Read Love Life and Vitamin M - 1 by Nagesh Beereddy in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

Love, Life and Vitamin M - 1

Love, Life and Vitamin M

ప్రేమ, జీవితం మరియు ఎం విటవిన్.

M అంటే ఇక్కడ మోర్.. అంటే ఒక్కటి కాదు మరిన్ని. మరెన్నో. ఎం ఫర్ మనీ, ఎం ఫర్ మ్యానర్, ఎం ఫర్ మోటివేషన్, మేనేజ్మెంట్, మ్యాజిక్, మిరాకిల్.. ఇలా మోర్. మోర్ దాన్ మోర్.. అంశాలు.

ఈ అంశాల చుట్టూ అల్లిన కథలు. అల్లుకున్న చిన్ని కథలు.

చిన్న కథలు.

చిన్న చిన్న కథలు.

చిన్నవి అంటే చాలా చిన్నవి.

షార్ట్ అండ్ స్వీట్ అంటారు కదా.. అలా అన్నమాట.

షార్ట్ ఈజ్ స్వీట్ కూడా కదా.. అందుకు అన్నమాట.

ఎప్పుడో రాసుకున్నవి.

ఎప్పుడూ రాసుకునేవి.

ఇప్పుడూ రాస్తున్నవి.


కవ్వించేవి. లవ్వించేవి. నవ్వించేవి. కదిలించేవి.


ఇప్పుడు పనికొచ్చేవి.

ఎప్పుడూ గురుతుకు వచ్చేవి. .

ఎప్పటికీ మరిచి పోలేనివి. .

“మాతృభారతి” ద్వారా మీతో పంచుకునే అవకాశం.. ఒక అదృష్టం.

ఆదరిస్తారని, అభిమానిస్తారని.. అభిప్రాయం తెలియజేస్తారని.. ఆశిస్తూ..


- నగేష్ బీరెడ్డి

 

మొదటి కథ :

బహుముఖ కథనం

ఒక అబ్బాయి ప్రేమించాడు. పెళ్ళి చేసుకుందామని అనుకున్నాడు. ఆ అమ్మాయి మాత్రం ఒప్పుకోలేదు. అయినా ఆ తర్వాత ఇద్దరూ సంతోషంగా జీవించారు.

ఇది.. ప్రపంచంలోనే అతి చిన్న ప్రేమ కథ.

మరి ఈ కథని ఇంకాస్త.. ఎవరు చెబుతారు? ఎలా చెబుతారు??

ఆ కథ కథనాలు..

కథనం 1

అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ 1

తనను చూడగానే నచ్చింది. ఈ విషయం తనకు చాలా సార్లు చెప్పాలనుకున్నాను. చివరికి ఒక రోజు చెప్పాను. పెళ్ళి చేసుకుందామన్నాను. కానీ, ఆ అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోలేదు. ఒప్పించే ప్రయత్నం చేశాను. చాలా ప్రయత్నించాను. అయినా ఆ అమ్మాయి మనసు మారలేదు. ఎదురు చూశాను.. చూశాను. అయినా తాను మారలేదు. ఇక తనని మర్చిపోవడానికి ప్రయత్నించాను. వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. ఆ తర్వాత నేను సంతోషంగా జీవిస్తున్నాను. చాలా రోజుల తర్వాత తను ఎప్పుడో ఎక్కడో కలిసింది. ఆ అమ్మాయి కూడా పెళ్ళి చేసుకుంది. తను కూడా చాలా సంతోషంగా ఉంది.

కథనం 2

అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ 1

అతడు అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉండేవాడు. ఆరాధనగా చూసేవాడు. ఒకరోజు వచ్చి ప్రపోజ్ చేశాడు. పెళ్ళి చేసుకుందామని అన్నాడు. నాకు ఏమీ అర్థం కాలేదు.. కుదరదు అన్నాను. అయినా సతాయించాడు. వెంటపట్టాడు. వెంటపట్టాడు.. తిట్టేశాను బాగా.. ఇంకోసారి నీ మొఖం నాకు చూపించకు అదే నాకు సంతోషం అని చెప్పాను. ఆ తర్వాత ఏమయ్యిందో ఆ అబ్బాయి ఇక నాకు నిపించలేదు. నేను ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకున్నాను. హ్యాపీగానే ఉన్నాను. మరి తను?.

కథనం 3

అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ 2

తనను చూడగానే మైమరచి పోయాను. వెంటనే వెళ్ళి నచ్చావని చెప్పేను. తనేం మాట్లాడలేదు. పెళ్ళి చేసుకుందామన్నాను. అయినా ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. మళ్ళీ అడిగాను. మళ్ళీ మళ్ళీ అడిగాను. చాలా ప్రయత్నించాను. ప్రయత్నించాను. తన మనసు మారింది. తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకున్నాం. ఇద్దరం సంతోషంగా జీవించాం.

కథనం 4

అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ 2

తను ఎక్కడ తగిలాడో తెలియదు. ఆ కళ్ళెప్పుడూ నన్నే వెతికేవి. చూసి నవ్వేవాడు తప్ప మాట్లాడేవాడు కాదు. ఒకరోజు ప్రపోజ్ చేశాడు.. నాకేం అర్థం కాలేదు. అడగ్గానే ఒప్పుకుంటే అమ్మాయిని ఎలా అవుతాను. కుదరదు అన్నాను. అయినా వదల్లేదు. నచ్చాడు. ఇంట్లో చెప్పాను. చూద్దాం అన్నారు. తన వాళ్ళు అడిగారు. మావాళ్ళు ఒప్పుకున్నారు. పెళ్ళి చేసుకున్నాం. ఇద్దరం సంతోషంగా జీవిస్తున్నాం.

కథనం 5

థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ 1

ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ప్రేమించాడు. తిరిగాడు. తిరిగాడు. చివరికి ఆ అమ్మాయికి చెప్పాడు ప్రేమిస్తున్నానని. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. పెళ్ళి చేసుకుందామని అడిగాడు. అయినా ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఇంట్లోవారు ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళి చేశారు. ఆ తర్వాత ఇద్దరు వేర్వేరుగా ఎవరికివారు సంతోషంగా జీవించారు.

కథనం 6

థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ 2

ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ప్రేమించానని చెప్పాడు. ఆ అమ్మాయి కూడా అతని ప్రేమని ఒప్పుకుంది. ఇద్దరు ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. పెళ్ళి చేసుకుందామనుకున్నారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పించారు. ఇద్దరికి పెళ్ళి చేశారు. ఇద్దరు కలిసి హాయిగా జీవించారు.

కథనం ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది.. ఇంకా ఇంకా.. ఇలా.. ఎన్ని రకాలుగానైనా చెప్పొచ్చు. చెప్పుకుంటూ పోవొచ్చు..

నువ్వు, నేను, అతడు, ఆమె, అది.. చూపు ఒకటే చూసే విధానం వేరు. దృష్టి కోణం.

కథ ఒక్కటే. కథనాలే వేరు. వేరు. అవే పాయింట్ ఆఫ్ వ్యూస్.. పర్స్పెక్టివ్స్.. దృష్టికోణాలు. మన దృష్టిలోనే సృష్టి ఉంది. నువ్వోలా చూస్తావ్. నేనోలా చూస్తా. నువ్వోలా చెబుతావ్ కథ.. నేనోలా చెబుతా.

మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం.