" బాగా సంపాదించాలన్న కోరిక కదా ఏ గల్ఫ్ కంట్రీ కో వెళ్ళుంటాడు.".
" అయుండొచ్చు. డబ్బు యావలో  పడ్డవాడికి మేము గుర్తొస్తామా ? అందుకే తిరిగి రాలేదు. ఆమె నటించటం లేదు. నిజంగానే అన్వర్ వీళ్ళను కలవలేదు.
విశాలమైన ఆ కాలేజీ రిసెప్షన్ హాల్లో విజిటర్స్ ఛెయిర్ లో కూర్చుని ఉన్నారు  విహారి, మెహర్. 
" మీరే గుర్తుకు రానప్పుడు నేనేం ఉంటాను ? నాకు తెలిసి నేను, మీ అన్నయ్య నాలుగైదు సార్లు కలిసి ఉంటాం. . నా రూపం ఎప్పుడో జ్నాపకాల్లోంచి చెదిరి పోతుంటుంది. నన్ను మరిచిపోయుంటాడు. మీరు గుర్తు చేసినా ఫలితం ఉండదు. 
" విహారి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఏదో ఒకరోజు అన్వర్ వీళ్ళను కలవక పోడు.  అప్పుడు తప్పక తన ప్రసక్తి వస్తుంది. ఆ సందర్భంలో తనపై అనుమానం రాకుండా ఇప్పుడే జాగ్రత్త పడుతున్నాడు. 
" ఎప్పుడో నాలుగైదుసార్లు  కలిసిన మితృణ్ణి చూడాలన్న మీ కమిట్మెంట్ కు హ్యాట్సాఫ్. ఆ ఆలోచన అన్వర్ కు లేకపోవడం మా దురదృష్టం. " మెహర్ మొహంలో దైన్యం. విహారి ఓదార్పు గా చూశాడు.
అప్పుడే యాదగిరి టీ ప్రేమతో ప్రత్యక్షమయ్యాడు. రిసెప్షన్ స్టాఫ్ కు, విహారి, మెహర్ లకు వేడి వేడి టీ అందించాడు. 
అతడి మాట తీరు , విహారి దృష్టి ని ఆకర్షించాయి. గలగల మాట్లాడుతూ, నవ్వుల పువ్వులు పూయిస్తూ వాతావరణంలో  ఉత్సాహం నింపాడు యాదగిరి. 
ఎవరండీ ఈ శాల్తీ ? సంతోషమే సగం బలం అంటున్నాడు." అడిగాడు  నవ్వుతూ విహారి.
" మా హాస్టల్ బాయ్ . యాదగిరి. ఇలా నవ్వుతూ నవ్విస్తూ 
అందరినీ ఆకట్టుకుంటాడు. అతడిని ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా స్టూడెంట్ సర్కిల్లో అతడో సెన్సేషన్.  రెసిడెన్షియల్ స్టూడెంట్స్ కు ఆత్మబంధువు." నవ్వుతూ అంది మెహర్. 
" నేనిక బయలుదేరుతారు. తిరుపతి ఫ్లైట్ టైం అవుతోంది. " 
లేచాడు విహారి.  మెహర్ కూడా లేచి నిలబడింది. 
" మీ నాన్న గారిని తప్పక కలిసి రమ్మని మా డాడీ చెప్పారు. ఆ అవకాశమే లేకుండా పోయింది. జరిగినవన్నీ తెలిస్తే ఆయన బాధపడతారు.  వారిద్దరూ మంచి ఫ్రెండ్స్"
. 
మెహర్ ముఖం పై మళ్ళీ జీవం లేని నవ్వు.  రెసిడెన్షియల్ స్టూడెంట్స్ కు ఆత్మబంధువు అన్న మెహర్ మాటలు మననం చేసుకుంటూ వెళ్ళాడు విహారి.
      " మే ఐ కమిషన్ సార్ ?" 
