Read This is our story - 2 by Harsha Vardhan in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఇది మన కథ - 2

ఎప్పుడైనా తను లీవ్‌ పెడితే ఆ రోజంతా నా మనసు విలవిల్లాడేది. తను పరాయి మనిషి కాదు అని నా కోసమే పుట్టిందేమో అనే తీవ్రమైన భావన నాలో! నేను తనకి ఇంకా దగ్గర అవ్వకముందే మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఇంకో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగానికి మారిపోయింది.
మా ఆఫీస్‌లో తన లాస్ట్‌ వర్కింగ్‌ డేనాడు వీడ్కోలు పలుకుతున్నప్పుడు నా కళ్ళలోని తడిని చూసి ‘హే.. ఇప్పుడు ఏమైంది? నేను వేరే కంట్రీకి ఏమీ పొవట్లేదు. ఈ సిటీలోనే ఉంటున్నా. ఇంకా చెప్పాలంటే మనిద్దరి ఆఫీస్‌ల మధ్య దూరం పది నిమిషాలే. రెగ్యులర్‌గా టచ్‌లో ఉందాం. ఓకే నా’ అంటూ హగ్‌ చేసుకొంది. ఆ కౌగిలి తను కాజువల్‌గా ఇచ్చినా అప్పుడు మా రెండు దేహాల స్పర్శలో నేను పొందిన ఆనందం అనిర్వచనీయం. అలారం క్లాక్, మొబైల్‌ రెండూ ఒకేసారి మోగుతుండగా నిద్ర లేచాను. టైమ్‌ చూస్తే పది. మానస గురించి ఆలోచిస్తూ లేట్‌గా పడుకున్నానేమో మెలకువ రాలేదు.
.
మొబైల్‌ చూస్తే తన నుండే కాల్‌. ‘హలో.. గుడ్‌ మార్నింగ్‌ ’ అన్నాను. నా గొంతులో విషాదం నాకే తెలుస్తోంది. ‘హే గుడ్‌ మార్నింగ్‌. ఇప్పుడే లేచావా? కమాన్‌ క్విక్‌గా రెడీ అయ్యి బేగంపేట షాపర్స్‌ స్టాప్‌కి వచ్చేయ్‌. చిన్న షాపింగ్‌. తరుణ్‌ కూడా వస్తున్నాడు. నువ్వుంటే నాకు బాగుంటుంది’ అని చెప్పేసి ఫోన్‌ కట్‌ చేసింది. ఏమనుకుంటుంది ఈ మనిషి అసలు! మా ఇద్దరి మధ్య ఏమీ లేనట్లు ఇంత క్యాజువల్‌గా ఎలా మాట్లాడుతుంది? తరుణ్‌తో షాపింగ్‌ చెయ్యటానికి నన్నెందుకు రమ్మంటోంది? వాళ్ళిద్దరినీ పక్క పక్కన చూస్తే నేను తట్టుకోగలనా!
అలా ఆలోచిస్తూనే రెడీ అయ్యి కిందకి వచ్చి కార్‌ స్టార్ట్‌ చేశాను. రాత్రి తగ్గిన వర్షం మళ్ళీ సన్నని తుంపరతో మొదలయ్యింది. కొన్ని జ్ఞాపకాలకు మరణమే ఉండదు. కొన్ని జ్ఞాపకాలు అస్సలు పురుడు పోసుకోవు. డ్రైవ్‌ చేస్తూ మళ్ళీ పాత జ్ఞాపకాలను వెతుక్కొన్నాను. మొదటిసారి తను నా కార్‌ ఎక్కటానికి కూడా ఇలాంటి వర్షమే కారణం. ఆ రోజు సాయంత్రం ఆఫీస్‌ నుండి బయటకు వచ్చేసరికి చిన్న ముసురు. నా కార్‌ దగ్గరికి వెళ్తూ, నీటి బిందువులతో ఆనందంగా పరవశిస్తున్న చెట్ల ఆకుల సోయగాన్ని చూస్తే ఎందుకో మానస గుర్తుకు వచ్చింది. స్కూటీ పై ఆఫీస్‌కి వచ్చే తను ఈ వర్షంలో ఇంటికి ఎలా వెళ్తుందో అనిపించి మొబైల్‌ తీసి కాల్‌ చేశా.
.
నేనేం మాట్లాడక ముందే ‘హే.. హౌ అర్‌ యూ? ఒక్క మెసేజ్‌ లేదు, కాల్‌ లేదు. మర్చిపోయావనుకున్నా బేబీ’ అన్నది గారాలు పోతూ. ఆ గొంతులో ఆ చనువుకి నా వొళ్ళు సంతోషంతో పులకరించింది. ‘ఐ యామ్‌ గుడ్‌. వర్షం వస్తుంది కదా ఎలా వెళ్తావు? ఫైవ్‌ మినిట్స్‌లో వస్తా. ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తా’ అన్నాను. ‘థాంక్‌ గాడ్‌. క్యాబ్‌ కోసం ట్రై చేస్తుంటే రెస్పాన్స్‌ రావట్లేదు. కమాన్‌ తొందరగా వచ్చేయ్‌. నీతో కబుర్లు చెప్పుకొని చాలా రోజులు అవుతోంది. వెయిటింగ్‌ ఫర్‌ యూ..’ అన్న తన మాటలకి కొత్త ఉత్సాహం ఆవరించింది నన్ను.
రెడ్‌ కలర్‌ చుడీదార్‌ పై కొన్ని వర్షపు చినుకులు అద్దుకొని మంచి పరిమళాన్ని మోసుకుంటూ వచ్చి కార్‌లో కూర్చుంది. ఆ కళ్ళు చూస్తేనే మైకం కమ్ముకుంటుంది నాలో. ఎప్పటిలాగానే గలగలా మాట్లాడుతుంటే ముందున్న అద్దంలో మెరిసే తన పెదాలనే చూస్తున్నా. ‘హే.. ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే చల్లటి ఐస్క్రీమ్‌ చప్పరించాలని ఉంది’ అంది. ‘నిజం చెప్పనా! నాకైతే నిన్ను చూస్తూ చిల్డ్‌ బీర్‌ కొట్టాలని ఉంది’ అన్నాను. ‘అబ్బా.. నీకెప్పుడూ బోల్డ్‌ థాట్స్‌ వస్తాయి.. లెట్స్‌ డూ ఇట్‌..’ అంటూ కన్ను గీటింది

