Read Aa Voori Pakkane Oka eru - 9 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 9

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

అప్పుడు వంశీకి పద్నాలుగు సంవత్సరాల వయస్సు. తనూజకి పదేళ్లు వుంటాయేమో. ఆ రోజు తను ఫామ్ హౌస్ లో ఎదో సర్దుతూ ఉంటే అక్కడకి వచ్చింది.

"మీ మామ్ నీ చిన్నప్పుడే చనిపోయింది. నీకు మా బావ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా ఎదో వాళ్ళకి స్వంత మనిషిలా బాగానే మేనేజ్ అయిపోతున్నావు" అంది.

"నేనేం ఊరికినే పడి తినడం లేదు. బోలెడంత చాకిరీ చేస్తున్నాను." కోపంగా అన్నాడు వంశీ.

"చాల్లే. ఎదో నెలకి ఇంత జీతం పడేస్తే ఒళ్ళు వంచి పనిచేసే పనివాళ్ళు బోలెడంత మంది దొరుకుతారు. ఈమాత్రం  దానికి ఇంట్లో పెట్టుకుని స్వంత మనిషిలా చూసుకోవడం అనవసరం." మళ్ళీ అంది.

"అయితే ఆ విషయం వెళ్లి మీ అక్కకి, బావకి చెప్పు. వాళ్ళు వెళ్లిపొమ్మంటే నేను వెళ్ళిపోతాను. నా దగ్గర అనవసరంగా వాక్కు." వంశీ కోపంగా అన్నాడు.

"వాళ్ళు బాగా అమాయకులు. చెప్పినా అర్ధంకాదు. నువ్వే ఆ ఇంట్లోనుండి ఎక్కడికైనా పో."

"నేనెక్కడికి వెళ్ళను. నువ్వేం చేస్తావో చేసుకో పో." ఇంకా కోపంగా అన్నాడు వంశీ.

"నువ్వెందుకు ఎక్కడికైనా పోతావు. మా అక్క వాళ్ళ ఇంట్లో బాగా తినడానికి అలవాటు పడ్డావు కదా." వంశీని హీనంగా చూస్తూ అంది తనూజ.

అప్పుడు వంశీ తనూజ దగ్గరగా వచ్చి, తన చెవిలో ఒక బూతుమాట మాట్లాడి, తన కుడి చెంపమీద కొట్టాడు  కుడిచేత్తో. తనూజ మొహం కోపంతో ఎరుపెక్కిపోయి తనూ వంశీని కుడిచేత్తో కొట్టబోయింది. ఆ చేతిని తన ఎడమ చేతితో అడ్డుకుని ఇంకోసారి తనూజ కుడిచెంపమీద అదేచేత్తో బలంగా కొట్టాడు.

"నువ్వు నన్నే కొడతావా? ఇంటికిరా నిన్నేం చేయిస్తానో చూద్దువుకాని." కోపంగా అని ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది తనూజ. కాసేపట్లోనే మదన్ వచ్చాడు పొలంలోకి వంశీని ఇంటికి తీసుకువెళ్ళడానికి.

"నువ్వు తనతో ఆ బూతుమాట మాట్లాడవా, లేదా?" ఇంట్లో అడిగిపెట్టాడో లేదో వనజ అటకాయించి కోపంగా అడిగింది.

"తను నన్నేమందో నీకు చెప్పలేదా?" వంశీ కూడా కోపంగా అడిగాడు.

"ముందు నువ్వు  అలాంటి మాట మాట్లాడావా, లేదా? ఆ విషయం చెప్పు." అదే కోపంతో అడిగింది వనజ.

"అవును మాట్లాడాను." భయపడుతూ బెరుగ్గా అన్నాడు వంశీ.

వెంటనే వంశీ కుడిచెంపని తన కుడిచేత్తో చెళ్లుమనిపించింది వనజ. "అలంటి వెధవ మాటలు నేర్చుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను? మళ్ళీ మాట్లాడతావా?" తన కుడిచెవిని కుడిచేత్తో మెలిపెడుతూ అడిగింది.

"ఎప్పుడూ అలా మాట్లాడాను, సారీ." ఏడుస్తూ చెప్పాడు వంశీ.

అది జరుగుతూన్నప్పుడు ఆనందంగా చూస్తూ అక్కడే నిలబడ్డారు మంగవేణి, ఇంకా తనూజ.

"ఇప్పుడు చెప్పు తను నిన్నేమంది?" తన చెవిని విడిచిపెట్టి, రెండు చేతులతో రెండు భుజాలు పట్టుకుని అడిగింది వనజ.

