Read Love Life and Vitamin M - 3 by Nagesh Beereddy in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

Love, Life and Vitamin M - 3

ఐదో కథ : 

సామూహిక ఏకాంతం!

ఒకతనికి ఉరిశిక్ష పడింది.

"నీ చివరి కోరిక ఏంటి? అని అడిగాడు జడ్జి.

"నన్ను ఉరితీస్తున్నట్లు నా వాట్సప్ స్టేటస్ అప్డేట్ చేయాలి" సమాధానం ఇచ్చాడు అతడు.


ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిది. ఆంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకొచ్చారు. డాక్టర్ పరీక్షించి కండీషన్ చాలా సీరియస్ గా ఉంది” అని చెప్పాడు.

“మీ వాళ్ళకు ఏమైనా చెప్పాలా?" అని అడిగింది నర్స్. 

"ఒక వేళ నేను చనిపోతే నా మొహం పైన వెంటనే గుడ్డ కప్పేయండి. లేదంటే మా ఫ్రెండ్స్ ఫోటో తీసి ఇన్స్టా గ్రాంలో పెడతారు” సమాధానం ఇచ్చింది ఆ అమ్మాయి.

వర్తమాన కాలంలో ఇవి కాస్త “అతి”శయోక్తులే కావొచ్చు. అలా అనిపించడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కానీ, రేపటి కాలంలో అతిశయోక్తులు కావు. . అతి దగ్గరి వాస్తవాలు.

"ఫోన్ పక్కనపెట్టి కిందికి వచ్చెయ్ కలిసి భోజనం చేద్దాం" అని ఒక తల్లి తన కూతురికి మెసేజ్ చేసింది. ఇది జరిగింది, జరుగుతున్నది వర్తమాన కాలంలో కూడా కాదు. ఎప్పుడో భూతకాలంలోనే జరిగింది. వర్తమానంలోనూ జరుగుతున్నది. 

మనం నాలుగు గోడల మధ్య ఒకే ఇంట్లో ఉంటాం. కానీ, ఎవరి లోకం వారిది. ఎవరి ప్రపంచంలో వాళ్ళు. ఎటాచ్డ్ డిటాచ్మెంట్.. డిచాచ్డ్ ఎటాచ్ మెంట్.. 

వాట్సప్ గుంపుల్లో చేరడం ఇప్పుడు “తప్పని”.. సరి.

ఎవ్వరు ఎవ్వరికైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపియొచ్చు.

ఎవ్వరు ఎవ్వరినైనా యాడ్ చెయ్యొచ్చు కూడా.

వాట్సప్ గ్రూప్ అడ్మిన్ గా ఉండడం ఇప్పుడొక స్టేటస్. 

వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో చాటింగ్ లు.. వాదనలు, చర్చలు, రచ్చలు, గొడవలు.. ఇప్పుడు చాలా కామన్. ఇలా జరుగుతున్నా కొన్ని సంఘటనలు మన భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. 

అవసరం నుంచే ఆవిష్కరణ పుడుతుంది. సెల్ ఫోన్ మొన్నటి ఆవిష్కరణ. నిన్నటి అవసరం. నేటి వ్యసనం. 

మరి రేపు?

ఎదుటి వారితో మాట్లాడుతుంటాం.

ఇంతలో నోటిఫికేషన్ వస్తుంది. అందులో మునిగిపోతాం.

ముఖాముఖి కంటే “బ్లూ టిక్ మార్క్” మీదే మనకు ఆసక్తి.

మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.

మీరే చెప్పండి.. మీరూ, మీ స్నేహితుడు హాయిగా.. ప్రశాంతంగా కూర్చుని.. అసలు సెల్ఫోనే చూడకుండా మనసు విప్పి మాట్లాడుకుని ఎన్ని రోజులయ్యింది?

అంతలా ఆలోచించకండి..

మనం దాదాపుగా మాట్లాడడమే మానేశాం.

ఎక్కడో చూస్తూ మాట్లాడుతున్నాం.

ఏదో చేస్తూ వింటున్నాం.

టీవీ చూస్తూ తింటున్నాం.

సెల్ఫోన్ చూస్తూ ఎదుటి వారికి “హలో” చెబుతున్నాం.

వాట్సప్ లో శుభాకాంక్షలు చెబుతున్నాం.

ఫేస్ బుక్ లో కామెంట్స్ రాస్తున్నాం.

