Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 15 - లక్కవరం శ్రీనివాసరావు

కలికివాయి బిట్రగుంట . చెన్నై -కోల్ కటా నేషనల్ హైవేస్ -5
నుండి అరకిలో మీటరు ఎడమవైపు డైవర్షన్ రోడ్లో వెళితే కనిపించే గ్రామం . మరీ పెద్దది కాదు.మరీ చిన్నది కూడా కాదు. ఆ ఊరే ఇంతియాజ్ పుట్టిన గడ్డ. ఒక్క ఇంతియాజే కాదు, రెవెన్యూ మంత్రి షేక్ మస్తాన్, హోంమంత్రి పరాంకుశ రావు, మిషన్ జన్నత్ వ్యవస్థాపకుడు ఇనాయతుల్లా ఆ గడ్డ పైనే ఊపిరి పోసుకున్నారు.
ఇంతియాజ్ తండ్రి ఒక హైస్కూల్ టీచర్. మస్తాన్ తండ్రి ఆ గ్రామం పోస్టాఫీసు నుండి సమీపంలో ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న శింగరాయ కొండ సబ్ పోస్టాఫీసు కు
ఉత్తరాల సంచులు మనిఆర్డర్లు బట్వాడా చేసే చిరుద్యోగి.
పరాంకుశ రావు తండ్రి గ్రామం పోస్టాఫీసు లో పోస్ట్ మాస్టర్. ఆయనకు పోస్టుమాస్టర్ గిరి ఓ పార్ట్ టైం జాబ్ లాంటిది . చాలినంత భూవసతి ఉన్న రైతు సోదరుడు . ఒక్క మాటలో చెప్పాలంటే ఆ గ్రామానికి పెద్ద దిక్కు. పిలిస్తే పలికే నేస్తం. ఊరివారు అభిమానం తో ఆయనను ' పంతులు గారు ' అని పిలుస్తారు. ఇక ఇనాయతుల్లా అబ్బాజాన్ కందుకూరు తాలూకాఫీసులో ( మండలాలు ఏర్పడక ముందు,. అరవై యేండ్ల నాటి కధ ) హెడ్ క్లర్క్..
మస్తాన్, పరాంకుశరావు, ఇనాయతుల్లా బాల్య స్నేహితులు. స్కూల్ ఫైనల్ వరకు ఒకే స్కూల్లో చదివారు .
ముగ్గురిదీ అంతస్తులు, అరమరికలు లేని స్వచ్ఛమైన స్నేహం. వీరి స్నేహం ఇప్పటిది కాదు . అయిదు దశాబ్దాల పైచిలుకు కాలం అంటే గతంలోకి తిరోగమించాలి .
అప్పటి సామాజిక వాతావరణం ఇప్పటిలా రాజకీయాలవల్ల కలుషితం కాలేదు . కొద్దో గొప్పో మానవ సంబంధాల కు విలువనిస్తున్న రోజులవి . దాదాపు అందరూ అంతరాలు మరచి కలసి మెలసి ఉండేవారు . ఈ సామాజిక నేపథ్యం వారి స్నేహాన్ని పచ్చగా జీవంతో ఉంచగలిగింది . ఇప్పుడు-ఈ క్షణం కూడా వారు ముగ్గురూ మంచి స్నేహితులే .
తల్లి దండ్రుల సంస్కారం పిల్లల ఎదుగుదల కీలక పాత్ర వహిస్తుంది . షేక్ మస్తాన్ తండ్రి పేరు కాశిం. చదువుకలేదు
. చిన్న బంట్రోతు పనితో చాలీ చాలని జీతంతో బ్రతుకు బండి ఈడుస్తున్నాడు . షేక్ మస్తాన్ ఒక్కడే సంతానం . కొడుకును చాలా అపురూపంగా చూసుకునే వాడు . తనకు ఉన్నంతలో ఏ లోటూ రానిచ్చేవాడు కాదు . అప్పటి సామాజిక పరిస్థితులలో అతడు చాలా క్రింది స్థాయి వాడు .
మస్తాన్ తారాజువ్వ లాంటి వాడు . అన్నింటిలో చురుకే . అందిస్తే చాలు అల్లుకు పోయేవాడు . తండ్రి అర్థిక పరిస్థితి, సామాజిక స్థాయి మస్తాన్ ను చాలా బాధించేవి . కులాల పట్టింపు , లేకుండా కట్టుబాట్లు రాజ్యం ఏలుతున్న ఆ రోజుల్లో సంఘం అతడిపై విధించిన పరిమితులు, చాలా
సందర్భాల్లో అతడు ఎదుర్కొన్న అవమానాలు షేక్ మస్తాన్ పసిమనసుపై బలంగా నాటుకు పోయాయి . చాలా సందర్భాల్లో తండ్రి నిస్సహాయ పరిస్థితి. చూసి మస్తాన్ బాధపడేవాడు . తీవ్రం గా స్పందించేవాడు . వయసు పెరిగే కొద్దీ అతడిలో సమాజంపై అసంతృప్తి, ప్రతిఘటన అదే స్థాయిలో పెరగ సాగాయి . అతడి లో అలజడి కాశి గమనించాడు . మొగ్గ దశలోనే దీనిని త్రుంచి వేయాలి .
" చూడు మస్తాన్. ! ఈ పట్టింపులు, కట్టుబాట్లు ఇప్పటివి కావు . వీటివల్ల మనలాంటి వాళ్ళు బాధపడుతున్న మాట నిజమే . నా చిన్నప్పుడు మీ నాన్న గారు ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి లో ఉండే వారు . మీ కాలం వచ్చేసరికి ఎన్నో మార్పులు వచ్చాయి . ఇప్పుడున్న ఈ పరిస్థితి మారాలంటే ఇంకొంత కాలం జరగాలి. అందువల్ల ఆవేశం తెచ్చుకొని సమాజం పై అలిగితే మనకే నష్టం. మనలో మనకు ఎన్ని ఉన్నా కలిసిమెలసి బ్రతుకుతున్నాం. ఏం సమస్య వచ్చినా అందరం కలసి పోరాడుతున్నాం. కలిసే సాధించుకుంటున్నాం. ఇందువల్లనే ఊరు పచ్చగా ఉంది . ఊరు బాగుంటే అందరం బాగుంటాం. మనకేదో జరిగిందని ఎదురు తిరిగితే , ఈ తిరుగుబాటు ఇలాగే పెరిగి ఊరు వల్లకాటి దిబ్బ అవుతుంది. ఒక్కటి గుర్తు పెట్టుకో . ఏం సమస్య కైనా సమాధానం చదువు . బాగా చదువుకో . మంచి ఉద్యోగం సంపాదించుకో . నువ్వు వద్దన్నా నీ విలువ పెరుగుతుంది .
అందరూ గౌరవిస్తారు ." అతి సామాన్యుడు , చదువు లేని కాశిం తనదైన శైలిలో " సోషియో - ఎకనామిక్ స్టేటస్" గురించి చక్కగా చెప్పాడు .
ఇక పరాంకుశరావు తండ్రి బ్రాహ్మణుడు. ఆనాటి సమాజంలో రెడ్లు, నాయుళ్ళు లాంటి రైతులకు ఆర్థికంగా సమాజంపై పట్టు ఉన్నా ఊరి పెద్దరికాన్ని బ్రాహ్మణులకే కట్టబెట్టారు . ఇందుకు ప్రబల కారణం తరతరాల చరిత్రలో రాజకీయంగా ఆ వర్గానికి ఉన్న ఆధిపత్యం . రాజ పురోహితులు గా నాటి రాజకీయ వ్యవస్థ లో చక్రం తిప్పింది వీరే . కానీ వారి సంస్కారమే వారి గుణగణాలను ప్రభావితం చేసేది . నిస్వార్థంగా సర్వేజనా సుఖినోభవంతు అన్న ఆదర్శాన్ని త్రికరణశుద్ధిగా పాటించే వారు . సుస్థిర మైన రాజకీయ వ్యవస్థ కు , ఆదర్శ సమాజ స్థాపనకు పునాదిగా
నిలిచినవారు ఆనాడు చాలా కొద్ది మందే . అహంకారం, జాతి వెల్లి వచ్చిన గర్వం, కుతంత్రాలు, కుయుక్తులు నరనరాల్లో జీర్ణించుకున్న వారెందరో !