తనూజ తనని అన్నదంతా వివరంగా చెప్పాడు వంశీ. వంశీని విడిచిపెట్టి, తనూజ వైపు తిరిగి తన మొహంలోకి కోపంగా చూసింది వనజ.

"నేనేమైనా తప్పు మాట్లాడానా? వున్నవిషయమే కదా అన్నాను." పొగరుగా తలెగరేస్తూ అంది తనూజ.

వనజ కోపంగా తనూజ దగ్గరికి వెళ్లి తన కుడిచేత్తో తనూజ రెండు చెంపలూ ఛెళ్లు, ఛెళ్లు మనిపించింది. తనూజ వెక్కివెక్కి ఏడుస్తూ తన రెండు చెంపలూ రెండు చేతులతో కప్పుకుని కూలబడిపోయింది.

"ఏమిటే, ఏ సంబంధం లేని ఆ పనికిమాలిన వెధవ కోసం నా కూతురి మీద ఇలా చెయ్యి చేసుకుంటావా?" మంగవేణి గట్టిగా అరిచి వనజ దగ్గరికి వచ్చింది.

" అమ్మా, వంశీ నాకు ఏ సంబంధం లేని మనిషి కాదు. కొడుకుతో సమానం. నాకు మదన్ ఎంతో, వంశీ కూడా అంతే. ఇకపైని నువ్వు కానీ, నీ కూతురు కానీ వంశీని అవమాన పరిస్తే నా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది." వనజ కోపంగా చెప్పింది.

"నీ ట్రీట్మెంట్ ఇలాగే ఉంటే నిన్నే పట్టుకు వెళ్ళడానికి మేమేమీ గతిలేక లేము. నేను కానీ, నా కూతురు కానీ మళ్ళీ నీ గడపతొక్కితే నీ చెప్పు తీసుకుని కొట్టు." మంగవేణి కోపంగా అని, అప్పుడే అన్నీ సర్దుకుని, తనూజని తీసుకుని అక్కడనుండి వెళ్ళిపోయింది.

"నా వల్ల నీకు నీ అమ్మ చెల్లెలు దూరం అయిపోయారు. ఏమీ కానీ నా కోసం ఎందుకొదినా అంతపని చేసావు?" ఏడుస్తూ వనజని పట్టుకుని అడిగాడు వంశీ.

"నువ్వు ఏమీ కావని నేననుకోవడం లేదు. చెప్పాగా నాకు మదన్ ఎంతో నువ్వూ అంతేనని. మీ ఇద్దరివల్ల నాకు పిల్లలు లేని విషయమే మర్చిపోయాను." వంశీని కుడిచెంప మీద ముద్దుపెట్టుకుని అంది వనజ."ఇంకెప్పుడూ నాకేమీ కానని నువ్వు అనుకోకు, నువ్వూ, మదన్ ఇద్దరూ నాకు కొడుకులతో సమానం."

పొలంలో పని పూర్తికావస్తూంది. వనజ చెప్పినా ప్రకారంగా తనూజ ఎప్పుడో ఇంటికి వచ్చేసే ఉంటుంది. ఇంట్లో తనకి తనూజ ఎదురుపడితే  పలకరించాలో, వద్దో అర్ధం కావడం లేదు. ఇంకా తానెలా బిహేవ్ చేయబోతోంది? అప్పట్లాగే బిహేవ్ చేస్తుందా, లేకపోతే ఏమైనా మారి ఉంటుందా? రకరకాలుగా ఆలోచిస్తూ వున్నాడు వంశీ.

