Read Aa Voori Pakkane Oka eru - 2 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 2

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

వెంటనే అతని మొహం అంతా హర్ట్ ఫీలింగ్ తో నిండిపోయింది. "నా క్లోజ్ ఫ్రెండ్ కి మీరు కూడా ఫ్రెండ్ కాబట్టి మీ గురించి తెలుసుకోవాలనుకున్నా." ఆ వాయిస్ లో కూడా బాధ వుంది.

"కానీ నా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందరి గురించి తెలుసుకోవాలని నాకు లేదు." ఆలా అన్నాక ఇంకేం మాట్లాడకుండా అక్కడినుండి వెళ్ళిపోయింది.

తక్కిన అందరి అబ్బాయిలలాగే తానెలా మాట్లాడిన మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తాడేమోనన్నతన అంచనా తప్పయిపోయింది. తను పరీక్షలు రాసి వూరెళ్ళిపోయేలోపు మళ్ళీ ఒక్కసారి కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. తను ఎంతో డిజప్పోయింట్ అయింది. అయినా కాలం గడిచే కొద్దీ తన గురించి మరిచిపోయింది. కానీ తను ప్రస్తుత ప్రమాదం నుండి ఎలా బయటపడాలి అని పదే పదే ఆలోచిస్తూంటే అంతసేపూ మదనే గుర్తుకు వచ్చాడు. అప్పటికికాని బోధపడలేదు తనకి మదన్ మీద వున్నది జస్ట్ ఫీలింగ్ కాదని, తనెప్పుడూ మదన్ ని మర్చిపోలేదని. ఓకవేళ తనకి ఇప్పటికే  పెళ్ళయిపోయివుంటే ఏమిటి పరిస్థితి అన్న ఆలోచన వచ్చినా, మదన్ దగ్గరికే వెళ్లాలన్న అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోలేకపోయింది. ఎదో మాటల్లో మాధురి దగ్గరనుంచి ఆ రోజుల్లోనే మదన్ గురించి రాబట్టింది. ఇంచుమించులో నాలుగు సంవత్సరాలు తరువాత అక్కడికి వెళ్ళబోతూ వుంది.

"ఆ వూళ్ళో వాళ్ళు చాలా మోతుబరులు. భూములు, పొలాలు, తోటలు ఇంకా పెద్ద ఇల్లు వున్నాయి. ఆ ఊల్లోకెల్లా పెద్ద ఇల్లు వాళ్లదే." మాధురి మాటల సందర్భంలో తనతో చెప్పింది గుర్తుకు వస్తూంది.

సుస్మితని డిస్టర్బ్ చేస్తూ బస్ వచ్చి ఆగింది బస్ స్టేషన్ లోకి. 'మదన్. మనసులో కొండంత ఆశతో ఇంకా కొండంత ప్రేమతో నీ దగ్గరికే వస్తున్నా. ఆ దేవుడు నాలో నీ మీద వున్న ప్రేమని నువ్వు గమనించేలా చేసి నాకు ఆశ్రయం ఇప్పించాలని కోరుకుంటున్నా. ఇంకా ఆ తరువాత నా ప్రేమని నువ్వు అంగీకరించి నన్ను పెళ్లి చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా. ' బస్ కదులుతూ వుంటే సీట్లో వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ అనుకుంది సుస్మిత. ఆ తరువాత ఎప్పుడూ నిద్రపట్టేసిందో ఆ అమ్మాయికి తెలియలేదు. 