తను అలా చేస్తే ఏదో తెలియని థ్రిల్‌ ఫీలింగ్‌ కలిగింది నాకు. ‘అయితే చలో నా ఫ్లాట్‌కే పోదాం. ఫ్రిజ్‌లో ఐస్క్రీమ్, బీర్‌ రెండూ ఉన్నాయి’ అంటూ నేను కూడా కన్ను గీటాను కావాలని. ‘డన్‌..’ అంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బాల్కనీలో కూర్చొని, వర్షాన్ని ఆస్వాదిస్తూ తను బటర్‌ స్కాచ్‌ని, నేను బడ్వైజర్‌ని రుచి చూస్తున్నాం. ఎలా మొదలు పెట్టాలో అర్థంకావటం లేదు నాకు. డైరెక్ట్‌గా ప్రపోజ్‌ చేస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోకుంటే భరించలేను. నా గురించి అందరికీ చెపితే ఆ అవమానాన్ని తట్టుకోలేను. బాల్కనీ కుండీల్లో రకరకాల మొక్కలు ఉంటే, వాటివైపు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది మానస.
బీర్‌తో పాటు నైట్‌ క్వీన్‌ గుబాళింపు ఒక వైపు, మరువం పరిమళం ఇంకో వైపు నాకు మత్తుని కలిగిస్తున్నాయి. ధైర్యం చేసుకొని తన దగ్గరగా వెళ్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను. అదే మెరుపు. నవ్వుతూ నన్ను ఆహ్వానిస్తున్నట్లుగా..చప్పున తన భుజాలు పట్టుకొని ముద్దు పెట్టి ‘లవ్‌ యూ మానసా..’ అన్నాను. ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోయి నిలుచుంది తను. నా వొంట్లో భయం కలిసిన ఉద్విగ్నత.

మరి తను ఏమి చేసింది ..?

అసలు ఏమి జరిగి ఉంటుంది ..?


( ఇంకా ఉంది ) ...🫡