&&&

ఆ చిన్నతనంలో జరిగిన సంఘటనలు తలుచుకుని తర్జన భర్జనలు పడుతూన్నది కేవలం వంశీ మాత్రమే కాదు తనూజ కూడా. తను ఇంటికిరాగానే వంశీని ఫేస్ చెయ్యాల్సి వస్తుందేమోనని భయపడింది కానీ ఆ సమయం లో కేవలం తన బావ ముకుందం మాత్రమే ఇంట్లో వున్నాడు. ముకుందాన్నిపలకరించాక తిన్నగా మదన్ రూమ్ లోకి వెళ్ళిపోయింది, మదన్ తన రూమ్ లో వున్నాడని చెప్పడం తో.  సుస్మితతో కూడా మాట్లాడడం పూర్తయ్యాక, కిందకి వచ్చి అక్కతో మాట్లాడి తనకిచ్చిన రూమ్ లోకి వచ్చి పడుకున్న తరువాత వంశీ ఏ గుర్తుకు వస్తున్నాడు. కేవలం ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మాత్రమే కాదు తనకి ఎందుకో తెలీదు గత కొద్దీ రోజులుగా వంశీ గురించే ఆలోచిస్తూవుంది. తనకి వంశీ కి వున్న డిఫరెన్స్  తనకి బాగా తెలుసు. తను బాగా చదువుకుంది. వంశీ టెన్త్ కూడా పాసవ్వలేదు. తను ఒకవేళ నచ్చి కావాలనుకున్నాతన తల్లి ఎంతమాత్రం వంశీతో తన పెళ్ళికి అంగీకరించదని తెలుసు. ఇంత చదువుకుని, ఇంత అందంగా వున్న తను వంశీ లాంటి ఒక చదువు, డబ్బు లేని వాడితో ప్రేమలో పడ్డం అబ్సర్డ్ అని తనకి తానూ చాలాసార్లు చెప్పుకుంది.

కానీ అదే విషయం ఎన్ని సార్లు రిపీట్ చేసినా, ఆమె మనసు మాత్రం వినడంలేదు. ఎంతవద్దనుకున్న తను ఆఖరి రోజు చూసిన ఆ వంశీ ఏ గుర్తుకు వస్తున్నాడు. ఆ రోజు తననలా బాధపెట్టి తను చాలా ఆనందపడింది. కానీ ఈ రోజు ఆ విషయం గుర్తుకు వస్తే తనమీద తనకే చాలా కోపం వస్తూంది. తననలా అకారణంగా బాధపెట్టే అధికారం తనకెవరు ఇచ్చారు? ఇదంతా తన తల్లి వల్లే జరిగింది. ఆమెలా అహంకారంగా, గర్వంగా ఉండడం మంచిదనుకుంది. తను కాలేజీలోనూ అదీ చేరి, తనలో కూడా మానసిక పరిపక్వత వచ్చేవరకూ కూడా తను బిహేవ్ చేస్తూన్న విధానం ఎంత తప్పో తనకి తెలిసిరాలేదు. అప్పటినుండి తనని తాను మార్చుకుంటూ వస్తూంది. తను ఆలా అహంకారంగా బిహేవ్ చేసి బాధపెట్టింది కేవలం వంశీని మాత్రమే కాకపోయినా, ముఖ్యంగా తను వంశీని బాధపెట్టిన విధానమే ప్రస్తుతం తనని చాలా బాధిస్తూ వుంది.

అప్పుడు కేవలం వంశీని ఆలా బాధపెట్టినందుకు మాత్రమే తను బాధపడుతూ ఉంటే, వంశీని కలవగానే సారీ చెప్తే సరిపోతుంది. కానీ వంశీ మీద ఇంకో కొత్తరకం ఫీలింగ్ ఎదో చాలా పవర్ఫుల్ గా నోటీసు లోకి వస్తూంది తనూజకి. చిన్నప్పటినుండి పొలంలో కష్టాలు పడ్డానికి అలవాటు పడ్డాడు వంశీ. అందువల్ల ఆ పద్నాలుగేళ్ల వయసులోనే కండలు తిరిగిన వయసుతో ఆకర్షణీయంగా ఉండేవాడు. మరింక ఈ పాతికేళ్ళు దాటిన వయసులో ఇంకెలా వుండివుంటాడు? ఎంత వద్దనుకున్నా తను ఆఖరిసారి చూసిన ఆ పద్నాలుగేళ్ల వంశీని పాతికేళ్ళకి ప్రమోట్ చేసి ప్రొజెక్ట్ చేస్తూంది తనూజ మనసు. అంతేకాదు ఆ పాతికేళ్ల వంశీ తనని బలంగా కౌగలించుకున్నట్టూ, పెదాల మీద ముద్దు పెట్టుకుంటున్నట్టూ అనిపిస్తూవుంది. ఎదో థ్రిల్ ఫీలింగ్ వళ్ళంతా బలంగా పాకుతూ ఉంటే అక్కడే వున్న దిండు తీసుకుని బలంగా కౌగలించుకుంది.

"ఎవరైనా కన్నెపిల్ల ఇలా దిండుని బలంగా కౌగలించుకుంది అంటే దానికి ఒకటే అర్ధం, తనకి త్వరగా పెళ్లి చేసెయ్యాలి."

వనజ మాటలు విని, షాక్ కొట్టినట్టుగా దిండుని పక్కన పడేసి లేచి కూచుంది సుస్మిత. "నేనేం చేసుకోనని భీష్మించుకుని కూర్చోలేదు. అవసరాన్ని గమనించినదానివి, మరి ఎవరో ఒక కుర్రాడిని కూడా చూడు." చిరునవ్వుతో లేచి కూచుని అంది తనూజ.

"నువ్వు చాలా ముదిరావ్. అయినా నీకూ మీ అమ్మకి నేను చూసిన కుర్రాడు ఎక్కడ పనికొస్తాడు?" తనూజ పక్కనే బెడ్ మీద కూచుని అంది వనజ.

తన తరువాత ఇంచుమించులో ఇరవై ఏళ్ల గ్యాప్ లో పుట్టింది తనూజ. తనకి తనూజ చెల్లలిలా కన్నా కూడా కూతురిలాగే అనిపిస్తూ ఉంటుంది. తన తల్లిలాగే గర్వంగా అహంకారంగా ఉంటుందని తప్పిస్తే తన చెల్లెలు అంటే తనకీ చాలా అభిమానం.

"అయినా నిన్నంత ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. కానీ నేనెవరినైనా ఎంచుకుంటే నన్ను సపోర్ట్ చెయ్యి." వనజ కళ్ళల్లోకి చూస్తూ అంది తనూజ.

"నువ్వంత ఘటికురాలివే అని అనుకుంటూనే వున్నాను. ఆల్రెడీ ఎవర్నన్నా ప్రేమించేసేవా ఏమిటి?" భృకుటి మూడేసి అంది వనజ.

"ఒకవేళ ఎంచుకుంటే అన్నాను. ఏంచేసుకున్నాను అనలేదు కదా. ఒకవేళ నేనెవరితోనైనా ప్రేమలో పడితే గనక సపోర్ట్ చెయ్యి." అక్కడ వున్న గోడకి దగ్గరగా జరిగి దానికి జారగిలబడుతూ అంది తనూజ.

"మదన్ ఆ బ్రాహ్మిన్ అమ్మాయిని ప్రేమించాడు. తనని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నేను సపోర్ట్ చెయ్యడం లేదూ? ఇంత చదువుకున్న నువ్వు అనాలోచితంగా ఎవరితోనూ ప్రేమలో పడవని తెలుసు. నువ్వు ప్రేమలో పడితే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను."

వనజ ఆలా ఆందో లేదో తనూజ వనజని గట్టిగా కౌగలించుకుని కుడిబుగ్గ మీద ముద్దు పెట్టుకుంది.

"ఇంకా చాలు." తనూజని విడిపించుకుంటూ అంది వనజ. "కానీ నువ్వు ఆలోచించాల్సింది అమ్మ గురించి. బాగా డబ్బున్న వాడితో తప్ప నీ పెళ్లికి తను అంగీకరించదు."

"ఓహ్, అక్కా. మనిద్దరికీ తానెలా అమ్మగా అయిందో అర్ధం కావడంలేదు." చిరాగ్గా అంది తనూజ.

"ఇప్పుడు మారావేమో తెలీదు. లేకపోతే నువ్వూ అచ్చం అలాగే కదా. నువ్వా వంశీని ఎలా బాధపెట్టావో నేను మర్చిపోయాను అనుకున్నావా?"

"నేనిప్పుడు చాలా మారిపోయాను అక్కా. అప్పట్లా అసల్లేను. నేనప్పుడు వంశీని ఆలా ఇన్సల్ట్ చేసి, టార్చర్ చేసినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. తనని కలిసిన మొదటి క్షణంలోనే తనకి సారీ చెప్తాను." ఫేస్లో ఒక జెన్యూన్ ఎక్స్ప్రెషన్ తో అంది. 

"నువ్వు సారీ చెప్పినా చెప్పకపోయినా కూడా పరవాలేదు. కానీ అప్పట్లా నువ్వు తనని మళ్ళీ హర్ట్ చేశావా, అంతకన్నా ఎక్కువగానే నీ చెంపలు పగలు కొడతాను." దృఢస్వరంతో అంది తనూజ.

"అలాగ జరగనే జరగదు. చెప్పాను కదా నేను చాలా మారాను." కాస్త ఆగి తన అక్క మళ్ళీ ఎదో అనేలోపు ఆ టాపిక్ మార్చడానికా అన్నట్టుగా అంది. "సుస్మిత మొత్తం విషయం అంతా మీకు చెప్పిందా?"