&&&

ఆ ఏటిపక్కన వున్న తమ పెద్ద తోటలో ఆలా సమయం గడపడం అంటే మదన్ కి చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చి వున్నాడు అంటే ఎంత సమయం గడిచేది కూడా తనకి తెలియదు. ఒక్కక్కసారి సాయంత్రం నాలుగు ఆలా ఇక్కడికి వచ్చాడు అంటే రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు కూడా ఈ తోటలో వుండిపోతాడు. చిన్నపటినుంచి ఇదే తోటలోకి వస్తూన్నా, ఇదే తోటలో వున్న ఫామ్ హౌస్ లో గడుపుతూన్నా తనకెప్పుడూ వాటిమీద విసుగురాలేదు. నిజానికి ఈ ముమ్మర గ్రామం అన్నా, ఈ గ్రామంలో వున్న తమ భూములు, పొలాలు అన్నా కూడా మదన్ కి ఎంతో ఇష్టం. తాత్కాలికంగా కూడా వాటిని వదిలి ఎప్పుడూ వదిలి వెళ్లాలని అనిపించలేదు. వీటన్నింటికన్నా కూడా తనని అమ్మని నాన్నని మించి చూసుకునే అన్నయ్య వదిన అంటే ఇంకా ప్రాణం. అందుకే తాను ఎక్కడో దూరంగా వున్న టౌన్ లో హాస్టల్ లో వుండి కాలేజ్ లో చదవాలని తన అన్నయ్య అన్నప్పుడు తనెంతమాత్రం ఒప్పుకోలేదు. 

"ఇక్కడే ఇలా గడుపుతూ పల్లెటూరి బైతు వి అనిపించుకుంటావా? నువ్వు టౌన్ కి వెళ్లి అక్కడ హాస్టల్ లో వుండి కాలేజ్ లో చదవాల్సిందే." తన అన్నయ్య పట్టుపట్టడం ఇంకా తన వదిన కూడా వంతపాడటం తో తనకెలాగో మూడు సంవత్సరాలు అతికష్టం తో ఈ వూరికి చాలా దూరంగా హాస్టల్ లో వుండి ఆ కాలేజ్ లో చదవక తప్పలేదు. ఇప్పటికి మూడు సంవత్సరాలు అలా అయింది ఆ కాలేజ్ చదువు పూర్తయ్యి. ఈ మూడు సంవత్సరాలలోనూ ఎప్పుడో అప్పుడప్పుడు తప్ప తను ఈ తోటలోకి రావడం మిస్సయింది లేదు. తను ఈ తోటలోకి వచ్చాడు అంటే కనీసం ఒక గంటయినా ఇక్కడ గడపకుండా వెళ్ళడు.

"ఇక్కడ నీకొచ్చే ఆనందం అంతా వదులుకుని నువ్వింటికి రావాల్సిన అవసరం వచ్చింది." వెనకనుండి వంశీ మాటలు వినపడి చిరాగ్గా వెనక్కి తిరిగాడు మదన్. "ఏమిటి ఈ చెట్ల మధ్య నీకు కలిగే ఆనందమో నాకు బోధపడదు. సమయమే తెలియదు ఇక్కడికి వస్తే నీకు."

"మధ్యలో నీకొచ్చిన ఇబ్బంది ఏమిటి?" కోపంగా అన్నాడు మదన్. "ఇంతకీ నేనెదుకు ఇంటికి బయలుదేరి రావాలి ఇప్పుడు?"

"ఎవరో వచ్చారు చాలా దూరం నుంచి నీ గురించి." సడన్గా ఒక వింత ఎక్స్ప్రెషన్ తో పాటుగా ఒక చిరునవ్వు కూడా వచ్చింది వంశీ పెదవుల మీదకి. "తనకి నువ్వే కావాలంట."

"నా గురించి చాలా దూరంనుంచి వచ్చే వాళ్లెవరు? ఎందుకొచ్చారు?" మదన్ భృకుటి ముడిపడిపోయింది.

"అది తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా ఇంటికి వెళ్ళు. నాకు ఈ ఫామ్ హౌస్ లో కొంత పని వుంది అది చూసుకుని ఇంటికి వస్తాను." ఆలా చెప్పాక  పిలుస్తూవున్నావెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు వంశీ.

 వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది ఎవరో గెస్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తూ ఇంటివైపు అడుగులు వేసాడు మదన్. కానీ ఎంత ఆలోచించినా వచ్చింది ఎవరో మాత్రం బోధపడడం లేదు. ఎవరో కొంత మంది క్లోజ్ ఫ్రెండ్స్ వున్నారు కానీ తనకి ఫోన్ చెయ్యకుండా ఇలా రాత్రి అయిపోతూ ఉంటే వచ్చే వాళ్లెవరు?

"అన్నయ్యా నా గురించి ఎవరో వచ్చేరుట కదా. ఎవరు, ఎక్కడ వున్నారు?" ఇంటిముందు కుర్చీలో కూర్చుని వున్న అన్నయ్య ముకుందాన్ని అడిగాడు  మదన్.

"ఇక్కడివరకూ వచ్చేవు కదా. ఆలా నాలుగు అడుగులు వేసి వంటింట్లోకి వెళ్ళు. అక్కడ మీ వదినతో మాటల్లో చాల బిజీ గా వున్నారు తను." మోహంలో అదొకరకమైన ఎక్స్ప్రెషన్ ఇంకా చిరునవ్వుతో అన్నాడు ముకుందం.

"వంటింట్లో వదినతో బిజిగానా? నాకస్సలు అర్ధం కావడం లేదు." ఇంటి లోపలికి నడుస్తూ అన్నాడు మదన్.

"నాకూ ఏమీ అర్ధం కావడం లేదు. నువ్వు ఇన్ని రోజులూ చాలా అమాయకుడివనుకున్నా." అన్నయ్య మాటలు వినిపించినా వెనక్కి తిరిగి సమాధానం చెప్పే ఓపికలేక ముందుకే నడిచాడు మదన్. అసలే మనసంతా విపరీతమైన కంఫ్యూజింగా వున్నా ఇంకా ఎవరో గెస్ చెయ్యడానికి ట్రై చేస్తూ వంటింట్లోకి అడుగు పెట్టాడు మదన్.

వంటింట్లో తన వదిన పక్కనే స్టవ్ దగ్గర ఎవరో అమ్మాయి నిలబడి మాట్లాడుతూ వుంది, తన వదిన ఎదో బిజిగా పనిచేసుకుంటూ ఉంటే. తన గురించి వచ్చింది ఒక అమ్మాయా? మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయింది మదన్ కి. ఇంకా గెస్ చేసే ఓపిక లేక "వదినా" అన్నాడు చిన్న గొంతుతో.

ఆ పిలుపు వినగానే తన వదిన వనజ మాత్రమే కాదు, ఆ అమ్మాయి కూడా వెనక్కి తిరిగి చూసింది. అప్పటికే ఆశ్చర్యంతో నిండిపోయిన మదన్ మనస్సు ఒక్కసారి షాక్ తో నిండిపోయింది. కలలో కూడా ఊహించని విషయం తనిక్కడకి ఈ రోజు వస్తుందని.

"నువ్వా?" ఆశ్చర్యంతో ఎలా అన్నాడో తనకే తెలియదు.

"ఆ నేనే." ఆ అమ్మాయి ఎంత అందంగా వుందో, నవ్వూ అంత అందంగానూ వుంది. "ఎదో నీకు ఫోన్ చెయ్యకుండా వచ్చినంత మాత్రాన నువ్వు ఇంతగా ఆశ్చర్యపోవాలా? నీ లవర్ ని నీకు ఇంటిమేషన్ ఇవ్వకుండా రాకూడదా?" ఆ గొంతు కూడా అప్పటి గొంతు లాగే, అంత మధురంగానూ వుంది.

"నువ్వు నాకు లవర్ వా?" మదన్ లో షాక్ ఇంకా ఎక్కువ అయిపోయింది.

" ఏం కాదా? నేను మీ అన్నావదినల దగ్గర ఏమీ దాచలేదు. అంతా చెప్పేసాను." ఆ మోహంలో బెరుకు కానీ, కంగారు  కానీ ఏమీ లేవు. చాలా స్థిమితంగా మాట్లాడుతూంది.

"ఏం చెప్పావు వాళ్ళ దగ్గర?" మదన్ లో షాక్ కాస్తా కోపంగా మారిపోయింది. ఆ రోజు తనతో ఎంత పొగరుగా మాట్లాడిందో ఎప్పటికీ మరిచిపోడు తను. కానీ ఫ్రెండ్ అని కూడా కాదు లవర్ ని అని చెప్పడమేమిటి? ఏ ఉద్దేశంతో ఆలా ఆందో బోధపడడం లేదు.