పరాంకుశరావు తండ్రి మొదటి వర్గానికి చెందిన వారు . అందుకే ఊర్లో వారందరూ ప్రేమతో 'పంతులు" గారు అని పిలిచేవారు . ఏం కులం వాడైనా , ఏం కష్టం వచ్చినా ఆయన
పెంకుటింటి వసారాలో కూలబడి' పంతులు' గారూ అని పిలిచేవారు . ఎలాంటి సమస్య నైనా తమలపాకు తొడిమ గిల్లినంత సులభం గా పరిష్కరించగలడని వారి కొండంత నమ్మకం .
బట్వాడా బంట్రోతు కాశిం ఆయన ఆదరణలో , ఛత్ర ఛాయలో నిండైన మనిషిలా ఎదగగలిగాడు. మస్తాన్ కు కూడా శ్రీనివాసరావంటే చాలా గౌరవం . ఇంటర్ పాసైన తర్వాత మస్తాన్ ను చదివించలేని ఆర్థిక దుస్థితి తో కాశిం బాధపడుతుంటే అతడి భుజం తట్టి మస్తాన్ చదువుకు సాయం చేసింది శ్రీనివాసరావే . అలాంటి వాతావరణంలో శ్రీనివాసరావు కొడుకుగా పెరిగిన పరాంకుశరావు వ్యక్తిత్వం సులభంగా అంచనా వేయవచ్చు .
ఇనాయతుల్లా తండ్రి లియాఖత్ అలీ ఖాన్ రెవెన్యూ ఉద్యోగి . ఆయనకు వృత్తి పరమైన ఒత్తిడి ఎక్కువ . ఆ ఒత్తిడికి మందుగా ఆయన ఎంచుకున్న వినోదం పుస్తక పఠనం. పుస్తకం చేతిలో పెడితే ప్రపంచమే మరిచిపోతాడు ఈ మానవుడు . ఈ పుస్తక పఠనమే ఆయన మానసిక పరిధి ని విశాలం చేసింది . కాలంతో పాటు మతాలకు అతీతంగా మనిషి ఆలోచనలో మార్పు రావాలన్నది ఆయన తాపత్రయం . మనిషి శీలానికి, ప్రగతికి మించినది మరేదీ కాదు , లేదు అన్నది అన్న అభ్యుదయ భావన ఆయన ఆదర్శం. " ఏం పర్ ఫెక్ట్ ముస్లిం విత్ ఎ ప్రోగ్రెసివ్ థాట్ ' ఇనాయతుల్లా ఆయన కొడుకు కనుకనే ' మిషన్ జన్నత్' స్థాపించగలిగాడు .
ఇంతియాజ్ ఓ హిందీ పండిట్ కొడుకు . సాహిత్యం ఆయన ఊపిరి. హిందీ లో ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని మధించి వేశాడు . మృదు స్వభావి , సంస్కారి . మరి- ఆయన కొడుకు ఇంతియాజ్ ను ఏ స్థాయిలో ఊహించుకోవచ్చు .
ఇలా విభిన్న కుటుంబాల నేపథ్యాలతో ఒకే ఊరి నుండి నలుగురు ఘన చరిత్ర గల భాగ్య నగర వేదికపై తమ వంతు పాత్రను ఎలా నిర్వహిస్తారో చూడాలి .
కొనసాగించండి 16