Tana Premakai - 2 books and stories free download online pdf in Telugu

తన ప్రేమకై - 2

చంద్రశేఖర్ ఎంత నచ్చచెప్పిన ఉమ మనసు కుదుటపడలేదు..ఎంతైనా తల్లీ మనసు కదా! రాను రాను హరిణి మరీ దారుణంగా తయారయ్యింది.. మొఖంలో ఏ భావం లేకుండా మౌనంగా ఎప్పుడూ తనే తన ప్రపంచం అన్నట్టు.. ఎవరితోనూ ఏ సంబంధం లేనట్టు ఆ గదికే అంకితమయిపోయింది..ఒకప్పుడు హరిణికి, ఏడుపుకి పడదు.. ఇప్పుడు ఆ ఏడుపే తన సహచరి..ఎల్లప్పుడూ తనని అంటిపెట్టుకునే ఉంటుంది..

తనకేంతో ఇష్టమైన జాబ్ విషయమే మర్చిపోయింది.. అసలు జీవితమే గుర్తులేనప్పుడు, ఇంకా జాబ్ నీ ఏం గుర్తుపెట్టుకుంటుంది..ఉండే కొద్ది తనకి తానే నచ్చకుండా పోయింది..

హరిని అలా చూస్తుంటే ఉమ కడుపు తరుక్కుపోతుంది.
ఎందుకో ఏంటో ఏమి తెలియదు.. కానీ బిడ్డ దేనికో బాగా క్రుంగిపోయింది.. ఏమైయ్యుంటుంది అన్న ఆలోచనలో తన ఆరోగ్యం పూర్తిగా పాడయిపోయింది..

బీపీ పెరిగిపోయి ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది..
24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు డాక్టర్లు.. తల్లీ పరిస్థితి చూసి హరి దుఃఖం రెట్టింపయ్యింది..
వాళ్ళని అలా చూసి కూడా ఏం చెయ్యలేని స్థితి చంద్రశేఖర్ ది.. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా ఒక సంవత్సరం గడిచిపోయింది.. అయినా కూతురు మోహంలో కళ లేదు.. ఆమె వ్యధ తీరలేదు.. దానివల్ల భార్య ఆరోగ్యం క్షీణించిన.., అప్పుడు కూడా తనేమీ చెయ్యలేడు.. ఏమయ్యిందని అడిగి కూతురుని బాధపెట్టలేడు..ఇంకా నీలోనే నీ బాధని ఎంతకాలం దాచుకుంటావ్ అనుకోకుండా ఉండలేడు..

అన్నట్టుగానే 24 గంటలు గడిచేవరకు ఉమకి స్పృహ రాలేదు..తరవాత కూడా ఉమ హెల్త్ అంతంతమాత్రమే.. వారం రోజులకి డిశ్చార్జ్ చేశారు.. ధరణినే తల్లికి దగ్గరుండి అన్నీ చూసుకునేది.. ఎంత కూతురైనా ఒక్కసారి పెళ్లి అయిన తరవాత తనకంటూ వేరే బాధ్యతలు ఉంటాయి కదా!భర్త పిల్లలు అంటూ., అందుకే ఎక్కువ రోజులు తల్లీతో ఉండలేకపోయింది ధరణి..ఒకే ఊరయినా అత్తిల్లు దూరమవ్వడం వలన భర్త ఉద్యోగానికి, తేజు స్కూలుకి ఇబ్బంది అవుతుందని వెళ్లిపోవాల్సివచ్చింది..

అప్పట్నుంచి ఉమ బాగోగులు హరిణి బాధ్యత అయ్యింది..తండ్రి ఉద్యోగానికి ఇబ్బంది కలగకుండా సమయానికి అన్నీ సమాకూరుస్తూ, తల్లిని జాగ్రత్తగా చూస్కుంటుంది.సంవత్సరం నుండి ఇంటి బయట అడుగుపెట్టని కూతురు, ఇప్పుడు ఇంటి పనులు చేస్తూ, ఇంటికి కావాల్సినవి తీసుకొస్తూ ఉంటే ఉమ మనసు కాస్త ఊరట చెందింది..

తల్లీ ఆరోగ్యం దృష్ట్యా ఇదివరకటి అంత కాకపోయినా హరి కాస్త నవ్వుతూనే మాట్లాడుతుంది..ఒకరోజు ఇద్దరు కలిసి కూరగాయల కోసం మార్కెట్ కి వెళ్లారు..వీళ్ళు అలా మాట్లాడుకుంటూ రోడ్ మీద నడుస్తూ ఉండగా.. ఓ బుడ్డిది పక్కన వెళ్లే బైక్ కి అడ్డంగా వచ్చెయ్యబోయింది..
అది చూసి హరి చేతిలోని బ్యాగ్ వదిలేసి అయ్యో బుడ్డి అనుకుంటూ పక్కకు లాగింది.. ఇంతలో ఒక పెద్దావిడ
చిన్నూ అని అరుస్తూ వీళ్ళ దగ్గరకొచ్చింది.. చిన్ను నీకేం కాలేదు కదమ్మా!అంటూ పాపను హరి దగ్గర్నుంచి హడావిడిగా లాక్కుని తడిమి చూస్తుంది వొళ్ళంతా..

