Read Aa Voori Pakkane Oka eru - 1 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 1

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

ఇరవై ఒక్క ఏళ్ల సుస్మితకి తన తల్లి తండ్రి ఇద్దరూ తన పదహారో సంవత్సరంలోనే  ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోవడం వల్ల మాత్రమే కాదు, తన తండ్రి రాసిన ఒక వింత వీలునామా వల్ల  కూడా పెద్ద చిక్కు వచ్చిపడింది. ఆ వంశంలో తరతరాలుగా వస్తూన్న ఆచారం ప్రకారంగా, అందరూ రాస్తూ వస్తున్నట్టే, ఇరవై రెండేళ్లు దాటి పెళ్లి చేసుకుంటే తప్ప తన కూతురికి తన ఆస్తి మీద హక్కు రాదని, అలాగే ఇరవై రెండేళ్ల లోపు పెళ్లి చేసుకుంటే ఎటువంటి హక్కు తన ఆస్తి మీద ఉండదని విల్లు రాసాడు సుస్మిత తండ్రి. ఆ వంశం లో కొంతమంది ఆడవాళ్ళూ ఇరవై రెండు సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసుకుని ఆస్తులు తగలేస్తే, ఇంకొంత మంది చాలాకాలం పాటు పెళ్లి చేసుకోకుండా వుండి ఆస్తులు తగలెయ్యడం వల్ల ఆ వంశంలో మగవాళ్లందరూ అటువంటి వీలునామాలు వ్రాస్తూ వస్తున్నారు. అందువల్ల సుస్మిత తండ్రి కూడా అలాంటి వీలునామా రాసాడు.  గుంటనక్క లాంటి తన మామయ్య వసంతరావు, అత్తయ్య పంకజం, బావ శేషేంద్ర తను ఇరవై రెండో సంవత్సరంలో ప్రవేశించి, పెళ్లి చేసుకుని, ఆస్తి మీద హక్కు సంపాదించక ముందే చంపేయాలని ఆలోచిస్తూవుంటే, ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఎక్కడికైనా వాళ్ల ముగ్గురికి తెలియని  చోటుకి వెళ్లిపోవాలని ఆలోచిస్తూండగా, సమస్యంతా తీరడానికి  సుస్మితకి గుర్తుకు వచ్చిన ఒకే ఒక వ్యక్తి తను ఇష్టపడే మదన్. మదన్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది ఏమిటంటే, తనని ఆఖురుసారి చూసి, మాట్లాడి  మూడు సంవత్సరాల పైన అయింది. అంతే కాకుండా కాలేజీ లో చదివే రోజుల్లో ఎదో చిలిపితనంతో అవమానించింది కూడా.  తన మనసులో ఎవరన్నా ఉన్నారేమో, పెళ్లి అయిపోయిందేమో కూడా తెలియదు. ఒకప్పుడు తను చేసిన అవమానానికి ఎలా స్పందిస్తాడో, ఒకవేళ ఈ మూడు సంవత్సరాల కాలంలోనే తనకి పెళ్లి అయిపోయివుంటుందో,  లేక తన మనసులో ఇంకా ఎవరన్నా ఉన్నారేమో తెలియక మధన పడుతూ వున్నా, మదన్ దగ్గరికే వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చేసింది సుస్మిత. మదన్ రూమ్ లో అనుకోకుండా అతని డైరీ చదివి, ఒక సీక్రెట్ తో మదన్ ని బ్లాక్మెయిల్ చేసి అతని ఇంట్లో ఆశ్రయం సంపాదించినా, త్వరలోనే విషయం అంతా అతనికి చెప్పి, అతని ప్రేమని పొందడమే కాకుండా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చాక తన సమస్య పూర్తిగా తీరిపోయినట్టుగానే అనిపించింది సుస్మితకి.

