ఆ మాట ఎప్పుడంటుందా అన్నట్లుగా చూస్తున్నాడు సుందరం. శకుంతల అనేసింది. ఇక ఆలస్యం చెయ్యకూడదన్నట్లుగా తొందరపడుతూనే తగు జాగ్రత్తలు తీసుకొంటున్నట్లుగా అటూ ఇటూ ఓ సారి చూసి, దగ్గర్లో ఎవరూ లేకపోవడంతో...‘‘పాతికిచ్చుకో అక్కా’’ అన్నాడు సుందరం.‘‘వందలా? వేలా?’’ కళ్లెత్తి అడిగింది శకుంతల.‘‘నువ్వు మరీనక్కా!తమ్ముడితో కూడా జోకులే నీకు’’ నవ్వాడు.‘‘జోకులు కాదు! సీరియస్సే! చెప్పు! వందలా? వేలా?’’ సీరియస్‌గా వుందామె గొంతు.దానికి కొంచెం భయపడుతున్నట్లుగా కిందకి, పైకి రెండు మూడు సార్లు చూసి, తర్వాత ఏదయితే అదవుతుందన్నట్లుగా, తెగించినట్లుగా గుండెల్నిండా ఊపిరి తీసుకొని...‘‘వె..వ్వె..వేలేనక్కా’’ అన్నాడు సుందరం.అంతే! సుందరం చెంప ‘ఛెళ్’ మంది. చాచిపెట్టి కొట్టింది శకుంతల.రాత్రి ఒంటిగంట దాటిందేమో, వూరి చివరేమో, నిశ్శబ్దంగా వుందేమో, ఆ నిశ్శబ్దంలో ‘ఛెళ్’మన్న శబ్దం స్టేషనంతా మారు మ్రోగింది. టపాసు పేలినట్లనిపించడంతో రావిచెట్టు మీది పక్షులు భయంభయంగా గోలగోలగా అరుచుకుంటూ పైకెగిరాయి. అలాగే అటుగా వున్న ప్రయాణికులు కూడా జడుసుకొని ఇటుగా చూశారు. అయితే వాళ్లేదీ గుర్తించలేకపోయారు. కాస్సేపటికి ప్రమాదం లేదనుకున్న పక్షులు యాధాస్థానానికి చేరుకున్నాయి. ప్రయాణికులు కూడా ఎవరి మానాన్న వాళ్లున్నారు.దెబ్బతిన్న చెంపని చేత్తో నిమురుకుంటూ...‘‘ఏంటక్కా! ఏంటీ పని! నేనేం తప్పుగా మాట్లాడాను’’ అడిగాడు సుందరం.‘‘చాలా తప్పుగా మాట్లాడావ్! పాతిక వేలు అడిగావంటే నిన్నేమనుకోవాలి?’’ అంది శకుంతల.‘‘నువ్వేమన్నా అనుకో అక్కా! కానీ నేను అడిగిందాంట్లో తప్పులేదు! లక్ష్మిని లైన్లో పెట్టడానికి రెండేళ్లుగా నాకు ఖర్చు ఎంతయ్యిందో తెలుసా!’’ అడిగాడు సుందరం.‘‘ఎంతయ్యింది?’’‘‘నాలుగైదు వేలయింది.’’‘‘అయితే పదిహేనడగాలి! పాతికడిగితే కోపం రాదా’’ అంది శకుంతల.‘‘అంటే ఎప్పుడూ ఒకటే రేటా? రెండేళ్ల క్రితం పదివేలే? ఇప్పుడూ పదివేలేనా?’’‘‘అంతకన్నా నీ సరుక్కి ఎక్కువ ఎవరూ ఇవ్వరు! అదేమైనా ఐశ్వర్యరాయా?’’‘‘ఇప్పుడు కాకపోవచ్చు! కానీ, రేపు మేకప్పదీ చేసి మార్కెట్లో పెడితే ఐశ్వర్యరాయే కాదు, లక్ష్మి ముందు ఇంకెవరూ పనికిరారు’’‘‘అప్పటి సంగతి చూద్దాంలే’’‘‘చూద్దాంలే...గిద్దాంలే కాదక్కా! పదిహేనువేలకి తక్కువయితే నేను సరుకుని నీకివ్వను’’ ఏదయితే అదయిందన్నట్లుగా ఖరాఖండీగా తేల్చేశాడు సుందరం.‘‘ఇంకెవరికిస్తావు? ఎవరికిస్తావ్‌రా! ఇంకెవరికిస్తావ్’’ కోపంగా సుందరం కాలర్ పట్టుకుంది శకుంతల.‘‘అది...అదక్కా..వదులక్కా! ముందు కాలరొదులు’’‘‘పీక పిసికేస్తాను!జాగ్రత్త!’’ కళ్లల్లో నిప్పులు కురిపించింది.‘‘ఎక్కువ తక్కువ మాట్లాడకు! చీరేస్తాను’’ అని కాలర్ వదిలి, చేతులు దులుపుకొంది శకుంతల.ఊపరి ఆడలేదేమో కాలర్ వొదిలిన తర్వాత ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడంతో దగ్గొచ్చి దగ్గుతూ కళ్లంట నీళ్లు పెట్టుకొన్నాడు సుందరం.‘‘సరుకుని నీకివ్వనని జీవితంలో మళ్లీ అనకు! తట్టుకోలేను’’ అంది శకుంతల.‘‘ఛీ! మూడంతా పోయింది’’ అని, దగ్గడం నిలువరించుకొని, గొంతు రాసుకొని కన్నీళ్లు తుడుచుకొంటోన్న సుందరంతో...‘‘నువ్వడిగిందీ కాదు, నేనన్నదీకాదు! ఇరవై! ఇరవై వేలతో సెటిల్ చేసుకో’’ అని పరుసులోంచి వెయ్యినోట్లు కొన్ని తీసి, ఇరవై లెక్కపెట్టి సుందరానికిచ్చింది శకుంతల.‘‘థ్యాంక్సక్కా’’ అందుకున్నాడు సుందరం.-----------------------‘పోలీసు రామ్మూర్తికి అంతా తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత తప్పదు! అతన్ని శాంతింపచెయ్యాలి. శాంతింపచెయ్యాలంటే అతనికి వెయ్యో, రెండు వేలో సమర్పించుకోవాలి. కోవాలంటే డబ్బుల్లేవు. ఎలాగిప్పుడు’ అని గందరగోళపడసాగాడు త్రిబుల్.వాడి అవస్థని గమనించినట్లుగా...‘‘సర్లేగాని! శకుంతలాసుందరాలిపుడు ఎక్కడున్నారు? టేసన్లోనే కదా వున్నారు’’ అడిగాడు రామ్మూర్తి.‘‘అవునండీ! ఆళ్లిద్దరూ ఆకాణ్నే వున్నారు’’‘‘పదయితే ఎల్దాం’’ త్రిబుల్‌గాడి చేయిలాగాడు రామ్మూర్తి.‘‘తెలీనట్లు మాటాడతారేటండీ! మనం లచ్మి కోసం ఈడ ఎయిటింగ్ కదా’’ అన్నాడు త్రిబుల్.మరిచిపోయానన్నట్లుగా ‘అవునవును కదా’ అని,‘‘నాకు తెలీకడుగుతానొరే! ఈ ఆడాళ్లికిదేం పిచ్చిరా సినిమా పిచ్చి’’ అన్నాడు రామ్మూర్తి.‘‘సినిమా పిచ్చి సరే! ఇయ్యాల రేపు ఆడోళ్లకి సీరియల్ల పిచ్చి ఎక్కువైపోనాది! టివిలో ఏసవిస్తామంటే సాలు! ఏమివ్వడానికైనా రెడీ అయిపోతున్నారు’’‘‘ఇదే అదును మీకు! మీ యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా సాగిపోతోంది’’‘‘మా బాగా సెప్పేరు’’ నవ్వాడు త్రిబుల్.‘‘అప్పుడెప్పుడో కమల, ఆ మద్దె సరోజ, ఇప్పుడు లక్ష్మి! మనూరు నుంచి అయిదారాబాదుకి ముగ్గురెళ్లారప్పుడే’’‘‘అవును బాబు’’‘‘కమల రెండు మూడు సినిమాల్లో కనిపించినాది! కోవెల్లో ముస్టిదానికింద, పెళ్లిల్లో ఆరిందా కిందా!బాగానే వుంది. మరయితే సరోజసలు కనిపించనేనేదు’’‘‘సరోజయిదారాబాద్‌లో నేదు బాబూ! ముంబాయిలో వుంది’’‘‘ముంబాయిలో యేటిసేస్తోంది’’‘‘ఏటి సేస్తాది? రెడ్‌లైట్ ఏరియాలో వుంది’’అంతే! ఎవరో మొండిగోడకి కొట్టుకున్నట్లుగా శబ్దమై తర్వాత ఎవరో పరుగుదీస్తున్నట్లుగా అడుగుల శబ్దం కూడా వినవచ్చింది.‘‘ఎవులు! ఎవులదీ’’ గట్టిగా కేకేశాడు త్రిబుల్. సమాధానం లేదు. కానీ పరిగెత్తుతోన్న శబ్దం వినిపించింది.‘కొంపతీసి కతంతా లచ్మి ఇనలేదు కదా!, ఇని లగెత్తలేదుకదా! అన్న ఆలోచన కలిగి త్రిబుల్...‘ఓలమ్మోలమ్మో’ అంటూ గాబరాపడసాగాడు.ఎవరో పరుగుదీస్తున్నారు. అడుగుల శబ్దం వినవస్తూ వుంది.గాబరాపడుతోన్న త్రిబుల్ గాణ్ని గమనిస్తూనే పోలీసు రామ్మూర్తి తనకున్న రెండు చెవుల్ని, వందలాది కళ్ళనీ అటుగా కేంద్రీకరించి చూసి, విషయం పసిగట్టినట్లుగా సన్నగా నవ్వి -‘‘ఓసోస్! గాబరా నీకక్కర్నేదునేవో! పరిగెడుతోంది లచ్మి కాదులే! ఆళ్ళు ఏరేవోళ్ళు’’‘‘ఏరేవోళ్ళా’’ అంటూ గాబరా తగ్గించుకుని ‘ఎవరై వుంటార’న్నట్లుగా ఆలోచనలో పడ్డాడు త్రిబుల్. అది కూడా గమనించిన రామ్మూర్తి -‘‘పాడుబడ్డ ఈ ఇల్లు నీకొక్కడికే అడ్డా అనుకున్నావేట్రా! ఇది సానామందికి అడ్డా! సలికాలం కదా! ఏడెక్కడానికి ఎవరో గుంటా-గుంటడూ సాటుగా ఇటొచ్చుంటారు. మన అలికిడిని లగెత్తేరు! అంతే’’ అన్నాడు.‘‘అలాగయితే పర్నేదు’’ వూపిరి తీసుకున్నాడు త్రిబుల్.‘‘శకుంతలా సుందరాల్ని కలాలి కదా! మరి నాను టేసన్‌కెళ్తానయితే’’ అన్నాడు రామ్మూర్తి.ఆ మాట అన్నదే తడవు ‘‘ఎళ్రండి’’ అన్నాడు త్రిబుల్. చేతులెత్తి దణ్నం కూడా పెట్టాడు. రామ్మూర్తి అక్కడ వుండకపోవడమే అన్నివిధాలా శ్రేయస్కరం అన్నది త్రిబుల్ గాడాలోచన. లక్ష్మి వచ్చేవేళవుతోంది కాబట్టి రామ్మూర్తి, ఇక్కణ్నుంచి వెళ్ళటమే క్షేమమనిపించింది వాడికి.‘‘వస్తానయితే’’ వెళ్ళిపోయాడు రామ్మూర్తి. రామ్మూర్తి వెళ్ళిపోవడంతో రిలాక్స్‌డ్‌గా మరో సిగరెట్ ముట్టించాడు త్రిబుల్.రెండు దమ్ములు గుండెల్నిండా లాగి వదిలాడు. కాస్సేపటికి -‘‘త్రిబుల్! త్రిబుల్’’ అంటూ లక్ష్మి అక్కడికి నిధిలా రానే వచ్చింది. ఆమెను చూస్తూనే మతాబాలా వెలిగిపోతూ -‘‘ఏటింత లేటు’’ అంటూ లక్ష్మి చేతిలోని సూట్‌కేసందుకున్నాడు త్రిబుల్. చేతిలోని సిగరెట్‌ని విసిరేశాడు.‘‘సుందరం బాబు, శకుంతలక్కా అక్కడ నీకోసం ఎయిటింగ్! పద పద’’ అంటూ లక్ష్మిని తొందరచేసి, లూనా స్టార్ట్ చేశాడు.------------------------చలిచలిగా వుండడంతో స్టేషన్లో వేడివేడిగా టీ తాగుతున్నారు శకుంతలా సుందరాలు. డబ్బులిచ్చేసినా టీ కుర్రాడింకా అక్కడ నిలబడి వుండడాన్ని చూసి -‘‘ఎళ్రా! ఇంకా నీకిక్కడేం పని’’ కసిరింది శకుంతల. ఆ కసురుకి అల్లంత దూరానికి వెళ్ళి నిలబడ్డాడు కుర్రాడు.‘‘ఏంటింకా వీళ్ళు రాలేదు’’ లక్ష్మి, త్రిబుల్నుద్దేశించి అనుమానంగా సుందరాన్నడిగింది శకుంతల.‘‘వస్తారక్కా! వస్తారు! కంగారుపడకు’’ అన్నాడు సుందరం.‘‘బండొచ్చేస్తాదింక’’ అంది శకుంతల.‘‘వాళ్ళూ వచ్చేస్తారక్కా’’ అన్నాడు సుందరం. ‘జయం’ అన్నట్లుగా గుడిగంట వినిపించింది. ‘ఇంత రాత్రివేళ ఈ గుడిగంట యేంటా’ అన్నట్టు అటుగా చూసిన శకుంతలకి -తురాయి చెట్టు దాటి, బంగార్రాజు శారీ సెంటర్ బోర్డు దాటి, త్రాగునీరు కుళాయి దాటిన తర్వాత ప్లాట్‌ఫారానికి ఆ చివరకెదురుగా గుడిలాంటి పాము పుట్ట కనిపించింది.పుట్టమీద పసుపు కుంకుమలున్నాయి. అగరుబత్తీలున్నాయి.పువ్వులున్నాయి. నైవేద్యంగా ఎవరో పెట్టిన అరటిపళ్ళు, కొట్టిన కొబ్బరి చిప్పలు వున్నాయి. పూజారి లేడుగాని, బొట్టు పెట్టుకుందికి పుట్టమన్ను ఓ పళ్ళెంలో వుంది. దక్షిణ వేసిన చిల్లర నాణాలు చెల్లాచెదురుగా వున్నాయి.గంట, గంటని కొట్టి దణ్నం పెడుతోన్న మనిషీ, ఆ మనిషి పక్కన అతనివే అయిన ఓ చిన్నబ్యాగు, ఓ చిన్న సూట్‌కేసూ వున్నాయి. ఇన్ని వున్నాయి సరే! అసలింతకీ ఆ పుట్టలో పాముందా? అన్నది శకుంతల అనుమానం. ఆ అనుమానాన్ని సుందరానికి చెప్పిందామె. దానికి -‘‘అయ్యయ్యో! బలేదానివక్కా! పుట్టలో పాము లేకపోవడమేంటి! చాలా... చాలా పెద్ద పాముంది అందులో. దేవతా సర్పం. చూసినవాళ్ళు చెప్పేరు. దానికి రెండు మూడు తలలు కూడా వున్నాయట’’ అన్నాడు.‘‘ఇంతకుముందు లేదుగాని, ఈమధ్య ఈ పుట్ట బాగా పాపులరైపోయిందక్కా! అంతెందుకు? మన లక్ష్మికి కూడా ఈ పుట్టంటే బాగా గురి’’ అని నవ్వాడు. ఖాళీ చేసిన ప్లాస్టిక్ టీ కప్పుని శకుంతలతో పాటు విసిరేశాడు. విసిరేసి ఇటు తిరగబోతూ, పోలీసు రామ్మూర్తి అక్కడికి వస్తూ కన్పించడంతో అటుగా మళ్ళీ చూస్తూ -‘‘వస్తున్నాడక్కా! పోలీసు రామ్మూర్తొస్తున్నాడు’’ అన్నాడు సుందరం.‘‘రానీ రానీ’’ రామ్మూర్తిని చూస్తూ అంది శకుంతల. వచ్చేశాడు రామ్మూర్తి. వస్తూనే -‘‘ఏటి శకుంతలా?? ఏటెలాగున్నావ్’’ అని పలకరించాడు.‘‘ఎలాగున్నాను? ఎండిపోయిన యేరులా వున్నాను’’ అంది శకుంతల.‘‘నువ్వు దొంగేరులే! ఎప్పుడెండిపోతావో, ఎప్డుఉ నిండిపోతావో నాకు తెల్దనుకోకు’’ అని -‘‘బాగున్నావు శకుంతలా! ఏనుగు మామిడిలా ఎలిగిపోతున్నావ్’’ అన్నాడు రామ్మూర్తి.‘‘నా ఎలుగు గురించి నువ్వే చెప్పాలి! ఎన్ని బాధలు పడుతున్నానో ఆ దేవుడికి తెలుసు’’ అంది శకుంతల. నీళ్ళు రాని కళ్ళని ఎందుకైనా మంచిదని, చీర కొంగుతో వొత్తుకుంది.‘‘ఈ బాదలు నీకెప్పుడూ వుండేవేగాని! లచ్మి నెంటెట్టుకొని త్రిబుల్ గాడొస్తున్నాడు! బాదపడకు’’ అన్నాడు రామ్మూర్తి. ఆ అనడంలో ‘నాకంతా తెలుసు! నా సంగతి నువ్వు తెలుసుకో’ అన్నది ధ్వనింపచేశాడు.‘‘ఎంతిమ్మంటావ్’’ అడిగింది శకుంతల.‘‘ఎంతిస్తాం అక్కా! మన సరదాకి రెండో మూడో చేతులో పెడితే సరి’’ కల్పించుకున్నాడు సుందరం.‘‘వొందలు కాదు కదా’’ నవ్వాడు రామ్మూర్తి.‘‘నువ్వు వేలనుకుంటే నేనంత ఇవ్వలేను’’ చేతులు జోడించింది శకుంతల.‘‘హైదరాబాద్‌లో లక్షలకి లక్షలు సంపాదిస్తున్నానని అనుకుంటున్నావేమో! అదేం లేదు రామ్మూర్తి! ఏదో సామెత చెప్పినట్టు - అవ్వ తీసిన గంధం తాత సెగ్గడ్డకే సరని - నా వ్యాపారం సంగతలా వుంది! రాత్రీ పగలూ ఓ ఒకటే బిజీ! తీరా చూస్తే రాబడి తిండానికి సరిపోతోందంతే’’ అంది.‘‘యాపారంలో ఈ ఎచ్చుతగ్గులు మామూలే! బాదపడకు’’ అని -‘‘ఇయ్యన్నీ నాకెందుగ్గాని - నా మామూలు నాకిచ్చీ! నానెళ్ళిపోతాను’’ అన్నాడు రామ్మూర్తి.‘‘ఇస్తానుగాని, ఇచ్చింతర్వాత తక్కువైందని తగువులొద్దు’’‘‘మరలాంటప్పుడు తక్కువివ్వకు’’ నవ్వాడు రామ్మూర్తి.కాళ్ళావేళ్ళా పడి కన్నీళ్ళు పెట్టుకుంటే ఏల్నాటి శనైనా వదుల్తాడేమోగాని, పోలీసోడు మాత్రం వదలడన్నది తెలుసుకొని - వెయ్యి నూటపదహార్లు లెక్క చూసుకుని - చూపించి మరీ రామ్మూర్తికిచ్చింది శకుంతల. అందుకొని -‘‘సాలా తక్కువ! ప్చ్’’ పెదవులు చప్పరించాడు రామ్మూర్తి.‘‘ఈసారికిలా సరిపెట్టుకో రామ్మూర్తి! మళ్ళీసారొచ్చినప్పుడు నిన్ను బాగా చూసుకుంటాను’’ అంది.‘‘ఈ మాట పాత పాటే’’ అన్నాడు రామ్మూర్తి.‘‘వదిలెయ్ రామ్మూర్తీ! ఈసారికిలా వదిలేయ్’’ రామ్మూర్తి భుజం తట్టాడు సుందరం.‘‘సరే’’ అని -‘‘అయిదారాబాదు తమరూ ఎళ్తున్నారేటి’’ సుందరాన్నడిగేడు రామ్మూర్తి.‘‘అబ్బబ్బే! లేదు! నేనూ లక్ష్మీ ఇద్దరం ఒక్కసారిగా కన్పించలేదంటే ఇంకేమైనా వుందా! వూరంతా గోలెత్తిపోదూ’’ అన్నాడు.‘‘అయినా హైదరాబాద్‌లో మనకేం పని?’’ అని నవ్వాడు.‘‘అవునవును! తమరి పనంతా ఇక్కడే’’ అని, వచ్చిన పని అయిపోవడంతో -‘‘ఎళ్ళొస్తాను శకుంతలా!’’ అంటూ వెళ్ళిపోయాడు రామ్మూర్తి. ప్లాట్‌ఫారం ఆ చివరకి నడవసాగాడు.‘‘వీడేమీ రైల్వే పోలీసు కాదుగదా! వీడికిక్కడేం పని’’ రామ్మూర్తిని వుద్దేశిస్తూ సుందరాన్ని అడిగింది శకుంతల.‘‘పేరుకే ఆ పోలీసులు, ఈ పోలీసులూ గాని - పోలీసులంతా ఒక్కటేనక్కా!! వాళ్ళకి పని లేని ప్లేసంటూ వుండదు! శ్మశానంలో కూడా వాళ్ళకే పని’’ అని నవ్వాడు సుందరం. తోడుగా శకుంతల నవ్వలేదు గాని, నవ్వినట్లుగా సుందరాన్ని చూసింది.‘డ్‌డ్‌డ్‌డ్‌డ్’ అంటూ మెల్లిగా భారంగా వస్తోంది లూనా. లక్ష్మిని, త్రిబుల్‌గాణ్ని లాగలేక లాగలేక లాగుతోందది.‘‘సక్కగ! సక్కగ కూకో’’ హెచ్చరిస్తున్నాడు త్రిబుల్.‘‘అలాగే కూర్చున్నాను గాని - నువ్వు పద’’ అంటోంది లక్ష్మి. లూనా స్పీడుగా పోవట్లేదన్నది బాధగా వుంది లక్ష్మికి. సుందరం, శకుంతలొదినా తనకోసం స్టేషన్లో ఎదురుచూస్తూ వుండడం అన్నది తట్టుకోలేక పోతోందామె. కావాల్సిన వాళ్ళని, పెద్దవాళ్ళని అలా ఎదురుచూడనీయడం చులకన చెయ్యడమేనని అనిపించి, కుమిలిపోతోంది.రథం వీధి మలుపు తిరిగారు. మలుపులో కారొకటి అడ్డంగా రావడంతో కంగారుపడి, లూనాని సరిగా నడపలేకపోయాడు త్రిబుల్. వజవజా వణికించేశాడు. తర్వాత తేరుకుని ముందుకి పోనిచ్చాడు.వస్తోన్న లూనా శబ్దం విని, ఒక్కసారిగా మెలకువ తెచ్చుకుని లేచి కూర్చుంది కుక్కపిల్ల. విరిగిన తన కాలువంకా, వస్తోన్న లూనావంకా కసికసిగా చూసుకొంది. లూనా మీది త్రిబుల్‌గాణ్ని చూస్తూ ‘నువ్వే! నువ్వే కదరా నా కాలు విరగ్గొట్టావ్! రారా! రా చెప్తాను’ అన్నట్టుగా అటెన్షన్లోకి వచ్చింది. దానికిప్పుడు కాలు విరిగిన బాధలేదు. కసి తీర్చుకోబోతున్నానన్న సంతోషంలో వుంది. వచ్చిందొచ్చింది! దగ్గరగా వచ్చింది లూనా! మాటువేసి మీద పడ్డట్టుగా త్రిబుల్‌గాడి పాదాన్ని ఒక్కసారిగా అందుకొంది కుక్కపిల్ల. నోట కరచి పట్టుకొంది.‘‘అమ్మనీ...’’ పెద్దగా అరిచాడు త్రిబుల్.‘‘ఏమైంది త్రిబుల్’’ అంటూనే జరిగింది చూస్తో గగ్గోలయిపోయింది లక్ష్మి. త్రిబుల్ కాలుని వెనక్కి గుంజుతున్నాడు. కుక్క వదల్దు. ఆపితే మరింత డేంజరునుకొంటూ, లూనాని రైజ్ చేస్తూ స్పీడందుకుంటున్నాడు త్రిబుల్. పోటీపడుతోంది కుక్కపిల్ల.‘‘వొగ్గే! వొగ్గీవొగ్గీ’’ అంటూ బలంగా కాలుని గుంజుకున్నాడు త్రిబుల్. ఆసరికి కాలునొదిలేసింది కుక్కపిల్ల.‘బతికాన్రా దేవుడా’ అన్పించి, మరింతగా స్పీడు పెంచి, కనుచూపు మేరలో కుక్కపిల్ల కనిపించనంత దూరం వచ్చి, లూనా ఆఫ్ చేశాడు త్రిబుల్.‘‘బాగా కరిచిందా త్రిబుల్’’ అడిగింది లకి్క్ష.‘‘కరిసీసింది! ముందు పళ్ళు నాటి పోనాయి! దీనమ్మ...’’ అని, రక్తం వస్తోన్న కాలునోసారి చూసుకొని, ఏం చెయ్యాలో పాలుపోనట్లుగా అటూఇటూ ఓసారి చూసి -‘‘ఇక్కన్నాబం నేదు! పద సెప్తాను’’ అంటూ మళ్ళీ లూనా స్టార్ట్ చేశాడు త్రిబుల్.ఈ లూనా స్టేషన్‌కి చేరుకుంటుందా? నేనక్కడ నా సుందరాన్ని మా శకుంతలొదిన్నీ కలుసుకుంటానా? భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతానా? హైదరాబాద్ వెళ్తానా? సినిమా హీరోయిన్ని, మహానటిని అవుతానా?- ఇలాంటి ప్రశ్నలతో పిచ్చిపిచ్చిగా వుండి, నిస్సహాయంగా కళ్ళంట నీళ్ళు పెట్టుకొంది లక్ష్మి.---------------------------‘‘షటప్’’ అని సూట్‌కేసందుకుని చరచరా తననించి దూరంగా వెళ్ళిపోయిన లక్ష్మిని చూస్తో ఏం పాలుపోక ఏడుస్తూ తల పట్టుకొన్న ప్రసాద్, ఎవరో నడిపించినట్లు, నడిచొచ్చి, రైల్వే స్టేషన్‌కి దగ్గరగా వున్న పాకా విలాస్‌లో కూర్చుని టీ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసి ఆరేడు నిముషాలయింది. టీ రాలేదు. అయినా పట్టించుకోలేదు ప్రసాద్. ‘వస్తుందొస్తుందిలే’ అనుకొంటూ జేబులో వున్న కర్చీఫ్‌ని తీశాడు. కర్చీఫ్, కర్చీఫ్‌లా లేదు. చిన్నసైజు మూటలా వుందది. ఆ మూటని టేబుల్ మీద వుంచి విప్పాడు. విప్పిన ఆ కర్చీఫ్‌లో చెంప పిన్నులున్నాయి. రిబ్బన్లున్నాయి. కూల్‌డ్రింక్ సీసా మూతలున్నాయి. సినిమా టిక్కెట్ల ముక్కలున్నాయి. ఎండిపోయిన పువ్వులు, పత్రీ వున్నాయి. అవన్నీ లక్ష్మివే. లక్ష్మివే తను దొంగిలించో, దాచేసో జాగ్రత్త చేసుకున్నాడు ప్రసాద్. ప్రేమ గుర్తులని, మూటగట్టుకున్నాడు. ఇప్పుడవన్నీ లక్ష్మికి చూపిద్దామనే తెచ్చాడు. చూపించే అవకాశమే ఇవ్వలేదు లక్ష్మి. అంతలా సుందరం మాయలో పడిపోయింది. వాడు... వాడిలో ఏం చూసుకునో ఆ పరుగు? అర్థం కావట్లేదు ప్రసాద్‌కి.‘‘సిగరెట్’’ అడిగాడు పక్కగా వున్న కిళ్ళీ కొట్టువాణ్ణి. అందించాడతను. సిగరెట్ ముట్టించి, పొగని ముక్కులోంచి వదులుతూ దీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు ప్రసాద్. అప్పుడొచ్చింది ఆర్డర్ చేసిన టీ. తెచ్చినవాడు టీ కప్పుని విసురుగా ప్రసాద్ ముందుంచి, ఎవరికోసమో ‘రెండు మినప’ అని ఆర్డర్ చేస్తూ వెళ్ళిపోయాడు. విసురుగా టీ కప్పు తన ముందుంచడంతో కప్పులోని టీ ఎగిరి, ప్రాణప్రదంగా చూసుకొంటోన్న లక్ష్మి ప్రేమ గుర్తులమీద పడింది. పట్టించుకోలేదు సర్వర్. దాన్నేకాదు, తనని ప్రసాద్ కోపంగా చూడ్డాన్ని కూడా పట్టించుకోలేదు వాడు.గుర్తుల మీద పడ్డ టీని జాగ్రత్తగా తుడిచి, మళ్ళీ మూటగట్టి జేబులో దాచుకుని, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ టీని సిప్ చేశాడు ప్రసాద్. చప్పగా వుంది టీ. అందులో చక్కెర లేదు. కోపం ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక దాటేసింది. సర్వర్‌ని గట్టిగా కేకేసి పిలిచాడు ప్రసాద్. వస్తూ -‘‘ఏం కావాలి’’ అడిగాడు సర్వర్. ఆ అడగడం ఎలా వుందంటే ‘ఏంటంత గట్టిగా అరుస్తున్నావ్? ఎలా వుంది వొళ్ళు’ అన్నట్టుగా వుంది. దానికి ప్రసాద్ కోపం రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక దాటేసింది.‘‘ఇందులో చక్కెర లేదయ్యా..’’ అరిచాడు ప్రసాద్.‘‘అడిగావ్ కదా! తెచ్చేస్తాం! ఏటంత నోరు పారేసుకుంటున్నావ్! నానెవర్నో తెల్సా? బొగ్గులీది సాయిబాబా మడిసిని’’ అన్నాడు సర్వర్.బొగ్గుల వీధి ఎక్కడుందో, బొగ్గుల వీధిలో సాయిబాబా ఎవడో, వాడి మనిషి వీడయితే ఆ విషయం తనకెందుకు చెబుతున్నాడో ప్రసాద్‌కి అర్థంకాక, కోపం మూడో నెంబరు ప్రమాద హెచ్చరికని చేరుకోవడంతో -‘‘నువ్వు ఎవడి మనిషివైతే నాకేంట్రా’’ అంటూ లాగి లెంపకాయ కొట్టాడు ప్రసాద్. సర్వర్‌కి కళ్ళు తుళ్ళిపోయాయి.నైట్‌డ్రస్‌లో వున్నవాడు, పొడుగ్గా అందంగా వున్నవాడు, లేలేత మీసాలు, కొనదేలిన ముక్కు, కన్నీటి కళ్ళు వున్న ప్రసాద్ లాంటి కుర్రాళ్ళు గొడవలకి రారనుకున్నాడు సర్వర్. పైగా బెదిరిస్తే బెదిరిపోతాడనుకున్నాడు. కాని రివర్సయింది. ప్రసాద్‌తోపాటు ఆ పాకా విలాస్‌లో ఇంకా ఆరేడుగురున్నారు. వాళ్ళంతా ప్రసాద్ తెగింపుని తేరిపారజూస్తూ నిల్చున్నారు. ‘ఏమవుతుంది? ఇప్పుడేమవుతుంది?’ అన్న ఉత్కంఠలోకూడా వున్నారు.‘‘సాయిబాబా మనిషట! సాయిబాబా మనిషి! వాణ్ణి, నిన్ను ఇద్దర్నీ విరిచేస్తాను! ఏమనుకుంటున్నావో ఏమో?’’ అని టీ కప్పుని వేడివేడి టీని సర్వర్ ముఖం మీదికి విసిరేసి వెళ్ళిపోతోంటే -‘‘ఇదిగో’’ అని అరిచిన సర్వర్ దగ్గరగా వచ్చి -‘‘ప్రేమిస్తే ప్రాణం ఇస్తాను! కాదంటే ప్రాణం తీస్తాను! దటీజ్! దటీజ్ ప్రసాద్’’ అని బుసలుగా కోపాన్ని వదులుతూ కదిలిపోయాడు.అలా కదిలిపోతూ ఏదేమయినా నా ప్రాణంలో ప్రాణం నా లక్ష్మిని నేను కాపాడుకోవాలి. నా లక్ష్మిని నేనందుకోవాలి అనుకున్నాడు ప్రసాద్. అడ్డొస్తే ఎవర్నయినా నరికి పోగులు పెడతానని కూడా అనుకున్నాడు.------------------------సూట్‌కేస్‌తో పరుగు పరుగున వస్తోన్న లక్ష్మిని చూస్తూ, టెన్షన్ నుంచి రిలీవయ్యారు శకుంతలా సుందరులు. అంతదూరంలో లక్ష్మి కనిపించగానే ‘అమ్మయ్య వచ్చేసింది! లేకపోతే పెద్దగొడవయిపోను’ అనుకున్నాడు సుందరం. ‘నా డబ్బు గట్టిదే! నా సరుకు నాకొచ్చేసింది’ అనుకుంది శకుంతల.‘‘లక్ష్మీ’’ అంటూ దగ్గరగా వచ్చిన లకి్క్షని మరింత దగ్గరగా తీసుకుని -‘‘ఏంటింత ఆలస్యం’’ అనడిగాడు సుందరం. Challenge 18 episode-16-30‘‘త్రిబుల్‌ని కుక్క కరిచింది’’ చెప్పింది లక్ష్మీ‘‘నిన్ను కరవలేదు కదా?’’ కంగారు పడింది శకుంతల.‘‘లేదు! నన్నేం కరవలేదు’’ అని తర్వాత -‘‘అడుగో - పాపం ఆ కుళాయి దగ్గర కాలు కడుక్కొంటున్నాడు’’ అంటూ త్రిబుల్ని చూపించింది. ‘త్రాగునీరు’ కుళాయి దగ్గర త్రిబుల్ కాలు కడుక్కొంటూ బాధని అణుచుకుంటూ ‘స్‌స్‌స్’ అనుకుంటున్నాడు.‘‘రైలు రైట్ టైమేనా’’ అడిగింది లక్ష్మీ.‘‘రైట్ టైమే! ఇంకో అయిదు నిముషాల్లో వచ్చేస్తుంది’’ అన్నాడు సుందరం.శకుంతల ప్రక్కగా వున్న రెండు సూట్‌కేసులు చూసి, ఆ రెండూ శకుంతలవని ముందే తెలియడంతో, సుందరం సూట్‌కేస్ తీసుకురావడం లేదా? అనుకుని -‘‘నీ సూట్‌కేసేది?’’ సుందరాన్ని అడిగింది లక్ష్మీ.‘‘అది ... అదీ... నేను.. నేను మీతోపాటు ఇప్పుడు రావట్లేదు లక్ష్మీ’’ అన్నాడు సుందరం.‘‘అదేంటది’’ ఆశ్చర్యపోయింది.‘‘ఎందుకు రావట్లేదంటే - నేను, నువ్వు ఇద్దరం ఒక్కసారి కనిపించకుండా పోయామనుకో - మీ అన్నయ్యకి ఈజీగా మన సంగతి తెలిసిపోతుంది. ఇద్దరం కలిసి పారిపోయామనుకుంటాడతను. అటు మా ఇంటికొచ్చి, ఇటు కాలేజీకొచ్చి ఎంత గొడవైనా చేస్తాడు. ఆ అవకాశం ఆయనకి మనమెందుకివ్వడం? గొడవలు దేనికి? ముందు నువ్వెళ్ళు! నేనీ వూళ్ళోనే వుంటాను. దాంతో నా మీద ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు! తర్వాత నువ్వేమయ్యావో కూడా ఎవ్వరికీ తెలీదు! నన్నడిగినా నాకూ తెలీదంటాను’’ అని చెప్పి తనెందుకు రాకూడదో, రావట్లేదో వివరంగా రేపు ఫోన్లో మాట్లాడుకుందామన్నాడు ప్రసాద్. అక్కడితో ఆ టాపిక్ ఆగిపోయేలా, ఆపేసేలా చేశాడు.‘‘నీకేం భయం లేదమ్మా! నేనున్నాను’’ ధైర్యం చెప్పింది శకుంతల.‘‘అది కాదండి! సుందరం మనతోపాటు రావట్లేదంటే ఏంటో - ఏదోలా వుంది’’ లక్ష్మీ గొంతు జీరపోయింది.‘‘అయ్యయ్యో! ఏం కాదమ్మా! ఏం కాదు! నేనున్నాను కదా! దగ్గరుండి నీ సంగతంతా నేను చూసుకుంటాను! నాలుగైదు రోజుల్లో సుందరం రానే వస్తాడు’’ లక్ష్మీని సుందరం దగ్గర్నుంచి తన దగ్గరగా తీసుకుంది శకుంతల.ఓదార్చింది.శకుంతల గుండెల మీద వాలిపోయి, ఓదార్పు పొందుతోన్న లక్ష్మీ కంటికి అప్పుడు ప్లాట్‌ఫారానికి ఆ చివరకెదురుగా గుడిలాంటి పాము పుట్ట కనిపించింది. ఆ పుట్టన్నా, ఆ పుట్టలో వున్న దేవతా సర్పమన్నా లక్ష్మీకెంతో నమ్మకం. కోరుకున్న వెంటనే తనని స్టేజి నటిని చేసిందా సర్పం. అలాగే ఇపడు సినిమా నటిని చేసేందుకు హైదరాబాద్ పంపుతోంది. కాబట్టి కృతజ్ఞతగా దణ్నం పెట్టుకురావాలి. ఆ మాటే చెప్పింది శకుంతలా సుందరాలతో లక్ష్మీ.‘‘ఇప్పుడా? రైలొచ్చేస్తుంది’’ గాబరాపడ్డాడు సుందరం.‘‘ఇంకా రాలేదు కదా! ఎంతసేపు? ఇట్టే దణ్నం పెట్టుకొని వచ్చేస్తాను’’ అని పరుగుదీసింది లక్ష్మీ.‘‘ఇదేం పిల్లరా! చెబితే వినిపించుకోదు’’ చిరాకుపడింది శకుంతల.‘‘తప్పదక్కా! ఏం చేస్తాం! ఒక్కొక్కసారి వాళ్ళ మాట కూడా మనం వినాలి’’ అన్నాడు సుందరం.కుళాయి దగ్గర కాలు కడుక్కుంటున్న త్రిబుల్ గాణ్ని దాటి, ప్లాట్‌ఫారానికి ఆ చివర చేరుకొని, దానికెదురుగా వున్న పాము గుడి దగ్గరికి పట్టాలు దాటి వెళ్ళింది లక్ష్మీ. పుట్ట దగ్గరగా వచ్చి, చేతుల్రెండూ జోడించి, కళ్ళు మూసుకుని ప్రార్థించనారంభించింది. అంతే! ఇటు రైలొచ్చేసింది. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ దబదబామంటూ వచ్చి ప్లాట్‌ఫారానికి, పాము గుడికీ మధ్యన గోడ కట్టినట్లుగా నిలబడిపోయింది.ఎస్ ఫైవ్‌లోకి శకుంతల ఎక్కేసింది. ఆమె రెండు సూట్‌కేసులు, లక్ష్మి సూట్‌కేసు కూడా కోచ్‌లోకి చేరుకుంది. చేరుకోని లక్ష్మే!లక్ష్మి కోసమే వెర్రెత్తిపోతున్నారంతా. లక్ష్మిని తీసుకురమ్మని త్రిబుల్‌గాణ్ని పంపారు. వాడు కుక్కపిల్లలా కుంటుకుంటూ పరుగుతీస్తున్నాడు. సుందరం కాలుగాలిన పిల్లిలా కకావికలమైపోతున్నాడు. ‘నా డబ్బు! నా సరుకు’ అన్నట్లుగా బెంబేలుపడిపోతోంది శకుంతల.ఆ స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ ‘హాల్ట్’ అవుతుందంతే! పెద్దగా ఆగదు. కదిలిందంటే కొంపలు మునిగిపోతాయి.‘‘లక్ష్మీ! లక్ష్మీ’’ కేకలేసి పిలుస్తున్నాడు సుందరం.అటుగా వున్న లక్ష్మికి సుందరం కేకలు వినిపిస్తున్నాయి. అయితే రాలేకపోతోంది. కంపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి వుంటే, అటెక్కేసి, ఇటు వచ్చేసేదేమో! కాని, ఏ ఒక్కటీ తెరిచి లేదు! రాత్రవడంతో అంతా మూసేశారు. దాంతో రైలుకి చివరంటా పరుగుదీస్తేనే కాని, దారి దొరికే అవకాశం లేదు. ప్లాట్‌ఫారం చేరుకోలేదు. అందుకని పరుగుదీయక తప్పలేదు లక్ష్మికి. పరుగుదీస్తోంది. జనరల్ కంపార్ట్‌మెంట్ దాటింది. గార్డ్ పెట్టె దాటింది.రైలు చివరంటా వచ్చి, ఇటు ప్లాట్‌ఫారానికి చేరుకొంది. ఈ చివరనుంచి మళ్ళీ ఆ చివరికి పరిగెత్తాలి. ఎస్ ఫైవ్ కోచ్ ఆ చివర్లో వుంది. పరుగుదీస్తోంది లక్ష్మి. సరిగ్గా అదే సమయానికి పరుగు పరుగున ప్లాట్‌ఫారం మీదికి చేరుకున్నాడు ప్రసాద్. పరుగుదీస్తోన్న లక్ష్మిని చూశాడు. ‘‘లక్ష్మీ లక్ష్మీ’’ అంటూ ఆగమన్నట్లుగా కేకలేయసాగాడు.ఇటెవరు పిలుస్తున్నారన్నట్టుగా చూసిన లక్ష్మికి తనవెంట పడుతూ వస్తున్న ప్రసాద్ కన్పించాడు.ఇటు ప్రసాద్ ‘ఆగ’మన్నట్టుగా అరుస్తోంటే -అటు సుందరం ‘రార’మ్మంటున్నట్టుగా అరుస్తున్నాడు. అంతలో పెద్దగా అరుస్తూ రైలు స్టార్టయింది. మెల్లగా నడుస్తోంది. దాంతో శకుంతల ‘నా సరుకు నాసరుకం’టూ లక్ష్మిని చూస్తూ నెత్తి బాదుకుంటోంది. కాణీ కాదు, పరక్కాదు సరుక్కోసం సుమారుగా పాతికవేలు ఖర్చయింది. కష్టార్జితం! పోతుందా?! అన్న అనుమానంతో గుండెల్లో దడ పెంచుకొంటోంది.- ఇదంతా చిత్రంగా చూస్తూ త్రిబుల్‌గాడు ఓ ప్రక్కగా నిలుచున్నాడు.లచ్మి బండెక్కుద్దా! ఎక్కదా? టెన్షన్‌లో వున్నాడు. ఆ టెన్షన్‌లో కుక్క కరిచిన బాధని కూడా వాడు మరిచిపోయాడు.‘లక్ష్మీ!లక్ష్మీ’ అంటూ తనని చేజిక్కించుకునేందుకు వెంటపడి పరుగుదీస్తోన్న ప్రసాద్‌కి ఎట్టి పరిస్థితుల్లోనూ అందకూడదని, సుందరాన్ని అందుకోవాలని, శకుంతల్ని చేరుకోవాలని ఎక్కడలేని బలాన్నీ కూడదీసుకొని పరుగెత్తి పరుగెత్తి ఆఖరికి ఎలాగయితేనేం సుందరాన్ని అందుకొంది లక్ష్మి. అలా అని లక్ష్మి అనుకొంది. కాని నిజానికి సుందరమే లక్ష్మిని అందుకున్నాడు. బాస్కెట్ బాల్‌ని అందుకున్నట్లుగా లక్ష్మిని అందుకొని, బాస్కెట్ బాల్‌లాంటి లక్ష్మిని గట్టిగా పట్టుకొని, ‘‘అందించు! అందించు! చెయ్యందించు చాలు’’ అంటూ అరుస్తూ బాస్కెట్‌లాంటి కంపార్ట్‌మెంట్లో నిల్చున్న శకుంతలకి అందేలా బాల్‌లాంటి లక్ష్మిని విసిరేశాడు సుందరం. అదృష్టం బావుండి, పెట్టిన దణ్ణాలు ఫలించి చివరకి ఏదయితేనేం శకుంతల చేతికి చిక్కింది లక్ష్మి. చిక్కిన లక్ష్మిని చేజారిపోనివ్వలేదు శకుంతల. అంతగట్టిగా పట్టుకొంది. కంపార్ట్‌మెంటులోకి లాక్కొని గుండెలకి హత్తుకుంది.‘బడబడ’ మంటూ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారం దాటేసింది. చీకట్లో కలిసిపోయింది.ఎప్పుడయితే సుందరం చేతిని లక్ష్మి అందుకుందో ఇకప్పుడు లాభం లేదనుకొని పరుగునాపి, ప్లాట్‌ఫారమ్మీద నిల్చుని ఆయాసపడసాగాడు ప్రసాద్. ముఖానికి పట్టిన చెమట ని చొక్కాతో తుడుచుకున్నాడు.‘లచ్మి బండెక్కేసింది’త్రిబుల్‌గాడు గుండెల్నిండా వూపిరి పీల్చుకొన్నాడు. వాడికిప్పుడు ఏ టెన్షనూ లేదు.లక్ష్మినయితే ప్రసాద్‌కి అందనీయకుండా తనందుకొని శకుంతలకి అందజేయగలిగాడు కాని, ప్రసాద్‌కి అందకుండా పారిపోవడం సుందరం వల్లకాలేదు. పారిపోదామని ప్రయత్నించాడు సుందరం. కాని అడ్డుకున్నాడు ప్రసాద్.ఆ అడ్డుకోవడం ఎలా అడ్డుకున్నాడో తెలుసా?!‘‘ఎక్కడికిరా బ్రోకర్నాకొడకా’’ అని సుందరం కాలర్ పట్టుకున్నాడు ప్రసాద్. కుందేలు పీక పట్టుకొన్నట్లుగా పట్టుకున్నాడు సుందరాన్ని. వంట్లో వున్న బలాన్నంతా చేతిలోకి తీసుకొచ్చాడేమో! ప్రసాద్ చెయ్యి ఇనపకడ్డీలా గట్టిగా బిగుసుకుపోయుంది. నరాలు వుబ్బి కన్పిస్తున్నాయి.ప్రసాద్ కన్నా సుందరం పది పన్నెండేళ్లు పెద్ద. ఒకటి రెండించీల పొడవు కూడా. ప్రసాద్ కన్నా సుందరమే బలవంతుడు. అయినా ప్రసాద్ చేతిలో సుందరం పిచికలా గిలగిల్లాడుతున్నాడంటే అధర్మం కన్నా ధర్మానికి బలం ఎక్కువనిపిస్తోంది. అధర్మానికి రావణాసురుడిలా పదితలలుంటే వుండొచ్చుగాక, ధర్మానికి రాముడిలా ఒకే ఒక్క తలయ్యుండొచ్చు గాక, ఆ ఒక్క తలముందూ ఈ పది తలలూ తెగిపడాల్సిందే! తప్పదనిపించింది.‘‘ఏం చేశావురా? నా లక్ష్మినేం చేశావ్? అమ్మేశావా? చెప్పుఅమ్మేశావా?’’ అంటూ కుడిచేతిని పిడికిలి చేసి, గదలా చేసి సుందరం కడుపులో ఒక్కటిచ్చాడు ప్రసాద్. అంతే! సుందరానికి అమ్మ గుర్తొచ్చింది. ‘అమ్మా’ అని అరుస్తూ చేతుల్తో కడుపు పట్టుకొని కిందపడ్డాడు. చెట్టేదో స్లోమోషన్లో కిందపడుతున్నట్లుగా సుందరం అలా కింద పడుతోంటే దూరంగా వున్న పోలీసు రామ్మూర్తి, దగ్గరగా వున్న త్రిబుల్ ఒకర్నొకరు కేకలేసుకుంటూ పరుగుదీశారు.వాళ్లొచ్చేసరికి సుందరం వెల్లకిలా కిందపడిపోయి లుంగలు చుట్టుకుపోతున్నాడు.‘‘ఏటి బాబూ! ఏటీ గోరం’’ ప్రసాద్‌ని అడిగాడు త్రిబుల్.‘‘ఇంకోసారి ఇదే మాట మళ్ళీ అడిగావనుకో! నీ గురించి అడగడానికి ఈ పోలీసు రామ్మూర్తి కూడా నీ పక్కన వుండడు’’ అన్నాడు ప్రసాద్.‘‘అంటే ఏట్నీ వుద్దేశం ప్రసాద్ బాబూ! పోలీసోణ్ని! నన్ను కూడా కొడతానంటావా’’‘‘పాపం చేస్తే పోలీసోణ్నే కాదు! ఆ పరమాత్ముడ్నయినా వదిలిపెట్టను’’ అన్నాడు ప్రసాద్. ఆ మాట రామ్మూర్తికి పదేపదే వినరావడం. భయపడ్డాడు. దాంతో చేతిలో మంత్రదండం లాంటి లాఠీ వున్నా, మంత్రాలు గుర్తుకురాని మాయలఫకీరులా పిచ్చి చూపులు చూస్తూ….‘‘ఇదిగో ఈ నరుక్కోవడాలు, ఫైటింగులూ వొద్దుగాని... ఎల్లు... ఎల్లిక్కణ్నించి’’ అన్నాడు. ఆ అనడంలో హెచ్చరిక ఎంత మాత్రం లేదు. వుంటే గింటే ‘బాబూ!నాయినా!’ అన్న బతిమాలుడుతనం వుంది.‘‘వెళ్తున్నాను! కాని మిమ్మల్నొదిలిపెట్టన్రా!వొదిలిపెట్టను! మీ అంతు చూస్తాను’’ అని వెళ్లిపోయాడు ప్రసాద్. ప్రసాద్ వెళ్లిపోవడంతో చెంతనున్న బాంబు దానంతటదే నిర్వీర్యమైనట్లుగా అనిపించి, ప్రమాదం లేదన్న భరోసాతో బలంగా వూపిరి పీల్చుకొన్నాడు రామ్మూర్తి. మంత్రాలు గుర్తొచ్చినట్టనిపించి మంత్రదండం ప్రాణం పోసుకుని పోలీసా!మజాకా’’ అన్న పవర్లోకొచ్చి...‘‘లెగరా!లెగు!లెగు’’ అంటూ లాఠీతో కింద పడ్డ సుందరాన్ని గుచ్చాడు.‘‘ఆడేటి లెగుస్తాడు సార్ అలా సుట్టుకుపోతుంటేను! మనవే లేపాల! సెయ్యెయ్యండి’’ అని రామ్మూర్తితో పాటు సుందరాన్ని లేపే ప్రయత్నంలో పడ్డాడు త్రిబుల్.ఆ ముగ్గురూ తప్ప మరెవరూ ప్లాట్‌ఫారమ్మీద లేరు. టీ కుర్రాడు, వీడ్కోలు చెప్పడానికొచ్చిన ఒకరిద్దరు మనుషులూ... వాళ్లంతా ఎప్పుడో వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ ముగ్గురూ కూడా ప్లాట్‌ఫారాన్ని ఖాళీ చేస్తే ప్రశాంతంగా వుంటుందక్కడ.----------------------చలిలో మునగదీసుకొని పడుకున్నట్లుగా, దగ్గర దగ్గరగా పదిపన్నెండు గడపలున్న ఏదో పల్లెటూరు వీధిదీపాల వెలుగులో ఇట్టే కనిపించి అట్టే మాయమయింది. తర్వాతంతా చీకటే చీకటి! చీకటిని కోసుకుంటూ వెళ్లిపోతోంది రైలు.రెండూ లోయర్ బెర్తులే! ఒక బెర్తు మీద శకుంతల పడుకుంది. రెండో బెర్త్ మీద లక్ష్మి పడుకోవాలి. కానీ ఆమె పడుకోలేదు. కూర్చుంది. మిడిల్ బెర్త్ ఆమె మెడమీదవుండడంతో తలొంచుకొని, కిటికీని ఆనుకొని కూర్చుందామె. కూర్చొని, గ్లాస్ డోర్ లోంచి అక్కడక్కడా వెలుగులో పరుగుదీస్తోన్న పల్లెల్ని, పొలాల్నీ, రొయ్యల చెరువుల్ని చూస్తోంది. హఠాత్తుగా ఆమెకెందుకో అన్నయ్య గుర్తుకొచ్చాడు.ఇప్పుడు టైమెంతయి వుంటుంది? మూడున్నర-నాలుగవుతోందేమో! అయితే ఈ టైములో అన్నయ్య లేస్తాడు. తప్పకుండా లేస్తాడు. లేచి, వంటిట్లోకెళ్లి మంచినీళ్లు తాగుతాడు. తిరిగొస్తూ నేనెలా వున్నదీ అన్నయ్య చూస్తాడు. కప్పుకున్న దుప్పటి తొలగిందేమో! చలికి వణికిపోతోందేమో! దుప్పటి కప్పిపోదామన్నట్లుగా చూస్తాడు. మంచం మీద నేను కనిపించను. దాంతో అన్నయ్య ఏం చేస్తాడు?లక్ష్మికి ఊహకందలేదు. ఏడుపొచ్చిందామెకు. సన్నగా ఏడుస్తోంటే మెలకువ వచ్చిందేమో చూసి శకుంతల మెత్తగా అడిగింది.‘‘ఎందుకేడుస్తున్నావ్’’‘‘ఏం లేదండీ! ఎందుకో ఏడుపొస్తోందంతే’’ అంది.‘‘మీ అన్నయ్య గుర్తుకొచ్చాడు కదూ’’ అడిగింది శకుంతల.‘‘అవునండీ’’ ‘భలే పోల్చార’న్నట్లుగా చూసింది లక్ష్మి.ప్రయాస మీద లేచి కూర్చుని లక్ష్మి ముఖం దగ్గరగా ముఖాన్నుంచి...‘‘ఏడిస్తే ఏదో అనుకుంటారంతా! లేనిపోని అనుమానాలొస్తాయి! ఏడవకు! పడుకో’’ అంది.‘‘నిద్దర్రావట్లేదండీ’’‘‘కళ్లు మూసుకొని పడుకో! అదే వస్తుంది’’పడుకుంది లక్ష్మి. కళ్లు మూసుకుంది. కళ్లు మూసుకున్నా అన్నయ్యే కనిపిస్తున్నాడామెకి. అమ్మ పోయిన తర్వాత అన్నయ్యే తనని అమ్మలా పెంచుకొచ్చాడు. అడిగినవన్నీ కాకపోయినా, అవసరమయినవన్నీ కొనిచ్చేవాడు. చెల్లెలని నెత్తిమీదకి ఎక్కించుకోలేదుకాని, భుజాలమీదకి ఎత్తుకుని ‘గుమ్మడిపండు’ అంటూ పరుగెత్తేవాడు. పనసతొనలు, తాటిముంజెలు, జామకాయలు, రేగిపళ్లు, మామిడిపళ్లు... ఎప్పుడేవి బజారుకొస్తే అప్పుడవి కొని తెచ్చిచ్చేవాడు. తినేవరకూ వొదిలేవాడు కాదు. జర్వం వచ్చి వదిలినప్పుడల్లా హోటల్ నుంచి టిఫిన్ తెచ్చేవాడు. స్వప్న హోటల్ టిఫినంటే తనకి బాగా ఇష్టం. పెసరట్టుప్మా ఎంతిష్టమో!ఓసారి అట్లతదియకి వూగడానికి వుయ్యాలకావాలంటే అప్పటికప్పుడు ఇంట్లో వుయ్యాల వేశాడు. వూపమంటే వూపాడు కూడా.‘గట్టిగా వూపకరా అన్నయ్యా! కళ్లు తిరుగుతాయి’ అంటే.‘నీకెంత వూపాలో నాకింతప్పట్నుంచీ తెలుసే’ అన్నాడన్నయ్య. పుట్టినప్పటి నుంచి అన్నయ్యే వూపాడు వుయ్యాల! ఆ సంగతి మరిచిపోయి మాట్లాడింది తను.రైలు ప్రయాణం వుయ్యాల్లో వూగుతున్నట్లుగానే వుంది. సరదాగా, సుఖంగానే వుంది కానీ, ఏంటో బాధగా వుంది లక్ష్మికి. పదే పదే అన్నయ్య తలపునకు రావడాన్ని తట్టుకోలేకపోతోందామె. నిద్ర పట్టట్లేదు. లేచి కూర్చుంది. ముడుచుకొని కూర్చునేందుకు కాళ్లు మడుచుకుంటూ అటుగా చూసి ఆశ్చర్యపోయింది. కళ్లు పెద్దవి చేసుకొని భయపడ్డట్లుగా చూసింది.ఎవరో స్త్రీ.. ముఫ్పై, ముఫ్పై అయిదేళ్ల వయసుంటుంది. నైటీలో వుంది. సన్నగా వున్నా అందంగా వుంది. బ్రష్ చేస్తోందేమో! నోటినిండా టూత్ పేస్ట్ నురుగుంచుకొని లక్ష్మిని రమ్మంటున్నట్టుగా చేత్తో సైగ చేస్తు పిలుస్తోంది.ఎవరో తెలీదు! ఎందుకు పిలుస్తోందో తెలీదు. దాంతోనే ఆశ్చర్యపోయి భయపడ్డట్టుగా కళ్లు పెద్దవి చేసుకొని చూసింది లక్ష్మి. ఎందుకైనా మంచిదని తల మీద నుంచి దుప్పటి కపకొని, దుప్పటిలో కట్టి పడేసిన శవంలా పడుకున్న శకుంతలను లేపబోతుంటే ‘వద్దు వద్ద’న్నట్లుగా సైగ చేసి అమాంతం లక్ష్మి చేయందుకొని ముందుకి టాయ్‌లెట్స్ దగ్గరగా లాక్కొచ్చి, నోటిలోని నురగని అక్కడ వాష్‌బేసిన్లో ఉమ్మేసి, ‘ఎవరీవిడ? ఏంటిదంతా’ అన్నట్లుగా భయం భయంగా చూస్తోన్న లక్ష్మితో...‘‘నా పేరు రాణి! రా చెప్తాను’’ అంటూ ఎస్ సిక్స్ కోచ్‌లోకి తీసుకొచ్చి అక్కడి డోర్ దగ్గరగా నిలబెట్టి, ‘‘కంగారు పడకు! అసలు సంగతేంటంటే...’’ అని రాణి ఏదో చెప్పబోతోంటే...‘‘ఏంటి మీరు! బలవంతంగా లాక్కొచ్చారు! వదలండి చెప్తాను’’ అని గింజుకొంటున్న లక్ష్మితో....‘‘వదిలితే ఛస్తావ్! చెప్పింది విను’’ అంది రాణి.‘‘ఎందుకు ఛస్తాను’’ మొండిగా అడిగింది లక్ష్మి.‘‘ఎందుకా? అది అదెవరనుకున్నావ్’’‘‘ఎవరు?’’‘‘ఎవరా? శకుంతల! ఆ శకుంతల ఎవరనుకుంటున్నావ్’’‘‘ఎవరు’’ శకుంతల పేరు చెప్పగానే కొంతలో కొంత మెత్తబడింది లక్ష్మి.‘‘పెద్ద బ్రోకర్! దానికి హైదరాబాద్ కృష్ణానగర్‌లో పెద్ద ఫ్లాటుంది.! అందులో నీలాంటి వాళ్లు ఆరేడుగురుంటారు’’అర్థం కాలేదు లక్ష్మికి. అలాగే చూసింది రాణిని.‘‘అర్థం కాలేదు కదూ? నీకు ..నీకెలా చెప్పాలి? అది... ఆ శకుంతల పెద్ద వేశ్య. దానికి కృష్ణానగర్‌లో పేద్ద వేశ్యాగృహం వుంది. నిన్ను అక్కడ వేశ్యని చెయ్యడానికే తీసుకెళ్తోంది’’ చెప్పింది రాణి.ఆ మాటలు విన్న లక్ష్మికి నోట మాట రాలేదు. చూపులో కూడా సూటిదనం చచ్చిపోయింది. గుడ్లప్పగించి అటెటో చూడసాగింది. అలా చూస్తోన్న లక్ష్మిని...‘‘ఏయ్! ఏయ్’’ అంటూ కుదిపి, తేరుకున్న లక్ష్మితో...‘‘అసలు సంగతి ఇప్పుడర్థమయిందా?’’ అడిగింది రాణి.‘‘అర్థమయింది కానీ... అసలింతకీ మీరు..మీరెవరు’’ అడిగింది లక్ష్మి.‘‘నేనెవరన్నది తర్వాత నీకు వివరంగా చెప్తాను! ముందో పన్చెయ్’’‘‘ఏం చెయ్యమంటారు?’’‘‘నీ బెర్త్ దగ్గరకెళ్లి నీ సూట్‌కేస్ తీసుకొని రా! వచ్చే స్టేషన్లో నువ్వు నేనూ దిగిపోదాం’’‘‘దిగిపోయి...?’’‘‘ముందు దిగిపోదాం. తర్వాత సంగతి తర్వాత’’‘‘లేదు! నేనెట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ వెళ్లాలి! సినిమా నటిని కావాలి’’‘‘ఈ పిచ్చితోనే పీకల మీదకి తెచ్చుకున్నావ్!చెప్పిన మాట విను! ముందు సూట్‌కేస్ తీసుకొనిరా’’‘‘అమ్మో! శకుంతల చూసిందంటే ఇంకేమైనా వుందా? నా వల్లకాదు.’’ భయపడింది లక్ష్మి.‘‘సరే!గుర్తులు చెప్పు! ఆ సూట్‌కేస్‌ని నేను తీసుకొస్తాను’’ అంది రాణి. లక్ష్మి గుర్తులు చెప్పింది.‘‘నువిక్కడే వుండు’’ అని రాణి బయలుదేరింది. బయలుదేరిన రాణిని చూసి ఆలోచనలో పడింది లక్ష్మి.శకుంతల గురించి సుందరానికి తెలీదా? లేకపోతే తెలిసి తెలిసీ సుందరమే ఇందుకు తెగించాడా? సుందరం అలాంటి వాడేనా? ‘కాదు కాదని’ సమాధానం చెపకుంటున్నా ‘ఔను ఔనని’అనిపిస్తోంది. నెత్తి కొట్టుకోవాలనిపించింది లక్ష్మి. ఏడుపొచ్చింది. ఏడుస్తూ డోర్‌నానుకొని అంతలోనే నిస్సత్తువ కూడా ఆవహించడంత డోర్‌నంటిపెట్టుకొని కిందకి జారి కూర్చుని మోకాళ్లలో తలంచుకొంది లక్ష్మి. అంతలో లక్ష్మి సూట్‌కేస్‌తో రాణి రానే వచ్చింది. వచ్చి ఏడుస్తోన్న లక్ష్మి చూసి.‘‘ఇదిగో! పద’’ అని లక్ష్మి లేపి ఓ చేత్తో లక్ష్మిని పొదివి పట్టుకొని, మరో చేత్తో సూట్‌కేస్‌ని మోస్తో ముందుకు నడిచింది రాణి. తన సీట్ దగ్గరగా తీసుకొచ్చి లక్ష్మి కూర్చోబెట్టింది. సైడ్‌లో లోయర్ బెర్త్ కావడంతో ఫ్రీగా కూర్చున్నారిద్దరూ.‘‘అయిదంటే అయిదే నిమిషాలు! అయిదు నిమిషాల్లో మనం యలమంచిలిలో దిగిపోదాం’’‘‘యలమంచిలి అంటే’’‘‘అదో వూరు! వూరి పేరది! అది కూడా తెలీదా’’ అడిగింది రాణి.‘‘తెలీదు’’ అంది లక్ష్మి.‘‘బాగా సత్తెకాలపు దానివి’’ జాలిపడింది రాణి.‘‘కాఫీ కాఫీ’’ కాఫీ వొచ్చింది.‘‘తాగుతావా?’’ లక్ష్మిని అడిగింది రాణి.‘‘వద్దు’’ అని.‘‘శకుంతల వస్తుందేమోనని భయంగా వుంది’’ అంది.‘‘రాదు! మంచి నిద్రలో వుంది.! భయపడకు’’ అంది రాణి.‘‘ఏమ్మా! కాఫీ’’‘‘వొద్దు’’ చెప్పింది రాణి.అక్కడొకరు, ఇక్కడొకరుగా ప్రయాణీకులు మేల్కొంటున్నారు. నిద్ర గొంతుల్తోనే సెల్ ఫోన్‌లో సంభాషిస్తున్నారు. ఏ బెర్తు మీద వుందో చంటిపాప. గుక్క పట్టి ఏడుస్తోంది. లాలించలేకపోతోంది తల్లి. విసుగొచ్చి. ‘‘వూర్కో! వూర్కో’’ అంటూ కసురుతోంది.‘‘పొద్దున పొద్దున్నే ఎందుకే దాన్ని కసుర్తావు’’ ఎవరో పెద్దావిడ నిదానంగా చెపుతోంది.‘‘నా గోల మీకెందుకు? మీ మానాన్న మీరు పడుకోండి.’’ పిల్ల తల్లి విసుక్కోంటోంది.మాటలు, ఏడుపు తప్ప మనుషులు కనిపించడం లేదు. అంతా ఏంటోగా వుంది లక్ష్మికి. ఇంతలో రైలాగింది.‘‘పద దిగు’’... లక్ష్మిని తీసుకొని గబగబా నడిచింది రాణి.ఇద్దరూ రైలు దిగేశారు.అప్పుడప్పుడే తెల్లవారుతోంది. మంచు దట్టంగా కురుస్తోంది. బాగా చలిగా వుంది. ఆ చలిలో మంచులో దిగిన లక్ష్మి, రాణిని చూసి దగ్గరగా వచ్చిన వ్యక్తితో...‘‘కారు రెడీనా’’ అడిగింది రాణి.‘‘రెడీ’’ అన్నాడా వ్యక్తి.‘‘మా వూరికేనా’’ అడిగింది లక్ష్మి.‘‘ముందు కారెక్కు! పద’’ అంది రాణి.ముగ్గురూ కారెక్కారు. కారు స్టార్టయింది. వెనక సీట్లో రాణితో పాటు లక్ష్మి కూర్చుంది. కారు సీటుకి చేరబడి కళ్లు మూసుకొని రిలాక్సవుతోంది రాణి. లక్ష్మి కూడా ఇంచుమించు అదే స్థితిలో వుంది. లేగదూడ ఒకటికారుకి అడ్డంగా వచ్చింది. దాంతో సడెన్ బ్రేక్‌తో కారాగింది.ఆగిన కారునొకసారి చూసి ముందుకి దూకింది లేగదూడ. దాని చేష్టకి నవ్వొచ్చింది లక్ష్మికి. కారు బయలుదేరింది. ఎక్కణ్నించో సీతాకోక చిలుక ఎగిరొచ్చి చిత్రంగా ముందు సీటు మీద వాలింది.దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలనుకుంది లక్ష్మికి. చేతిని మెత్తగా ముందుకు చాపిందో లేదో బయటకి ఎగిరిపోయిందది. ‘అయ్యయ్యో’ అని ఆనందంగా బాధపడింది లక్ష్మి.ఇదంతా క్రీగంట గమనిస్తూనే వుంది రాణి. ‘ఆడుకోనీ... ఆడుకోనీ’ అనుకుంటుండంగాసెల్ మోగింది. అందుకుని ‘హలో’ అంది.‘‘నేను రాణి’’ అటునుంచి పరిచయమైన గొంతు వినవచ్చింది.‘‘అయిపోయింది బాస్! ఆపరేషన్ సక్సెస్! సీతాకోకచిలుక ఇప్పుడు మన కారులోనే వుంది’’ అంది రాణి.‘‘లేదు! ఎగిరిపోయిందిగా’’ కల్పించుకొని చెప్పింది లక్ష్మి.‘‘ఆ సంగతి కాదులే’’ అని లక్ష్మితో అని, ఫోన్లో -‘‘ఓ గంటా, గంటన్నరలో నీ దగ్గరుంటాం బాస్’’ అంది రాణి. అని సెల్ ఆఫ్ చేసి లక్ష్మిని కొనగంట నవ్వుతూ చూసి.‘‘నీకిప్పుడు ఎన్నేళ్లు’’ అడిగింది.