"మాకు ఏం చెప్పిందో అంతా నీకూ చెప్తుంది. మేడ మీద నీ గదిలోకి తీసుకుని వెళ్లి మాట్లాడు. చాలా రోజులకి కలుసుకున్నారు. ఇక్కడ ఇలా వాదన పడొద్దు." ఆ అమ్మాయి చెప్పినదంతా విన్న తరువాత వనజకి మదన్ మాట్లేడే తీరు ఆశ్చర్యంగా వుంది.

ప్రస్తుతానికి అదే మంచిదనిపించింది మదన్ కి. ముందుగా తనెందుకు ఇక్కడికి వచ్చిందో, తన వాళ్ళతో ఏమి మాట్లాడిందో అడిగి తెలుసుకోవాలి. తరువాత తక్కిన విషయాలు ఆలోచించొచ్చు.  

&&&

"నాకు ఒక నలభై రోజుల పాటు మీ ఇంట్లో చోటు కావాలి. తరువాత మీకు ఏ ప్రాబ్లెమ్ సృష్టించకుండా నేను ఇక్కడనుండి వెళ్ళిపోతాను. నేను ఇక్కడికే ఎందుకు వచ్చాను, నా ప్రాబ్లెమ్ ఏమిటి, ఇలాంటి ప్రశ్నలేమి అడగొద్దు." మళ్ళీ ఆ గొంతులో అదే పొగరు.

"నువ్వు ఏమి అనుకొంటున్నావో నాకు బోధపడడం లేదు. కానీ నిన్ను ఈ ఇంట్లోనుండి బయటకి పంపించేయడం నాకు చిటికలో పని." తనలో కోపం ఇంకా ఎక్కువైపోతూ ఉంటే అన్నాడు మదన్.

"నేను నీ అన్నావదినలకి  మనం లవర్స్ అని  చెప్పాను. నన్ను చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. నన్ను ఇంట్లోనుంచి పంపించేయడం నీకు అంత తేలికగా అయ్యే విషయం కాదు." మోహంలో అదే స్థిమితం, మాటల్లో అదే పొగరు.

"విషయం పూర్తిగా తెలీక మా వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఎంత త్వరగా మా వాళ్ళకి అసలు విషయం చెప్పి నిన్ను ఈ ఇంట్లోనుంచి గెంటించేస్తానో చూస్తూ వుండు." కోపంగా వెనక్కి తిరిగాడు మదన్.

"జస్ట్ ఏ మూమెంట్." తన గొంతు విని వెనక్కి తిరిగి ఆమె మొహంలోకి చూసాడు మదన్. ఇంకొక సమయంలో అయితే ఆ పెదాల మీద చిరునవ్వు ఏంతో మధురంగా అనిపించి ఉండేది కానీ ప్రస్తుతం పూర్తి ఇరిటేషన్ కలిగిస్తూ వుంది.

"నీకంత కోపం తెప్పించిన అమ్మాయి నీ ఇంటికొచ్చి నీతో ఇలా మాట్లాడుతూంది అంటే తను ఏ సపోర్ట్ తో మాట్లాడుతోందో తెలుసుకోవాలని నీకు అనిపించడం లేదా?"

"ఇంతకీ నువ్వు చెప్పదలుకున్నది ఏమిటి?" తనకి దగ్గరగా వచ్చి మొహంలోకి చూస్తూ ఇంకా కోపంగా అడిగాడు మదన్.

"కూచుని మాట్లాడుకుందామా? కాళ్ళు లాగేస్తూ వున్నాయి." అక్కడే వున్న బెడ్ దగ్గరకి వెళ్లి ఎడ్జిలో కూలబడుతూ అంది సుస్మిత.

"నీతో గంటలతరబడి డిస్కషన్ పెట్టుకునే ఓపిక నాకు లేదు. ఇంతకీ ఏమిటి నీ ధైర్యం?" తనకి దగ్గరికి వెళ్లి మరోసారి తన మొహంలోకి చూస్తూ అడిగాడు మదన్. ఇప్పుడు కోపంతో పాటు ఎదో భయం మొదలైంది.