ఇన్స్టా గ్రాం లో ఇమేజ్ లు పెడుతున్నాం.

కానీ, ఎదురెదురుగా ఎంతసేపు ఉంటున్నాం.

ఫోన్ వదిలి మాట్లాడి ఎంత కాలమైంది?

ముఖాముఖి కరువైంది. 

పోను.. రాను.. కంటే.. ఫోనే బెటర్ అంటారు.

నిజమే.. కాదనలేం.. కానీ.. అది ముఖాముఖి సంభాషనలను మింగేసింది. 

మాటలు టెక్ట్స్ లోకి మారాక.. మనిషి  సమూహం నుంచి ఏకంతంలోకి వెళ్ళి మౌనంగా రోధిస్తున్నాడు.. సమూహంలో ఉన్నాగానీ సామూహిక ఏకాంతం అనుభవిస్తూ ఉన్నాడు     

 

ఆరో కథ :

చద్ది కూడు 

పదింటి దాకా పడుకున్న కొడుకుతో తండ్రి "కాస్త పెందలాడే లేవొచ్చు కదరా బాగు పడతావ్?” అంటే "తెల్లారగానే కోడి కూడా లేస్తది. ఏం బాగు పడింది. చికెన్ వండుకుని తినేస్తున్నం మనం" అని సినిమా డైలాగులు చెబుతున్నది ఈ తరం.

"కష్టపడి చదువుకోవే పైకొస్తావ్" అని తల్లి కూతురితో అంటే.. "కష్.. టపడుతూ చదవడమెందుకు అమ్మా! సింహం రోజూ పద్దెనిమిది గంటలు పడుకుంటుంది. గాడిద రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేస్తది. మరి కష్.. టపడి పని చేయడం వల్ల పైకి వస్తారంటే అడవికి గాడిద ఎప్పుడో రాజైపోయి ఉండాలి కదా. మరి కాలేదుందుకు?" అని ఎదురు ప్రశ్న వేస్తున్నది నవతరం కూతురు. 

పెద్దల మాట చద్దిమూట అంటారు. 

ఆ "చద్ది" ఈ నవ నాగరిక తరానికి అక్కరలేదు. 

వారికి కావాల్సింది.. పిజ్జాలు, బర్గర్లలాంటి ఫాస్ట్ ఫుడ్. 

కుందేలు గంటకు నలభై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో పరుగెత్తుతుంది. తాబేలు గంటకు 4.8 కిలోమీటర్లే నడవ గలుగుతుంది. కానీ, పెద్దలు చెప్పిన "తాబేలు- కుందేలు" కథలో తాబేలే గెలిచింది కదా..

ఈ పెద్దోళ్ళున్నారే వారికే క్లారిటీ లేదు. "నిదానమే ప్రధానం" అంటారు. 

అంతలోనే "ఆలస్యం.. అమృతం.. విషం.." అని కూడా వారే అంటారు. 

ఇంతకీ ఏది పాటించాలి?

వీళ్ళు చెప్పేది ఈ-మెయిల్స్ కాలంలో ఇన్ ల్యాండ్ లెటర్ రాయమన్నట్లుంది. - అనేది వాళ్ళ ఫీలింగ్. 

నిజమే.

రాసే విధానం వేరు కావొచ్చు. కానీ, ఈ-మెయిల్ అయినా, ఇన్ ల్యాండ్ లెటర్ అయినా వాడేది ఒకే పనికి. 

కమ్మ్యూనికేషన్ కోసం..

ఇన్ ఫర్మెషన్ ఇచ్చిపుచ్చుకోవడం కోసం..

సమాచారం కావాలంటే ఇంటర్నెట్లో బోలెడు దొరుకుతుంది. 

కానీ, సంస్కారం?

సంస్కారం మాత్రం పెద్దలే నేర్పాలి.

ఎలా రాయాలో ఈ తరానికి తెలిసినా ఏం రాయాలో చెప్పాల్సింది మాత్రం పెద్దలే. 

పిజ్జా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. 

కానీ, చద్ది కూడు?

అమ్మ చేసి పెట్టాల్సిందే.. అమ్మ చేయి పడాల్సిందే. అప్పుడే అద్భుతమైన  రుచి, శుచీ. 

అవి ఇంకెక్కడా దొరకవని ఈ-తరం ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో!?.