‘‘పద్దెనిమిది’’‘‘ఇంకా నీలో చిన్నతనం పోలేదు’’ నవ్వింది.‘‘మా అన్నయ్య కూడా ఇదే మాట అంటాడు. పెద్దదాన్ని ఎప్పుడవుతానో ఏమో’’ అంది. లక్ష్మి కూడా నవ్వింది. గలగలా వుందామె నవ్వు.‘‘చెప్పండి! ఇంతకీ మీరెవరు? నన్నెందుకు కాపాడాలనుకున్నారు’’‘‘చెప్తా! చెప్తా! తొందర దేనికి?’’ అంది రాణి.‘‘అది కాదండీ నరకంలో పడబోతున్న నన్ను పట్టుకొని లాగి, ఇలా కారులో పడేశారంటే మీరు...మీరు మామూలు మనిషి కాదు. నా దృష్టిలో మీరు మా వూరి నాగదేవత.’’‘‘ఆకలేస్తోందా’’ అడిగింది రాణి.‘‘బాగా’’ అంది లక్ష్మి.‘‘ఇదిగో! సీతాలు టిఫిన్ సెంటర్ దగ్గర కారాపు’’ కారు నడుపుతున్న వ్యక్తితో చెప్పింది రాణి.‘‘సరే’’ అన్నాడా వ్యక్తి.‘‘ముఖం కడుక్కొని రెండిడ్లీ, ఓ ప్లేటు పూరీ లాగించావనుకో కడుపులో హాయిగా వుంటుంది’’ అంది రాణి.జవాబుగా నవ్వింది లక్ష్మి.నేలమీద రాలి పడ్డ పువ్వులు, గన్నేరు చెట్టూ వెనక్కి పారిపోయాయి. పిచ్చుక గూళ్లున్న ఈత చెట్టొకటి - అది కూడా పారిపోయింది. అరెరె! కోతుల గుంపు! రోడ్డు మీద సభ తీర్చినట్లుగా కూర్చున్నాయి. కారు స్పీడుగా రావడంతో అటూ ఇటూ కంటికి అందకుండా పరిగెత్తాయి.కార్లోంచి అన్నీ చూస్తోంది లక్ష్మి. ఆనందిస్తోంది. పది పన్నెండేళ్ల పిల్లలెవరో ‘టాటా’ చెబుతోంటే తనూ వాళ్లకి ‘టాటా’ చెప్పి నవ్వింది లక్ష్మి. ఆ క్షణం జీవితం హాయి హాయిగా వుందనిపించిందామెకి. ఈ క్షణం శాశ్వతమయితే బాగుణ్నని కూడా అనిపించిదామెకి.అమ్మని లక్ష్మి చూడలేదు. కానీ, సినిమా నటి సావిత్రిని చూసినప్పుడల్లా ‘సావిత్రే మా అమ్మ’ అనుకునేది లక్ష్మీ. ఇప్పుడా సావిత్రి గుర్తుకొచ్చింది. అన్నయ్య గుర్తుకొచ్చాడు. వూరిలో కొండమీద కొలువైన దే వుడు, ఆ దేవుణ్ని చేరుకునేందుకు కట్టిన నూటపదహారు మెట్లు, ఆ మెట్ల మీద అన్నయ్య చేయి పట్టుకొని నడిచిన నడక, బాదం ఆకుల్లో అక్కడి ప్రసాదం, గుడి గంట మీద రాలిన పావురాలూ ఇలా ఎన్నో అందమైన దృశ్యాలు, ఆనందమయమయిన సన్నివేశాలు లక్ష్మికి గుర్తొస్తుండగా కారెందుకో ఆగిపోయింది. చూస్తే...‘సీతాలు టిఫిన్ సెంటర్’ అని బోర్డు కనిపించింది.‘‘దిగు’’ అంది లక్ష్మితో రాణి. లక్ష్మి దిగింది. కారులోంచి నేల మీదకి దిగిన లక్ష్మి చుట్టూ చూసింది.పెద్ద రావిచెట్టు! రావి చెట్టునీడలో టిఫిన్ సెంటర్. సెంటర్లోంచి ‘అబ్బా నీ తియ్యని దెబ్బ! ఎంత కమ్మగా వుందిరో యబ్బ’ పాట ... ఆ పాటతో పాటు‘‘ఎంత సేపయిందిరా పూరీ చెప్పి! తొందరగా తీసుకురా’’‘‘ఇదిగో ముందు ఇడ్లీ కొట్టు’’‘‘ఓర్నాయన! ఇదేం కాఫీరా బాబూ! ఇందులో షుగర్ లేదు’’‘‘నీకు షుగరుంది కదా! అందుకే ఎయ్యలేదు’’. అన్న కబురూ వినవస్తోంటే ‘బాగుందీ వాతావరణం’ అనుకొని సెంటర్ ముందున్న గోళెం లోంచి నీటిని దోసిలిలోకి తీసుకొని ముఖమ్మీద జల్లుకుంది లక్ష్మి. చల్లగా హాయిగా వుందనిపించిందామెకు. నీళ్లు పుక్కిలించింది.‘‘ఇదిగో’’ టూత్ పేస్ట్ పెట్టిన బ్రష్‌ని అందించింది రాణి. అందుకొని బ్రష్ చేసింది లక్ష్మి. బ్రష్ చేసిన మీదట గుండెల్నిండా వూపిరి పీల్చింది.అప్పుడు పూరీకూర వాసన ముక్కుపుటాలని తాకింది. బావుందా వాసన.‘‘పూరీ చెప్పండి! ముందది తిందాం’’రాణితో అంది లక్ష్మి.‘‘సరే’’ నవ్వింది రాణి. పూరీనే ఆర్డర్ చేసింది. పూరీ ప్లేటొచ్చింది. పూరీని తుంచి కూరలో అద్ది లక్ష్మి ఇలా నోట్లో పెట్టుకుందో లేదో...రెండు అంబాసిడర్ కార్లొచ్చి సడెన్ బ్రేక్‌తో ఒకదాని తర్వాత ఒకటి ఆగాయి. ఆగిన కార్లోంచి ముందు నలుగురైదుగురు గూండాల్లాంటి వ్యక్తులు దిగారు. ఆ వెనుక శ...శ....శ.... శకుంతల దిగింది. దిగిన శకుంతల ఎలా వుందంటే... కోపంగా వుంది... కసిగా వుంది.... జుత్తుని ముడిపెట్టుకొని వుందేమో, చీరకొంగుని బిగుతుగా గట్టిగా బొడ్లో దోపిందేమో... యుద్ధానికి వస్తున్నట్టుగా వుంది. ఎర్రని కళ్లతో ఇటూ అటూ చూస్తూ ఆ కళ్లలో లక్ష్మి పడ్డంతో ‘భగ్గు’మందామె. ‘‘అదిగో! సరుకక్కడే వుంది! పట్టుకోండి! పట్టుకోండి దాన్ని’’ పెనుకేక పెట్టింది శకుంతల. గూండాలు పరుగెత్తుకొని వెళ్లి లక్ష్మిని, రాణినీ చుట్టేశారు. తుంచిన పూరీ ముక్క ఇంకా చేతిలోనే వుంది. దాన్ని అప్రయత్నంగా కిందపడేసి, భయంభయంగా చూస్తూ లేచి నిలుచుంది లక్ష్మి. రాణి భయపడలేదు. రాణిని, లక్ష్మినీ కార్లో తీసుకొచ్చిన డ్రైవరు, అటుగా కూర్చునుండి అంతా గమనిస్తున్నాడు.‘‘మత్తు బిస్కట్లిచ్చి లగేజీ కొట్టేసిన మొహమూ ఇదీ! చూడెలా చూస్తోందో! దీన్ని...దీన్ని’’ అంటూ రాణిని కొట్టడానికి దగ్గర్లో ఏదైనా వుందా? అన్నట్టుగా చూసి ఏమీ లేకపోవడంతో చేతిని పిడికిలి చేసి, రాణి నెత్తి మీద ఒక్క గుద్దు గుద్దింది శకుంతల.‘‘నీకేం అయిందమ్మా! ఎవరు పిలిస్తే ఆళ్లతో ఎళ్లిపోతావా? ఓ కట్టూ, బొట్టూ లేదా నీకు?’’ పిడికిలి చేత్తోనే లక్ష్మి బుగ్గ మీద పొడిచింది శకుంతల. పలుగుతో పొడిచినట్టయిందామెకు. ఒకటే నొప్పి.‘‘ఇదేం లైన్ యాపారమే తల్లీ! లైన్ యాపారమంటే ఇంకొకరి సరుకుని కొట్టీడం కాదు. సరుకుని తెచ్చుకోడం’’ అని-‘‘అసలిది! ఇదెవత్తి! శకుంతల సరుకు మీదే కన్నేసిదంటే ఇది.... ఇది అల్లాటప్పాది కాదు! దీనికేదో పెద్ద పటాటోపమే వుంది.’’ గూండాలకి చెబుతున్నట్లుగా చెప్పింది శకుంతల. అంతలో సెల్ మోగింది. రాణి సెల్ అది. ఆన్ చెయ్యకుండా సెల్‌ని చూస్తోందామె. అందుకుంది. శకుంతల ఆన్ చేసి...‘‘హలో’’ అంది.‘‘నేను రాణి’’ పరిచయమైన గొంతు వినిపించింది.‘‘శకుంతల మిమ్మల్ని ఫాలో అవుతోందట! జాగ్రత్త’’‘‘ఎవరది? బు...బు...బుచ్చిబాబూ’’ అంది శకుంతల.‘‘అవును!బుచ్చిబాబునే మాట్లాడుతున్నాను’’ అంది అవతల గొంతు.‘‘నీ జిమ్మడిపోనూ!నువ్వురా!నువ్వున్నావా దీనెనకాల!’’ అంది ఫోన్లో అని-‘‘బుచ్చిబాబురా!మన బుచ్చిబాబు! సుందరం పెద్దమ్మ కొడుకు బుచ్చిబాబు లేడూ! ఆడు! ఆడు నడిపిస్తున్నాడిదంతా’’ గూండాలకి చెప్పి-‘‘ఒరే బుచ్చిబాబూ! దోపిడీలు, దొంగతనాలు యాపారం కాదు! దమ్ముంటే సరిగ్గా యాపారంలో దిగాల! లేదంటే లేదు! అంతేగాని ఇదిగిలాగ....’’ అంటూండగానే ఫోన్ కట్ అవడంతో-‘‘పెట్టీసాడు ఫోన్! ఫోన్ పెట్టీశాడు! ఆడితల్లి’’ అని చేతిలోని సెల్‌ని విసిరికొట్టింది.బుచ్చిబాబు పేరు వినపడగానే కొంచెం ధైర్యం చిక్కబట్టుకొంది లక్ష్మి. అవునవును!అతను సుందరం పెద్దమ్మ కొడుకే! సుందరం, అతనూ కలిసి తిరగడం తను చాలా సార్లు చూసింది.‘‘అంతా పెద్దరాకెట్టయిపోయింది.! సరుకమ్మడం! అంతలోనే కొట్టీడం! ఇందులో ఆ సుందరం గాడి హేండు కూడా వుంటాది. అనుమానం లేదు’’ అని-‘‘చూసుకొన్నాను కాబట్టి సరిపోయింది! లేకపోతేనా...’’ఏమైపోయేదో అన్నట్లుగా చేతులు తిప్పి అంతలోనే ఓ నిర్ణయానికి కొచ్చినట్లుగా-‘‘ఓ పన్జేయ్యండ్రా! లక్ష్మితో పాటు దీన్ని... ఈ రాణ్ని కూడా కార్లో కుదెయ్యండి! చెప్తాను’’ అంది శకుంతల.‘‘పద’’ అన్నారు గూండాలు.రాణి నడిచింది.‘‘నువ్వు కూడా!’’ లక్ష్మిని కసిరారు.రాణిని అనుసరించింది లక్ష్మి.ఆగిన అంబాసిడర్ కార్ల దగ్గరగా వస్తున్నారంతా. ఆ కార్లకి ఇటుగా వుంది ఇందాక రాణీ వాళ్లొచ్చిన కారు. ఆ కారు స్టార్టయి వుంది. డ్రైవరు ఎప్పుడొచ్చి సెటిలయ్యాడో కానీ పారిపోవడానికి సిద్ధంగా వుందది. నడుస్తున్నట్టుగానే నడుస్తూ ఒక్కంగలో ఆ కారు దగ్గరకి చేరుకొంది రాణి. డోర్ తెరిచి రాణి అందులో కూర్చోవడమేంటి, డోర్ ముయ్యడవేంటి, కారొక్క గెంతు గెంతి పరుగుదీసింది.‘‘పట్టుకోండి!పట్టుకోండి పింజారిని’’ అరిచింది శకుంతల. పట్టుకొందికి గుండాలు ప్రయత్నించారు. కానీ రాణి దొరకలేదు. పారిపోయింది.పరుగుదీస్తోన్న కారుని పారిపోతున్న రాణినీ చూస్తూ వూరుకోలేక దగ్గరగా వున్న చిన్న చిన్న రాళ్లని తీసి విసిరారు గూండాలు. ఆ రాళ్లేవీ కారుకి తగల్లేదు.‘‘ఏడికిపోద్ది!దొరుకుద్ది!మీరు కారెక్కండమ్మా’’ శకుంతలకి చెప్పేరు గూండాలు.‘‘అది దొరకాలి!దానంతు నేనుచూడాలి’’ గట్టిగా చెప్పింది శకుంతల.‘‘దొరుకుద్ది! ముందు మీరు కారెక్కండి’’.కారెక్కబోతూ అయోమయంగా అంతుచిక్కనట్టుగా, అదో రకంగా పిచ్చి చూపులు చూస్తోన్న లక్ష్మిని-‘‘ఎక్కే! ఎక్కు! కారెక్కు’’అని మెడని చేత్తో నొక్కిపట్టి కార్లోకి మల్లెపూల మూటని విసిరేసినట్లుగా విసిరేసింది శకుంతల. కార్లోకి వచ్చి పడింది లక్ష్మి. అంతే! ఆ కారు, ఆ కారు వెనక మరో కారూ, రెండు కార్లూ బయల్దేరాయి.పారిపోయిన చిలకని తీసుకొచ్చి పంజరంలో మళ్లీ పెట్టినట్లుగా వుంది లక్ష్మి స్థితి. ఆకలి చచ్చిపోయిందామెకు. ఆ స్థానంలో అదేంటో చెప్పలేని ఫీలింగ్. కడుపంతా ఉబ్బరమైపోతోంది. గుండెల్లో ఒకటే దడ. పిడికిలి పట్టిన చేతుల్ని ఇంటూ మార్కులా గుండెల మీదుంచుకొని వంట్లో ఏంటిదంతా అన్నట్లుగా కుమిలిపోతోంది. ఆమె ప్రక్కగా కూర్చుని వుండి, ఎగాదిగా చూస్తోంది శకుంతల.పోగొట్టుకున్న కేష్‌బాక్స్ దొరికినా ‘అసలంత జాగ్రత్తగా వుంటే పోగొట్టుకోవడం యేంటి’ అన్న ఆలోచనలో అలిసిపోతోందామె. అంతేకాదు!!బాక్స్ ఇచ్చినట్లుగా ఇచ్చి, కొట్టేయడానికి ఎంత ప్లాన్జేశారు? అన్నదమ్ములిద్దరూ ఒకటైపోయారు!ఒరేయ్ సుందరం! నిన్ను... నిన్నొదిలిపెట్టన్రా! నీ అంతు చూస్తాను! బుచ్చిబాబూ!! నిన్ను....నిన్ను కూడా వొదిలిపెట్టను! ఆ రాణి అమ్మో!!దాన్ని...దాన్ని కూడా వొదిలి పెట్టకూడదు! ముగ్గుర్నీ వుతికేయాలి! మూకుమ్మడిగా ముగ్గుర్నీ వుతికేసి, రక్తాన్ని పిండేసి, పిప్పిని ఆరేస్తేనేగాని మనసు శాంతించదు. శాంతించదు గాక శాంతించదు.-పిచ్చెక్కిపోతోంది శకుంతలకి.‘‘అది కాదు శకుంతలా! పిట్ట ఎగిరిపోయినట్లు నీకెలా తెలిసింది’’ సిగరెట్ పొగతో పాటు మాట ల్నొదిలాడు ముందు సీటులో కూర్చున్న గుండా. ‘పిట్ట’ అని లక్ష్మిని వుద్దేశించి అన్నాడతను.‘‘ఎలా తెలిసిదంటే ఆ దేవుడున్నాడు! వున్నాడు కాబట్టి తెలిసిందది! నిద్రపోతోన్న నాకు ఎందుకో గప్పున తెలివొచ్చింది. తెలివొచ్చి చూస్తే ఎదర బెర్తు మీద ఈ ముష్టి పాప లేదు! సూట్‌కేస్ కూడ లేదు! అమ్మో! సరుకు చేజారిపోయింది. జారిపోయిందనుకుంటూ ప్లాట్‌ఫారంకేసి చూశాను. చూస్తే ఇంకేముంది? ఈ ముష్టిపాప, ఆ రాణి కన్పించారు’’చెప్పింది శకుంతల.‘ముష్టిపాప’ అంటూ శకుంతల తనని సంబోధించడం లక్ష్మికి బాధ అనిపించింది.‘‘కనిపించిన వెంటనే రైల్లోంచి దిగి, ఆ రాణికి గట్టిగా రెండిచ్చి, ఈ పాపని రైలెక్కించేసుంటే నీకింత హైరానా వుండేది కాదు గదా’’ సలహా ఇచ్చాడా గుండా.‘‘హైరానా వుండేది కాదు గానీ, ముఠా ఎంతమందేటో? ముందెనకలు ఆలోచించకుండా జబ్బ చరిస్తే దెబ్బయిపోమా? అందుకని రైలు దిగినా ఆ రాణికి రెండివ్వకుండా ఆళ్లు కారెక్కిందాకా ఫాలో అయ్యి, అప్పైన్నీకు ఫోన్చేశాను’’‘‘పాత పరిచయం బాగా గుర్తెట్టుకున్నావ్’’ నవ్వాడు గుండా.‘‘నిన్నెలా మరిచిపోతాన్చెప్పు’’ అంది శకుంతల.‘‘సరేగాని! ఇప్పుడు చెప్పు! మన ప్రోగ్రావేంటి?’’‘‘ఈ కార్లతో ఇదిగిలాగే మనమంతా హైదరాబాద్ వెళ్లిపోదాం’’ అంది శకుంతల.‘‘మేమంతా హైదరాబాద్ దేనికి?’’‘‘దేనికనకు!మాటేసి వున్న పులి ఎప్పుడైనా మీద పడుద్దని! ఆ రాణి వోళ్లు మళ్లీ మీద పడొచ్చు! ప్రమాదం లేదనుకోకు. అందుకని నాతో పాటు మీరంతా హైదరాబాద్ రావాల్సిందే’’‘‘తప్పదా’’అడిగాడు గూండా.‘‘తప్పదు’’ అంది శకుంతల.‘‘శానా ఖర్చవుద్ది మరి’’‘‘అవ్వనీ! ఎంతవుద్దో అంతకి రెట్టింపు పిండుతాను దీని కానించి’’ అంటూ శకుంతల కసిదీరా లక్ష్మి బుగ్గ పొడిచింది.‘‘మొన్న మొన్నటి వరకూ సుందరం మాటంటే మాట మీదే వుండేవాడు. అదిగో! ఆ బుచ్చిబాబు కలిశాడు! అప్పట్నించీ మాట తప్పేసి మెలికెట్టేస్తున్నాడు’’ అన్నాడు గూండా.‘‘దొంగనోట్ల యాపారంలో సూడు!దొంగనోట్లు ఇచ్చినట్టే ఇచ్చి పోలీసుల్ని ఆళ్లే పంపినట్లుగా, గుంటపాపల్ని ఇచ్చినట్టే ఇచ్చి మద్దెలో మళ్లీ కొట్టీడం వుందే...సస్స!యాపారానికి పద్దతి లేకుండా పోయిందనుకో’’ గూండానే మళ్లీ అన్నాడు.‘‘సీ!! నీతి లేదు నా కొడుక్కి’’ తిట్టింది శకుంతల.‘‘ఆ సుందరంగాడు పాతిక వేలంటూ ఈ పిల్ల రేటుచెప్పినప్పుడే నాకనుమానం వచ్చింది? ఏటీడు రెచ్చిపోతున్నాడని! రేటు పెంచడాలే కాకుండా మద్దెలో సరుకుని దించీడాలు కూడా చేస్తున్నాడంటే.... ఆడికి పుట్టీసింది! దుర్బుద్ది బాగా పుట్టీసింది’’ అంది శకుంతల.‘‘వినాశకాలే విపరీత బుద్దని!పోతాడు! ఆడే పోతాడు’’ అన్నాడు గూండా.‘‘ఇదో పెద్ద చైన్ శకుంతలా! శానా పెద్ద చైను! సుందరంగాడు, బుచ్చిబాబుగాడు, త్రిబుల్‌గాడు, ఈ రాణి పెద్ద లింకిదంతా! సరుకుని తీసుకొని నువ్వెపడు బయల్దేరుతావ్. ఏ బండెక్కుతావ్? నీ సీటు నెంబరెంత? నిన్ను కనిపెట్టుకొని ఎవరుండాలి! నీక్కాకుండా నీ సరుకుని ఏం చెయ్యాలి? ఎక్కడ దించాలి? మళ్లీ ఎవరికెంతకమ్మాలి? అయయ్యో! ఆలోసిత్తోంటే తట్టుకోలేవనుకో’’ చెప్పాడు మళ్లీ.‘‘ఓర్నాయినో! బాగా ఎదిగీశారైతే’’ అంది శకుంతల.‘‘అడుగుతావ్! ఇదే పెద్ద మాఫియా అయిపోయిందనుకో’’ అన్నాడు గూండా.‘‘అలాగా’’ అంటూ ఆవలింత తీసింది శకుంతల. నిద్దరొస్తోందామెకు. ఊరకుక్కలతో యుద్ధం చేస్చేసి అలిసిపోయిన జాతికుక్కలా తూలుతోందామె. అది చూసి-‘‘పడుకో శకుంతలా!పడుకో!తర్వాత మళ్లీ మాట్లాడుకుందాం’’ అన్నాడు గూండా. ఆమాటలు కూడా వినిపించలేదు శకుంతలకి. ఆమెకి నిద్ర పట్టేసింది.దుమ్ము రేపుకుంటూ కార్లు ప్రయాణిస్తున్నాయి. ఏవేవో వూర్లు, బ్రిడ్జీలు, రైల్వే గేట్లూ దాటుకుంటూ పరుగుదీస్తున్నాయి.బాగా ఎండకాస్తోంది. పొగమంచు కరిగిపోయి రోడ్డు పక్క చెరువు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే భ్రమలన్నీ తొలగిపోయి నిజాలు, పచ్చినిజాలు తెలిసొచ్చాయి లక్ష్మికి.తనని వ్యభిచారంలోకి దించడానికి సుందరం ప్లానేశాడు. ముందు నటన, నాటకాలన్నాడు. తర్వాత ప్రేమలు, పారిపోవడాలు అన్నాడు. ఆ తర్వాత సినిమాలు, హీరోయిన్లూ అన్నాడు.తను ‘సరే’ననగానే శకుంతలకి అమ్మేశాడు. రైల్లో రాణి రాక, పోక కూడా .....అదో రూపం...మరో బేరం....గొల్లుమంది లక్ష్మి.గుండెల్లోనే ఏడ్చింది. గోముఖ వ్యాఘ్రం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకొందామె. మేడిపండు అన్న మాట కూడా తెలుసొచ్చిందామెకు. అనుభవం అయితే కాని తత్త్వం బోధపడదని, దిగితేనే కానీ లోతు తెలీదని... ఎన్నెన్నో... ఏంటేంటో నీతి వాక్యాలు చప్పున గుర్తుచ్చొయామెకు.హాయిగా చదువుకుంటూ, అన్న పెట్టిన అన్నం తింటూ వుంటే ఏ సమస్యా లేకపోను! కానీ ఆ చదువుకోవడం, ఆ అన్నమే పెద్ద సమస్య అనుకుంది తను. జీవితం అంటే ఇది కాదనుకుంది. పారిపోవాలనుకొంది. అనుకొని పరిగెత్తింది. ఎక్కడికి పరిగెత్తింది? ఇంకో సమస్యలోకి!జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యకి ప్రయాణం.... ఎక్కడో చదివిన వాక్యం! నిన్న ఎందుకు గుర్తొచ్చిందోననుకొంది. ఎందుకు గుర్తొచ్చిందో ఇవాళ ఇప్పుడు తెలుసుకుంది లక్ష్మి. మౌనంగా ఏడవసాగింది.---------------------------------‘‘బాబూ!బాబూ! సుందరం బాబూ! లెగండి బాబూ!లెగండి బాబూ’’ నిద్రలో వున్న సుందరాన్ని లేపుతున్నాడు త్రిబుల్. మంచి నిద్రలో వున్నాడేమో లేవట్లేదు సుందరం. ఇలా కాదనుకొని, చేతిలో వున్న సెల్ ఫోన్ వంకోసారి చూసి -‘‘బాబూ! బుచ్చిబాబు కానించి ఫోన్! సుందరం బాబూ! బుచ్చిబాబు నీతో మాట్లాడాల్ట’’ గట్టిగా అరిచాడు. త్రిబుల్ అరుపునకు కాదు గానీ, బుచ్చిబాబు పేరు వినగానే ఒక్కసారిగా మెలకువ తెచ్చుకొని-‘‘ఏమయ్యిందిరా! లక్ష్మి యలమంచిలిలో దిగిందా? లేదా?’’ అడిగాడు సుందరం.‘‘దిగిందట కాని మళ్లీ లాక్కుపోనారట’’ అన్నాడు త్రిబుల్.‘‘ఎవరు? ఎవరు లాక్కుపోయారు’’ కంగారుపడ్డాడు.‘‘ఇంకెవరు! మీ శకుంతలక్కే! ఆయమ్మే, లాక్కుపోయిందట! ఆ యమ్మేం తక్కువ తిందేటి? సరైన పోసాకారం, పవరూ చేతిలో వుండాలే గాని, వుంటేనే? బూగోలాన్ని బంతివువ్వు లెక్క తల్లో ఎట్టీసుకోదూ’’ శకుంతలంటే ఏంటో తను చదివింది చెప్పాడు త్రిబుల్.‘‘బుచ్చిబాబుతో మాట్లాడండి’’ అని ఫోనందిం చాడు.‘‘హలో’’ మాట్లాడాడు సుందరం.జరిగిందంతా చెప్పాడు బుచ్చిబాబు.‘‘లోకల్ గూండాల్ని వెంటేసుకొచ్చిందా’’ ఆశ్చర్యపోయాడు సుందరం.‘‘ఇచ్ఛాపురం నుంచి హైదరాబాద్ దాకా శకుంతలకి ఎక్కడ పడితే అక్కడ బ్రాంచీలున్నాయి. దాంతో చాలా కష్టం!అదృష్టం బాగుండి రాణీ వాళ్లు తప్పించుకొచ్చారుగాని లేకపోతేనా- రాణిని కూడా పట్టుకుపోయేదే’’చెప్పాడు బుచ్చిబాబు.‘‘ఛ’’ దెబ్బైపోయామన్నట్లుగా ధ్వనిం చాడు సుందరం.‘‘అద్సరేగాని! లక్ష్మి ఫోటో చూపించి పిల్లని డంప్ చేస్తామని ఇక్కడ చెప్పాం! చెప్పడమే కాదు అడ్వాన్స్‌గా పదివేలు నొక్కేశాం కూడా! ఇప్పుడు లక్ష్మి లేదు! ఎలా మరి?’’ అడిగాడు బుచ్చిబాబు.‘‘రాణిని అప్పజెప్పు’’‘‘దాన్నెత్తిన లచ్చెట్టిచ్చినా ఆళ్లకక్కర్లేదు! దాన్నెవరు తీసుకుంటారు గాని!చెప్పు ఏం చెయ్యాలిప్పుడు’’‘‘ఆళ్ల అడ్వాన్స్ ఆళ్లకిచ్చేసి దండవెట్టు’’‘‘అడ్వాన్స్ ఆళ్లు తీసుకోకపోతే’’‘‘సీర కట్టుకొని నువ్వు ఆళ్లకమ్ముడిపో’’ అని సెల్ ఆఫ్ చేసి-‘‘ఎదవని ఎదవ! ఏదీ సేతకాదు’’ అని చిరాగ్గా అందుకోడానికి సిద్ధంగా వున్న త్రిబుల్ గాడికి సెల్ అందించి-‘‘ఇదేట్రా! కతేటి ఇలా టర్నయ్యింది’’అడిగాడు సుందరం.‘‘అన్ని రోజులూ మనవి కావు బాబూ! ఒక్కొక్కసారి కొన్ని రోజులు ఎగస్పార్టీ వోళ్లకి దత్తు ఎళిపోతాయి’’.‘‘నోర్ముయ్’’ త్రిబుల్ కాలు తొక్కాడు సుందరం.‘‘బాబోయ్’’ గగ్గోలెత్తాడు త్రిబుల్.‘‘ఏమయిందిరా’’‘‘కుక్క కరిసిన కాలు తొక్కారు బాబూ’’ ఏడ్చాడు త్రిబుల్.‘‘ఇప్పుడేం చెయ్యాలి! దారేది’’ ఆలోచనలో పడ్డాడు సుందరం.‘‘అయన్నీ తర్వాత! ముందే వూరైనా పారిపోదాం! పదండి’’ అన్నాడు త్రిబుల్.ఎందుకన్నట్టు చూసిన సుందరంతో-‘‘తన లచ్మిని తనకి కాకుండా శకుంతల సేతికిచ్చారని మీమీద ప్రసాద్ బాబుకు పీకల్దాకా కోపం వుంది. ఆ బాబు ఎప్పుడు దాడి చేస్తాడో తెలీదు. దాడి చేశాడా? దుమ్ములిరిగిపోతాయి. అందులో అనుమానం లేదు! అదలా వుంచితే ఇప్పుడు శకుంతలమ్మతో సీక్వెన్సెట్టుకున్నారు! ఆయమ్మ వూరుకుంటదా?! సికెన్!సికెన్ లెక్క మనిద్దర్ని కొరుక్కుతినేస్తాది! దీంట్లో అనుమానం నేదు. దీన్నీ పక్కనుంచుదాం! సెల్లెలు సెడిపోయిందని తెలిస్తే కృష్ణారావు వూరుకుంటాడా? వూరుకోడు గాక వూరుకోడు! వూరమిరపకాయల్లా ఇద్దర్నీ నంజీసుకుంటాడు.’’‘‘ఆడెవడెహె! ఆ కృష్ణారావు ఎవడు?’’‘‘ఎవడా? మన లచ్మిపాప ఆళ్ల అన్నయ్య! ఆ బాబు తలుసుకుంటే సొంత సెల్లెల్నే కాదు నిన్ను, నన్నూ కూడా ఇరిసి పొయ్యిలో ఎట్టేస్తాడు’’.‘‘అవును కదా’’ భయపడ్డాడు సుందరం.‘‘పాపం ఒక్కగానొక్క సెల్లెలు! తల్లినేదు!తల్లిని ఆ సెల్లెల్లో సూసుకుంటున్నాడతగాడు! వొద్దు వొద్దంటున్నా నువ్వినకుండా ఆయమ్మాయిని లైన్లో యెట్టావు! ఇప్పుడు సూడు’’ ప్రమాదంలో పడ్డామన్నట్లుగా తల పట్టుకొన్నాడు త్రిబుల్.‘‘అటు ప్రసాద్! ఇటు శకుంతల! ఇంకా ఇటు లక్ష్మి వాళ్లన్నయ్య కృష్ణారావు! ముగ్గురు మధ్యా ఇరుక్కుపోయాంరా’’ ‘నువ్వు చెప్పిందే కరెక్ట్’ అన్నట్లుగా త్రిబుల్‌ని చూశాడు సుందరం.‘‘మరందుకే ఈ వూళ్లో జెండా పీకేద్దాం! లగెత్తండి’’ అన్నాడు త్రిబుల్. అందుకు సమాధానంగా-‘‘రెడీ’’ అన్నాడు సుందరం.-------------------------‘‘ఇదెప్పుడో ఇలా కొంప ముంచుతుందని నేను అనుకుంటూనే వున్నాను! రాత్రే నువ్వు చెప్పాల్సింది! ఎందుకు చెప్పలేదు’’ ఆవేశపడ్డాడు కృష్ణారావు.‘‘ఏంటో ఆ ఆలోచనే నాకు రాలేదు! ఎంతసేపూ లక్ష్మిని నేనొక్కణ్నే కాపాడగలననుకున్నాను’’ బాధపడ్డాడు ప్రసాద్.రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లుగా కృష్ణారావుకి ప్రసాద్ చెప్పడంతో సుందరాన్ని బతకనివ్వనని బయల్దేరాడు కృష్ణారావు. తోడుగా వుంటానంటూ అతణ్ని అనుసరించాడు ప్రసాద్.‘‘ఆ పోలీసు రామ్మూర్తిక్కూడా ఇందులో వాటా వుందండి’’ ఆ సంగతి కూడా దాచలేదు ప్రసాద్.‘‘వాణ్ణీ ఓ చూపుచూద్దామయితే’’ అన్నాడు కృష్ణారావు.కృష్ణారావుకి ఈ ప్రపంచంలో రెండే రెండు తెలుసు. ఒకటి! లక్ష్మికి అన్నీ తానే అయి వుండడం. రెండు! తన ఇష్టానికి, కష్టానికీ ఎవడడ్డొచ్చినా వాణ్ని అడ్డు తొలగించడం.లక్ష్మి అందంగా-సన్నగా వుంటుంది కదా! కృష్ణారావు కూడా అలాగే వుంటాడనుకునేరు!! లేదుగాక లేదు! కృష్ణారావు బారుగా అంతెత్తు మనిషి! పెద్ద పెద్ద పాదాలు, పెద్ద పెద్ద చేతులు, విశాలంగా వక్షస్థలం, అంతలేసి కళ్లు, ఇంతలేసి వేళ్లు.... ‘అమ్మో’అనిపిస్తాడు చూడ్డానికి.‘ఆడు అదో టైపు గురూ! టీవిలో డబ్ల్యూ డబ్ల్యూలో వస్తాడ్చూడు! అండర్ టేకర్, ఆస్టిన్ అని! ఆళ్లిద్దర్ని మిక్స్ చేస్తే ఎలా వుంటాడో కిష్నారావు అలా వుంటాడు! ఆడు కొట్టాడంటే అంతే సంగతులు!‘అమ్మ’ అన్న అరుపు కూడా నోట్లోంచి రాదు.అలాంటి కృష్ణారావు, ప్రసాద్‌తో కలిసి సుందరం కోసం నడుస్తున్నాడు. ఒకరిద్దరు ‘నమస్తే సార్’ అని కృష్ణారావుని పలకరించినా పట్టించుకోలేదతను. వీరాంజనేయ స్వామి ఆలయం దగ్గరగా ఇద్దరు వచ్చారు.నమస్కరిస్తున్నట్లుగా ఓ క్షణం కళ్లు మూసి పక్కకి తిరిగారు. ఆ పక్కనే డాబా ఇంట్లోనే సుందరం వుంటున్నది.‘‘సుందరం’’ అంటూ పరుగున అక్కడికి వచ్చారిద్దరూ. చూస్తే ఇంటికి తాళం వేసుంది.‘‘ఒరేయ్’’అంటూ తాళం వేసిన తలుపుల్ని బలంగా కాలితో తన్నాడు.‘‘ఇంట్లో లేడంటే ఇప్పుడెక్కడుంటాడు’’ అడిగాడు కృష్ణారావు.‘‘కాలేజీలో వుంటాడు’’ చెప్పాడు ప్రసాద్.‘‘పద’’ బయల్దేరారిద్దరూ. కాలేజీలో కూడా సుందరం దొరకలేదు. కాలేజీకి రాలేదతను.‘‘ఇంకెక్కడ దొరుకుతాడు’’‘‘రాత్రి కాలేజీ తోటలో గ్యారంటీగా దొరుకుతాడు’’చెప్పాడుప్రసాద్.‘‘అయిపోయాడు! ఈ రాత్రితో సుందరం చాప్టర్ క్లోజ్’’కసిగా అన్నాడు కృష్ణారావు.-------------------------------------రాత్రయింది. టైమెంతయిందో తెలీదుగానీ, రోడ్ల మీద జనసంచారమే లేదు. అప్పుడొకటి, అప్పుడొకటీ వాహనాలు మాత్రం స్పీడుగా వెళ్తూ కన్పిస్తున్నాయి. కారులో వున్నా బాగా చలిగా వుంది లక్ష్మికి. ముడుచుకొని కూర్చుందామె. శకుంతల నోరిప్పుకుని నిద్రపోతోంది. ముందు సీట్లో కూర్చున్న గూండా గురకపెట్టి మరీ నిద్రపోతున్నాడు. గూండా నిద్ర ఇంకో గూండాలాంటి వ్యక్తి డ్రైవర్‌కి ఇబ్బంది కలిగిస్తున్నదేమో!‘భయ్యా! భయ్యా’’ అంటూ గురకపెడుతోన్న గూండాని లేపే ప్రయత్నం చేశాడతను. ఫలితం లేకపోయింది. ట్రాన్స్‌పోర్ట్ లారీ ఏదో కారుకి అతి సమీపంగా వచ్చి పక్క నుంచి ‘జక్’ అన్న సౌండ్‌తో స్పీడుగా వెళ్లిపోయింది. కనిపించిన క్షణంలోనే మాయమయిపోయింది. అలాగే ఏదో వొల్వో బస్ కూడా వెళ్లింది.రాత్రి ఏడున్నర, ఎనిమిది గంటలప్పుడు, ఆ వూరి పేరు తెలీదు. రోడ్డువార డాబాలో లక్ష్మి, శకుంతల, మిగిలిన గూండాల్లాంటి వ్యక్తులంతా బాగా మందు కొట్టి చపాతీలు తిన్నారు. ‘చికెన్ చికెన్’ అంటూ కర్రీ ప్లేట్ల మీద విరుచుకుపడ్డారు. అప్పుడు లక్ష్మికి ఆకలేస్తోన్నా ఆకల్లేదంటూ ఏమీ తిననంది. తినకపోతే వొప్పుకోనంటూ శకుంతల కోపగించుకుంది. కోపగించుకోవడమే కాదు తిట్టింది కూడా. దాంతో తినక తప్పింది కాదు లక్ష్మికి. ఒకటో అరో చపాతిని తిని, కడుపు నిండా నీళ్లు తాగింది. ఆ నీళ్లే బలం. నిద్ర లేదు. నీరసం లేదు. కానీ బాధగా వుంది...భయంగా వుంది.ఏమయిందో ఏమో ఒక్కసారిగా స్టీరియో ఆన్ చేశాడు డ్రైవర్. పెద్ద సౌండ్ పెట్టి పాటలు వింటున్నాడు. తల దగ్గరగా స్పీకరుండడంతో లక్ష్మికి తలనొప్పిగా వుంది. అయినా భరిస్తోంది. అంత సౌండ్‌లో కూడా శకుంతల, గురక గూండా మేల్కోలేదు. నిద్రపోతూనే వున్నారు. ఒకటి రెండుసార్లు ఎందుకో డ్రైవర్ వెనక్కి తిరిగి లక్ష్మిని చూశాడు. అతను చూసినప్పుడల్లా నిద్రపోతున్నట్లుగా కళ్లు మూసుకుంది లక్ష్మి.కొండమీదేదో దేవాలయం, అక్కడి లైట్ వెలుగులో కన్పించింది. పదమూడో నెంబర్ మైలురాయి. అది కూడా కారు హెడ్‌లైట్స్ కాంతిలో కనిపించింది. పెద్ద పెద్దచెట్లు, మలుపు తిరుగుతోంటే పెద్ద లోయ, అదిగదిదో ఏదో నది, అది కూడా కనిపిస్తోంది. అన్నీ చూస్తోంది లక్ష్మి. అంతే!ఽధడ్! ధడేళ్!!రాత్రి పన్నెండు దాటింది. కాలేజీ తోటలో ఓ చెట్టు దగ్గరగా కూర్చుని సుందరం కోసం కాపేసిన కృష్ణారావు, ప్రసాద్‌లిద్దరికీ నిద్రొస్తోంది. ఆవలింతలు తీస్తూ కృష్ణారావు నిద్రని ఆపుకోగలుగుతున్నాడు కాని, ప్రసాద్ ఆపుకోలేక కళ్లు మూసుకొని తూలుతున్నాడు. చెట్టుమీద నుంచి చలి కురుస్తున్నట్టుగా వుంది. అప్రయత్నంగా తలమీదికి చేతిని పోనిచ్చిన కృష్ణారావుకి, తల చల్లగా తగిలింది.రోడ్డుకి దూరంగా కాలేజీ కట్టారు. కాలేజీకి వెనగ్గా తోట వుంది. అక్కడా తోటలో ఇప్పుడే జరిగినా ఎవరికీ తెలీదు. గుండెల్లో ఇంతలావు, అంతపొడవు కత్తి దిగితే ఆ బాధకి ‘అమ్మా’ అని అరిస్తే, ఆ అరుపు రోడ్డు దాటి, అటు జనానికి వినిపించడమన్నది అసాధ్యం. అంతరాత్రివేళ కూడా వినిపించే అవకాశం లేదు.ఇదంతా ఆలోచించే కత్తి పట్టుకుని కూర్చున్నాడు కృష్ణారావు. సుందరం కనిపించాలి. అంతే! పొడిచి చంపేస్తాడు తను.నా చెల్లిని మోసం చేస్తాడా? నా బంగారు తల్లిని అమ్మేస్తాడా? రానీ! రానీ యెదవని!కత్తితో ఒకే ఒక్కపోటు! కిమ్మనకూడదు. ఆ త్రిబుల్‌గాణ్ని కూడా వొదిలిపెట్టను! వాడికసలే ఓ కాలు కుంటి! వున్న కాలిని కూడా తీసేస్తాను.- కృష్ణారావు రగిలిపోతున్నాడు.‘‘ఇక్కడే గురూ! ఇక్కడే! ఈ తోటలోనే ఎక్కడో దగ్గర ఆళ్లిద్దరూ వున్నారు! పారిపోలేదు! పక్కా! ఏసేయ్ గురూ! ఇద్దర్నీ ఏసేయ్’’ కోపంగా కసిగా, కాలి బొటనవేళ్ల మీద లేచి నిలబడుతూ చెప్పాడు కాకా హోటల్ సర్వర్.‘‘నానెవర్నో తెల్సా? బొగ్గులీది సాయిబాబా మడిసిని అని సెప్పినా ఇనిపించుకోలేదు గురూ! ఇనిపించుకోలేదు సరికదా...నువ్వు ఎవడి మడిసివైతే నాకేట్రా...అంటూ లాగి లెంపకాయ కొట్టాడు గురూ! నొప్పి! బుగ్గనొప్పి ఇప్పటికింకా పోలేదు’’బుగ్గని తడుముకుంటూ చెప్పాడు సర్వర్.‘‘సాయిబాబా మడిసట!సాయిబాబా మడిసి! ఆణ్ని, నిన్నూ ఇద్దర్ని ఇరిసేస్తాను! ఏటనుకుంటున్నావేమో అన్నాడు గురూ’’ బాధ పడ్డాడు సర్వర్.‘‘పేమిస్తే పేనం ఇస్తాట్ట! లేదంటే పేనం తీస్తాట్ట!!తర్వాత అదేటో అదేటో ఇంగిలిపీసేటో అని సివరాకర్న పెసాద్ అన్నాడు గురూ! ఆడి పేరు పెసాదట’’సర్వర్ మాటలు మరి వినిపించుకోలేదు సాయిబాబా. సర్వర్ చెప్పిన ఒక్కొక్కమాట తన వునికిని, తనని ప్రశ్నించడంతో తట్టుకోలేక‘‘ ఒరేయ్’’ అంటూ గట్టిగా కేకేశాడు. ఆ కేకలో ‘‘రారా ప్రసాద్!రా’’అన్న కసితో కూడిన పిలుపు వుంది. తొడగొట్టిన సౌండ్ కూడా వుంది.నిన్న రాత్రి పాకా విలాస్‌లో ప్రసాద్ తనకు చేసిన అవమానాన్ని తలుచుకొని తలుచుకొని కుమిలిపోయి, ‘ప్రసాదెవరు’ వాడేం చేస్తున్నాడు. అంతా కూపీ లాగాడు. పాకా విలాస్ సర్వర్. కృష్ణారావుతో ప్రసాద్ కాలేజీ తోటలో వున్నాడన్నది కూడా తెలుసుకున్నాడు. తెలుసుకుని సంగతంతా సాయిబాబాకి చెప్పి, వెంటపెట్టుకొచ్చాడు.ప్రసాద్‌ని సాయిబాబా కొట్టాలి!రక్తం కారేటట్టు కొట్టాలి!‘అమ్మో! బాబో’అనేలా కొట్టాలి! తను చూడాలి! చూడాలంతే!- సర్వర్ ఉడుకెత్తిపోతున్నాడు.సాయిబాబా ‘ఒరేయ్’ అన్న కేకకి ఒక్కసారిగా కళ్లు తెరిచి, తలవిదిల్చాడు ప్రసాద్. కత్తిని గట్టిగా పట్టుకొని లేచి నిల్చున్నాడు కృష్ణారావు.‘‘అది... ఆ గొంతు సుందరం గాడిదేనా?’’ అడిగాడు కృష్ణారావు.‘‘వాడికంత దమ్మెక్కడిది’’ ఆశ్చర్యపోయాడు ప్రసాద్.‘‘మరెవరై వుంటారు?’’‘‘అదే ఆలోచిస్తున్నాను’’ అంటూ తనూ లేచి నిల్చున్నాడు ప్రసాద్.యాభై అడుగుల దూరంలో టార్చిలైటు వెలుగులో ఎవరో ఇద్దరు ఎవరి కోసమో వెదుకుతున్నారు. వాళ్లిద్దరూ సుందరం, త్రిబుల్‌గాడయ్యుంటారా?కారా?- ఆలోచిస్తున్నాడు కృష్ణారావు.‘‘ ఒరేయ్ ప్రెస్సిగా!దమ్ముంటే రారా!రా!బైటికిరా’’ సర్వర్ రెచ్చిపోతున్నాడు. చేతిలోని టార్చ్‌లైట్‌ని ఆమూలా, ఈ మూలా వేస్తూ వెదుకుతున్నాడు.‘‘వాళ్లొచ్చింది నీకోసమే’’ప్రసాద్‌తో అన్నాడు కృష్ణారావు.‘‘కాని... ఆ గొంతు సుందరంది కాదు! త్రిబుల్‌గాడిది కూడా కాదు’’ చెప్పాడు ప్రసాద్.ఎవరో ఇద్దరు ఇటుగా వస్తున్నారు! వాళ్లిద్దరు ఎవరన్నది ఉత్కంఠగా వుంది కృష్ణారావుకి. చేతిలో టార్చితో పాటు, వాళ్ల చేతుల్లో కర్రలు కూడా వున్నాయి. టార్చిలైటు వెలుగులో కన్పించాయవి.కర్ర? కత్తి? కత్తే గొప్పది! భయంలేదనుకున్నాడు కృష్ణారావు. వాళ్లెవరన్నదీ తర్వాత... ముందు వాళ్లని అడ్డుకోవాలి!లేకపోతే లేనిపోని భయాలనుకొని-‘‘రండ్రా!రండి!’’అంటూ ప్రసాద్‌తో పాటుగా చాటు నుంచి తప్పుకుని బైటికొచ్చాడు కృష్ణారావు. కృష్ణారావు రావడం యేంటి? ముఖం మీద టార్చి వెలుగుపడ్డం యేంటి?‘‘గురూ!నువ్వా’’గగ్గోలుగా అరిచాడు సాయిబాబా.‘‘నేను గురూ! నీ సాయిబాబాని’’అని మళ్లీ అన్నాడు .ఆ మాటకి‘‘నువ్వా’’అంటూ తేల్చేసి -‘‘మా ప్రసాద్ నిన్నేం చేశాడు? వాడెందుకు నీకు?’’అడిగాడుకృష్ణారావు. అప్పుడు టార్చి వెలుగు ప్రసాద్ మీద పడింది.‘‘ ఈడే గురూ! ఈడే నన్ను లాగి లెంపకాయ కొట్టింది! నిన్నెవరంటూ నిగ్గదీసింది కూడా ఈడే’’ ఓ ప్రక్క సాయిబాబాకి చెబుతూనే మరో ప్రక్క ప్రసాద్ మీదకి ఎగబడుతోన్న సర్వర్ని బలంగా పట్టి ఆపి-‘‘సాయిబాబా మనిషినని నువ్వు బెదిరిస్తే- మరీయన నా మనిషి! కృష్ణారావు మనిషి! కృష్ణారావు ఎవరనుకున్నావ్? నీ గురువు సాయిబాబాకి గురువు!నీకు గుగ్గురువు! గుగ్గురువు మనిషికామాత్రం పౌరుషం రాదా’’అడిగాడు కృష్ణారావు.‘‘ప్రసాద్ మనవాడు సాయిబాబా! ప్రసాద్ నేం చె య్యొద్దు’’చెప్పాడు కృష్ణారావు.‘‘అది కాదు గురూ’’ అని సాయిబాబాకి ఏదో చెప్పబోతున్న సర్వర్ని-‘‘నువ్వాగెహె’’అని -‘‘నువ్వేంటి గురూ!నువ్విక్కడెందుకున్నావ్’’కృష్ణారావుని అడిగాడు సాయిబాబా.‘‘అదంతా పెద్ద కత గాని! ముందీ సంగతి చెప్పు! సుందరం గాని, ఆ త్రిబుల్‌గాడు గాని నీకు కనిపించారా’’అడిగాడు కృష్ణారావు.‘‘కన్పించారు! పొద్దున్నే రైల్వేస్టేషన్లో కనిపించారు! ఇద్దరూ రైలెక్కి ఎటో వెళ్లిపోయారు’’ చెప్పాడు సాయిబాబా.‘‘ఛత్’’అవకాశం చేజారిపోయిందన్నట్లుగా బాధపడ్డాడు కృష్ణారావు.‘‘అయితే ఇద్దరూ వూరొదిలి పారిపోయారన్నమాట’’ అడిగాడు. అందుకు సమాధానంగా ‘‘అవును గురూ’’అని‘‘ఆళ్లు మనకేం చేశారు గురూ’’అడిగాడు సాయిబాబా.‘‘చాలా అన్యాయం చేశారు! వాళ్ల కోసమే మేమిక్కడ కాపేసింది’’అని,‘‘ఈ చలిలో ఇంకెందుకిక్కడ! పదండి! వెళ్తూ మాట్లాడుకుందాం’’అంటూ సాయిబాబా భుజమ్మీద చెయ్యివేసి ముందుకి నడిచాడు కృష్ణారావు. వాళ్లని అనుసరించాడు పాకావిలాస్ సర్వర్, ప్రసాద్. టార్చివెలుగులో దారి చూపిస్తూ-ఇదేటిది గప్పున మండి! గుప్పున ఆరిపోనాది...కయ్యం మాటలేదు! అంతా వియ్యం అయిపోనాది! సస్స! దెబ్బకి దెబ్బ తీసే అవకాశం పోనాది! పెసాద్‌ని కొట్టే ఈల్లేదింక! లేదంతే!గుండెల్లో బాధపడ్డాడు సర్వర్.త్రిబుల్‌గాడు, సుందరంగాడు వూరొదిలి పారిపోయారా? ఎక్కడికెళ్లి వుంటారు? వెళ్తే గిల్తే హైదరాబాదే వెళ్లుంటారు! మనమూ హైదరాబాద్ వెళ్లాలయితే!- ఆలోచిస్తూ నడవసాగాడు ప్రసాద్.--------------------------------యాక్సిడెంటై అరగంటయింది.శకుంతల, లక్ష్మి ప్రయాణిస్తోన్న కారుతో పాటు, వెనకవస్తోన్న కారు కూడా లోయలో పడిపోయాయింది.తాగిన మత్తులో వుండి డ్రైవ్ చెయ్యడంతో వెనక వస్తోన్న కారు ముందొస్తున్న కారుని చూసుకోలేదు. ఢీ కొంది. దాంతో ‘ధడ్! ధడేల్’అని రెండు కార్లూ ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదంలో శకుంతల, గుండాలు ఏమయ్యారో లక్ష్మికి తెలీదు. తను మాత్రం బ్రతికి వున్నానని తెలుసుకుందామె. గుబురుమొక్కలు అడ్డుకోవడంతో లోయలో పడిపోకుండా అదృష్టవశాత్తు బతికి బట్టకట్టింది లక్ష్మి. రోడ్డుకి సమీపంగానే గుబుర్లలో వుందామె. రోడ్డు మీద వచ్చిపోయే వాహనాల హెడ్‌లైట్స్ కాంతిలో ఆ విషయాన్ని గమనించి, కాలు, చెయ్యీ కూడదీసుకుని, ‘దేవుడా! దేవుడా’ అనుకుంటూ ఎగబాకుతూ ఎలాగైతేనేం రోడ్డు మీదకి చేరుకుంది లక్ష్మి. గుండెల్నిండా ఊపిరి తీసుకుంది. లేచి నిల్చునే ప్రయత్నం చేసింది. కాళ్లు సహకరించడం లేదు. వజవజా వణికిపోతున్నాయవి. ఎగబాకడంతో, వాటిని వీటిని దన్ను చేసుకొని పైకి ఎక్కడంతో కాళ్లని బిగలాగడంతో నరాలు, నాడులూ జవజవలాడుతూ కూడుకోవడం లేదు. దాంతో రోడ్డు వారగా ఎలా వున్నది అలా వుండిపోయింది. కాస్సేపటికి....కాళ్లకి బలం వచ్చింది. చెప్పినట్లు వినసాగాయవి. ఇప్పుడు కాళ్లు ముడుచుకొంటున్నాయి. సాచుకొంటున్నాయి. మెల్లిగా లేచి నిల్చుంది లక్ష్మి. కళ్లు విప్పార్చుకొని కిందకి చూసింది. ఎవరూ ఏమీ కనిపించడంలేదు. ఎత్తు నుంచి నీరు కిందకి పడుతోన్న శబ్దమయితే వినిపిస్తోంది. ఒక్కసారిగా ఏడుపొచ్చింది లక్ష్మికి. పెద్ద పెట్టున ఏడవసాగింది. ఆ క్షణంలో ఏడుపెందుకో, ఎవరికోసమో అర్థం లేదు కానీ ఏడుస్తోంది లక్ష్మి.కార్లు రెండూ నుగ్గునుగ్గయిపోయి వుంటాయి. నలుగురైదుగురు గూండాలు చనిపోయి వుంటారు. శకుంతల?! పాపం శకుంతల ఏమైంది?! చనిపోయిందా?! గగ్గోలుగా వుంది లక్ష్మికి. ఇంతింత జబ్బలతో, అంతంత కళ్లతో నిండుగా వున్న శకుంతల.... చెవులకి జూకాలు, మేటీలు, చేతులకి డజను డజను బంగారు గాజులు, మెళ్లో నల్లపూసలు, గంటల్లా పుస్తెలు, రవ్వల నెక్లెసు, నోట్లో ఇటు పన్నుమీద పన్ను కాక అటు బంగారపు పన్ను కూడా వున్న శకుంతల... లోకల్ వస్తాదులాంటి శకుంతల... ఎక్కే! ఎక్కు! కారెక్కంటూ మల్లెపూల మూటలా తనని కార్లోకి విసిరేసిన శకుంతల... శకుంతలేమయ్యింది?కొన్ని కొన్ని సమయాల్లో శత్రువులు మీద కూడా జాలి కలుగుతుంది. అలా శకుంతల మీద జాలిపడసాగింది లక్ష్మి. జాలి పడుతూ ఏడుస్తోంది. ఆ ఏడుపు వినిపించింది శకుంతలకి. ఆ ఏడుపుతో స్పృహలోకి వచ్చింది శకుంతల. స్పృహలోకి వచ్చిన శకుంతల కళ్లు తెరిచి చూసింది. కొమ్మల్లాంటి చెట్ల వ్రేళ్లలో ఇరుక్కుని వుంది తను. లేవలేకపోతోంది. ఎవరైనా వచ్చి లేవనెత్తాలి. ఎవరొస్తారు? ఆ.... ఆ ఏడుపెవరిది! లక్ష్మిది కాదు కదా? లక్ష్మిదయితే బాగుణ్ను! తను బ్రతికుంటే బాగుణ్ననుకొంటూ-‘‘లక్ష్మీ!లక్ష్మీ’’ పిలిచింది శకుంతల. ఆ పిలుపు వినిపించడంతో ఏడుపాపేసి, పిలుపు వినవచ్చిన వైపు చూసింది లక్ష్మీ.కళ్లు చిట్లించుకుని చూసింది. చెట్టు వ్రేళ్లలో ఇరుక్కుని కనిపించింది శకుంతల. వ్రేళ్ల మధ్య నుంచి లేవనెత్తితే శకుంతలకి ఏం కాదు. తొలగించాలా? వొద్దా? లేవనెత్తాలా? వొద్దా? సంశయంలో పడింది లకి్క్ష. చేయందిస్తే చాలు! ప్రాణం లేచివచ్చినట్టే! ఆ చేయి కోసం, లక్ష్మి చేతి కోసం చూస్తోంది శకుంతల. ఆలస్యం చేస్తే చెట్టు వ్రేళ్ల పట్టు తపతోంది. జరజరమంటూ జారుతోంది. లోయలోకి శకుంతల పడిపోవడం క్షణాల్లో వుంది.‘‘లక్ష్మీ లక్ష్మీ’’ రక్షించు!రక్షించు అన్నట్టుగా గోలపెడుతోంది శకుంతల.ఇంతకంటే మంచి అవకాశం దొరకదు! శకుంతల బారి నుంచి తప్పించుకోవాలంటే ఇదే సరయిన అవకాశం. దాని మానాన్న దాన్నొదిలేసి పారిపోవడం బెటరనుకుంటూ పారిపోనా? వొద్దా? ఆలోచిస్తోంది లక్ష్మి.‘‘లక్ష్మీ!లక్ష్మీ’’అని పిలిచినంత మాత్రాన లక్ష్మి తనని రక్షిస్తుందా? ఎందుకు రక్షిస్తుంది? అసలెందుకు రక్షించాలి? పడిపోతోన్న పులినెవరైనా పట్టుకొంటారా? నిప్పుల్లోకి నడుస్తోందంటూ పాము నడకని ఎవరైనా తప్పిస్తారా? జరగవవి! ప్రాణాల్ని కాపాడుతున్నామనుకుంటూ ప్రాణాల మీదకి ఎవరూ తెచ్చుకోరు.లక్ష్మి తనని కాపాడదు కాక కాపాడదు! ఇంతే! ఇప్పుడో అప్పుడో తనకు చావు తప్పదు!!-శకుంతల చావుకి సిద్ధపడిపోయింది. అప్పుడు ‘‘అందుకోండి! ఇటు! ఇక్కడ! ఇక్కడ నా చెయ్యందుకోండి’’ చేయందిస్తూ గోల పెట్టింది లక్ష్మి. కలా? నిజమా? ఏదీ తేలకుండానే లక్ష్మి చెయ్యి అందుకుంది శకుంతల.ఒక చేత్తో శకుంతల్ని పట్టి వుంచి, మరో చేత్తో వ్రేళ్లని తొలగిస్తూ హైరానా పడిపడి ఆఖరికి, శకుంతల్ని రక్షించింది లక్ష్మి. తోడుకుని ఆమెను రోడ్డు మీదకి తీసుకుని వచ్చింది. శకుంతలని తోడుకొని రావడంతో బాగా అలిసిపోయింది లక్ష్మి. ఆమెను వొదిలి ఆయాసపడసాగింది. ఊపిరి అందడం లేదు లక్ష్మికి. సుమారుగా అదే పరిస్థితి శకుంతలది కూడా. కాస్సేపటికి ఇద్దరూ సర్దుకున్నారు. ఊపిరంది ప్రాణాల్ని నిలబెట్టుకున్నారు. ఒకర్నొకరు చూసుకున్నారు.శకుంతల్ని చూస్తూ ‘ ఈ పులినా నేను రక్షించింది’ అని లక్ష్మి అనుకొంటున్నది. Challenge 18 episode -31-45లక్ష్మిని చూస్తూ ‘ ఈ లేడి తప్పించుకొని పారిపోతుందేమో! పట్టుకో!!పట్టుకో!’ అనిపించి, పంజా విసిరినట్టుగా చేతిని విసిరి, లక్ష్మిని గట్టిగా పట్టుకొంది శకుంతల. అంతలోనే మళ్లీ రక్షించిన దేవుణ్ని భక్షించడమా? అందుకున్న చేతిని నరక్కూడదు అనిపించి, లక్ష్మిని గట్టిగా పట్టుకొన్న తన చేతిని సడలించి వదిలేసింది శకుంతల. ఆ క్షణం వెలుతురు కిరణం విచ్చుకొంది. తూర్పున సూర్యుడు ఉదయించసాగాడు. ------------------------కొండమీద దేవాలయం, చాలా బాగుంది. ప్రశాంతంగా వుంది ఆ ఆలయ మండపంలో శకుంతల, లక్ష్మీ కూర్చున్నారు. కొలువు దీరిన దేవుణ్ని చూస్తూ కూర్చున్నారు. వచ్చిపోయే భక్తులు మోగిస్తున్న గుడిగంట ధ్వని, దేవుడికి హారతినిస్తూ వాయించే చిరుగంట ధ్వనీ వింటూ సేద దీరుతున్నారిద్దరూ. ఒకే స్తంభానికి అటు ఇటుగా కూర్చున్నారు. ఇద్దరికీ ఏ ఆలోచనలూ లేవు. ఏ అలజడులూ లేవు.ఒకర్నొకరు తరుముకుంటూ ఇద్దరు చిన్నపిల్లలు మండపంలో పడిపోతే పరుగున వెళ్లి వాళ్లని లేవదీసింది శకుంతల. ఏడుస్తోన్న ఇద్దర్నీ లాలించి, బుజ్జగించి ‘ ఆడుకోండి! ఆడుకోండి! జాగ్రత్తగా ఆడుకోండి’ అని పంపించేసింది. మళ్లీ యధాస్థానంలో కూర్చుంది. ఎవరో దక్షిణ కోసం పర్సు తెరిచి చిల్లర కోసం వెతుకుతుండగా వెతుకుతోన్న చిల్లరనాణెం అర్ధరూపాయి కిందపడి, లక్ష్మి దగ్గరగా వస్తే దాన్నందుకుని, తనదంటూ పరుగెత్తికొచ్చిన ఆ వ్యక్తికి నాణాన్ని అందించి సన్నగా నవ్వింది లక్ష్మి.-అంతా గమనిస్తున్నాడు పూజారి.ఆలయం తలుపులు తనింకా తెరవనేలేదు. పళ్లెంలో పళ్లు, పాలు, ఆలయ తాళాలూ వుంచుకొని తనొస్తుండగా వాళ్లిద్దరూ ఎదురయ్యారు. ఇద్దరికీ మోచేతులు, ముఖాలు రక్కుకుపోయున్నాయి. ఎక్కడో పాపం! ఇద్దరూ పడ్డారనుకున్నాడు. వివరాలు అడక్కుండానే ఆలయం దగ్గరి నూతిని చూపించి-‘‘వెళ్లి మొహాలు కడుక్కు రండమ్మా’’ అన్నాడు. తను చెప్పినట్టే విన్నారు వాళ్లు. మొహాలు కడుక్కొని వచ్చారు. తెరతొలగించిన వెంటనే, దైవ దర్శనం ముందు వాళ్లే చేశారు. తీర్థాన్ని కూడా భక్తిగా తీసుకున్నారు. ప్రసాదం పెడితే కళ్లకద్దుకుని తిన్నారు.‘‘ఇలా వచ్చి అలా వెళ్లిపోతే ‘ఏంటది? వెట్టీనా’ అంటాడు దేవుడు! అందుకని కాస్సేపు కూర్చుని వెళ్లండమ్మా’’ అన్నాడతను. కూర్చున్నారు వాళ్లు. కూర్చుని రెండు మూడు గంటలవుతోంది. కదలరే? ఆశ్చర్యపోతున్నాడు పూజారి.మధ్యాహ్నం పదకొండు దాటుతోంది. దేవునికి మహానివేదన వేళయ్యింది. ఇక అప్పుడు ఆలయం మూసేసే వేళ. మళ్లీ సాయంత్రం అయిదారు గంటలకు కాని తెరవరు. ఆ ప్రయత్నాల్లో వున్నాడు పూజారి. ఆలయం తాళాలు తీసుకొని వస్తూ మండపంలో కూర్చున్న లక్ష్మి, శకుంతల్ని చూసి -‘‘ ఏమ్మా! ఇంకాసేపు ఇక్కడ కూర్చుంటారా’ అడిగాడు పూజారి. జవాబు ఏం చెప్పాలో తెలీక ఒకర్నొకరు చూసుకున్నారు లక్ష్మి- శకుంతల.‘‘ ఏమయిందమ్మా! ఎందుకిద్దరూ అంత మౌనంగా వున్నారు! అసలా గాయాలేంటి?’’అడిగాడు పూజారి. సమాధానం ఇద్దరి దగ్గర్నుంచీ లేదు.‘‘ ఏవూరమ్మా మీది’’ మళ్లీ అడిగాడు.‘‘............’’‘‘అసలు మీరెవరు?’’‘‘................’’‘‘ఏంటమ్మా ఇదంతా? మీరెవరో చెప్పరు! మీ వూరేదో చెప్పరు! ఈ గాయాలెందుకయ్యాయో ఇక్కడకి మీరు ఎందుకొచ్చారో ఏదీ చెప్పరు! ఏదీ చెప్పకపోతే ఎలాగమ్మా! ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. ఉలుకూ పలుకూ లేకుండా అడిగిన ప్రతిదానికీ జవాబుగా చూస్తూ కూర్చుంటే మిమ్మల్ని దొంగలనుకునే ప్రమాదం వుంది.! అందుకని మాట్లాడండమ్మా’’ ఆ మాటకి శకుంతల మాట్లాడేందుకన్నట్లుగా సన్నగా దగ్గి తర్వాత-‘‘నేను హైదరాబాద్ వెళ్లాలి! ఇదేవూరో, ఇక్కణ్ణుంచి అక్కడికి రైలుందో లేదో నాకు తెలీదు! తెలిస్తే చెప్పండి!చాలు’’ అంది‘‘మా వూరిని మల్లెలమడుగు అంటారమ్మా! ఇక్కణ్ణుంచి నేరుగా హైదరాబాద్‌కి రైలు లేదు కాని, ఖాజీపేటకో పాసింజర్ రైలుంది. అక్కణ్నుంచి మీరు హైదరాబాద్ చేరుకోవచ్చు’’ చెప్పాడుపూజారి.‘‘రైలు స్టేషన్ ఇక్కడికి దగ్గరేనా’’‘‘దగ్గరే! అదిగో ఇక్కణ్నించి చూస్తే కన్పిస్తోందే! అదే’’ చూపించాడు పూజారి.లేచి నిల్చుంది శకుంతల. లక్ష్మిని చూసింది. ఎందుకు చూసిందో ఏమో! ఆ చూపుకి లక్ష్మి కూడా లేచి నిల్చుంది.‘‘వెళ్తున్నారా’’ అడిగాడు పూజారి.‘‘వెళ్లిపోతామండి! ఏమీ అనుకోకపోతే వీలయితే మాకో చిన్న సాయం చేస్తారా’’ అడిగింది శకుంతల.‘‘చెప్పండమ్మా’’చేతికున్న బంగారు గాజుల్లోంచి ఒక గాజుని తీసి పూజారికిస్తూ-‘‘తీసుకోండి పూజారిగారూ! ఈ గాజుని తీసుకొని మాకో వెయ్యిరూపాయలిప్పించండి’’అడిగింది శకుంతల.నవ్వాడు పూజారి.‘‘రోల్డ్‌గోల్డ్ కాదండి! అచ్చంగా బంగారమే’’ చెప్పింది.‘‘బంగారం అవునో కాదో నాకెందుగ్గాని! వెయ్యి రూపాయలంటే.... వుండండి! చూద్దాం’’అని చేతిలోని తాళాల గుత్తితో అక్కడున్న హుండీ తాళం తీసి, హుండీలో వున్న డబ్బులోంచి పది వంద నోట్లు తీసి, వాటిని శకుంతలకిస్తూ-‘‘తీసుకోండమ్మా! ఫర్వాలేదు! స్వామి వారు గట్టిగానే వున్నారు’’ అని హుండీకి తాళం వేశాడు పూజారి.‘‘మొన్ననే ఉత్సవాలయ్యాయి! స్వామి వారు పాలా తేనే వున్నారు’’ అని నవ్వాడు.‘‘గాజు తీసుకోండి పూజారిగారు’’ ఇవ్వబోయింది శకుంతల.‘‘నాకెందుకమ్మా!’’ అని దేవుణ్ని చూపిస్తూ-‘‘డబ్బు ఆయన్ది! తీసుకున్నది మీరు! ఇచ్చిపుచ్చుకోవడాలు మీ ఇద్దరి మధ్యే జరగాలి గాని మధ్యలో నేనెవర్ని’’ అన్నాడు. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలిప్పుడు? ఆలోచించాలోచించి చేతిలోని గాజుని హుండీలో వేసి‘‘లక్ష్మీ’’ అంది శకుంతల.‘‘రండి’’ అంటూ ముందడుగేసింది లక్ష్మి. ఆమెను అనుసరించింది శకుంతల. ఇద్దరూ మండపంలోంచి ధ్వజస్తంభం దగ్గరకి, అక్కణ్నించి ఇటు వినాయకుణ్ని మరోసారి దర్శించుకొని ప్రధాన ద్వారం లోంచి బైటకి నడవడాన్ని పూజారి చూసి -‘‘తల్లీ కూతుళ్లనుకుంటాను! బాగున్నారిద్దరూ! ఏ కష్టాల్లో ఉన్నారో! గట్టెక్కించు స్వామీ! గట్టెక్కించు’’ అని సిఫార్సు చేస్తున్నట్లుగా దేవుణ్నోసారి చూసి తను ముందడుగేశాడు పూజారి.-----------------------మల్లెలమడుగు రైల్వేస్టేషన్‌కి చేరారు లక్ష్మి, శకుంతల. స్టేషన్లో టిక్కెట్లిచ్చే కౌంటర్ దగ్గర ప్రయాణీకులు ఒక్కరు కూడా లేరు. ఖాళీగా వుందంతా.‘‘ఏమండీ’’ కేకేసింది శకుంతల.‘‘ఎక్కడికమ్మా టిక్కెట్’’ అడిగాడు కౌంటర్లోని వ్యక్తి.‘‘ఖాజీపేటకొకటి ఇవ్వండి’’ శకుంతల అడిగింది. ఇచ్చాడతను.‘‘రైల్లో కన్నా బస్సులో సుఖం తల్లీ! ఈ రైలు ఎప్పుడొస్తుందో ఏమో’’ అడక్కుండానే సలహా కూడా టికెట్టిచ్చిన తర్వాత ఇచ్చాడతను. చూస్తూండగానే ఖాజీపేట అని రాసున్న బస్సు అటుగా రోడ్డెక్కుతూ కనిపించింది.‘‘వైజాగ్ వైపు వెళ్లే రైలేదన్నా వుందాండీ’’‘‘వైజాగ్‌కు లేదుగాని, విజయవాడకి వుందమ్మా! అదీ పాసింజరే. టిక్కెట్టివ్వనామ్మా’’ అడిగాడు.‘‘తర్వాతిద్దురుగాని’’అని, లక్ష్మితోపాటుగా ప్లాట్‌ఫారమ్మీదకొచ్చి, అక్కడ సిమెంట్ బెంచీ మీద కూర్చొని, నిల్చున్న లక్ష్మిని కూర్చోమన్నట్లుగా చెయ్యిపట్టి లాగింది శకుంతల. దాంతో లక్ష్మి కూడా కూర్చుంది.‘‘జరిగిందేదో జరిగిపోయింది! జరిగిందంతా మరిచిపో! ఇదంతా ఓ పీడకల అనుకో! నువ్వు మీ వూరు వెళ్లిపో’’ చెప్పింది శకుంతల.లక్ష్మి దగ్గర్నుంచి జవాబులేదు. చూస్తోందంతే!‘‘అయిపోయిందేదో అయిపోయింది! తప్పు చేశాను! క్షమించు’’ అంది మళ్లీ శకుంతల.‘‘సుందరాన్ని నమ్మకు. సుందరాన్నేకాదు సుందరంలాంటి మగాళ్లని ఎవరినీ నమ్మకు!! వాళ్లంతా నీతో ఆడుకుంటారు కానీ నీకే అవకాశం ఇవ్వరు! అంతా నెంబర్ వన్ దొంగలు’’చూస్తోంది లక్ష్మి.‘‘అన్నయ్య చెప్పింది విను! ప్రసాద్‌ని పెళ్లి చేసుకో! మీ వూరు వెళ్లిపో’’అని తన చేతికున్న బంగారు గాజుల్లోంచి నాలుగు గాజులు తీసి చెరి రెండు చొప్పున లక్ష్మి చేతులకి తొడిగింది శకుంతల. అలాగే తన మెళ్లోని రవ్వల నెక్లెసు లక్ష్మి మెడలో వుంచి-‘‘నీ పెళ్లికి నేను రాలేను! రాకూడదు కూడా! అందుకే నాకు తోచిన కానుకలు నేన్నీకు ముందుగా ఇచ్చేశాను! కాదనకు’’ అంది శకుంతల. ఏమనాలో తోచక ఏమీ మాట్లాడలేకపోతోంది లక్ష్మి.‘‘ఈ ఏడువందలూ నీ దగ్గరుంచుకో! నాకీ రెండొందలూ చాలు’’ అంటూ ఏడువందల నోట్లని లక్ష్మి చేతిలో వుంచింది శకుంతల. అప్రయత్నంగా అందుకొంది లక్ష్మి.పాసింజరొచ్చింది. నీరసంగా వచ్చి నిల్చుంది.‘‘వస్తాను’’ అని రైలెక్కి డోర్ దగ్గరగానే నిల్చుంది శకుంతల.శకుంతల్ని చూస్తూ వున్న చోటనే వుంది లక్ష్మి. సామాన్లేవో అన్‌లోడవుతున్నాయి. ‘చాయ్‌చాయ్’ అని అరుస్తూ చాయ్‌వాలా పరుగుదీస్తున్నాడు. ఎవరో ముసలాయన -‘‘అమ్మా! ఈ బండి ఖాజీపేట పోతుందా’’అడిగాడు లక్ష్మిని.‘‘పోతుంది’’చాలా సేపటికి నోరిప్పింది లక్ష్మి.ముసలాయన వెళ్లి రైలెక్కాడు. అటుగా చూస్తూ ఆలోచిస్తోంది లక్ష్మి.తిరిగి వూరికెళ్తే అన్నయ్య ఇంట్లోకి రానిస్తాడా? చెప్పిన మాట వినడం లేదనే చావగొట్టే అన్నయ్య, చెడిపోయినదాన్ని చేరదీస్తాడా? వొద్దువొద్దంటూ వెంటబడి బ్రతిమలాడిన ప్రసాద్, ఇప్పుడు మళ్లీ కనిపిస్తే ముద్దు ముద్దు అంటూ ముందుకొస్తాడా? ఒకసారి వలలో పడ్డ చేప మళ్లీ పడకుండా పోదంటూ సుందరం లాంటి వాళ్లు తనకోసం ప్రయత్నించకుండా వూరుకుంటారా? వూరుకోరు గాక వూరుకోరు! మరప్పుడు ఆ వూరు దేనికి? చావో రేవో శకుంతల్తో పాటు హైదరాబాద్‌కి వెళ్లి పోవడమే మంచిది.పెళ్లి కాకుండా ఆడది గడపదాటకూడదు. దాటిందంటే మళ్లీ ఆ గడప తొక్కకూడదు!!పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది లక్ష్మి. కూతవేసి పాసింజర్ ఎప్పుడు కదిలిందో కదిలింది.‘‘వుంటాను లక్ష్మి’’ చెమర్చిన కళ్లతో టాటా చెపుతోంది శకుంతల. ఆలస్యం చెయ్యలేదు. పరుగున వెళ్లి రైలెక్కింది లక్ష్మి. పడిపోకుండా ఆమెను గట్టిగా పట్టుకొని -‘‘ ఏంటిది! నువ్వెక్కడికి’’అడిగింది శకుంతల.‘‘మీతో పాటు హైదరాబాద్‌కి’’ అంది లక్ష్మి. ఆశ్చర్యపోతోన్న శకుంతల్ని చూస్తూ సన్నగా నవ్వింది.చావోరేవో శకుంతలతో పాటు హైదరాబాద్ వెళ్లిపోవడమే మంచిది! పెళ్లి కాకుండా ఆడది గడప దాటకూడదు. దాటిందంటే మళ్లీ ఆ గడప తొక్కకూడదనుకొని శకుంతలతో పాటు రైలెక్కిన లక్ష్మి ‘అదిగదిగో హైదరాబాద్’ అన్నంత దగ్గరగా రానే వచ్చింది.ఖాజీపేటలో ప్యాసింజరు దిగి, అక్కడో రెండు గంటలు వెయిట్ చేస్తే ఎక్స్‌ప్రెస్ ఏదో వచ్చింది. దాన్నెక్కారు ఇద్దరు. ఎక్స్‌ప్రెస్‌లో చెరి రెండు మసాలా వడలు తిన్నారు. చిన్నప్పట్నించీ తింటున్న మసాలా గారెని ‘మసాలా వడ’అని పిలవడం లక్ష్మికి ఏదోలా అనిపించింది. ఇద్దరూ చెరో ‘ఛాయ్’ కూడా తాగారు. ‘టీ’ని ‘ఛాయ్’అంటున్నారు ఇటు సైడంతా!చిత్రమనిపించింది లక్ష్మికి.ఛాయ్ తాగిన తర్వాత ఏంటో తలవిచ్చుకున్నట్లనిపించి, హుషారుగా కిటికీలోంచి బైటకి చూసింది లక్ష్మి. చీకటి చీకటిగా వుందంతా. ఆ చీకటి చీకటిలో ఏదో చిన్న స్టేషన్. సింగిల్ మాస్టర్ స్కూల్లా అనిపించింది. ఒంటి దీపంతో వెలుగుతూ కనిపించి వెళ్లిపోయింది. చిన్నచిన్న స్టేషన్లు ఎక్స్‌ప్రెస్ రైళ్లకి ఆనవేమో! రైలు కూడా ఆగలేదు. తర్వాతేదో బ్రిడ్జి తగలడంతో రైలు మెల్లగా నడవనారంభించింది. బ్రిడ్జి కింద వున్నది నిలవనీరేమో! ఒకటే కంపు కొడుతోంది. కంపార్ట్‌మెంట్ అంతా ముక్కు మూసుకున్నారు. కాస్సేపటికి గండం గట్టెక్కింది. రైలు బ్రిడ్జిని దాటేసింది. కంపులేదిప్పుడు. ముక్కుమీద చీర కొంగును తొలగించి-‘‘ఆ నీరు ఏం నీరో గాని, దాని కంపుకి కడుపులో దేవేస్తోందనుకో’’ తనతో శకుంతల అన్న మాటల్ని వింటూ ఆలోచనలో పడింది లక్ష్మి.చావోరేవో శకుంతలతో పాటు హైదరాబాద్ వచ్చేస్తోంది. తెగించి ఈ నిర్ణయానికొచ్చింది.కానీ ఈ తెగింపు ఏ మంచి కోసం? ఏ సుఖం కోసం?పెళ్లికాకుండా ఆడది గడపదాటకూడదు!దాటిందంటే మళ్లీ ఆ గడప తొక్కకూడదు! నిజమే! కాని ఇప్పుడు తనే గడపతొక్కబోతోంది.!! అదేమైనా అందమైన అత్తవారిల్లా? కాదే!నిప్పుల కొలిమి. కత్తులబోను!మగ మృగాల మదనారణ్యం. ఆ అరణ్యంలోకి కావాలనే...కావాలనే తాను ప్రవేశిస్తోంది.‘‘ఛీ’’ అనుకొంది లక్ష్మి. తన మీద తనకే అసహ్యం వేసిందామెకు. ముఖం చిట్లించుకొని లక్ష్మి ‘ఛీ’ అనడం శకుంతల వింది. విని-‘‘ఏంటంతగా అసహ్యించుకుంటున్నావ్’’ అడిగింది.‘‘ఏంలేదు’’ చెప్పింది లక్ష్మి.లేకపోవడేం లేదు! వుంది! తప్పనిసరై తనతో వస్తోంది లక్ష్మి. బతకలేననిపించి, బతుకంటే అసహ్యం కలిగి తనతో బయల్దేరింది కాని, లేకపోతే తనతో ఎందుకొస్తుంది? తెలిసి తెలిసీ వూబిలోకి ఎవరైనా దిగుతారా? పాపాల పుట్ట మీద ఎవరైనా పడతారా? పడుతోందంటే అర్థం? దిక్కులేక!!‘‘పాపం’’అనుకుంది శకుంతల. జాలిపడింది. ఆమాట విన్నదేమో-‘‘దేనికి పాపం’’ అడిగింది లక్ష్మి.‘‘ఏం లేదు’’ అని నవ్వింది శకుంతల. తన మాట తనకప్పజెప్పడంతో లక్ష్మికి కూడా నవ్వొచ్చింది. నవ్విందామె.కొత్తగా పెళ్లయినట్లుంది. ఎవరో భార్యాభర్తలిద్దరూ దగ్గరదగ్గరగా కూర్చుని కబుర్లాడుకుంటున్నారు.‘‘నువ్వింతవరకూ హైదరాబాద్ చూడలేదు కదూ’’అడిగాడు భర్త.‘‘చెప్పేను కదా!! చూళ్లేదు’’ నవ్వుతూ సిగ్గుపడింది భార్య.‘‘హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ వుంటుందీ! చూడాలి! చూస్తే జన్మ తరించిపోతుందనుకో’’ చెప్పాడు భర్త.‘‘చూద్దాం లెండి!’’ నవ్వింది భార్య.‘‘ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ అదుర్సనుకో’’‘‘అదీ చూద్దాం’’.‘‘జూ, మ్యూజియం చూసి తీరాలంతే’’.‘‘అన్నీ చూద్దాం లెండి’’అని తెర లు తెరలుగా నవ్వసాగిందామె. ఆ నవ్వుని చూస్తూ వుండిపోయాడు భర్త. మాట్లాడ్డం మానుకున్నాడు. నవ్వులో అంత అందం వుందా? ఆమెను చూస్తూ అనుకుంది లక్ష్మి. బ్రతుకంతా నవ్వుతూ హాయిగా ఆటగా సాగిపోవాలి. అంతే కాని బ్రతుకు నవ్వులాట కాకూడదు అని కూడా అనుకుంది లక్ష్మి.హైదరాబాద్ వచ్చేసింది. ప్లాట్‌ఫారం మీదకి రైలొస్తుండగానే రైల్వే కూలీలు కంపార్ట్‌మెంట్‌లోనికి చొరబడి ‘కూలీ కూలీ’ అని అరవసాగారు. ఇద్దరి దగ్గరా ఏ సామాను లేదు. దాంతో కూలీ అవసరమే లేకపోయింది. రైలు దిగుతోన్న లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకొని ‘‘జాగ్రత్త!జాగ్రత్త’’ అని హెచ్చరిస్తూ కిందకి దిగింది శకుంతల. ప్లాట్‌ఫారం మీదకి దిగిన లక్ష్మికి జనం ప్రవాహంలా కనిపించారు. ఎటు చూస్తే అటు జనం! పాయలు పాయలుగా ప్రవహిస్తూ కనిపించారు.‘‘ఇటు! ఇట్రా’’ లక్ష్మి చేతిని పట్టుకొని నడిచింది శకుంతల. మనుషుల్ని మనుషులు రాసుకుంటూ, తోసుకుంటూ పోతున్నారు. ఆడా, మగా అలా రాసుకుంటూ తోసుకుంటూ పోవడం అసభ్యత కాని, అనాగరికం కాని కాదనిపిస్తోంది. ముందుకి నడవాలంటే ఇదంతా తప్పదనిపిస్తోంది.‘‘ఏయ్’’ గట్టిగా కేకేసింది లక్ష్మి ఎవరో పోకిరి. కావాలనే లక్ష్మి గుండెల మీద చెయ్యేశాడు.‘‘ఏమయింది లక్ష్మీ?’’ అడిగింది శకుంతల.‘‘వాడెవడో ఇడియెట్! సరేగాని పదండి’’ జరిగింది చెప్పడం ఇష్టం లేనట్లుగా గుండెల మీద ఇంటు మార్కులా రెండు చేతులూ వుంచుకుని నడిచింది లక్ష్మి.జరిగింది ఏమిటో-లక్ష్మి ఎందుకు అరిచిందో అర్థం చేసుకోగలిగింది శకుంతల.‘‘ఏడీ? ఎక్కడ? ఎవడాడు’’ పెద్దగా అరుస్తూ కలియజూసింది శకుంతల. వాడ్ని చూపించాలని తనూ చూసింది లక్ష్మి. కాని ప్రవాహంలో కలిసి పోకిరి కనిపించలేదు.‘‘తప్పుకో!తప్పుకో’’తోవ చేస్తూ లక్ష్మిని తోడుకుని వస్తోంది శకుంతల. అప్పుడు కనిపించాడు పోకిరి. లక్ష్మి గుండెల మీద మళ్లీ చెయ్యి వేసేందుకు ప్రయత్నిస్తూ కనిపించాడు.‘‘ఇడిగో ఇడియెట్! ఇక్కడున్నాడు’’ గోలపెట్టినట్లుగా చెప్పింది లక్ష్మి వినిపించుకున్న శకుంతల ఇటు తిరిగి పోకిరిని చూసింది.‘‘రేయ్’’ అరిచింది. ఆ అరుపుకి పోకిరీ భయపడి తప్పించుకోజూశాడు. పరిగెత్తాడు. వెంటపడింది శకుంతల. ‘‘పట్టుకోండి పట్టుకోండి’’ అంటూ గోల చేసింది. ఆమె గోలని ఎవరూ పట్టించుకోలేదు. ఎవరి మానాన్న వాళ్లు నడుస్తున్నారంతే! ఏమయ్యిందో ఏమిటో కూడా ఆరా తియ్యట్లేదు.ఎవరో ఏదో అడ్డొచ్చింది. పరిగెత్తే వీలు లేదు. దొరికిపోయాడు పోకిరి.దొరకడమే తరువాయి-‘‘ఎదవన్నర ఎదవ! ఏంట్రా? ఏంట్రా? నువ్వు చేసిన పని? ఆడది కనిపిస్తే రెచ్చిపోవడమే! నిన్ను....నిన్ను...’’చెంపలు వాయించేసి, పిడి గుద్దులు గుద్దేసి కాళ్లతో తన్నేసి పోకిరీని కిందపడేసింది శకుంతల. తొక్కేయసాగింది. అప్పుడా క్షణంలో శకుంతల శకుంతల్లా లేదు. మహిషాసురమర్దినిలా వుంది. జగజ్జననిలా వుంది.‘‘మళ్ళీ... మళ్ళీ ఆడదాని మీద చెయ్యేశావో ఇరిచేస్తాను!’’ అని పోకిరీ చేతిని మెలి తిప్పి వాడు బాధగా ‘‘అబ్బా’’ అంటే-‘‘జాగ్రత్త!వైజాగ్ శకుంతలతో పెట్టుకోకు!వొళ్లు హూనమైపోద్ది’’అని అప్పటికే అక్కడి చేరుకొని తన వీరవిహారాన్ని ఆశ్చర్యపోయి చూస్తోన్న లక్ష్మితో-‘‘నువ్వురా! నీకేం కాదు’’ అని గాల్లోకి ఓ సారి చేతులు విదిలించి ముందుకి నడిచింది శకుంతల.ఆమె నడకకి అడ్డురాకుండా జనప్రవాహం పక్కకి తప్పుకుంది. ఆమెను అనుసరించింది లక్ష్మి. అప్పుడు ఎదురొచ్చారు ఇద్దరు రౌడీలు. వాళ్లని చూస్తూనే-‘‘ఇప్పటిదాకా ఎక్కడ సచ్చార్రా’’ కేకేసినట్టుగా అడిగింది శకుంతల.‘‘కొంచెం లేటైందక్కా! ట్రాఫిక్! ట్రాఫిక్ జాం’’ సంజాయిషీ చెప్పారు వాళ్లు.‘‘ఈ పాప మనపాపేనా’’ లక్ష్మినుద్దేశించి శకుంతలని అడిగేరు వాళ్లు.‘‘మన పాపే’’ చెప్పింది శకుంతల. దాంతో ‘‘ఏయ్ ! తప్పుకోండి!తప్పుకోండి’’ అరకొరా అడ్డొచ్చిన జనాన్ని తొలగిస్తూ రౌడీలు దారి చెయ్యడంతో స్టేషన్ బైటికి వచ్చేశారు వాళ్ళు. ‘ఆటో ఆటో’ అంటూ మీదపడుతోన్న ఆటోవాలాల్ని కాదని, పక్కకి వచ్చి అక్కడున్న సుమోలో లక్ష్మితో పాటుగా ఎక్కింది శకుంతల.‘‘కాజీపేట నుంచి నువ్వు ఇలా.... ఇలా వస్తున్నావని ఫోన్ చెయ్యగానే సుమోతో మేం రెడీ అయిపోయాం. కాకపోతే మధ్యలో చిన్నచిన్న పనులు చూసుకొని వచ్చేసరికి లేటయిపోయింది.’’ మళ్లీ లేటవడానికి గల కారణాన్ని చెప్పేరు రౌడీలు.‘‘సర్లెండి’’ విసుక్కుంది శకుంతల. ఆ విసుగుదలలో ‘పోనీయ్’ అన్న ధ్వని కూడా వుండడంతో ‘‘పోనీరా’’ అని ఓ రౌడీ చెప్పడంతో సుమోని ముందుకు పోనిచ్చాడో రౌడీ. సుమోలో ప్రయాణిస్తో అసెంబ్లీని చూసింది లక్ష్మి. రవీంద్ర భారతిని చూసింది. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, పంజాగుట్ట సిటీ సెంట్రల్‌ని కూడా చూసి మలుపు తిరిగి, ఏవేవో పార్కులు, పెద్ద పెద్ద బిల్డింగ్‌లను చూసి వస్తో-అయిదంతస్తులున్న ఓ అపార్ట్‌మెంట్ ముందు ఆగి, శకుంతలతో పాటు సుమో దిగి, అపార్ట్‌మెంట్‌లోనికి, లిఫ్ట్‌లో అయిదో ఫ్లోర్‌లోనికి నడిచింది లక్ష్మి.అయిదో ఫ్లోర్లో అయిదారు ఫ్లాట్సున్నాయి.అన్ని ఫ్లాట్లు ముందు అందంగా అలంకరించుక్ను అమ్మాయిలు నిల్చుని వున్నారు. వాళ్లంతా శకుంతలని చూస్తూనే ‘వొచ్చేసిందక్క! వొచ్చేసింది’ అంటూ చుట్టుముట్టారు.‘‘ఏమయిందక్కా! యాక్సిడెంట్ ఎక్కడయ్యింది’’ ఆదుర్దా కనపరిచారు. అదేమీ పట్టించుకోకుండా‘‘అవన్నీ తరువాత. అయిందట కదా! ముందు పని చూడండి! పని’’ అని-‘‘నువ్వురా లక్ష్మి’’ అని లక్ష్మిని తీసుకొని అయిదువందల ఆరు అని నెంబరున్న ఫ్లాట్‌లోనికి నడిచింది శకుంతల.‘‘లక్ష్మి... లక్షణంగా వుంది’’. ఎవరో అమ్మాయి ఇంకెవర్తోనో అంది.అది వినిపించింది లక్ష్మికి. వెంటనే వెనక్కి తిరిగిచూసింది. ఆమె అలా చూడగానే అమ్మాయిలంతా ఒక్క పెట్టున నవ్వారు.‘ఏంటా గోల’ హెచ్చరించింది శకుంతల. నవ్వులాగిపోయాయి.అయిదువందలారు ఫ్లాటు చాలా బాగుంది. హాల్లో అటొకటి, ఇటొకటి రెండు సోఫాలున్నాయి. మధ్యలో టీపాయ్ వుంది. పైన సీలింగ్ ఫ్యానుంది. గోడలకు మంచి మంచి సీనరీలున్నాయి. ఆ సీనరీల్లో అర్ధనగ్నంగా అందమైన అమ్మాయిలున్నారు. ఆ హాలు దాటితే ఇంకో హాలుంది. ఆ హాలు కూడా అంతే! ముందున్న హాలులాగే ముచ్చటగా వుంది. అయితే ఇక్కడ సోఫాల్లేవు. అన్నీ కుర్చీలే! కుర్చీల మధ్య రెండు మూడు టీపాయ్‌లున్నాయి. ఆ హాలునానుకునే మూడు బెడ్ రూములున్నాయి.అందులో ఓ బెడ్‌రూమ్‌లోనికి లక్ష్మిని తీసుకొచ్చి-‘‘ఇది నీ బెడ్‌రూం! నువ్విక్కడే వుండు’’ అని వెళ్లిపోయింది శకుంతల.బెడ్‌రూం చాలా బాగుంది. డబుల్‌కాట్సున్నాయి. కాట్సు మీద మంచి మంచి దుప్పట్లు దిళ్లూ వున్నాయి. పైన ఫ్యానుంది. ఇటు పక్కకి కిటికీ వుంది. కిటికీ పక్కన గోడ మీద ఇష్టదైవం, ఇలవేల్పు పడగెత్తిన నాగరాజున్నాడు. కట్‌పీస్ సెంటర్ క్యాలండర్ అది. అయినా బాగుంది. అటు అటాచ్‌డ్ బాత్‌ర్రూం వుంది.గదంతా తిరిగి చూసి బాగుంది-బాగుందనుకుంది లక్ష్మి. కిటికీకి వున్న కర్టెన్లు తొలగించి కిటికి రెక్కలు తెరిచింది.చలిగాలి రివ్వున వచ్చింది లోపలకి.. ‘అమ్మో’అనుకొని గబగబా కిటికీ రెక్కలు మూసేసింది. కర్టెన్లు కూడా వేసేసి, నిద్రొస్తున్నట్లనిపిస్తే, మంచమ్మీద వాలిపోయిందామె. నిద్రపోయింది. నిద్రలోనే ఏదో వేళలో లేవడం, ఎవరో అందిస్తే ఇడ్లీపేకట్టుందుకుని తినడం, నీళ్లు తాగి మళ్లీ నిద్రపోవడం లక్ష్మి లీలగా గుర్తుంది. అంతే! ఇంతలో తెల్లగా తెల్లారిపోయింది. ఎవరో గమ్మత్తుగా పేరుపెట్టి పిలుస్తున్నట్టనిపిస్తే - మెలకువ తెచ్చుకుని లేచి కుర్చుంది లక్ష్మి. తీరా చూస్తే-పిలుస్తోంది పంజరంలోని చిలక. ‘లక్ష్మీ! లక్ష్మీ!’ అంటూ పిలుస్తూ అది చిలకపలుకులు పలుకుతోంది.‘‘దీనికి నాపేరు ఎలా తెలుసు’’ మనసులో గాకుండా బైటికే అనేసింది లక్ష్మి.‘‘ఎలా తెలుసంటే దానికి ఆ ఒక్క మాటే తెలుసుకాబట్టి’’ నవ్వుతూ వచ్చింది శకుంతల. అర్థం కానట్టు చూసింది లక్ష్మి.‘‘దీన్ని ఇంతకు ముందు లకి్క్ష అని ఓ అమ్మాయి పెంచిందిలే! పెంచి ‘లక్ష్మి లక్ష్మి’ అంటూ దీనికి పలుకులు కూడా నేర్పింది. పలుకులు నేర్చుకున్న చిలక ఇక్కడే వుంది కాని, నేర్పిన చిలకే పోయింది పాపం చనిపోయింది’’ అంది శకుంతల. అని అంతలోనే-‘‘ఇప్పుడా గోలంతా దేనిక్కాని! తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు! ఫోటోలు తీయించుకుందువుగాని’’ అని వెళ్లిపోయింది. వెళ్లిపోతున్న శకుంతలతో ‘ఫోటోలిప్పుడు ఎందుకు?’ అని అడుగుదామనుకుంది లక్ష్మి. కాని అడగలేకపోయింది.ఫోటోలెందుకు తీస్తారు? ఎందుకు తీస్తారో తనకి బాగా తెలుసు. తనెన్ని సీరియళ్లు చూడలేదు. చదవలేదు! ఇలాంటి కొంపల్లో ఫోటోలు తీసేదందుకే!ఫోటో తీసి బ్రోకర్లకిచ్చి బేరాలు తెమ్మంటారు. తెలుసు!తనకంతా తెలుసు!!కన్నీళ్లు పెట్టుకుంది లక్ష్మి.రైల్లో రాణి చెప్పిందంతా నిజమే! అందులో అబద్ధం లేదు. శకుంతల ఈ రంగంలో బాగా ఆరితేరిపోయింది.కృష్ణానగర్లో పెద్ద ఫ్లాటంది తను. ఫ్లాట్ కాదు ఫ్లోర్‌కి ఫ్లోరే వుంది శకుంతలకి. ‘అక్కడ నీలాంటి వారు ఆరేడుగురుంటారు’ అంది. ఆరేడుగురేం ఖర్మ! చాలా మందే వున్నారు. ఎంత పాపాన్ని మూటకట్టుకుంటోంది శకుంతల?బాధపడింది లక్ష్మి.నిన్నటి వేళ ఫ్లాట్‌ఫారం మీద పోకిరిని ‘‘మళ్లీ ఆడదాని మీద చెయ్యేశావో ఇరిచేస్తాను’’అని శకుంతల అంటే శకుంతల మారిపోయిందనుకుంది తను. మనసులో ఎంతో ఆనందపడింది. అయితే అదెవరికీ తెలియనీయలేదు. కానీ, మారలేదు శకుంతల.‘అయ్యోయ్యో’అనుకుంది లక్ష్మి.‘లక్ష్మి లక్ష్మి’ అంటూ చిలక గోల చేస్తూనే వుంది. ఆ గోలలో మరో మగ గొంతు ‘లక్ష్మి’ అని పిలించింది. చూస్తే-నిక్కరు, నిక్కరు మీద చేతుల బనీను, నున్నగా గుండు, చేతిలో టీ గ్లాసు, నలభై అయిదు, యాభై యేళ్ల వయస్సున్న వ్యక్తి కనిపించాడామెకి.‘‘ఎవర్నువ్వు’’ అడిగింది లక్ష్మి.‘‘చంకరం’’ అన్నాడు.‘‘ఏంటి’’ అర్థం కానట్లుగా మళ్లీ అడిగింది.‘‘చంకరం’’ మళ్లీ చెప్పాడతను. దాంతో అతని పేరు ‘శంకరం’అని ‘శ’ ని పలకలేక ‘చంకరం’అంటున్నాడని తెలుసుకుంది లక్ష్మి.‘‘చాయ్ చకుంతలక్క నీకిమ్మంది’’ అందించాడు.‘‘వత్తాను’’ అని వెళ్లిపోయాడు.గుమ్మం వరకూ వెళ్లి ఆగి వెనక్కి తిరిగి చూసి వెకిలి నవ్వొకటి నవ్వాడు. చాలా అసహ్యంగా వుందా నవ్వు. తేళ్లని చితక్కొడుతున్నట్లు, పాముల్ని పిసుకుతున్నట్లుగా వుంది. తట్టుకోలేకపోయింది లక్ష్మి.‘‘హె’’ కసురుకుంది. దాంతో నవ్వునాపేసి, పరుగులాంటి నడకతో పారిపోయాడు చంకరం.అందుకున్న టీ కప్పు బాగుంది. అందులో ‘టీ’ ఎలా వుందో? సిప్ చేసింది లక్ష్మి. పర్వాలేదు. బాగానే వుంది. పూర్తిగా తాగేసింది.పదయ్యింది. తప్పనిసరై ఫోటోల కోసం ముస్తాబై కూర్చుంది లక్ష్మి. చంకరం తెచ్చిస్తే చిలక్కి జామకాయ ముక్కలు పంజరంలో వేస్తోంది.‘‘మ్యూజియం అని ఇక్కడికి తీసుకొచ్చేరేంటి’’ భయంభయంగా ఓ ఆడగొంతు వినవచ్చింది. ఆ గొంతు ఎక్కడో విన్నట్లనిపిస్తేను-గబగబా గదిలోంచి ముందు హాల్లోకొచ్చి చూసింది లక్ష్మి.నిన్న రాత్రి రైల్లో తెరలు తెరలుగా అందంగా నవ్వినామె. కొత్తగా పెళ్లయినట్లుగా వున్న భార్యభర్తల్లో భార్య!! అటు... అటువాడు భర్త.‘‘ఏంటండీ ఇదంతా? వీళ్లంతా ఎవరు’’ అడుగుతోంది పాపం. అక్కడ శకుంతల, ఇద్దరు రౌడీలు, చంకరం వున్నారు.‘‘ఏంటంటే? వీళ్లకి నిన్ను నేను అమ్మేస్తున్నాను! అదీ కథ’’ అన్నాడు భర్త.ఆ మాటకు భార్య కన్నా లక్ష్మి ఎక్కువ షాకయ్యింది.‘‘అమ్మేయడం ఏంటండి’’ అంది భార్య. ఆ అనడంలో చాలా అమాయకత్వం వుంది. భార్యని ఎవరైనా అమ్ముకుంటారాండి’’ అన్న బాధ వుంది.‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదే! దాంతో మీ నాన్న నాకు కట్నం ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్లిస్తామంటున్నారు! పాతికవేలు! వదులుకోమంటావా’’ అడిగాడు భర్త.మోసం!మోసం!గుండెల్లో గగ్గోలుగా అరిచింది లక్ష్మి.‘‘అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నారు కదండి’’ ఏడ్చింది భార్య.‘‘చేసుకోకపోతే నువ్వు నాతో రావు కదే’’ నవ్వాడు భర్త.అమ్మో!అమ్మో! గుండెలు బాదుకుంది లక్ష్మి.‘‘ఏడడుగులు, తలంబ్రాలు, అరుంధతిని చూడ్డాలు.... ఇవి... ఇవన్నీ నన్ను అమ్మేయడానికేనా’’‘‘నిక్షేపంగా! పెళ్లిని అంత రక్తి కట్టిస్తేనే పెళ్లాంగా నువ్వు నా సొంతం అవుతావు. నా సొంతం నా ఇష్టం! అమ్ముకుంటాను!!అక్కర్లేదనుకుంటే రెండుగా చీల్చుకుంటాను’’.తట్టుకోలేకపోయింది లక్ష్మి.‘ ఏం కూశావురా’ అంటూ గట్టిగా కేకేస్తూ హాల్లోని టీపాయ్‌ని ఒక్కదుటున అందుకొని రెండుచేతుల్తో దాన్ని పైకెత్తి భర్త మీదకి కసిదీరా విసిరేసింది.భర్తకి ఆ టీపాయ్ ఎక్కడ తగిలిందో తెలీదు కాని వాడు ‘‘ఆ’’ అని బాధగా అరుస్తూ కిందపడిపోయాడు. స్పృహ కోల్పోయాడు. ఆ ఊహించని ఈ సంఘటనకి అక్కడున్న వాళ్లంతా అవాక్కయిపోయారు. రౌడీలు నోరెళ్లబెట్టారు.చంకరం కళ్లు తేలేశాడు. శకుంతలైతే ఆశ్చర్యపోయి అలా వుండిపోయింది. భార్య అయితే కళ్లప్పగించి చూస్తోందంతే!‘‘అమ్మకాలకి ప్రేమలు, పెళ్లిళ్లూ ఎందుకురా! ఎందుకురా ఈ మోసాలు! బలవంతంగా ఎత్తుకొచ్చి అమ్మేయొచ్చుగా! ఎందుకురా! ఎందుకురా మాతో ఆటలు!’’ గొంతు చించుకుంది లక్ష్మి.రాత్రంతా ఆ భార్యభర్తలూ, శకుంతలా రైల్లో ఎదురుబొదురుగానే కూర్చున్నారు. శకుంతల ఆ భర్తకి తెలుసు! భర్తకి శకుంతల తెలుసు! అయినా ఒకర్నొకరు ఇద్దరూ పలకరించుకోలేదు. కారణం బిజినెస్ టాక్టిక్స్. అది గుర్తొచ్చి -‘‘ఛీ! మీ నాటకాలు మండిపోనూ! మీరు మనుషులు కార్రా! కారు’’ అంది లక్ష్మి.ఆ ఊపులో లకి్క్ష అక్కణ్నించి వెళ్లిపోయినా అడ్డుకునే దమ్ము, ధైర్యం అక్కడెవరికీ లేదు. అడ్డుకుంటే ప్రాణాలొడ్డాల్సిందేనని అందరికీ తెలిసిపోయింది. అయినా లక్ష్మి ఆ చోటుని విడిచిపోలేదు. ఏడుస్తూ, తన గదిలోకి వెళ్లిపోయింది. మంచమ్మీద బోర్లాపడి గుండెలవిసేలా ఏడవసాగింది. ఏడుస్తోన్న లక్ష్మిని జాలిగా చూస్తూ -‘లక్ష్మీ!లక్ష్మీ’ అని పిలుస్తోంది చిలక. ఆ పిలుపులో ఓదార్పు వుంది. బాధని పంచుకునే ధ్వని వుంది.సుందరం, త్రిబుల్‌గాడు ఏమయ్యారు?రైలెక్కి ఎటో వెళ్లిపోయారు. వూరొదిలి పారిపోయారు.ఇద్దరూ ఎక్కడకి వెళ్లుంటారు?వెళ్తేగిల్తే హైదరాబాదే వెళ్లుంటారు.- ఇటు సాయిబాబాని, అటు ప్రసాద్‌ని అడిగడిగి ఆఖరికి ‘అయితే వాళ్లిద్దరూ హైదరాబాదే వెళ్లుంటారు’ అన్న నిర్ణయానికి వచ్చి ‘దొరికితే ఆళ్లిద్దర్ని అక్కడే ఏసేస్తాను’ అనుకొని వాళ్లని చంపడం కన్నా ముందు చెల్లెలు లక్ష్మిని కాపాడుకోవాలి. తప్పదనుకుంటూ శకుంతలతో లక్ష్మి హైదరాబాద్ వెళ్లింది కాబట్టి మనమూ హైదరాబాద్ వెళ్లాలనుకుని అందుకు సిద్ధపడ్డాడు కృష్ణారావు.‘‘నేనూ మీతో పాటు వస్తానండి’’ అన్నాడు ప్రసాద్. అలా అనడంలో ‘వద్దనకండి! ప్లీజ్!’ అన్న అర్థింపు వుంది.డిగ్రీ చదువుతున్నాడు. చేజేతులా చదువుని పాడు చేసుకుంటున్నాడేమో అనిపించింది కృష్ణారావుకి. అది అతని ముఖంలో కనిపించింది. దాన్ని గుర్తించినట్టు-‘‘చదువుదేం వుందండి! మళ్లీ చదువుకుంటాను. కానీ పాపం లక్ష్మి’’ అని కన్నీళ్లు పెట్టుకుంటోన్న ప్రసాద్‌ని చూసి-‘‘లకి్క్ష అంటే నీకెందుకయ్యా ఇంత ఇది’’ అని అడుగుదామనుకుని, అర్థమయిన తర్వాత అడిగి తెలుసుకోవడం అనవసరమనుకుని, తనతో వస్తానన్న దానికి సమాధానంగా-‘అయితే బయల్దేరు’ అన్నాడు కృష్ణారావు.‘‘థ్యాంక్సండీ!థ్యాంక్యూ వెరీమచ్’’ కృష్ణారావు చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు ప్రసాద్. గట్టిగా పట్టుకున్న ప్రసాద్ చేతుల్ని చూస్తో-లక్ష్మిని ఈ చేతుల్లో పెట్టాలి. ఈ చేతుల్లో పెడితే లక్ష్మికి ఏలోటూ రాదనుకున్నాడు కృష్ణారావు. అనుకొని-‘‘పద’’ అన్నాడు.ప్రసాద్ ఆనందంగా కళ్లు తుడుచుకున్నాడు.-------------------------‘‘ఇటు చూడండి! సూట్‌కేస్ ఇక్కడ పెట్టాను!’’ అని సూట్‌కేస్ ఎక్కడ పెట్టిందీ చూపించి-‘‘ఇది మన టిక్కెట్! జాగ్రత్త’ అని కృష్ణారావు చేతికి హైదరాబాద్ టికెట్ అందించి-‘‘మీరు కూర్చోండి! నేనంతా చూసుకొంటాను’’ అంటూ కృష్ణారావు చేతిలోని ఖాళీ వాటర్ బాటిలందుకుని-‘‘క్షణంలో! క్షణంలో నీళ్లతో వస్తాను’’ అని కంపార్ట్‌మెంటు నుంచి కిందకి దిగి, ప్లాట్‌ఫారం మీదకి పరుగెత్తాడు ప్రసాద్. ప్లాట్‌ఫారమ్మీద రావిచెట్టు దాటాడు. తురాయి చెట్టు దాటాడు. బంగార్రాజు శారీ సెంటర్ బోర్డు దాటి ‘త్రాగునీరు’ కుళాయి దగ్గరగా వచ్చి అక్కడ బాటిల్లో వాటర్ నింపుకుంటూ, అటు కృష్ణారావున్న కంపార్ట్‌మెంట్ వైపు చూస్తూ నిల్చున్నాడు.లక్ష్మికి ఈ పాటికి నిజనిజాలు తెలిసిపోయి వుంటాయి. సుందరం దుర్మార్గుడు అని తేలిపోయి వుంటుంది. దాంతో ‘‘ప్రసాద్!ప్రసాద్’’అంటూ కలవరిస్తూ వుంటుంది. సరిగ్గా ఆ టైముకి తను హైదరాబాద్ చేరుకుంటున్నాడు.‘‘లక్ష్మీ! ఐ లవ్ యూ లక్ష్మీ! ఐ లవ్ యూ’’-వాటర్తో బాటిల్ నిండిపోయినా గమనించక ఆలోచనలో వున్నాడు ప్రసాద్.‘‘ఏటయ్యా... ఎట్నువ్వుసూస్తున్నావ్’’ కసిరినట్లుగా అడిగారెవరో.దాంతో ఆలోచనలని తెంచుకుని, ఇటు నిండిన వాటర్ బాటిల్ని చూసి దగ్గరగా తీసుకొని దానికి మూత బిగిస్తూ తననే చిరాగ్గా చూస్తోన్న వ్యక్తికి ‘సారీ’ చెప్పి ప్రసాద్ అటు అడుగువెయ్యబోయాడో లేదో -‘‘ప్రసాద్ అంటూ ఓ చెయ్యి తన భుజాన్ని అదిమి పట్టడాన్ని గమనించి, ఆగి ఇటు తిరిగి చూశాడు ప్రసాద్.అమ్మ!తడిసిన చీరకొంగుతో, కళ్ల నిండా నీళ్లతో కనిపించింది.‘‘ఎక్కడికిరా? ఎక్కడికి పరిగెడుతున్నావ్’’ అడిగింది.‘‘అమ్మకి కూడా చెప్పకూడదనుకున్నావా’’ మళ్లీ అడిగింది.‘‘రెండు రోజులుగా నేనంతా గమనిస్తూనే వున్నాను! నువ్వు నువ్వులా లేవు. ఏదో ఆలోచిస్తో ఆందోళన పడుతున్నావ్! తిండిలేదు! సరిగ్గా నిద్రపోవడం లేదు! నిద్రపోయిన కాసేపూ ‘‘లక్ష్మీ!లక్ష్మీ’’ అంటూ కలవరింతలు! ఏంట్రా? ఏంటిదంతా’’ అడిగింది.ఏం చెప్పాలి? అమ్మకేం చెప్పాలి? తడుముకు పోతున్నాడు ప్రసాద్.‘‘తెలుసు లేరా! నువ్వు లక్ష్మిని ప్రేమిస్తున్నావ్’’ అంది అమ్మ.‘‘అవునమ్మా! అవును’’ భోరుమన్నాడు ప్రసాద్. తల్లడిల్లిపోయిందా తల్లి.‘‘లక్ష్మి లేకుంటే నేను బతకలేనమ్మా! లక్ష్మి నాక్కావాలి! తను... తనిప్పుడు హైదరాబాద్‌లో వుంది.’’‘‘అందుకని హైదరాబాద్ వెళ్తున్నావా?’’అవునన్నట్లుగా కన్నీటి కళ్లార్చాడు ప్రసాద్‘‘డాడీకి ‘సారీ’ చెప్పానని చెప్పమ్మ! ఎందుకంటే డాడీ పర్సులోంచి వెయ్యి ...థౌజెండ్ రూపీస్....నేను దొంగతనం చేశాను’’‘‘డాడీకి నువ్వు డబ్బు తీసిన సంగతి తెలీదులే! నేనా వెయ్యీ డాడీ పర్సులో పెట్టేశాను.’’ ఆ మాటకి ‘‘అమ్మా’’ అంటూ మరింతగా భోరుమన్నాడు ప్రసాద్.‘‘డాడీ అడిగితే బొటానికల్ టూర్‌కో, ఇంటర్ కాలేజీ కాంపిటీషన్‌కో వెళ్లాడంటూ నీ గురించి అబద్ధం ఆడతాను. హైదరాబాద్ నుంచి వీలైనంత త్వరగా వచ్చేయ్ నాన్నా’’ అంది అమ్మ.‘‘అలాగే’’ అన్నాడు ప్రసాద్.అంతలో బయలుదేరుతున్నానంటూ రైలు కూత పెట్టింది.‘‘నన్ను క్షమించమ్మా’’తల్లి పాదాల మీద పడబోయాడు ప్రసాద్. పాదాల మీద పడనీయకుండా ప్రసాద్‌ని గుండెలకి దగ్గరగా తీసుకొంది తల్లి. ఏడ్చింది. తర్వాత ప్రసాద్ నుదుట మీద ముద్దు పెట్టుకొని ‘‘వెళ్లిరా’’ అంది.అప్పటికే రైలు నడుస్తోంది. నడుస్తోన్న రైల్లోంచి ప్రసాద్ ఇంకా రాలేదేంటా? అని డోర్ దగ్గరగా నిలబడి కృష్ణారావు చూస్తున్నాడు.తల్లిని వదిలి పరుగుదీశాడు ప్రసాద్.ఓ చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని, తల్లిని వదిలి పరిగెత్తుకొస్తోన్న ప్రసాద్‌ని చూసి, చేతినందించి కంపార్ట్‌మెంట్‌లోనికి లాక్కున్నాడు కృష్ణారావు. ఏడుస్తోన్న తల్లిని చూస్తో, ఆమెకి దూరం అవుతూ ‘టాటా’ చెప్పాడు ప్రసాద్. తల్లి కూడా ప్రసాద్‌కి ‘టాటా’ చెప్పింది.రైలు చీకటి చీకటి సొరంగంలోనికి వెళ్లిపోయింది. రైలు వెళ్లిపోవడమేంటి ఇలా తురాయి చెట్టు చాటునుంచి బైటికొచ్చాడు పోలీసు రామ్మూర్తి.‘‘ఆ పోలీసు రామ్మూర్తి క్కూడా ఇందులో వాటా వుందండి’’ అని కృష్ణారావుకి మొన్నారాత్రి ప్రసాద్ చెప్పినమాట ఆనోటా ఈనోటా పడి రామ్మూర్తి చెవిలో పడింది. ఆ మాటే కాదు ‘అయితే వాణ్ని కూడా ఓ చూపుచూద్దాం’ అని కృష్ణారావన్న మాట కూడా అతని చెవిలో పడింది. ఈ రెండు మాటలూ చెరో చెవిలో పడ్డంతో పోలీసు రామ్మూర్తి జాగ్రత్త పడ్డాడు.కృష్ణారావుకి, ప్రసాద్‌కీ దొరక్కుండా తప్పించుకుని తిరిగాడు. పోలీసు స్టేషన్లో వాకబు చేస్తే-‘‘వూళ్లోనే వున్నాడండి! కానీ ఏంటో, పెద్దగా కన్పించట్లేదు’’చెప్పారు. ఎప్పటికయినా దొరక్కుండా పోడు! దొరకనీ చెబుదాం’’!అని ఆలోచనలో వుంటోండగానే హైదరాబాద్ ప్రయాణించాల్సి వచ్చింది ప్రసాద్, కృష్ణారావులకి. అది వరమయ్యింది రామ్మూర్తికి. దాంతో అతను ఆనందంగా బైటపడ్డాడు.కొంగుతో కళ్లు తుడుచుకొని వెనుతిరిగిన ప్రసాద్ వాళ్లమ్మకి ఎదురొచ్చి -‘‘దణ్నాలమ్మగోరు! పెసాద్‌బాబేటి? ఏటెక్కడికెళ్తున్నారు’’ ఆరా తీశాడు రామ్మూర్తి.‘‘హైదరాబాద్‌కెళ్తున్నాడు’’ అందామె.‘‘ఎందుకో’’ అడిగాడు.‘‘ప్రేమకోసం’’ అంటూ. చరచరా వెళ్లిపోయింది.వెళ్లిపోయిన ఆమె వైపోసారి చూసి తర్వాత చేతిలోని లాఠీని చూస్తూ మాట్లాడుతున్నట్లుగా -పేమకి ఇంత పవరేటి? ఆపెసాద్‌గాడేవన్నా పెసిడెంటు కొడుకా? పయిల్వానా? ఆడు కిష్నారావుతో కలిసి శకుంతల మీదికి దాడికెళ్తాన్నాడు!అస్సల్సెకుంతల సంగతి ఈళ్లకి తెలుసా? అదెలాటిది? అదాకాసెంలో మెరుపు!బూమ్మీద పిడుగు! అడవిలో అగ్గి, సంద్రంలో సొరసేప!ఎల్నీ! ఎల్నీ! ఆళ్లే తెలుసుకుంటారు!!-అని ‘‘అయినా ఇయ్యన్నీ నాకెందుకు’’ అంటూ లాఠీని వెనక్కి నెట్టేసి ముందుకి నడిచాడు రామ్మూర్తి.సాయంత్రం అయిదయింది. అయినా నిద్ర లేవలేదు లక్ష్మి. బోర్లా పడుకుని నిద్రపోతూనే వుంది. అమాయకపు పెళ్లాం ప్రశ్నలకి దొంగమొగుడు సమాధానాలు విని తట్టుకోలేక, టీపాయ్‌తో వాణ్నీ కొట్టి, గదిలోకొచ్చి, బోర్లా పడి ఏడ్చిందే! ఆ ఏడుపేడుపు లక్ష్మిని నిద్రలోకి నెట్టేసింది.మధ్యాహ్నం రెండుగంటలపడు భోజనం కేరియర్, ప్లేటూ పట్టుకొని గదిలో కొచ్చాడు చంకరం. బోర్లా పడుకున్న లక్ష్మి చూశాడు. ఆ యాంగిల్లో లక్ష్మి చాలా బాగుంది. పాములా పెద్ద జడ, బంగారంలాంటి మెడ, మైదానం లాంటి వీపు, ఆ మైదానంలో నీటిచెలమలా, చెమట పట్టిన పెద్ద పుట్టుమచ్చ, కనీకనిపించని నడుము, ఎత్తయిన జఘన భాగం.... ఆనందంగా ఆ భాగమ్మీద చెయ్యి వెయ్యబోయాడు చంకరం. అంతలో ‘లక్ష్మీ’అని పిలిచింది చిలక. అంతే! భయపడి చేతిని స్పీడుగా వెనక్కి లాక్కున్నాడు. చిలకని కోపంగా చూశాడు.‘‘పోరా గొట్టాంగా’’అన్నట్లుగా తలవిదిల్చింది చిలక.‘‘నిన్నూ... నిన్ను...’’అంటూ పంజరమ్మీద చేత్తో కొట్టాడు చంకరం. అదురూ లేదు...బెదురూ లేదు...నీ దెబ్బలు నాకు తగలవులే’’ అన్న ధైర్యంతో వున్న చోటునుంచి ఇంచి కూడా కదలక చూడసాగింది చిలక. ఇంత జరుగుతున్నా లక్ష్మి నిద్ర లేవలేదు. మంచి నిద్రలో వుందామె.‘ ఇప్పుడు గాని లేపానా! చెంపలు పేలిపోతాయి’అనుకున్నాడు చంకరం. మరిందాక అక్కడ చెయ్యి వెయ్యడానికిలా సాహసించాడంటే ఆ మూడు వేరు!ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడేమో! తెచ్చిన కేరియర్,ప్లేటు అక్కడ పెట్టి వెళ్లిపోయాడు.అలా వెళ్లిపోయినవాడు మళ్లీ ఇప్పుడొచ్చాడు. అయిదుగంటల వేళ లక్ష్మి గదిలోకి వచ్చాడతను. ఇప్పుడు లక్ష్మి వెల్లకిలా పడుకొని కనిపించింది.పెద్ద పెద్ద కళ్లు, సంపెంగ ముక్కు, చిన్న నోరు, చక్కనైన మెడ, ఎత్తుగా,లావుగా, బలమైన గుండెలు, లక్ష్మి అందంగా కన్పించిందతనికి. దాంతో ఆనందంగా నవ్వు తోసుకొచ్చింది చంకరానికి. నవ్వాడు. మెత్తగా, అసహ్యంగా, వొళ్లు జలదరించేలా నవ్వాడు. ఆనవ్వుకి మెలకువ వచ్చింది లక్ష్మికి. కళ్లు తెరిచి చూసింది. స్విచాఫ్ అయినట్లుగా నవ్వుని ఆపేసి‘‘చాయ్’’అన్నాడు చంకరం. చాయ్ కప్పు వున్న చేతిని ముందకి సాచాడు.లేచి కూర్చుని చాయందుకొని-‘‘ఇప్పుడు టైమెంతయ్యింది’’అడిగింది లకి్క్ష.‘‘అయిదయ్యింది!’’అని తర్వాత ఎక్‌స్ర్టా ఇన్‌ఫర్‌మేషన్ ఇస్తున్నట్లుగా-‘‘అందరూ తానాలుచేత్తున్నారు’’ అన్నాడు. ఆ మాటల్ని పట్టించుకోక-‘‘అన్నట్లు! ఆ మొగుడూ పెళ్లాలేమయ్యారు?’’అడిగింది.‘‘ఏమయ్యారు! ఎళ్లిపోయారు’’‘‘ఎక్కడికి’’‘‘ఆయన్నీ మనకెందుగ్గాని! లేతల్లి! లెగిచి ముకం కడుక్కో! నిన్ను చూడ్డానికి పెదపెద్దోళ్లొత్తున్నారు’’అన్నాడు చంకరం.అని ఇంకా అక్కడుంటే ఇంకే ప్రశ్ననెదుర్కోవలసి వస్తుందోనన్న భయంతో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.----------------------------రాత్రి ఎనిమిదయింది.టివి షూటింగ్ జరుగుతోందక్కడతెలుగులో ప్రముఖ ఛానెల్-ఛానెల్ 18లో రాత్రి పదకొండుగంటల కొచ్చే ‘క్రైం టైం’కి సంబంధించి సీరియల్ షూటింగ్ జరుగుతోంది. జనరేటర్ వ్యాన్, ప్రొడక్షన్ సిబ్బంది, అసిస్టెంట్, కో, డైరక్టర్ల కేకలు. లైట్ బాయ్స్ అరుపుల్తో హడావుడిగా వుందంతా.హీరోయిన్ డ్రస్ ఛేంజ్ చేసుకుంటోంది. దాంతో షూటింగ్ బ్రేకయ్యింది. సొల్లేసుకుంటున్నారంతా.కెమెరామన్‌తో చెప్తున్నాడు డైరక్టర్ -‘‘ఆ రోజులే వేరు సార్! డైరక్షనంటే క్లాప్ కొట్టడం దగ్గర్నుంచీ నేర్చుకోవాలి! ఇప్పుడదేం అక్కర్లేదు.‘కెమెరా! యాక్షన్! కట్’ మూడంటే మూడు మాటలొస్తే చాలు! డైరక్టరయిపోవచ్చు’’.‘‘బాగా చెప్పేరు’’నవ్వాడు కెమెరామన్.‘‘ముందు దస్తూరీ చూసేవార్సార్! తప్పుల్లేకుండా రాస్తున్నాడా? లేదా? యాక్షన్ పార్ట్, డైలాగ్ పార్ట్, డివైడ్ చేస్తున్నాడా? లేదా? అదే చూసేవారు! డివైడ్ చేసి, తప్పుల్లేకుండా రాస్తే గొప్పే! బాగా మెచ్చుకునేవారు’’‘‘అవునవును’’కెమరామన్ అన్నాడు.‘‘ఇకపోతే ప్రామ్‌టింగ్! పాత్రలోకి ప్రవేశించి లీనం అయిపోయి, ప్రామ్‌టింగ్ చెప్పాలి! మన మూడే కదా అవతల ఆర్టిస్ట్ మూడు కూడా! అలా చెప్తే ఇంకేం వుంది! ఎదురులేనట్టే’’‘‘మా బాగా చెప్పేరు’’మెచ్చుకున్నాడు కెమెరామన్‘‘ఇప్పుడవన్నీ ఏవి? ప్రామ్‌టింగ్ సరిగ్గా చెప్పలేరు. తప్పుల్లేకుండా రాయలేరు. కోడిగెలికినట్లుగా అక్షరాలూ-వీళ్లూనూ! డైలాగేంటో, యాక్షనేంటో తెలీదు! అబ్బబ్బ! పనికి రార్సార్! ఒక్కడూ పనికిరారు’’‘‘నిజం చెప్పేరు’’తలపట్టుకున్నాడు కెమెరామన్.డైరెక్టర్ అలా కెమెరామన్‌తో సొల్లేయడాన్ని గమనిస్తూ ‘ఈ నా కొడుకు ఇప్పట్లో’ తెమల్చడు! కావాలనే టైం తినేస్తున్నాడు. ఇలా టైం తింటూపోతే రాత్రి పది దాటిందంటే అందరికీ డబుల్ బేటాలివ్వాలి. ఛస్తాం’ అనుకొని డైరక్టర్ని తిడుతున్నట్లుగా అందర్ని అదిలిస్తూ-‘‘ఏంటయ్యా! ఏంటింకా లేటు’’గట్టిగా కేకేశాడు ప్రొడక్షన్ మేనేజర్.‘‘హీరోయిన్‌గారు డ్రస్ ఛేంజ్ చేసుకుంటున్నారు’’ ఎడం చేత్తో కుడి బుగ్గని రాసుకొంటూ చెప్పాడు కో డైరెక్టర్ గిరి.‘‘ఎంతసేపది! గంటై తలుపులేసుకొని గదిలో వుంది’’ అరిచాడు.‘‘ష్! గట్టిగా అరవకండి సార్! లోపల హీరోయిన్‌తో పాటు హీరోగారు కూడా వున్నారు’’రహస్యంగా చెప్పాడు గిరి. దాంతో కోపం నసాలానికి అంటిందేమో!‘‘రమ్మను! రమ్మనిద్దర్నీ!’’ గోలచేశాడు మేనేజర్.‘‘అయ్యా! మీరు మరీ గోల చెయ్యకండి! హీరోయిన్‌గారి డేటు ఇవాళ మనది కాదు! ఎడ్జస్ట్‌మెంట్! అడుక్కుని తీసుకున్నాం! పడాలివన్నీ!తప్పదు’’ చెప్పాడుగిరి.‘‘కొంచెం నోరు తగ్గించుకోండి! హీరోయిన్‌గారు విన్నారనుకోండి!లేనిపోని గోల’’ హితవు చెప్పాడు.‘‘సినిమాలంటే హీరో హీరోయిన్లకి భయపడతామయ్యా! టివీక్కూడా భయపడాలంటే నావల్లకాదు! నేనీ ప్రొడక్షన్ చెయ్యలేను’’‘‘చెయ్యాలి! తప్పదు! వొప్పుకున్నాక తప్పుతుందా’’అని సర్దిచెప్పి, ‘సొల్లాపండి’ అన్నట్లుగా డైరెక్టర్‌నుద్దేశించి ‘రెడీ రెడీ’అని అరుస్తూ ముందుకు నడిచాడు గిరి.లోకేషన్‌కి కొంచెం దూరంగా చీకట్లోకి వచ్చాడు. అక్కడ సిగరెట్ తీసి ముట్టించాడు. రెండు దమ్ముల్లాగాడు. అదే అదనన్నట్లుగా గిరిని కలవడానికి విలన్(వేషధారి) వచ్చాడక్కడికి.‘‘ఏంటి గురూ! సిగరెట్ నువ్వొక్కడికే తాగుతున్నావ్’’అడిగాడు.‘‘నీక్కావాలా’’సిగరెట్ ఆఫర్ చేశాడు గిరి. అందుకొని తనూ రెండు దుమ్ముల్లాగి-‘‘ఏంటి గురూ! ఇంకా ఎంతసేపు షూటింగ్ ఇంకా కొనసాగడం మీద చిరాకు పడ్డాడు విలన్.‘‘ఓ గంట పడుద్ది! నైన్ థర్టీ-టెన్-పేకప్! గ్యారంటీ’’ చెప్పాడు గిరి.‘‘తొందరగా అయ్యేట్టు చూడు గురూ! వైజాగ్ శకుంతల రమ్మంటోంది! వెళ్దాం’’‘‘ఆ కంపెనికా? సచ్చినా రాను! ఒక్క గుంట కూడా బాగోదు’’ చీదరించుకున్నాడుగిరి.‘‘కొత్త గుంట వచ్చిందట గురూ! బలేగుందట! పొద్దున ఫోన్జేసి చెప్పింది శకుంతల’’ చెప్పాడు విలన్.‘‘అదలాగే చెప్పుద్ది!లైటింగులో సీరలు సూసినట్టు-మేకప్పు మీద వుంటారంతా! మనకయి నచ్చవు! మనకంతా నాటు! నాటు కావాల! వితవుట్ మేకప్’’ తన టేస్టేంటో చెప్పాడు గిరి.‘‘లక్ష్మి అని సరికొత్త సరుకట! నిన్ననే దిగింది! నువ్వన్నట్లు నాటే! మీ సైడు గుంటే’’చెప్పాడు విలన్.‘‘అయితే మనం రెడీనే’’అని ఆనందంగా చేతిలోని సిగరెట్‌ని గట్టిగా ఓ దమ్ములాగి విసిరేసి, ‘రెడీ రెడీ’అంటూ అరుచుకుంటూ వచ్చాడు గిరి. అతన్ని అనుసరించి వచ్చాడు విలన్.అప్పటికి హీరోయిన్ డ్రస్ ఛేంజ్ చేసుకొని రెడీ అయి వుంది. హీరోగారు కూడా ఎందుకైనా మంచిదని డ్రస్ ఛేంజ్ చేసుకొని వున్నారు. అది గమనించి-‘‘మీరు-మీరెందుకండి డ్రస్ ఛేంజ్ చేశారు! మీకు డ్రస్ ఛేంజ్‌ని నేను చెప్పానా! కంటిన్యుటి! కంటిన్యుటీని చూసుకోరెందుకు’’‘‘అది...అదీ లోపల షర్టు మీద టీ పడితేను! సారీ! ఆ షర్టే వేసుకొని రానా అయితే’’ అని వెళ్లబోతుంటే-‘‘మీరాగండి! మళ్లీ ఓ అరగంట లేటంటే నేన్తట్టుకోలేను! కంటిన్యుటీ లేదు! పాడు లేదు! కానిచ్చేయండి’’ కల్పించుకొని షూటింగ్ స్టార్ట్ చెయ్యమన్నట్లుగా చెప్పేడు ప్రొడక్షన్ మేనేజర్.‘‘అది కొంచెం ఇబ్బందేనండి’’ కుదరదన్నట్లుగా మెత్తగా చెప్పాడు డైరక్టర్.‘‘అదేం ఇబ్బంది కాదు! మీతోనే నాకు ఇబ్బందిగా వుంది! ముందు షూటింగ్ స్టార్ట్ చెయ్యండి’’కసిరాడు మేనేజర్. ఆ కసురుకి ‘లైట్స్’ అంటూ అరిచాడు లైట్స్ ఇంఛార్జి. లైట్లు వెలిగాయి. ఒక్కసారిగా వెలుగుపరుచుకొంది. ఆ వెలుగులో హీరోయిన్ మెరిసిపోతోంది. మెరిసిపోతున్న ఆ హీరోయిన్ని కత్తితో ఒకే ఒక్క పోటు పొడిచి చంపేయాలి విలన్. సీను వివరించి ‘రెడీ రెడీ’ అన్నాడు గిరి.‘‘ముందు క్లోజ్‌లు తీసుకుందామయ్యా! తర్వాత డిటైల్స్ వర్క్ చేద్దాం’’ గిరితో చెప్పాడు డైరెక్టర్.‘‘మీ ఇష్టం సార్’’ అన్నాడు గిరి.‘‘అదమ్మా సంగతి! ముందు కసక్! కత్తితో మిమ్మల్ని విలన్ పొడుస్తాడు! అది తీసుకుందాం! ఓకే’’ అడిగాడు డైరక్టర్.‘‘ఓకే సార్’’ చెప్పింది హీరోయిన్.‘‘రెడీ’’అని అరిచి-‘‘కెమెరా’’గొంతు చించుకొన్నాడు డైరక్టర్.‘‘రన్నింగ్ సార్’’ చెప్పేడు కెమెరామన్.‘‘యాక్షన్’’ అరిచాడు డైరక్టర్.‘‘ఆ’’ అంటూ అరుస్తూ నోరు, కళ్లూ విప్పార్చి, బాధగా లుమ్మలు చుట్టుకుపోతున్నట్లుగా ఎక్స్‌ప్రెషన్సిస్తూ కుప్ప కూలిపోయింది హీరోయిన్.‘‘కట్’’ ఆనందంగా అరిచాడు డైరక్టర్.‘‘బాగా చేశావమ్మా! చాలా బాగా చేశావ్’’హీరోయిన్ని మెచ్చుకున్నాడు.-------------------------‘‘నిజమా!నన్ను...నన్ను చూడ్డానికి డైరెక్టర్‌గారొస్తున్నారా’’ ఆనందంతో కళ్లు చెమర్చుకుంది లక్ష్మి.‘‘అవున్లక్ష్మీ! నేనబద్ధం చెప్పట్లేదు! క్రైం టైం సీరియల్ డైరెక్టర్ గిరి అనీ- ఆయనొస్తున్నాడు నిన్ను చూడ్డానికి! ఆయన్తో పాటు అన్ని సీరియల్స్‌లో విలన్ వేషాలు వేస్తాడే! ఆయన... ఆయన పేరేంటబ్బా....శకుంతల ఆలోచిస్తుండగా-‘‘పండా’’ గుర్తు చేసింది లక్ష్మి.‘‘కరెక్ట్! పండా కూడా వస్తున్నాడు’’ చెప్పింది శకుంతల.లక్ష్మికేదీ వూహకందట్లేదు. హీరోయిన్ని చేస్తానని అబద్ధం చెప్పి తనని వేశ్యను చేద్దామనుకున్నాడు సుందరం. అదే - వేశ్యని చేస్తుందనుకున్న శకుంతల తనని హీరోయిన్ని చేస్తోంది. శకుంతల్ని తప్పుగా వూహించింది తను! ఛీ! పాపిష్టిదాన్ని‘‘అయితే నువ్వో చిన్న సాయం చెయ్యాలి లక్ష్మి’’ అడిగింది శకుంతల.‘‘చెప్పండి! ఏం చెయ్యమంటారు’’‘‘గిరి వాళ్లతో నువ్వు కొంచెం క్లోజ్‌గా మూవ్ అవ్వాలి’’‘‘ఫీల్డంటే తప్పదు కదండీ! అవుతాను’’అంది లక్ష్మి.‘‘నా తల్లి! నా బంగారం’’ అని లక్ష్మి చుట్టూ చేతులు తిప్పింది శకుంతల.‘‘ఇంకాసేపట్లో వాళ్లొస్తున్నారు! రెడీగా వుండేం’’అని ఆనందంగా అక్కడ్నుంచి వెళ్లిపోయింది శకుంతల. వెళ్లిపోయిన శకుంతల్నోసారి చూసి, తర్వాత పంజరం దగ్గరగా వచ్చి, చిలకని పలకమన్నట్లుగా నవ్వుతూ సంతోషంగా-‘‘లక్ష్మీ!లక్ష్మీ’’అని చెప్పింది లక్ష్మీ.చిలక పలకలేదు!మళ్లీ చెప్పింది లక్ష్మి.పలకలేదు చిలక! బాధగా చూస్తోందంతే!కో-డైరక్టర్ గిరీ వాళ్లు వస్తున్నారని లక్ష్మికి చెప్పడానికి ముందు, చెప్పగానే ఆనందంతో లక్ష్మి కళ్లు చెమర్చడానికి ముందు-వైజాగ్ శకుంతల చాలా ఎక్సర్‌సైజ్ చేసింది. పొద్దున్నుంచి ‘ఫోటోలు! ఫోటోలు’ అని గోల చేస్తోంటే, ఆ ఫోటోలు తీసేవాడు సాయంత్రం ఆరుగంటలకి వచ్చాడు.పాత ఫోటోగ్రాఫరే! పేరు కోటి. కోటిగాడి ఫొటోలంటే కోట్లకి పడగలెత్తినట్టే! వాడంతందంగా ఫోటోలు తీస్తాడు. ఉత్తరాది నుండి దక్షిణాదికి దిగుమతి అవుతోన్న చాలా మంది హీరోయిన్లకి కోటిగాడి ఫోటోలే శ్రీ రామ రక్ష! ఉత్తరాది వాళ్లంతా కోటిగాడ్ని ఇక్కణ్నుంచి అక్కడికి పిలిపించుకుపోయి మరీ ఫోటోలు తీయించుకుంటారు. వాడంత ఫేమస్. మరి అంత ఫేమస్ ఫోటోగ్రాఫర్ శకుంతల కంపెనీకొస్తాడా? వచ్చి ముక్కూ, మూతి లేని వాళ్లకి ఫోటోలు తీస్తాడా? అంటే తీస్తాడు. శకుంతల చెప్తే చాలు! కోటిగాడు ఎంత పనైనా చేస్తాడు. వాళ్లిద్దరికీ వున్న లింకు అలాంటిది.సాయంత్రం ఆరు గంటలకి కంపెనీకొచ్చిన కోటిగాడు, పిల్లలందర్ని పేరుపేరునా పలకరించి, కొందరకి ఫ్లయింగ్ కిస్సులుకూడా ఇచ్చాడు. వాడొస్తేనే హడావుడి! వాడి మాట, నడకా అలా వుంటుంది మరి!‘‘ఏం శకుంతలా! ఎలా వున్నావ్’’ పలకరించాడు కోటి.‘‘చూసి నువ్వే చెప్పు ’ న వ్వింది శకుంతల. ఆ మాటకి శకుంతలని కింది నుంచి పైదాకా చూసి-‘‘మడతిప్పని కొత్తకోకలాగున్నావ్! పూతరేకులాగున్నావ్! నీకేటి’’అన్నాడు కోటి. శకుంతల్ని గిచ్చాడు.‘‘ఓలమ్మో! నీ చేతులు పడిపోను! ఏటా గిల్లుడు’’ అంది శకుంతల.‘‘సరసం’’ అని నవ్వాడు కోటి.‘‘నీ సరసం సంతకెల్ల! చేసిన సరసం చాలుగాని, ముందు పాపకి ఫోటోల్తియ్ అని, లక్ష్మిని చూపించింది కోటికి. లక్ష్మిని చూస్తూనే కోటిగాడు గుమ్మెత్తిపోయాడు.ఎవరీ పాలరాతి బొమ్మ? ఎక్కడిదీ పూలరెమ్మ? ఇదే ఇంత అందంగా వుందంటే తీన్తల్లి - అదెంత అందంగా వుంటుందో! కోటిగాడి వూహకి అందలేదది.కోటిగాడికి పలకమారిన జామకాయలకంటే అరమగ్గిన జామ పళ్లంటేనే ఇష్టం. పిందెల్ని, కాయల్ని పట్టించుకోడువాడు. పళ్లంటే చాలు పడి ఛస్తాడు. అందుకే వాడికి శకుంతలంటే అంత ఇది! ఒకొక్కరిదొకో రుచి! కాదనలేం కదా!‘‘చూస్తూంటే కళ్లు ‘జిగ్’మంటున్నాయి! ఎక్కడిదేటి ఈ హైమాస్ లైటింగ్’’ లక్ష్మిని ఉద్దేశించి శకుంతలని అడిగాడు కోటి.‘‘అయ్యన్నీ తర్వాత చెప్పుకుందాం గానీ! ముందు ఫొటోల్తియ్’’ అంది శకుంతల.‘‘చార్మినార్ని, తాజ్‌మహల్ని ఫోటోల్తియ్యమని ఒకరు చెప్పక్కర్లేదు! తీస్తాంగాని! ముందు చెప్పు శకుంతల! ఈ పాపదేవూరు’’‘‘ఆళ్లమ్మ ఎప్పుడో చచ్చిపోయింది! ఏ వూరయితే ఇక నీకెందుకు’’ అంది శకుంతల. కోటిగాడికి చావు కబురు చల్లగా చెప్పింది.‘‘ఛఛ’’ అవకాశం చేజారిపోయినట్లుగా ఫీలయ్యాడు కోటిగాడు. అంతలోనే తేరుకుని ‘రెడీరెడీ’ అన్నాడు.లక్ష్మిని ఫోటోల్తియ్యడానికి రెడీ అయిపోయాడు. రకరకాల యాంగిల్స్‌లో లక్ష్మికి ఫోటోల్తీశాడు కోటి.‘‘రెడీ!స్మైల్’’ అంటూ ఒక్కో యాంగిల్లో లక్ష్మిని చూస్తూ ‘ఇది ఆషామాషీ మనిషి కాదు! స్వర్గంలోంచి డైరక్టుగా దిగిన దేవకన్య’’ అనుకున్నాడు.‘‘ఫోటోలయిపోయాయి! ఇప్పుడు ఫోటోలు ఎవరికి చూపిస్తావ్’’ అడిగాడు కోటి.‘‘ఉన్నాడున్నాడు! ఓ బాబున్నాడు! ఆ బాబుకి ఫోటోల్చూపించి-తర్వాత కథ తర్వాత చెప్తాను’’ అంది శకుంతల.‘‘ఎవడా బాబు’’ అడిగాడు కోటి.‘కో-డైరక్టర్ గిరి’ అని చెబుదామనుకుని, అతడి గురించి కోటి దగ్గరెందుకు? అనుకొంది శకుంతల. అందుకని చెప్పలేదు.‘‘ఎవడా బాబు’’ మళ్లీ అడిగాడు కోటి.‘‘తెలుస్తుందిలే! నీకు తెలియకుండా ఏదీ వుండదు కానీ!రా! కాసేపు చల్లబడుదువుగాని’’ అని తనతో పాటుగా కోటిగాణ్ని తీసుకెళ్లింది శకుంతల.రాత్రి ఏడుగంటల వేళ గిరికి ఫోన్జేసింది శకుంతల. షాట్‌లో వున్నాడేమో ఫోన్‌ని పట్టించుకోలేదు. దాంతో పండాకి ఫోన్జేసింది. పండా మాట్లాడాడు. వివరంగా అతనితో మాట్లాడింది శకుంతల.‘‘నీకెందుకు? గిరిని తీసుకొచ్చే పూచీ నాది’’చెప్పాడు పండా.‘‘తీసుకురా మరి’’ అని ఫోన్ పెట్టేసింది శకుంతల.ఈ హైరానా అంతా దగ్గరుండి గమనించారు శకుంతలకు చెందిన ఇద్దరు రౌడీలు, వాళ్ల తోడుగా వున్న చంకరం. గమనించి-‘‘ఏందక్కా ఇదంతా! ఆ గిరిగాడెందుకు? లక్ష్మికి ఫస్ట్‌నైట్ గిరిగాడితోనా’’ అడిగారు.‘‘ఫస్ట్‌నైట్ కాదు! పరిచయం! గిరికి లక్ష్మిని పరిచయం చేస్తానంతే’’ చెప్పింది శకుంతల.‘‘దాని వల్ల లాబమేంటి’’ అడిగారు.‘‘లక్ష్మి పెద్ద హీరోయిన్ అవుతుంది’’ చెప్పింది.‘‘హీరోయిన్ని చెయ్యడానికా లక్ష్మిని నువ్వు ఇక్కడకి తీసుకొచ్చావ్’’.‘‘ఏదో ఒకటి చెయ్యడానికి తీసుకొచ్చాను! మీకెందుకూ ఈ గోలంతా! ఎళ్లండి! ఎళ్లండిక్కడణ్నుంచి’’ కసిరింది శకుంతల. దాంతో వాళ్లు వెళ్లిపోయారు. వెళ్లిపోనిది లక్ష్మే! ఆమె చాటుగా వుండి, వాళ్ల సంభాషణంతా వింది.తను...తను పెద్ద హీరోయిన్ కాబోతోంది. తను కన్న కలలు నెరవేరబోతున్నాయి. అందుకు శకుంతల సహకరిస్తోంది. చాలు దేవుడా! చాలీ జన్మకీ’.లక్ష్మి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.------------------------‘‘పేకప్’’అరిచాడు డైరక్టర్.‘హమ్మయ్యా!’ అనుకుని గుండెల్నిండా వూపిరి తీసుకొని చేతిలోని ఫైల్‌ని విసిరికొట్టినట్టుగా అసిస్టెంట్ డైరక్టర్ చేతిలో పడేశాడు గిరి. పడే సి చేతిలోని వాచీకేసి చూశాడు. పదిగంటలయింది.‘‘పండా ఏడి! ఎక్కడ’’ అసిస్టెంట్ డైరక్టర్ని అడిగాడు గిరి.‘‘మేకప్ తీసేసుకొని ఎప్పుడో మీకోసం కార్లో కూర్చున్నాడు సర్’’‘‘చెప్పవేం మరి’’ హడావుడి పడ్డాడు గిరి. జేబులోని కాగితం తీసిస్తూ-‘‘ఇదీ రేపటి ప్రోగ్రాం! అందరికీ చెప్పు’’ అని గిరి బయల్దేరబోతుండగా ఎదురొచ్చి -‘‘ఇవాల్టిలా రేపు కుదరదయ్యా! రేపెట్టి పరిస్థితుల్లో ఉదయం ఏడు ఏడున్నర కల్లా కెమెరా స్టార్టవ్వాల్సిందే’’ కోపాన్ని అణచుకుంటున్నట్లుగా చెప్పేడు డైరక్టర్.‘‘అలాగే సార్’’ అన్నాడు గిరి.‘‘రేపు లొకేషనెక్కడ’’ అడిగాడు డైరక్టర్.‘‘మనవాడు చెప్తాడ్లెండి’’ అసిస్టెంట్ డైరక్టర్ని ఉద్దేశించాడు.‘‘ఏం నువ్వు చెప్పకూడదా’’‘‘చిన్న పనుంది సార్’’ బ్రతిమాలాడినట్లుగా చెప్పాడు గిరి.‘‘పనులు మీకే కాదు. మాకూ వుంటాయి! చెప్పు లొకేషనెక్కడ’’.‘‘హిందూ శ్మశానవాటిక! రోడ్ నెంబర్ త్రీ! బంజారా హిల్స్! మీకు తెల్లారుజామున నాలుగ్గంటలకే కారొస్తుంది’’ చెప్పేడు గిరి.‘‘అంత...అంత పొద్దున్నే ఎందుకయ్యా!’’‘‘మొన్న మిగిలిపోయిన రెండూ షాట్లూ నైట్ ఎఫెక్ట్‌లో ముందక్కడ తియ్యాలి’’‘‘సాయంత్రం తీసుకందాం! కంగారు దేనికి’’‘‘మధ్యాహ్నం మూడు గంటలకి అక్కడ్నుంచి షిఫ్టయి ఇంకో లొకేషన్‌కెళ్తున్నాం అదీ కథ’’‘‘మరీ లెక్కన రేపు నాలుగున్నర, అయిదుకే కెమెరా స్టార్టవుతోంది’’‘‘అవును! వెళ్లొస్తాను!’’ అని అక్కణ్నుంచి స్పీడుగా నడకందుకున్నాడు గిరి.నడిచి వెళ్తోన్న గిరిని చూస్తూ-‘‘ఈడూ! ఈడి షెడ్యూలూ! పనికి రాడయ్యా! కో డైరెక్టర్‌గా పనికిరాడు’’అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్‌కి అర్థయమ్యేలా గిరిని కోపగించుకున్నాడు డైరెక్టర్.‘‘జాగ్రత్తగా అన్నీ చూసుకో! నెక్ట్స్ షెడ్యూల్‌కి నువ్వే కో-డైరెక్టర్‌వి’’ అసిస్టెంట్‌ని అందలం ఎక్కించాడు డైరెక్టర్.‘‘థ్యాంక్యూ సార్! థ్యాంక్యూ వెరీ మచ్’’ పొంగిపోయాడు అసిస్టెంట్ డైరెక్టర్.‘‘అసలా గిరిగాడ్ని వద్దనుకున్నానయ్యా! ఈసారి తీసుకోకూడదనుకున్నా! కాని జనరల్ మేనేజర్ రికమండేషన్! తప్పిందికాదు! అసలు పనికన్నా పట్టడం బాగా తెలుసాడికి! జనరల్ మేనేజరేంటి ఎండీలనే పట్టగలడు! అదీ ఆడి పని! స్కౌండ్రల్’’ అని గిరిని నోరారా తిట్టి- Challenge-18 episode-46-60‘‘పన్చూసుకో! పన్చూసుకో’’ అంటూ అసిస్టెంట్‌ని అక్కణ్నుంచి పంపేశాడు డైరక్టర్. పంపించేసి ‘ఎవరు దొరుకుతాడా’ అన్నట్లుగా గెద్ద చూపుచూశాడు. ఆ రాత్రి మందుకో స్పాన్సర్ కావాలి. వాడెక్కడున్నాడు? వెతుక్కుంటున్నాడు.కన్పించడాతనికి పోస్ట్‌మ్యాన్ వేషం వేసిన కుర్రాడు. డైరెక్టర్ కరుణా కటాక్షాలకోసం పడిగాపులు పడుతున్నట్లుగా నిరీక్షిస్తున్నాడు.‘‘రారా’’ కేకేశాడు డైరెక్టర్. దగ్గరగా వచ్చాడా కుర్రాడు.పోస్ట్‌మ్యాన్ వేషం అని బాధపడకు! హీరోక్కూడా లేవు! అలా నీకు క్లోజ్‌లు తీశాను.’’‘‘థ్యాంక్యూ సార్.’’‘‘వస్తావు! పైకొస్తావు! అనుమానం లేదు’’ అని తర్వాత మీ ఇల్లెక్కడ అడిగాడు డైరెక్టర్.‘‘అమీర్‌పేట అవతల్సార్’’‘‘గోల్డెన్ కేవ్ బార్ అండ్ రెస్టారెంట్ దాటిన తర్వాతా?’’‘‘అవున్సార్’’‘‘పద!నన్నక్కడ డ్రాప్ చేద్దువుగాని’’‘‘విత్ ప్లెజర్ సార్’’ డైరెక్టర్‌ని తీసుకొని కుర్రాడు తన బైక్ దగ్గరగా నడిచాడు.--------------------------రాత్రి పదిన్నరయింది. అప్పటికో రౌండు మందు పూర్తయింది. స్కాచ్ విస్కీ! చికెన్ కర్రీ! ‘బాగుంది!బాగుంది’ అనుకున్నారు పండా, గిరి. రౌడీలు టీపాయ్ దగ్గరగా కూర్చుని మందు, సోడా మిక్స్ చేస్తున్నారు. చంకరం గాడు సర్వ్ చేస్తున్నాడు. శకుంతల ఎదురుగా సోపాలో కూర్చుని కబుర్లు చెబుతోంది.‘‘కంపెనీకి వచ్చిందంటే వచ్చింది కానీ, లక్ష్మీ మనసంతా యాక్టింగ్ మీదే వుంది. ఎలాగైనా తనో మంచి సినిమా యాక్టరయిపోవాల! అయిపోతుంది తను. నేను చెప్పేశాను! మరందుకు నువ్వు హెల్పింగ్ చెయ్యాల.’’‘‘ముందా లక్ష్మిని చూపించు’’ అడిగాడు గిరి.‘‘వస్తాదొస్తాది!అన్నం తింటోంది’’ అంది శకుంతల.‘‘ఫుల్‌గా తిండెట్టి మా మీదకి తోల్దామనా’’నవ్వాడు గిరి.‘‘మనమూ గుర్రం ఎక్కి వున్నాం కదా గురూ! ఏం ఫర్వాలేదు’’ అన్నాడు పండా.‘‘తల్లి లేదు! తండ్రి ఇంట్లోంచి పారిపోనాడు! ఉన్న ఒక్కగానొక్క అన్నదమ్ముడి మాటా వినకుండా మన వెంటొచ్చేసింది. గొర్రె కసాయిని నమ్మేసినట్లుగా నన్ను నమ్మేసింది’’ లక్ష్మి గురించి మరిన్ని వివరాలు చెప్పింది శకుంతల.రెండో రౌండు ప్రారంభించారు గిరి, పండా.‘‘నాటకాలు, సినిమాలంటే దానికెంత పిచ్చో! అద్దంలో తనని తాను చూసుకున్నట్లుగా తెరమీద తనని తాను చూసేసుకోవాల! ఆ పిచ్చిలో వుంది లక్ష్మి’’‘‘ఆ పిచ్చి వుండబట్టే ఇక్కడ తేలింది! లేకపోతే ఇక్కడెందుకు తేలుద్ది’’ త్రేన్చాడు గిరి.‘‘కబుర్లాపు శకుంతల కబుర్లాపు!! కథలోకి రా! ముందా లక్ష్మిని చూపించు’’ విసుక్కున్నాడు పండా.‘‘వత్తాది! ఎందుకంత తొందర’’కల్పించుకున్నాడు చంకరం.‘‘పదకొండవుతోందిరా! లక్ష్మినెప్పుడు చూస్తాం! ఇంటికెప్పుడు వెళ్తాం! అదే మూడ్‌తో అరిచాడు పండా.సరిగ్గా అప్పుడక్కడికి లక్ష్మి వచ్చింది. లక్ష్మి రాకతో అప్పుడక్కడ వెయ్యి వోల్టుల బల్బు వెలిగినట్టయింది. జిగ్‌జిగేల్ మంది అందరికీ.ఆ కాంతిని తట్టుకోలేకపోతున్నట్లుగా కళ్లకి చేతిని అడ్డుపెట్టుకొని -‘‘ల...లక్ష్మి అంటే ఈ అమ్మాయేనా’’అడిగాడు పండా.‘‘ఈ అమ్మాయే! అనుమానంలేదు’’ లక్ష్మిని నఖశిఖపర్యంతం గమనించాడు గిరి.‘‘ఓకే! నీకు వేషం ఓకే!! కమాన్’’ అంటూ లేచి, లక్ష్మిని దగ్గరగా తీసుకోబోయాడు గిరి. అడ్డుపడింది శకుంతల.‘‘వద్దు గిరి బాబూ లక్ష్మినేం చెయ్యొద్దు’’‘‘ఏం చెయ్యకుండా వేషం ఎలా వస్తాది’’ అడిగాడు గిరి.‘‘నువ్వు తలచుకుంటే వస్తాది! అందుకే నిన్ను పిలిపించాను!’’ అని లక్ష్మిని తన దగ్గరగా తీసుకొని-‘‘ఇది పావురాయి బాబూ! ఈ పావురాయి నీకెందుకు! నువ్వు మెచ్చిన నాటు కోళ్లు నాలుగైదున్నాయి కంపెనీలో. చెప్పు ఏది కావాలో!చంకరం తీసుకొస్తాడు’’ అంది శకుంతల.‘‘ఈ కంపెనీలో ఇలాంటి సెంటిమెంట్లు కూడా వున్నాయా’’ ఆశ్చర్యపోయాడు పండా.‘‘సెంటిమెంట్లు కాదు పండా! ఏదో తెలియని అభిమానం! లక్ష్మిని ఏం చెయ్యొద్దు! ప్లీజ్! చూసి వెళ్లిపోండి! అసలు మిమ్మల్నిందుకే నేను పిలిపించింది’’ చెప్పింది శకుంతల.‘‘సరికొత్త గుంటని చెప్పమన్నావ్! మీ సైడ్ గుంటేనన్నావ్’’‘‘అవును బాబూ! అన్నాను! అయన్ని ఎందుకన్నానంటే గిరిబాబు ఇక్కడికి రావాలని అన్నాను! అంతేకాని ఇంకోలా అర్థం చేసుకోకండి’’ బతిమాలాడింది శకుంతల.‘‘ఈ పిల్ల అక్షింతల్లాంటిది. దగ్గరగా తీసుకొన్నామంటే ఆశీర్వదించాలి తప్ప నోట్లో వేసుకొని తినకూడదు’’అంది.‘‘కావాలంటే కబుర్లాడండి!పక్కన కూర్చుని మందు కలపమంటే కలుపుతాది! అంతేకాని పక్క మీదకి రమ్మంటే మాత్రం తన్రాదు! ఒకవేళ తనొచ్చినా నేనొప్పుకోను’’ తేల్చేసింది శకుంతల.ఆ మాటకి మందంతా దిగిపోయి, మంచుబొమ్మల్లా నిల్చున్నారు గిరి, పండా.తన మీద ఎంత గురి? తను తలుచుకుంటే ఏమైనా చెయ్యగలడన్న నమ్మకం! కేవలం తననిక్కడకి రప్పించడం కోసం పాపం శకుంతల ఎన్ని అబద్ధాలాడింది? ఓకే! ఎడ్జస్ట్‌యిపోయాడు గిరి.‘‘అయితే లక్ష్మిని తెరమీద చూడాలంటావు’’అడిగాడు.‘‘అవును గిరి బాబూ! చూడాలి’’ అంది శకుంతల.‘‘ముందు బుల్లితెర మీద చూద్దువుగాని! తర్వాత పెద్ద తెరమీద. సెవెన్టీ ఎంఎంలో చూద్దువు గాని! పక్కా’’ అన్నాడు గిరి.లక్ష్మి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆ ఆనందంలో శకుంతల్ని గట్టిగా కౌగిలించుకుంది. చంకరం కూడా పెద్దగా నవ్వాడు. అయితే ఇప్పుడు వాడి నవ్వులో అసహ్యం లేదు.‘‘రేపే ఎంట్రీ! మంచి ఫోటోలు రెండు మూడుంటే పట్టుకొని తిన్నగా ఛానెల్ ఎయిటీన్ ఆఫీసుకొచ్చేయ్! మిగిలింది నేను చూసుకొంటాను’’ లక్ష్మికి చెప్పేడు గిరి.‘‘మా బాబు! మా బాబే’’ గిరిని ముద్దుపెట్టుకొంది శకుంతల.‘‘రేపు మధ్యాహ్నం మూడు ఆ ప్రాంతంలో ఆఫీసుకిరా! షిఫ్టింగ్ టైం కాబట్టి, నేను ఆఫీసులోనే వుంటాను!’’ లక్ష్మితో అన్నాడు గిరి.‘‘ముందు జనరల్ మేనేజర్ చూస్తాడు! చూణ్నీ ఏమంటావు’’ అన్నట్లుగా శకుంతల్ని చూశాడు గిరి.‘‘దాందేముంది! చూణ్నీ బాబూ’’ అంది శకుంతల.‘‘చూస్తూ సొల్లుకార్చుకుంటాడే తప్ప ఆ జనరల్ మేనేజర్ వల్ల లక్ష్మికి వచ్చే ప్రమాదేమేమీ లేదు.’’ హామీ ఇచ్చాడు గిరి.‘‘చాలు బాబూ! చాలు’’ చేతులెత్తి దణ్ణం పెట్టింది శకుంతల.‘‘రేప్పొద్దుటికల్లా కోటిగాడు ఫోటోలు కూడా ఇస్తానన్నాడు’’ చెప్పింది శకుంతల.‘‘అప్పుడే కోటిగాడు రావడం-ఫోటోలు తియ్యడం, అది కూడా అయిపోయిందా’’ ఆశ్చర్యపోయాడు పండా.‘‘అక్క తలుచుకోవాలే గాని, తలుచుకుంటే పోటోలెంచేపు’’ చెప్పాడు చంకరం.అప్పటికే రాత్రి పదకొండయ్యింది. ఇంకా ఆలస్యం చేస్తే బాగోదని ఇంటికెళ్లే తొందర్లో నాటు కోళ్ల కోసం ఇటు గిరి, అటు పండా పరిగెత్తారు. వాళ్ల వెంట పరుగుదీసి ‘‘ఇదిగో నీ కోడి ఇక్కడుంది’’ అంటూ గిరికో కోడిని, పండాకో కోడినీ అందజేసి ఆయాసపడుతూ కూర్చుంది శకుంతల.----------------------తెల్లారింది.ఉదయం అయింది.మధ్యాహ్నం అయింది.మధ్యాహ్నం రెండయ్యింది.మధ్యాహ్నం మూడు గంటలకల్లా ‘ఛానెల్18’లో ఫోటోలతో పాటుగా లక్ష్మి వుండాలి. అందుకని, కోటి తీసిన తన ఫోటోలు పట్టుకొని శకుంతలను తోడు తీసుకొని మధ్యాహ్నం రెండు గంటలకే ఆటోలో కూర్చుని ప్రయాణిస్తోంది లక్ష్మి.‘‘ఫోటోలు చాలా బాగా తీశాడు’’ మెచ్చుకుంది లక్ష్మి.‘‘ఆడికాడ వున్న గొప్ప విద్య అదొక్కటే! దాంతోనే ఆడు కోట్లు సంపాదించేస్తున్నాడు’’ నవ్వింది శకుంతల.‘‘ఇప్పుడు నన్ను జనరల్ మేనేజర్‌గారు చూసి ఏం చేస్తారు’’‘‘సెలెక్ట్ చేస్తారు’’‘‘దేనికి’’‘‘దేనికో దానికి! ఏదో సీరియల్లో ఓ వేషమైతే గ్యారంటీ’’‘‘చాలు! ఆ ఒక్క అవకాశం ఇస్తే చాలు! రెచ్చిపోతాను’’ నమ్మకంగా చెప్పింది లక్ష్మి.‘‘షారూక్‌ఖాన్, విద్యాబాలన్ వీళ్లంతా ముందు టివి ఆర్టిస్టులే! తర్వాత.... ఇప్పుడు చూడు! సినిమాల్లో ఎంత పెద్దాళ్లయిపోయారో! వేషం ఎక్కడైనా ఒకటే! కలిసిరావాలి’’ చెప్పింది శకుంతల.‘‘అవునవును’’ అంటూ చేతిలోని తన ఫోటోల్ని చూడసాగింది లక్ష్మి. ఇప్పటికా ఫోటోలు లక్ష్మి చూడ్డం ఇది వందోసారి అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.--------------------సికింద్రాబాద్‌లో రైలు దిగి, ఆటోలో వస్తున్నారు ప్రసాద్, కృష్ణారావులు. కృష్ణారావు వొళ్లో సూట్‌కేసు వుంది. ప్రసాద్ చేతిలో వాటర్ బాటిల్ వుంది.రైలు దిగి ఆటో స్టాండ్ దగ్గరకొచ్చి-‘‘వైజాగ్ శకుంతల! కృష్ణానగర్’’ అన్నారంతే! ఆటోవాలా కృష్ణారావుని, ప్రసాద్‌ని ఎగాదిగా చూసి-‘‘ఎందుకయ్యా అంత గట్టిగా అరుస్తారు! మెల్లగా చెప్పొచ్చు కదా! పోలీసులు వింటే లేనిపోని గొడవ’’ అని‘‘ఎక్కండి’’ అని ఆటో ఎక్కించుకుని వాళ్లని తీసుకొస్తున్నాడు. ఒకటి రెండు ఫ్లై ఓవర్లు దాటింది ఆటో.‘‘ఇంకా ఎంత దూరం బాబూ’’ అడిగాడు కృష్ణారావు.‘‘శానా దూరం! నేను తీసుకెళతాను కదా! మీ సంగతి నాకొదిలేయండి’’ చెప్పాడు ఆటోవాలా.‘‘శకుంతల పచ్చడి పచ్చడి అయిపోవాలి’’ కసితో వున్నాడు కృష్ణారావు.‘‘చూస్తారు కదా! నేనేంటో! నా సత్తాయేంటో’’ చెప్పేడు ప్రసాద్.పిచ్చనాకొడుకులు! పట్టపగలు కూడా అదే ఆలోచన! ఇలాంటోళ్లు.... ఆటోవాలాకి ప్రసాద్, కృష్ణారావుల మీద కోపంగా వుంది. స్పీడు పెంచి ఆటోని పోనిచ్చాడు.ఏదో సెంటర్-స్పీడుగా వస్తోన్న ఆటో సడెన్ బ్రేకుతో ఆగింది.‘‘ఎందుకాపావు’’ అడిగాడు కృష్ణారావు.‘‘సిగ్నల్ పడింది! చూడండి’’ చూపించాడు ఆటోవాలా.రెడ్‌లైట్ వెలుగుతోందక్కడ. ఎదురు బొదురు వాహనాలన్నీ ఆగిపోయాయి. రెడ్ లైట్ మీంచి చూపు మరల్చి అప్రయత్నంగా అటుగా చూశాడు కృష్ణారావు.అలా చూసిన కృష్ణారావుకి ఎదురుగా ఆటోలో-వస్తాదులాంటి ఆడదానితో తన చెల్లి లక్ష్మి.... లక్ష్మి కనిపించింది. అంతే!‘‘ప్రసాద్’’ అంటూ కేకేశాడు. ‘ఏంటన్నట్లు’గా చూసిన ప్రసాద్‌కి ఎదురు ఆటోలో లక్ష్మిని చూపించాడు కృష్ణారావు దాంతో-‘‘లక్ష్మీ’’ అని కేకవేస్తూ కృష్ణారావుతో పాటుగా ఆటోలోంచి దూకి, అతనితో పాటుగా ప్రసాద్ పరుగుదీఽశాడో లేదో-గ్రీన్ సిగ్నల్ పడింది.వాహన ప్రవాహం ఒక్కసారిగా వేగాన్ని పుంజుకుంది.చూస్తుండగానే లక్ష్మి కూర్చున్న ఆటో ఇటు తిరిగి స్పీడుగా వెళ్లిపోతోంది. దాని వెంట పరుగుదీశారు ప్రసాద్, కృష్ణారావులు.కోటిగాడు తీసిన తన ఫోటోలను ఒక్కొక్కటిగా చూస్తూ ఆటోలో మురిసిపోతోంది లక్ష్మి. ఆవలింతలేసి అటుగా వొరిగి కళ్లు మూసుకుంది శకుంతల. ఇద్దరికిద్దరూ ఎవర్ని పట్టించుకోవట్లేదు. ఏదీ వినిపించుకోవట్లేదు. వినిపించుకుంటే ‘లక్ష్మీ!లక్ష్మీ!’ అన్న ప్రసాద్, కృష్ణారావుల కేకలు వాళ్లకి వినిపించేవి.అటూ ఇటూ ఎడాపెడా వాహనాలు. పెద్దగా హారన్ శబ్దాలు...రొద.. ఆ రొదలో ‘లక్ష్మీ!లక్ష్మీ!’ అన్న ప్రసాద్, కృష్ణారావుల కేకలు కలిసిపోతున్నాయి. అందువల్ల కూడా ఆ కేకలు లక్ష్మీ, శకుంతలకి వినిపించలేదు. పరుగుదీస్తోన్న కృష్ణారావుకి చేతిలోని సూట్‌కేస్ ఇబ్బంది అనిపించింది. దాంతో సూట్‌కేస్‌ని వదిలి మరింతగా పరుగుందుకున్నాడతను. ప్రసాద్‌ని దాటి పరుగుదీశాడు.అదిగో అల్లంత దూరంలో లక్ష్మీ వాళ్లున్న ఆటో.ఇదిగో ఇక్కడ పరుగుదీస్తూ ప్రసాద్, కృష్ణారావులు.ఏదో బైక్‌కి అడ్డొచ్చాడు కృష్ణారావు. క్షణంలో ప్రమాదం జరిగేదే! కాని సడన్ బ్రేక్‌తో ఆగింది బైక్.‘‘ఏయ్’’ కృష్ణారావుని కసురుకున్నాడు బైక్ మీది వ్యక్తి.‘‘తప్పయిపోయిందిసార్’’ చెప్పాడు కృష్ణారావు. ఆ మాట కూడా కృష్ణారావు పరుగుదీస్తూనే చెప్పాడు. బైక్‌ని పోనివ్వబోతోంటే ఈసారి ప్రసాద్ అడ్డొచ్చాడు.‘‘ఏయ్’’ తీవ్రంగా కసిరాడు బైక్ మీది వ్యక్తి.‘‘సారీ’’ సింపుల్‌గా చెప్పి ప్రసాద్ పరుగుదీశాడు.లక్ష్మీ వాళ్ల ఆటో మలుపు తిరిగింది. వెంబడించి వచ్చిన కృష్ణారావుకి మలుపు తిరిగిన ఆటో కనిపించలేదు. లక్ష్మీ వాళ్ల ఆటో వెనక భాగంలో ‘‘ఏసు మనల్ని రక్షించును’’ అని రాసి వుంది. అది గుర్తు కృష్ణారావుకి. ఇప్పుడలా రాసి వున్న ఆటో ఏదీ? ఎక్కడ? కన్పించడంలేదు.-కృష్ణారావు గగ్గోలయిపోయాడు.అటా? ఇటా? ఎటూ? ఎటుపోయిందా ఆటో?-పిచ్చెత్తిపోతున్నాడు కృష్ణారావు. కుడిచేతిని పిడికిలి చేసి ఎడమచేతిలో అసహనంగా కొట్టుకున్నాడు. తర్వాత ఏం చెయ్యాలో పాలుపోక వెర్రిచూపులు చూడసాగాడు.ఎటు పరిగెత్తాలిప్పుడు? కుడివైపున వున్న ఈ సిమెంట్ రోడ్డు వైపా? లేకపోతే ఎడమ వైపున వున్న ఆ తారు రోడ్డు వైపా? లేదంటే ఎదురుగా వున్న మట్టిరోడ్డు మీదికా? ఎటు? ఎటు పరిగెత్తాలి? ఎటు పరిగెడితే లక్ష్మి దొరుతుంది.దేవుడా! దేవుడా!!-జుత్తు పీక్కున్నాడు కృష్ణారావు.ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఇటు ఈ తారు రోడ్డునే నమ్ముకుందాం. ఇటే పరుగెడతాం. ఇటు... ఇటు...పరిగెడితేనే లక్ష్మి దొరుకుతుంది. దొరుకుతుందనుకుంటూ పరుగుతీశాడు కృష్ణారావు. ఇలా అతను పరుగుతీశాడో లేదో అలా అటు నుంచి కారొకటి వచ్చి కృష్ణారావును‘ఢీ’ కొంది.‘అమ్మా’ అని అరవలేదు కృష్ణారావు. ‘లక్ష్మీ’ అంటూ కిందపడిపోయాడు. సరిగ్గా అక్కడికి అప్పుడొచ్చాడు ప్రసాద్.కారు చక్రం కింద గిలగిలా కొట్టుకుంటున్నాడు కృష్ణారావు. పళ్ల బిగువున బాధని అణచుకుంటూ ‘ఆ...ఆ’ అంటున్నాడు. కారు చుట్టూ జనం మూగారు.--------------------చేతిలోని ఫోటోల్ని ఎదురుగా కూర్చున్న లక్ష్మిని మార్చి మార్చి చూసి-‘‘గుడ్!! బాగుందమ్మాయి!’’ అన్నాడు జనరల్ మేనేజర్. తన పక్కగా చేతులు కట్టుకొని నిల్చొన్న కో- డైరక్టర్ గిరితో. ఆ మాట చాలు అన్నట్టుగా పొంగిపోయాడు గిరి. శకుంతల, లక్ష్మీ ఆనందంగా ఒకర్నొకరు చూసుకొన్నారు.‘‘మీదేవూరు?’’ అడిగాడు మేనేజర్.చెప్పింది లక్ష్మి.‘‘మీకు నాటకానుభవం బాగా వుందటకదా’’ అడిగాడు మేనేజర్.అవునంది లక్ష్మీ.‘‘మరయితే యాంకర్‌గా ‘ట్రై’ చేస్తారా? యాక్టింగ్‌లో కంటిన్యూ అవుతారా?’’‘‘మీ ఇష్టం సార్! మీరు ఎలాగంటే అలాగే’’ చెప్పింది లక్ష్మి.‘‘యాక్టింగైతేనేం బెస్ట్’’ ఏమంటావ్ అన్నట్లుగా గిరిని చూశాడు మేనేజర్.‘‘అవున్సార్! మనకి ఆర్టిస్టులు చాలా అవసరం’’ చెప్పాడు గిరి.‘‘సరే మరి! మేకప్ టెస్ట్ చేసి చూడు’’ లక్ష్మిని వుద్దేశించి గిరికి చెప్పాడు మేనేజర్.‘‘ఓకే సార్’’ అని -‘‘రండమ్మా’’ అని లక్ష్మి, శకుంతల్ని తోడుకుని, జనరల్ మేనేజర్ రూంలోంచి బైటపడ్డాడు గిరి.ఇందాక వచ్చినప్పుడు పెద్దాగా పట్టించుకోలేదు గాని, ఇప్పుడు పరీక్షగా చూస్తుంటే ఛానెల్ 18 ఆఫీసు చాలా పెద్దదనిపించింది లక్ష్మికి. అసలక్కడి పద్ధతులే హైక్లాస్‌గా కనిపించాయి.ఆటో ఎక్కుతూ చానెల్ 18 అని చెప్పింది శకుంతల. అంతే ఆటోవాలా తీసుకొచ్చేశాడు. శకుంతలతోపాటుగా దిగుతూ చూసింది లక్ష్మి. అయిదంతస్తుల బిల్డింగ్. పెద్ద పెద్ద అక్షరాల్లో ‘ఛానెల్ 18’ అని బోర్డు.‘‘ఎవరు కావాలి?’’ మెట్లెక్కి వస్తోన్న లక్ష్మి శకుంతల. అడ్డుకున్నాడు సెక్యూరిటీ.‘‘గిరి! కో-డైరక్టర్ గిరి గారు కావాలి’’ చెప్పింది శకుంతల.‘‘ఇందులో అన్నీ వివరంగా రాయండి’’ విజిటర్స్ రిజిస్టర్ ముందుకి తోశాడు సెక్యూరిటీ.అన్ని వివరంగా రాసింది లక్ష్మి. అది చూసి, విజిటర్స్ పాస్ ఇస్తే, తీసుకొని లోపలకి వచ్చారు. అప్పటికే గిరి అక్కడున్నాడు.‘‘రండి...రండి’’ అని -‘‘నేనిందాకే జనరల్ మేనేజర్‌తో మాట్లాడాను! అవకాశం గ్యారంటీ! ఏం ఫర్వాలేదు’’ చెప్పాడు గిరి.ఆ ధైర్యంతోనే మేనేజర్ ముందు తొణక్కుండా బెణక్కుండా కూర్చుంది లక్ష్మి.‘‘సొల్లు కారుస్తాడన్నావ్! అదేం లేదే’’ జనరల్ మేనేజర్ని వుద్దేశించి గిరిని అడిగింది శకుంతల. ముగ్గురూ లిఫ్ట్‌లో వున్నారప్పుడు. మేకప్ టెస్ట్ కోసం అయిదో ఫ్లోర్‌కి వెళ్తున్నారు.‘‘లక్ష్మి ఒక్కర్తీ రూంలో వుంటే కార్చేవాడే! మనం కూడా వున్నాం కదా? దాంతో నోరు కట్టేసుకున్నాడు’’ నవ్వాడు గిరి.మూడో ఫ్లోర్‌లో ఆగింది లిఫ్ట్. తలుపులు తెరుచుకున్నాయి. లిఫ్ట్‌లోకి ‘చిన్నకోడలు’ సీరియల్ హీరోయిన్ వచ్చింది. ఆమెను విష్ చేశాడు గిరి.‘‘ఏం చేస్తున్నారిప్పుడు’’ గిరిని అడిగిందామె.‘‘క్రైం టైం చేస్తున్నాను మేడం’’ చెప్పాడు గిరి.‘‘డైరెక్టర్ ఎవరు?’’ అడిగిందామె.చెప్పాడు గిరి.‘‘ఆయన్తో చాలా కష్టం. సెల్ఫ్‌డెసిషన్ లేదు. కట్ చెప్పి, ఓకేనా అని మనల్ని అడుగుతాడు’’ నవ్విందామె.లక్ష్మీ ఆమెనే గమనిస్తోంది. నిజంగా అందంగా వుందామె. మంచి వాసన వేస్తోంది.నాలుగో ఫ్లోర్లో ఆగింది లిఫ్ట్. తలుపులు తెరుచుకున్నాయి.‘‘మళ్లీ కలుద్దాం’’ అని గిరికి చెప్పి వెళ్లిపోయింది హీరోయిన్. తలుపులు మూసుకున్నాయి. లిఫ్ట్ అయిదో ఫ్లోర్‌కి ప్రయాణిస్తోంది.‘‘మనం అంటే మేడంకి మంచి గురి’’ వెళ్లిపోయిన హీరోయిన్ని వుద్దేశించి చెప్పాడు గిరి.‘‘నువ్వంటే ఎవరికి గురి లేదు’’ అడిగింది శకుంతల.‘‘నువ్వు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలవు’’ అంది మళ్లీ.‘‘ములగచెట్టు ఎక్కించకు’’ నవ్వాడు గిరి.‘‘లేదు గిరి బాబు! నేను నిజమే చెపుతున్నాను! నువ్వు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలవు! ఇందులో అబద్ధం ఏమీ లేదు. మా లక్ష్మిని హీరోయిన్ని చెయ్యి బాబూ! చచ్చి నీ కడుపున పుడతాను’’ అంది శకుంతల.‘‘లక్ష్మిని హీరోయిన్ని చేస్తాను గాని- నువ్వు- నువ్వు మాత్రం నా కడుపున పుట్టకు’’ పగలబడి నవ్వాడు గిరి. లిఫ్ట్ అయిదో ఫ్లోర్‌కి చేరుకుంది.పెద్ద పెద్ద అద్దాలు, కుర్చీలు, మేకప్ సామాగ్రి, మేకప్ మాన్ - చాలా హడావుడిగా వుందా ఫ్లోర్‌ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్‌లో వున్నాడు కృష్ణారావు. ప్రాణానికయితే ప్రమాదం లేదు కాని అతనికేమయిందీ అంతుచిక్కడం లేదు.ఆసుపత్రి బయట చెట్టునానుకుని దీనంగా నిల్చున్నాడు ప్రసాద్. అతని దగ్గర కృష్ణారావు సూట్‌కేస్ వుంది. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదతనికి.ప్రసాద్‌కి కాస్తంత దూరంగా పూజ నిల్చుని వుంది.పూజకి పదిహేడేళ్లుంటాయి. అందంగా వుంది. జీన్స్ ఫ్యాంట్, షర్టు వేసుకుని మోడరన్‌గా వుంది. మోడరన్‌గా వుందన్న మాటే గాని, మెత్తగా మాట్లాడడం లేదామె. గట్టిగా అరుస్తోంది. ఎదురుగా వున్న ప్యూన్‌లాంటి వ్యక్తితో -‘‘నువ్వేం చేస్తావో నాకు తెలీదు! అర్జంట్‌గా వన్ లాక్-లక్ష కావాలి! మా మమ్మీని అడుగుతావో, డాడీని అడుగుతావో నాకు తెలీదు. వెళ్లి విషయం అంతా వివరంగా చెప్పి డబ్బు తీసుకురా’’‘‘ఆల్రెడీ అమ్మగారితో మాట్లాడానమ్మా!!’’‘‘మమ్మీ ఏమంది?’’‘‘ఆసుపత్రిలో జాయిన్చేశారు కదా! చాలు! వచ్చేయమన్నారు’’ఆ మాటలకి ఆశ్చర్యపోయింది పూజ.‘‘యాక్సిడెంట్ చేసి, ఆసుపత్రిలో జాయిన్ చేస్తే అయిపోయిందా? నో నో? నేనొప్పుకోను! తప్పుచేశాను! దాన్ని సరిదిద్దాకోవాలి! ముందు నువ్వెళ్లి డబ్బు తీసుకునిరా’’కదలకుండా చేతులు నలుపుకుంటూ నిల్చున్న ప్యూన్‌లాంటి వ్యక్తితో ‘‘నీకే చెపుతోంది! వెళ్లు’’ కసిరింది పూజ.కదిలాడతను.లక్ష్మి కోసం పరుగుతీసిన కృష్ణారావును కారుతో ఢీకొన్నది పూజే! యాక్సిడెంట్ చేసినా పలుకుబడి, పరపతీ వుంది కాబట్టి తప్పించుకోవచ్చు. కానీ పూజకది ఇష్టం లేదు.చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో కృష్ణారావుని ఆసుపత్రికి తీసుకొచ్చింది. ఆపరేషన్ అంటే అందుకు అన్ని విధాలా సహకరిస్తోంది.చెట్టునానుకొని దీనంగా నిల్చున్న ప్రసాద్ దగ్గరగా వచ్చింది పూజ.‘‘కృష్ణారావుగారికేం కాదండి! మీరు కంగారు పడకండి’’ చెప్పింది పూజ.‘‘అన్నింటికీ నేనున్నాను! ఆ ధైర్యంతో మీరుండండి’’ అంది మళ్లీ. ఇంకా దీనంగా చూస్తోన్న ప్రసాద్‌తో-‘‘నా మీద మీకు నమ్మకం లేదా’’ ప్రాధేయపూర్వకంగా అడిగింది.‘‘అది కాదండి...’’ అని ఏదో ప్రసాద్ చెప్పబోతోంటే-‘‘నన్ను నమ్మండీ!ప్లీజ్’’ అంది పూజ. బాధగా కళ్లు చెమర్చుకుంది.----------------------‘‘గుండెలు ఎత్తుగా బాగానే వున్నాయి! పేడింగ్స్ అక్కర్లేదు’’ అంటూ చనువుగా లక్ష్మి గుండెల మీద చెయ్యి వేశాడు మేకప్‌మాన్.‘‘పద్ధతి కాదండీ! ప్లీజ్! పైగా నేనలాంటిదాన్ని కాదండి’’ బ్రతిమాలడుతున్నట్లుగా అంది లక్ష్మి. ఆ మాటకి పగలబడి నవ్వుతూ-‘‘శకుంతల్తో వచ్చి నేనలాంటిదాన్ని కాదంటే ఎవరు నమ్ముతారు! వూరుకో’’ అని ఆమె గుండెల్లో ముఖాన్ని వుంచబోయాడు.మీద పడుతోన్న మేకప్‌మాన్ ముఖాన్ని కుడిచేత్తో బలంగా అడ్డుకుని వెనక్కి నెట్టి, దిగ్గున లేచి నిల్చుంది లక్ష్మి. కోపంగా చూసిందతన్ని, దానికతను నవ్వుతూ-‘‘దీనికే నువ్వు నన్ను కాదంటే-నువ్వేం పైకొస్తావ్! రావు! నిన్ను రానివ్వను’’ అని ఆవేశంగా అక్కడున్న కొబ్బరినూనెని చేతిలో పోసుకొని, రబ్‌చేసి రెండుచేతులకీ ఆ నూనెని పూసుకుని, ఆ చేతుల్ని లక్ష్మి ముఖం మీద వుంచి, ఆమెకు చేసిన మేకప్‌ని చెరిపేశాడు.క్షణం క్రితం మేకప్ పూర్తయి అద్దంలో చూసుకుంటే అప్సరసలా వుంది లక్ష్మి. ఆమాటే అన్నాడు గిరి.‘‘నా బంగారం’’ అని ముద్దుపెట్టుకుంది శకుంతల.ఇప్పుడుకెమెరామాన్‌ని పిలుచుకొస్తానని శకుంతలతో పాటు గిరి వెళ్లగానే జరిగిందేమిటి?అందం అంతా పోయింది.అప్సరస కరిగిపోయింది.కన్నీళ్లు... కన్నీళ్లు మిగిలాయి... ‘గొల్లు’మంది లక్ష్మి.ఆసుపత్రిలో- ఆపరేషన్ థియేటర్‌కి కాస్తంత దూరంలో వున్న వరుస కుర్చీలలో ఓ కుర్చీలో కూర్చుని వున్నాడు ప్రసాద్. నీరసమో, నిద్రో తెలీదు. కళ్లు మూసుకొని వున్నాడతను. అతని కాళ్ల దగ్గరగా కృష్ణారావు సూట్‌కేసుంది.థియేటర్లో కృష్ణారావుకి ఆపరేషన్ అవుతోంది. కారు కిందపడి అతని కాలొకటి నుజ్జునుజ్జయి పోయింది. ఆ కాలుని వుంచే ప్రయత్నాలు చేసే కన్నా తొలగించడమే మంచిదనిపించి, దాన్ని తొలగిస్తున్నారు డాక్టర్లు.ప్రసాద్ కూర్చున్న స్థలానికి కొద్దిపాటి దూరంలో మదర్ థెరిసా ఫోటో దగ్గరగా నిల్చుని వుండి సెల్‌లో మాట్లాడుతోంది పూజ. ఇప్పుడామె అరవడం లేదు. మెత్తగా మాట్లాడుతోంది.‘‘థ్యాంక్యూ డాడీ! థ్యాంక్యూ వెరీమచ్’’‘‘దేనికమ్మా ఇదంతా’’ అట్నుంచి ఫోన్లో పూజ తండ్రి ప్రశ్నించాడు.‘‘అడిగిన వెంటనే వన్‌లాక్ పంపించినందుకు’’‘‘అన్నట్లు! ఇప్పుడాయనకి ఎలా వుంది? ఆపరేషన్ అయిపోయిందా? లేదా?’’‘‘ఆపరేషన్ జరుగుతోంది డాడీ! పాపం కాలు తీసేస్తున్నారు’’. పూజ గొంతు బొంగురుపోయింది.‘‘అవును! అదే నాకు బాధగా వుంది’’‘‘మీరు ఆస్పత్రికి వస్తారా డాడీ’’‘‘వస్తానమ్మా! తప్పకుండా వస్తాను! ఇదిగో ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే బయల్దేరొస్తాను’’ చెప్పాడు తండ్రి.ఆయనేదో మీటింగ్‌లో వున్నాడు మరి!‘‘మీరొచ్చేదాకా నేనిక్కడే వుంటాను డాడీ! ఆస్పత్రిలోనే వుంటాను’’‘‘సరేనమ్మా’’‘‘బై’’ అని సెల్ ఆఫ్ చేసి, ఎదురుగా వున్న ప్యూన్‌లాంటి వ్యక్తితో -‘‘నేనిందాక నీ మీద అనవసరంగా అరిచాను! ఐ యాం వెరీ సారీ’’ చెప్పింది పూజ.‘‘పర్వాలేదు మేడం’’ సన్నగా నవ్వాడా వ్యక్తి.‘‘ఇలా ఇలా జరిగిందని చెప్పగానే డాడీ ఏమన్నారు’’‘‘ఏమనలేదు మేడం!పూజకి ఎంత కావాలట? అనడిగారంతే! లక్ష కావాలన్నాను. ఇచ్చేశారు. పట్టుకొచ్చాను’’‘‘దెన్నోకే’’ అని ఇటు తిరిగి, కళ్లు మూసుకొని కుర్చీలో కూర్చున్న ప్రసాద్‌ని చూసి-‘‘సరే నేను ప్రసాద్‌గారి దగ్గరుంటాను’’ అని అతనితో చెప్పి ప్రసాద్‌ని కలిసేందుకన్నట్టుగా ముందుకు నడిచింది పూజ.ఎవరో వచ్చి ఎదురుగా నిల్చున్న అలికిడికి కళ్లు తెరిచి చూశాడు ప్రసాద్. పూజ! లేచినిల్చున్నాడతను.‘‘బాగా నీరసంగా వున్నట్లున్నారు! జ్యూసేమన్నా తాగుతారా? క్యాంటీన్‌కెళ్దాం’’ అడిగింది పూజ.‘‘వద్దండి’’ చెప్పాడు ప్రసాద్.‘‘మా డాడీతో మాట్లాడాను! కాస్సేపట్లో ఆయనిక్కడకి వస్తున్నారు! మీకేం కాదు! మేము న్నాం.’’ ఏదో చెప్పాలనుకుని ఇంకేదో మాట్లాడుతోంది పూజ.‘‘ఆస్పత్రి ఖర్చంతా మేమే భరిస్తాం! తర్వాత...తర్వాత కృష్ణారావు గారు కోలుకునేంత వరకూ మీరు మా దగ్గరే వుండొచ్చు. ఆ తర్వాత....’’ అంటూ పూజ ఇంకేదో చెప్పబోతోంటే అడ్డుకుంటూ-‘‘ముందాపరేషన్ కానీయండి, తర్వాత సంగతి తర్వాత’’ అన్నాడు ప్రసాద్.‘‘ఓకే’’ పూజగొంతు బలహీనంగా పలికింది.-------------------‘‘ఏంటయ్యా! ఏంటి నువ్వు చేసిన పని? అసలు...అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావ్’’ అరుస్తూ కుర్చీలోంచి లేచాడు జనరల్ మేనేజర్.చేసిన తప్పుకి తలదించుకుని, చేతులు కట్టుకుని వుండి మరీ తిట్లు తింటున్నాడు మేకప్ మాన్.అందం పోగొట్టుకున్న లక్ష్మి కరిగిపోయిన అప్సరస లక్ష్మి, కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే వుంది. ఆమెను ఓదారుస్తోంది శకుంతల. ‘వూర్కో!వూర్కో’అంటోందామె. మేకప్‌మాన్ మీద చాలా కోపంగా, గుర్రుగా వున్నాడు కో-డైరక్టర్ గిరి. వాడ్ని తినేసేలా చూస్తున్నాడతను.‘‘నిన్ను కాదంటే లక్ష్మి పైకి రాదా! ఏం పిచ్చ పిచ్చగా వుందా?’’ రెచ్చిపోయాడు మేనేజర్.తలెత్తలేదు మేకప్‌మాన్.‘‘ఏంటి? మాట్లాడవేంటి?’’ గట్టిగా అరిచాడు మళ్లీ.‘‘చేసిందానికి సారీ చెప్పు లక్ష్మికి సారీ చెప్పు’’ చెప్పాడు మేనేజర్.‘‘సారీ’’ లక్ష్మికి చెప్పాడు మేకప్‌మాన్.‘‘ఔట్!గెటౌట్’’అన్నాడు మేనేజర్. మేకప్‌మాన్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.‘‘ఇడియెట్’’ వెళ్లిపోయిన మేకప్‌మాన్‌ని వుద్దేశించి అని, టేబుల్ మీది మంచినీళ్ల గ్లాసందుకొని నీళ్లు తాగి, గ్లాసుని యథాస్థానంలో వుంచాడు మేనేజర్.‘‘చెత్త!చెత్త! ఈ ఫీల్డే చెత్త’’ తనకి తను చెప్పుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు మేనేజర్.‘‘ఇది ఆడంతట ఆడికి పుట్టిన బుద్ధి కాదండి! ఎవరో కావాలనే చేయించారు’’గిరి అందుకున్నాడు.‘‘మేకప్‌మాన్‌గా ఆడు నాలుగైదేళ్లుగా నాకు తెలుసు! ఎప్పుడూ ఇలాంటి పని చెయ్యలేదు. ఇప్పుడు చేశాడంటే- ఎవరో చేయించారు సర్’’ చెప్పాడు గిరి.ఎవరు చేయించి వుంటారు? ఆలోచనలో పడ్డాడు మేనేజర్. లక్ష్మి గుండెల మీద చెయ్యేసి, ఆమె మేకప్ చెరిపేసి, ‘నిన్ను పైకి రానివ్వను! రాలేవ్!’అని మేకప్‌మాన్ అన్నాడంటే ఏది చూసుకుని, ఎవరి దన్ను చూసుకొని ఇలా ప్రవర్తించాడు?! ఆఫీసులో... అదీ మధ్యాహ్నం...స్టాఫంతా వుంటారని తెలిసి కూడా అంతకు తెగించాడంటే వాడ్ని ఏమనుకోవాలి?కెమెరామాన్‌ని తీసుకొని గిరి, శకుంతల వస్తూ, లక్ష్మి మీద పడి, ఆమె మేకప్ చెరిపేస్తోన్న మేకప్‌మాన్‌ని అల్లంత దూరం నుంచి చూసి ఆశ్చర్యపోయారు.జరిగింది లక్ష్మి ద్వారా తెలుసుకొని అయోమయానికి గురయ్యారు. ‘ఏం చేద్దాం! ఏం చేద్దాం’ అనుకుంటూనే మేకప్‌మాన్‌ని పట్టుకుని, ఏడుస్తోన్న లక్ష్మిని తోడుకుని జనరల్ మేనేజర్ దగ్గరకొచ్చారు. కెమెరామాన్‌కి ఈ గొడవలో దూరటం ఇష్టం లేదట! రూంలోనికి రానంటూ అతను బైటే వుండిపోయాడు.శకుంతల, గిరీ చెప్పిందంతా గుర్తు చేసుకున్నాడు మేనేజర్. ఎక్కడా ఏ ‘క్లూ’ దొరకలేదు. మేకప్‌మాన్‌కి పుట్టిన బుద్ధికాకుండా, మేకప్‌మాన్‌కి ఎవరో పుట్టించిన బుద్ధంటూ గిరికెందుకొచ్చిందీ అనుమానం? అదే గిరిని అడిగాడు మేనేజర్.‘‘అంటే అతను నాకు నాలుగైదేళ్లుగా తెలుసు కాబట్టి....’’అంటూ నీళ్లు నమిలాడుగిరి.‘‘ఇదిగో! నువ్వలా నీళ్లు నమలొద్దు! నీకు ఎవరిమీదనైనా అనుమానం వుంటే చెప్పు! వాళ్ల సంగతి నేను చూస్తాను’’‘‘నాకెవరి మీద అనుమానం లేదండి’’‘‘లేకపోతే నీకెందుకొచ్చిందా అనుమానం’’ నిగ్గదీశాడు.‘‘అదీ..అదీ...అని గిరి చెప్పడానికి సంకోచిస్తుండగానే, టేబుల్ మీది ఫోన్ మోగింది. అందుకుని-‘‘హలో’’అన్నాడు మేనేజర్.‘‘నేన్సార్’’ అట్నుంచి ‘చిన్నకోడలు’ హీరోయిన్. ఫోన్లో మాట్లాడుతోంది.‘‘చెప్పమ్మా’’‘‘ఏంటా పిల్లకి అంత పొగరు’’ కోపంగా అంది హీరోయిన్.‘‘ఏ పిల్లకి’’‘‘ఇందాక లిఫ్ట్‌లో చూశాన్లెండి, ఆ శకుంతల, గిరితోనూ వుందా పిల్ల’’‘‘ఎవరు? లక్ష్మి’’‘‘అవును! దానికే! హీరోయిన్ని చూడగానే దణ్నం పెట్టాలని తెలీదా?’’‘‘తెలీదు! కొత్త పిల్లకదా’’ అన్నాడు మేనేజర్.‘‘చెప్పండి మరి’’ అని ఫోన్ పెట్టేసింది హీరోయిన్.దాంతో మబ్బులన్నీ విడిపోయాయి. లక్ష్మిని ఎవరు అల్లరి చేయించారో, మేకప్‌మాన్ ఎందుకలా ప్రవర్తించాడో ఇట్టే అర్థమయిపోయింది మేనేజర్‌కి.‘చిన్నకోడలు’ హీరోయిన్, ఛానెల్ 18 ఛైర్మన్‌గారికి దూరపు బంధువు. మెగా సీరియల్స్ అన్నింటిలోనూ ఆమె హీరోయిన్. ఆవిడకందరూ అణకువగా వుండాలి. లేదంటే గొడవే! ఇప్పుడీ గొడవకి ఆమే కారణం!‘‘ఏమ్మా! కొంచెం పెద్దల్ని గౌరవించడం నేర్చుకో! చిన్నకోడలు హీరోయిన్ ఇందాక లిఫ్ట్‌లో కనిపించిందట కదా’’ లక్ష్మిని అడిగాడు మేనేజర్.‘‘అవునండీ’’చెప్పింది లక్ష్మి.‘‘మరి దణ్ణం పెట్టావా?’’‘‘లేదండి’’‘‘లేకపోతే ఎలా? పెద్దవాళ్లు కనిపిస్తే దణ్ణం పెట్టాలి!సరే! ఇప్పుడైనా వెళ్లి దణ్ణం పెట్టు’’‘‘సరేనండి’’‘‘తీసుకెళ్లవయ్యా! లక్ష్మిని హీరోయిన్ దగ్గరకి తీసుకెళ్లు!తనామెకి దణ్ణం పెట్టాక మళ్లీ మేకప్ అదీ చేయించి, షూట్చెయ్’’ అని గిరికి చెప్పి, మంచి నీళ్లు తాగుదామనుకుని టేబుల్ మీది గ్లాసందుకుని, అందులో నీళ్లు లేకపోవడంతో ‘బోయ్’ అంటూ చిరాగ్గా కేకేశాడు మేనేజర్. ఆ చిరాకుని అర్థం చేసుకున్నాడేమో-‘‘రండమ్మా’’అంటూ శకుంతలని, లక్ష్మిని తోడుకుని రూం బైటికొచ్చాడు గిరి.అసలేంటిదంతా?అర్థం అయ్యీ కాకుండా వుంది లక్ష్మికిఅసలు కథ ఇదన్నమాట!శకుంతలకి పూర్తిగా అర్థం అయిందంతా.‘‘అయితే ఈ గొడవంతటికీ కారణం ఆ హీరోయిన్నేన్నమాట అంది శకుంతల.‘‘ఏ హీరోయిన్?’’ అడిగాడు గిరి.‘‘ఇంకే హీరోయిన్? చిన్నకోడలు హీరోయిన్’’‘‘అర్థం అయింది కదా! పదండి’’ అన్నాడు గిరి.ముగ్గురూ నడుస్తున్నారు.తను దణ్ణం పెట్టలేదని, ఇంత రగడా? అసహ్యంగా లేదూ? అనుకుంది లక్ష్మి.కానీ, దీన్నొదలకూడదు! ఎప్పటికైనా బుద్ధి చెప్పాలి! కసిగా అనుకుంది లక్ష్మి.------------------------ఆపరేషన్ అయిపోయింది. కృష్ణారావు కాలు తొలగించేశారు. ఇంకా స్పృహలోకి రాలేదతను. అయినా కావాలంటే వెళ్లి చూడొచ్చన్నారు డాక్టర్లు. దాంతో కృష్ణారావుని చూడ్డానికి పూజతో పాటుగా వచ్చాడు ప్రసాద్.బెడ్ మీద కృష్ణారావు వాడిపోయి వున్నాడు. వేదనగా వున్నాడు. కదిపితే చాలు కన్నీటి పర్యంతం అయ్యేలా వున్నాడుచూసి తట్టుకోలేకపోయాడు ప్రసాద్. కాలు లేని కృష్ణారావుని చూస్తూ దుఃఖం ఆపుకోలేక ఒక్కసారిగా ‘భోరు’మన్నాడు ప్రసాదు. ఏడవసాగాడు.‘‘ప్లీజ్! కంట్రోల్ యువర్ సెల్ఫ్’’ అతడిని ఓదార్చింది పూజ. అయినా ఏడుస్తూనే వున్నాడు ప్రసాద్.‘‘ఇదాసుపత్రి! ఇలా ఏడవకూడదు’’ చెప్పింది పూజ. అయినా ఏడుపాపలేదు ప్రసాద్. దాంతో ఏం చెయ్యాలో పాలుపోక, తనూ కన్నీళ్లు పెట్టకుంటూ ఓదార్పుగా ప్రసాద్‌ని దగ్గరగా తీసుకోబోతున్నంతలో-‘‘అమ్మా’’ అంటూ అక్కడికి ప్రవేశించాడు పూజ తండ్రి.‘‘చూడండి డాడీ! పాపం! పాపం ఎలా ఏడుస్తున్నాడో’’ ఏడుస్తూ చెప్పింది పూజ.‘‘వూరుకో బాబూ! వూరుకో’’ ప్రసాద్‌కి నచ్చజెప్పాడతను. గుండెలకి దగ్గరగా తీసుకున్నాడు.‘‘నేనున్నాను బాబూ! నేనంతా చూసుకుంటాను మీకేం భయం లేదు’’ అన్నాడు.‘‘కృష్ణారావుగారికింకా స్పృహ రాలేదు! రానీయండి! అప్పుడొచ్చి చూద్దాం! పదండి! అందాకా బైట నిలబడదాం’’ అని పూజని, ప్రసాద్‌ని తీసుకుని బైటకొచ్చి-‘‘మా అమ్మాయి చేసింది పెద్ద తప్పే! కాదనను! కాని, ఆ తప్పుకి సరిపడా మేం మూల్యం చెల్లించుకుంటాం! దయచేసి మమ్మల్ని అల్లరి చేయకండి!’’ ప్రసాద్ ముందుచేతులు జోడించాడు పూజ తండ్రి.అర్థం కానట్లుగా చూశాడు ప్రసాద్.‘‘అలా క్యాంటీన్లో కూర్చుని అన్నీ వివరంగా మాట్లాడుకుందాం రండి! కమాన్’’ పూజ తండ్రి దారి తీశాడు. అతన్ని అనుసరించారు పూజ. ప్రసాద్.చాలా పెద్ద ఆస్పత్రి అది. ఖరీదైంది కూడా. అందుకు అనుగుణంగానే క్యాంటీన్ కూడా వుంది. స్నాక్స్, కూల్‌డ్రింక్స్...నిల్చోని తినడానికైనా, కూర్చుని తినడానికైనా టేబుల్స్.... చాలా హడావుడిగా అట్టహాసంగా వుందా క్యాంటీన్.‘‘ఏం తీసుకుంటావు బాబూ! కాఫీ-టీ-కూల్‌డ్రింక్’’ ప్రసాద్‌ని అడిగాడు పూజ తండ్రి.‘‘నాకేం వద్దు సార్’’‘‘బలేవాడివే! ఏదో ఒకటి తీసుకో! చల్లగా కూల్‌డ్రింక్ తీసుకురానా?’’‘‘వద్దు సార్’’‘‘ఆయన అలాగే అంటారు డాడీ! చూస్తున్నాను కదా! మీరెళ్లి తీసుకురండి’’ చెప్పింది పూజ.‘‘సరే’’ అని కౌంటర్ దగ్గరగా నడుస్తోన్న పూజ తండ్రిని (తన బాస్‌ని) చూస్తూ ప్యూన్ లాంటి వ్యక్తి-ఓర్నాయనో! ఈ డబ్బున్నోళ్లు ఎంతకైనా దిగజారతారు! వచ్చీరాని డ్రైవింగ్‌తో కూతురు కారుతో గుద్దేస్తే-పాపం ఆ కృష్ణారావు కాలు పోగొట్టుకున్నాడు. ఇదంతా పెద్ద కేసవుతుంది. అదవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు తండ్రి. కోటీశ్వరుడు. ముక్కు మొహం తెలీని వాళ్లకి కూల్‌డ్రింక్ తెస్తానని వెళుతున్నాడు. దగ్గరున్నా తీసుకురమ్మని తనకు చెప్పట్లేదు! అబ్బబ్బ!!గుండెల మీద చెయ్యి వేసుకున్నాడతను.‘‘మూడు కూల్‌డ్రింక్స్’’ కౌంటర్‌లో వ్యక్తికి చెప్పి బ్యాక్ పాకెట్లోని పర్సు తీశాడు పూజ తండ్రి.కౌంటర్లోని వ్యక్తి డబ్బు ఎంతివ్వాలో చెప్పాడు. ఇచ్చాడతను. పర్సుని మళ్లీ బ్యాక్ పాకెట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్నానని అతననుకున్నాడు. కానీ పాకెట్లో పర్సు ఇమడలేదు. కిందపడిపోయింది. ఆ పడడం పడడం తెరుచుకుని వెల్లికలా పడింది పర్సు. అది గమనించాడు ప్రసాద్. పర్సు తీసివ్వడానికి ముందుకి పరిగెత్తాడు. కింద పడ్డ పర్సుని యాధాతథంగా తీశాడు. చేతుల్లోకి పర్సు తీసుకొని, అందులో ఇటు పక్కగా వున్న ఫోటోని చూస్తూ షాకయ్యాడు ప్రసాద్.పూజ తండ్రి, ఓ స్త్రీ మూర్తీ కలిసి తీసుకున్న ఫోటో అది. ఇద్దరూ ఫోటోలో అందంగా ఆనందంగా వున్నారు. పగలబడి నవ్వుతున్నారు. స్త్రీమూర్తి భుజమ్మీద చేయుంచి పూజతండ్రి ఆమెను గుండెలకదుముకుంటుంటే, ఆ స్త్రీ మూర్తి, పూజ తండ్రి నడుం చుట్టూ చేయి వేసి నిల్చుని వుంది.ఆమె... ఆ స్త్రీ మూర్తి ఎవరో కాదు! ప్రసాద్ తల్లి!!మేకప్ మీద లక్ష్మి మెరిసిపోతుంటే రకరకాల యాంగిల్స్‌లో, ఎక్స్‌ప్రెషన్‌లో నాలుగైదు క్లోజ్‌లు కట్చేశాడు గిరి. చాలదన్నట్లుగా రెండుమూడు డైలాగ్స్ కూడా చెప్పమన్నాడు. ఓ డైలాగ్ నవ్వుతూ, ఓ డైలాగ్ ఏడుస్తూ, మరో డైలాగ్ కోపంగా చెప్పమన్నాడు. చెప్పింది లక్ష్మి. డైలాగ్స్ చెబుతోంటే, అందుకనుగుణంగా మొహంలో భావాలు పలుకుతోంటే ‘సామాన్యురాలు కాదీ లక్ష్మి! మహానటి’ అనుకున్నాడు కెమెరామన్. అదే అభిప్రాయానికి గిరికూడా వచ్చాడు. శకుంతలకైతే మతి పోయింది. ‘ఇంత గొప్ప నటినా నేను రొంపిలోకి దింపుదామనుకున్నది’అని బాధపడింది.‘‘చాలింక’’ అని కెమెరా ఆఫ్ చేసి, క్యాసెట్ తీసి గిరికిచ్చాడు కెమెరామాన్.‘‘తీసుకెళ్లి చూపించు! మేనేజర్‌కి, ఎండీకీ దిమ్మ తిరిగిపోతుంది’’ చెప్పాడు.‘‘థ్యాంక్యూ’’ అన్నాడు గిరి. క్యాసెట్ తీసుకొచ్చి ఎడిటర్‌కిచ్చాడు. అంతా రెడీ చేసి-‘‘ఎండీ గారిని, మేనేజర్ గారినీ రమ్మని చెప్పు! చూస్తారు’’ చెప్పాడు ఎడిటర్. గిరి వాళ్లని పిలవడానికి వెళ్లాడు.‘‘ఎలా వున్నాన్సార్’’ ఎడిటర్‌ని అడిగింది లక్ష్మి.‘‘నీకేమమ్మా! బ్రహ్మాండంగా వున్నావ్’’ మెచ్చుకున్నాడు ఎడిటర్.‘‘ఎండిగారు, మేనేజర్ గారు ఓకే చేస్తారా?’’అనుమానాన్ని వ్యక్తం చేసింది లక్ష్మి.‘‘ఓకే చేసి తీరాలి! చెయ్యకపోతే వాళ్ల ఖర్మ’’ చెప్పాడు ఎడిటర్.అంతలో చిన్నకోడలు హీరోయిన్‌తో పాటుగా ఎండీగారు, మేనేజర్‌గారు, గిరీ అక్కడకి రావడంతో‘‘రండి సార్! రండి ! రండి మేడమ్’’ అంటూ వాళ్లని ఆహ్వానించాడు ఎడిటర్.‘‘ఈ అమ్మాయే సార్ లక్ష్మి’’ ఎండీకి లక్ష్మిని చూపించాడు గిరి.‘‘నమస్తే సార్’’ ఎండీకి లక్ష్మి నమస్కరించింది.‘‘ఓకే’’ అంటూ లక్ష్మిని పరిశీలనగా చూసి-‘‘కమాన్! ప్లే చెయ్’’ ఎడిటర్‌కి చెప్పాడు ఎండీ. ఎడిటర్ ప్లే చేశాడు.క్యాసెట్ ప్లే అవుతోంది. లక్ష్మి హావభావాలన్నీ గమనిస్తున్నారు ఎండీ, మేనేజర్. చిన్నకోడలు హీరోయిన్ కూడా లక్ష్మి ఎక్స్‌ప్రెషన్స్‌ని గమనిస్తోంది. లక్ష్మికి టెన్షన్‌గా వుందంతా. శకుంతల కూడా అదే మూడ్‌లో వుంది.గిరి, ఎడిటర్ చేతులు కట్టుకొని నిల్చున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు.క్యాసెట్ పూర్తయింది. లక్ష్మితోపాటుగా అంతా ఎండీని చూశారు.ఆయనేమంటారు? ఆయన ఒపీనియన్ ఏమిటి? ఏం చెప్తాడేం చెప్తాడు? చూస్తున్నారు.‘‘ఓకే! బాగుంది’’ చెప్పాడు ఎండీ.ఆమాటకి కళ్లు మూసుకొని తృప్తిగా నిండుగా ఊపిరి తీసుకొంది లక్ష్మి. శకుంతల ఆనందంగా లక్ష్మిని చూసింది. సాధించానన్నట్లుగా కుడిచేతి వేళ్లని ముడిచి పిడికిలి చేసి చేతిని గాలిలో వూపాడు గిరి.‘‘ముందుగా ఎందులోకి తీసుకుందామని?’’ మేనేజర్ని అడిగాడు ఎండి‘‘క్రైం టైంలోకి తీసుకుందామనుకుంటున్నాం’’ చెప్పాడు మేనేజర్.‘‘నో..నో...’’ చిరాగ్గా అన్నాడు ఎండి.‘‘నెక్ట్స్‌మంత్ మెగా సీరియలొకటి ప్లాన్ చేస్తున్నాం కదా! దానికి హీరోయిన్‌గా ఎలా వుంటుందో ఆలోచించండి! కొత్త ఫేస్ కదా! బావుంటుందని నా ఉద్దేశం’’ చెప్పాడు మళ్లీ.‘‘ఓకే సార్! మీరెలాగంటే అలాగే’’ అన్నాడు మేనేజర్.‘‘దెన్నోకే! ఓకే లక్ష్మి’’ అని లక్ష్మికి చెప్పి గబగబా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు ఎండీ. ఆయన్ని అనుసరించి మేనేజర్ కూడా వెళ్లిపోయాడు. చిన్నకోడలు హీరోయిన్ అక్కడే వుందింకా.‘‘కంగ్రాట్స్’’ లక్ష్మి చేతిని అందుకుని ఆనందంగా షేక్ చేశాడు గిరి.‘‘నేను చెప్పానా? ఓకే చేసి తీరాలి! అదంతే’’ నవ్వాడు ఎడిటర్.లక్ష్మిని గట్టిగా కౌగిలించుకొని, ఆమె తలకి, తన తలని అదిమి పెట్టి-‘‘నాకు తెలుసమ్మా! నాకు తెలుసే! నువ్వు చాలా గొప్పదానివి అవుతావు’’ అంది శకుంతల.ఎడిట్‌సూటంతా ఆనందానందంగా వుంది. ఆ ఆనందంలో విషాదంగా ‘హాచ్’ అని తుమ్మి, ‘సారీ’ చెప్పి-‘‘కంగ్రాట్స్ లక్ష్మి! నీకు మంచి ఫ్యూచరుంది.’’ అని అక్కడ్నుంచి చరచరా వెళ్లిపోయింది చిన్నకోడలు హీరోయిన్. వెళ్లిపోతున్న హీరోయిన్ని చూస్తూ-‘తట్టుకోలేకపోతున్నావు కదూ! తట్టుకోలేవే! నువ్వు నన్ను తట్టుకోలేవు’ అనుకుంది లక్ష్మి.గంటలో ఎంత మార్ఫు?తప్పు చేసినదానిలా ‘సారీ’ చెప్పి దణ్ణం పెట్టిందామెకి గంట క్రితం.మేనేజర్ చెప్పిన మీదట గిరితో కలిసి శకుంతలతో పాటుగా చిన్నకోడలు హీరోయిన్ దగ్గరకి వెళ్లింది లక్ష్మి.‘‘నువ్వు నాకు దణ్ణం పెట్టాలని కాదు! పెద్దల్ని ఎలా గౌరవించాలో నీకు తెలియాలనే ఇదంతా’’ చెప్పింది చిన్నకోడలు హీరోయిన్.‘‘ప్రామ్‌టింగ్ లేకుండా డైలాగ్ చెప్పలేరు. బాడీ లాంగ్వేజ్ తెలీదు. సరైన ఎక్సెప్రెషనేంటో అంతుచిక్కదు! అయినా లెవెలే... లెవెల్! కాల్తుంది నాకు’’ కోపగించుకుంది హీరోయిన్.లక్ష్మి తలదించుకుని నిల్చుని వుంది.‘‘కనీసం కెమెరా ముందు ఎలా నిలబడాలో తెల్సా! తెలీదు! ముందది నేర్చుకో!’’ చెప్పింది.‘‘మేకప్ వేసుకున్నంత మాత్రాన హీరోయిన్ అయిపోరు! దానికి చాలా కావాలి! వినయం, వందనం, టాలెంట్... సర్సరే!వెళ్లిక్కడ్నుంచి’’ గట్టిగా కసిరింది. ఆ కసురుకి ఎగిరిపోయిన పిట్టల్లా గిరి, శకుంతలతో పాటు బైటకి వచ్చేసింది లక్ష్మి. వచ్చింతర్వాత గంటలో జరిగిందిది.లక్ష్మికంతా ఆశ్చర్యంగా వుంది. ఆనందంగా వుంది. ఏదీ ఆమె వూహకందడం లేదు.-----------------------------------పర్సులోని ఫోటోని చూస్తూ-‘‘మా...మా అమ్మ’’ అన్నాడు ప్రసాద్.‘‘ఎవరు’’ అంటూ ఇటు తిరిగాడు పూజ తండ్రి. అప్పటికే అక్కడికి చేరుకుంది పూజ. పర్సులోని ఫోటోని చూపిస్తూ-‘‘ఈవిడే! ఈవిడే మా అమ్మ’’ అన్నాడు ప్రసాద్. ఆ అనడంలో భరించలేనంత ఉత్కంఠ వుంది. ఆశ్చర్యం వుంది. తెలియని ఆనందం కూడా వుంది‘‘పేరు’’ అడిగాడు పూజ తండ్రి.‘‘అన్నపూర్ణ’’ చెప్పాడు ప్రసాద్.‘‘అన్నపూర్ణ మీ అమ్మా?నిజం’’ ఆశ్చర్యపోయాడు పూజ తండ్రి.‘‘అవున్సార్! మా నాన్నగారి పేరు మల్లికార్జునరావు. మా వూళ్లో కరెంటాఫీసులో పన్చేస్తారు’’ అంతే! ఆ మాటకి ‘‘ప్రసాద్’’ అంటూ పూజ తండ్రి ప్రసాద్‌ని గట్టిగా గుండెలకదుముకున్నాడు. జరుగుతోందంతా అయోమయంగా వింతగా వుంది పూజ.‘‘నేను...నేనెవరో తెల్సా’’ ప్రసాద్‌ని మోచేతి దూరంలో వుంచి నవ్వుతూ అడిగాడు పూజ తండ్రి. తెలీదన్నట్లుగా చూశాడు ప్రసాద్.‘‘మీ మామయ్యని! నీ మేనమామని!’’ చెప్పాడు పూజ తండ్రి.‘‘అవునా’’ అన్నట్లుగా మరింతగా ఆశ్చర్యపోయాడు ప్రసాద్. పూజ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే వుంది.‘‘అవున్రా ప్రసాద్! నేను మీ మేనమామని. మీ అమ్మ అన్నపూర్ణ నాకు స్వయానా చెల్లెలు! నాపేరు రఘునాథం’’ అన్నాడు పూజ తండ్రి.‘‘అవును బాబూ! అయ్యగారి పేరు రఘునాథమే’’ దగ్గరగా వచ్చి కల్పించుకుంటూ ప్రసాద్‌కి చెప్పాడు ప్యూన్‌లాంటి వ్యక్తి.‘‘నీకు ప్రసాద్ వరుసకి బావ అవుతాడమ్మా! మేన బావ’’ అని గట్టిగా నవ్వాడు రఘునాథం. ఆ నవ్వు ఆస్పత్రి క్యాంటీనంతా ప్రతిధ్వనించింది. దాంతో అంతా ఇటుగా చూడసాగారు.‘‘మా అమ్మ ఎప్పుడూ మీ గురించి చెప్పలేదే’’ అనుమానం వ్యక్తం చేశాడు ప్రసాద్.‘‘చెప్పదు! ఎందుకు చెప్పదంటే అన్నయ్యనంటూ నేనొకడ్ని వున్నానని ఈ జీవితంలో ఎవరికీ చెప్పొద్దని మీ అమ్మకి నేనే చెప్పాను! అందుకు... అందుకే... చెప్పి వుండదు’’ అన్నాడు రఘునాథం.‘‘మీరెందుకిలా చెప్పేరు’’ అడిగింది పూజ.‘‘ఎందుకు చెప్పానంటే అదో పెద్ద కథ. సింపుల్‌గా చెప్పాలంటే మా చెల్లెలు అన్నపూర్ణ, మల్లికార్జునరావుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి నా కిష్టం లేదు! అదీ విషయం’’ అన్నాడు రఘునాథం.‘‘వివరంగా చెప్పండి డాడీ’’.‘‘తర్వాతంతా చెప్తారు కాని, ముందీ కూల్ డ్రింక్స్ తీసుకోండి’’ కూల్‌డ్రింక్స్ సర్వ్ చేశాడు ప్యూన్‌లాంటి వ్యక్తి.డ్రింక్ తాగుతోంటే చల్ల చల్లగా హాయి హాయిగా వుంది ప్రసాద్‌కి. ఇంతకుముందున్న బాధా, భయం ఇప్పుడతనిలో లేవు. అయినవాళ్ల పక్కన అందులోనూ తల్లో, మేనమామో అన్నారు. అలాంటి మేనమామ పక్కన వుండడంతో ఎక్కడ లేని శక్తీ వచ్చినట్టయిందతనికి.లక్ష్మిని ఈజీగా వెతికి పట్టుకుంటాననుకొన్నాడు ప్రసాద్.-----------------------‘‘ఇదిగో!’’ ఆటోవాలాని వుద్దేశించి కేకేసింది శకుంతల.‘‘చెప్పండమ్మా’’ అడిగాడు ఆటోవాలా.‘‘పంజాగుట్ట సాయిబాబా టెంపుల్‌కి పోనీయ్’’‘‘సరేనమ్మా’’ అన్నాడు ఆటోవాలా. కుడివైపునకు టర్న్ తీసుకొని ఆటోని స్పీడుగా పోనివ్వసాగాడు.‘‘హీరోయిన్ కాబోతున్నావు! అంతా మంచే జరుగుతోంది. బాబానోసారి చూసుకొని అట్నుం చటు ఇంటికెళ్దాం’’ అంది శకుంతల.‘సరే’నంది లక్ష్మి.‘‘గిరిబాబు తలుచుకుంటే ఏదైనా అవుద్ది! అందుకే ఆ బాబుని పట్టుకున్నాను.’’ నవ్వింది శకుంతల.‘‘వచ్చే నెలకి మా లక్ష్మి పేద్ద హీరోయిన్’’ మళ్లీ నవ్వింది శకుంతల.‘‘హీరోయిన్ అయిన్తర్వాత నువ్వొక్క క్షణం కూడా మా కంపెనీలో వుండొద్దు! యేరే ఇల్లు చూస్తాను! అక్కడ వుందూగాని’’ చెప్పింది శకుంతల.‘‘ఆ పురుగుల్లో నువ్వెందుకు? నువ్వు సీతాకోకచిలుకవి! సెపరేట్‌గా వుందూగాని’’ అని, ఆలోచిస్తున్నట్టుగా ఎటో చూస్తోన్న లక్ష్మితో-‘‘ఏంటాలోచిస్తున్నావ్’’ అడిగింది శకుంతల.‘‘ప్రసాద్ ఎందుకో గుర్తొస్తున్నాడు’’ అంది లక్ష్మి.‘‘ఏ ప్రసాదు’’‘‘అన్నపూర్ణమ్మగారి కొడుకు ప్రసాదని-మావూళ్లో ఓ అబ్బాయున్నాడు! ఆ ప్రసాద్‌కి నేనంటే చాలా ఇది’’ అంది లక్ష్మి.‘‘ఇదంటే- ప్రేమా’’ అడిగింది శకుంతల.‘‘అవును’’ అంది లక్ష్మి.‘‘ఇపడీ ప్రేమలు, దోమలూ పెట్టుకోకు! హీరోయిన్‌వి కాబోతూ, ఇవన్నీ పెట్టుకున్నావంటే ఇంతే సంగతులు! బంగారం లాంటి బతుకు బుగ్గిపాలవుతుంది’’ హెచ్చరించింది శకుంతల.‘‘అబ్బాయిల్దేముంది? అంతా మన సుందరం టైపే! అందంగా ఎవరు కనిపించినా ప్రేమిస్తారు’’ అంది మళ్లీ.‘‘ప్రసాద్ అలాంటి వాడుకాదు’’ కోపంగా అంది లక్ష్మి.‘‘మరెలాంటి వాడు? అని అడగాలనుకుని, లక్ష్మి కోపం చూసి వూరుకుంది శకుంతల.ఆటో పరుగుతీస్తోంది.లక్ష్మి ఆలోచనలునకూడా పరుగుదీస్తున్నాయి. పాపం ప్రసాద్! తనకోసం ఆ రాత్రి ఎంతగా ఏడ్చాడు? హైదరాబాద్ వెళ్ళొద్దని, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కవద్దని ఎంతగా ప్రాధేయపడ్డాడు?‘‘ఐ లవ్ యూ లక్ష్మి! ఐ లవ్ యూ! నువ్వెళ్లిపోకు’’ అంటూ-‘‘కావాలంటే నీకోసం డిగ్రీ చదవడం మానేస్తాను. ఇద్దరం పేపర్లేసుకుంటూ, పాల ప్యాకెట్లు అమ్ముకుంటూ బతికేద్దాం’’ అన్నాడు. అపడా మాటలు తనకి కోపం తెప్పించాయి గాని, ఇపడాలోచిస్తుంటే ‘ఎంత అమాయకత్వం’ అనిపిస్తోంది.ప్రసాద్ ప్రేమలో కల్తీలేదు. ప్రసాద్ ప్రేమలో అబద్ధం లేదు. వుంటే గింటే తన ప్రేమలో కల్తీ వుంది. తన ప్రేమలో అబద్ధం వుంది. అందుకే ఇన్ని ఇబ్బందులు పడింది. ఇది తెలుసుకోవడంతో పశ్చాత్తాపం చెందడంతో ఇప్పుడు గట్టెక్కింది.ప్రసాద్ కనిపిస్తే బాగుణ్ణు! గుళ్లో బాబాకి మొక్కినట్లుగానే ప్రసాద్‌కి కూడా మొక్కుతాను అనుకుంది లక్ష్మీ. ఆ ఆలోచనతో దూదిపింజలా తేలిపోయింది.---------------కృష్ణారావుకి స్పృహరావడానికి ఇంకా ఇరవై నాలుగుగంటలు టైము పడుతుందని డాక్టర్లు చెప్పడంతో ‘‘అంతవరకూ ఇక్కడుండి చేసేదేముంది? ఏం లేదు! కాబట్టి అలా మనింటి దాకా వె ళ్లొద్దాం! రండి’’ అంటూ ప్రసాద్‌ని, పూజని బయల్దేరదీశాడు రఘునాథం.‘‘నేను రాలేనండి! నేనిక్కడే వుంటాను’’ చెప్పాడు ప్రసాద్.‘‘మేనమామని తెలిసింతర్వాత కూడా ‘అండి’ యేంట్రా? ‘మామయ్యా’అనలేవు’’ అని నవ్వి,‘‘ఇక్కడుండి ఏం చేస్తావ్? స్పృహలో లేని కృష్ణారావుని చూస్తూ కూర్చొంటావా? ఫలితమేముంది? పెద్దవాణ్ణి ఎందుకు చెబుతున్నానో విను! పద! మీ అత్తయ్య కూడా నిన్ను చూస్తానంటోంది’’ అన్నాడు రఘునాథం. ప్రసాద్ కారెక్కేంత వరకూ వూరుకోలేదతను. కృష్ణారావుని కనిపెట్టుకొని ఎవరుంటారంటే-‘‘మా వాడున్నాడుగా! వాడు చూస్తాడు’’ అని ప్యూన్‌లాంటి వ్యక్తిని చూపించి కారు స్టార్ట్ చేశాడు రఘునాథం. కార్లో రఘునాధం, పూజ పక్కపక్కన కూర్చుంటే, ప్రసాద్ వెనక సీట్లో కూర్చున్నాడు.‘‘అన్నపూర్ణాంటీ వుందని చెప్పావు కాని, అన్నపూర్ణాంటీకి ప్రసాద్ బావంతటి కొడుకున్నాడని నువ్వెప్పుడూ చెప్పలేదెందుకు డాడీ’’ అడిగింది పూజ.‘‘నాకు తెలిస్తే కదమ్మా నీకు చెప్పడానికి? అయినా మీ మామయ్యని పెళ్లాడేంత వరకే మీ అత్తయ్య సంగతి నాకు తెలుసు! తర్వాత వాళ్ల వేరెబౌట్స్ తెలీవు! తెలీనప్పుడు ఏం చెప్పేది’’ అన్నాడు రఘునాథం.‘‘భలే వుంది డాడీ! బావా మనం కలుసుకోవడం థ్రిల్లింగ్‌గా వుంది’’.‘‘మరి జీవితం అంటే ఏమనుకున్నావ్’’ నవ్వాడు రఘునాథం.కారు పంజాగుట్ట సాయిబాబా గుడి దగ్గరగా వస్తోంది. అది గమనించి -‘‘డాడీ డాడీ’’‘‘ఏంటమ్మా’’‘‘కారాపండి’’‘‘ఎందుకు’’‘‘బాబానోసారి దర్శించుకుని ఇంటికెళ్దాం’’‘‘ఇప్పుడా’’‘‘అవునిపడే! అత్తయ్య వాళ్లు ఎక్కడున్నదీ తెలియడం, బావని కలవడం, అంతా బాబా దయలా నాకనిపిస్తోంది! అందుకని కారాపండి’’ అంది పూజ. కారాపక తప్పలేదు రఘునాథానికి.‘‘రా బావా’’ ప్రసాద్ చేయందుకుంది పూజ.‘‘న...న... నాపేరు ప్రసాద్’’ప్రసాద్‌కంతా ఇబ్బందిగా వుంది.‘‘నీ పేరు ప్రసాదే! కాదన్నదెవరు?కాకపోతే నేను మాత్రం నిన్నా పేరుతో పిలవను. నేను నిన్ను ‘బావ’ అనే పిలుస్తాను’’ చనువు తీసుకొని నవ్వింది పూజ.‘‘బాగా చెప్పావమ్మా’’ ఎంకరేజింగ్‌గా మాట్లాడాడు రఘునాథం.ముగ్గురూ బాబా గుడిలోకి ప్రవేశించారు. బాబాకి అభిముఖంగా వస్తున్నారు వాళ్లు. అప్పటికే బాబా విగ్రహం చుట్టూ మూడోసారి ప్రదక్షిణం చేసి-ప్రసాద్ వాళ్లకి అభిముఖంగా జోడించిన చేతుల్తో వస్తూ ప్రసాద్‌ని చూసింది లక్ష్మి. ఆశ్చర్యానందాలు పొందింది.‘ప్రసాద్’ అని కేకేయబోయి, ప్రసాద్ చేయి ఎవరో అమ్మాయి చేతిలో వుండడాన్ని గమనించి గొంతుని గుండెల్లో నొక్కేసింది. తలుచుకుందో లేదో ప్రసాద్ కనిపించాడు! చాలనుకంది లక్ష్మి.జోడించిన చేతుల్ని ఎత్తి మనసారా, నమస్కరించి, ముఖం చాటుచేసుకుని ముందుకి గబగబా నడిచింది. అలా నడుస్తోన్న లక్ష్మిని చూస్తూ-‘‘లక్ష్మీ లక్ష్మీ’’ కేకేసి పిలిచింది శకుంతల.శకుంతల ఇంకా రెండో ప్రదక్షిణలో వుంది. మూడోదింకా చెయ్యాలి. ఇంతలో లక్ష్మీ వెళ్లిపోతూ కనిపిందామెకి. ఎక్కడికి వెళ్లిపోతోందో తెలీదు. అందుకే పిలిచింది.‘లక్ష్మీ’అన్న పేరు వినబడగానే గిరుక్కున ఇటు తిరిగి చూశాడు ప్రసాద్.‘లక్ష్మి’ అన్న పిలుపు వినిపించడంతో గిరుక్కున ఇటు తిరిగి ఆత్రంగా, ఆందోళనగా చూస్తోన్న ప్రసాద్ ముఖాన్ని తన వైపునకు తిప్పుకుంటూ-‘‘ఏంటి బావా? ఏంటటు చూస్తావు? దేవుడిటున్నాడు’’ అంది పూజ.ఏం చెప్పాలో తెలియక ‘‘అదీ...అదీ’’ అంటోన్న ప్రసాద్‌తో-‘‘రావయ్యా! రారా! ఆట్టే జనం లేనప్పుడే దేవుణ్ని చూడగలం’’ అంటూ తొందర చేశాడు రఘునాథం. దాంతో రఘునాథం, పూజలతో ముందుకు నడవక తప్పలేదు ప్రసాద్‌కి. వాళ్లతో నడుస్తూ కూడా ఒకటి రెండు సార్లు వెనక్కి తిరిగి తిరిగి చూశాడు ప్రసాద్. ‘లక్ష్మి’ అన్న పిలుపు వినిపించగానే లక్ష్మి’ కనిపిస్తుందన్న ఆశ. ఆ ఆశ తీరలేదు. లక్ష్మి అతనికి కనిపించలేదు.తల మీదుగా కొంగు కప్పుకొని, ప్రసాద్‌కి కనిపించకుండా, జాగ్రత్తగా, గబగబా గుడి బైటకొచ్చేసింది లక్ష్మి. వచ్చి గుండెల్నిండా ఊపిరి తీసుకుంది. కళ్లు కూడా చెమర్చుకుంది.ఏదైతేనేం ప్రసాద్‌కి నేను కనిపించలేదు.కనిపిస్తే?!అమ్మో! ఇంకేమైనా వుందా?-అనుకుంది లక్ష్మి. ప్రసాద్‌కి తానెందుకు కనిపించకూడదు? కనిపిస్తే ప్రసాదేం చేస్తాడు? అమ్మో దేనికి? ఇంకేమైనా వుందా అనుకోవడం దేనికంటే లక్ష్మి దగ్గర ప్రస్తుతానికి సమాధానాలు లేవు. ఎవరెవరు? ప్రసాద్ చేతిని పట్టుకున్న అమ్మాయి ఎవరన్నది ఇప్పుడు లక్ష్మి ఆలోచన. అసలా అమ్మాయిని చూసే ‘ప్రసాద్’ అని పిలవబోయి గొంతు నొక్కేసుకుంది తను. లేకపోతేనా? లేకపోతే ఏం చేసేది? అదీ అంతుచిక్కట్లేదు లక్ష్మికి.ఏదీ ఏమీ అర్థంకాకపోవడంతో ఏడుపొస్తోందామెకు. ఏడుస్తోంది లక్ష్మి.పిలుస్తున్నా పట్టించుకోక, తలమీదుగా కొంగు కప్పుకుని గబగబా వెళ్లిపోతోన్న లక్ష్మిని చూస్తూ-ఏమైంది? ఎందుకలా లక్ష్మి వెళ్లిపోతోందనుకుంటూ అటూ ఇటూ చూసిన శకుంతలకి, ఓ నడివయసు పెద్దాయనతోను, ఓ చమక్ చమక్ కాలేజీ పిల్లతోనూ ప్రసాద్ కనిపించడంతో-ఈ కుర్రాడెవరు?ఈ కుర్రాణ్నెక్కడ చూసింది తను? ఆలోచించింది శకుంతల. ఆలోచించగా... ఆలోచించగా...పరిగెడుతున్న లక్ష్మి వెంటపడుతూ ప్లాట్‌ఫారం మీద పరుగుదీస్తోన్న ప్రసాద్ గుర్తొచ్చాడామెకి.ఓర్నాయినో! అక్కణ్నించీ ఈ కుర్రాడు ఇక్కడికి ఎందుకొచ్చాడు? కొంపదీసి ఈ కుర్రాడి పేరు ప్రసాద్ కాదు కదా? అయిన పక్షంలో ఇప్పుడిప్పుడే లక్ష్మి గుర్తుచేసుకుంది. అందుకే కాబోలు తనలా వెళ్లిపోయింది.-అనుకొని, ఎందుకైనా మంచిదనుకొంటూ ప్రసాద్ కంటపడకుండా జాగ్రత్త పడి, గుడి బైటకొచ్చింది శకుంతల. వచ్చి, ఏడుస్తోన్న లక్ష్మిని చూసి-‘‘ఎందుకు లక్ష్మీ? ఎందుకేడుస్తున్నావు?’’ అనడిగింది.‘‘ఏం లేదు! పదండి! ఇంటికెళదాం’’అని ఆటో ఎక్కింది లక్ష్మి అనుసరించింది శకుంతల. ఆటో కదిలింది.-----------------------రాత్రి. గడియారంలో పావుతక్కువ తొమ్మిది అయింది. అది గమనించి-‘‘అయ్యయ్యో! అప్పుడే తొమ్మిదిగంటలయిపోతోంది’’ అని గాబరా పడి టీపాయ్ మీది గ్లాసులు రెంటినీ అందుకుని, వేసుకున్న చొక్కా చివర్లతో వాటిని లోపల, బైటా బాగా తుడిచి, మళ్లీ యథాస్థానంలో వుంచి, అక్కడున్న ఫుల్‌బాటిల్(మందు), జీడిపప్పు, చిప్స్, చికెన్ని చూసి, వూరుతోన్న నోటిని అదుపులో వుంచుకొని-‘‘ఈ మేడమ్ ఇంకా ఎప్పుడొస్తుందో ఏమో’’ అని డీలా పడ్డాడు క్రైం టైం డైరెక్టర్. ‘‘వస్తే బాగుణ్ణు’’ అన్నట్లుగా అటుగా చూశాడు. అతని ఆశ ఫలించింది. చిన్నకోడలు హీరోయిన్, జుత్తును మునివేళ్లతో సరిజేసుకుంటూ, నైటీలో వుండి, వయ్యారంగా మెట్లు దిగుతూ కనిపించింది.‘‘రండి మేడమ్! రండి’’ ఆహ్వానిస్తున్నట్లు లేచి నిల్చున్నాడు డైరెక్టర్.‘‘కూర్చోండి! కూర్చోండి’’ అని కూర్చోమన్నట్లుగా చేత్తో కూడా సైగ జేసి చెప్పి, వచ్చి సోఫాలో కూర్చుంది హీరోయిన్. అలా కూర్చొన్న హీరోయిన్ని కన్నార్పకుండా చూసి-‘‘బాగున్నారు మేడం! మీరీ నైటీలో అదిరిపోయారు’’ అన్నాడు డైరెక్టర్.‘‘అలాగా’’ అని నవ్వి -‘‘మొన్న దీన్ని (నైటీని) బెంగుళూర్లో కొన్నాను’’ అంది హీరోయిన్.‘‘విశాలమైన నుదురు. నుదుటి మీద సూర్యోదయంలా ఎర్రగా ఆ బొట్టు. పెద్దపెద్ద కళ్లు. పొడుగ్గా కొనదేలిన ముక్కు, మెరిసే బుగ్గలు, మెత్తగా పెదవులు, కిందకి దిగితే నీళ్లు తాగినా కనిపించేలా కంఠం... ఇంకా కిందికి దిగితే....’’‘‘చాల్చాలు ఆపండి’’ సన్నగా నవ్వుతూ డైరెక్టర్ని హెచ్చరించింది హీరోయిన్.‘‘ఇలాంటి అందాన్ని నేనెక్కడా చూళ్లేదు మేడం! చూళ్లేదు’’‘‘ఇప్పుడు చూశారుగా’’‘‘అదే! ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను! నాకు తెలిసి మీరు మామూలు స్త్రీ కాదండీ! ఎక్కడో ఏదో జరిగింది. ఐ థింక్! శాపవశాత్తు ఈ భూలోకంలో మీరు పుట్టారు. అందులో అనుమానం లేదు’’జవాబుగా మళ్లీ నవ్వింది హీరోయిన్.‘‘ఈ శ్రియాలు, త్రిషలూ వీళ్లు...వీళ్లేం పనికొస్తారండీ మీ ముందు? ఒక్కటి, ఒక్కటంటే ఒక్క మూవీ చెయ్యండి! అంతే! జాతకం తిరగబడిపోతుంది! అయితే మూవీ డైరెక్షన్ నాకే ఇవ్వాలి! ఇది నా అభ్యర్థన’’ చేతులు జోడించాడు డైరెక్టర్.‘‘చూద్దాం! ముందు మందు స్టార్ట్ చెయ్యండి’’ చెప్పింది ఆమె.చెప్పడమే ఆలస్యం. అక్కడున్న రెండు గ్లాసుల్నీ మందుతో నింపేసి, ఓ గ్లాసు హీరోయిన్‌కిచ్చి, ఇంకో గ్లాసు తను తీసుకొని, ‘చీర్స్’ చెప్పి, సిప్ చేసి ‘హమ్మయ్య! మందు గుండెల్లోకి దిగుతోంది’ అనుకున్నాడు డైరెక్టర్.‘‘మిమ్మల్ని ఈ రాత్రి మా ఇంటికి ఎందుకు పిలిచానో తెల్సా’’ అడిగింది హీరోయిన్.‘‘తెలీదు’’ మళ్లీ మందుని సిప్ చేశాడు డైరెక్టర్.‘‘తెలీదు కాని, నాకేదో మంచి చెయ్యాలనే మీరు పిలిచారు. అది తెలుసు’’ అని మందుని మూడో సారి సిప్ చేశాడతను.‘‘వచ్చే నెల కొత్త సీరియల్ స్టార్ట్ కాబోతోంది. దానికి మీరే డైరెక్టర్’’ చెప్పింది హీరోయిన్.‘‘థ్యాంక్స్ మేడం! థ్యాంక్యూ వెరీమచ్’’ డైరెక్టర్ గొంతు కృతజ్ఞతతో బొంగురుపోయింది. మూడు సిప్‌లకే అతని మూడ్ మారిపోయింది.‘‘ఛైర్మన్‌గారితో మాట్లాడాను! ఆయన ఎండి గారికి చెప్తానన్నారు. మేనేజర్‌దేముంది? మేనేజ్ చెయ్యొచ్చు’’ అని నవ్వింది హీరోయిన్.‘‘మీరు... మీరే కదా హీరోయిన్. మీరు హీరోయిన్ అయితేనే నేనా సీరియల్ డైరెక్ట్ చేస్తాను! లేదంటే వొద్దు! నాకొద్దు ఆ సీరియల్’’ ఒక్కసారిగా గ్లాసులోని మందంతా పీల్చేశాడతను.‘‘నేనే హీరోయిన్! కాకపోతే దాన్ని మీరు డిసైడ్ చెయ్యాలి’’‘‘ఛైర్మన్‌గారి దూరపు బంధువు. ఎండీగారికి వరసవుతారు. మిమ్మల్ని నేను డిసైడ్ చెయ్యడమా? నేనింకా ఒక పెగ్గే తాగాను మేడం! జోకులొద్దు’’ గ్లాసులో రెండో పెగ్గు పోసుకున్నాడు డైరెక్టర్.‘‘జోక్కాదు! నిజమే చెప్తున్నాను. ఆ కొత్త సీరియల్‌కి ‘లక్ష్మీ’ అని ఓ అమ్మాయిని హీరోయిన్‌గా సాయంత్రం అనుకున్నారు. ఎండీగారు ఆల్రెడీ ఆ అమ్మాయిని సజెస్ట్ చేశారు! అయితే అది హీరోయిన్ కాకూడదు’’ చేతిలోని మందు గ్లాసుని టీపాయ్ మీద వుంచి విసురుగా లేచి నిల్చుంది హీరోయిన్.‘‘ఎందుకు కాకూడదు’’ రెండో పెగ్గుని సగానికి లాగేశాడు డైరెక్టర్.‘‘ఎందుకు కాకూడదంటే అది....అదంటే నాకెందుకో కోపంగా వుంది! దాన్ని నేను భరించలేకపోతున్నాను.’’ అంది హీరోయిన్. అసహనంగా చేతి వేళ్లను నులుముకుంది.లక్ష్మి అంటే చిన్నకోడలు హీరోయిన్‌కి ఎందుకు పడదంటే...‘ఇందుకు’ అంటూ ఏ కారణమూ ఎవరూ చెప్పలేరు. ఇద్దరికీ ఇంతకు ముందు ఏ రకమైన పరిచయాలు లేవు. పగలూ లేవు. అయితే మరెందుకీ గొడవంటే-కొందరికి కొందరు పడరు. అకారణంగా ఈర్ష్యలూ, ద్వేషాలూ పుట్టుకొస్తాయి. దాంతోనే ఇదంతా జరుగుతోంది. Challenge-18 episode-61-75‘‘కొత్త సీరియల్ అని కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తాం. పూజ అయిన తర్వాత ఆ అమ్మాయి లక్ష్మి ఎవరో కెమెరా ముందుకొస్తుంది. ‘యాక్షన్’ అని నేనంటాను. ఆ మాట పూర్తి కాకుండానే ‘కట్’ అంటాను. ఆరోజంతా అంతే! సింగిల్, సింగిల్ టేక్ కూడా తియ్యను. ఆ రాత్రి ఆ అమ్మాయి పనికిరాదని మేనేజర్‌గారికి చెప్తాను! మిమ్మల్ని కావాలంటాను. మర్నాడు మీరు హీరోయిన్. షూటింగ్ స్టార్ట్’’ నాలుగో పెగ్ పోసుకున్నాడు డైరెక్టర్. మూడోది ఎపడు ముగించేశాడో తెలీకుండా పోయింది.‘‘ఆ సాయం మీరు చెయ్యండి! మిమ్మల్ని నేనెలా చూసుకోవాలో అలా చూసుకుంటాను’’ చెప్పింది హీరోయిన్.‘‘రోజూ ఇలా చూసుకోండి! చాలు’’ బాటిల్ ఎత్తి చూపించాడు డైరెక్టర్.‘‘ఓకే’’ నవ్వింది హీరోయిన్.‘‘నాకు సెల్ఫ్ డెసిషన్ లేదని మీరు కూడా అంటారు మేడం! కాని వుంది! లేకపోతే ఇంత డెసిషన్ నేనెలా తీసుకోగలను?’’ అడిగాడు డైరెక్టర్.‘‘కరెక్ట్’’ తప్పు వొప్పుకుంది హీరోయిన్.‘‘అందుకే అంటారు మేడం కాలు జారినా తీసుకోవచ్చు గాని, నోరు జారితే తీసుకోలేమని!సో....’’ అని కాలుజారాడతను. తూలి హీరోయిన్ మీద పడ్డాడు. పట్టుకొని ఆపి-‘‘మందెక్కువైనట్టుగా వుంది. ‘‘జాగ్రత్త! సోఫాలో పడుకోండి’’ అని చెప్పి తూలుతూ సోఫా దగ్గరికి వెళ్తోన్న డైరెక్టర్ని చూస్తూ-‘‘మందుకోసం వీడెంతకైనా తెగిస్తాడు! ఇడియెట్’’ అనుకొంది హీరోయిన్.------------------------------డాక్టర్లు అన్నట్టుగానే ఇరవైనాలుగ్గంటల తర్వాత, సుమారుగా సాయంత్రం వేళ, ఆస్పత్రిలో కృష్ణారావుకి స్పృహ వచ్చింది. చుట్టూ వున్న వాళ్లని తేరిపార చూశాడు కృష్ణారావు. నలుగైరుదుగురు తనని ఆత్రంగా ఆనందంగా చూస్తున్నారు. వాళ్లలో ప్రసాద్ తప్ప మిగిలిన వారెవరూ తెలియడం లేదు.‘‘వేడి వేడిగా పేషెంట్‌కి కాఫీ ఇవ్వండి’’ డాక్టర్ చెప్పాడు. ‘విన్నావా’ అన్నట్లుగా రఘునాథం ప్యూన్ లాంటి వ్యక్తిని చూశాడు.‘‘కాఫీ తీసుకొస్తాను సార్’’ వ్యక్తి ఓ రకంగా అక్కణ్నుంచి పరుగుదీశాడు.‘‘మీరోసారి నాతో పాటు రండి’’ అంటూ రఘునాథాన్ని వెంటబెట్టుకొని వెళ్లాడు డాక్టర్. వాళ్లలా వెళ్లడాన్ని అనుమానంగా చూస్తోంటే-‘‘నువ్వేం భయపడకు! ఎలాంటి అనుమానాలుపెట్టుకోకు! పేషెంటు ఎన్ని రోజులు ఆస్పత్రిలో వుండాలి? ఎసి రూంలో వుంచమంటారా? నాన్ ఎసి రూంలో వుంచమంటారా? వగైరా వగైరా మాట్లాడడానికి తప్ప ఇంకెందుకూ నన్ను పిలవట్లేదు’’ ప్రసాద్‌తో అన్నాడు రఘునాథం.‘‘అవును బాబూ! అంతే! అందుకే పిలిచాను’’ అని రఘునాథాన్ని తీసుకొని వెళ్లిపోయాడు డాక్టర్. అయినా భయం భయంగా చూస్తోన్న ప్రసాద్‌తో-‘‘డాడీ అబద్ధాలాడరు బావా! ఆయనకి అబద్ధాలాడడం చేతకాదు’’ అంది పూజ.‘‘కృష్ణారావుగారికేం కాదు! నీకా అనుమానాలేవద్దు’’ చెప్పింది మళ్లీ.ప్రసాద్‌ని ‘బావా’ అనడం, ‘నువ్వు-నిన్ను’ అని ప్రసాద్‌ని సంబోధించడం, తనున్నది ఖరీదైన ఆస్పత్రిలా వుండడం, తనకి కాలొకటి లే క పోవడం- ఇవన్నీ వరుసగా ఒక్కొక్కటీ తెలుస్తున్నాయి కృష్ణారావుకి.కాఫీ తాగాడు కృష్ణారావు. కాస్సేపటికి పూర్తి స్పృహలోకి వచ్చాడు.‘‘ఏంటిదంతా’’ ప్రసాద్‌ని అడిగాడు కృష్ణారావు. అడిగినప్పుడు అతని కంఠంలో ఏడుపు జీర తొంగి చూసింది. జరిగిందంతా బాధగా వివరంగా చెప్పాడు ప్రసాద్.‘‘మీకేం కాదంకుల్! మీకు మేమున్నాం! ఇక మీదట మాతో పాటు మీరు’’కృష్ణారావుకి అండగా మాట్లాడింది పూజ.‘‘మీ లక్ష్మీని మా బావతో పాటు నేనూ వెతుకుతాను! ఎక్కడున్నా తెచ్చి, మీముందుంచి తీరుతాను’’ అభయమిచ్చింది పూజ.‘‘మా డాడీ సంగతి మీకు తెలీదు! ఆయన తలుచుకున్నారంటే ఏమైనా చేస్తారు! ఆయన చిటికేస్తే పోలీసులే కాదు స్పెషల్ ఫోర్సు కూడా రంగంలోకి దిగుతుంది’’ అని ధైర్యం చెప్పి-‘‘నా పేరు పూజ! ఐయాం వెరీ సారీ’’ అంది. ఆ మాటకి ‘ఫర్వాలేదు’ అన్నట్లుగా సన్నగా నవ్వి, దగ్గరకి రమ్మన్నట్లుగా చేత్తో పిలిచి. వచ్చిన పూజ తల మీద చేతి నుంచి, ప్రేమగా నిమిరాడు కృష్ణారావు. ఆ దృశ్యాన్ని, అల్లంత దూరం నుంచి వస్తూ చూసి తృప్తిగా నిట్టూర్చాడు రఘునాథం.‘‘మినిమం వన్ మంత్ వరకూ కృష్ణారావు గారు ఆస్పత్రిలో వుండాలట! డాక్టరు గారు చెప్పారు’’ దగ్గరగా వచ్చి ప్రసాద్‌తో చెప్పాడు రఘునాథం.‘‘వన్ వీక్ వరకూ ఇదే రూంలో ఇక్కడే కృష్ణారావుగారిని వుంచుతారు! ఆఫ్టర్ వన్‌వీక్ మనకి కావల్సిన రూంలోకి షిఫ్ట్ చేస్తారట’’ చెప్పాడు మళ్లీ.‘‘డాక్టర్‌గారితో అన్ని వివరంగా మాట్లాడాను కృష్ణారావుగారూ! స్పెషల్ కేర్ తీసుకుంటామన్నారు. పోయిన మీ కాలునయితే తెచ్చివ్వలేను గాని, మీకేం కావాలో చెప్పండి!తెచ్చిస్తాను’’ కృష్ణారావు చేతులు పట్టుకొన్నాడు రఘునాథం.‘‘క్షమించండి’’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు రఘునాథం.‘ఏడవొద్దు’ అన్నట్లుగా చేత్తో సైగ చేసి, ‘నా కర్మ’ అన్నట్లుగా నుదుటి మీద చేత్తో రాసుకున్నాడు కృష్ణారావు.ముందు కొంచెం ఇబ్బందిగా వున్నా, మాట్లాడగా మాట్లాడగా అంతా ‘ఒకరికోసం ఒకరు’ అన్నట్లుగా కలిసిపోయారు. విడిపోయిన కుటుంబం సభ్యులు కలిసినట్లుగా వుందంతా.‘‘ప్రసాద్ ఎవరనుకున్నారు? నా మేనల్లుడు’’ కృష్ణారావుకి చెప్పాడు రఘునాథం.‘‘తెలుసు! ఇందాక చెప్పాడు’’ అన్నాడు కృష్ణారావు.‘‘నిన్న రాత్రి మా చెల్లెలితోనూ, మా బావతోనూ ఫోన్లో మాట్లాడాను. ప్రసాద్ ఇప్పుడప్పుడే మీ వూరు వెళ్లడు! ఇక్కడే వుంటాడు! గట్టిగా చెప్పాలంటే ఇక్కడే చదువుకుంటాడు! ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తున్నాను’’ కృష్ణారావుతో అన్నాడు రఘునాథం.‘అవునా’ అన్నట్లుగా ప్రసాద్‌ని చూశాడు కృష్ణారావు.‘అవును’ అన్నట్లుగా కళ్లార్చాడు ప్రసాద్.‘‘త ల్లో... మేనమామో అన్నారు! నా దగ్గర ప్రసాద్ వుంటే వాళ్లమ్మ దగ్గరున్నట్లే’’నవ్వాడు రఘునాథం.‘‘మీరూ ఇక్కడే! బావతో పాటు మీరూ వుండిపోవాలి! మిమ్మల్ని కూడా మేం వదలం’’ చెప్పింది పూజ.‘‘సరేనమ్మా’’ అని సన్నగా నవ్వాడు కృష్ణారావు. అంతలో ఇందాక రఘునాథంతో మాట్లాడిన డాక్టర్ అక్కడికి వచ్చి-‘‘పేషెంట్‌ని ఎక్కువగా మాట్లాడించడం మందిది కాదు! ప్లీజ్! నన్నర్థం చేసుకోండి’’ అన్నాడు.‘‘ఓకే... ఓకే’’ దాందేముంది! అన్నట్లుగా మాట్లాడాడు రఘునాథం.‘‘వస్తాం అయితే’’ కృష్ణారావుకి చెప్పి బయల్దేరారంతా. వెళ్తోన్న వాళ్లవైపు చూస్తూ-‘‘కాలు పోతే పోయింది! కావల్సిన మనుషులు దొరికారు’’ అన్నట్లుగా పొంగిపోయాడు కృష్ణారావు.------------------------ఎండీ చెప్పిన నెక్ట్స్ మంత్ రానే వచ్చింది. మెగా సీరియల్‌ని ప్లాన్చెయ్యసాగారు. లక్ష్మికి తగిన విగ్గులు తయారు చేశారు. కాస్ట్యూమ్స్ కొన్నారు. అందాలు, ఆభరణాలు లక్ష్మి ముందు కుప్పబోశారు. క్యారెక్టర్ ఫిట్‌నెస్సంటూ, మేకప్ టెస్టంటూ ఫోటోలు తీశారు. బాగుంది లక్ష్మి. ‘హీరోయిన్ అంటే ఇలా వుండాలి’అన్నారంతా. ‘ఎండిగారి సెలక్షన్’ అనగానే ‘ఆయన దృష్టే వేరు! మూడో కన్నుతో చూస్తారాయన’ అని మెచ్చుకున్నారు.రేపు షూటింగ్ స్టార్టంటే ఇవాళ రాత్రి నిద్రపట్టలేదు లక్ష్మికి. ఏదో తెలియని భయం... ఆనందం... తెల్లవారు జాము అయిదుగంటలకే పికప్ కోసం కారొస్తుందని చెప్పారు. అంటే మూడున్నర, నాలుగ్గంటలకే లేవాలి. అందుకని తొందరగా నిద్రపోవాలి. పోవాలంటే నిద్ర రావట్లేదు. షూటింగ్ అనే కాదు, ఇల్లు కూడా కొత్తది. అందువల్ల కూడా నిద్ర రావట్లేదు లక్ష్మికి.‘హీరోయిన్ అయినతర్వాత నువ్వొక్క క్షణం కూడా కంపెనీలో వుండొద్దు!వేరే ఇల్లు చూస్తాను! అక్కడ వుందూగాని’ అంది శకుంతల. అన్నట్లుగానే లక్ష్మికి కంపెనీ నుంచి మార్చి వేరే ఇల్లు చూసి పెట్టింది. జూబ్లీహిల్స్‌లో రోడ్ నెంబరింకా తెలీదు గాని, రెండు మూడు ఆలయాలున్నాయక్కడ. వాటి పక్కగా ఇండిపెండెంట్ హౌస్. చాలా బాగుంది. కారు పెట్టుకునేందుకు పోర్టికో...చిన్న లాన్...పెద్దగా మెయిన్ డోర్. హాలు. హాల్లోంచి మెట్లు. మెట్లెక్కి వస్తే ఇటు బెడ్‌రూం. అటాచ్‌డ్ బాత్రూం. బాత్రూంలో షవర్. బాత్‌టబ్...కోటీశ్వరులుండే ఇల్లులా వుందది. అందులో వుంటోంది లక్ష్మి.సాయంత్రం వరకూ లక్ష్మితోనే వుంది శకుంతల. సాయంత్రం కాగానే కంపెనీ వ్యవహారాలు చూసుకొని, రాత్రికి వస్తానని చెప్పి వెళ్లింది. ఇంకా రాలేదు. ఇంకా రాని శకుంతల కోసం చూడడం వల్ల కూడా లక్ష్మికింకా నిద్రరావట్లేదు.కంపెనీ నుంచి పొద్దున్న ఈ ఇంటికొస్తూ తను అపడు వూరు నుంచి తెచ్చుకున్న సూట్‌కేస్‌తో పాటు తనకెంతగానో నచ్చిన చిలకని కూడా ఇక్కడకు తెచ్చుకుంది లక్ష్మి. నిద్రపట్టకపోవడంతో దానితో కాసేపు కాలక్షేపం చేద్దామని మంచం మీద నుంచి లేచి, బెడ్‌రూం లోంచి బాల్కనీలోకి వచ్చింది.అక్కడ వేలాడుతోన్న పంజరంలో వుంది చిలక. దాని దగ్గరగా లక్ష్మి వస్తోందో లేదో-‘లక్ష్మి లక్ష్మి’ అంటూ ఆనందంగా చిలక ఒకటే గోల చేసింది.‘‘హాయ్’’ పంజరం దగ్గరకొచ్చి చిలకని పలకరించింది లక్ష్మి.‘‘లక్ష్మి’’ అంది చిలక. అది ప్రతి పలకరింపేమో!‘‘ఏం చేస్తున్నావ్’’ అడిగింది లక్ష్మి.‘‘లక్ష్మి’’ అంది చిలక. నిద్ర రావట్లేదని చెప్పిందేమో!‘‘నాకూ నిద్ర రావట్లేదే! ఏంటో వళ్లంతా వేడిగా అదోలా వుంది’’అంది లక్ష్మి.‘‘లక్ష్మి’’ అంది చిలక. నా పరిస్థితీ అంతేనని అర్థమేమో!‘‘రేప్పొద్దున షూటింగ్! రేపట్నుంచి నేను పెద్ద హీరోయిన్ని తెలుసా’’ గొప్పగా చెప్పింది లక్ష్మి.‘‘లక్ష్మి’’ అంది చిలక. అవునా? అని భావమేమో!‘‘అవునే నా బుజ్జి చిలక’’ అని నవ్వుతూ పంజరాన్ని తిప్పింది లక్ష్మీ. పంజరం తిరుగుతోంది. పంజరంలోని చిలకా తిరుగుతోంది. తిరుగుతోన్న చిలక ‘లక్ష్మి లక్ష్మి’ అని అరుస్తోంది. అయినా పంజరాన్ని ఆపక తిప్పుతూ నవ్వుతోంది లక్ష్మి.అలా నవ్వుతూ నవ్వుతో మెయిన్ డోర్ తెరుచుకోవడాన్ని గమనించి కిందకి చూసింది లక్ష్మి.ముందుగా శకుంతల వచ్చింది. ఆమె వెనుక కో డైరెక్టర్ గిరి వచ్చాడు. ఆ వెనక... ఆయన... ఆయన ఎవరు? ఛానెల్ 18 ఎండీగారు!! ఆయనేంటి ఇంతరాత్రి వేళ ఇక్కడికి కొచ్చారు.‘‘రండి బాబూ! రండి’’ ఆహ్వానిస్తోంది శకుంతల.‘‘రండి సార్! రండి’’ వినయంగా తోడుకొని వస్తున్నాడు గిరి.ఎండీ మెట్లెక్కి పైకొస్తున్నాడు. మొగలి పూల వాసన చుట్టేస్తోంది. ఎండీ పూసుకున్న సెంటు వాసనది. ఆ వాసనకి పాములొస్తాయంటారు? పాములా ఇతనొస్తున్నాడేంటి?- ఆశ్చర్య అనుమానాలతో చూస్తోంది లక్ష్మి.ఆశ్చర్య అనుమానాలతో లక్ష్మి చూస్తూండగానే మెట్లన్నీ ఎక్కి పైకొచ్చేశాడు. ఎండి అతన్ని అనుసరించి శకుంతల, గిరీ కూడా పైకొచ్చేశారు.‘‘హాయ్’’ లక్ష్మి దగ్గరగా వచ్చి పలకరించాడు ఎండీ.‘‘హలో’’ అందామనుకుంది లక్ష్మి. కానీ అనలేకపోయింది. నిశ్చేష్టురాలై చూస్తోందంతే!!‘‘ఏయ్’’ అని హెచ్చరించినట్లుగా లక్ష్మిని కుదిపి-‘‘మిమ్మల్నిచూస్తో లక్ష్మి ఆనందాన్ని తట్టుకపోతోంది. నవ్వుతూ ఎండీతో అంది శకుంతల.‘‘సార్‌ని చూసి షాక్ అనుకుంటాను’’ నవ్వాడు గిరి.‘‘ఏంటిది? ఏమైందే నీకు? సారొచ్చేరు! చూడు’’ లక్ష్మికి మళ్ళీ చెప్పింది శకుంతల. ఆమె వినిపించుకోనట్లు అనిపించడంతో లక్ష్మిని గట్టిగా గిల్లింది శకుంతల. దాంతో ‘అబ్బా’ అని తేరుకుంది లక్ష్మి. తేరుకొని గిచ్చిన చోట చేత్తో రుద్దుకుంటూ-‘‘ఏంటండీ మీరు’’ బాధగా అంది శకుంతలతో-‘‘నా సంగతి తర్వాత! ముందు సార్‌ని చూడు’’ చెప్పింది శకుంతల.‘‘నమస్తే సార్’’ ఇటు తిరిగి ఎండీని పలకరించింది లక్ష్మి.‘‘నమస్తే’’ నవ్వాడు ఎండీ. అతనంతా గమనిస్తున్నాడు.‘‘సార్‌ని లోపలకి తీసుకెళ్లు’’అని-‘‘రండి సార్’’ అంటూ ఎండీని లక్ష్మి బెడ్‌రూంలోనికి తోడుకుని వచ్చింది శకుంతల.‘‘ముందలా కూర్చోండి బాబు’’ అని ఎండీకి కుర్చీ చూపించి-‘‘గిరి బాబూ! నువ్వు నాతో పాటురా’’ అని గిరిని తోడుకొని, లక్ష్మిని, ఎండీని రూంలో వదిలి బయటకు వచ్చేసింది శకుంతల. సరిగ్గా అపడక్కడికి వచ్చాడు ఎండీ కారు డ్రైవర్.అతని చేతిలో బొకే వుంది. బొకేతో పాటుగా అతను రూంలోకి వెళ్లబోతుంటే-‘‘నువ్వెక్కడికేంటి’’ అతన్ని అడ్డుకుంది శకుంతల.‘‘లోపల ఎండిగారికి బొకే ఇవ్వాలి’’చెప్పాడు డ్రైవరు.‘‘ఇది తర్వాత ఇవ్వొచ్చుగాని! ముందీ సంగతి చెప్పు! ఎండీ గారు ఏడేడి గా ఏం తీసుకుంటారు?’’ అడిగింది.‘‘ఏడేడిగా ఆయనేం తీసుకోరు! అంతా సల్లగానే తీసుకొంటారు’’‘‘అయితే నువ్వర్జంట్‌గా ఎళ్లి రెండు మూడు బీరు బాటిల్స్ పట్టుకురా’’ గిరికి పురమాయించింది శకుంతల.‘‘అయ్యబాబోయ్! ఏట్నువ్వు’’ ఆశ్చర్యపోయాడు డ్రైవరు.‘‘సల్లగా తీసుకుంటారని నువ్వేకదా చెప్పావు’’ అంది శకుంతల.‘‘సల్లగా అంటే బీరు బాటిల్సా?! బలేదానివే! ఎండీగారు అలాంటివేవీ తీసుకోరు. ఐస్‌క్రీములు, ఫ్రూట్‌జ్యూస్‌లు, కూల్‌డ్రింకులు ఇయే ఆయనకిష్టం’’.‘‘మరలా చెప్పొచ్చుగా’’ అని-‘‘అయితే రెండు కూల్‌డ్రింకులు తీసుకురా’’ అని గిరికి చెప్పి హడావుడిపడుతూ గిరితో పాటు కిందికి దిగింది శకుంతల.చేతిలో బొకేని చూసి‘‘అమ్మ బాబోయ్! ఇది ఎండీగారికి ఇవ్వాలి కదూ’’ అనుకుని, రూంలోకి ప్రవేశించి-‘‘సార్’’ అన్నాడు డ్రైవరు. ఎండీ డ్రైవర్ని చూశాడు.‘‘తీసుకురా’’ అని డ్రైవర్ చేతిలోని బొకే అందుకొన్నాడు. డ్రైవర్ వెళ్లిపోయాడు. వెళ్లిపోయిన డ్రైవర్ వైపో సారి చూసి, తర్వాత తలదించుకొని నిల్చున్న లక్ష్మిని చూసి,‘‘తీస్కో’’ లక్ష్మికి బొకేని అందించాడు ఎండీ.‘‘థ్యాంక్యూ’’ చెప్పింది లక్ష్మి. ఆ చెప్పడం కూడా వణికిపోతూ చెప్పింది.లక్ష్మికేదీ అంతు చిక్కట్లేదు. ‘కీ’ ఇచ్చిన బొమ్మలా ప్రవర్తిస్తోందామె. ఎండీ గారి వెనుక రూంలోకి రావాలి. వచ్చింది. ఎండీగారి ముందు నిలవాలి. నిలబడింది.ఎండీగారు బొకే ఇచ్చారు. తీసుకొంది.‘‘నీతో...సారీ...మీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి’’ లక్ష్మితో ఎండీ అన్నాడు.‘‘చెప్పండి’’ అంది లక్ష్మి.‘‘ముందా తలుపు వేసిరండి’’ చెప్పాడు ఎండీ.‘‘తప్పదా’’ అన్నట్లుగా భయంగా చూసింది లక్ష్మి. ఆ చూపుని అర్థం చేసుకొన్నట్లున్నాడు. తలుపు తను వేసేలా లేదనుకొని, ఎండీయే వెళ్లి తలుపు వేశాడు.లక్ష్మి బెడ్‌రూం తలుపు మూసుకుని పోవడాన్ని కింది నుంచి గిరి, డ్రైవర్‌తో పాటుగా చూసి మురిసిపోయింది శకుంతల.‘‘ఇప్పుడా కూల్‌డ్రింక్స్ అవసర మంటావా’’ అడిగాడు గిరి.‘‘అక్కర్లేదు’’ నవ్వింది శకుంతల.‘‘అదృష్టం అంతా లక్ష్మిదే’’ గొప్పగా చెప్పాడు డ్రైవరు.‘‘అవునవును’’ ఆనందపడింది శకుంతల.‘‘ఎండీ గారు లక్ష్మి దగ్గరకు వస్తున్నారని నువ్వు ఫోన్చెయ్యగానే కంపెనీలో వున్నానేమో నాకు కాలు చెయ్యీ ఆడలేదు! నువ్వు లక్ష్మి ఇంటిదగ్గరకొచ్చెయ్! నేనూ అక్కడికి వచ్చేస్తున్నాను! ఇద్దరం ఇంటిదగ్గరుండి ఎండీ గారి కోసం వెయిట్ చేద్దామని నువ్వు చె ప్పావ్ చూడూ! అప్పుడైతే అయోమయంలో పడిపోయాను. ఆ అయోమయంతోనే ఆటోలో ఎలా వచ్చానో ఇక్కడకి వచ్చాను. వచ్చేసరికే నువ్విక్కడున్నావ్’’ గిరితో గోలగోలగా చెప్పింది శకుంతల.‘‘అయ్యగారంతే!! అనుకున్నారంటే పని అయిపోవలసిందే’ ఎండీని విశ్లేషించాడు అతని కారు డ్రైవర్.‘‘ప్రోగ్రాం అంతా మనకిదిగ్గో ఈ డ్రైవరే చెప్పాడు!! దాంతోనే నేను నీకు ఫోన్చేశాను.’’ సంగతంతా తనకి డ్రైవర్ చెప్పాడన్నది తేల్చేశాడు గిరి.‘‘ఏదైతేనేం! ఆఖరికి లక్ష్మి బూరెల గంపలో పడింది’’ సంబరపడింది శకుంతల. అలా సంబరపడుతూనే పైన తలుపు మూసి వున్న లక్ష్మి బెడ్‌రూం కేసి చూసింది.ఆ తలుపులు ఇప్పుడప్పుడే తెరుచుకోవు! తెరుచుకోకూడదు కూడా! అనుకొని-‘‘రండి మనం ఇక్కడ కిందన వుండడం కూడా మంచిది కాదు. వెళ్లి కారులో కూర్చుందాం’’ అని గిరిని, డ్రైవర్‌ని తోడుకుని ముందుకి నడిచింది శకుంతల.------------------------------------టక్...టక్....టక్....చంకల్లో క్రచర్స్ వుంచుకొని, వాటి సాయంతో ఒంటికాలి మీద నడుస్తున్నాడు కృష్ణారావు. వీలయినప్పుడల్లా ఇలా నడవడాన్ని డాక్టర్ ప్రాక్టీసు చెయ్యమంటే చేస్తున్నాడతను. ఇంత రాత్రి వేళ ఈ నడక ఏంటంటే? పొద్దుటిపూట పెద్ద పెద్ద వాళ్లు వచ్చిపోతుంటే, నడకని ప్రాక్టీసు చేస్తూ లాన్‌లో తిరగడం బాగోదు కాబట్టి, రాత్రి వేళ అంతా పడుకొన్న సమయంలో నడిస్తే, ఎవరికీ ఎటువంటి ప్రాబ్లమ్ వుండదని కృష్ణారావు ఆలోచన.నెలరోజులుగా ఆస్పత్రిలో స్పెషల్ రూంలో వుండి, మొన్ననే డిశ్చార్జ్ అయ్యాడు కృష్ణారావు. డిశ్చార్జ్ అయి రఘునాథం బంగ్లాలో ఔట్‌హౌస్‌లో వుంటున్నాడతను.‘‘ప్రసాద్ బావతో పాటు మీరూ ఈ బంగ్లాలో వుండండంకుల్’’’ అంది పూజ.‘‘ఫర్వాలేదు! నాకు ఔట్‌హౌసే బావుంటుంది.’’ చెప్పాడు కృష్ణారావు. తనతో కలిసి ప్రసాద్ వుంటానంటే కృష్ణారావే వద్దన్నాడు. ఎంతగానో చెప్పి చూశాడు ప్రసాద్. అయినా కృష్ణారావు వినలేదు.‘‘ఏంటిసార్! వాకింగా’’ మెయిన్ గేట్‌కి తాళం వేసి, తొలివిడతగా బంగ్లాని చుట్టి రావడానికి చేతిలో టార్చ్‌తో వెళ్తూ కృష్ణారావుని పలకరించాడు వాచ్‌మేన్.‘‘అవునయ్యా’’ చెప్పాడు కృష్ణారావు.‘‘కానివ్వండయితే! కాని కొంచెం జాగ్రత్త’’ అని హెచ్చరించి, వాచ్‌మెన్ వెళ్లిపోయాడు.బంగ్లాలో బయట నాలుగు వైపులా తప్ప లోపల ఒక్క లైటు కూడా వెలుగుతూ కనిపించడం లేదంటే రాత్రి పదకొండు గంటలు దాటి వుంటుంది. ప్రసాద్ రూంలో కూడా వెలుగులేదంటే, అతను కూడా పడుకొని వుంటాడనుకొని నడుస్తున్నాడు కృష్ణారావు.సింహంలాంటి కింగ్(కుక్క) ఎదురొచ్చింది. చూసి భయపడ్డాడు కృష్ణారావు. నిలబడిపోయాడు. కింగ్ వచ్చి కృష్ణారావు కాలుని, క్రచర్స్‌ని వాసన చూసింది.‘‘కమాన్ కింగ్! కమాన్’’ వాచ్‌మేన్ కేక వినవచ్చింది. దాంతో కింగ్ కేక వినవచ్చిన వైపుగా పరుగు అందుకొంది. బ్రతికానన్నట్లుగా ఊపిరి తీసుకొని మళ్లీ నడవసాగాడు కృష్ణారావు.అపడే హైదరాబాద్ వచ్చి నెల పైనే అయ్యింది. చెల్లెలు కనిపించలేదు సరికదా, కాలొకటి పోగొట్టుకున్నాడు. ఎవరో చేరదీస్తే దయతో ఇంత అన్నం పెడితే తింటున్నాడు. ఎందుకిలా జరిగింది!! ఏంటిదంతా? అంటే జవాబు దొరకదు!ఆలోచిస్తూ నడుస్తోంటే కృష్ణారావు కాలికేదో తగిలింది. బాలెన్స్ తప్పాడతను. తూలి ముందుకి పడుతున్నాడు. ఎదురుగా సిమెంట్ బెంచీ వుంది. దానికి తన తల కొట్టుకోవడం ఖాయం. గాయం తప్పదనుకున్నాడు. అంతలో రెండు చేతులు వచ్చి అతన్ని ఆదుకున్నాయి. కృష్ణారావుని పొదివి పట్టుకున్నాయి. ఆ చేతులు ప్రసాద్‌వి.‘‘ఏంటి సార్ ఇది! ఈ రాత్రి వేళ ఇప్పుడీ నడక ఇదంతా ఎందుకు చెప్పండి’’ బాధపడ్డాడు ప్రసాద్.‘‘ఎందుకంటే ఈనాటి ఈ నడకే రేపు పరుగవుతుంది. రేపు లక్ష్మి కనిపించేనాటికి నేను పరిగెత్తాలి’’ చెప్పాడు కృష్ణారావు.‘‘లక్ష్మి కనిపిస్తుందంటారా’’ ఆశగా అడిగాడు ప్రసాద్.‘‘కనిపిస్తుంది! కనిపించి తీరాలి! అంత వరకూ నేను నిద్రపోను’’ అని ప్రసాద్ చేతులనుంచి విడివడి క్రచర్స్‌తో నడుస్తూ ముందుకి సాగిపోయాడు కృష్ణారావు. అలా సాగిపోతోన్న కృష్ణారావుని చూస్తూ-‘‘లక్ష్మి కనిపించే వరకూ నేనూ నిద్రపోను’’ అనుకున్నాడు ప్రసాద్.-----------------------మూడు పెగ్గులయ్యాయి. నాలుగో పెగ్గు గ్లాసులో పోసుకుంటున్నాడు డైరెక్టర్. మందిలా గ్లాసులో పడిందో లేదో అతని చేతిలోంచి బాటిల్‌ని లాక్కుంది చిన్నకోడలు హీరోయిన్.‘‘మేడం’’ చిరాకు కనపడకుండా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్.‘‘ముందు రేపేం చెయ్యబోతున్నారో చెప్పండి’’ గట్టిగా అడిగింది హీరోయిన్.‘‘చెప్పానుగా! చెబితే అందులో అందం లేదు! రేపు మీరు సెట్‌లో చూడాల్సిందే! చూస్తేనే అందం’’‘‘నేనప్పటి వరకూ ఆగలేను! రేపు లక్ష్మిని మీరేం చెయ్యబోతున్నారో ముందు నాకు చెప్పండి ప్లీజ్’’‘‘చెబితే అందులో థ్రిల్లుండదు మేడం’’‘‘చెబితేనే మీకీ మందు నేనిచ్చేది! లేదంటే! నో!’’‘‘అయితే వినండి’’‘‘చెప్పండి’’ ఆసక్తిగా అడిగింది.‘‘రేపు ఫస్ట్ సీనేంటో తెలుసా? హీరోయిన్ మీద విలన్‌గాడు దాడి చెయ్యడం!’’‘‘ప్రతి సీరియల్‌లోనూ వుంటుందా సీను! విషయం!! విషయం ఏంటో చెప్పండి’’ రెట్టించింది.‘‘అదే! అదే! అక్కడికే వస్తున్నాను!రేపు ఫస్ట్ సీన్లో లక్ష్మి మీద విలన్‌గాడు దాడిచేస్తాడు! అదీ దేంతో తెలుసా?’’‘‘చెప్పండి’’ ఉత్కంఠను తట్టుకోలేకపోతోంది హీరోయిన్.రాత్రి తొమ్మిదిగంటలప్పుడు ఫోన్చేసి ‘‘మేడం మీకో గుడ్‌న్యూస్ చెప్పాలనుకుంటున్నాను!! నన్ను మీ ఇంటికి రమ్మంటారా’’ అడిగాడు డైరెక్టర్.గుడ్‌న్యూస్ ఏముంటుంది? రేపు లక్ష్మి హీరోయిన్‌గా సీరియల్ ప్రారంభం కాబోతోంది. అందుకు సంబంధించి తాము ఇంతకు ముందు అనుకున్నట్లుగానే లక్ష్మిని సింగిల్ ఫ్రేమ్‌లో కూడా ‘ఓకే’ చెయ్యకుండా అడ్డుపడుతూ వచ్చి ఆఖరికి ఆమె పనికి రాదని తేల్చేస్తాడు డైరక్టర్. అదేనా? ఆ విషయమే అడిగింది హీరోయిన్.‘‘కాదు’’ అన్నాడు డైరక్టర్.‘‘మరేంటి?’’ అడిగింది.‘‘పనికిరాదని మనం చెప్పడం కాదు మేడమ్! జనం చెప్తారు!! ఆ లెవల్లో వర్కవుట్ చేశాను’’చెప్పాడు డైరెక్టరు.‘‘తొందరగా రండయితే’’ చెప్పింది హీరోయిన్. డైరక్టర్ వచ్చాడు. వచ్చిన దగ్గర్నుంచీ తాగుతూ కూర్చున్నాడే తప్ప విషయంలోకి రాడే! అందుకే బాటిల్ లాక్కుంది హీరోయిన్. లాక్కున్న దగ్గర్నుంచి జరుగుతోన్నదంతా తెలుస్తూ వున్నదే!‘‘ప్లీజ్! బాటిల్...బాటిల్ ఇవ్వండి’’ హీరోయిన్ని అడిగాడు డైరక్టర్. అతనేం చెప్పదలచుకున్నాడో అది మరిచిపోయినట్లున్నాడు.‘‘మందు సంగతి తర్వాత! ముందు అసలు సంగతి చెప్పండి’’ హీరోయిన్లో సహనం నశిస్తోంది.‘‘లక్ష్మి మీద విలన్ దాడి దేంతో తెలుసా?’’‘‘దేంతో’’‘‘యాసిడ్‌తో’’అంతే! ఆ మాటకి అలా వుండిపోయింది హీరోయిన్. చేష్టలుడిగిపోయింది. అదంతా ఓ క్షణమే! మరు క్షణంలో ఆనందాన్ని తట్టుకోలేక తెరలు తెరలుగా నవ్వింది. నవ్వుతున్నప్పుడు ఆమె గాలికి ఊగుతోన్న ముంత మామిడికొమ్మలా వూగిపోయింది. ఆ వూగిపోతున్నప్పుడు ఆమె చేతిలోని బాటిల్ ఎక్కడ జారి పడుతుందోమోనని భయపడ్డాడు డైరక్టర్. అందుకని ‘‘మేడం! మేడం’’ అంటూ గగ్గోలెత్తాడు.‘ఫర్వాలేద’న్నట్లుగా చేత్తో సైగ చేసి, బలవంతాన నవ్వు ఆపుకొని-‘‘గుడ్! ఇప్పుడు నువ్వు నాకు నచ్చావ్ డైరక్టర్! ఐ లైక్ యూ’’ అని డైరక్టర్ చేతిని ముద్దుపెట్టుకుంది హీరోయిన్.‘‘తీసుకోండి’’ అంటూ మందు బాటిల్‌ని అతనికి అందించింది. అందివ్వడమే ఆలస్యం గ్లాసులో మందు పోసుకొని నాలుగో పెగ్గు సిప్ చేస్తూ-‘‘సీనేంటో డిస్‌క్రైబ్ చెయ్యనా మేడం ’’అడిగాడు డైరెక్టర్.‘‘చెయ్యండి! కళ్లకి కట్టినట్లు అద్భుతంగా చెయ్యండి’’‘‘రోలింగ్ ఛైర్లో కూర్చుని హీరోయిన్ అంటే మన లక్ష్మి, ఆలోచిస్తుంటే చేతిలో యాసిడ్ బాటిల్‌తో ఎంట్రీ అవుతాడు విలన్.యాసిడ్ బాటిల్, లక్ష్మి ఫేస్, లక్ష్మిఫేస్, యాసిడ్ బాటిల్ అలా సైమల్‌టేనియస్‌గా రెండూ చూపిస్తో, టెన్షన్ బిల్డప్ చేసి ఆఖరికి కసిగా కోపంగా విలన్, యాసిడ్‌ని లక్ష్మి మొహమ్మీద పోసేస్తాడు. మంటలు.. పొంగులు... గోల... ఆఖరికి వికృతంగా చూడ్డానికే అసహ్యంగా, భయంకరంగా లక్ష్మి...కట్! ఎలా వుందీ ఐడియా’’‘‘సూపర్బ్’’ చప్పట్లు కొట్టింది హీరోయిన్.‘‘గాజు బాటిల్లో ఇనో పోసి యాసిడ్ అని ప్రేక్షకుల్ని నమ్మించడం కాదు! నిజం...నిజమైన యాసిడ్‌నే బాటిల్లో పోస్తాం. అలా సెట్ కుర్రాణ్ని మౌల్డ్ చేశాను!! ఎలా వుంది ప్లాన్’’‘‘అదిరిపోయింది’’ మెచ్చుకుంది హీరోయిన్.‘‘లక్ష్మి హీరోయిన్ కాకూడదన్నారు మీరు! హీరోయిన్ కాదు! కనీసం రోడ్డుపక్క బిచ్చగత్తెగా కూడా దాన్ని జనం యాక్సెప్ట్ చెయ్యకూడదు. చెయ్యనివ్వను! ఇది మీకు నా నజారానా! బావుందా?’’ అడిగాడు డైరక్టర్.‘‘ఫెంటాస్టిక్’’ అంది హీరోయిన్.‘‘థ్యాంక్యూ’’ అని చేతిని చాచి, హీరోయిన్ చేతిని అందుకున్నట్లుగా ఫీలయి,‘‘బై! గుడ్‌నైట్’’ అని చేతిని వెనక్కి తీసుకొని ముందడుగు వెయ్యబోయి, సోఫాలో పడి గుర్రుపెట్టి నిద్రపోయాడు డైరక్టర్.రేపు ఇంత ప్రోగ్రాం పెట్టుకొని వీడు ఇక్కడ తనింట్లో పడుకుంటే ఎలా?ఆలోచించింది హీరోయిన్.వీడికి మత్తు వదిలి, వీడు మామూలవ్వాలి. అవ్వాలంటే ఏం చెయ్యాలి?కంగారు పడిందామె. అటూ ఇటూ చూసింది. ఆ చూపుకి డైనింగ్ టేబుల్ మీద అది కనిపించింది. దాంతో అటుగా పరుగు దీసింది హీరోయిన్.పరుగున డైనింగ్ టేబుల్ దగ్గరగా వచ్చింది హీరోయిన్. అక్కడ్నుంచి అటుగా, సోఫాలో గుర్రు పెట్టి నిద్రపోతోన్న డైరెక్టర్ని చిరాగ్గా చూసి, టేబుల్ మీది అదేదది? పెరుగు...పెరుగు గిన్నెను అందుకొంది. అందులో జగ్‌లోని వాటర్ని పోసి, చేత్తోనే చిలకరించి, మజ్జిగ చేసి, దాంతో డైరెక్టర్ దగ్గరకి వచ్చింది. నోరు తెరిచి నిద్రపోతూ ‘గుర్రు’ సౌండిస్తోన్న డైరెక్టర్ని అసహనంగా చూసి, మజ్జిగని అతని గొంతులో పోసింది. పొలమారి డైరెక్టర్ లేస్తాడనుకుంది హీరోయిన్. పొలమారలేదు సరికదా, డైరెక్టర్ గుటకలేస్తూ మజ్జిగంతా తాగేశాడు. గిన్నె ఖాళీ అయిపోయింది. ఖాళీ గిన్నెనోసారి చూసి తర్వాత డైరెక్టర్ని కసిదీరా చూసి, చేతిలోని గిన్నెతో డైరెక్టర్ నెత్తిన మొత్తింది హీరోయిన్. దెబ్బకి చావనైనా చావాలి! లేదంటే మత్తుని వదుల్చుకొని, స్పృహలోకి వచ్చి డైరెక్టర్ లేవనైనా లేవాలి. ఆ ఆలోచనతోనే కొట్టింది హీరోయిన్. ఆమె ఆలోచన ఫలించింది.‘‘అబ్బా! నొప్పి! కొట్టొద్దు మేడం’’ అన్నాడు డైరెక్టర్.‘‘మరి లేవండి’’ కోపంగా అంది హీరోయిన్.‘‘అప్పుడే తెల్లారిపోయిందా’’ అడిగాడు.‘‘లేదు కానీ, మీరిలా పడుకుంటే మన బతుకులు తెల్లారిపోతాయి.! ముందు లేవండి’’ గట్టిగా కసిరింది.‘‘ఇదిగో’’ అంటూ లేచి కూర్చున్నాడు డైరెక్టర్. అంతే! ‘భళ్లున’ వాంతి చేసుకొన్నాడు.‘‘కంపు’’ అని ముక్కు మూసుకొంది హీరోయిన్.-------------------ఉదయం ఏడు గంటలయింది. అయినా ఇంకా ప్రసాద్ నిద్ర లేవలేదు. పడుకునే వున్నాడు-చూసి ఉత్తుత్తినే కోపం తెచ్చుకుంది పూజ. చేతుల్ని పిడికిళ్లు చేసి బిగించి ‘ఆ’ అని గట్టిగా అరచి-‘‘బావా! బావా’’ పిలిచింది. ఫలితం లేదు. ప్రసాద్ లేవలేదు.ఎనిమిది గంటలకల్లా డైనింగ్ టేబుల్ దగ్గర ప్రసాద్‌తో రఘునాథం చాలా మాట్లాడాల్సి వుంది.పూజ చదివే కాలేజీలో నువ్వూ జాయినవుతావా? లేదంటే వేరే కాలేజీలో జాయినవుతావా?పూజ నువ్వూ ఒకే కారులో వెళతారా? లేదంటే నువ్వొక్కడివీ వేరే కారులో వెళ్తావా?పూజ సాయంత్రం పూట డాన్స్ నేర్చుకుంటోంది! నువ్వూ నేర్చుకో!!రేపాదివారం ఏం చెయ్యబోతున్నావ్? నీకంటూ ప్రత్యేకించి ఏ ప్రోగ్రామూ లేదు కదా! లేనప్పుడు పూజ, నువ్వూ ఇద్దరూ చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వెళ్లి రావచ్చుగా?ప్రసాద్‌తో ఇవన్నీ మాట్లాడాలి. మాట్లాడమని రఘునాథానికి పూజే చెప్పింది.‘‘ఎయిటోక్లాక్‌కల్లా ప్రసాద్‌ని డైనింగ్ టేబుల్ దగ్గర రెడీ చెయ్యి! అన్నీ ఒకటొకటే అడిగేస్తాను’’ పూజతో చెప్పాడు రఘునాథం.‘‘పిలుచుకొస్తానైతే’’ అంటూ బయల్దేరొచ్చి, ప్రసాద్ ఇంకా లేవకపోవడాన్నిచూసి పిచ్చెత్తిపోతోంది పూజ.‘నిన్నెలా లేపాలో నాకు తెలుసు బావా! బాగా తెలుసు!’ అనుకొని, ఎసి ఆఫ్ చేసింది పూజ. వెళ్లి కిటికీకి వున్న కర్టెన్ తొలగించి, కిటికీ తలుపులు తెరిచింది. వెలుగు ప్రసాద్ మొహమ్మీద ఫోకస్‌లా పడుతోంది. తిరుగుతోన్న ఫ్యాను కూడా ఆఫ్ చేసింది. ఇక తప్పనిసరి! ప్రసాద్ లేస్తాడనుకొందామె. అయినా లేవలేదు ప్రసాద్. దాంతో ‘‘బావా’’ అని నుదురుకొట్టుకుని బెడ్ మీది దుప్పటి తీసి-‘‘లే! నిన్నే! లెమ్మంటుంటే’’ అంటూ ప్రసాద్‌ని దుప్పటితో కొట్టసాగింది పూజ. రెండు మూడు దెబ్బల వరకూ ప్రసాద్‌కి మెలకువ రాలేదు. నాలగోదో, అయిదోదో ఆ దెబ్బకి మాత్రం మెలకువ వచ్చిందతనికి. వచ్చి-‘‘ఏంటి పూజా! పొద్దున్న పొద్దున్నే ఏంటీ అల్లరి’’ అంటూ లేచి కూర్చున్నాడు.‘‘ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా’’ అడిగింది పూజ.‘‘తెలీదు’’ చెప్పాడు ప్రసాద్.‘‘ఏడూ పది! ఎనిమిది గంటలకల్లా నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గరుండాలి. మా డాడీ నీతో ఏదో మాట్లాడాలంట’’‘‘సరిగ్గా ఎనిమిది గంటలకి, డైనింగ్ టేబుల్ దగ్గర తప్ప ఇంకెక్కడా, ఇంకో టైములో అంకుల్ నాతో మాట్లాడరా’’‘‘మాట్లాడరు’’‘‘అని అంకుల్ చెప్పారా! నువ్వు చెప్తున్నావా’’‘‘నేనే చెప్తున్నాను!’’ అని చిటికెలేస్తూ-‘‘కమాన్! కమాన్! తొందరగా రెడీ అవ్వు’’ అంటూ బెడ్ మీది ప్రసాద్‌ని బలవంతాన లేపి, నిలబెట్టి, అతడ్ని బాత్రూంలోకి నెట్టింది పూజ.‘‘తలుపేసుకో’’ నవ్వుతూ అరిచింది. తలుపేసుకున్నాడు ప్రసాద్.అయిదునిమిషాల తక్కువ ఎనిమిదయింది.డైనింగ్ టేబుల్ దగ్గర రఘునాథం పూజ కూర్చుని వున్నారు. ప్రసాద్ ఇంకా అక్కడికిరాలేదు.‘‘టిఫెన్ పెట్టమంటారా సార్’’ అప్పటికది రెండోసారి అడగడం. రఘునాథాన్ని సర్వరడిగాడు.‘‘ప్రసాద్ రానీ’’ చెప్పాడు రఘునాథం.‘‘ఇంతకీ టిఫినేంటి’’ సర్వర్‌ని అడిగింది పూజ.‘‘పెసరట్టమ్మా! ఉల్లి పెసరట్టు’’ చెప్పాడు సర్వర్.ఆ మాటకి పెసరట్టంటే ఇష్టమైన రఘునాథం ‘‘అయితే ఆలస్యం దేనికి! తీసుకురా’’ అనబోయి,పూజని చూసి, ప్రసాద్ రాలేదన్నది గుర్తుకి తెచ్చుకుని ఆగిపోయాడు, ఆగిపోయినా ఆక్రోశాన్ని దాచుకోలేక-‘‘ఏంటమ్మా! ప్రసాద్ రాడేంటి? టైం! టైం సెన్స్ లేదమ్మా మీ బావకి’’ అన్నాడు.‘‘అన్నీ వస్తాయి డాడీ! నేనున్నాను కదా! నేనన్నీ నేర్పుతాను’’ అంది పూజ.‘‘అది కాదమ్మా! అవతల ఉల్లిపెసరట్టు...’’‘‘తిందురుగాని డాడీ! అదిగో మాటల్లోనే బావొస్తున్నాడు’’ అంటూ తండ్రి మాటని పూర్తికానివ్వలేదు పూజ.‘‘రా బావా’’ అని ప్రసాద్‌ని ఆహ్వానిస్తున్నట్లుగా లేచి నిలబడింది.చేతి వాచీకేసి చూశాడు రఘునాథం. సరిగ్గా ఎనిమిదిగంటలయింది. అది గమనించింది పూజ.గమనించి తండ్రితో-‘‘టైమంటే టైమే డాడీ! బావ టైముని బలే ఫాలో అవుతాడు’’ అని నవ్వింది. ముగ్గురికీ పెసరట్లు పెట్టాడు సర్వర్. తింటున్నారు. టిఫిన్లో పడి అసలు విషయం మరిచిపోయిన రఘునాథానికి ఆ విషయం గుర్తు చేస్తున్నట్లుగా-‘‘డాడీ’’ అంది పూజ.‘‘ఏంటమ్మా’’ పెసరట్ల మీద విజృంభిస్తూ అడిగాడు రఘునాథం‘‘బావతో మీరేదో మాట్లాడాలన్నారు’’‘‘అవునవును! మరిచేపోయాను’’ అని-‘‘ఇదిగో ప్రసాద్’’ అన్నాడు రఘునాథం.‘‘చెప్పండంకుల్’’‘‘మీ వూరు నుంచి నీ కాలేజీ పేపర్లన్నీ వచ్చేశాయ్! మీ అమ్మతోను, నాన్నతోనూ అన్నీ మాట్లాడాను. నువ్విక్కడే ఏదో కాలేజీలో చదువుకోవాలి! ఏ కాలేజీలో చదువుతావ్’’‘‘ఏ కాలేజీయో ఎందుకు డాడీ! బావ మా కాలేజీలోనే చదువుతాడు ! మా కాలేజీలో పిజి కూడా వుంది! ఓ అయిదేళ్లపాటు కాలేజీ మారనక్కర్లేదు’’‘‘అవునవును! అయితే పూజ చదివేకాలేజీలోనే నువ్వూ చదువు! ఏమంటావ్’’ ప్రసాద్‌ని అడిగాడు రఘునాథం.‘‘మీ ఇష్టం అంకుల్’’ అన్నాడు ప్రసాద్. ఆ మాటకి ‘హెహేయ్’ అంటూ గుండెల్లోనే ఆనందించింది పూజ.‘‘అన్నట్లు! నీకంటూ స్పెషల్‌గా ఓ కారు కావాలా’’ ప్రసాద్‌ని అడిగాడు రఘునాథం.‘‘అక్కర్లేదంకుల్! పూజ కారుందిగా! అందులో వెళతాను! పైగా ఇద్దరిదీ ఒకే కాలేజీ కదా’’చెప్పాడు ప్రసాద్. ఆ మాటకి ‘యూహూ’ అంటూ ఎగిరిగంతేయబోయి, ఉత్సాహాన్ని ఆపుకుంది పూజ.‘‘పూజ డాన్స్‌నేర్చుకుంటోంది! నీకు తెలుసా’’ అడిగాడు రఘునాథం.‘‘తెలుసంకుల్!’’‘‘నువ్వూ నేర్చుకోకూడదూ’’‘‘వొద్దులేండకుల్’’ నవ్వాడు ప్రసాద్.‘‘దానికి సిగ్గుపడాల్సిందేమీ లేదు బావా! నేర్చుకోవచ్చు! మా ఆడాళ్లకన్నా మీ మగాళ్లే ఎక్కువ మంది నేర్చుకొంటున్నారు’’‘‘ఆలోచిద్దాంలే’’ అన్నాడు ప్రసాద్. ఆ మాటకి ‘చాలు బావా! చాలు’ అంటూ పొంగిపోయింది పూజ.‘‘తర్వాత ప్రసాద్’’‘‘చెప్పండంకుల్’’‘‘రేపాదివారం నీకేమైనా ప్రోగ్రాం వుందా?’’ అడిగాడు రఘునాథం.‘‘లేదంకుల్’’‘‘మరలాంటప్పుడు-నువ్వూ, పూజా సరదాగా చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వెళ్లొచ్చుగా’’‘‘వెళ్లొచ్చు’’ అన్నాడు ప్రసాద్.‘‘వెళ్లిరండి’’ తేల్చేశాడు రఘునాథం.‘‘సరే అంకుల్’’‘థ్యాంక్యూ బావా! థ్యాంక్యూ వెరీమచ్’ మనసులోనే ప్రసాద్‌కి కృతజ్ఞతలు చెప్పుకొంది పూజ.నెలరోజులుగా ప్రసాద్‌ని గమనిస్తూ వస్తోంది పూజ. ప్రసాద్ అందగాడు. అనుమానం లేదు. ప్రసాద్ మంచివాడు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. అందుకని ప్రసాద్‌ని ప్రేమించాలి. సొంతం చేసుకోవాలి అనుకుంది పూజ. ఆ అనుకోవడంతోనే ఈ తతంగం అంతా నడుపుతోంది. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ, ఒక కాలేజీలో చదువుతూ, సాయంత్రం సరదాగా డాన్స్ నేర్చుకుంటే ఇద్దరు బాగా దగ్గరయ్యే అవకాశం వుంది. మాటా మాటా మనసూ మనసూపంచుకుని ఇవాళ కాకపోతే రేపు! రేపు కాకపోతే ఎల్లుండి! ఎల్లుండి కాకపోతే ఆవలెల్లుండయినా ఇద్దరూ ఒకటి కావచ్చన్నది పూజ ఆలోచన. ఆ ఆలోచన సక్సెసయ్యేందుకే చిలుకూరు బాలాజీ సందర్శన.టిఫిన్లు అయ్యాయి.‘‘మరి నేను ఆఫీసుకి వెళ్లొస్తాను’’ అని లేచాడు రఘునాథం.‘‘మేం కూడా కాలేజీకి వెళ్లొస్తాం’’ తండ్రికి చెప్పింది పూజ.‘‘వెళ్లిరండి’’ అని రఘునాథం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.‘‘వెళదామా’’ ప్రసాద్‌ని అడిగింది పూజ.‘‘కాలేజీ ఎన్ని గంటలకి’’ ప్రసాద్ అడిగాడు.‘‘పది గంటలకి’’‘‘ఇంత తొందరగా దేనికైతే?’’‘‘ఇప్పుడు బయల్దేరితే ఆ టైముకి కాలేజీకి చేరుకుంటాం! మధ్యలో ఎన్ని ట్రాఫిక్ జాంలో... ఎన్ని కథలో నీకేం తెలుసు! పదపద’’ తొందర చేసింది పూజ.‘‘పదయితే’’ బయల్దేరాడు ప్రసాద్. అంతలో పూజ సెల్ రింగయింది.‘‘హలో’’ మాట్లాడింది పూజ.‘‘పూజా! నేనే’’ అంటూ పూజ ఫ్రెండ్ అటునుంచి మాట్లాడసాగింది.‘‘ఏంటి విషయం?’’ అడిగింది పూజ.‘‘ఇవాళ మన కాలేజీలో సీరియల్ షూట్ చేస్తున్నారు తెలుసా’’ అడిగిందా ఫ్రెండ్.‘‘తెలీదు’’ అని తర్వాత-‘‘అద్సరే! హీరోయిన్ ఎవరు?’’ అడిగింది పూజ.‘‘నాకూ తెలీదు!సీరియల్ షూటింగ్ వుంది!అంతే తెలుసు’’ చెప్పిందా ఫ్రెండ్.‘‘సరే!కాలేజీలో కలుద్దాం అయితే’’ అని లైన్ కట్చేసి, జరిగిన సంభాషణేదీ పట్టించుకోక, ఏదో ఆలోచిస్తునట్లున్న ప్రసాద్‌తో-‘‘కమాన్ బావా!పద’’ అంటూ ప్రసాద్‌ని తోడుకుని ముందుకి నడించింది పూజ.నడుస్తూ నడుస్తూ, క్యాజువల్‌గా పట్టుకొన్నట్లుగా ప్రసాద్ చేతిని పట్టుకుంది పూజ. దాన్ని ప్రసాద్ పట్టించుకోలేదుకాని, కావాలనే ప్రసాద్ చేతిని పట్టుకొన్న పూజకు తెలీని ఆనందం కట్టలు తెంచుకుంది. సెలయేళ్లు, నదులు, జలపాతాలు, ఉవ్వెత్తున గుండెల్లో ప్రవహిస్తున్నట్లుగా వుందామె పరిస్థితి. గుండెల్లో పెనుగంగా ప్రవాహం వున్నా ఆమె గొంతెందుకో తడారిపోతోంది.-------------------------కాలేజీ గార్డెనంతా చాలా హడావుడిగా వుంది. సీరియల్ షూటింగైనా సినిమా షూటింగ్‌లా బిల్డప్ ఇస్తున్నారంతా. ఒక పక్క దేవుళ్ల ఫోటోలు పెట్టి పూజ కోసం సిద్ధం చేస్తున్నారు. మరో పక్క లైట్లు, కెమెరా, హాఫ్‌ట్రాలీ సరంజామా సిద్ధమవుతోంది.‘‘ముహూర్తం ఎన్ని గంటలకి సార్’’ కెమెరామన్ డైరెక్టర్ని అడిగాడు.‘‘పది గంటల ఎనిమిది నిమిషాలకి’’ చెప్పి తల పట్టేసినట్టుందేమో కణతలు, నుదురూ నొక్కుకోసాగాడు.‘‘పూజకి ఎండీగారొస్తారా’’‘‘ప్రతి సీరియల్ పూజకి ఆయనెందుకు?రారు!!’’ అని బాధగా ‘ఆ’ అన్నాడు.‘‘ఏమైంది సార్’’‘‘హ్యాంగోవర్’’‘‘రాత్రి మందెక్కువైందా?’’‘‘లేదు!!వాంతులెక్కువయ్యాయి’’ చెప్పాడు డైరక్టర్.క్లాస్ రూం ఒకదాన్ని గ్రీన్ రూం చేసి మేకప్ అవుతున్నారంతా. లక్ష్మికి మేకప్ అయిపోయింది. తుది మెరుగులు దిద్దుతున్నారు. రాత్రి జరిగిందంతా గుర్తుకొస్తోంది లక్ష్మికి. ‘మీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి. తలుపు వెయ్యమని’ చెప్పి వెయ్యకుండా తను నిల్చుంటే ఎండీనే వెళ్లి తలుపు వేసి-‘‘అసలీ రాత్రి మిమ్మల్ని కలవాలని నేనెందుకొచ్చానో తెలుసా లక్ష్మిగారూ’’ అడిగాడు ఎండి.తెలీదన్నట్లుగా తలూపింది లక్ష్మి.‘‘కింద అందరూ అనుకొంటున్నట్లుగా మీ మీద కోరికతో నేనురాలేదు! మీకో రహస్యం చెప్పి పోదామని వచ్చాను’’‘‘ఏంటది’’ అన్నట్లుగా ఆందోళనగా, ఆశ్చర్యంగా చూసింది లక్ష్మి.‘‘చిన్న కోడలు హీరోయిన్ లేదూ’’‘‘ఉంది’’‘‘క్రైం వాచ్ డైరెక్టర్ లేడూ’’‘‘ఉన్నాడు’’‘‘వాళ్లిద్దరూ కలిసి మిమ్మల్నేదో చేద్దామనుకుంటున్నారట! మీరు కొంచెం జాగ్రత్తగా వుండండి! ఈ విషయం నేనే వచ్చి నేరుగా మీకెందుకు చెపుతున్నానంటే... ఎవర్నీ నమ్మలేని పరిస్థితి! ఎవరికి చెప్పి విషయం చెప్పమన్నా మీకు చెప్పరేమోనని అనుమానం!’’‘‘ఏం చేద్దామనుకుంటున్నారు’’ భయపడింది లక్ష్మి.‘‘అదే తెలీట్లేదు! మొత్తానికి ఏదో ప్లాన్చేస్తున్నారు! డైర్టెకర్ని తీసేద్దామంటే మొదటరోజే గొడవలు అసహ్యంగా వుంటాయని ఆలోచిస్తున్నాను! హీరోయిన్ని హెచ్చరిద్దామంటే-తను మాకు దూరపు బంధువయింది. ఏం అన్నా రేపు ముఖముఖాలు చూసుకోలేం! ఇదంతా దేనికి? షూటింగ్ క్యాన్సిల్ చేద్దామంటే మీ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆలోచిస్తున్నా. కొత్త హీరోయిన్ కెమెరా ముందుకి రాకుండానే షూటింగ్ క్యాన్సిల్ చేశారంటే... ఊహకందదు! మీరీ ఫీల్డ్‌లో వుండరు! అందుకే అంతా ఆలోచించే మీ దగ్గరకొచ్చాను’’‘‘ప్రాణాలయితే పోవుకదా’’ లక్ష్మి కళ్లు చెమర్చుకుంది.‘‘ఛఛ! అంతకు తెగించరు లెండి! కాకపోతే ఏ ప్రమాదం తలపెట్టారో ఏమోనని ఒకటే ఆందోళనగా వుంది! ఏది ఏమైనా రేపు షూటింగ్ స్టార్టవుతోంది. మీరు హీరోయిన్ అవుతున్నారు! ఇది పక్కా’’ఏం మాట్లాడాలో తెలీక వెర్రి చూపులు చూస్తోంది లక్ష్మి.‘‘మీ జాగ్రత్తలో మీరుండండి! కంపెనీపరంగా నేను తీసుకోవల్సిన జాగ్రత్తలు నేను తీసుకొంటాను.! ఐ థింక్... ఏం కాకపోవచ్చు! వాళ్ల భయాల్లో వాళ్లూ వుంటారు! కాకపోతే మన జాగ్రత్తలో మనమూ ఉండాలనే ఇదంతా’’ అని-‘‘వెళ్లొస్తాను’’ అంటూ వెళ్లిపోయాడు ఎండీ. ఆయనలా వెళ్లడమేంటి శకుంతల, గిరీ పరుగు పరుగున వచ్చి ‘ఏమన్నాడేమన్నాడు’ అనడిగారు. ఏం చెప్పలేదు లక్ష్మి. సిగ్గుని, అలసటని, నటించి నిద్ర వస్తోందన్నట్లుగా ఆవలించేసిందంతే! వాళ్లకేదో అర్థమయింది. పగలబడినవ్వారు.‘‘రెడీనా! మేడం గారి మేకప్ అయిపోయిందా లేదా’’ గ్రీన్ రూంలోకి వచ్చి మేకప్ మేన్‌ని కో-డైరెక్టర్ హోదాలో అడిగాడు గిరి. గిరి మాటతోను, గిరిరాకతోనూ, ఈ లోకంలోకి వచ్చి రాత్రి జరిగిందానికి ఫుల్‌స్టాప్ పెట్టి-‘‘ఎండీగారొచ్చారా’’ అడిగింది లక్ష్మి.‘‘ఆయనెప్పుడు పడితే అప్పుడు రారు! బలే దానివే’’ అని గుసగుసగా చెప్పి గోలగోలగా నవ్వాడు గిరి.‘‘ముహూర్తం దగ్గరపడుతోంది! డ్రస్ ఛేంజ్ చేసుకొని రెడీకా’’ అని వెళ్లిపోయాడు.దగ్గరగా వచ్చిన గిరితో-‘‘హీరోయిన్ రెడీనా’’ అడిగాడు డైరెక్టర్.‘‘డ్రస్ చేసుకుంటోంది సార్’’ చెప్పాడు గిరి.‘‘రాత్రి బాగా ఆలోచించాను గిరి! ఇంటీరియర్లో అయితే హీరోయిన్ రోలింగ్ ఛైర్లో కూర్చోవడం, ఆలోచించడం, అప్పుడు విలన్ వచ్చి యాసిడ్ పొయ్యడం బాగుంటుంది. ఇదిప్పుడు కాలేజీ ఎక్స్‌టీరియర్ కదా! ఇక్కడలా కుదరదు! అందుకని ఓ పని చేద్దాం! హీరోయిన్ పుస్తకాలుపట్టుకుని వస్తూ వుంటుంది. విలన్ దాడి చేసి ఆమె ముఖమ్మీద యాసిడ్ పోస్తాడు! ఎలా వుంటుంది?’’ అడిగాడు డైరెక్టర్.‘‘బ్రహ్మాండం’’ చెప్పాడు గిరి. అలా అనకపోతే కో-డైరెక్టర్‌గా తనని వద్దంటాడేమోనని భయం గిరికి.‘‘ఫస్ట్ షాట్ దేవుడి పటాల మీద తీసి, నెక్ట్స్ ఈ సీన్లోకి వచ్చేద్దాం! ఏమంటావ్’’ మళ్లీ అడిగాడు.‘‘మీ ఇష్టం సార్’’ అలాగే చేద్దాం అన్నాడు గిరి.‘‘గెస్ట్‌లెవరూ ఇంకా రాలేదేంటి’’ ‘‘చిన్నకోడలు హీరోయిన్ గారూ... వాళ్లా సార్’’‘‘అవును’’‘‘వస్తున్నారట సార్! బయల్దేరారట! ఇప్పుడే ఫోనొచ్చింది’’ చెప్పాడు గిరి.‘‘దెన్!రెడీ!రెడీ’’ కేకలేశాడు డైరెక్టర్.‘‘నేను కూడా రెడీ సార్’’ నవ్వుతూ ఎదురొచ్చాడో కుర్రాడు.‘‘ఎవర్రా నువ్వు’’ కోపగించుకున్నాడు డైరెక్టర్.‘‘నేను సార్! యాసిడ్‌ని’’ వెనగ్గా చేతిలో దాచిన యాసిడ్ బాటిల్ చూపించాడు కుర్రాడు.‘‘నువ్వా! నీ దుంపతెగ! జాగ్రత్త! జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి’’ అని రాత్రి మందు దెబ్బకి మనుషుల్ని పోల్చుకోలేకపోతున్నాను అనుకున్నాడు డైరెక్టర్.లంగా, ఓణీ, వాలుజడ, చెవులకి జూకాలు, నుదుటన నిలువుబొట్టు, కాళ్లకి పట్టీలు...అందంగా వుంది లక్ష్మి. అద్దంలో తనని తాను చూసుకొంటూ ఆనందిస్తోంది. కాస్సేపట్లో తను హీరోయిన్. ‘స్టార్ట్ కెమెరా! యాక్షన్’ అని డైరెక్టర్ అనగానే నటిస్తుంది తను.పుస్తకాలని గుండెలకదుముకుంటూ భయం భయంగా కాలేజీ కారిడార్లోకి ప్రవేశిస్తుంది. భయం ఎందుకంటే విలన్ తనని కోరుకుంటున్నాడు. ప్రేమించానని వెంటపడుతున్నాడు. నిన్నటి రోజున క్లాసులో తన చెయ్యి పట్టుకొన్నాడు. కోపం వచ్చి చెప్పుతో కొట్టింది తను. దాంతో ‘నీ అంతు చూస్తాను’ అన్నట్లుగా చూసి, చరచరా వెళ్లిపోయాడు విలన్. ఇవాళ తప్పదు. ఎదురొస్తాడు. ఎదురొచ్చేవాణ్ని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు. అందుకే భయం.సీనంతా చెప్పి ఇప్పుడే వెళ్లాడు గిరి.‘‘నెర్వస్ కాకు! అదరగొట్టేయ్’’ అన్నాడు.‘‘ఫస్ట్ టేకే ఓకే అయిపోవాలి’’ అని కూడా చెప్పాడు. నటన తనకి కొత్త కాదు. ఎలాంటి సీనైనా తను పండిస్తుంది. ఆ నమ్మకం తనకుంది. కాకపోతే చిన్నకోడలు హీరోయిన్, డైరెక్టర్ కలసి ఏం ప్లాన్ చేశారో? తననెందుకు హింసించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఏదో తెలీని టెన్షన్! దాంతో తనకంతా భయం భయంగా వుంది. తెరమీద నటించాలన్న చిన్న కోరిక వెనక ఎన్ని కష్టాలు?!కళ్లు చెమర్చుకుంది లక్ష్మి. అంతలో ఎవరో వస్తోన్న అడుగుల శబ్దం వినరావడంతో గబగబా కన్నీళ్లు తుడుచుకొని చూసింది.విలన్ పండా!‘‘బాగున్నావా లక్ష్మి’’ అభిమానంగా పలకరించాడు పండా.‘‘బాగున్నాను సార్’’ చెప్పింది లక్ష్మి.పండా మేకప్ మీద వుండడం గమనించి-‘‘మీరేంటి సార్’’ అడిగింది.‘‘విలన్’’ అని నవ్వాడు.‘‘ముందు మనల్నొద్దనుకున్నారు. కొత్తవాళ్ల కోసం ట్రై చేశారు. తర్వాత ఏమయిందో ఏంటో! ఇందాక, ఓ గంట క్రితం ఫోన్ చేసి, విలన్ వేషం వుంది. రండన్నారు. వచ్చేశాను’’ అన్నాడు పండా.‘‘కో డైరెక్టర్ చల్లగా వుండాలేగాని, మనకి వేషాలు దొరక్కుండా పోవు’’ అని నవ్వాడు. నవ్వుతూ లక్ష్మిని పరిశీలనగా చూసి-‘‘బావున్నావు లక్ష్మి! బ్యూటిఫుల్! ఈ గెటప్‌లో నువ్వు చాలా అందంగా వున్నావ్’’ అని పొగిడాడు.‘‘చందమామలా వున్నావ్’’ అని లక్ష్మి ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని మురిసిపోతూ-‘‘ఇలాంటి ముఖమ్మీద యాసిడ్ పొయ్యాలా? నా వల్ల కాదు’’ అన్నాడు పండా.‘‘యాసిడ్?! యాసిడేంటి’’ కంగారు పడింది లక్ష్మి. తన ముఖం మీద పండా చేతుల్ని తొలగించింది.‘‘నిన్న క్లాసులో నన్ను నువ్వు కాదన్నందుకు, నీ అంతు చూస్తాననన్నట్లుగా చూసి నేను అప్పుడు వెళ్లిపోయినందుకు ఇవాళ కాలేజీ కారిడార్లో నీ మీద నేను యాసిడ్ పోస్తున్నాను’’ చెప్పాడు పండా.‘‘యాసిడ్ అంటే ఏం పోస్తారు’’ భయం భయంగా అడిగింది లకి్క్ష.‘‘బుడగలొస్తోన్న ఇనో కలిపిన నీళ్లు చూపించి, యాసిడ్ అన్నది బాగా ఎస్టాబ్లిష్ చేసి, ఆ నీళ్లు నీ ముఖమ్మీద పోస్తాం’’ అని నవ్వాడు పండా. పండా నవ్వుతోంటే లక్ష్మికి నవ్వొచ్చింది. నవ్విందామె. రిలాక్స్‌యింది.-----------------------------కారొచ్చి, కాలేజీ ముందు ఇలా ఆగిందో లేదో కారుని చుట్టుముట్టేశారు పూజ ఫ్రెండ్స్. ‘‘వెల్‌కం! వెల్‌కం’’ అంటూ ఒకటే గోల చేశారు. పూజతో పాటు దిగిన ప్రసాద్‌ని చూసి అంతా ఆశ్చర్యంగా కోరస్‌గా ‘‘వావ్’’ అని.....‘‘అదిరిపోయాడే పూజా! మీ బావ మహేష్‌బాబులా వున్నాడే’’’ అన్నారు. ఒక్కొక్కరూ ప్రసాద్‌ని పరిచయం కూడా చేసుకున్నారు.నలుగురైదుగురు అమ్మాయిలు, ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు. అందరూ అన్ని రకాలుగా ఒకేలా వున్నారు. పైగా అంతా ఒకే క్లాస్. వాళ్లందరూ ఓ గ్యాంగ్.‘‘వీళ్ల డాడీ పెద్ద పోలీసాఫీసర్’’ ఒకమ్మాయిని చూపించింది పూజ.‘‘అలాగా’’ నవ్వాడు ప్రసాద్.‘‘వీళ్ల డాడీ ఎవరో తెలుసా? ఇందాక మనం కారులో వస్తోంటే ఓ బార్ అండ్ రెస్టారెంట్ చూపించాను చూడు! అది వీళ్లదే! వీళ్ల డాడీనే దాని ఓనర్’’. ఓ అబ్బాయిని చూపించింది పూజ.‘‘ఓహో’’ అన్నాడు ప్రసాద్.‘‘వీళ్లిద్దరూ లవ్వులో పడ్డారు’’ పూజతో పాటు మిగిలిన వాళ్లంతా ఒక్క పెట్టున నవ్వారు.‘‘తండ్రేమో పోలీసాఫీసర్! మామగారేమో బార్ ఓనర్! బావుంది కదూ’’ మళ్లా నవ్వింది పూజ.‘‘ఇంకో సంగతి తెలుసా? వీళ్లిద్దరికీ పెళ్లి కాకుండానే అన్నీ అయిపోయాయి’’ అని పగలబడి నవ్వింది. ప్రసాద్‌కది నచ్చలేదు. ముఖం చిట్లించుకున్నాడు. అది గమనించిందేమో!‘‘సారీ’’ అంది పూజ.‘‘సరదాకి అన్నాను కాని, ఛఛ! వీళ్లిద్దరి మధ్యా అలాంటిదేం లేదు’’ అంది.‘‘కోపం వచ్చిందా’’ అని ప్రసాద్ గడ్డాన్ని బతిమలాడుతున్నట్లుగా పట్టుకొంది.‘‘ప్లీజ్! ఓవర్ చెయ్యకు’’ పూజను కసురుకున్నాడు ప్రసాద్.‘‘ఓర్నాబావో!అదంతా సీరియస్సే!’’ గ్యాంగ్‌లో ఎవరో అరిచారు. అంతే! గొల్లుమన్నారంతా. ప్రసాద్‌ని చూస్తూ పూజ నవ్వడానికి ఇబ్బంది పడుతూ వుంటే ఆమె ఇబ్బందిని తొలగించేందుకన్నట్లుగా సన్నగా నవ్వాడు ప్రసాద్.దాంతో పూజ ఫ్రెండ్స్ నవ్వులో పాలుపంచుకొంటూ గట్టిగా నవ్వింది. అప్పుడొచ్చింది ఇందాక కాలేజీకి బయల్దేరుతుంటే ఫోన్చేసిన పూజ ఫ్రెండ్.‘‘ఇంతసేపూ ఎక్కడున్నావే’’ అడిగింది పూజ.‘‘గ్రీన్ రూం కిటికీ దగ్గరున్నాను’’ చెప్పిందామె.‘‘గ్రీన్‌రూమ్మేంటే’’ ఆశ్చర్యపోయారంతా.‘‘మన కాలేజీలో సీరియల్ ఒకటి షూటు చేస్తున్నారు తెల్సా’’‘‘తెలుసు’’‘‘ఆ సీరియల్ హీరోయిన్, సైన్స్ క్లాస్‌లో మేకప్ అవుతోంది. మనం ఆ రూం కిటికి దగ్గరుండీ అంతా గమనించాం’’‘‘హీరోయిన్ ఎలా వుందే’’ ఆసక్తిగా అడిగారు.‘‘అద్భుతం’’‘‘పేరేంటే’’‘‘లక్ష్మి’’ఆ మాట అన్నదో లేదో-‘‘పేరేంటన్నారు’’ ఆత్రంగా అడిగాడు ప్రసాద్.‘‘లక్ష్మి’’ మళ్లీ చెప్పిందామె.‘‘గ్రీన్ రూమెక్కడ’’ ఆదుర్దా పడ్డాడు ప్రసాద్.‘‘అటు! అక్కడ’’ చూపించిందామె.‘‘ఇప్పుడే వస్తాను పూజ’’ అంటూ గ్రీన్‌రూం దిశగా పరుగులాంటి నడకతో వెళ్తోన్న ప్రసాద్‌ని-‘‘బావా బావా’’ అంటూ పిలిచి, తన పిలుపుని పట్టించుకోకు వెళ్తోన్న ప్రసాద్‌ని చూసి, ఫ్రెండ్స్ ముందు చిన్నబుచ్చుకున్నట్టు ఫీలయ్యింది పూజ.‘‘పద! మనం కూడా వెళ్దాం’’ పూజ చిన్నబుచ్చుకోవడాన్ని పోగొట్టే ప్రయత్నంలో పడ్డారు ఫ్రెండ్స్.‘‘పదండయితే’’ బయల్దేరింది పూజ.మూసి వున్న గ్రీన్‌రూం తలుపులు ఒక్కదుటున తెరిచి, రూంలోకి హడావుడిగా ప్రవేశించి-‘లక్ష్మీ లక్ష్మీ’ అంటూ పిలవసాగాడు ప్రసాద్. మేకప్‌మాన్, అతని అసిస్టెంట్లు ఇద్దరూ ప్రసాద్ అలా రావడాన్ని ఆశ్చర్యపోయి చూస్తున్నారంతే!‘‘లక్ష్మీ లక్ష్మీ’’ కేకలేస్తూ అటూ ఇటూ వెదకసాగాడు ప్రసాద్.‘‘ఎవరు కావాలండీ మీకు’’ ప్రసాద్‌ని అడిగాడు మేకప్‌మాన్.‘‘లక్ష్మి! లక్ష్మి కావాలి’’‘‘హీరోయిన్‌గారా?’’‘‘అవును! హీరోయిన్! లక్ష్మి కావాలి’’‘‘గార్డెన్లోకెళ్లారు! షూటింగక్కడే! అక్కడికెళ్లండి’’ చెప్పాడు మేకప్‌మాన్. దాంతో గార్డెన్‌కేసి పరుగుదీశాడు ప్రసాద్. పరిగెడుతోన్న ప్రసాద్‌ని ఆశ్చర్యపోయి చూస్తో, పూజతో పాటుగా ఫ్రెండ్స్‌ంతా ప్రసాద్‌ని అనుసరించారు.--------------------------‘‘ఏమ్మా! సీను అర్థమయింది కదా’’ లక్ష్మిని అడిగాడు డైరెక్టర్.‘‘అయింది సార్’’ చెప్పింది లక్ష్మి.‘‘పుస్తకాల్ని గుండెలకదుముకొంటూ నువ్వు భయం భయంగా వస్తుంటావు. విలన్ ఎక్కడ కనపడతాడోనని నీ కళ్లల్లో ఒకటే భయం! ఒంటరిగా వస్తున్నావ్! తోడెవరూ లేరు! విలన్ ఎదురైతేచాలు! నీ గుండె ఆగిపోతుంది! అంతలా భయపడుతున్నావ్, ఆ భయంతో నడుస్తున్నావ్. అప్పుడొచ్చాడు విలన్. ‘నన్ను కాదంటావా! అందం చూసుకునే కదా నీకీ పొగరు. ఆ అందం లేకుండా చేస్తానం’టూ యాసిడ్ నీ ముఖం మ్మీద పోస్తాడు. అంతే! ‘ఆ’ అంటూ బాధగా నువ్వు పెద్దగా అరిచి కుప్పకూలిపోతావ్! ఓకే’’‘‘ఓకే సార్’’‘‘దెన్ రెడీ’’ కేకేశాడు డైరెక్టర్.‘‘లైట్స్’’ అరిచాడు కెమెరామాన్. లైట్లు వెలిగాయి.‘‘మూడ్’’ అరిచాడు డైరెక్టర్. మూడ్‌లోకి వచ్చింది లక్ష్మి.‘‘కెమెరా’’అరిచాడు డైరెక్టర్.‘‘రన్నింగ్ సార్’’ చెప్పాడు కెమెరామాన్.‘‘యాక్షన్’’ చెప్పాడు డైరెక్టర్.లక్ష్మి పుస్తకాల్ని గుండెలకదుముకుని భయం భయంగా నడవసాగింది.‘‘కట్ కట్’’ డైరెక్టర్ అరిచి, ఇటుగావున్న గిరిని చూస్తూ-‘‘ఏడీ విలనెక్కడ’’ అడిగాడు.‘‘అడిగోండి సార్! వున్నాడు’’ పండాని చూపించాడు గిరి.‘‘యాసిడ్! యాసిడెక్కడ’’ అడిగాడు డైరెక్టర్.‘‘ఇక్కడ’’ అంటూ వచ్చాడు కుర్రాడు. చేతిలోని యాసిడ్ బాటిల్ని ఎత్తి చూపించాడు.‘‘దాన్ని ఆ పండాకియ్యి’’ చెప్పాడు డైరెక్టర్. పండాకి యాసిడిచ్చాడు కుర్రాడు.‘‘జాగ్రత్త! యాసిడ్’’ పండాని హెచ్చరించాడు డైరెక్టర్.‘‘ఓకేసార్’’ నవ్వాడు పండా.‘‘రెడీనా’’ అడిగాడు డైరెక్టర్.‘‘రెడీసార్’’‘‘దెన్నొకే’’ అని-‘‘అమ్మా లక్ష్మీ! రెడీ’’ అని-‘‘యాక్షన్’’ అన్నాడు మళ్లీ డైరెక్టర్.లక్ష్మి పుస్తకాల్ని గుండెలకదుముకొని భయం భయంగా నడవసాగింది. అటు చప్పుడయింది. చూసిందటు భయంగా. ఇటు చప్పుడయింది. చూసిందిటు భయంగా. నడుస్తోంది.‘‘కట్’’అరిచాడు డైరెక్టర్. కెమెరా ఆగిపోయింది.‘‘ఏడీ!మేకప్‌మానేడీ’’‘‘సార్’’ ప్రత్యక్షమయ్యాడు మేకప్‌మాన్.‘‘హీరోయిన్ భయంతో నడుస్తోంది. చెమటలు పట్టాలి. స్ర్పే చెయ్యవయ్యా! ముఖమ్మీద వాటర్ స్ర్పే చెయ్’’‘‘సరేసార్’’ అని, వెళ్లి లక్ష్మి ముఖమ్మీద వాటర్ స్ర్పే చేశాడు మేకప్‌మాన్.‘‘ఓకేనా సార్’’ చెమట పట్టినట్లున్న లక్ష్మిని డైరక్టర్‌కి చూపించాడు.‘‘ఓకే ఒకే’’ అని-‘‘రెడీ! యాక్షన్’’ అరిచాడు డైరెక్టర్.లక్ష్మి గుండెలకి పుస్తకాలను అదుముకుని భయం భయంగా నడుస్తోంది. అటు చప్పుడయింది. భయంగా చూసిందటు. ఇటు చప్పుడయింది. భయంగా చూసిందటు. నడుస్తోంది. అంతలో ఎదురయ్యాడు విలన్ పండా. పండాని చూసి గజగజా వణికిపోయింది లక్ష్మి.‘‘డైలాగ్’’ అరిచాడు డైరెక్టర్.గిరి ప్రామ్‌టింగ్ ఇవ్వసాగాడు.‘‘నన్ను చూస్తే భయంగా వుందా’’ లక్ష్మిని అడిగాడు పండా.‘‘లేదన్నట్లుగా తలూపుతూ అంతలోనే వుందన్నట్లుగా తలూపింది లక్ష్మి.‘‘భయం దేనికి? నేనేమన్నా అందవికారంగా వున్నానా? లేను కదా? నిజం చెప్పాలంటే ఈ కాలేజీ మొత్తమ్మీద అంతో ఇంతో అందగాడ్ని నేనే! అవునా? కాదా?’’‘‘ఆ... అవును’’‘‘మరలాంటప్పుడు నన్ను ప్రేమించడానికి భయం దేనికి? లవ్! లవ్‌మి’’‘‘నో’’‘‘ప్రేమించవా? ఎందుకు ప్రేమించవు! నాలో ఏం తక్కువే’’లక్ష్మి దగ్గర జవాబు లేదు.‘‘జేబునిండా డబ్బుంది! చేతిలో సూపర్ బైకుంది! గెస్ట్ హౌసుంది! ఆటకి , మాటకి, పాటకీ ఫ్రెండ్సున్నారు! ఏం తక్కువైందే నీకు? నాలో నీకేం తక్కువైంది’’ అడిగాడు పండా.ఏడుపొచ్చింది లక్ష్మి. ఏడవసాగింది.‘‘ఆపు! ఏడుపాపు’’ కసిరాడు పండా. ఏడుపు ఆపేసింది లక్ష్మి.‘‘నీ నాటకాలు నాదగ్గర కాదు! ఏడిస్తే వదిలేస్తాననుకుంటున్నావా! వదల్ను! నిన్నొదల్ను! నన్ను నా ప్రేమనీ, కాదన్న నిన్ను... నిన్నొదల్ను. ఏం చూసుకునే నీకీ పొగరు’’ లక్ష్మి మీదికొచ్చాడు పండా. ఆమె కళ్లల్లో కళ్లు పెట్టి తీక్షణంగా పరిశీలనగా చూశాడు.‘‘ఓ! అందం! ఈ అందం చూసుకునే కదా నీకీ పొగరు! ఈ అందం లేకుండా చేస్తాను! నిన్ను...నిన్ను కురూపిని చేస్తాను’’ అని వెనక్కుదాచి వుంచిన యాసిడ్ బాటిల్ తీసి, దాన్నోసారి చూసి, భయపడుతోన్న లక్ష్మిని కూడా చూసి, కసిగా, శాడిస్ట్‌గా నవ్వుతూ యాసిడ్‌ని లక్ష్మి ముఖమ్మీద పోశాడు. అంతే! ‘ఆ’ అంటూ బాధగా గట్టిగా అరిచింది లక్ష్మి. ముఖాన్ని చేతుల్లో దాచుకొని కుప్పకూలిపోయింది.‘‘కట్’’ అరిచాడు డైరెక్టర్. కెమెరా ఆగిపోయింది. అయినా లక్ష్మి బాధగా వేస్తోన్న కేకలాగలేదు. ఆమె అల్లాల్లాడిపోతోంది. ముఖమంతా మంటలెత్తి, బొబ్బలెక్కిపోతోంటే గగ్గోలుగా అరుస్తోంది. ఆమె చర్మం కాలిపోతోంది. కరిగిపోతోంది. ముఖాన్ని కప్పి వుంచిన చేతులకి చర్మం జిగురులా అంటుకుంటుంటే చూసుకొంటూ పిచ్చెక్కిపోతోంది.యాసిడ్‌కి ముఖమ్మీది చర్మం కాలిపోతోంది. కరిగిపోతోంది. బాధని వోర్చుకునేందుకు ముఖాన్ని అంటిపెట్టిన చేతులకి, చర్మం జిగురులా అంటుకొంటుంటే చూస్తో పిచ్చెక్కిపోతోంది లక్ష్మి. గగ్గోలుగా ఏడుస్తోంది. లక్ష్మి అలా ఏడుస్తోంటే అయోమయాన్ని నటిస్తూ ఆనందిస్తున్నాడు డైరెక్టర్. మనసులో అతనికి చాలా తృప్తిగా వుంది. అనుకున్నది సాధించేశాడు. హీరోయిన్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.‘క్రీచ్’మంటూ కారాగిపోయింది. సడెన్‌గా బ్రేకు పడిందేమో తూలి, ముందు సీటుకి తలకొట్టుకుంది హీరోయిన్. దిమ్మతిరిగి పోయిందామెకి. బలవంతాన కళ్లు తెరచి చూసింది. అంతా చీకటి చీకటిగా వుంది. ఏదీ కనిపించడంలేదు. ఇంతవరకూ కనిపించిన షూటింగ్, షూటింగ్‌లో విలన్, లక్ష్మి మీద యాసిడ్ పొయ్యడం, లక్ష్మి ఏడవడం, డైరెక్టర్ ఆనందించడం... ఏవవి? ఏమయిపోయాయి?కల చెదిరిపోయింది. ఊహకి ఊపిరిపోయింది. దాంతో అవేవీ కనిపించకుండా పోయాయి.‘అబ్బా’ అంది హీరోయిన్.‘‘దెబ్బ తగిలిందా మేడం’’ అడిగాడు డ్రైవర్.‘‘ఏమయిందిరా? ఎందుకంతగా సడెన్ బ్రేక్ వేశావ్’’ కోపగించుకుందామె.‘‘సిగ్నల్ పడింది మేడమ్! చూసుకోలేదు! దాంతో...’’ సంజాయిషీ ఇచ్చుకున్నాడు డ్రైవర్.‘‘ఏడిశావ్’’ అంది హీరోయిన్. సర్దుకుని సరిగ్గా కూర్చుంది. గట్టిగా కళ్లు మూసుకొని తెరిచింది. ఇప్పుడన్నీ కనిపించసాగాయి. డ్రైవర్ ఆందోళనగా ఆమెనే చూస్తున్నాడు.‘‘నన్ను చూడ్డం కాదు! అటు చూడు’’ కసిరింది హీరోయిన్. అటు చూశాడు డ్రైవర్. గ్రీన్ సిగ్నల్ పడింది. కారుని ముందుకి పోనిచ్చాడతను.లక్ష్మి మీద విలన్ యాసిడ్ పొయ్యడం. లక్ష్మి ఏడవడం ఇవేవీ ఇంకా జరగలేదు. జరిగినట్లుగా తనూహించుకుంది. అయ్యయ్యో!!-బాధపడింది హీరోయిన్.‘‘షూటింగ్ స్పాట్ ఇంకా ఎంత దూరంరా! ఆ కాలేజీ ఎక్కడ’’ విసుక్కుంది హీరోయిన్.‘‘ఓ ఫైవ్ మినిట్స్‌లో అక్కడుంటాం మేడం’’ చెప్పాడు డ్రైవర్.‘‘తొందరగా పోనీయ్! ఫస్ట్ షాట్‌కి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడుండాలి’’‘‘అలాగే మేడం’’కారు స్పీడందుకుంది. గ్లాసెస్ తెరిచి వుండడంతో చల్లని గాలి లోపలకి దూసుకొస్తోంది. హీరోయిన్‌కి హాయిగా వుందిపడు. తను ఊహించుకున్నది, తను కలగన్నది జరిగి తీరుతున్నదన్న భరోసాతో వుందామె.-------------------------బాపు బొమ్మలా అందంగా మేకప్ అయి వస్తోన్న లక్ష్మిని చూస్తూ-‘‘అబ్బబ్బ! ఏవందం దీన్ది’’ అనుకున్నాడు డైరెక్టర్.‘‘గార్డెన్‌కి ఇదే అందం’’ అనుకున్నాడు మళ్లీ.‘‘నమస్తే సార్’’ డైరెక్టర్‌కి నమస్కరించింది దగ్గరగా వచ్చిన లక్ష్మి.‘‘నమస్తే...నమస్తే...’’ లక్ష్మిని తనివితీరా చూస్తున్నాడతను.‘‘ఓకేనా సార్! డ్ర స్ అదీ బాగానే వున్నానా’’ అడిగింది లక్ష్మి.‘‘బ్రహ్మాండంగా వున్నావ్! అతిలోక సుందరి శ్రీదేవిలా వున్నావ్’’ అని నవ్వాడు.‘‘కూర్చో కూర్చో’’ అని తన ప్రక్కన కుర్చీలో లక్ష్మిని కూర్చోబెట్టుకొని-‘‘ముహూర్తానికింకా పావు గంట టైముంది. సంగతులు చెప్పు’’ అంటూ లక్ష్మి చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు డైరక్టర్. తన చేతిని డైరక్టర్ అలా అందుకోవడం ఇబ్బందనిపించినా తప్పదనుకుని సర్ది చెప్పుకుంది లక్ష్మి.‘‘నేను జాతకాలు చూస్తాను తెల్సా’’ చెప్పాడు డైరెక్టర్.‘‘అవునా సార్’’ ఆశ్చర్యపోయింది లక్ష్మి్క్ష.‘‘నీ జాతకం చెప్పనా’’ అడిగాడు.‘‘చెప్పండి సార్’’ అంది లక్ష్మి.జాతకం చెప్పే నెపంతో లక్ష్మి చేతిని పిసికి పారేస్తున్నాడు డైరెక్టర్. వోర్చుకుంటోంది లక్ష్మి.‘‘దీన్ని సూర్య స్థానం అంటారు! దీన్ని చంద్రస్థానం అంటారు’’ అంటూ ఏదో చెబుతున్నాడు డైరెక్టర్. చెబుతూ చెబుతూ ఎందుకో అటుగా చూశాడు. చూసినవాడు చేష్టలుడిగి పోయాడు.ముఫ్పై నలభై మంది స్టూడెంట్స్ గుంపుగా పరుగు పరుగున ఇటొస్తున్నారు. వాళ్లందరి చేతుల్లో క్రికెట్ బ్యాట్స్, స్టంప్స్ వున్నాయి. హాకీ బ్యాట్స్ కూడా వున్నాయి. ఆయుధాలు ధరించి యుద్ధానికి వస్తున్నట్లుగా వున్నారంతా. Challenge-18 episodes-76-90‘‘ఏంటయ్యా గిరీ! ఏంటా గుంపు’’ తేరుకొని, అటు కెమెరామాన్‌తో మాట్లాడుతోన్న గిరిని కేకేశాడు డైరెక్టర్.‘‘ఏంట్సార్’’ ఇటు తిరిగి అడిగాడు గిరి.‘‘అటు చూడు! ఆ గుంపేంటి’’ అడిగాడు డైరెక్టర్. అప్పడటుగా డైరెక్టర్‌తో పాటు గిరి, కెమెరామాన్, లక్ష్మి చూశారు.కదం తొక్కుతూ వస్తోంది యువత. ఘోషగా వాళ్లంతా మాట్లాడుకుంటున్నారు.‘‘ఎందుకైనా మంచిది! లక్ష్మి! నువ్వు...నువ్వెళ్లి ఆ కార్లో కూర్చో’’ చెప్పాడు గిరి.‘‘ఏమయిందిప్పుడు’’ అడిగింది లకి్క్ష.‘‘ఇప్పుడేమీ కాలేదు కాని, చెప్పిన మాట విను! వెళ్లి కార్లో కూర్చో’’ గట్టిగా చెప్పాడు గిరి.‘‘రామ్మా’’ కెమెరామాన్, లక్ష్మిని తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి వచ్చాడు.వస్తోన్న స్టూడెంట్స్‌ని చూసి, ఏదో గొడవయ్యేలా వుందని షూటింగ్ సిబ్బందంతా ఓ చోట చేరారు. ఖరీదైన వస్తువులు కెమెరాలాంటివి జాగ్రత్త చేశారు.‘‘ప్రొడక్షన్ మేనేజర్ని పిలు’’ పెద్ద గొంతుతో అరిచాడు డైరెక్టర్.‘‘నేనిక్కడే వున్నాన్సార్ మీరంత నోరు పెట్టకండి!’’ చికాకు పడ్డాడు ప్రొడక్షన్ మేనేజర్.గుంపు వచ్చేసింది. టివి సిబ్బందిని చుట్టుముట్టేసింది.‘‘ఎవరండీ! కాలేజీలో షూటింగ్ చేసుకోమ్మని మీకెవరు పర్మిషనిచ్చారు’’ అడిగారు స్టూడెంట్స్.‘‘ప్రిన్సిపాల్‌గారిచ్చారు సార్’’ చెప్పాడు ప్రొడక్షన్ మేనేజర్.‘‘ఆయన ఇవ్వలేదంటున్నాడు’’‘‘ఇచ్చాడు సార్! అయిదు వేలు రెంటని చెబితే రెండువేలు అడ్వాన్స్ కూడా కట్టాం’’‘‘రిసీట్ మీదగ్గరుందా?’’‘‘ఇలాంటి వాటికి రిసీట్స్ వుండవు సార్! అంతా నోటి మాట మీదే జరుగుతుంది’’ భయం భయంగా చెప్పాడు ప్రొడక్షన్ మేనేజర్.‘‘నేను చెప్పలేదు గురూ... ఆటంతా ప్రిన్సిపాల్ ఆడుతున్నాడు! ఇక వూరుకునేది లేదు!’’ అని-‘‘ప్రిన్సిపల్’’ గట్టిగా అరిచాడతను.‘‘డౌన్ డౌన్’’ అన్నారంతా.‘‘ప్రిన్సిపల్’’‘‘డౌన్ డౌన్’’‘‘ప్రిన్సిపల్’’‘‘డౌన్ డౌన్’’ముహూర్తం దగ్గర పడిపోతోంది. పరిస్థితి చూస్తేనేమో గందరగోళంగా వుంది. షూటింగ్ జరుగుతుందో? జరగదో?గాబరా పడ్డాడు డైరెక్టర్. అది గమనించాడు గిరి. దాంతో కలుగజేసుకుని స్టూడెంట్స్‌తో-‘‘మీరేమీ అనుకోనంటే చిన్న రిక్వెస్ట్ సార్! షూటింగ్ టైమవుతోంది! దయచేసి మీరంతా....’’‘‘ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలి! అంతేగా మీరు చెప్పేది’’ గిరితో అన్నారు స్టూడెంట్స్.‘‘బాగా అర్థం చేసుకొన్నారు’’ నవ్వబోయాడు గిరి.‘‘షటప్! ముందు మీరిక్కడ్నుంచి కదలండి’’చెప్పారు.‘‘విద్యాలయాలు టివి స్టూడియోలు కావు! మేం వొప్పుకో’’ అన్నారు.‘‘ఇప్పటికప్పుడు లోకేషన్ ఛేంజంటే కుదరద్సార్’’ ప్రొడక్షన్ మేనేజర్ బ్రతిమలాడాడు.‘‘ఎందుకు కుదరదు! సిటీలో పార్కులు బొచ్చెడున్నాయి! వెళ్లండి’’ అన్నారు.‘‘అది కాదండి...’’ అని ప్రొడక్షన్ మేనేజర్ ఏదో చెప్పబోతోంటే, వినిపించుకోకుండా షూటింగ్ సామానుని చెల్లా చెదురు చేసే కార్యక్రమంలో పడ్డారు స్టూడెంట్స్. అడ్డుకో వచ్చిన షూటింగ్ సిబ్బందిని కూడా చెల్లా చెదురు చేయసాగారు. దాంతో గొడవ రాజుకుంది. తోపులాటలు, తిట్టకోవడాలు పెరిగి పెరిగి కొట్టుకునే స్థాయికి చేరుకున్నారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇక్కణ్నుంచి తప్పుకోవడం బెటరనుకున్నాడేమో! లక్ష్మి కూర్చున్నకారెక్కి-‘‘ఏం చూస్తున్నావ్! పద! ఇంకాసేపు ఇక్కడున్నావంటే నీ కారద్దాలు పగులుతాయి’’ అని డ్రైవర్ని హెచ్చరించి, ‘‘పోనీయ్’’ అన్నాడు గిరి.అన్నదే తడవు, కారుని ముందుకి పోనిచ్చాడు డ్రైవర్.షూటింగ్ వాళ్లెవరో మన స్టూడెంట్స్‌ని కొడుతున్నారని కాలేజీ నలుమూలలా తెలియడంతో విద్యార్థులంతా గోలగోలగా గుంపు గుంపులుగా గార్డెన్‌కి చేరుకోసాగారు. అక్కడకి వస్తోన్న ప్రసాద్, పూజ, ఆమె ఫ్రెండ్సంతా కూడా అందుకే అక్కడికి వస్తున్నట్లనిపించారు. అయితే వాళ్లొస్తున్నది లక్ష్మి కోసం.గ్రీన్ రూం నుంచి గార్డెన్‌కి ఎంతసేపు? గట్టిగా పరిగెడితే మూడు నిమిషాల్లో గార్డెన్లో వుంటారు. ప్రసాద్ అలానే పరిగెత్తాడు. నిమిషం పరిగెత్తాక కాళ్లకేదో తగులుకుంది. కింద పడ్డాడతను.‘‘పూజా’’కేకేశాడు ప్రసాద్.‘‘బావా’’ బాధగా అరిచిందామె.ఫ్రెండ్స్, పూజా ప్రసాద్‌ని లేవనెత్తి ఆందోళన పడుతూ చూస్తే, ప్రసాద్ మోచేయి బాగా రక్కుకు పోయింది. రక్తం చిప్పిల్లుతోంది కూడా. పూజ కన్నీళ్లు పెట్టుకుంది.‘‘ఏం కాదు పూజా! ఏం కాదు’’ ఫ్రెండ్స్ నచ్చజెప్పారు. ఎవరో తన కర్చీఫ్ ప్రసాద్ మోచేతికి కట్టారు.‘‘అదేదో ఆయింట్‌మెంట్ వుంటుంది! అదిరాస్తే సరి’’ అన్నారెవరో.‘‘పేరేంటి’’ అడిగింది పూజ.‘‘తెలీదు’’‘‘ఇలా అని చెప్పి మెడికల్ షాపులో అడిగితే వాళ్లే ఇస్తారు! పదండక్కడికి’’ అన్నారు. దాంతో ప్రసాద్‌ని తోడుకుని పూజ, ఆమె ఫ్రెండ్స్ ఇటు గార్డెన్‌కేసి కాక అటు మెడికల్ షాపుకేసి వెళ్లిపోయారు. ఆయింట్‌మెంట్ కొని ప్రసాద్‌కి రాశారు. రాసిన తర్వాత ‘క్యాంటీన్ కెళ్లి చల్లగా కూల్‌డ్రింక్స్ తాగుదాం’ అంటే అంతా అటుగా క్యాంటీన్ కెళ్లారు.‘‘నేను తొందరగా లక్ష్మిని చూడాలి పూజా’’ ఆదుర్దాపడ్డాడు ప్రసాద్.‘‘చూద్దుగాని బావా! అయినా హీరోయిన్ లక్ష్మే, కృష్ణారావుగారి చెల్లెలు లక్ష్మి అని నువ్వెలా అనుకుంటున్నావ్.’’‘‘ ఈ అనుకోవడాలు, అనుమానాలన్నీ తర్వాత. ముందు నేను లక్ష్మిని చూడాలి. నా మనసుకెందుకో అనిపిస్తోంది పూజా! హీరోయిన్ లక్ష్మి మా లక్ష్మే అనిపిస్తోంది’’‘‘ముందు కూల్‌డ్రింక్ తీసుకో బావా’’ అందించింది పూజ.‘‘వద్దు! పద చెప్తాను’’కదిలాడు ప్రసాద్. పూజ అతన్ని అనుసరించింది. ‘‘ఎక్కడికెక్కడికి’’ అంటూ ఫ్రెండ్స్ వాళ్ల వెనుక పడ్డారు.అదిగో అది గార్డెనంటే ఇదిగో ఇక్కడున్నారు ప్రసాద్, పూజ, ఆమె ఫ్రెండ్స్. గార్డెన్‌లో గొడవ చూశారు. అంతా కొట్టుకుంటున్నారక్కడ.‘‘వొద్దు బావా! ఇప్పుడక్కడికి వెళ్లడం ప్రమాదం’’ చెప్పింది పూజ.‘‘మరి లక్ష్మినెలా చూడ్డం’’ బాధపడ్డాడు ప్రసాద్.‘‘ఎంత అదృష్టం కలిసిసొస్తే మాత్రం ఇంత త్వరగా హీరోయిన్ అయ్యే అవకాశాలు మీ లక్ష్మికి లేవు గాక లేవు. నాకు తెలిసి, హీరోయిన్ లక్ష్మి మీ లక్ష్మి కాదు గాక కాదు! నా మాట విని పద! ఇక్కడ్నుంచి వెళ్లిపోదాం! లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది’’ హెచ్చరించింది పూజ.‘‘ఆ కొట్లాటలో - వాళ్లంతా స్టూడెంట్సే’’ అనుమానం వ్యక్తం చేశాడు ప్రసాద్.‘‘కొందరు గూండాలు, రౌడీలు కూడా వున్నారు! చూస్తోంటే తెలియట్లే! పద’’ అందిపూజ.‘‘అవును ప్రసాద్‌గారూ! రండి’’ వంతపాడారు అమ్మాయిలు.‘‘వెళ్లి రండి ప్రసాద్‌గారు! పూజ, మీరు, వీళ్లంతా వెళ్లి రండి! మేం ఆ గొడవేంటో చూసుకొని వస్తాం’’ చెప్పారు అబ్బాయిలు. ప్రసాద్‌కి తప్పింది కాదు. అబ్బాయిల మాట వినాల్సి వచ్చిందతనికి. వెనుతిరిగి వెళ్లిపోయాడు.కాలేజీ బయట, మెయిన్‌గేట్‌కి కాస్తంత దూరంలో కార్లో వుండీ అంతా గమనిస్తున్నారు లక్ష్మి, కో-డైరెక్టర్ గిరి. ఎవరెవరో పరుగు పరుగున కాలేజీలోకి వెళుతున్నారు. ఇంకెవరెవరో కాలేజీలోంచి పరుగున వస్తున్నారు. పోలీసులకి కబురందినట్లుగా లేదు.వాళ్లింకా రాలేదు.‘‘పాపం డైరెక్టర్‌గారు... మన వాళ్లంతా ఏమయ్యారో! ఎలా వున్నారో!! ఆందోళన పడింది లక్ష్మి.‘‘నిక్షేపంగా వుంటారు! నువ్వేం కంగారు పడనక్కర్లేదు’’ అన్నాడు గిరి.‘‘ఎలా వుంటారు? అంత గొడవ జరుగుతోంటే’’‘‘నీకు మన వాళ్ల సంగతి తెలీదులే’’ సిగరెట్ ముట్టించాడు గిరి.‘‘అసలెందుకీ గొడవ? ప్రిన్సిపల్ గారు పర్మిషనిచ్చారు! మనం షూటింగ్ చేసుకుంటున్నాం. వద్దనడానికి వాళ్లెవరు’’‘‘స్టూడెంట్స్’’ అని నవ్వి-‘‘అదో వర్గం! వాళ్లకిది ఇష్టం లేదు. అయినా గార్డెన్లో తీయడానికి కాలేజీ ఎందుకు? ప్రొడక్షన్ మేనేజర్‌కి బుద్ధి లేదు’’ విసుక్కున్నాడు గిరి.కెమెరా పట్టుకొని ఓ కార్లో కెమెరామెన్ వెళ్లిపోతూ కన్పించాడు. అతని పక్కన డైరెక్టర్ వున్నాడేమోనని గుచ్చి గుచ్చి చూశాడు గిరి. డైరెక్టర్ లేడు! కెమెరామాన్ ఒక్కడే వెళ్లిపోతున్నాడు.‘‘ఈయనేమయ్యాడు మరి!’’ డైరక్టర్ని తలచుకున్నాడు గిరి.‘‘ఇక్కడేడుస్తున్నాను’’ ఎవరో ‘‘డైరక్టర్ గారు! డైరక్టర్ గారు’’ అని పిలుస్తుంటే సమాధానంగా అరిచాడు డైరెక్టర్. ఓ చెట్టు చాటుగా నిల్చుని, కొట్టుకొంటోన్న వాళ్లని చూస్తున్నాడతను.‘‘ఇక్కడున్నారా’’ ఎదురొచ్చాడు కుర్రాడు.‘‘ఏం కావాలి నీకు’’ అడిగాడు డైరెక్టర్.‘‘దీన్నేం చెయ్యమంటారు’’ వెనక్కి చేతుల్లో దాచిన యాసిడ్ బాటిల్ని చూపించి అడిగాడు కుర్రాడు.‘‘నా నెత్తిన కొట్టు’’ చిరాకు పడ్డాడు డైరెక్టర్.‘‘కాలిపోతుంది సార్’’ జాలిపడ్డాడా కుర్రాడు.‘‘మరేం చేస్తావ్’’‘‘అదే ఆలోచిస్తున్నాను’’ అన్నాడు కుర్రాడు.ముందు కెమెరాని కాపాడుకోవాలి. అందుకని కెమెరాని, కెమెరామన్‌ని కార్లో బయటకి తీసుకుపోయారు. తర్వాతిప్పుడు డైరెక్టర్‌ని కాపాడతారు. కారు కోసం వెయిట్ చెయ్యమన్నారు. వెయిట్చేస్తున్నాడు డైరెక్టర్.వెయిట్చేస్తోంటే వచ్చి యాసిడ్ కుర్రాడి గోల!‘‘ఈ పాటికి పూజయి పోయి, షూటింగ్ స్టార్టయిపోయి వుంటుంది.’’ నెత్తికొట్టుకుంటోంది చిన్న కోడలు హీరోయిన్.‘‘ఫైవ్ మినిట్స్‌లో వుంటాం అన్నావ్! ఏదీ? అరగంట పట్టింది’’ అసహనంగా అంది హీరోయిన్.‘‘ట్రాఫిక్ జాంకి నన్నేం చెయ్యమంటారు మేడం’’ విసుక్కున్నాడు కారు డ్రైవర్.‘‘కారు కాలేజీ మెయిన్ గేటు దాటింది. లోపలకి వెళుతోంది. అది చిన్నకోడలు హీరోయిన్ కారని తెలుసుకున్న గిరి-‘‘ఈ సందట్లో ఈవిడెందుకొచ్చింది’’ గాబరాపడ్డాడు.‘‘ఎవరు’’ అంది లక్ష్మి.‘‘చిన్నకోడలు హీరోయిన్’’ అన్నాడు.‘‘అయ్యయ్యో ఆవిడెందుకొచ్చింది’’ ఆందోళన చెందింది లక్ష్మి.‘‘ఖర్మ’’ తలపట్టుకున్నాడు గిరి.హీరోయిన్ కారొచ్చి గార్డెన్లో ఆగింది. హడావుడి పడుతూ ఆమె దిగబోతోంటే సెల్ మోగింది. అందుకొని ‘‘హలో’’ అంది హీరోయిన్. అట్నుంచి ఎవరో మాట్లాడుతున్నారు.‘‘నన్ను... నన్ను కొడతార్రా! చెప్తాను మీ పని’’ అంటూ గుండాలాంటి వ్యక్తి పరుగున వచ్చి, డైరెక్టర్ దగ్గరగా వున్న కుర్రాడి చేతిలోని యాసిడ్ బాటిలందుకున్నాడు. కుర్రాడు ‘ ఏయేయ్’ అని గాబరాపడుతోన్నా పట్టించుకోక బాటిల్‌ని ముద్దుపెట్టుకొని, దానిని ఆ వ్యక్తి గాలిలోకి విసిరాడు. అది శత్రువు మీద పడాలని అతని ఆశ. అయితే అది గాలిలో తేలుతూ వచ్చి, సెల్‌లో మాట్లాడుతూ కారు దిగిన చిన్నకోడలు హీరోయిన్ తల మీద అంతెత్తులో గిరికీలు కొట్టి ఆమె తల మీద పడి ‘ఫట్’మని పేలింది.తల మీద ఏదో పడింది. ‘ఫట్’మని పేలింది. తర్వాత... తర్వాతేం జరిగిందంటే మంట! ఒక్కసారిగా తలకి నిప్పు పెట్టినట్లుగా మంట. ఆ మంటల్లోంచి నుదుటి మీదుగా, ముక్కు మీదుగా, బుగ్గల మీదుగా జారుతూ ఏదో ద్రవం! ద్రవం జారుతోన్న చోటల్లా కోసుకు పోతున్నట్లుగా బాధ... నొప్పి....ఏమైంది? ఏంటది?!భయాందోళనలతో హీరోయిన్ బెంబేలు పడుతోంటే ఎవరో కేకేశారు-‘‘హీరోయిన్ గారి మీద యాసిడ్! యాసిడ్ పోశారెవరో’’ఆ మాట వింటూనే ‘కెవ్వు’మంది హీరోయిన్. స్పృహ కోల్పోయింది. మొదలు నరికిన అరటి చెట్టులా కిందపడిపోయింది. హీరోయిన్ అలా పడడం యేంటి- గొడవ ఆగిపోయింది. ఎత్తిన క్రికెట్ బ్యాట్స్, స్టంప్స్, హాకీబ్యాట్స్ కిందకి వొరిగిపోయాయి. బిగుసుకున్న పిడికిళ్లు సడలిపోయాయి. ఎవరెవరో ఎటేటో చెదిరిపోయారు. అంతా ఖాళీ. చెట్టు చాటున వున్న డైరక్టర్‌కి నోట మాట లేదు. జరిగిందంతా చూస్తో అవాక్కయిపోయాడు. అతని దగ్గర యాసిడ్ కుర్రాడేడీ? ఎక్కడ? ఎప్పుడో పారిపోయాడు.కబురందినట్లుగా వుంది. పోలీసులొచ్చారు. పోలీసుల్ని చూసి, ఇంతవరకూ గొడవలో దూకుడుగా పాల్గొన్న వాళ్లంతా ఇపడేమో ఏమీ తెలియని వారిలా తమ పనిలో తామున్నట్లుగా తిరుగుతున్నారు. ఫాంటు, బానపొట్ట మీద చాలీచాలని టీ షర్టు వేసుకొని అమాయకంగా అటూ ఇటూ చూస్తోన్న వ్యక్తినొకర్ని పట్టుకొని-‘‘నువ్వేంట్రా? నీకిక్కడేం పని?’’ అడిగాడు పోలీస్ ఇన్‌స్పెక్టర్.‘‘మా మేనల్లుడు రమ్మంటే వచ్చానండి’’ చెప్పాడా వ్యక్తి.‘‘ఎందుకు రమ్మన్నాడు’’‘‘సాయం కోసం.’’‘‘దేనికి సాయం?’’‘‘ఆణ్ణెవరో అల్లరి పెడుతున్నారట! పెట్టకుండా చూడమంటే వచ్చాను.’’‘‘నీకో మేనల్లుడు!! ఆణ్ణి అల్లరి పెట్టడం! కిరాయి నా కొడకా! ఎక్కు! ఎక్కు! జీపెక్కు’’ లాఠీతో కొడుతూ ఇన్‌స్పెక్టర్ ఆ వ్యక్తిని జీపెక్కించాడు.‘‘రౌడీ ఎదవ! ఎదవ!’’ అంటూ జీపెక్కిన ఆ వ్యక్తిని లాఠీతో పొడిచాడు ఇన్‌స్పెక్టర్. ఈ లోపు మరి నలుగురైదుగుర్ని వెతికి వెతికి అలాంటి శాల్తీలనే తీసుకొచ్చారు పోలీసులు. వాళ్లనీ జీపెక్కించారు.‘‘ఈ గూండాలేంటి సార్? వీళ్లకెందుకు కాలేజీ గొడవలు’’ కానిస్టేబుల్ ఎవరో అనుమానం వ్యక్తం చేస్తే-‘‘ఆ లింకులు ఎవరికీ అర్థం కావు!’’ అని చెప్పి‘‘అటు చూడు! ఆ అమ్మాయి ఎవరో నేల మీద పడుంది.’’అని అటుగా పరుగు తీశాడు ఇన్‌స్పెక్టర్. ఇద్దరు ముగ్గురు పోలీసులు అతడ్ని అనుసరించారు.ముక్కు, ముఖం కాలిపోయి వుంది. చూడ్డానికి భయంకరంగా వుంది. చచ్చిపోలేదు. ఎవరు? ఎవరీవిడ??రకరకాల ప్రశ్నలతో అనుమానాలతో అటూ ఇటూ చూస్తోన్న ఇన్‌స్పెక్టర్‌తో-‘‘చిన్న కోడలు హీరోయిన్సార్’’ చెట్టుచాటు నుండి వచ్చి చెప్పాడు డైరెక్టర్.‘‘మీరెవరు?’’‘‘సీరియల్ డైరెక్టర్ని సార్! ఇవాళిక్కడ కొత్త సీరియల్ స్టార్ట్ కాబోతుంటేను...’’‘‘అర్థమయిందర్థమయింది’’ అని డైరెక్టర్ని ఇంకేమీ చెప్పనివ్వక-‘‘అంబులెన్స్‌కి ఫోన్ చెయ్యండయ్యా! ముందు అంబులెన్స్‌కి ఫోన్ చెయ్యండి’’ అని కానిస్టేబుల్స్‌కి చెప్పాడు ఇన్‌స్పెక్టర్. వాళ్లా పనిలో పడ్డారు.‘‘మీ వాళ్లేరి? మీ షూటింగ్ జనాలు’’ డైరెక్టర్‌ని అడిగాడు ఇన్‌స్పెక్టర్.‘‘ఈ గొడవకి పారిపోయిన వాళ్లు పారిపోగా మిగిలినవాళ్లు నాలాగే ఆ మూలా ఈమూలా దాక్కుని వుంటారు’’‘‘చూడండయ్యా! షూటింగ్ జనాల్ని, స్టూడెంట్స్‌ని వొదిలేసి, ఇంకెవరైనా దాక్కొని వుంటే పట్టుకు రండి! వెళ్లండి’’కానిస్టేబుల్స్‌ని పంపించాడు ఇన్‌స్పెక్టర్. వాళ్లు వెతకడానికి పరిగెత్తారు.కాస్సేపటికి అంబులెన్స్ వచ్చింది. హీరోయిన్ని అందులోకి చేర్చారు.‘‘పోనీయ్! పోనీయ్’’ కేకేశాడు ఇన్‌స్పెక్టర్.అంబులెన్స్ బయల్దేరింది. కాలేజీ బయటకొచ్చింది. కో-డైరెక్టర్ గిరి, లక్ష్మీ చూస్తూండగానే అంబులెన్స్ అరుచుకుంటూ వెళ్లిపోయింది.ఏమయిందేమయింది?లక్ష్మి, గిరి ఒకరినొకరు ప్రశ్నించుకొని, అంబులెన్స్‌తో పాటు పరుగుదీస్తోన్న ఒకరిద్దరు షూటింగ్ మనుషుల్ని అడిగారు.‘‘హీరోయిన్ గారి మీద యాసిడ్ పోశారు’’ చెప్పారు వాళ్లు.‘‘యాసిడ్’’ అంటూ భయపడిపోయింది లక్ష్మి. అయితే చేష్టలుడిగిపోయాడు గిరి. అప్పుడక్కడికి వచ్చాడు పండా. వస్తూనే గిరిని పట్టుకొని కుదిపి-‘‘ఏంటి బాస్! ఏంటలా వుండిపోయావ్’’ అడిగాడు.‘‘మేడమ్ మీద యాసిడ్ పోశారంటే..అసలు...అసలెంతకి తెగించారా స్టూడెంట్లు’’ షాక్‌లోంచి ఇంకా కోలుకోలేదు గిరి.‘‘పోసింది స్టూడెంట్స్ కాదు! అదంతా పెద్ద కథ! ఆ కథంతా నాకిప్పుడే తెలిసింది. డైరెక్టర్ ఏడుస్తూ ఒక్కొక్కటీ కక్కుతూంటే అన్నీ తెలుసుకున్నాను.’’ అన్నాడు పండా.‘‘కథేంటి అసలు. డైరక్టర్‌గారెందుకు ఏడుస్తున్నాడు’’ ఆత్రంగా అడిగింది లక్ష్మి.‘‘అదంతా తీరిగ్గా చెప్పుకుందాం! ముందిక్కడ్నుంచి పదండి’’ అని గిరితోపాటు కారెక్కి-‘‘పోనీయ్’’ అన్నాడు పండా! కారు బయలుదేరింది.--------------------------‘‘అమ్మె! అమ్మో! ముదనష్టపోళ్లు! ఎంతకి తెగించారు’’ గుండెలు బాదుకుంది శకుంతల.‘‘ఏంటేంటి? యాసిడ్ లక్ష్మి మీద పోద్దామని ప్లాన్ చేశారా’’ అని విస్తుపోయింది అంతలోనే.‘‘అదృష్టం బాగుండి మన లక్ష్మి మనకి దక్కింది. పాపం పండి ఆ హీరోయిన్ అలా పోయింది’’ తగిన శాస్తే జరిగిందనుకుని లోపల్లోపలే ఆనందించింది శకుంతల.ముఖమంతా కాలిపోయి, చూడ్డానికి భయంకరంగా వున్న హీరోయిన్ని అంబులెన్స్ ఎక్కించి, తన కళ్ల ముందు నుంచే తీసుకెళ్తోంటే చూసి తట్టుకోలేక గగ్గోలుగా ఏడ్చాడు డైరెక్టర్. పండా వచ్చి ఓదార్చబోతుంటే-‘‘వొద్దు! నన్ను ఓదార్చొద్దు! మేం చేసిందానికి ఇంతే! మాకింతే కావాలి’’ అన్నాడతను.‘‘ఏం చేశారు’’ అని పండా అడగలేదు. కాని చేసిందంతా ఏడుస్తూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్.లక్ష్మి మీద యాసిడ్ పోసి, హీరోయిన్ని కాకుండా చేద్దామనుకొన్నారట. లక్ష్మిని ఈ సీరియల్లోంచి తప్పించి ఆ సీరియల్లో చిన్న కోడలు హీరోయిన్నే- హీరోయిన్ కావాలనుకుందట. తలచింది ఒకటయితే జరిగింది ఇంకొకటి అంటూ గోలపెట్టాడు డైరెక్టర్. పోలీసులు వినకుండా జాగ్రత్త పడ్డాడు పండా. డైరెక్టర్ని వాళ్లకి దూరంగా తీసుకు పోయాడు.అప్పుడు డైరెక్టర్ దగ్గర తాను విన్నదంతా ఇప్పుడు శకుంతలకి, గిరికి, లక్ష్మికీ చెప్పుచ్చాడు పండా. అతనలా చెప్పడంతో శకుంతల ఇలా బాధపడుతోంది.‘‘లక్ష్మి మీద వాళ్లకెందుకంత కసి? వాళ్లకేం చేసింది తను’’ ప్రశ్నించింది శకుంతల.‘‘చేసిందని కాదు! చేస్తుందని భయం’’ అన్నాడు గిరి.అర్థంకానట్లుగా చూసింది లక్ష్మి.తన టాలెంట్‌తో లక్ష్మి రేపు పెద్ద హీరోయిన్ కాకుండా పోదు! అపడు చిన్నకోడలకి పనే వుండదు. పనిలేకపోతే డబ్బు, పేరూ వుండదు. డబ్బు, పేరూ లేకపోతే ఎవరూ ఎందుకూ పనికిరారు. అందుకనే అన్నీ ఆలోచించి లక్ష్మిని ఈ రకంగా లేపేద్దామనుకున్నారు’’అన్నాడు గిరి.‘‘ఇంతలా తను ఆలోచిస్తుందంటావా’’ అడిగాడు పండా. చిన్నకోడలు హీరోయిన్ కసికి, కోపాలకీ అంతలేసి ఆలోచనలుండవని అతని నమ్మకం. నమస్కారం పెట్టకపోతే చాలు! నలిపేస్తుందని అతనికి తెలుసు.‘‘ఏదేమైనా ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారని!బాగా జరిగింది! ఈ సంగతి మనం ఎండీగారికి చెప్పాలి’’ అంది శకుంతల.‘‘అక్కర్లేదు’’ అంటూ దిగ్గున లేచి అక్కడ్నుంచీ వెళ్లిపోయింది లక్ష్మి. ‘లక్ష్మి లక్ష్మి’ అని శకుంతల పిలుస్తోన్నా పట్టించుకోలేదామె.‘‘వదిలేయండి! పాపం! బాధలో వుంది’’ అన్నాడు గిరి. మళ్లీ లక్ష్మిని పిలవకుండా శకుంతలని ఆపాడు.మెట్లెక్కి పంజరం దగ్గరగా వచ్చింది లక్ష్మి, అందులోని చిలకని చూస్తూ నిల్చుంది.‘‘లక్ష్మి’’ అని పిలిచింది చిలక.‘‘లక్ష్మీనే! బతికేవున్నాను’’ అని భోరుమంది.‘‘లక్ష్మి, లక్ష్మీ’’ వోదారుస్తున్నట్లుగా పిలుస్తోంది చిలక. ఏడుస్తోంది లక్ష్మి.ఎండీ రాత్రి దేవుడిలా వచ్చాడు. ఏదో జరుగుతుందని హెచ్చరించి వెళ్లాడు. హెచ్చరించినట్లుగానే జరిగింది. ఆయన చెప్పిందంతా నిజమే! నామీద...నామీద ఆయనకెందుకంత ప్రేమ?! ఆయనెక్కడ? నేనెక్కడ? గరికెపువ్వు ఎక్కడ? గగనాల జాబిలెక్కడ?! ఎక్కడ?ఊపిరి ఆడడంలేదు లక్ష్మికి. అంతలా ఏడుస్తోందామె.సరిగ్గా అప్పుడే-‘‘లక్ష్మీ’’ అంటూ పిలుస్తూ వచ్చాడక్కడకి ఎండీ. ఎండీ పిలుపు వినడం ఏంటి, ఇటు తిరిగి ఎండీని చూడ్డం ఏంటి మెట్లన్నీ ఒక్కొక్కటిగా దిగి వచ్చి, అతని కాళ్ల మీద పడింది లక్ష్మి. కన్నీళ్లతో అతని కాళ్లను కడుగుతున్నట్లుగా ఏడవసాగింది.‘‘వూర్కో! వూర్కో! ఏం జరగలేదు కదా! వూర్కో’’ భుజం పట్టి లక్ష్మిని లేపి ఓదార్చాడు ఎండీ.‘‘జరిగింది తలుచుకుంటుంటే భయం వేస్తోంది సార్’’ కల్పించుకుంది శకుంతల. ఎండీకి జరిగిందంతా చెప్పడానికి సిద్ధపడుతూ-‘‘అసలేమయిందంటే సార్...’’‘‘నాకంతా తెలుసు! నాకేం చెప్పనక్కర్లేదు’’శకుంతలను చెప్పనివ్వలేదు ఎండీ.‘‘ఛైర్మన్ గారిక్కూడా అంతా తెలుసు! భయంతో జరిగిందంతా డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. అని మళ్లీ చెప్పాడాయన.‘‘లక్ష్మి మంచికే ఇదంతా జరిగింది. ఛైర్మన్‌గారు ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ ఆగకూడదన్నారు. లక్ష్మి హీరోయిన్‌గా వెంటనే సీరియల్ స్టార్ట్ కావాలన్నారు! రేపే షూటింగ్ స్టారవ్వాలట! అది చెప్పడానికే ఇక్కడికొచ్చాను’’ చెప్పాడు ఎండీ.‘‘మరి డైరెక్టర్‌గారి పరిస్థితేమో అలా వుంది’’ గిరి గాబరా పడ్డాడు.‘‘డైరెక్టర్‌గా వాడ్ని ఛైర్మన్‌గారు తీసేయమన్నారు. రేపట్నించీ నువ్వే డైరెక్టర్! నీకావకాశం ఇమ్మన్నారు! నువ్వోకేనా’’ గిరిని అడిగాడు ఎండీ.‘‘సార్’’ ఆనందాశ్చర్యాలు గిరిని వూపిరాడనివ్వలేదు.‘‘లక్ష్మి హీరోయిన్‌గా, గిరి డైరెక్టర్‌గా రేపు సీరియల్ షూటింగ్ ప్రారంభం కావాలి. అవుతుందా? అవ్వదా’’ గిరిని అడిగాడు ఎండీ.‘‘ఎందుకవ్వదు సార్! అయి తీరుతుంది’’ గట్టిగా చెప్పాడు గిరి.‘‘అయితే నువ్వా ప్రయత్నాల్లో వుండు’’ అని-‘‘వస్తా లక్ష్మీ’’ అని చరచరా వచ్చినంత వేగంగానే వెళ్లిపోయాడు ఎండీ.ఊహకందని పరిణామం. గిరి ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు. పండాని గట్టిగా కౌగిలించుకొని కళ్లు చెమర్చుకున్నాడు.‘‘వస్తుంది బాస్! మనకంటూ ఓ రోజొస్తుందని చెప్పానా లేదా? ఇప్పుడొచ్చింది. ఐ యాం వెరీ హ్యాపీ’’ పండా ఆనందించాడు.‘‘రేపు నేను తప్పకుండా షూటింగ్‌కి వస్తాను’’ గిరితో శకుంతల అంది.‘‘ఇవాళ మాత్రం రావొద్దని నీతో ఎవరన్నారు’’ అడిగాడు గిరి.‘‘తనే రావొద్దంది’’ లక్ష్మిని చూపించింది శకుంతల.‘‘ఎందుకని’’ అడిగాడు.‘‘వద్దంది! కారణం చెప్పలేదు! అందుకే రాలేదు! రాకపోవడంతో చూడు! ఎంత గొడవయిపోయిందో’’ అంది శకుంతల.‘‘నువ్వు రాక పోవడమే మంచిదయ్యిందేమో! లేకపోతే ఆ యాసిడ్ సీసా నీ నెత్తిన పగిలేది’’నవ్వాడు పండా. ‘అవునవును’ అన్నట్లుగా గిరి కూడా నవ్వాడు. వాళ్లని చూసి లక్ష్మి కూడా నవ్వింది. లక్ష్మి అలా నవ్వడాన్ని సంతోషంగా చూసింది శకుంతల.-------------------------మూడు రోజులుగా తనకేమవుతోందో తెలీని పరిస్థితి. మత్తు... నిద్ర... వచ్చీరాని స్పృహలో తెలుస్తోంది తనున్నది ఆస్పత్రని, డాక్టరెవరో తనని ట్రీట్ చేస్తున్నారని, నర్సెవరో తనకి మందులవీ ఇచ్చి మింగిస్తోందని!ఏమయింది తనకి?బాగా స్పృహలోకి వచ్చిన చిన్న కోడలు హీరోయిన్ ఇప్పుడు కళ్ళు విప్పార్చుకుని చుట్టూ చూసింది. గదంతా చీకటి చీకటిగా వుంది. జీరో ఓల్ట్ బెడ్‌ల్యాంపేదో గుడ్డిగుడ్డిగా వెలుగుతోంది. ఆ వెలుగులో నర్సొకామె కునికిపాట్లు పడుతూ కనిపించింది.దాహంగా వుంది తనకి. నీళ్ళు కావాలి. ఇటు చూసింది. చేతికందేంత దూరంలో మంచినీళ్ళ గ్లాసుగాని, మగ్గుకానీ లేదు. నీళ్ళకోసం నర్సుని పిలవాల్సిందే!న.... ర్సు!!గట్టిగా పిలిచినా మెత్తగా వచ్చిందా పిలుపు. తన పిలుపు తనకే వినిపించనంత మెల్లిగా వినవచ్చింది. ఇంకొంచెం గట్టిగా పిలిచింది.న... ర్సు!!పిలవడానికి పెదవులు విప్పితే నొప్పి. భరించలేకపోతోంది తను. కుడిచేతిని ఎత్తి ముఖాన్ని ఆనించుకొంది. నొప్పి అనిపించినచోట నిమురుకొంటుంటే ఏదో మెత్తగా తగిలింది. ఏమయి వుంటుంది! దూదా? అవునవును! దూదే!! దూది ముఖాన ఎందుకుంది?దూదిని తీసే ప్రయత్నంలో పడింది హీరోయిన్. పింజెలు పింజెలుగా దూదిని తొలగిస్తూ, దూదిని తొలగిస్తున్నప్పుడు చర్మానికి నొప్పి కలిగితే అక్కడ చేత్తో అదుముకుంటూ మొత్తానికి ముఖాన్నంతా అంటిన దూదిని తీసేసింది. ఇపడు స్పర్శకి తెలుస్తోంది.ముఖాన్నంటి ఏదీలేదు.హమ్మయ్య!!కాకపోతే అక్కడక్కడా గరుకు గరుకుగా కోతలు కోతలుగా వుందేమిటి? ఏమయిందబ్బా? నాకేమయింది?! ఒకపక్క దాహం! మరోపక్క తనకేమయిందో తెలుసుకోవాలన్న ఉత్కంఠ.- కకావికలమయిపోతోంది హీరోయిన్.నా పిలుపు నర్సుకి వినిపించదు. తనొచ్చి నీళ్ళివ్వదు! ఈ దాహం తీరదు! అలాగే నా ముఖం మీద గరకు గరకుగా ఏమిటది? కోతలెందుకున్నాయి? తెలుసుకోవాలి!ప్రయాస మీద బెడ్ మీదనుంచి లేచి కూర్చుంది హీరోయిన్. అలా కూర్చోడంతో కళ్ళు తిరిగినట్టనిపించాయి. చెప్పలేనంత నీరసం కూడా వచ్చేసింది. కాసేపే అది! తర్వాత కూడదీసుకుంది.శరీరంలో మూలమూలల్లోంచి శక్తిని చేరదీసి, ఒక్క ఉదుటున లేచి నిల్చుంది. గాలిలో తేలిపోతున్నట్లుగా వుందంతా.నేల మీద బలంగా అడుగు పడుతోందో లేదో తెలీని స్థితి. కాని, ముందుకెళ్తోంది తను.స్విచ్ బోర్డు దగ్గరగా వచ్చింది హీరోయిన్. అక్కడున్న అన్ని స్విచ్‌లనూ వేసింది. గది నలువైపులా వున్న లైట్లన్నీ వెలిగాయి. ఇప్పుడంతా తెల్లగా, స్పష్టంగా, పగలుగా వుంది. నీళ్ల గ్లాసు కనిపించింది. అందుకొని నీళ్లు తాగింది. దాహం తీరిపోయింది. ముఖం సంగతేంటి? ఆ అనుమానం తీరాలిగా!! గదంతా పరికించి చూసింది. అల్మైరాకి అద్దం వుంది. అటుగా నడిచింది. ఒకటి... రెండు... మూడు... మూడంటే మూడడుగుల్లో అద్దం దగ్గరగా వచ్చి - అందులో తనని తాను చూసుకొంది హీరోయిన్. అంతే! ‘కెవ్వు’న అరిచి కుప్పకూలిపోయింది.‘‘అది బావా! అందుకని నువ్వు డాన్స్ నేర్చుకున్నావనుకో ఇంకా బ్రహ్మాండంగా తయారవుతావు’’ అంది పూజ. అని కారుకు అడ్డంగా పరిగెత్తుకొచ్చిన కుక్కపిల్లను చూసి భయాందోళనలతో ‘‘అరరే’’ అంటూ సడన్ బ్రేకుతో కారాపింది. కుక్కపిల్లకి ఏంకాలేదు. అది పరిగెత్తుకుంటూ అటుగా క్షేమంగా పోయింది. దాంతో గుండెల్నిండా ఊపిరి పీల్చుకొని వదిలి, పరిగెత్తిపోతోన్న కుక్క పిల్లని నవ్వుతూ చూస్తూ ‘‘యూ నాటీ’’ అని, కారుని ముందుకి పోనిచ్చి-‘‘ఏం బావా! ఏమంటావు నువ్వు? ఇంతకీ డాన్స్ నేర్చుకుంటావా? నేర్చుకోవా?’’ అడిగింది పూజ.‘‘నా డాన్స్ సంగతి తర్వాత! ముందు నువ్వు జాగ్రత్తగా కారు డ్రైవ్ చెయ్యి’’ పూజని చూడకుండా బైటకి చూస్తూ చెప్పాడు ప్రసాద్.‘‘మనం డ్రైవింగ్‌లో ఫస్ట్! నువ్వేం కంగారు పడకు’’‘‘అవునవును’’నవ్వాడు ప్రసాద్.‘‘నాకు సరిగా డ్రైవింగ్ రాదని నువ్వేం నవ్వక్కర్లేదు! అసలు డ్రైవింగ్ రాకపోవడం కూడా పెద్ద లక్కే! తెల్సా’’ అంది పూజ. అర్థం కాలేదు ప్రసాద్‌కి. ఆ భావంతోనే పూజని చూశాడతను.‘‘అర్థం కాలేదా? మనకి సరిగా డ్రైవింగ్ రాకపోబట్టే యాక్సిడెంట్ చేశా. కృష్ణారావు అంకుల్ కారు కింద పడ్డారు. నువ్వేమో నా కళ్లల్లో పడ్డావ్!’’ నవ్వింది పూజ.‘‘నువ్వు నా కళ్లల్లో పడడం నాకు పెద్ద లక్కే’’ అంది మళ్లీ.‘‘భగవంతుడా’’ అని తలపట్టుకున్నాడు ప్రసాద్.గత రెండు మూడు రోజులనుంచి పూజని జాగ్రత్తగా గమనిస్తున్నాడు ప్రసాద్. ఆమె మాటలు, చేష్టలూ అన్నీ అదోలా వుంటున్నాయి. ఆమె ఒంటరిగా వుండదు. తనను వుండనివ్వదు. పొద్దుటి పూట చూసే డైలీ పేపర్ నుంచి రాత్రి తాగే పాల దాకా అన్నీ సగం సగం షేర్ చేసుకుందామంటుంది.పేపర్నయితే మెయిన్ పేపర్, టాబ్లాయిడ్ పేపరంటూ విడదీసి సగం సగం పంచుకోవచ్చు. తాగే పాలని, అందులోనూ ఎంగిలి పాలని ఎలా పంచుకోడం? ఒకరెంగలి ఒకరు తినడాన్ని, తాగడాన్ని కాపురం అంటారు. అది పూజతో సాధ్యమవుతుందా? అవుతుందన్నట్లుగానే వుంటుంది పూజ ప్రవర్తన.‘‘పాలన్నీ నీ ఒక్కడి కోసమే తేలేదు! నాకందులో సగం వాటా వుంది’’‘‘ఇవి ఎంగిలి పాలు పూజా!’’‘‘అయితే ఏమయింది?’’‘‘ఏమయిందా? మగాడి ఎంగిలి ఆడది ఎప్పుడు ముట్టుకుంటుందో తెల్సా’’‘‘తెలుసు!శోభనం రాత్రి!’’‘‘దేవుడా’’ తల పట్టుకున్నాడతను.‘‘అలా తలపట్టుకునే బదులు నా కొంగు పట్టుకోవచ్చు కదా! హాయిగా వుండొచ్చు’’‘‘నువ్వేం మాట్లాడుతున్నావో నీ కర్థం కావట్లేదు’’‘‘నేను మాట్లాడుతోందంతా నా కర్థమవుతోంది. అర్థం కానిది నీకే! ఎర్రగా బుర్రగా అంతెత్తున వుండడం కాదు బావా! ఆ ఎత్తుకి తగ్గట్లుగా ఏ మాత్రమైనా బ్రెయినుండాలి. అది నీకు లేదనిపిస్తోంది.’’‘‘లేదు! నన్నొదిలేయ్’’‘‘వదల్ను! వెంటపడి వేధిస్తాను! గట్టిగా మాట్లాడితే ప్రేమిస్తాను’’ అంటూ ఇంకేవేవో మాట్లాడుతోంటే వినకూడని వాటిని విన్నట్లుగా చెవులు మూసుకున్నాడు తను. తనలా చెవులు మూసుకుంటే తెరలు తెరలుగా నవ్వింది పూజ.తనని ప్రేమిస్తున్నానని చెప్పడానికి పూజకి భయం లేకుండా పోయింది. సిగ్గుకూడా పడడం లేదు. ప్రేమించడం వీరోచిత చర్యలా ఫీలవుతోందామె. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలో, ఏం చేసి పూజని తన నుంచి దూరం చేసుకోవచ్చో తెలియట్లేదు ప్రసాద్‌కి.మొన్నటికి మొన్న చిలుకూరు దేవాలయంలో కూడా అంతే! ముందు దేవుడి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేద్దామంది. ‘సరే’నన్నాడు తను. ఒకరి పక్కగా ఒకరు నడుస్తూ ప్రదక్షిణ చేద్దామనుకుంటే పూజ తన పక్కన లేకుండా పోయింది. ఏమయిందని చూస్తే తన వెనగ్గా నడుస్తోంది.‘‘అదేంటి వెనక నడుస్తున్నావు! ప్రక్కకి రా’’ అంటే-‘‘ఇలాగే బాగుంటుంది! పద’’ అంది.మూడు ప్రదక్షిణలు అయిపోయాయి.‘‘ఆలయంలోకి వెడదాం రా’’ పిలిచాడు తను.‘‘మరో నాలుగు ప్రదక్షిణలు చేద్దాం’’ అంది పూజ.‘‘అదేం లెక్క’’‘‘అదో లెక్కలే!రా’’ అంది పూజ. బలవంతంగా తన చేత మరో నాలుగు ప్రదక్షిణలు చేయించింది.‘‘ఏడయిపోయాయి!చాలు’’ అన్నాడతను.‘‘అవును! అసలు నడవాల్సింది ఏడడుగులే! కాని నీతో నేను ఏడు ప్రదక్షిణలే చేశాను. అంటే ఈ జన్మకే కాదు! ఏడేడు జన్మలకీ నువ్వే నా భర్తవి’’ అని నవ్వింది పూజ.‘‘భగవాన్’’ అంటూ తలపట్టుకున్నాడు తను.‘‘పట్టుకోవాల్సింది తల కాదు బావా! చేయి పట్టుకోవాలి! నా చేయి పట్టుకోవాలి’’ అంటూ పగలబడి నవ్వింది. పది మందీ చూస్తారన్న బెరుకు కూడా పూజలో లేదు. అర్చనకి-‘‘గోత్రం చెప్పండమ్మా’’ అని పూజారి అడిగితే-‘‘మా బావ గోత్రమే నా గోత్రం’’ అంది.‘‘పెళ్లి కాకుండా ఇద్దరి గోత్రాలొకటి కావమ్మా’’ అని పూజారంటే-‘‘మనసులు కలిశాయి పూజారి గారూ! ముందు కలవాల్సింది అవే కదా’’ అని ‘ ఏమంటారు’ అన్నట్లుగా కళ్లెగరేసి నవ్వింది. పాపం పూజారి ఏమీ అనలేదు. అర్చన చేసేందుకు అటుగా వెళ్లిపోయాడు.‘‘ఈ పద్ధతేం బాగాలేదు పూజ’’ హెచ్చరించాడు తను.‘‘ఇది బాగోలేదు సరే! ఏ పద్ధతిలో ప్రేమించమంటావ్’’ అడిగింది.‘‘నీతో మాట్లాడ్డం కన్నా వూరుకోవడం మంచిది’’‘‘కరెక్ట్! వూరుకో, దేవుడికి దణ్నం పెట్టుకో’’ అంది పూజ.దణ్ణం పెట్టుకున్నాడు తను. ఏమని దణ్ణ పెట్టాడు? లక్ష్మి తొందరగా కనిపించాలని పెట్టాడు. పూజని దూరం చెయ్యమని పెట్టాడు. ఫలించలేదు. లక్ష్మి కనిపించలేదు సరికదా పూజ మరింత దగ్గరవుతోంది. ఏం దేవుడో ఏమో! శ్రద్ధగా తన మొర ఆలకించనేలేదు.-తెగని ఆలోచనలతో చిరాకు చిరాగ్గా వున్నాడు ప్రసాద్. ప్రసాద్ ఆ మూడ్‌లో వుంటూండగానే డాన్స్ స్కూలు ముందు కారాపింది పూజ.‘‘దిగు’’ కారు డోర్ తెరిచింది పూజ.‘‘ఈ డాన్స్‌లవీ నేర్చుకోవడం నాకిష్టం లేదు’’ చెప్పాడు ప్రసాద్.‘‘మళ్లీ మొదటికొచ్చావా మగడా?’’ అంది పూజ.‘‘ఇవన్నీ నీలాంటి ఆడవాళ్లకి! మాలాంటి మగవాళ్లకి కావు! చెబితే వినిపించుకోవు’’ అసహనం వ్యక్తం చేశాడు ప్రసాద్.‘‘నీకో సంగతి తెలుసా’’ అడిగింది పూజ.‘‘ఏంటది?’’‘‘డాన్స్ స్కూల్లో నాలాంటి ఆడవాళ్లు పదహారు మంది స్టూడెంట్స్ వుంటే నీలాంటి మగవాళ్లు ఇరవై మంది దాకా వున్నారు.’’‘‘వాళ్లకే పనిపాటా లేదేమో’’‘‘అని నువ్వనుకుంటే ఎలా చెప్పు!కమాన్! పద’’ కారులోంచి ప్రసాద్ చేయిపట్టి లాగి, స్కూలులోనికి దారి తీసింది. అయిదారు అడుగులు వేసి ఆగి-‘‘నీకు డాన్స్ నేర్పేది ఎవరో తెల్సా’’ అడిగింది పూజ.‘‘ఎవరు?’’‘‘నేనే’’ గొలుసులు గొలుసులుగా నవ్వి-‘‘డాన్స్ ఎలా చెయ్యాలో కాలుకి కాలు, కన్నుకి కన్నూ కలిపి చెప్తాను! ఇట్టే వచ్చేస్తుంది నీకు.’’‘‘ఛీ..ఛీ’’ అసహ్యించుకున్నాడు ప్రసాద్.‘‘దేన్ని అసహ్యించుకుంటున్నావ్! డాన్స్‌నా? నన్నా?’’‘‘దేన్ని అసహ్యించుకోవడం లేదు పద’’ అన్నాడు ప్రసాద్.‘‘అలా దారికి రా’’ అని ప్రసాద్‌ని తోడుకుని ఆనందంగా నడిచింది పూజ.మొన్నటి నుంచీ ఇదే తంతు. పూజ వాళ్ల కాలేజీలో ప్రసాద్ జాయినయిన దగ్గర్నుంచీ ప్రసాద్‌ని పూజ ఇలాగే వేధించుకుని తింటోంది. ఆరోజు చిలుకూరు దేవాలయంలోముందుగా అల్లరి స్టార్ట్ చేసింది. ఏ ముహూర్తాన స్టార్ట్ చేసిందో గాని ఆమె అల్లరింకా అలాగే కొనసాగుతోంది. తట్టుకోలేకపోతున్నాడు ప్రసాద్.ప్రసాద్ లక్ష్మిని కావాలనుకుంటున్నాడు. అయితే ప్రసాద్‌ని పూజ కావాలనుకుంటోంది. ఎవరు ఎవర్ని కోరుకుంటున్నా, ఆశించడం వరకే వారి వంతు! కట్టుకోవడం, కలిసి కాపురం చెయ్యడం అదంతా విధి లిఖితం. అన్నది కృష్ణారావు ఆలోచన. ప్రసాద్‌తో పూజ చనువుగా వుండడాన్ని కృష్ణారావు చాటు మాటుగా గమనిస్తూనే వున్నాడు. రేపు వీళ్లిద్దరూ ఒకటవుతారా? అయితే నా చెల్లెలు లక్ష్మి గతి ఏమిటి? దేవుడి లాంటి ప్రసాద్‌ని నేను దూరం చేసుకోవాలా?నో! చేసుకోను! చేసుకోలేను! నాకు...నాకు ప్రసాద్ కావాలి. కావాలంతే!-కృష్ణారావు గుండెల్లో రోదిస్తున్నాడు. రోదిస్తూనే గట్టి నిర్ణయం తీసుకున్నాడతను.--------------------------------‘‘కట్’’ గట్టిగా అరిచాడు గిరి. వెనువెంటనే ‘బ్రేక్’ అన్నాడు. అంతే! లైట్లారిపోయాయి. జనరేటర్ కూడా ఆగిపోయింది. ప్రొడక్షన్ వాళ్లు లంచ్ ఏర్పాట్లలో పడ్డారు.‘‘నాకు ఆకలిగా లేదు’’ అంది లక్ష్మి.‘‘కొంచెం పెరుగన్నం తిను! లేకపోతే కష్టం! నెక్ట్స్ సీను చాలా హెవీ సీను! మీ అమ్మగారు చనిపోవడం. ఆమె శవాన్ని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకురావడం, నువ్వు ఏడ్వడం..అబ్బో! రైటర్‌గారు ఆరు పేజీలు రాశారా సీను! పేజీలుచూస్తేనే భయం వేస్తోంది. తియ్యాలంటే... ఆలోచించుకో! సాయంత్రం ‘టీ బ్రేక్’ కూడా ఇచ్చే అవకాశం లేదు! అందుకని నా మాట విను, ఆకలి లేకపోయినా, ఏదో కొంత ఈ మాత్రం తిను.’’ అన్నాడు గిరి. హీరోయిన్‌గా లక్ష్మిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడతను.‘‘ఏంటో? ఇక్కడి రైస్ అరగట్లేదు గిరిగారు! ఇంత తిన్నా కడుపంతా భారంగా వుంటోంది’’ తన బాధని వెళ్లబోసుకుందామె.‘‘కక్కుర్తిగాళ్లు! ఏ కంపెనీలో అయినా ప్రొడక్షన్ ఇంతే! పెట్టే అన్నం దగ్గరే లావాదేవీలు! ఇవాళ్టికిలా కానిచ్చేయ్! రేపు సీరియస్‌గా చెబుదాం! మంచి రైసయితేనే భోంచేస్తాం! లేకపోతే చెయ్యం అందాం! ఓకే’’‘‘ఓకే’’ నవ్వింది లక్ష్మి.అనుకున్నట్లుగానే గిరి డైరెక్షన్లో లక్ష్మి హీరోయిన్‌గా సీరియల్ షూటింగ్ స్టార్టయింది. స్టార్టయి అప్పుడే మూడోరోజు. బాగానే జరుగుతోందంతా.కావాల్సిన లెంగ్త్ కూడా వస్తోంది.‘‘రోజుకి పదిహేను నిముషాలు కాదయ్యా! మినిమమ్ ట్వంటీ! ట్వంటీ మినిట్స్ నువ్వు తియ్యగలగాలి! అటు ఇటుగా ఓ ఎపిసోడ్ అనుకో! రోజుకో ఎపిసోడ్ నువ్వు తియ్యగలిగితే నీకింక ఎదురు లేదయ్యా’’ మేనేజర్ చెప్పాడు.‘‘ట్రై చేస్తాను సర్’’ గిరి ఇబ్బందిగా అన్నాడు.‘‘ట్రై చేసి చూడు! నీకు నా ఆశీస్సులుం టాయి’’‘‘ఓకేసార్’’రోజుకి ఇరవై నిమిషాలు తియ్యడానికి గిరి నానా కష్టాలు పడుతున్నాడు. రోజుకి నలభై నిమిషాలు తీసేవాళ్లు కూడా వున్నారు. లేకపోలేదు. కాకపోతే వాళ్లు చుట్టేస్తారు. క్వాలిటీ వుండదు. గిరి క్వాలిటి కోసం తాపత్రయపడుతున్నాడు. వచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించుకోవాలి. వినియోగించుకుంటనే ఫ్యూచర్. లేకపోతే కష్టం అన్నది గిరికి బాగా తెలుసు.తర్వాతి సీను షాట్ డివిజన్ చేస్తున్నాడు గిరి. అంతలో ఫోనొచ్చింది. అటు నుంచి ఎండీ మాట్లాడుతున్నాడు.‘‘చెప్పండి సార్’’ గిరి గొంతంతా వినయంతో నిండిపోయింది.‘‘ఇవాల్టితో ఇప్పుడు చేస్తోన్న సీరియల్ ఆపేసి, రేపట్నించి చిన్న కోడలు సీరియల్ డైరెక్ట్ చెయ్యి’’ చెప్పాడు ఎండీ.‘‘మరీ సీరియల్ సార్’’‘‘ఇదీ నువ్వే చేద్దూగాని! కాకపోతే టెలికాస్ట్‌కి చిన్నకోడలు ఎపిసోడ్స్ లేవు. అదీ అసలు సంగతి.’’‘‘హీరోయిన్ గారు ఆస్పత్రిలో వున్నారుకదా సార్’’‘‘వుంటే వుండనీ! మనకేం ఇబ్బంది లేదు! ఆవిడ స్థానంలో లక్ష్మిని హీరోయిన్‌గా పెట్టి షూట్చెయ్’’‘‘ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తారా సార్’’‘‘ఎందుకు చెయ్యరు? జరిగిన గొడవంతా పేపర్లో వచ్చిందిగా. వాళ్లకి అంతా తెలుసు. లక్ష్మికీ సంగతి చెప్పి తనని కూడా ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పు! నేను తర్వాత ఫోన్‌లో తనతో వివరంగా మాట్లాడతాను’’‘‘సరే సార్’’‘‘బై’’ ఎండీ ఫోన్ పెట్టేశాడు.గిరికి ఒక్కసారిగా కళ్లు తిరిగినట్టనిపించాయి. నింగి, నేలా రెండూ ఏకమయిపోతున్నట్లనిపించింది. ఏంటది? తనింకో సీరియల్‌కి డైరెక్టరా! అదలా వుంచితే లక్ష్మి చిన్నకోడలు సీరియల్ హీరోయినా? టైటిల్ రోల్ తను పోషించబోతోందా? తను చెప్తే నమ్ముతుందా?‘‘లంచ్ రెడీ సార్’’ అని కేకేసి చెబుతున్నా వినిపించుకోక-‘‘లక్ష్మి...లక్ష్మి ఎక్కడ’’అడిగాడు గిరి.‘‘రూంలో వున్నార్సార్’’ చెప్పాడు.పరుగున చేరుకున్నాడక్కడికి. లక్ష్మి విగ్గుని హెయిర్ డ్రస్సర్ ఎడ్జస్ట్ చేస్తోంది. పిన్స్ పెడుతోందామె. లక్ష్మి కళ్లు మూసుకొని రిలాక్స్‌వుతోంది.‘‘మేడమ్‌తో మాట్లాడాలి! నువ్వోసారి బైటికెళ్లు’’ హెయిర్ డ్రెస్సర్‌కి చెప్పాడు గిరి.‘‘సరే సార్’’ వెళ్లిపోయిందామె.గిరి గొంతు వినగానే కళ్లు విప్పి చూసింది లక్ష్మి. హెయిర్ డ్రెస్సర్ని అతను వెళ్లమని చెప్పడం వెనక ఏదో వుందనిపించి ‘ఏమయింది’ అన్నట్లుగా చూసింది గిరిని.‘‘నీకో గుడ్ న్యూస్’’ చెప్పాడు గిరి.‘‘ఏంటది’’ అడిగింది లక్ష్మి.‘‘చిన్న కోడలు టైటిల్ రోల్ నీదే! ఆ సీరియల్లో రేపట్నుంచి నువ్వే హీరోయిన్’’అని తనతో ఎండీ మాట్లాడిందంతా చెప్పుకొచ్చాడు. నమ్మలేకపోయింది లక్ష్మి.‘‘నిజం! మా అమ్మతోడు’’ చెప్పాడు గిరి.‘‘నీతో కాస్పేపట్లో ఎండీగారు మాట్లాడతానన్నారు’’ అని కూడా చెప్పాడు. దాంతో గిరి మాటల్ని కొంచెం కొంచెంగా నమ్ముతూ వచ్చిందామె. కొన్ని గొప్పగొప్ప పనులు తేలిగ్గా జరిగిపోతాయి. ఊహకి కూడా అందవవి. అదందనంత సేపే ఆరాటం. తాను కొత్త సీరియల్లో హీరోయిన్ అనగానే ఎన్ని గొడవలు జరిగాయి! ఎన్ని కుట్రలు చేశారు! అంతే! ఆ ఒక్కరోజే అవన్నీ. మర్నాడేమయింది! తను హీరోయిన్ అయిపోయింది. పువ్వు విచ్చుకున్నంత మెత్తగా చడీ చప్పుడు లేకుండా చకచకా జరిగిపోయాయన్నీ. ఇప్పుడూ అంతే! చిన్నకోడలు టైటిల్ రోల్ తనది! రేపట్నుంచి ఆ సీరియల్ హీరోయిన్ తను. ఆనందంతో లకి్క్ష కళ్లు చమర్చాయి.‘‘నామీద, నీ మీద ఎండీగారికి ఎందుకింత ప్రేమంటావ్’’ గిరిని అడిగింది లక్ష్మి.‘‘ఎందుకంటే...అది మన అదృష్టం అంతే’’ అన్నాడు గిరి.‘‘నీకో రహస్యం చెప్పనా?’’ అన్నాడు మళ్లీ.‘‘ఏంటది?’’‘‘ఆస్పత్రి పాలయిన చిన్నకోడలు హీరోయిన్‌వి ఇంకా రెండు మూడు సీరియల్సున్నాయి. ఈ లెక్కన వాటిక్కూడా టెలికాస్ట్ ఎపిసోడ్స్ వుండవు. అంటే...’’ అర్థోక్తిలో ఆగాడు. కాస్సేపటికి-‘‘ఆ సీరియల్స్ కూడా నీవే’’ అని నవ్వాడు. లక్ష్మి ఆనందం పట్టలేకపోయింది. ‘భోరు’న ఏడ్చేసింది.-------------------------అన్ని విషయాలు తెలుసుకున్న చిన్నకోడలు హీరోయిన్ యాసిడ్ పడి రంధ్రాలయిన ముఖాన్ని నిమురుకుంటూ ఆరోజు ఎపిసోడ్ చూసేందుకు కావాలనే కసిగా టీవిని ఆన్ చేసింది. చిన్నకోడలు సీరియల్ స్టార్టయింది. అత్తగారిని ఎదిరించే చిన్నకోడలు మేడమెట్లు దిగుతూ వస్తోంది.మేడమెట్లు దిగుతోంది లక్ష్మి.మహరాణిలా దిగుతోంది.‘ఈ సామ్రాజ్యం నాది’ అన్న గర్వం, హుందాతనం వున్నాయి ఆమెలో...లక్ష్మి అలా మేడమెట్లు దిగుతోంటే కింద స్ర్కోలింగ్‌గా-‘ఈరోజు నుంచి చిన్నకోడలు పాత్రధారిణి ‘లక్ష్మి’ అని గమనించి, సీరియల్‌ని ఎప్పట్లాగే ఆదరించగలరని మనవి.’ అని రావడాన్ని చూసి అది భరించలేక ‘ఏయ్’ అంటూ గట్టిగా అరుస్తూ దగ్గరలో వున్న ఫ్లవర్‌వాజ్ అందుకుని టివి మీదకి విసిరింది హీరోయిన్. దెబ్బకి టివి ‘భళ్ళ’ని పేలిపోయింది.టక్...టక్...టక్‌క్రచెస్ సాయంతో నడుచుకుంటూ కిటికీ దగ్గరగా వచ్చాడు కృష్ణారావు. కిటికీ చువ్వలను పట్టుకొని క్రచెస్‌ని కిటికీకి చేరవేసి, చూస్తూ నిల్చున్నాడు.రాత్రి ఎనిమిది గంటలు కావస్తోంది. వాచ్‌మన్ మెయిన్ గేటు దగ్గర లేడు. ఏమయ్యాడు?-చూస్తే, ఇటు మందార చెట్టు నీడలో నిల్చుని వుండి, దొంగచాటుగా సిగరెట్ తాగుతూ కనిపించాడు. కేకేస్తే చాలు! సిగరెట్ పారేస్తాడతను. కేకేసి అతని ఆనందాన్ని ఎందుకు పోగొట్టడం? ఆనందించనీ!-అనుకొని ఇటుతిరిగి చూశాడు కృష్ణారావు.పోర్టికోలోని కారు దగ్గరకి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, నవ్వుకుంటూ వస్తో కనిపించారు ప్రసాద్ - పూజ.‘‘డాడీ ఎప్పుడూ అంతే! ముందు రానంటారు. తర్వాత తనే బయల్దేరుతారు’’ అంది పూజ.‘‘రానంటే నువ్వు వూరుకుంటావా? అందుకే బయల్దేరతారు’’ నవ్వాడు ప్రసాద్.‘‘ఎక్కడికెళ్లినా నలుగురం నవ్వుతూ బయల్దేరాలి. అది మన పాలసీ’’ అంది పూజ.‘‘నీ పాలసీ సంగతేమోగాని, నీతో తిరగడంతో నా చదువు సాగట్లేదు’’ అన్నాడు ప్రసాద్.‘‘ఇరవైనాలుగ్గంటలూ చదువుతూ కూర్చుంటే బోర్ బావా! అప్పుడప్పుడూ అలా తిరిగిరావాలి! తిరిగొస్తేనే తలకెక్కుతుంది.’’‘‘ఏంటీ ? తలనొప్పా’’‘‘బావా’’ బుంగమూతి పెట్టింది పూజ.బాధపడ్డట్లు చూసింది.అంతలో పూజ తల్లి, తండ్రి రఘునాధం కూడా వస్తూ కనిపించారు. అంతా ఎక్కడికో వెళుతున్నారు. పెళ్లికో? పార్టీకో?‘‘కారుని నేను డ్రైవ్ చేస్తాను డాడీ’’ అంది పూజ.‘‘వద్దమ్మా! డ్రైవర్ ఏమయ్యాడు’’ అడిగాడు రఘునాథం.‘‘చిన్నపని వుందని హాఫ్ డే లీవ్ అడిగితేను, మధ్యాహ్నమే పంపించేశాను. అందుకే కారుని మనం డ్రైవ్ చేస్తాం’’ అని పూజ డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుంటే-‘‘నువ్వాగమ్మా! ఆగు! నువ్వు డ్రైవ్ చేస్తే మనం వెళ్లేది పెళ్లికి కాదు! ఆస్పత్రికి వెళ్లాలి’’ అంది పూజ తల్లి.‘‘మమ్మీ’’ ఉడుక్కుంది పూజ.‘‘ఆంటీ మాటల్లో అక్షరం అబద్ధం లేదు. సెంట్ పర్సంట్ కరెక్ట్’’ పూజని మరింతగా ఉడికించాడు ప్రసాద్.‘‘యూ’’ ప్రసాద్‌ని కోపంగా కొట్టబోయింది పూజ. తప్పించుకున్నాడు ప్రసాద్. పట్టుకోజూసింది అతన్ని. పరిగెత్తాడు ప్రసాద్. అతని వెంట పడిందామె. ప్రసాద్ - పూజ అలా పరిగెడుతోంటే చూసి ఆనందించారు పూజ తల్లిదండ్రులు.‘‘ఇద్దరికిద్దరూ బాగా సరిపోయారు! మంచి జోడీనే’’ నవ్వింది పూజ తల్లి.‘‘అయితే నీకూ నాలాగే అనిపించిందన్నమాట’’ నవ్వాడు రఘునాథం.‘‘బాగుంది వరస’’ అందామె.‘‘వరస కాబట్టే ఇదంతా..’’ గుంభనంగా నవ్వాడు రఘునాథం.పరుగెత్తుకొస్తోన్న ప్రసాద్, పూజలను చూసి, చేతిలోని సిగరెట్‌ని గోడ అవతలకి విసిరేసి గబగబా మెయిన్ గేటు దగ్గరకి వచ్చి నిల్చున్నాడు వాచ్‌మెన్.తన డ్యూటీలో తాను బాగా సిన్సియర్ అన్నట్లుగా లోపలకి అసలు చూడకుండా బైటకి చూస్తూ నిల్చున్నాడు.-అదంతా గమనించి సన్నగా నవ్వుకున్నాడు కృష్ణారావు. ‘బలేవాడే’ అనుకున్నాడు. అంతలో పూజకి ప్రసాద్ దొరికిపోయాడు. ప్రసాద్‌ని దొరకబుచ్చుకున్న పూజ, ఒక్క ఎగురెగిరి, గుమ్మడిపండులా ప్రసాద్‌ని పట్టుకుని వేలాడింది.‘‘ఏయ్ దిగు! నిన్నే! దిగమంటుంటే’’ ప్రసాద్ ఎంత చెప్పినా విన్పించుకోలేదు పూజ.‘‘పద! మోసుకుంటూ కారు దగ్గరకి పద’’ అంది. తప్పలేదు ప్రసాద్‌కి. పూజని మోసుకుంటూ నడవసాగాడు.- ఆ దృశ్యాన్ని చూస్తూ తట్టుకోలేకపోయాడు కృష్ణారావు. ప్రసాద్ తనవాడు. తనకు కావాలి. బావ కావాలి. ప్రసాద్ తనకి బావ కావాలంటే లక్ష్మి కావాలి. లక్ష్మి దొరకాలి. ఎక్కడున్నావ్ లక్ష్మి? ఈ మహానగరంలో ఎక్కడున్నావ్?- కిటికీ చువ్వలకి తలాన్చి బాధగా చెమర్చిన కళ్లని మూసుకున్నాడు కృష్ణారావు.గుమ్మడిపండు వాటంలో పూజని మోసుకొస్తూ కారు దగ్గరకి వచ్చాడు ప్రసాద్.‘‘ఏంటమ్మా అల్లరి? దిగు’’ సున్నితంగా కసురుకుంది పూజ తల్లి.‘‘లేకపోతే నాకు దొరక్కుండా పోతాడా?’’ ప్రసాద్ వీపు మీంచి దిగింది పూజ.‘‘పదండి! పదండి! ముహూర్తానికి టైమవుతోంది’’ కారెక్కి తొందర చేశాడు రఘునాథం. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారెక్కారంతా. వస్తోన్న కారుని చూసి మెయిన్ గేట్ తీశాడు వాచ్‌మెన్. కారు గేటులోంచి దూసుకుపోయింది.పూజ నుంచి ప్రసాద్‌ని ఎలాగైనా దూరం చెయ్యాలి. పూజకి ప్రసాద్ అందకుండా పోవాలి. పోవాలంటే లక్ష్మి... లక్ష్మి దొరకాలి! ఎక్కడమ్మా? ఎక్కడున్నావ్ తల్లీ!!గుండెల్లో కృష్ణారావు గగ్గోలుగా ఏడుస్తున్నాడు.‘‘సార్’’ వాచ్‌మన్ పిలుపు వినవచ్చింది. దాంతో కళ్లిప్పి చూశాడు కృష్ణారావు. మెయిన్ గేట్ దగ్గర వాచ్‌మన్ లేడు! పైగా గేటుకి తాళం వేసి వుంది. మరి...మరెక్కడ్నించీ పిలుపు? ఇటు తిరిగి చూశాడు కృష్ణారావు. వాచ్‌మన్ ఔట్‌హౌస్ గుమ్మంలో నిల్చుని కన్పించాడు.‘‘సార్’’ మళ్లీ పిలిచాడు వాచ్‌మన్.‘‘వస్తున్నా’’ అని క్రచర్స్ సాయంతో అటుగా నడిచాడు కృష్ణారావు.‘‘ఏంటయ్యా’’ వాచ్‌మన్ దగ్గరగా వచ్చి,అడిగాడు కృష్ణారావు.‘‘టివి పెడతారా సార్! సీరియల్ ఒకటి చూడాలి’’‘‘ఏంటా సీరియల్’’‘‘చిన్నకోడలు సార్! సూపర్ సీరియల్’’‘‘వచ్చి నువ్వే పెట్టుకో’’ అని ఔట్ హౌస్ బైటకి నడవబోతుంటే-‘‘మీరు సీరియల్స్ చూడరా సార్’’ కృష్ణారావుని అడిగాడు వాచ్‌మన్.‘‘నాకు సీరియల్స్ చూసే అలవాటు లేదు’’‘‘బలే సీరియల్ సార్! చిన్న కోడలు చూడండి-చాలా బాగుంటుంది’’‘‘నువ్వు చూస్కో’’ముందుకు నడిచాడు కృష్ణారావు. బంగ్లాలో ఎవరూ లేరు. కాసేపలా తిరిగి వద్దామని అతని ఆలోచన.వాచ్‌మన్ లోపలకి వచ్చాడు. టివి ఆన్ చేశాడు. ఛానెల్18 పెట్టాడు. ఆ టైంలో ఛానెల్18లో వచ్చే ‘చిన్నకోడలు’ సీరియల్ అంటే అతనికి చాలా ఇష్టం. ఏదోలా ఆ సీరియల్‌ని రెగ్యులర్‌గా చూస్తూ వస్తున్నాడతను. నిన్నటి వరకూ వంటాయన క్వార్టర్‌లో చూశాడు. ఇవాళ బంగ్లాలో ఎవరూ లేరు కాబట్టి ఇక్కడ చూడబోతున్నాడు.----------------------సీరియల్ స్టార్టయిపోతోంది! ఎండీగారింకా రాలేదేమిటి? వస్తానని చెప్పారు. ఈ రోజు సీరియల్స్ రేటింగ్స్ వస్తాయని, ఆ ఛార్ట్ పట్టుకొని వస్తానన్నారు. ఇంకా రాలేదు.-అసహనంగా టివి ముందు కూర్చుని అటూ ఇటూ చూస్తోంది లక్ష్మి.చిన్నకోడలు మొదటి నుంచి నెంబర్ వన్ సీరియల్. గత రెండేళ్లుగా నెంబర్ వన్‌లోనే కొనసాగింది. ఇటీవలే దాని రేటింగ్ పడిపోయింది. నెంబర్ వన్నల్లా నెంబర్ సిక్స్‌కి పడిపోయింది. ఇంతలో హీరోయిన్ ఛేంజయింది. టైటిల్ రోల్ తాను పోషిస్తోంది.నటిస్తూ వారం పదిరోజులయిందప్పుడే! రెస్పాన్స్ ఎలా వుందో మరి?!- లక్ష్మికంతా ఆందోళనగా వుంది.లక్స్ చిన్నకోడలు!ఈ సీరియల్ సమర్పిస్తున్నవారు ఫెయిర్ అండ్ లవ్‌లీ మరియూ గార్నియర్ ఎపిసోడ్ నెంబర్ 450.- టివి తదేకంగా చూస్తోంది లక్ష్మి. చిన్నకోడలు టైటిల్ సాంగ్ స్టార్టయింది. అంత వరకూ కిందన వుండి కబుర్లాడుకుంటున్న శకుంతల, గిరి చిన్నకోడలు టైటిల్ సాంగ్ వినడం ఏంటి? గబగబా మెట్లెక్కి వచ్చి లక్ష్మి పక్కన కూర్చున్నారు.‘‘ఎండీ గారు రావట్లేదా’’ గిరిని అడిగింది లక్ష్మి.‘‘రావాలి! వస్తానని నాకు చెప్పారు కూడ’’ అన్నాడు గిరి.‘‘రేటింగ్సొస్తాయి! తీసుకొని వస్తానన్నారు! రాలేదంటే...నా ఎంట్రన్స్‌తో రేటింగ్ ఇంకా పడిపోయిందా?’’ అనుమానాన్ని వ్యక్తం చేసింది లక్ష్మి.‘‘ఛఛ! అదేం లేదు! నాకున్న సోర్స్ ద్వారా నాకు తెలిసిందేమిటంటే- నీ ఎంట్రన్స్ దగ్గర్నుంచీ చిన్నకోడలు మళ్లీ పుంజుకొంది.. మళ్లీ ఇప్పుడే నెంబర్ వన్‌కి వచ్చే అవకాశాలు వున్నాయంటున్నారు’’ చెప్పాడు గిరి.‘‘అవును లక్ష్మీ! కృష్ణానగర్‌లో కూడా ఇదేటాక్’’ చెప్పింది శకుంతల.టైటిల్ సాంగ్ అయిపోయింది. సీరియల్ స్టార్టయింది. ఏదో కామెడీ సీను. టైమ్ లాప్స్ సీను నడుస్తోంది. పెద్దగా చూడక్కర్లేదు దాన్ని. అందుకనే దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అంతలో రానే వచ్చాడు ఎండీ. అతని చేతిలో రేటింగ్స్ కాగితాలున్నాయి. వస్తూనే-‘‘కంగ్రాట్స్ లక్ష్మీ! కంగ్రాట్స్’’ అంటూ లక్ష్మి చేతిని షేక్ చేశాడు.‘‘రేటింగ్ ఎంతొచ్చింది సార్’’ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు గిరి.‘‘చెప్పండి బాబూ! శుభవార్త చెప్పండి’’ శకుంతల సంతోషాన్ని పట్టలేకపోతోంది.‘‘థర్టీ టు పాయింట్ ఎయిట్! అంటూ ముఫ్పై రెండు పాయింట్ ఎనిమిది! అంటే నేషనల్ లెవల్లో నెంబర్ వన్’’ అని లక్ష్మిని రెండు చేతుల్తో పట్టుకుని పైకెత్తాడు ఎండీ. పైకెత్తి ఆమెని పట్టుకోవడమే కాదు గిరగిరా తిప్పాడు కూడా. ఆ దృశ్యాన్నిచూస్తూ శకుంతల, గిరీ చప్పట్లు కొట్టారు.‘‘కళ్లు తిరుగుతున్నాయి సార్! కిందకి దింపండి’’ నవ్వింది లక్ష్మి.‘‘నో! నువ్వెప్పుడూ కిందకి దిగకూడదు. ఆ స్థాయిలోనే వుండాలి’’ అన్నాడు ఎండీ.‘‘అవును బాబూ! మంచి మాటన్నారు’’ కల్పించుకుంది శకుంతల.‘‘హీరోయిన్ లకి్క్ష ఎపడూ ఇలాగే ఎండీగారి చేతుల్లోనే వుండాలి! మేం అది చూస్తూ ఆనందించాలి’’ గిరి మళ్లీ చప్పట్లు కొట్టాడు.అప్పుడు తన చేతుల్ని, తన చేతుల్లో వున్న లక్ష్మిని చూసి, తనేం చేశాడో తెలుసుకొని, ఎండీ లక్ష్మిని కిందకి దించాడు‘‘సారీ’’ చెప్పాడు. చేసిందానికి సిగ్గుపడ్డాడు కూడా. అతనలా సిగ్గుపడ్డాన్ని చూసి తనూ సిగ్గుపడ్డది లక్ష్మి. వాళ్లిద్దరూ అలా సిగ్గుపడడాన్ని శకుంతల, గిరీ చూసి లోలోపల నవ్వుకున్నారు.‘‘నీకింకో గుడ్ న్యూస్ లక్ష్మి’’ అన్నాడు ఎండీ‘‘ఏంటది సార్’’ అడిగింది లక్ష్మి.‘‘నెక్ట్స్ షెడ్యూల్ నుంచి నీ రెమ్యునరేషన్ పెంచుతున్నాం! ఛైర్మన్ గారు పెంచమ న్నారు.’’‘‘అంటే ఎంత బాబు’’ ఎండీని అడిగింది శకుంతల.‘‘ఇప్పుడు పర్‌డే మూడు వేలు ఇస్తున్నాం కదా! ఇక మీదట రోజుకి అయిదువేల చొప్పున పే చేస్తాం’’ చెప్పాడు ఎండీ.‘‘చాలు బాబూ! చాలు!! లక్ష్మికింక తిరుగులేదు’’ చేతులు ఎత్తి ఎండీకి నమస్కరించింది శకుంతల.టివిలో ‘బ్రేక్’ వచ్చింది. జరుగుతోన్న కామెడీ సీనేదో అయిపోయింది.‘‘బ్రేక్ తర్వాత నీ సీనే! పగిలిపోయే డ్రామా’’ లక్ష్మికి చెప్పాడు గిరి.‘‘కాప్స్యూలింగప్పుడు చూశాను! అద్భుతంగా చేసింది లక్ష్మి’’ మెచ్చుకున్నాడు ఎండీ.‘‘మీకో సంగతి తెలుసా సార్! ఆ సీనప్పుడు గ్లిసరిన్ కూడా వాడలేదు లక్ష్మి. అంతలా మూవయి ఏడ్చింది.’’ ఎండీతో చెప్పాడు గిరి.‘‘మన లక్ష్మి నటన కోసమే పుట్టింది! సహజనటి! లేకపోతే కన్నీళ్లెందుకొస్తాయి’’ మెచ్చుకున్నాడు ఎండీ.‘‘చిన్న సీన్ సార్! హీరోయిన్ అన్నయ్య చెల్లెలింటికి వస్తాడు. అత్తగారు రానివ్వదు. చెల్లెల్ని చూడాలంటాడన్నయ్య. వద్దంటుంది అత్తయ్య. మేడ మీద చెల్లెలు. కిందనేమో అన్నయ్య - అత్తయ్య. చెల్లెలు చూస్తుండగానే అత్తయ్య, అన్నయ్యని మెడపట్టి గెంటేస్తుంది. అది చూసి చెల్లెలు ఏడుపు! లక్ష్మికేం గుర్తుకు వచ్చిందో ఏమో! గోలగోలగా ఏడ్చింది! అదేడుపు కాదు! గుండెలు పట్టేశాయి అందరికీ’’ లక్ష్మి చేసిన సీను గురించి గొప్పగా చెప్పాడు గిరి.