"ఇట్స్ ఒకే దెన్." చేతులు రెండూ ఒళ్ళో పెట్టుకుని, గట్టిగా ఆవలించి అంది సుస్మిత. "నేను ఈ ఇంటికి వచ్చి ఫస్ట్ నీ క్లోజ్ ఫ్రెండ్ ని అని చెప్పాక నన్ను చాలా వార్మ్ గా రిసీవ్ చేసుకున్నారు మీ అన్న వదిన. తరువాత మీ వాళ్ళకి మనిద్దరం లవర్స్ అని కూడా చెప్పేసాను. అదొక ప్లెజెంట్ షాక్ వాళ్ళకి. అఫ్ కోర్స్ ఒక రిజర్విడ్ టైపు నీలాంటి అబ్బాయికి నాలాంటి అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్గా ఇంకా లవర్ గా ఉందంటే ఎవరికైనా నమ్మడం కష్టమే అనుకో కానీ నాలాంటి అందమైన అమ్మాయి చెప్పాక నమ్మకపోవడానికి మనస్కరించలేదు వాళ్ళకి. కాస్త రిఫ్రెష్ అయ్యాక నన్ను రెస్ట్ తీసుకోమని ఈ రూంలోకి పంపించారు. మామూలుగా అయితే పంపించరేమో కానీ నీ లవర్ ని అని కూడా చెప్పాను కదా."

"నీ చెత్తవాగుడు ఆపి నన్ను దేనితో బ్లాక్ మెయిల్ చెయ్యాలని ఆలోచిస్తున్నావో అది చెప్పు?" కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా వుంది మదన్ కి.

"వాట్? అప్పుడే నేను నిన్ను బ్లాక్ మెయిల్ చెయ్యబోతున్నానని కనిపెట్టసావా? చాలా ఇంటెలిజెంట్ వి నువ్వు."

"ముందు విషయానికి రా." కోపంగా అరిచాడు మదన్. తన నవ్వు ఎంతో అందంగా అనిపిస్తూ వున్నాపీక పిసికి చంపాలన్నంత కోపంగా వుంది మదన్ కి.

"అసలు డైరీ రాయడమే ఒక తెలివి తక్కువ పని, టైం వేస్ట్. అందుకనే నేను డైరీ ఎప్పుడూ రాయను. ఒకవేళ రాయాలని అనిపించినా అలాంటి విషయాలన్నీ డైరీ లో అస్సలు రాయకూడదు. ఒకవేళ రాసినా ఆ డైరీ ఎవరి చేతిలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా సీక్రెట్ గా ఉంచాలి."

"ఇది నా రూమ్. ఇందులోకి నేను, నా వాళ్ళు తప్ప ఎవరూ రారు. వచ్చినా నా వాళ్ళెవరూ మేనర్స్ లేకుండా ఇంకొకళ్ళ డైరీ తీసి చదవరు." తన అనుమానం నిజం అయింది. తనని దేనితో బ్లాక్మెయిల్ చెయ్యబోతూ వుందో బోధపడి పోయింది మదన్ కి. "నీ మాటలు నమ్మి నిన్ను నా రూంలో రెస్ట్ తీసుకోమంటే మేనర్స్ లేకుండా నా డైరీ తీసుకుని చదవడమే కాకుండా నన్ను బ్లాక్ మెయిల్ చెయ్యాలని చూస్తావా? కానీ ఆ డైరీ లో నేను భయపడాల్సినట్టుగా ఏమీ లేదు."

"నువ్వా చిట్టిరాణి ని వంతెన మీద నుండి నది లోకి తోసి చంపేసావు, ఇది నువ్వు భయపడాల్సిన విషయం కాదా?"

"షట్ అప్!" కోపంగా అరిచాడు మదన్. "అసలు జరిగిందేమిటో అందులో చాలా క్లియర్ గా రాసాను. అది చదవలేదా? తను పెనుగులాటలో నదిలో పడిపోయింది, నేను తొయ్యలేదు."