"మొత్తం అంతా మాకు చెప్పింది. అసలు అక్కడ అప్పుడు సరిగ్గా ఏం జరిగిందన్నది మాకు సుస్మిత ద్వారానే తెలిసింది. ఈ సమస్య నుండి తను బయటకి రావడానికి మేమంతా పూర్తి సహాయం చేస్తాం అని చెప్పాము." వనజ అంది.

"సుస్మిత నాక్కూడా అంతా చెప్పేసింది. నేనూ అలాగే మాట ఇచ్చాను." తనూజ అంది. "కానీ ఆ చిట్టిరాణి మదన్ మీద చాలా పగబట్టి వుంది. తను చెప్పినట్టుగానే మదన్ ని మూడు చెరువుల నీళ్లు తాగించే వరకూ ఊరుకోదు."

"చిట్టిరాణి పగలో న్యాయం వుందనిపిస్తూంది. తనని అంతగా ప్రేమించినా మదన్ ఏ రోజూ పట్టించుకోలేదు. తనలా నీళ్ళల్లో కొట్టుకొని పోతూ వున్నాతనకి కాదన్నట్టుగా చూస్తూ ఊరుకున్నాడు." వనజ అంది.

"కానీ ఇప్పుడు బాధ పడేది కేవలం మదన్ మాత్రమే కాదు, తనని ప్రేమించి ఇంత దూరం వచ్చిన సుస్మిత కూడా. ఎలా వాళ్లిద్దరూ ఈ కష్టం నుంచి బయటపడతారో నాకు చాలా భయం గా వుంది." తనూజ మొహం భయం తో నిండిపోయింది.

"మనం చెయ్యగలిగిన సహాయం చెయ్యడం తప్ప, ఇంకేం చెయ్యలేం. అంత పగబట్టివున్న ఆ చిట్టిరాణి నుండి ఆ దేవుడే మదన్ ని కాపాడాలి." నిట్టూరుస్తూ అంది వనజ. తనూజ ఎదో అనబోయే లోపు మళ్ళీ వనజే అంది "నువ్విప్పటినుండి ఇలాంటి టైట్ జీన్స్ వేసుకోకు ఇక్కడ. నీక్కావాలంటే నా చీరలు అవీ చాలా వున్నాయి."

"నువ్వేసుకోమన్నా వేసుకోను. నేనీ టైట్ జీన్స్ తో వస్తూ ఉంటే సర్కస్ నుండి వచ్చినట్టుగా చూసారు అందరూ." నవ్వుతూ అంది తనూజ.

&&&

"నేనలా ఒకసారి పొలంలోకి వెళ్లి వస్తాను." సాయంత్రం అవుతూ ఉండగా అంది తనూజ వనజ తో. వంశీ ఇంటికి వచ్చాక సడన్గా కలుసుకోవడం కన్నా కూడా పొలంలోనే కలుసుకుని సారీ చెప్పడం బావుంటుందనిపించింది. "ఆ పొలాలు, మన తోట చూసి చాలా కాలం అయింది."

"నేనూ నీతోటి ఆ తోటలోకి వచ్చేవాడిని ఈ మహాతల్లి అలంటి కండిషన్ పెట్టకపోతే."మదన్ కోపంగా అన్నాడు సుస్మిత వైపు చూస్తూ. "ఆ తోటలో టైం స్పెండ్ చెయ్యడం అంటే నాకెంతో ఇష్టం."

"నేనేమన్నా నా గురించి నిన్నక్కడికి వెళ్ళొద్దన్నానా? ఆ చిట్టిరాణి నీ మీద అక్కడ ఎంత పగబట్టి వుందో చెప్పాను కదా." సుస్మిత కూడా కోపంగా అంది. "నా దృష్టిలో తనూజ కూడా అక్కడికి వెళ్లడం మంచిది కాదు. తను తనూజకి కూడా ఏమైనా అపకారం చేస్తుందేమోనని నాకు భయంగా వుంది. తను నీకు మరదలే కదా."

"నేను తోటలో ఉండను. తిన్నగా పొలంలోకి వెళ్ళిపోతాను. నువ్వు అనవసరంగా భయపడకు." తనూజ నవ్వి అంది.

"తోట దాటకుండా పొలంలోకి వెళ్ళలేవు కదా. ఇంట్లోనే ఎలాగోలాగ కాలక్షేపం చేసుకోవచ్చు కదా. పొలంలోకి వెళ్లకపోతే ఏమైంది?" సుస్మిత అంది.