‘‘అవునవును! చూశాను కదా! బ్రహ్మాండంగా వుంది’’ అన్నాడు ఎండీ.ఇంతలో టివిలో గిరి చెప్పిన సీను స్టార్టయింది.----------------------ఏడుస్తున్నాడు వాచ్‌మన్. చిన్నకోడలు సీరియల్ చూస్తూ ‘భోరు భోరున’ ఏడుస్తున్నాడతను. అతను ఏడవడం అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణారావుకి నచ్చలేదు.‘‘ఏంటయ్యా! ఎందుకేడుస్తున్నావ్’’ అడిగాడు.‘‘కష్టాలు సార్! ఆ అన్నయ్య కష్టాలు, ఆ చెల్లెలు బాధా చూస్తోంటే ఏడుపొస్తోంది.’’‘‘ఏ అన్నయ్య, ఏ చెల్లెలు’’ అడిగాడు కృష్ణారావు.‘‘సీరియల్లో సార్! చూడండి’’ చూపించాడు వాచ్‌మన్. టివి చూస్తూనే, టివిలో ఏడుస్తోన్న లక్ష్మిని చూస్తూనే ‘‘లక్ష్మి’’ అంటూ గట్టిగా అరిచి, స్ర్కీన్ మీద క్లోజప్‌లో వచ్చిన లక్ష్మి ముఖాన్ని అభిమానంగా, ఆత్రంగా చేత్తో నిమిరాడు కృష్ణారావు. కృష్ణారావు ప్రవర్తన వాచ్‌మన్‌కి అర్థం కాలేదు.‘‘ ఏంటి సార్! ఏమయింది సార్’’ కృష్ణారావుని వాచ్‌మన్ అడిగాడు.‘‘ఈ అమ్మాయి... ఈ అమ్మాయి ఎవరో తెలుసా?’’ లక్ష్మిని చూపిస్తూ అడిగాడు కృష్ణారావు.‘‘చిన్నకోడలు సార్’’‘‘కాదు! లక్ష్మి! మా లక్ష్మి’’ చెప్పాడు కృష్ణారావు.‘‘తెలుస్సార్! ఆ అమ్మాయి పేరు లక్ష్మే! కొత్తగా వచ్చింది’’‘‘అది కాదు! ఈ అమ్మాయి ఎవరో తెలుసా? నా చెల్లెలు! స్వయానా నా చెల్లెలు’’వాచ్‌మన్ ఆశ్చర్యపోయాడు. కృష్ణారావుకి ఓ చెల్లెలు వుందని, ఆ చెల్లెల్ని వెతుకుతూనే కృష్ణారావు హైదరాబాద్ వచ్చాడని వాచ్‌మన్‌కి తెలుసు.అయితే ఆ చెల్లెలే ఈ లక్ష్మి అన్నది అతనికి తెలియదు.ఇప్పుడు తెలియడంతో వాచ్‌మన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.‘‘అయితే ఈ అమ్మాయి ఇక్కడే వుంటోంది సార్’’‘‘ఎక్కడ?’’ ఆత్రంగా అడిగాడు కృష్ణారావు.‘‘ఇక్కడే సార్! చౌరస్తా వుందా?’’‘‘వుంది’’‘‘చౌరస్తా దాటగానే ఫస్ట్ లెఫ్ట్‌లో ఫస్టిల్లే ఆ అమ్మాయిది’’‘‘నిజం’’‘‘నిజం సార్! డ్యూటీకొస్తూ ఎప్పుడూ చూస్తుంటాను’’ వాచ్‌మన్ మాట పూర్తయిందో లేదో కృష్ణారావు అప్పుడే మెయిన్ గేట్ దగ్గరకి వచ్చేశాడు. అతని ఆనందాన్ని, ఆరాటాన్ని చూసి వాచ్‌మన్ గేటు తాళం తీశాడో లేదో కృష్ణారావు టక్...టకా...టక్..టకా పరుగులాంటి నడకతో క్రచస్ సాయంతో ముందుకి సాగిపోయాడు.చౌరస్తా.... చౌరస్తా ఎంతదూరం? గట్టిగా నడిస్తే అయిందంటే అయిదు నిమిషాల్లో అక్కడుంటాను. దాటితే ఫస్ట్ లెఫ్ట్‌లో ఫస్టిల్లు! అక్కడ...అక్కడ లక్ష్మి వుంది. నా చెల్లెలు... నా చెల్లెలు లక్ష్మి అక్కడుంది.చౌరస్తా దాటాడు కృష్ణారావు. ఫస్ట్‌లెఫ్ట్ వచ్చింది. ఇదిగో ఫస్టిల్లు!!‘‘లకీ్క్ష’’ గట్టిగా అరిచాడు కృష్ణారావు. Challenge-18 Episode:91-100పెళ్ళి భారీఎత్తున జరుగుతోంది. మినిస్టర్ గారి కూతురి పెళ్ళి. పెద్దపెద్ద వాళ్ళంతా వచ్చిపోతున్నారు. పది నిముషాల క్రితమే సి.యం. కూడా వచ్చి వెళ్ళారు. హడావుడిగా వుందంతా. ఒకవైపు డిన్నర్ నడుస్తోంది. మరోవైపు కాక్‌టైల్ తీసుకుంటున్నారు. ఇంకోవైపు పెసరట్టు, ఉప్మా, పూరీ, ఇడ్లీ... రకరకాల టిఫిన్స్ తింటున్నారు. ప్రసాద్‌కి పెసరట్టు, ఉప్మా తినాలనిపించింది. అటుగా కదలబోయాడు.‘‘ఎక్కడికి’’ అడిగింది పూజ.‘‘అక్కడ పెసరట్టు, ఉప్మా తిందామని...’’‘‘ఈ టైంలో పెసరట్టు, ఉప్మానా? బలేవాడివి బావా’’ నవ్వింది పూజ.‘‘తప్పేం వుంది.’’‘‘తప్పేంలేదు బావా! కాకపోతే మనలాంటి వాళ్ళం పెళ్ళిళ్ళకొచ్చి, పెసరట్టు, ఉప్మా తినకూడదు. అది మిడిల్ క్లాస్ వ్యవహారం. తింటే మనల్ని మిడిల్‌క్లాస్ కింద జమకట్టేస్తారు. మనలాంటి వాళ్ళం తింటే గింటే సమోసా, కట్‌లెట్, పానీపూరి లాంటివి తినాలి. లేదంటే...’’ అని కాక్‌టైల్ దగ్గర ఖుషీగా కబుర్లు చెప్తూ గ్లాసులోని మందుని సిప్ చేస్తున్న తండ్రిని చూసి -‘‘లేదంటే అదిగో అక్కడ కాక్‌టైల్ దగ్గర నిల్చుని సరదాగా సిప్ చెయ్యాలి’’ అని మళ్ళీ నవ్వింది పూజ.‘‘నాకు అలాంటివి ఇష్టం వుండవు.’’‘‘ఇష్టం వున్నా లేకపోయినా మన స్టేటస్‌కి తగ్గట్టు మనం అలాంటివి అలవాటు చేసుకోవాలి. నేను నీకు ఇష్టమా? లేదు! కాని నాతో నువ్వు అలవాటుపడాలి. పడక తప్పదు. లేకపోతే మనిద్దరికీ పెళ్ళి ఎలా అవుతుంది చెప్పు’’ ఫెళ్ళున నవ్వింది పూజ. ఆ మాటలు, ఆ నవ్వూ ప్రసాద్‌కి నచ్చలేదు. అదోలా పూజని చూశాడతను.‘‘ఏంటలా చూస్తున్నావు? కోపం వచ్చిందా’’ అడిగింది పూజ.‘‘లేదు’’ అంటూ అక్కణ్ణించి చరచరా వెళ్ళిపోయాడు ప్రసాద్. ‘బావా’ అని పిలవబోయి ఆగిపోయింది పూజ. ఎందుకు ఆగిపోయిందంటే తల్లితోపాటుగా చిన్ననాటి స్నేహితురాలు ‘హాయ్ పూజ’ అంటూ అక్కడికి రావడమే అందుకు కారణం.‘‘ఒక్కదానివే వున్నావేంటే! ప్రసాదేడీ’’ అడిగింది తల్లి.‘‘అడుగో అటు వెళ్తున్నాడు’’ అని వెళ్తున్న ప్రసాద్‌ని చూపించి -‘‘ఏంటే! సంగతులేంటి’’ చిన్ననాటి స్నేహితురాలిని పలకరించింది పూజ.‘‘సంగతులన్నీ డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం! రా!’’ అని పూజని తోడుకుని స్నేహితురాలు ముందుకి నడిచింది.‘‘పద పద’’ అంటూ తల్లీ వాళ్ళతోపాటుగా నడిచింది.టిఫిన్ సెక్షన్ దగ్గరగా నిల్చున్నాడు ప్రసాద్. అతనికంతా ఏదోలా వుంది. పూజ మాటల్ని, ప్రవర్తననీ అతను భరించలేకపోతున్నాడు. ఆ భరించలేనితనాన్ని క్షణక్షణం పూజకి చెప్పాలని అతని ఆరాటం. కాని చెప్పలేకపోతున్నాడు. చెప్పలేకపోవడానికి సంస్కారం అడ్డొస్తోంది. పైగా చిన్నపిల్ల! ఏం మాట్లాడితే ఏ అఘాయిత్యానికి పూనుకుంటుందోనని భయం. అందుకని వూరుకున్నాడతను.‘‘ఏటి కావాలి సార్’’ సర్వరడిగాడు ప్రసాద్‌ని.తల అటు తిప్పుకుని ఆలోచనలలో వున్న ప్రసాద్ ఏం మాట్లాడకపోవడంతో సర్వర్ కుంటుకుంటూ ఇటుగా నడిచాడు. ఆలోచనలలోంచి తేరుకుని, అడిగిన దానికి ఇటు తిరిగి ప్రసాద్ సర్వర్‌ని చూసి వుంటే ఇంకేమైనా వుందా? అక్కడో పెద్ద గొడవ జరిగేది. గొడవ ఎందుకు జరిగేదంటే ‘‘ఏటి కావాలి సార్’’ అంటూ ప్రసాద్‌ని అడిగిన సర్వర్ ఎవరో కాదు. వాడు... వాడు త్రిబుల్!?!--------------------------‘చిన్నకోడలు’ సీరియల్ అయిపోయింది. రాత్రి తొమ్మిది గంటలు దాటింది.‘‘వస్తాను’’ అంటూ లేచాడు ఎండీ.‘‘సరదాగా డిన్నర్ చేసి వెళ్ళండి సార్’’ చెప్పింది శకుంతల.‘‘నోనో! ఇంట్లో వొప్పుకోరు’’ నవ్వాడు ఎండీ.‘‘ఇవాళ లక్ష్మి సాంబారు చేసింది.... తింటే వదిలిపెట్టరు.’’‘‘దేన్ని? లక్ష్మినా? సాంబార్నా’’ పగలబడి నవ్వాడు ఎం.డీ.‘‘భలే జోక్ సార్’’ అంటూ ఎండీ నవ్వులో శృతి కలిపాడు గిరి. శకుంతల సంగతి చెప్పనవసరం లేదు. ఎండీ ఏం మాట్లాడినా నవ్వొస్తుందామెకు. ఆ నవ్వులు ఇబ్బందిగా వున్నాయి లక్ష్మికి. వూరకనే నవ్వడం, అబద్ధాలు చెప్పడం లక్ష్మికెందుకో ఇష్టం వుండట్లేదు. తను సాంబారు ఎక్కడ చేసింది? చెయ్యనేలేదు. చేసిందని ఎండీకి చెప్పింది శకుంతల. అంతా అబద్ధం! ఈ అబద్ధం దేనికో?ఆలోచిస్తున్న లక్ష్మితో -‘‘గుడ్‌నైట్ లకి్క్ష! వెళ్ళొస్తాను’’ అని చెప్పి ఎండీ మెట్లు దిగుతుంటే, అతన్ని లక్ష్మీ, శకుంతల, గిరీ అనుసరిస్తోంటే సరిగ్గా అప్పుడు -‘‘లక్ష్మీ’’ అంటూ కృష్ణారావు కేక వినిపించింది.‘‘ఎవరో నిన్ను పిలుస్తున్నారు’’ లక్ష్మితో అన్నాడు ఎండీ.‘‘ఫాన్స్ అయ్యుంటారు’’ నవ్వాడు గిరి.‘‘అయ్యబాబోయ్! అభిమానులే’’ ఆశ్చర్యపోయింది శకుంతల.‘‘ఎందుకంతాశ్చర్యం. లక్ష్మికి అభిమానులెందుకుండకూడదు. నేను కానా’’ అన్నాడు ఎండీ.‘‘మీరూరుకోండి బాబూ! మీరు లక్ష్మికి అభిమానులేంటి? లక్ష్మే మీ అభిమాని’’ అని నవ్వింది శకుంతల.‘‘అవునా’’ లక్ష్మిని అడిగాడు ఎండీ.ఏం చెప్పాలి? ‘అవును’ అన్నట్లుగా సన్నగా నవ్వింది లక్ష్మి.‘‘లక్ష్మీ’’ మళ్ళీ కృష్ణారావు కేక వినిపించింది.‘‘అభిమాని గొంతు చించుకుంటున్నాడు. దర్శనం ఇవ్వకూడదూ’’ అని -‘‘పద’’ అంటూ లక్ష్మి చేయిపట్టుకుని దిగుతున్నవాడల్లా ఆగి, మేడ మెట్లు లక్ష్మితోపాటుగా ఎక్కి, బాల్కనీలోకి ఆమెతోపాటుగా చేరుకున్నాడు ఎండీ.బాల్కనీ అంతా చీకటిగా వుంది. ఆ చీకట్లోంచి చూస్తే, బిల్డింగ్ కింద అరకొరా వెలుగులో కృష్ణారావు వాళ్ళకి స్పష్టంగా కనిపించడం లేదు. ‘లక్ష్మీ’ అంటూ అతని అరుపులు వినిపిస్తున్నాయంతే!‘‘ఇక్కడ లైట్ లేదా’’ ప్రక్కగా చేరిన గిరిని అడిగాడు ఎండీ.‘‘ఎందుకు లేదు! వుంది బాబూ’’ అని కల్పించుకుని, బాల్కనీలోని లైట్ వేసింది శకుంతల. బాల్కనీలో లైట్ వెలగడంతో కింద వున్న కృష్ణారావు తలెత్తి పైకి చూశాడు. లక్ష్మి!! లక్ష్మి కనిపించింది. ఆనందం పట్టలేకపోయాడతను.‘‘అమ్మా! లక్ష్మీ’’ అరిచాడు కృష్ణారావు.ఆ పిలుపు... అన్నయ్య... అన్నయ్య పిలుపులా అనిపించి ‘ఝళ్’మంది లక్ష్మి.‘‘నేనమ్మా! నేను! మీ అన్నయ్యని’’ మళ్ళీ అరిచాడు కృష్ణారావు.అన్నయ్యా!? లక్ష్మి గుండె ‘గుభేళ్’మంది.‘‘జనానికి సీరియల్ బాగా పట్టేసింది. అన్నయ్యట! చూడెలా వరసలు కలుపుతున్నాడో’’ లక్ష్మితో అన్నాడు ఎండీ.‘‘అమ్మా’’ అరిచాడు కృష్ణారావు. క్రచెస్ సాయంతో ఇటు కొంచెం వెలుగులోకి వచ్చాడు.అన్నయ్యే! అనుమానం లేదు! పాపం... చంకల్లో ఆ కర్రలేంటి? ఏమయింది అన్నయ్యకి?!‘‘అమ్మా’’‘‘అన్నయ్యా’’ పరిగెత్తబోయింది లక్ష్మి. అడ్డుకున్నాడు గిరి.‘‘మరీ అంతగా మూవ్ అయిపోకు! అభిమానులంతే! వాళ్ళు ఫీలవుతూ మనల్నీ ఫీల్జేస్తారు’’ చెప్పాడు గిరి.‘‘ఆ కుంటోడు నీకు అన్నయ్య ఏంటి అసహ్యంగా! ఆగాగు’’ అన్నాడు ఎండీ. ఆగిపోయింది లక్ష్మి. హీరోయిన్లకి కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు అన్నయ్యలుగా వుండకూడదు కాబోలు అనుకుంది.పరిగెత్తుకుని కిందికి రాబోతున్న లక్ష్మిని ఆపుచెయ్యడాన్ని గమనించి -‘‘ఏంటమ్మా ఆగిపోయావు! నేనమ్మా! మీ అన్నయ్యని! రామ్మా రా! కిందకిరా’’ కేకేశాడు కృష్ణారావు.‘‘వస్తుందొస్తుంది! నువ్వెళ్ళు’’ చీదరించుకుంది శకుంతల.లక్ష్మి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అటు అన్నయ్య అనుబంధం. ఇటు ఎండీ. కోరుకున్న రంగం. ఎటు? ఎటువెళ్ళాలి తను? ఎవరిని వొదులుకోవాలి?‘‘నిన్ను అడ్డుకుంటున్నాను! రానివ్వట్లేదు కదూ? నేనొస్తానమ్మా! నేనే వస్తాను నీ దగ్గరకి’’ అంటూ కృష్ణారావు క్రచెస్‌ను టకటకలాడించుకుంటూ బిల్డింగ్ మెయిన్ గేట్ దగ్గరికి రాబోతుండగా -‘‘ఏయ్! చూడాణ్ణి! ఆ కుంటోణ్ణి లోపలికి రానివ్వకు’’ గట్టిగా అరిచాడు ఎండీ. ఆ మాటలు తనని ఉద్దేశించి చెప్పినవని ఎండీ కారు డ్రైవర్ గ్రహించి తనతో మాట్లాడుతున్న చంకరం, మరొకరితోపాటుగా వెళ్ళి కృష్ణారావుని అడ్డుకున్నాడు.‘‘హె! ఎక్కడికిరా’’‘‘మా చెల్లెలు! మా చెల్లెలు లక్ష్మి దగ్గరికి’’ చెప్పాడు కృష్ణారావు.‘‘అంత పెద్ద హీరోయిన్ నీ చెల్లెలా? పిచ్చెక్కిందా?’’‘‘పిచ్చికాదు బాబూ! లక్ష్మి... లక్ష్మి నిజంగా నా చెల్లెలు! మీ మీదొట్టు’’‘‘వొట్టొకటి! ఎల్లెహె’’ కృష్ణారావుని చంకరం వెనక్కి నెట్టాడు.‘‘ఒరేయ్’’ కోపంగా అరిచాడు కృష్ణారావు.‘‘ఏంట్రా అరుస్తున్నావు’’ దగ్గరగా వున్న కర్రందుకున్నాడు ఎండీ కారు డ్రైవర్.‘‘పోరా! పో’’ అంటూ చేతిలోని కర్రతో విసురుగా కృష్ణారావుని వెనక్కి నెట్టాడతను. క్రచెస్ బ్యాలన్స్ తప్పాయి. ‘‘లక్ష్మీ’’ అంటూ కిందపడిపోయాడు కృష్ణారావు.ఆ దృశ్యాన్ని చూడలేనన్నట్లుగా ఏడుస్తూ చేతుల్లో ముఖం దాచుకొని బాల్కనీలోంచి పరిగెత్తుకుని చిలక పంజరం దగ్గరగా వచ్చింది లక్ష్మి.‘‘లక్ష్మీ లక్ష్మీ’’ చిలక అరిచింది.-----------------------------‘‘ఈ పెసరట్టు పొయ్యడం నా వల్ల కాదురా’’ చిరాకుపడ్డాడు సుందరం. చేతిలోని గరిటె వొదిలేసి, చేతినోసారి గాలిలో విదిలించి -‘‘సిగరెట్టుందా’’ అని త్రిబుల్‌ని అడిగాడు.‘‘ఉంది కాని, నానివ్వను! నువ్విక్కడ సిగరెట్ తాగినావనుకో! ఇకనంతే సంగతులు! మినిస్టర్ గారి మడుసులు మనల్ని బతకనివ్వరు’’ అన్నాడు త్రిబుల్.‘‘వంటోళ్ళు సిగరెట్లు తాగితే ఎలాగేటెహె అని మక్కెలిరగదంతారు’’ అన్నాడు మళ్ళీ. ఆ మాటలకి బాధపడ్డాడు సుందరం.‘‘ఈ బతుకే బాగులేదురా! కన్నతల్లి లాంటి వున్నవూరుని వొదులుకుని తప్పు చేశాం’’ అన్నాడు సుందరం.‘‘తప్పు చేశాం కాబట్టే వున్నవూరునొదులుకున్నాం! నేకపోతే ఎందుకొదులుకుంటాం! అనుబవించాలంతే’’ తల కొట్టుకున్నాడు త్రిబుల్.లక్ష్మిని శకుంతలకి అప్పజెప్పినట్టే అప్పజెప్పి, శకుంతల నుంచి లక్ష్మిని దూరం చెయ్యాలన్న ఆలోచన వికటించడంతో వున్న వూరిలో వుండడం క్షేమం కాదనుకుని త్రిబుల్‌తోపాటుగా సుందరం విజయవాడ పారిపోయి వచ్చాడు. విజయవాడలో ఎక్కడా బతుకుతెరువు లేకుండా పోయింది. ఇద్దరూ నానా బాధలూ పడ్డారు. ఆఖరికి కేటరింగ్ సర్వీసులో చేరారు. రోజులు నిక్షేపంగా గడిచిపోతున్నాయి. విజయవాడలో ప్రసాద్ కొడతాడన్న భయం లేదు. కృష్ణారావు చంపేస్తాడన్న భయంలేదు. శకుంతలకి దొరుకుతామన్న భయం అంతకన్నా లేదు. ఆనందంగా వున్నారిద్దరూ. అలా వుంటుండగా హైదరాబాద్‌లో మినిస్టర్ గారింట్లో పెళ్ళి! కేటరింగ్ మనదే! అన్న కబురు తెలిసింది. హైదరాబాద్ అనగానే సుందరానికి, త్రిబుల్‌కీ గుండెలు జారిపోయాయి. వెళ్ళకూడదనుకుని, ‘మేము రాలేం’ అన్నారిద్దరూ. కుదరదన్నారు పెద్దలు. దాంతో తప్పనిసరై హైదరాబాద్ రావాల్సి వచ్చింది. వచ్చిందగ్గరనుంచి పెసరట్లు వెయ్యలేక సుందరం, అడిగిన వాళ్ళకి సర్వ్ చెయ్యలేక త్రిబుల్ నానా అవస్థలూ పడుతున్నారు.‘‘పొరపాట్న మనం శకుంతలకి దొరికే అవకాశం లేదుకదా’’ అనుమానం వ్యక్తం చేశాడు సుందరం.‘‘ఇలాటి పెళ్ళిళ్ళకి శకుంతలెందుకొస్తాది? అసలు రానిచ్చేవోళ్ళెవరు’’ అడిగాడు త్రిబుల్.‘‘ఇలాంటి పెళ్ళిళ్ళకే అలాటోళ్ళొస్తారు! ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా వుండు’’ హెచ్చరించాడు సుందరం.‘‘నీకో సంగతి నేను సెప్పడం మరిసిపోనాను’’ అన్నాడు త్రిబుల్ సుందరంతో.‘‘ఏటో’’‘‘నిన్ను టేసన్లో సితకబాదేసిన పెసాదుబాబు, లచ్మి ఆళ్ళ అన్నయ్య కిట్నారావూ - ఆళ్ళిద్దరూ ఈణ్నే, అయిదారాబాద్‌లోనే వున్నారంట! మొన్న కబురొచ్చింది’’ చెప్పాడు త్రిబుల్. సుందరానికి గుండెలు జారిపోయాయి.‘‘నిజం’’ భయపడ్డాడు సుందరం.‘‘నీమీదొట్టు’’ చెప్పాడు త్రిబుల్.‘‘సరే అయితే ఇద్దరం కొంచెం జాగ్రత్తగా వుందాం’’ అన్నాడు సుందరం. అన్న తర్వాత టెన్షన్ తట్టుకోలేక సిగరెట్ తాగాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చాడు.‘‘ఇక్కడెక్కడా వొద్దుగాని! పద! అక్కడా టాయ్‌లెట్లో సిగరెట్లు తాగుదాం’’ అన్నాడు సుందరం.‘‘పద’’ అన్నాడు త్రిబుల్. ఇద్దరూ టాయ్‌లెట్‌లోకి వచ్చారు. పేరుకి టాయ్‌లెట్ గాని చాలా నీటుగా వుందక్కడ. ఇద్దరూ సిగరెట్లు ముట్టించారు. రెండు దమ్ముల్లాగి ఆనందంగా ఇద్దరూ కళ్ళు మూసుకున్నారో లేదో - ఎవరో టాయ్‌లెట్ తలుపు మూసిన శబ్దం అయింది. దాంతో కళ్ళు తెరిచి చూశారిద్దరూ. ఎదురుగా ప్రసాద్!? ‘అమ్మో’ అనుకున్నారిద్దరూ. అంతే! వాళ్ళ మీద ప్రసాద్ పులిలా పడ్డాడు. ఎలా గమనించాడో, ఎప్పుడు గమనించాడో వాళ్లిద్దర్ని ప్రసాద్ గమనించాడు. గమనించి దాడి చేశాడు.------------------------రాత్రి పన్నెండయ్యింది. అయినా కృష్ణారావుకి నిద్ర రావట్లేదు. ఔట్‌హౌస్ మెట్ల మీద ఆలోచిస్తూ కూర్చున్నాడతను. ఆలోచిస్తూ లోలోపల దుఃఖిస్తున్నాడు.వాడెవడో, ఆ కారు డ్రైవర్ తోసిన తోపుకి కిందపడ్డాడు తను. తల బలంగా నేలని తాకింది. ‘లక్ష్మీ’ అంటూ అరిచాడు. ఆమె వస్తుందనుకున్నాడు. రాలేదు. రావాలనుకుంటే వచ్చేదే! రావాలని లక్ష్మికి అనిపించి వుండదు. పాపం రానివ్వలేదేమో? నమ్మను! మనసుంటే మార్గం ఉంటుంది. లక్ష్మికి మనసే లేదు. చూసిచూసి వెనక్కి తిరిగొచ్చేశాడు తను.బంగళా అంతా ఓ రౌండ్ తిరిగి, ఎక్కడా ఎలాంటి ప్రమాదమూ లేదని తెలుసుకుని మెయిన్‌గేట్ దగ్గరికి వస్తూ - ఔట్‌హౌస్ మెట్ల మీద దీనంగా కూర్చున్న కృష్ణారావుని చూశాడు వాచ్‌మన్.పెళ్ళికెళ్ళిన పెద్దలు ఇంకా రాలేదు. కాబట్టి గేటు దగ్గరే వుండాల్సిన పనేం లేదు. అసలు సంగతి! చెల్లెల్ని కృష్ణారావు గారు కలుసుకున్నారో లేదో!! ఆ వివరాలే చెప్పలేదాయన. ‘అడగాలి అడగాలి’ అనుకుంటూనే పనిలో పడిపోయాను. అడగలేదు. ఇప్పుడు అడుగుదాం.- అనుకుని, కృష్ణారావు దగ్గరగా వచ్చాడు వాచ్‌మన్.‘‘ఏంటి సార్? ఏమైంది? లకి్క్షగారిని మీరు కలిశారా? లేదా’’ అడిగాడు వాచ్‌మన్.సమాధానం లేదు కృష్ణారావు దగ్గర్నుంచి.‘‘ఏమయింది సార్? మాట్లాడరేంటి’’ రెట్టించాడు.అయినా కృష్ణారావు మాట్లాడలేదు.‘‘చెప్పండి సార్! మీ చెల్లెల్ని మీరు కలిశారా? లేదా’’‘‘అది... అది చెల్లెలు కాదు’’ ఎర్రగా ఇంతింత కళ్ళతో కోపంగా చూశాడు కృష్ణారావు. భయపడ్డాడు వాచ్‌మన్.‘‘అది నా చెల్లెలు కాదు! కానే కాదు’’ గట్టిగా అరిచాడు కృష్ణారావు. ఆశ్చర్యపోయాడు వాచ్‌మన్.‘‘నేనూ అదీ ఓ తల్లి కడుపున పుట్టలేదు! మాకెలాంటి రక్త సంబంధమూ లేదు! లేదు’’ అని క్రచెస్‌ని పట్టుకుని టక్‌టకా టక్‌టకా వెళ్ళిపోయాడు కృష్ణారావు. ఏమీ అర్థంకాక చూస్తూ నిల్చున్నాడు వాచ్‌మన్.చేతివేళ్లు బాగా బిగించి, మోచేతిని ఇనుపకడ్డీలా చేసి, కసిదీరా ఒకే ఒక దెబ్బ.ఫాట్!!ప్రసాద్ కొట్టినదెబ్బకి సుందరం ఎగిరి టాయ్‌లెట్ గోడకి గుద్దుకుని ‘దబ్’ని క్రింద పడ్డాడు. క్రింద పడ్డ సుందరాన్ని మరి లేవనీయలేదు ప్రసాద్. చితకబాదేశాడు. ‘అబ్బ...బ్బా! బాబోయ్! అమ్మా’ అంటూ సుందరం అరవడమే తప్ప ప్రసాద్‌కి ఎదురుతిరగలేకపోయాడు. సుందరాన్ని ప్రసాద్ ఉతికి ఆరేస్తుంటే చేష్టలుడిగి త్రిబుల్ చూస్తున్నాడంతే! ‘వొగ్గీయండి బాబూ!సుందరాన్ని వొగ్గీయండి’ అని అనాలని వుందతనికి. అంటే అట్నుంచి ఇటు ప్రసాద్ తిరిగి, తనను కూడా పచ్చడి చేస్తాడేమోనని భయంగా వుంది. సుందరం పెదవి చిట్లిపోయి రక్తం కారుతోంది. ముక్కులోంచి కూడా రక్తం స్రవిస్తోంది. కళ్లు తేలిపోతున్నాయి. చచ్చిపోతాడు. అనుమానం లేదు. ఆ సమయంలో శక్తినంతా కూడదీసుకొని, ఒక్కదుటున లేచి, మీద పడుతోన్న ప్రసాద్‌ని ముందుకి తోసేసి, పరుగున మూసి వున్న తలుపు దగ్గరకొచ్చి, తలుపు తెరిచి, దొరికిందే అవకాశం అన్నట్లుగా పరుగుదీశాడు సుందరం. సుందరం అలా పరుగెత్తడాన్ని, సుందరం తోసిన తోపుకి పడబోయి నిలదొక్కుకుని చూశాడు ప్రసాద్. క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదతను.సుందరం వెంటపడ్డాడు. సింహంలా తన మీదకి దూకుతోన్న ప్రసాద్‌ని గమనిస్తూ-‘‘చంపేస్తున్నాడు! రక్షించండి బాబోయ్! రక్షించండి’’ అరవసాగాడు సుందరం. సుందరం అలా అరుస్తూనే ఇటు టిఫిన్ సెక్షన్ నుంచి, అటు కాక్‌టైల్ మీదుగా డిన్నర్ స్పాట్‌కి చేరుకున్నాడు. అతన్ని వెంబడిస్తూ ప్రసాద్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ప్రసాద్‌కి తను దొరక్కూడదు. ప్రసాద్ నుంచి తప్పించుకోవాలి. ఎలా? ఆ ఆలోచనల్తో ప్రసాద్‌ని దగ్గరకి రానివ్వకుండా టేబుల్ మీది ఉప్పు, పప్పు, పులుసూ, పాత్రలను ఒక్కొక్కటే ప్రసాద్ మీదకి విసురుతూ రక్షించుకోసాగాడు సుందరం. సుందరం విసిరనదేదీ తన మీద పడకుండా తప్పుకుంటూ అదను కోసం ప్రయత్నిస్తున్నాడు ప్రసాద్.- ఇదంతా పెళ్లికొచ్చిన వాళ్లందరూ గమనిస్తున్నారు. ఎవరు వాళ్లిద్దరు? ఎందుకలా కొట్టుకుంటున్నారు? అందుకే పెద్ద వాళ్లింటి పెళ్లిళ్లకు రాకూడదు. వస్తే? ఇదుగో అంతా ఇలాగే వుంటుంది. ఛీఛీ!చీదరించుకుంటున్నారు ఆహూతులు. మినిస్టర్ గారింట్లో పెళ్లి క్కూడా ఇలాంటివి తప్పవా? సెక్యూరిటీ? సెక్యూరిటీ ఏమయింది? పోలీసులెక్కడ? ఎక్కిన మత్తు దిగిపోయి, మగాళ్లంతా ఆలోచిస్తోంటే.‘తాగుబోతు వెధవలు! ఫుల్‌గా తాగి కొట్టుకుంటున్నారు! మీద పడతారేమో? పదండి! వెళ్లి దూరంగా నిలబడదాం’ అనుకుంటున్నారు ఆడాళ్లు. ఎందుకైనా మంచిదని వేసుకొన్న నగలు మీద చేయుంచి జాగ్రత్త పడుతున్నారు. తేరిపార జూసిన రఘునాథానికి ఒకటి అర్థమయింది.అవతలి వాడెవడో తనకి తెలియదు. ఇవతలి వాడు మాత్రం తన మేనల్లుడు ప్రసాద్! అవతలివాణ్నెందుకు ప్రసాద్ కొడుతున్నాడు?‘‘మమ్మీ! బావే!మన ప్రసాద్ బావ!’’ ప్రసాద్‌ని తల్లికి చూపిస్తో అరిచింది పూజ. అక్కడెవరో కొట్టుకుంటున్నారంటే తల్లితో అక్కడికి వచ్చింది పూజ. జనం బాగా మూగి వుండడంతో కొట్టుకుంటున్న వారెవరో ముందు కనిపించలేదు. ప్రయత్నించగా కన్పించిందామెకి. అప్పుడు అలా అరిచింది పూజ.పరుగు పరుగున పోలీసులొస్తున్నారు. వాళ్లని చూసి, తర్వాతిటు ప్రసాద్‌ని చూసి అతన్ని హెచ్చరిస్తున్నట్లుగా, ‘‘ప్రసాద్’’ అని అరిచాడు రఘునాథం. ఇందాక అరిచిన పూజ అరుపుకాని, ఇప్పుడు అరిచిన రఘునాథం అరుపు కానీ ఏవీ వినిపించడం లేదు ప్రసాద్‌కి. వినిపించడం మాట అటుంచితే సుందరం తప్ప ప్రసాద్ కంటికి ఏమీ కనిపించడం కూడ లేదు.సుందరం పరుగెత్తడం, పరిగెడుతోన్న సుందరాన్ని ప్రసాద్ వెంబడించడం, ఇద్దరూ డిన్నర్ స్పాట్‌కి చేరుకోవడం, అక్కడ ప్రసాద్‌కి దొరక్కుండా సుందరం పడుతోన్న పాట్లు... ఇవన్నీ వాళ్లని అనుసరించి వచ్చి చూస్తోన్న త్రిబుల్, పోలీసులు రావడాన్ని కూడా చూసి ‘దొరికామంటే డొంకంతా కదులుతుంది’ అనుకొని సుందరాన్ని హెచ్చరించే ఉద్దేశ్యంతో-‘‘సుందరం బాబో! పోలీసులు’’ అంటూ గట్టిగా కేకేశాడు.‘అయిపోయింది! పోలీసులు కూడా వచ్చేశారు!దొరికిపోయాను’ అనుకున్నాడు సుందరం.దాంతో మరింత నిస్సత్తువ ఆవరించడంతో చేతులెత్తేశాడు. అదే అదునుగా సుందరాన్ని ప్రసాద్ అందుకోబోయేంతలో-‘‘ ఆగండి మిస్టర్ ఆగండి’’ అంటూ పోలీసులొచ్చి, సుందరం మీద దాడి చేయబోతున్న ప్రసాద్‌ని అడ్డుకున్నారు.‘‘లేదు... వీడి సంగతి మీకు తెలీదు సార్! వీడు అమ్మాయిల్ని అమ్ముతాడు! పాపం మా లక్ష్మిని అమ్మేశాడు’’ పోలీసుల ముందు సుందరాన్ని ఉద్దేశిస్తూ గొంతుచించుకున్నాడు ప్రసాద్.‘‘వీడికి తోడు...వాడు కూడా....’’ పోలీసులకి త్రిబుల్‌ని చూపించాడు.‘‘వీళ్లని వదలకూడదు సార్! నరికి పోగులు పెట్టాలి’’‘‘ఓకే’’ ‘మేం చూసుకుంటాం కదా’ అన్నట్లుగా చూశారు పోలీసులు.‘‘ఇంతకీ మీరెవరు?’’ అడిగారు.‘‘మా మేనల్లుడు సార్’’ కల్పించుకొని పోలీసులకు చెప్పాడు రఘునాథం.‘‘పేరు’’‘‘ప్రసాద్’’‘‘మరీ ఇంత ఆవేశం పనికిరాదు ప్రసాద్ గారూ’’నవ్వుతూనే ప్రసాద్‌ని హెచ్చరించారు పోలీసులు.‘‘పదండయ్యా! పదండి’’ అంటూ సుందరంతో పాటుగా త్రిబుల్‌ని లాక్కెళ్లారు.స్టేషన్లో ఈ పాటికి ఇద్దరికీ బాగా పూజ అయి వుంటుంది! అనుమానం లేదు!- జరిగిందంతా తలుచుకుంటూ అనుకున్నాడు ప్రసాద్. పెళ్లినుంచి ఇంటికొచ్చినా జరిగిందంతా ఇంకా కళ్లకి కట్టినట్లు వుందతనికి. ఆవేశం కూడా ఇంకా చల్లారలేదు. రాత్రి రెండయినా, చల్ల చల్లగా గాలి వీస్తున్నా వేడి వేడిగానే వుంది ప్రసాద్‌కి. బెడ్ మీద పడుకున్నాడన్న మాటే గాని నిద్ర రావట్లేదతనికి. ‘‘స్కౌండ్రల్’’ సుందరాన్ని కసిదీరా తిట్టుకున్నాడు.‘‘ ఇంకా నిద్ర పోలేదా బావా’’ అక్కడికి అపడే వచ్చిన పూజ ప్రసాద్‌ని అడిగింది.‘‘లేదు! ఏం’’ లేచి కూర్చున్నాడు ప్రసాద్.‘‘ ఏం బాగాలేదు బావా! పెళ్లిలో నీ ప్రవర్తన ఏం బాగాలేదు’’ ఏడుపు గొంతుతో అంది పూజ. సమాధానం ఏం చెప్పాలో తెలీక తలొంచుకున్నాడు ప్రసాద్.‘‘డాడీని చూసి నిన్ను పోలీసులు వదిలిపెట్టారుగాని! లేకపోతేనా...?’’అని ఏడవసాగింది.‘‘అయినా అలగాజనంలాగా ఏంటి బావా అదంతా! నేను మమ్మీ ఎంతగా బాధపడ్డామో తెల్సా?’’ అడిగింది పూజ. ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ప్రసాద్.‘‘ఎవరికో అమ్ముడుపోయిన ఆ లక్ష్మి మీద అంత పిచ్చేంటి చెప్పు? దాని కోసం నిన్ను నువ్వు దిగజార్చుకోవడం... ఛఛా! చాలా అసహ్యంగా వుంది బావా! నీ పద్ధతి అసహ్యంగా వుంది’’తల మీదికి చేతి వేళ్లు పోనిచ్చి, జుత్తునోసారి దువ్వుకొని ఏం మాట్లాడాలో, ఎటు చూడాలో తెలీని పరిస్థితిలో అటెటో చూడసాగాడు ప్రసాద్.‘‘అన్నాను కాదు కానీ ఒక వేశ్య కోసం నువ్విలా..’’‘‘షటప్’’ గట్టిగా అరిచాడు ప్రసాద్.అతని అరుపు ఔట్‌హౌస్‌లో నిల్చున్న కృష్ణారావుకే కాదు మెయిన్ గేట్ దగ్గరున్న వాచ్‌మన్ కూడా వినిపించింది.‘‘లక్ష్మి వేశ్య కాదు పూజా! వేశ్య కాదు! తను నా ప్రాణం’ గుండెల్ని చరుచుకున్నాడు ప్రసాద్.‘‘లక్ష్మి కోసం నన్ను నేను దిగజార్చుకోవడమే కాదు! నేను ఎంతకైనా దేనికైనా తెగిస్తాను’’‘‘నన్ను కూడా కాదనుకుంటావా?’’ సూటిగా అడిగింది పూజ.‘‘నిన్ను ఎప్పుడు కావాలనుకున్నానసలు’’ ప్రసాద్ కూడా అంత సూటిగానే సమాధానమిచ్చాడు. అంతే! ఆ మాటకి ఇక అక్కడ నిలబడలేనన్నట్లుగా చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తూ అక్కడ్నుంచి పరుగుతీసిందిపూజ. ఆమె అలా పరుగుతీయడాన్ని ఔట్‌హౌస్ గుమ్మంలో నిల్చుండి చూశాడు కృష్ణారావు. ఆందోళన చెందాడు.అనుకున్నట్లే అయింది. లక్ష్మిని చులకన చేసి మాట్లాడితే ప్రసాద్ వూరుకోడు అనుకున్నాడు కృష్ణారావు. అలాగే జరిగింది. పెళ్లి నుంచిరాగానే పూజ తన దగ్గరకి వచ్చింది . అక్కడ పెళ్లిలో సుందరాన్ని ప్రసాద్ కొట్టడం...అదంతా పూసగుచ్చినట్లు చెప్పింది.‘‘బావ ఇలా అల్లరిపాలు కావడం భరించలేకపోతున్నాను’’ అంది.‘‘డాడీకి ఇలాంటివి న చ్చవు. కొట్టుకోవడాలు, తిట్టుకోడాలంటే ఆయనకి అసలు పడదు. సంస్కారం లేని మనుషులంటూ తెగదెంపులు చేసుకుంటారు.’’ చెప్పింది.‘‘బావనె లాగైనా నేను కాపాడుకోవాలి!బావ నాకు కావాలి’’ అని ఏడ్చింది. పూజ అలా చెప్పుకొని ఏడుస్తోంటే తట్టుకోలేకపోయాడు తను. ప్రసాద్‌ని ఎలాగైనా లక్ష్మి నుంచి, లక్ష్మి ఆలోచనల నుంచి దూరం చెయ్యాలనుకున్నాడు. అనుకొని-లక్ష్మిని చులకన చేసి ప్రసాద్ దగ్గర మాట్లాడమని చెప్పింది తనే. పాపం పూజ అలాగే మాట్లాడి వుంటుంది. దాంతో ప్రసాద్‌కి కోపం వచ్చి కసిరి వుంటాడు. లక్ష్మిని చులకన చేస్తూ మాట్లాడితే ప్రసాద్ వూరుకోడని కృష్ణారావుకి, పూజకీ ముందే తెలుసు. అయినా ప్రయత్నించి చూద్దాం అనుకున్నారు.‘‘సొంత చెల్లెల్ని కాదనుకొని, నన్ను మీరింతగా ఎందుకు అభిమానిస్తున్నారంకుల్’’ కృష్ణారావుని అడిగింది పూజ.‘‘ఎందుకంటే ప్రసాద్ మీద నీకున్న ప్రేమ, లక్ష్మికి లేదు కాబట్టి’’ అన్నాడు.‘‘లక్ష్మిని మరిచిపోయి మా బావ నన్ను ప్రేమిస్తాడా’’ అడిగింది పూజ.‘‘ప్రేమిస్తాడు! దానికిదే ప్రారంభం’ అన్నాడు. పూజని ప్రసాద్ దగ్గరకి పంపాడు. జరిగిందేంటి? పూజని ప్రసాద్ కాదనుకున్నాడు. లక్ష్మిని కావాలనుకుంటున్నాడు. ఏం చెయ్యాలి! ఏం చెయ్యాలిప్పుడు?- ఆలోచనలో పడ్డాడు కృష్ణారావు.----------------------------------బెడ్ మీద బోర్లా పడుకుని ఏడ్చేడ్చి ఎప్పుడు నిద్రపోయిందో పోయింది. ఇప్పుడు మెలకు వచ్చింది లక్ష్మికి. దాహం వేస్తోందామెకి. మెలకువ వచ్చి లేచి కూర్చుంది. చుట్టూ చూసింది. గది తలుపులు దగ్గరగా వేసి వున్నాయి. టీపాయ్ మీద డిన్నర్ ప్లేటుంది. ఎప్పుడు తీసుకొచ్చిపెట్టాడో చంకరం డిన్నర్ తెచ్చిపెట్టాడు. గ్లాసులో నీళ్లు కూడా వున్నాయక్కడ. లేచి వచ్చి నీళ్లు తాగింది లక్ష్మి. దాహం తీరినట్లు అనిపించలేదు. మరో గ్లాసు తాగాలనిపిస్తోంది. చంకరాన్ని కేకేస్తే, ఇప్పుడు టైం ఎంతయ్యిందో ఏమో! గోడ గడియారం కేసి చూసింది లక్ష్మి. నాలుగయింది. చంకరం మంచి నిద్రలో వుండి వుంటాడు. కేకేసి లేపడం భావ్యం కాదనుకుంది. అంతలో ఆమెను ఆలోచనలు చుట్టుముట్టాయి.రాత్రి అన్నయ్య రావడం, ‘అమ్మా’ అంటూ కేకేయడం, తను ‘అన్నయ్యా’ అంటూ పరుగుతీయడం, గిరి అడ్డుకోవడం, ఎండీ అసహ్యంగా మాట్లాడడం... అన్నీ అంతా కళ్ల ముందు కదలాడుతోంది. తను ఏడుస్తూ బాల్కనీ నుంచి చిలక పంజరం దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. తర్వాత? తర్వాతేమయింది?‘‘ ఏంటలా ఏడుస్తున్నావ్? కొంపదీసి ఆ కుంటోడు నిజంగా నీ అన్నయ్య కాదుకదా?’’ గిరి శకుంతలతో పాటుగా వచ్చి అడిగాడు ఎండీ.అవునంటే!! ఎండీ అసహ్యించుకుంటాడా? నటనావకాశాలు లేకుండా చేస్తాడా? అప్పుడు! అప్పుడేమవుతుంది? కన్న కలలన్నీ కాగితపు పేలికలైౖ రాలిపోతాయా?కట్టుకున్న స్వప్న సౌధం కూలిపోతుందా? పోనీ! అమ్మో! గుండెలుజారిపోయాయి లక్ష్మికి. కాదంటే?! అనుబంధాన్ని తెంచుకున్నట్లే! సంబంధాన్ని తుదముట్టించుకున్నట్లే! భగవంతుడా! గుండెల్లోనే నిండుగా ఏడ్చింది లక్ష్మి.‘‘ఏంటి? నేనడిగిన దానికి సమాధానం లేదా?’’ రెట్టించాడు ఎండీ.‘‘ఆ కుంటోడు నీకు అన్నయ్య అవునా? కాదా?’’‘‘కాదు బాబూ! కాదు’’ కల్పించుకొని చెప్పింది శకుంతల.‘‘ఆళ్లమ్మానాన్నకి లక్ష్మి ఒక్కతే సంతానం! నాకు బాగా తెలుసు’’ మళ్లీ చెప్పింది.‘‘అవునా?’’ లక్ష్మిని అడిగాడు ఎండీ.‘‘అవున్సార్! శకుంతల చెప్పిందంటే తిరుగు లేదు’’ ముందుకి తోసుకువచ్చాడు గిరి.‘‘మరామాట తనెందుకు చెప్పలేకోపోతోంది’’ లక్ష్మీనుద్దేశిస్తూ గిరిని అడిగాడు ఎండీ.‘‘ఎందుకేడుస్తున్నట్లు?’’ అనుమానంగా అడిగాడు.‘‘ఆర్టిస్టులు ఒక్కొక్కసారి అంతేనండి! మూడ్! వాళ్లేమూడ్‌లో వుంటారో వాళ్లకే తెలీదు’’ నవ్వాడు గిరి.‘‘తనే మూడ్‌లో వుందో గాని, నా మూడయితే చెడగొట్టింది’’ అని చరచరా వెళ్లిపోయాడు ఎండీ. అతనలా వెళ్లిపోవడమేమిటి? లక్ష్మి ఇలా ఏడుస్తూ బెడ్ మీద బోర్లాపడింది.అన్నయ్య ఇక్కడే వున్నాడు! ప్రసాద్ కూడా ఇక్కడే వున్నాడు. ఇద్దరు... ఇద్దరూ నన్ను వెతుక్కుంటూ వచ్చినట్లున్నారు. వచ్చారు సరే! అన్నయ్యకేం అయింది పాపం? కాలుకేమయినా యాక్సిడెంటుఅయిందా? అది సరే! అప్పుడెప్పుడో సాయిబాబా గుళ్లో ప్రసాద్ చేయి పట్టుకొని నిల్చున్న ఆ అమ్మాయి ఎవరు? ప్రసాద్‌కి ఆ అమ్మాయి ఏమవుతుంది?- లక్ష్మికి విపరీతంగా దాహం వేయసాగింది. ఆలోచనలు ఆమె దాహాన్ని పెంచాయి. నీళ్లు తాగాల్సిందే! తప్పదు! నీళ్లెక్కడున్నాయి? కింద కిచెన్లో వున్నాయి. వెళ్లి తీరాల్సిందే!-అనుకొని దగ్గరగా వేసి వున్న తలుపుల్ని మెల్లగా తెరుచుకొని ముందుకొచ్చింది లక్ష్మి.లక్ష్మిని చూస్తూ పంజరంలోని చిలక ‘లక్ష్మి’ అని కేకేయబోయి ఎందుకాగిపోయిందో ఆగిపోయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. మెట్ల దిగుతోన్న లక్ష్మికేవో గుసగుసలు వినిపించాయి. ఎవరో ఆడామగా నిద్ర గొంతుల్తో కత్తితో స్పాంజ్‌ని కోస్తున్నట్లుగా మెల్లిమెల్లిగా మాట్లాడుకొంటున్నారు. ఇటువైపు గదిలోంచి మాటలు విన్పిస్తున్నాయి ఆ గొంతులు. ఆ గదిలో చంకరం ఒక్కడే వుంటాడు. మరా స్త్రీ ఎవరు? తెల్లారుజామున ఈ గుసగుసలేమిటి? అసలు వాళ్లేం మాట్లాడుకుంటున్నారు?తెలుసుకోవాలన్న ఉత్సాహంతోనూ, ఉత్కంఠతోను ఆ గది దగ్గరగా చేరుకుంది లక్ష్మి. మూసినట్లుగా దగ్గరగా వేసి వున్న తలుపులను సున్నితంగా ముందుకి కాస్తంతగా నెట్టింది. చంకరం పడుకొని కనిపించాడు. గిరి, శకుంతలా మాట్లాడుకుంటున్నారు.‘‘ఎండీగారివాళ చాలా మూడ్ మీద వచ్చారు. ఇవాళ ఎలాగైనా పని అవుతుందనుకున్నారు. కాలేదు. ప్చ్! బాగా ఫీలయ్యారు. వెళ్ళిపోయారు’’ సిగరెట్ ముట్టించాడు గిరి.‘‘నాకు నిన్ననే చెప్పారు! ఇవాళ ఎలాగైనా అయ్యేటట్టు చూడమని! అలాగే అన్నాను. అయ్యింది కాదు’’ బాధపడింది శకుంతల.‘‘మంచి టైంలో ఆ ముండాకొడుకు ‘లక్ష్మీ’ అంటూ కేకేశాడు! లేకపోతే అయిపోయేదే! అలా ఎరేంజ్ చేశానన్నీ’’ మళ్ళీ అంది శకుంతల.‘‘అయితే ఆ కుంటోడు దాని అన్నేనంటావా’’ అడిగాడు గిరి.‘‘ఇంకా అనుమానం దేనికి? దాని అన్నే! దానికో ‘అన్న’ వున్నాడని సుందరం నాకెప్పుడో చెప్పాడు’’ అంది శకుంతల.‘‘సీన్లోకి ఆడెలా వచ్చేశాడు’’ అడిగాడు గిరి.‘‘అదే అంతుచిక్కకుండా వుంది. ఆడు రావడం కాదుగాని - దాని మూడ్ పాడయిపోయింది. లేకపోతేనా? ఇవాళ ఎండీగారికి పలారం అయిపోయి ఏ గొడవా లేకపోను’’ అంది శకుంతల.‘‘ఏదేవయినా ఎండీగారికి గొప్ప ఓపిక! లక్ష్మీ లాంటిదాన్ని బలవంతంగా అనుభవించకూడదట! అందులో మజా వుండదట! మెల్లమెల్లగా స్వీటుని కొరుక్కుని తింటున్నట్లుగా దగ్గర చేసుకోవాల్ట! తర్వాత అసలు పనట’’ నవ్వాడు గిరి.‘‘మరందుకే ఈ బిల్డింగ్‌లు, టీవీల్లో ఆ యేషాలు! లేకపోతే దీనికెవుడిస్తాడు’’ కోపంగా అంది శకుంతల. ‘‘తన నటనకే ఇయన్నీ వచ్చేశాయనుకుంటోంది ఆ పిచ్చిది! తనొంటిరంగుకి, కనుముక్కు తీరుకీ అని అనుకోవట్లేదు. ఇదెలా చెప్పాలో ఆ పిల్లకి నాకర్థం కావట్లేదు’’ బాధపడింది శకుంతల.‘‘ముందు ఫోటోలు చూసి పిచ్చెత్తిపోయాడు. అరేంజ్ చేసీ అన్నాడు. లక్ష్మీ అలాంటి పిల్ల కాదంటే, నటనంటే దానికి పిచ్చంటే, సరే! ఆ రూట్లోనే వద్దామంటూ ఎండీ ఈ రూట్లో వచ్చాడు. రాత్రి లక్ష్మిని ఎత్తుకున్నప్పుడు అయిపోతుందనుకున్నాను! కాని కాలేదు! ఛ’’ తల వెనుకన చేత్తో చరుచుకున్నాడు గిరి.‘‘అవుద్దవుద్ది! తొందరపడమోక! ఇంతకాలం వోపిక పట్టినోళ్ళం - ఇంకొకటి రెండు రోజులలోపికపట్టాలేమో? అవుద్ది! అయితీరుద్ది! లక్ష్మినెలా ఎండీ పక్కలోకి పంపాలో నాకు బాగా తెలుసు’’ అని నిద్రొస్తోందేమో ఆవలింత తీసింది శకుంతల. ఆడపులిలా నోరుని ఇంతగా సాగదీసింది.- అదంతా వింటూ గిరిని, శకుంతలనీ గమనిస్తోన్న లక్ష్మికి ముచ్చెమటలు పోశాయి. అసలు సంగతి ఇదన్నమాట! ఎండీ తనని చేరదీస్తోన్నదితన శరీరమ్మీద కోరికతోకాని తన నటన మీద ఆసక్తితో కాదు. ఇందుకా? ఇందుకా ఇవన్నీ...కళ్ళు తిరుగుతున్నట్టనిపించి ముందుకి తూలింది లక్ష్మి. గది తలుపులకి ఆమె తల కొట్టుకుంది.తలుపు చప్పుడవడంతో నిద్ర మత్తు వదిలించుకుని, గిరితో పాటుగా అటుచూసి‘‘ఎవరు? ఎవరది?’’ అందోళన చెందింది శకుంతల‘‘ఎవరు? ఎవరక్కడ’’ గిరి కూడా అరిచాడు. వాళ్ల అరుపులకి మెలకువ తెచ్చుకొని‘‘ఏంటక్కా? ఏటైంది’ అడిగాడు చంకరం.‘‘ఏట్లేదు! నువ్వు తొంగో’’ అని రెండంగల్లో తలుపు దగ్గరగా వచ్చి, మూసినట్లుగా దగ్గరగా వేసి వున్న తలుపుల్ని ఒక్కుదుటున బార్లా తెరిచింది శకుంతల. తెరిచి అటూ ఇటూ చూసింది. ఎవరూ కనిపించలేదామెకి.‘‘ఎవరూ లేరు గిరీ’’ చెప్పింది శకుంతల.‘‘అయితే తలుపులు గాలికి కొట్టుకుని వుంటాయి’’ అన్నాడు గిరి.‘‘అంతే అయివుంటుంది’’ అంది శకుంతల. అని తలుపుల్ని మళ్లీ మూసినట్లుగా దగ్గరగా లాగి-‘‘కొంపతీసి మనం మాట్లాడుకున్నదంతా లక్ష్మి చాటుగా విందేమోనని ఒకటే భయపడ్డాను’’ గిరి దగ్గరగా వచ్చి కూర్చుంటూ అంది శకుంతల.‘‘దానికంత సీనులేదులే’’ తేలిగ్గా తీసిపారేశాడు గిరి.‘‘మీరేటి మాట్లాడుకుంటున్నారు’’ ఉత్కంఠని తట్టుకోలేక అడిగాడు చంకరం.‘‘ఏదో ఒకటి మాట్లాడుకున్నాం! తొంగెహే’’ కోప్పడింది శకుంతల.దాంతో చప్పున కళ్లు మూసుకున్నాడు చంకరం. నిద్ర పట్లేదు వాడికి. అయినా రాబట్టుకునే ప్రయత్నాల్లో పడ్డాడు. అటు వైపు తిరిగి పడుకున్నాడు.తట్టుకోలేని బాధని, వస్తోన్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ వార్డ్‌రోబ్ చాటుగా దాగున్న లక్ష్మి’ఇక ఫర్వాలేదు’ అనుకుని చాటు నుంచి తప్పుకుని ఇటొచ్చింది. అంత వరకూ ఊపిరి కూడా బిగపట్టిందేమో! ఇప్పుడు ఊపిరిని గుండెల్నిండా తీసుకుంది. ‘ఎవరు? ఎవరది’ అని శకుంతల ఆందోళనగా కేకేసరికి, శక్తినంతా కూడదీసుకొని స్పృహలోకి వచ్చినట్లయి‘ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలిప్పుడు’ అనుకుని ఎందుకైనా మంచిదనుకుని, వార్డ్‌రోబ్ చాటుగా దాగుంది లక్ష్మి. గది ఇవతలకి వచ్చి శకుంతల చూస్తే లక్ష్మి దొరికిపోయేదే! కాని, అదృష్టం బాగుండి, శకుంతల ఇవతలకిరాలేదు. అవతలుండి చూసి అట్నుంచటే లోపలకి వెళ్లిపోయింది.దాంతో బతికిపోయింది లక్ష్మి.మూసినట్లుగా దగ్గరగా వేసి వున్నా శకుంతలా వాళ్లున్న గది తలుపులవైపోసారి చూసి ‘అమ్మో! ఆలస్యం చేయకూడదు’ అనుకుని, తప్పించుకోవాలన్నట్లుగా చప్పుడు చేయకుండా మెల్లగా మేడమెట్లు ఎక్కి పైకి వచ్చింది లక్ష్మి. పంజరం దగ్గరగా వచ్చింది. ‘లక్ష్మి’ని చూసింది చిలక.ఆమెను పిలిచేందుకు నోరు తెరవబోయిందది. వద్దన్నట్లుగా సైగ చేసి, చేతలు జోడించింది లక్ష్మి. చిలక్కి లక్ష్మి బాధ అర్థమయింది.పేరు పెట్టి పిలవలేదది. దాంతో కన్నీళ్లు నిండిన కళ్లతో కృతజ్ఞతగా చిలకనోసారి చూసి, పరుగున గదిలోకి వచ్చి మంచం మీద పడింది లక్ష్మి. భోరున విలపించింది.ఏంటది? ఎటు చూస్తే అటు మాయ! మోసం! నచ్చిన రంగంలో నిలదొక్కుకోవాలంటే నయవంచనకి గురికాక తప్పదా? కళారంగంలో కాళ్లూనుకోవాలంటే కళంకిత కావాల్సిందేనా? అయ్యయ్యో!!లక్ష్మికెందుకో ఆ క్షణంలో చాలా చాలా బొమ్మలు గుర్తొచ్చాయి. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన బొమ్మలు- నగ్నంగా వున్న అమ్మాయిని ఆ పామేదో త్రాచుపామో! కట్లపామో చుట్టుకుపోతోంది. అమాయకంగా అల్లంత దూరంలో మోస్తోన్న లేళ్లగుంపుని పులి పొంచి చూస్తోంది. పంజరంలో చిలక మీద పిల్లి కన్ను పడింది. కోరగ్గా చూస్తోంది దాన్ని.ఈ బొమ్మల్ని తనెప్పుడు చూసిందో ఎక్కడ చూసిందో గుర్తులేదు కాని చూసింది లక్ష్మి. అప్పుడు ‘పాపం’ అని జాలిపడింది. ఇప్పుడు.... ఇప్పుడు తను కూడా అలాంటి బొమ్మే! ఆశగా, కోరిగ్గా, ఆకలిగా ఎండీ చూస్తున్నాడు తనని. జాలిపడేదెవరు?! తెగించి. ఎండీ బారిన పడకుండా తనని కాపాడెదెవరు?ప్రసాద్‌కోటి గొంతుల్తో గుండెల్లో పిలిచింది లక్ష్మి.------------------------------రాత్రంతా నిద్ర పోలేదు కృష్ణారావు. ప్రసాద్‌ని, పూజని కలపడం ఎలా? అన్న ఆలోచనలతోనే రాత్రంతా గడిచిపోయిందతనికి. పొద్దున్న టిఫిన్ చేసి, ఇలా బెడ్ మీద వాలాడో లేదో అలా నిద్రపట్టేసిందతనికి. నిద్రలో కృష్ణారావుకి చాలా అందమైన కలలొచ్చాయి. పూజకి, ప్రసాద్‌కీ పెళ్లయిపోయింది. కొత్త దంపతుల్ని కారులో ఊరేగిస్తున్నారు. డ్రైవర్ తనే! కారు ముందు బాణాసంచా కాలుస్తుంటే బంధుమిత్రులంతా తరలివస్తోంటే ప్రసాద్, పూజా ఊరేగుతున్నారు.ధన్ ధన్ ధనేళ్‌కలలో బాణాసంచా కాల్పుల ధ్వని కాదది. ఔట్‌హౌస్‌లో ఏదో పడింది. మెలకువ వచ్చింది కృష్ణారావుకి. కళ్లిప్పి చూసాడతను. ఎదురుగా హడావుడి పడుతూ కనిపించాడు ప్రసాద్. మీదనున్న సూట్‌కేస్‌ని ప్రసాద్ లాగడంతో సూట్‌కేస్‌ని ఆనుకుని వున్న పాతకాలం నాటి ఐరన్ ట్రే జారి కిందపడింది. పెద్ద శబ్దం చేస్తోంది.‘‘ఏమయ్యింది ప్రసాద్’’ అడిగాడు కృష్ణారావు.‘‘ఒక్కక్షణం అని, శబ్దం చేస్తున్న ట్రేని చేత్తో అందుకుని, దాన్ని అటు మూలగా గోడకి చేరవేసి-‘‘పదండి! మనం మన వూరు వెళ్లిపోదాం’’ అన్నాడు ప్రసాద్.‘‘మన వూరికా? ఎందుకు’’ ఆశ్చర్యపోయాడు కృష్ణారావు. బెడ్ మీద నుంచి లేచి నిల్చున్నాడు.‘‘మన వూరికి కాకపోతే ఇక్కడే ఇంకో చోటుకి పోదాం! ఈ బంగ్లాలో మాత్రం వుండొద్దు’’ సూట్‌కేస్ తెరిచి, కృష్ణారావు బట్టలు అందులో సర్దసాగాడు ప్రసాద్.‘‘ఆగాగు తొందరపడకు’’ తన బట్టలు సూట్‌కేస్‌లో ప్రసాద్ సర్దడాన్ని అడ్డుకొని-‘‘ఏమయింది ప్రసాద్! ఏంటిదంతా’’ అడిగాడుకృష్ణారావు.‘‘ఇక్కడ వొద్దు సార్! ఇక్కడుంటే...మనం... మన లక్ష్మిని మరిచిపోతాం’’ ప్రసాద్ గొంతుజీరబోయింది. అతని కళ్లు కూడా చెమర్చడాన్ని కృష్ణారావు స్పష్టంగా చూశాడు.‘‘డబ్బు, పూజ - ఈరెండూ ఇక్కడ చాలా డేంజర్ సార్! వీటికి దూరంగా మనం పారిపోదాం’’ ప్రసాద్ అన్నాడు.‘‘పారిపోయి’’‘‘మన లక్ష్మిని మనం వెతుకుదాం’’‘‘లక్ష్మి దొరక్కపోతే’’‘‘ఎందుకు దొరకదు సార్! వెతికితే తప్పకుండా దొరుకుతుంది.‘‘మరి ఇంతకాలం ఎందుకు వెతకలేదు’’కృష్ణారావు అడిగిన ప్రశ్నకి ప్రసాద్ దగ్గర సమాధానం లేకపోయింది. దాంతో పిచ్చిచూపులు చూశాడతను.‘‘ఎందుకు వెతకలేదో నేను చెప్పనా’’ అడిగాడు కృష్ణారావు. చెప్పండన్నట్లుగా చూశాడు ప్రసాద్.‘‘ఎందుకు వెతకలేదంటే నువ్వు పూజని ప్రేమిస్తున్నావ్’’‘‘నో’’ గట్టిగా అరిచాడు ప్రసాద్.‘‘నిజం ప్రసాద్! నువ్వు పూజని ప్రేమించబట్టే లక్ష్మిని వెతికే ప్రయత్నాలు మానుకున్నావ్! అందులో అబద్ధం లేదు’’‘‘వొప్పుకోను! నేనెపుపడూ పూజని ప్రేమించలేదు! ఆ సంగతలా వుంచితే లకి్క్షని వెతికే ప్రయత్నాలు నేను చెయ్యకపోతే చెయ్యకపోవచ్చుగాని, లక్ష్మిని వెతకాలి, వెతకాలన్న ఆలోచనయితే నేను మానుకోలేదు’’‘‘పనికిరాని ఆలోచనలు దేనికి చెప్పు’’‘‘సార్’’ ప్రసాద్ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.‘‘బాధపడకు ప్రసాద్! నేను అన్నవన్నీ నిజాలే! అందుకని మన వూరు మనం వెళ్లి పోదాం, పారిపోదాం లాంటి మాటలను మానుకో. అని అంత వరకూ బెడ్‌ని ఆసరా చేసుకొని నిల్చుని వున్న కృష్ణారావు ఇప్పుడు క్రచెస్ అందుకని వాటి ఆసరాగా నిల్చున్నాడు.‘‘నీకో సంగతి ఎప్పనా’’ అడిగాడు కృష్ణారావు.‘‘చెప్పండి’’‘‘ఒకవేళ మనకి లక్ష్మి కనిపించినా మనల్ని తను పట్టించుకోదు! పైగా అసహ్యించుకుంటుంది! అందుకని లక్ష్మిని వెతకడం కూడా అనవసరం’’ అన్నాడు కృష్ణారావు.‘‘లక్ష్మికి అన్నగా మీరు మాట్లాడడం లేదు’’ బాధపడ్డాడు ప్రసాద్.‘‘మీలో చాలా మార్పు వచ్చింది’’ అన్నాడు కూడా.‘‘మార్పుకి కారణం వుంది ప్రసాద్! నేను లక్ష్మిని కలిసాను. చెప్పాడు కృష్ణారావు. ‘‘నిజమా?’’ ఆశ్చర్యపోయాడు ప్రసాద్.‘‘నిజం! అన్నయ్యని కూడా చూడకుండా నన్ను వాళ్లింటి కారు డ్రైవర్‌తో గెంటించేసింది.’’‘‘నమ్మలేకపోతున్నాను సార్’’ బాధపడ్డాడు ప్రసాద్.‘‘నువ్వు నమ్మలేవు! నమ్మకు! కాని ఇది నిజం! అందుకని లక్ష్మిని మనం మరచిపోవడం మంచిది! అంతేకాదు! నువ్వు పూజని ప్రేమించడం కూడా అన్ని విధాలా మంచింది! ఆలోచించుకో!’’‘‘పూజని ప్రేమించడం నావల్ల కాద్సార్! నా వల్లకాదు’’ గట్టిగా అరిచాడు ప్రసాద్. తర్వాత ఏం మాట్లాడాలో తెలీక అటూ ఇటూ చూసి, చేతికి దగ్గరగా వున్న కృష్ణారావు బట్టలు సర్దిన సూట్‌కేసును బలంగా చేత్తో తోసేసి, చరచరా అక్కడ్నుంచి నడిచి వెళ్లిపోయాడు.నడిచి వెళ్లిపోతున్న ప్రసాద్‌లో పేలుతోన్న అగ్నిపర్వతాల్ని, ప్రవహిస్తోన్న లావాప్రవాహాల్ని చూశాడు కృష్ణారావు. అసహనంతో ప్రసాద్ అట్టుడికి పోతున్నాడు అనుకున్నాడు కృష్ణారావు. కావల్సిందదే! ఇప్పటి ఈ అసహనమే రేపు కోపం అవుతుంది. ఈ కోపమే ఆ మర్నాటికి అసహ్యం అవుతుంది. లక్ష్మిని ప్రసాద్ అసహ్యించుకోవాలి. పూజని ప్రేమించాలి. ప్రేమించాలి.-పదేపదే అదేమాట వల్లెవేసుకోసాగాడు కృష్ణారావు. The End