"నువ్వలా చెప్తే ఎవరు నమ్ముతారు బాస్? ఎదో శిక్ష నుండి తప్పించుకోవడానికే డైరీ అలా రాసావు ఇంకా అలా చెప్తున్నావు అనుకుంటారు. నీ అదృష్టం, ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరూ చూడలేదు, కానీ ఆ డైరీ లో ఆ విషయం ఎవరి కంటపడ్డా చాలా ప్రమాదం. మోరోవర్ మొత్తం మీ ఇద్దరి కథ అంత ఆ డైరీ లో చాలా క్లియర్ గా రాసేసావు."

"మై గాడ్!" అక్కడున్న కుర్చీలో కూలబడి తన తలని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు మదన్.

"ఒక్క ఫార్టీ డేస్ ఓపిక పట్టు. ఆ డైరీ నీ చేతుల్లో పెట్టి నా దారిని నేను పోతాను. ఇద్దరికీ ఏ ప్రాబ్లమ్ ఉండదు." కొంచెం బ్రతిమాలే ధోరణి లో అంది సుస్మిత.

"మా ఇంట్లో ఫార్టీ డేస్ ఆశ్రయానికి నువ్విలా నన్ను బ్లాక్ మెయిల్ చెయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను మామూలుగా అడిగినా ఒప్పుకునే వాడిని. ఒక అమ్మాయి ఆశ్రయం కావలనంటే కాదనేంత కుసంస్కారిని కాదు." కుర్చీలో వెనక్కి జరగిలబడి అన్నాడు మదన్.

"ఆ చూసాగా నన్ను చూడగానే నీ రియాక్షన్! నీ మాటలు నేను నమ్మను. ఈ ఫార్టీ డేస్ అయ్యే వరకు ఆ డైరీ నా దగ్గర ఉండాల్సిందే." దృఢంగా అంది సుస్మిత.

"మహా అయితే ఆ డైరీ నీ సూట్ కేసు లో పెట్టి ఉంటావు. కావాలంటే ఆ డైరీ ఇప్పుడే నేను తీసుకుని డిస్ట్రాయ్ చెయ్యగలను." కుర్చీలోనుంచి లేచాడు మదన్.

"నేను మీ అన్న వదినలకి, ఇంకా ఈ వూళ్ళో వాళ్ళకి కూడా వంతెన మీద నీకు చిట్టిరాణి కి పెనుగులాట జరిగిందందని, అప్పుడు నువ్వు తనని నది లోకి తోసేసావని చెప్పగలను. అఫ్ కోర్స్, వేరే ప్రూఫ్ లేకపోయినా నీ మీద స్ట్రాంగ్ డౌట్ రావడానికి అది చాలు కదా." అదే ధృడత్వంతో అంది.

"యు డెవిల్. నీలాంటి అమ్మాయినా ఒకప్పుడు కావాలనుకున్నాను అనుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తూంది." ఎందుకో సుస్మితని అసహ్యించుకోవాలన్నాఅసహ్యం కలగడం లేదు. అలా మాట్లాడుతూ వున్నా, అలా బ్లాక్ మెయిల్ చేస్తూ వున్నా కూడా తనెంతో అందంగానే కనిపిస్తూ వుంది.

"ఫార్టీ డేస్, జస్ట్ ఫార్టీ డేస్. దిస్ ట్రబులింగ్ థింగ్ విల్ బి ఓవర్ ఫర్ మీ అండ్ యు ఆల్సో. అంటిల్ దెన్ జస్ట్ ట్రై టు బి ఏ గుడ్ బాయ్." బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంటూ అంది సుస్మిత. "నేను మీ అన్న వదినలకి నేనిక్కడ ఒక ఫార్టీ డేస్ వుండబోతున్నానని చెప్పలేదు. ఆ చెప్పే బాధ్యత నీదే. ఇప్పటికింకా ఒకవేళ వాళ్ళు నేను నీ లవర్ ని అని కన్విన్స్ కాకపోతే అలా కన్విన్స్ చెయ్యాల్సిన బాధ్యత కూడా నీదే."

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)