"ఎంతమందిని నువ్వలా తోటలోకి, పొలంలోకి వెళ్లకుండా కట్టేస్తావు? మాకు తిండిపెడుతున్నవి అవే. ఒకవేళ ఆ చిట్టిరాణి దయ్యంగా ఆ తోటలో వున్నా చేస్తే నన్నేమన్నా చేస్తుంది కానీ ఇంకెవర్నీ ఏమీ చెయ్యదు. తనని వెళ్లనీ." మదన్ అన్నాడు.

"మదన్ చెప్పింది నిజం. అందరం ఆ చిట్టిరాణికి భయపడి తోటలోకి, పొలంలోకి వెళ్లకుండా ఉండలేం. తనని వెళ్లనీ." వనజ కూడా అంది.

అక్క మొహంలోకి ఒకసారి కృతజ్ఞత గా చూసి అక్కడనుండి బయటపడింది తనూజ. ఏటినీ, తోటని దాటుకుని పొలంలోకి అడుగుపెట్టేసరికి ఇరవై నిమిషాల వరకూ పట్టింది. ఎంతవద్దనుకున్న అంత సేపూ కేవలం వంశీ గురించే ఆలోచిస్తూ వుంది. తనని చూసి ఎలా రియాక్ట్ అవుతాడు? తనతో అసలు మాట్లాడతాడా లేదా? మాట్లాడకపోతే ఏం చెయ్యాలి, మాట్లాడితే ఏం మాట్లాడాలి? ఇలాగే ఆలోచిస్తూ వుంది.

ఆ విశాలమైన వరిపొలాల్లోకి అడుగుపెట్టేసరికి సాయంత్రం అయిదున్నర అలాగ అయింది. ఆకుపచ్చ దుప్పటీ పరిచినట్టుగా వున్నఆ విశాలమైన పొలాల్ని చూస్తూ మైమరచిపోయింది కాసేపు తనూజ. ఇంత అందమైన ప్రకృతికి ఇన్నిరోజులూ ఆ తగువు వల్ల దూరమై తను చాలానే కోల్పోయింది. తానున్న టౌన్ లో మల్టీప్లెక్స్ లు, పబ్ లు, సినిమా థియేటర్లు వున్నాయి తప్ప, ఇలాంటివి మచ్చుకైనా కనిపించవు. ప్రస్తుతం తనకి బాగా చిరాకు కలిగిస్తూన్న విషయం కేవలం ఒక్కటి మాత్రమే వుంది. వంశీ ఎక్కడా కనిపించడం లేదు. అసలు చుట్టుపక్కల ఎక్కడా మనుషులే లేరు.

వంశీ ఎక్కడికి వెళ్లి ఉంటాడు? ఎరువులు అవీ తేవడానికి ఏమైనా టౌన్ లోకి వెళ్లి ఉంటాడా? లేదా ఏదైనా ఇంకేమైనా పనిమీద తన బావ ఇంకెక్కడికైనా పంపించి ఉంటాడా? తనని కలుసుకోవాలని ఎంతో ఆశతో వచ్చింది. లేకపోవడం చాలా నిరాశగా వుంది.

ఫామ్ హౌస్ లో గాని వుండివుంటాడా? చటుక్కున ఆలోచన వచ్చింది తనూజకి. ఎరువులు లాంటివి అవీ ఫామ్ హౌస్ లో స్టోర్ చేస్తూ వుంటారు. వాటిని తేవడానికి ఫామ్ హౌస్ లోకి వెళ్లి ఉంటాడు. ఇంతసేపూ తనకెందుకు ఈ ఆలోచన రాలేదు? చటుక్కున వెనక్కి తిరిగింది ఫామ్ హౌస్ కి వెళ్లే ఆలోచనతో.

అంతే ఒక్కసారి తనూజ మనస్సు ఆనందం, భయం, సిగ్గు, సంకోచం ఇంకా తనకే తెలియని భావాలతో నిండిపోయింది. ఎంతసేపై వచ్చాడో తెలియదు కానీ తనవెనకతలే నిలబడి తనవైపే చూస్తూ వున్నాడు వంశీ.

"ఎంత సేపైంది వచ్చి? ఏంటలా చూస్తున్నావు?" చిరుకోపంతో అడిగింది.

"జస్ట్ ఒక్క నిమిషం అలా అయింది. నీ వెనకాతలే నిలబడి నువ్వేమిటి చూస్తున్నావో చూడడానికి ట్రై చేస్తున్నాను." చిరునవ్వుతో అన్నాడు వంశీ.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)