హరి ఆవిడ్ని ఆశ్చర్యంగా చూస్తూ ఆంటీ మీరా?ఎలా ఉన్నారు అని పలకరించింది.. హరి నువ్వా థాంక్ యు సో మచ్ అమ్మా!కంగారులో నేను నిన్ను గమనించనే లేదు.. ఇంతలో మెల్లిగా వీళ్ళ దగ్గరకొచ్చిన ఉమ, నందు ఎలా ఉన్నావే? అసలు కనిపించడమే మానేశావ్ అంటూ సైడ్ నుంచి సునందని హగ్ చేసుకుంది..

సునంద, ఉమకి చిన్నప్పటి నుంచి స్నేహితురాలు.. పెళ్లిళ్లు కూడా ఇంచుమించు ఒకేసారి జరిగాయి.. ఒకే ఊరు అవ్వడంతో ఇద్దరు కలుస్తూనే ఉండేవాళ్ళు అప్పుడప్పుడు.. కానీ సునంద భర్త చనిపోయిన తరవాత గత నాలుగేళ్లుగా ఉమని సరిగ్గా కలవలేదు.. ఎప్పుడయినా ఉమ వాళ్ళింటికి వెళ్లినా కూడా ఏదో మాట్లాడేది అంతే.. భర్త చనిపోయిన బాధలో ఉన్న స్నేహితురాలి దుఃఖం చూడలేక ఉమ మనసు ద్రవించిపోయేది.. ఒక్కోసారి దూరం నుంచి చూసి వచ్చేసేది.. హరి బెంగుళూరు నుంచి వచ్చిన తరవాత సంవత్సర కాలంలో అయితే అసలే చూడలేదు.. చాలా కాలం తరవాత ఇదే చూడడం..

నేను బావున్నానే.. నువ్వెలా ఉన్నావ్ అంటూ వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు సంతోషంగా మాట్లాడుకుంటున్నారు.. హరి మాత్రం చిన్నూనే చూస్తుంది.. తన మొఖంలో విష్ణు పోలికలేం కనిపించడంలేదు కానీ.. ఆటిట్యూడ్ మాత్రం విష్ణుదే అనిపిస్తుంది.. చిన్నూది వాళ్ళమ్మా పోలిక ఏమో భలే ముద్దుగా ఉంది.. వాళ్ళమ్మా అనుకోగానే హరికి మళ్ళీ తన గాయం రేగిపోయింది..ఎక్కడలేని దుఃఖం పొంగుకొచ్చేసింది...

తనని తాను తమాయించుకుంటుంది..ఉమా, సునంద ల మాటలు వినడానికి ప్రయత్నిస్తుంది..నందు నువ్వప్పటికి ఇప్పటికి చాలా మారిపోయావే.. అప్పుడు నిన్నలా చూసి ఏమయిపోతావోనని చాలా భయపడిపోయాను..అని ఉమా అంటుంటే.. అవునే నన్ను నా బిడ్డని మళ్ళీ మామూలు మనుషుల్ని చేసింది ఈ బంగారమే అంటూ చిన్నూని ముద్దు పెట్టుకుంటుంది సునంద..

ఇంతకీ ఈ బుడ్డిది ఎవరే అంటూ చిన్నూ బుగ్గ గిల్లుతు అడిగింది ఉమా.. మ్మ్ అంటూ మొఖంగా విసుగ్గా పెట్టుకుని ఉమా చేతుల్ని విడిపించుకుంటుంది చిన్నూ..
చిన్నూని నవ్వుతూ చూస్తూ ఇంకెవరే నా మనవరాలు అని చెప్పింది సునంద.. దానికి ఉమ ఇంకేదో అనబోయేలోపు చిన్నూ ఏడుపు అందుకుంది నానమ్మ నా బుడగ అంటూ.. అప్పడు గుర్తొచ్చింది సునందకి అసలు చిన్నూ తన చెయ్యి ఒదిలి ఎందుకు పరిగెత్తిందో, సరే బంగారం మళ్ళీ కొనుక్కుందాం అంటూ, ఉమ నేను మళ్ళీ కలుస్తానే.. ఇప్పటికే చాలా సేపయ్యింది అని అక్కడ్నుంచి బయల్దేరింది..చిన్నూ వెనక్కి తిరిగి బాయ్ హరి అని నవ్వుతూ తన చిట్టీ చేతిని ఊపింది..దానికి
హరి నీకెలా నాన్న నేను హరి అని అడిగింది.. ఇందాక నాన్నమ్మ పిలిసిందిగా హరి అని ముద్దుముద్దుగా చెప్పింది చిన్నూ.. అమ్మో నాన్న స్మార్ట్నెస్ బానే కనిపిస్తుంది దీనిలో అనుకుంటూ.. బాయ్ చిన్నూ అని ఆనందంగా నవ్వుతూ చెప్పింది..ఉమ అది చూస్తూ ఎన్ని రోజులకి నీ నవ్వులో జీవాన్ని చూసానే అనుకుంటుంది..