కానీ తను డైరీ లో చదివిన చిట్టిరాణి  ఎవరైతే మదన్ ని ప్రేమించి పెళ్లిచేసుకోమని వేధిస్తూ, పెనుగులాటలో నదిలో పడిపోయి చనిపోయిందో, తిరిగి సుస్మిత ముందుకి మళ్లీ మళ్ళీ వచ్చినప్పుడు సమస్య అంతా మొదలైంది. చిట్టిరాణి దయ్యం గా మారి మదన్ మీద పగ తీర్చుకోవాలని చూస్తూందని సుస్మిత భయపడుతూవుంటే,   ఏ దయ్యాలు భూతాలు లేవని, సుస్మిత ది కేవలం మానసిక సమస్యేనని, తన కజిన్ ఇంకా సైకాలజిస్ట్ తనూజ ద్వారా ఆ సమస్యని పరిష్కారించడానికి మదన్ ప్రయత్నాలు మొదలుపెట్టాక జరిగిన వింత సంఘటనల సమాహారమే ఈ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'ఆ ఊరి పక్కనే ఒక ఏరు.'

డిస్క్లైమర్

ఈ నవల పూర్తిగా రచయిత యొక్క స్వంత ఆలోచనలతో వ్రాయబడినటువంటిది. ఏ ఇతర రచయిత యొక్క రచనకి అనువాదం కానీ, అనుకరణ కానీ కాదు. ఈ నవల ఎవరినీ ఉద్దేశించి వ్రాయబడినది కాదు. ఇందులో వున్న పాత్రలు అన్నీ కూడా పూర్తిగా కల్పితం.  ఒకవేళ ఇందులోని పాత్రలు కానీ, కధ కానీ, మెయిన్ కాన్సెప్ట్ కానీ, నవలలో వేరే ఇంకేదైనా కానీ దేనితోనైనా పోలివున్నాఅది కేవలం కాకతాళీయం (co-incidental) మాత్రమే. రచయిత ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

 ఆ ఇంట్లోనుంచి పూర్తిగా బయటకి వచ్చి రోడ్ మీదకి రాగానే ఎంత వద్దనుకున్నా వెనక్కి తిరిగి చూడకుండా వుండలేకపోయింది సుస్మిత. దగ్గర దగ్గర ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఆ ఇంటితో తనకి పెనవేసుకుని వున్న అనుబంధం, ఆ జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు వస్తూంటే తన్నుకు వస్తూన్న కనీళ్ళని ఆపుకోలేక పోతూంది. పదహారు సంవత్సరాలు పాటు తన తల్లితండ్రులతో ఎంతో ఆనందంగా గడిపిన ఇల్లది. మిగిలిన దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు గుంటనక్కలాటి తన మామయ్య ఇంకా అతని ఫామిలీ తో గడిపింది. తల్లి తండ్రి లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలతో పాటుగా ఉండిపోయింది ఆ ఇంట్లో. వాళ్ళు లేకపోయినా వాళ్ళు ఎంతో ప్రేమగా కట్టుకున్న ఆ ఇంట్లో వుంటూవుంటే వాళ్లతోపాటుగా వున్నట్టే ఉంటూ ఉండేది. ఎంత ప్రమాదం ముంచుకు వస్తూన్న మాటయినా ఇప్పుడా ఇంటిని విడిచిపెట్టడం అంటే తల్లితండ్రిని విడిపెట్టేస్తున్నట్టే వుంది.

'ఐ యామ్ ఏ బిగ్ గర్ల్ నౌ. ఐ షుడ్ నాట్ వీప్.' కుడిచేతిలో సూట్ కేస్ ఎడమచేతిలోకి మార్చుకుని, కుడిచేతితో కళ్ళు తుడుచుకుంటూ అనుకుంది సుస్మిత. 'ఇంకా ఎక్కువ సేపు ఇక్కడ వుండకూడదు. వేగంగా వెళ్ళిపోవాలి.' ఎడమచేతిలో సూట్ కేస్ మళ్ళీ కుడిచేతిలోకి మార్చుకున్నాక వేగంగా నడక ప్రారంభించింది.

ఎంత గుంటనక్కలాంటి తన మామయ్య వసంతరావు, సరిగ్గా అలాంటి స్వభావమే వున్న అతని భార్య  పంకజం ఇంకా అతని కొడుకు శేషేంద్ర వల్ల తనకి ప్రమాదం తప్పదని తెలిసినా, వాళ్ళవల్ల ఇలా ఇల్లే విడిచిపెట్టేయాల్సి వస్తుందని మాత్రం అనుకోలేదు. ఇంచుమించులో ఒక వారం కిందట కాబోలు వాళ్ళు మాట్లాడుకుంటున్న గది పక్కనుండి వెల్తూ కిటికీ పక్కనుండి వాళ్ళ మాటలు వింది.  వాళ్ళు తనని గమనించక పోవడం తన అదృష్టం!