తన ఛాంబర్లో ఏదో ఫైల్స్ చూసుకుంటున్న  ఇంతియాజ్ తలెత్తకుండానే " కమిన్ ప్లీజ్ " అన్నాడు.
పర్మిషన్ తీసుకున్న వ్యక్తి  వచ్చి ఎదురుగా కూర్చున్నాడు.  తలెత్తి చూసిన ఇంతియాజ్ చిరునవ్వు లు చిందిస్తున్న  ఆ వ్యక్తిని చూసి అదిరిపడ్డాడు. సంభ్రమం, సంతోషం రెండూ అతని మొహం లో పోటీ పడ్డాయి. 
" ఇది !" ఎన్నాళ్ళకెన్నాళ్ళకు " ఆ వ్యక్తిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. 
మళ్ళీ ఇద్దరు కూర్చున్నారు. 
" రిసెప్షన్ లో శేఖర్ ఫ్రమ్ " బి" స్కూల్  చెప్పావు. నన్ను సర్ప్రైజ్ చేసేందుకా ?"
ఆదిత్య సహజ దరహాసం.
దాదాపు పావుగంట సేపు పాత జ్ఞాపకాల టైం మెషీన్ లో గతం లోకి వెళ్ళి పోయారు . 
గుండెలో నిండా మధుర స్మృతుల గుబాళింపు. మనసులు తేలికైనాయి. ముఖంలో ఉత్సాహం, వెలుగు !
" నేను ఈ వింగ్ లో ఉన్నానని ఎలా తెలిసింది ? "ఆశ్చర్యం గా అడిగాడు ఇంతియాజ్.
నువ్వు ఏ.సి.పీ గా ప్రమోట్ అయిన విషయం ఇటీవలే తెలిసింది.  మన బెంచ్ మేట్ సారధి చెప్పాడు. అయినా ఇంతియాజ్ ! ఎం.బి.ఏ లో టాప్ ర్యాంకర్ వి.  దట్ టూ ఫ్రం ది మోస్ట్ రెప్యుటెడ్ "బి" స్కూల్.  మరి ఈ ఐ.పి.యస్ పిచ్చి ఏంటి ?   నీకున్న డైనమిజం కు దేశ రాజకీయాలను , ఆర్థిక వ్యవస్థ ను శాసిస్తున్న  నేటి కార్పొరేట్ సర్కిల్ నిన్ను రెడ్ కార్పెట్ తో ఆహ్వానించేది."
ఇంతియాజ్ జవాబు గా చిరునవ్వు నవ్వాడు.
" కోట్లు కూడబెట్టాలన్న కోరిక వ్యసనం లాంటిది.  ఆ వ్యసనానికి నన్ను దూరంగా ఉంచినందుకు అల్లాకు నేను 
జన్మంతా ధన్యవాదాలు చెప్పుకుంటాను.
" డబ్బు సంపాదించడం వ్యసనం అని  చేతులు ముడుచుకొని కూర్చుంటే అభివృద్ధి ఎలా సాధించడం ?
" నేను బాగుండాలి. నన్ను నమ్ముకున్న వారు , నా చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి అన్న ఆలోఛన మనసు లో ఉంటే డబ్బు సంపాదించడం వ్యసనం గా మారదు. కానీ అలాంటి వారు ఈ సమాజం లో ఎంత మంది ఉన్నారు ?
నా విషయం వేరు. నేనో స్కూల్ టీచర్ కొడుకు ను. సగటు మనిషి ని. మా నాన్న ఆలోచనలకు వారసుడిని. సింపుల్ లివింగ్. హై థింకింగ్. మొదట ఎమ్.ఏ లిట్ చేశాను. నాన్న కాదనలేదు. కానీ కోర్సు పూర్తి చేశాక ఒక మాట అన్నారు .
టీచింగ్ లైన్ నా ఆలోచనా తీరు కు సరిపోదని. ఆమాట ముందే చెప్పుంటే  ఎమ్.ఏ చేసుండేవాడిని కాదు కదా అని అన్నాను. " నీ ఉత్సాహం చూసి కాదనలేకపోయాను రా" అని అన్నారు. సాహిత్యమే ఊపిరి గా భావించే ఓ సిన్సియర్ హిందీ పండిట్ కొడుకు  సాహిత్యం పై మక్కువ పెంచుకోవటం సహజమే కదా "
" సహజమే మరి. తర్వాత ఎం .బీ.ఏ అన్నావు.  మేనేజిరియల్ స్కిల్స్ అన్నావు. అక్కడా కుదురు లేకపోయింది. సివిల్స్ అన్నావు. చివరకు ఐ.పీ.యస్ లో తేలావు "
" ముందు మా అబ్బాజాన్ కి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎటు వెళతానన్నా కాదనలేదు. నేను ఏదైనా చేయగలను అని ఆయనకు చాలా నమ్మకం.  ఆ మోరల్ సపోర్ట్ ఈ రోజు నన్నీ సీట్లో కూర్చోబెట్టింది.  నేనూ సమాజానికి ఏదైనా చేయాలన్న పట్టుదల నన్ను ఏ.సి.పీ ని చేసింది. సరే ....నా కథంతా విన్నావు. మరి నీ సంగతేంటి. "
" నాదే ముంది చాలా సింపుల్. మొన్నటి దాకా ఓ ఎమ్.ఎన్.సీ కంపెనీ లో ప్రాజెక్ట్  హెడ్.  ఆంగ్లో ఫైనాన్షియల్ అనలిస్ట్  ప్రస్తుతం ఓ "బి" స్కూల్లో ఫ్యాకల్టీ ని. "
ఆశ్చర్యం గా చూశాడు ఇంతియాజ్. 
" ఒక్కసారిగా  ఇంత మార్పా. సడన్ గా టీచింగ్ లైన్ లో కి ఎందుకు వచ్చావు ?"
" నాకు నచ్చిన వ్యాపకాలు రెండు. ఒకటి వ్యవసాయం . అది నాన్నగారు చూస్తున్నారు. ఇంకేం రెండోది టీచింగ్. నాన్న గారి ప్రోద్బలం వల్ల కార్పొరేట్ రంగం లో  ఉద్యోగం వెలగబెట్టాను.
దాదాపు ఆరేళ్ళు పనిచేశాను.  ఆయన కోరిక తీరింది. నాకు మొహం మొత్తింది. అందుకే గేరు మార్చి టీచరునయ్యాను." 
క్షణం ఆగాడు.
 " నా మార్పుకు మరో కారణం ఉంది. " ఆలోచనలో పడిపోయాడు ఆదిత్య.  అతడి మౌనం ఏదో అతి ముఖ్యమైన విషయానికి " సైలెంట్ బిగినింగ్"  అని అర్థమైంది. 
" మా తమ్ముడు అరవింద్ నేను పనిచేస్తున్న 'బి' స్కూల్లో థర్డ్ ఇయర్ బి.బి.ఏ చేస్తున్నాడు. వాడికో క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. 
........ పవన్ కుమార్ వాసిష్ట ".
" పవన్ కుమార్ " 
" ఏం అతడు నీకు తెలుసా ?"
" వాడి నాన్నగారు నాకు మెంటార్.  ఫ్యామిలీ ఫ్రెండ్స్. అవును. పవన్ ఎలాంటి వాడు. ?"
" గుడ్ బాయ్. కానీ.....చాలా సాఫ్ట్ బాయ్. మాట కూడా ధాటిగా ఉండదు. మావాడు చాలా చురుకు . చూసి రమ్మంటే కాల్చి వస్తాడు. "
" మరి ఇద్దరికీ దోస్తీ ఎలా కుదిరింది ?
" దటీజ్ వెరీ ఇంట్రెస్టింగ్.  ఇద్దరికీ సంగీతమంటే పిచ్చి. మావాడు గిటార్ బాగా ప్లే చేస్తాడు. వాడికి వెస్ట్రన్ మ్యూజిక్ అంటే  చాలా ఇష్టం. " ఆగాడు ఆదిత్య. 
ఇంతియాజ్ ను క్షణం కన్నార్పకుండా చూశాడు. 
" ఈ కబుర్లన్నీ నింపాదిగా ఆఫీస్ టైంలో చెబుతున్నందుకు చిరాగ్గా ఉందా ?"
మితృడి ప్రశ్న కు నవ్వాడు.
" ఇవి కబుర్లు కావు కనుకనే నన్ను వెదుక్కుంటూ  ఈ టైంలో చెబుతున్నానని మొదటే అర్థమైంది. నా ఊహ కరెక్టే అయితే నువ్వు చెప్పేది డ్రగ్స్ రాకెట్ గురించి అవునా ?"
" యూ ఆర్ టూ షార్ప్".
" అందులో నా గొప్పదనం ఏమీ లేదు.  మేమూ ఓ డ్రగ్స్ రాకెట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాం . యూ కేం ఇన్ రైట్ టైం . ప్లీజ్ కంటిన్యూ "
" నీకు తెలుసుగా !  వీకెండ్స్ లో హాస్టల్స్ పలచబడతాయి. 
సిటీ లిమిట్స్ లో ఉండేవాళ్ళు పేరెంట్స్ తో ఇళ్ళకు వెళతారు. మిగిలిన వాళ్ళు సరదాగా హాస్టల్లో నే సరదాగా గడుపుతారు.   పవన్ విశాల్ అనే మరో ఫ్రెండ్ తో ఏ.సి రూం లో ఉంటున్నాడు. బంగారు పిచ్చుకలు కదా . కార్పొరేట్ సంస్థలు ఇలాంటి వారికి సకల సౌకర్యాలు కల్పిస్తాయి. ఈ  మహారాజు పోషకుల వల్ల మంచి రాబడి ఉంటుంది. 
.  అలాంటి వారిని , వారి చర్యలను మేనేజ్మెంట్  పెద్దగా పట్టించుకోదు ఃః దారి తప్పటానికి ఇదొక అవకాశం. అవునన్నట్లు తలవూపాడు ఇంతియాజ్. 
" పవన్, విశాల్ దాదాపు ప్రతి శనివారం డిన్నర్ కు వచ్చేవారు కాదు. వాళ్ళ రూంకే పరిమితమయ్యే వారు. ఎనిమిది గంటల కే తలుపులు మూసుకునేవి.  ఉదయం తొమ్మిదైనా లేచేవారు కారు. ఇలాంటి వారిని వార్డెన్ పట్టించుకోరు.  మేనేజ్మెంట్ నుండి వారికి స్పెషల్ instructions .   ఆదివారం లంచ్ వరకు పవన్, విశాల్ మూడీగా ఉండేవారు. మా వాడికి వాళ్ళ వాలకం నచ్చలేదు.  " ఎందుకలా ఉంటానని పవన్ ను మావాడు రెండు మూడు సార్లు అడిగాడు.  వాడేదో చెప్పాడు. కానీ వాడు చెబుతున్నది నిజం కాదని అర్థమై పోయింది.  అప్పుడు మా తమ్ముడు ఓ సాహసం చేశాడు. "
   ఇంతియాజ్ మొహం లో ఆతృత. 
" ఒక శనివారం రాత్రి పన్నెండు గంటల పైన  అంతా మాటు మణిగాక అరవింద్ వాళ్ళ గది తలుపులు మెల్లగా తడుతూ పవన్ ను పిలిచాడు.    పది నిమిషాల తర్వాత పవన్ తలుపు తీశాడు. వెంటనే దబ్బున బెడ్ పై పడిపోయాడు. 
ఏదో కలవరిస్తున్నాడు.   పూర్తిగా మన స్పృహ లో లేడు. 
విశాల్ పరిస్థితి దారుణంగా ఉంది. వాడికసలు స్పృహే లేదు."
       ఇంతియాజ్ లో ఇప్పుడు కంగారు .
                                 కొనసాగించండి 23