హరి ఇంటికి వచ్చిందే కానీ! క్షణం కూడా బుడ్డిదాని ఆలోచన తనని వదల్లేదు..మాటిమాటికీ తన స్పర్శని హరి ఫీల్ అవుతూనే ఉంది..అసలు ఇంతకమునుప్పేడు
చూడను కూడా చూడని పిల్లని తను అంతలా ఎందుకు
మిస్ అవుతుందో తనకే తెలియలేదు.. బహుశా విష్ణు మూలానా అనుకోగానే తన సహచరి మళ్ళీ తనని ఆవహించేసింది..ఏడుస్తూనే గతంలోకి వెళ్లిపోయింది..

*******************************
సునంద, ఉమ మంచి ఫ్రెండ్స్.. ఒకే ఊరిలో పుట్టి పెరిగారు..అందుకే పెళ్లిళ్లు అయ్యి పిల్లలు పుట్టిన తరవాత కూడా ఒకర్నుంచి ఒకరు విడిపోలేదు.. ఎప్పుడూ కలుస్తూనే ఉండేవాళ్ళు..సునంద భర్త అచ్యుతరావు.. వీరికి ఇద్దరు పిల్లలు కవలలు
"శ్రీవిష్ణు, శ్రీవైష్ణవి"..

ఉమ,సునంద కలిసిన ప్రతిసారి స్కూల్ హడావిడి లో పడి కలవకపోయినా అప్పుడప్పుడు కలిసేవారు..పైగా విష్ణు, వైష్ణవులు..హరి కన్నా 4 ఇయర్స్ పెద్ద అందుకే హరిణి కన్నా ధరణితో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు.

అంతేకాక హరి ఎప్పుడూ నాన్నకూచినే.. ఎప్పుడూ తండ్రితోనే ఆట పాట తన ఏజ్ పిల్లలతో కూడా తక్కువే..సుమ ఒక్కటే తన ఫ్రెండ్.. ఆమె కూడా నాన్న తరవాతనే..ఎప్పుడయినా సునంద పిల్లలని తీసుకొచ్చినా హరి నాన్నతో బయటకెల్లిపోయేది..ఇంటికి ఎవరొచ్చిన తనకి పెద్ద సంబంధం ఉండేది కాదు..

అమ్మగారికి పాపం కుదురు కూడా చాలా ఎక్కువేలే.. అందుకే గోడలు, చెట్లు ఎక్కడం బాగా అలవాటు..ఇంకా ఇప్పుడు హరికి 13 ఏళ్ళు 8త్ క్లాస్కి వచ్చేసింది..ధరణికి 10 త్ అయ్యింది..విష్ణు వైష్ణవులు ఇంటర్ పూర్తి చేశారు.
పిల్లలు ఎదుగుతున్న కొద్ది పెద్దవాళ్ళు కలుస్తున్నా.., పిల్లలు మాత్రం వీళ్ళతో పాటు కలవడం లేదు.. వాళ్ల చదువులు,వాళ్ల బిజీ వాళ్ళది.. ధరణికి వైష్ణవికి కాస్త ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు కలవడం కూడా తక్కువే..

ఎందుకంటే వైష్ణవి కి విష్షునే లోకం.. తన బ్రదరే తన ఫ్రెండ్.. ఎంతయినా అమ్మ కడుపులో కూడా కలిసే పెరిగారు కదా! వైషు, విష్ణు కన్నా 8 నిమిషాల ముందు భూమ్మీదకొచ్చింది..కడుపులో ఎలాగో డామినేట్ చేసి బయటకొచ్చినా, ఆ తరవాత మాత్రం విష్ణుదే పైచేయి.. కడుపులో ఎలాగో డామినేషన్ ఇచ్చాను కదా! బయట కూడా ఎందుకులే అనుకున్నాడేమో!. తను ఏదీ చెప్తే తన అక్క అదే చెయ్యాలి.. దీన్ని డామినేషన్ అనొచ్చు.. లేదా తన అక్కకి తనే అన్నీ దగ్గరుండి చూస్కోవాలి అనుకునే వల్లమాలిన ప్రేమ అనొచ్చు..