"గడువు రెండు నెలల్లోకి వచ్చింది. చేతులు ముడుచుకు కూర్చున్నారు. అవి కాలక ముందే ఎదో ఒకటి చెయ్యండి." తన అత్త పంకజం కోపంగా అంటోంది. 

"నువ్వు అనవసరంగా కంగారు పడకు. నేను ఆలోచిస్తూనే వున్నాను." తన మామయ్య వసంతరావు చిరాగ్గా అన్నాడు.

"అమ్మేమి తప్పు మాట్లాడలేదు నాన్నా. తనకి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చి పెళ్లి కూడా చేసుకుందంటే, తన తండి ఆస్థి మీద సర్వ హక్కులు వచ్చేస్తాయి. తరువాత వాటిని ఏం చేస్తుందో మనం ఏం చెప్పగలం?" శేషేంద్ర లో కంగారు వుంది.

"తనకి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేస్తే చాలదు. పెళ్లి కూడా చేసుకోవాలి. అప్పటికి గాని తనకి ఆస్తి మీద పూర్తి హక్కులు రావు ఆమె తండ్రి విల్లు ప్రకారం. తనకి లవర్ లాంటి వాడు ఎవరూ లేడని నువ్వే కదా చెప్పావు. ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేగానే ఎవర్ని తొందరపడి పెళ్లి చేసేసుకుంటుంది? నువ్వు కూడా మీ అమ్మలాగే వూరికే కంగారు పడకు." మరోసారి చిరాకు పడ్డాడు తన మామయ్య.

"అయ్యో రామ. ఇన్ని రోజులుగా చూస్తూ కూడా మీరు తనని సరిగ్గా అంచనా వేయలేక పోతున్నారు. అది తన అమ్మకున్న అందాన్నే కాదు నాన్న తాలూకు తెలివి అంతా కూడా పొందిపుచ్చుకుంది. మనం ఏమనుకుంటున్నామో, మన మనసుల్లో ఏముందో అది కనిపెట్టలేదనుకుంటున్నారా? దానికి ఎవరో లవర్ వున్నాడని, వాడిని ఇరవై రెండు రాగానే తను పెళ్లి చేసుకుంటుందని మనకి తెలిస్తే మనం చేతులు ముడుచుకుని కూర్చోమని దానికి తెలీదా? మనకి తెలీకుండా ఎవర్నో ఒకళ్ళని మైంటైన్ చేస్తూనే వుండివుంటుంది  సరిగ్గా టైం రాగానే పెళ్లిచేసుకోవడానికి." తనూ  చిరాకుపడుతూ అంది తన అత్త పంకజం

"అందుకది సమర్దురాలే కానీ దానిమీద ఒక డేగ కన్ను వేసివుంచానమ్మా. దానికి లవర్ అన్నవాడు ఎవరూ లేకపోవడమే కాదు, మగాడన్నవాడినే దగ్గరికి రానివ్వదు. నువ్వలా భయపడాల్సిన అవసరం లేదు." తన బావ శేషేంద్ర అన్నాడు.

"ఏమోరా అబ్బాయ్. దానిని చాలా కాలంగా అబ్సర్వ్ చేస్తూ ఉన్నదాన్ని. అదో గుండెలు తీసిన బంటు. ఇరవై రెండు నిండాక వెంటనే పెళ్లి చేసుకోవడం తన జీవితానికి ఎంత ముఖ్యమో తెలిస్తే అది ఖచ్చితంగా ఎవర్నో ఒకళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం చేసుకునే వుండివుంటుంది. నువ్వు తన మీద డేగకన్ను వేసివుంచావని తెలిసి నీకు తెలియకుండా జాగ్రత్తపడుతూందేమో." ఈ సారి కంగారు కనిపించింది పంకజం మాటల్లో.

"నువ్వు అనవసరంగా కంగారు పడకే. అదంత పని చెయ్యదులే." నిజానికి ఈ సారి   తన మామయ్య వసంతరావులో కూడా కంగారు కనిపించింది

"అవును నాన్నా. అమ్మ చెప్పినదాన్ని కూడా కాదనలేను నేను. అది అంత తెలివైనది. దాన్ని తక్కువ అంచనా వెయ్యకండి. దాన్ని తప్పు తోవ పట్టించడానికి, ఇంకా డ్రగ్ అడిక్ట్ ని చెయ్యడానికి నేనెంత ప్రయత్నం చేసాను? ఏ సందర్భంలోనూ నన్ను అనుమానించినట్లుగా కనిపించలేదు. కానీ ఒక్కసారి కూడా తప్పుతోవ పట్టలేదు. ఇరవై రెండు రాగానే పెళ్లి చేసుకుని ఆస్తి అంతటిమీద హక్కు సంపాదించి మనల్ని ఇంట్లోనుంచి గెంటేయడానికి ప్లాన్తో వుండివుంటుంది." తన కజిన్ లో కంగారు ఏ మాత్రం తగ్గలేదు.

"అంతవరకు రానివ్వనులేరా. కంగారు పడకు." తన మామయ్య అన్నాడు.

"ఏంటి కంగారు పడకు? మీరిలాగే అంటూ అది మనల్ని ఇంట్లోనుంచి గెంటేసే వరకూ ఆలోచిస్తూ వుండండి." తట్టుకోలేక బరస్ట్ అయిపొయింది తన అత్త.

"అమ్మా, నాన్నని అనవసరంగా కంగారు పెట్టకు. మనం ఏ స్టెప్ తీసుకున్నా జాగ్రత్తగా అలోచించి తీసుకోవాలి. ఒక మనిషిని అడ్డు తప్పించుకోవడం అంటే సినిమా లో చూపించినట్టుగా కాదు. చాలా అలోచించి చెయ్యాలి."

తన బావ శేషేంద్ర ఆలా అనడం వినగానే తన గుండెవేగం పెరిగిపోయింది. ఈ దుర్మార్గులు ఏమి ఆలోచిస్తున్నారో ఆలోచించలేనంత తెలివితక్కువది కాదు తాను.

"ఇప్పటివరకూ ఎంత సెన్స్ లెస్ గా బిహేవ్ చేసినా మొదటిసారిగా కాస్త సెన్స్ తో మాట్లాడావురా." తన మామయ్య అంటున్నాడు. "నేను ఒప్పుకుంటాను. అది అంతకు సమర్దురాలే. తనకి ఆస్తిమీద సర్వాధికారాలు వచ్చి మనల్ని బికారులు చేసేముందు ఎదో ఒకటి చేసెయ్యాలి."

"భయపడకండి నాన్నా. ఇన్ని సంవత్సరాలుగా మంచి పరపతి సంపాదించారు చుట్టుపక్కలంతా. మనం నమ్మదగ్గ ఒక వ్యక్తితో  చిన్న ఆక్సిడెంట్. ఫినిష్. అందరినీ, ఇంకా పోలీసులని కూడా అది కేవలం ఆక్సిడెంట్ అని నమ్మించడం పెద్ద కష్టం అయినా పనేమీ కాదు." గొంతులో ఏమాత్రం ఫీలింగ్ లేకుండా అన్న తన బావ మాటలు విన్నాక, ఎంత అదే వాళ్ళ ఆలోచన అని తెలిసినా మరోసారి ఆమె గుండె గతి తప్పింది.

"ఇప్పటివరకూ ఆలస్యం చేసి చేసిన తెలివితక్కువ చాలు. ఇప్పటికయినా కరక్ట్ గా దాని అడ్డు తప్పించండి." తన అత్తలో కోపం మాత్రం అలాగే వుంది. "ఏది ఏమైనా వాళ్ళ నాన్న అలాంటి విల్లు రాసి చచ్చాడు కాబట్టి మనం బ్రతికాం. లేకపోతె ఆ గుండెలు తీసిన బంటు తనకి మెజారిటీ రాగానే ఆస్థి మీద హక్కు వచ్చి మనల్ని ఇంట్లోనుంచి గెంటేసేది."