ఏజ్ పెరిగే కొద్దీ ఎంతో కేరింగ్గా, ప్రేమగా చూస్కునేవాడు.. అక్కని ఫుల్ గా సతాయించేవాడు కూడా..తను మాత్రం ఎవరి మాట వినేవాడు కాదు.. కోపం కూడా చాలా ఎక్కువ తాతలాగ.. అన్నీ తన తండ్రి పోలికలే అని కొడుకుని చూస్కుని మురిసిపోయేది సునంద..

ఫ్రెండ్స్ తో ఆటలు,జోకులు మామూలుగా కాదు.. తోకొక్కటే తక్కువ సార్ కి.. మితిమీరిన అల్లరి, కోపం.. అల్లరోడే కానీ ఆకతాయి కాదు.. వయసు పెరిగేకొద్ది అక్కని ఎలా చూసేవాడో అలాగే ప్రతి ఆడపిల్లని గౌరవించేవాడు.. మొత్తానికి ఎవరు చెప్పేది వినకపోయినా తనకు తానుగా తన క్యారెక్టర్ ని తీర్చి దిద్దుకున్న లెజెండ్ అన్నమాట..

ఇతగాడు ఇలా ఉంటే ఇంకా మన వైష్ణవి కూడా తమ్ముడికి ఫుల్ సపోర్ట్.. ఏదయినా తమ్ముడు చెప్తేనే చేస్తుంది.. తమ్ముడికి చెప్పే చేస్తుంది.. అందుకే బయటకి వెళ్లడం కూడా తక్కువే తమ్ముడితో తప్ప.. సార్కేమో ఫ్రెండ్స్ అల్లరి, ఇంకా ఎన్నో పనులు అస్సలు తీరిక ఉండదు కదా!.. అలా ధరణితో కూడా పరిచయం తక్కువయ్యింది.. ఇంకా 100 లో ఒక్కసారి కలిసే హరిణి అయితే వీళ్ళకస్సలు గుర్తే లేదు..

ఇలా ఉండగా ఒకసారి సునంద, తనని ఉమ ఇంటి దగ్గర బైక్ లో డ్రాప్ చెయ్యమని అడిగితే నాన రచ్చ చేసి ఎప్పటికో ఒప్పుకున్నాడు హీరో.. అలా డ్రాప్ చేసి ఉమ ఇంట్లోకి రమ్మని బలవంతం చేస్తే.. ఇలా వెళ్లి అలా కూర్చుని బయలుదేరిపోయాడు..వేసవి సెలవులు అవడంతో ధరణి కూడా ఇంట్లో లేదు అమ్మమ్మగారింటికి చెక్కేసింది.. మన హరి నాన్నకూచి కదా ఎక్కడకి కదిలే ప్రసక్తే లేదు.. ముందే పాపకి కుదురెక్కువ కాబట్టి చెట్లు పుట్టలు ఎక్కడం తప్ప మరో పనేమీ లేదు..

అలవాటుగా జామచెట్టు ఎక్కి కాయలు కోస్తుంది.. ఆ కాయ బావుంది.. ఈ కాయ బావుంది అనుకుంటూ ఒక్క కాయ కూడా కొయ్యకుండానే కాలుజారి కింద పడిపోయింది..అప్పుడే లోపలినుంచి బయటకొచ్చిన విష్ణు అది చూసి ఒక్క ఉదుటున ఆమెని కింద పడకుండా తన రెండు చేతులతో పట్టుకున్నాడు..
అంతే మన హరిణి కిందపడిపోయాననుకుని కళ్లు మూసుకుని గయ్యిమని అరిచేసింది.. అబ్బా! అంటూ తన చేతుల్లోని హరి ని కిందకి వదిలేసి చెవులు మూసుకున్నాడు విష్ణు.. ఒక్కసారిగా నేల తగిలేసరికి అప్పుడు అర్థమయ్యింది హరికి తను అప్పుడు పడింది కింద అప్పటివరకు పడలేదు అని..కళ్ళు తెరిచి తన ముందు చెవులు మూసుకుని నిల్చున్న విష్ణుని చూసింది..

కింద పడున్న ఆమెని చెయ్యిచ్చి పైకి లేపుతూ మెల్లిగా అరువు చెవులు చిల్లులు పడిపోయేలా ఉన్నాయ్ అన్నాడు..దానికి హరి నోరొదిలేసి నిలబడిపోయింది..
నోర్మూస్కో ఈగలు దూరతాయి అంటూ తన చేతితో హరి గెడ్డం పైకి పెట్టి హరి నోరు మూయించి, తనని పక్కకి తప్పించుకుని వెళ్ళిపోయాడు విష్ణు..




కొనసాగుతుంది