"అలాంటి వీలునామాలు రాయడం ఆ కుటుంబంలో అలవాటుగా రావడం మన మంచికే.  తన వంశం లో ఆచారం గా వస్తూన్న అది పాటిచండంవల్ల తన కూతురికి వచ్చే నష్టం కానీ మనకొచ్చే లాభం కానీ ఆ తండ్రి ఆలోచించ లేకపోయాడు." నవ్వుతూ అన్నాడు వసంతరావు.

"తెలిసిన విషయాలు మీరిప్పడు ఏకరవు పెట్టక్కర్లేదు. దాని ఆస్థి అంతా మన చేతుల్లోకి వచ్చేవరకు మీ సంతోషాన్ని రెజెర్వ్ చేసుకోండి." తన అత్త కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూంది.

"రిలాక్స్ డియర్. సాధ్యమైనంత త్వరలో దాని  అడ్డు తప్పించేస్తాను. ఒకప్పుడు కాదుకానీ ఇప్పుడు పోలీస్ కమిషనర్  కూడా నాకు మంచి ఫ్రెండ్. ఎవ్వరికి మనమీద అనుమానం రాకుండా మేనేజ్ చేస్తాను."

తన గుండెవేగం ఇంకా పెరిగి పోతూ ఉంటే మొదట ఎవరో వింటున్నట్టుగా వాళ్ళకి అనుమానం రాకూడదని అక్కడినుండి మేడమీద తన గదిలోకి చప్పుడు చెయ్యకుండా వెళ్ళిపోయింది.

తన మామయ్య మాటల్లో అతిశేయోక్తి ఏమీ లేదు. చిల్లిగవ్వ స్వంతంగా సంపాదించలేక పోయినా  తన ఆస్తినంతా అడ్డుపెట్టుకుని చుట్టుపక్కల అంతా పరపతి బాగానే సంపాదించాడు. తనని ఎదో ఒకలాగా చంపించేసి, అది యాక్సిడెంట్ అని చాలా ఈజీగా అందర్నీ నమ్మించేగలడు. గదిలోకి వెళ్ళాక రాబోయే ప్రమాదంనుండి ఎలా తెప్పించుకోవాలా అని తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టింది.

తన మామయ్య వాళ్ళు ఇలాటిదేదో ప్లాన్ చేస్తున్నారని తనకి చాలా రోజులుగా అనుమానంగానే వుంది. ఈ ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలా అని తీవ్రంగా ఆలోచిస్తూంది కూడా. కానీ తన తెలివితేటలోతో ఎంతో ఆస్తి సంపాదించిన తన డాడ్ కేవలం ఆచారంగా వస్తోందని అలాంటి వీలునామా రాయడం వల్ల తనకి వచ్చే ప్రమాదం గమనించలేకపోయాడు. కానీ అలాంటి వీలునామాలు రాయడం అలవాటుగా రావడం ఏమిటో తనకి ఎప్పుడూ అర్ధం కాదు.

ఆ కుటుంబంలో తరతరాలుగా ఒక వింత ఆచారం అలవాటుగా వస్తూంది.    ఆ కుటుంబంలో ఆడపిల్లలకి ఇరవై రెండు సంవత్సరాలు నిండి పెళ్లి అయితేకాని తండ్రి సంపాదించిన ఆస్తిమీద హక్కురాదు. ఒకవేళ ఇరవై రెండు సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తండి ఆస్తి మీద హక్కు ఎప్పటికీ రాదు. ఆ వంశంలో కొంతమంది ఆడవాళ్లు పరిపక్వత లేకుండా పెళ్లి చేసుకుని ఆస్తులు తగలేస్తే, ఇంకొంతమంది ఆడవాళ్లు చాలా కాలంపాటు పెళ్లి చేసుకోకుండా వుండి ఆస్తులు తగలేశారుట. ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండడానికి అటువంటి వీలునామాలు రాయడం ఆచారంగా వస్తూంది తమ వంశంలో.  కానీ ఇప్పటివరకు తన వంశంలో ఏ ఆడపిల్లకైనా ఇబ్బంది వచ్చిందోలేదో కానీ తనకి మాత్రం ఇలాంటి ప్రమాదం  వచ్చిపడింది.

ఆలోచనల్లో గమనించలేదు కానీ తను బస్సు స్టేషన్ కి వచ్చేసింది. సరిగ్గా నాలుగు గంటలకి ఇక్కడినుంచి ఫస్ట్ బస్సు వుంది. అదెక్కి టౌన్ లోకి వెళ్ళాక అక్కడినుండి రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి ఆటోలో. అక్కడ ట్రైన్ ఎక్కాక ఒకటిన్నర రోజుల ప్రయాణం తరువాత ఇంకో టౌన్ లో దిగాలి. అక్కడినుండి ఇంకో బస్సు లో ఎనిమిది గంటలు ప్రయాణం చేసి మళ్ళీ ఇంకో ఆటోలో ఇంకో అరగంట ప్రయాణం చేస్తే కానీ ముమ్మర విలేజ్ కి వెళ్ళలేదు. కానీ ఆ విలేజ్ లోకి అడుగుపెట్టి తాను కలుసుకోబోయే వ్యక్తి గురించి ఆలోచిస్తూంటే మాత్రం ఎదో మధురానుభూతితో నిండిపోయింది సుస్మిత మనస్సు. అతని ఇంట్లో తను ప్రస్తుతం ఆశ్రయం పొందడం ఎంత క్లిష్టమో తెలిసినా, అక్కడికి వెళ్తున్నాను అతన్ని కలుసుకోబోతున్నాను అన్న ఆలోచనే ఎంతో థ్రిల్లింగా వుంది. అసలు నిజంగా తను ఎందుకు అక్కడికి వెళ్తూంది అనే ఆలోచిస్తే, అది జరిగే పనేనా అని భయంగా కూడా వుండి. తను అనుకున్నట్టుగా జరగక పొతే ఏం చెయ్యాలో తోచడం లేదు.

'మదన్' బస్ స్టేషన్లో వున్న బెంచీలో కూలబడి, వెనక్కి వాలి రిలాక్స్డ్ గా కళ్ళు మూసుకున్నాక  అనుకుంది సుస్మిత. 'ఎంతో ఆశ తో నా దగ్గరికి వచ్చిన నీతో పొగరుగా మాట్లాడి నీకు శత్రువునైపోయాను. తరువాత నిన్ను కలుసుకుని, నీకు అపాలజీ చెప్పి, ఫ్రెండ్షిప్ చెయ్యాలని ఎంతగా అనుకున్నానో నీకు తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు నీ దగ్గరకే ఆశ్రయానికి వస్తున్ననన్ను ఏమంటావో బాధపడడం లేదు. నా మనసులో అసలు ఆలోచన తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో అంచనాకి అందడం లేదు. '

ఆ రోజు తను ప్రవర్తించిన తీరు గుర్తుకురాగేనే మరోసారి తనమీద తనకే కోపమొచ్చేసింది సుస్మితకి. తను, మదన్ ఒకే కాలేజీ లో చదివేవారు. కాకపోతే తను ఫస్ట్ ఇయర్ లో వున్నప్పుడు మదన్ ఫైనల్ ఇయర్. మంచి ఎక్సెర్సయిజ్డ్ బాడీతో హ్యాండ్సమ్ గా వున్న మదన్ ని మొదటి సారి చూసినప్పుడే చాలా ఇంప్రెస్ అయింది. కానీ అందరూ తన వెంటపడుతూ వున్నప్పుడు తను వెళ్లి అతని వెంటపడడం ఇగోకి అడ్డొచ్చింది. చాలామంది అమ్మాయిలు అతని వెంట పడుతూ వున్నా, మనసు ఎంత గోల చేస్తూవున్నాఅదే ఇగోతో ఆగి పోయింది. కానీ తనే తన దగ్గరకి వచ్చి పలకరించినప్పుడు తనెందుకు ఆ అవకాశం యూజ్ చేసుకోలేకపోయింది? ఆ రోజు ఆ సంఘటన తలుచుకుంటూ ఉంటే ఈ రోజుకీ తన మీద తనకే మండిపోతుంది.

"నా కజిన్ మాధురికి మీరు కూడా ఫ్రెండ్ కదా." ఇంక ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయనగా తన దగ్గరికి వచ్చి అన్నాడు మదన్.

"అఫ్ కోర్స్. అయితే..." మోహంలో ఇరిటేషన్ ఇమిటేట్ చేస్తూ అడిగింది.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)