Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ అన్నయ్య అందరి లాంటి వాడు కాదు

"కాయ్ ఝాలా" అన్న అమిత మాటలకు అమూల్య ఈ లోకం లోకి వచ్చింది.

"ఏం లేదు" అని కాఫీ కలుపుతూ ఉంది.

"టెన్ మినిట్స్ నుండి కాఫీ కలుపుతూనే ఉన్నావు. ఇట్స్ గెట్టింగ్ కోల్డ్" అన్నాడు అమిత్ వచ్చి రాని తెలుగులో.

"ఓహ్ సారీ మీకు కాఫీ వేడి గా ఉంటే ఇష్టం కదా, మళ్ళీ వేడి చేసి తెస్తా. ఒక్క నిమిషం" అని గ్యాస్ వెలిగించింది అమూల్య.

కాఫీ అమిత్ కి ఇచ్చాక అమిత్ అన్నాడు "టుడే ఇస్ రాఖీ, మీ అన్నయ్య ఆనంద్ వస్తున్నాడా?"

"ఐ డోంట్ నో, తెలీదు చూద్దాం" అంది అమూల్య నిర్లిప్తంగా.

అమూల్య బెడ్రూం లోకి మంచం మీద పడుకొని ఆలోచిస్తోంది....

అన్నయ్య ఎలా ఉన్నాడో ఏమో. పెళ్లి అయ్యి మూడు నెలలు అయ్యింది. నేను ఇక్కడ పూణే లో, పుట్టిల్లు హైదరాబాద్ లో. అదే తెలుగు వాడిని పెళ్లి చేసుకుంటే ఆషాఢం అనో శ్రావణ శుక్రవారం అనో పుట్టింటికి పంపేవారేమో. ఈ మాయల మరాఠీ ని చేసుకున్నాను. ఒక ఆషాడము లేదు శ్రావణం అంతకన్నా లేదు. ఇంకా శ్రావణ సోమవారం ఉపవాసాలు అని ఇక్కడే ఉంచేశారు.

ఇప్పటివరకు అన్నయ్య నాతో ఎప్పుడూ రాఖీ కట్టించుకోలేదు. ఎప్పుడూ ఏదో సాకు చెప్పేవాడు. పైగా ఇది నార్త్ ఇండియా పండుగ, మనకి ఈ సాంప్రదాయాలు లేవు అనేవాడు. మరి ఇప్పుడు నేను నార్త్ ఇండియా వాడినే కట్టుకున్నాను గా ఈ సారి అయినా వస్తాడా. అన్నట్టు అమిత్ ఈ మాట వింటే నేను నార్త్ ఇండియా వాడిని కాదంటాడు గాని మా తెలుగు రాష్ట్రం దాటి మాకు అందరూ నార్త్ ఇండియన్స్ అంతే...

అన్నయ్య ని చూడాలని బాగా కోరికగా ఉంది. ఎలా ఉన్నాడో పిచ్చి నాన్న. ఇద్దరం కలిసి ఉన్నన్నాళ్ళు కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం. ఇప్పుడు వాడు లేక పోతే తెలుస్తోంది. ఇప్పుడు ఆ కొట్లాటలు తలచుకుంటే నవ్వొస్తోంది. వాడికి చెస్ ఆడటం అంటే పిచ్చి. నన్ను రోజూ ఆడమని ప్రాణం తీసే వాడు. రోజూ నేను ఒడిపోతుంటే నాకు మజా ఎక్కడ వస్తుంది. ఆడనంటే వాడికి కోపం వచ్చి నాలుగు బాది పారిపోయేవాడు. నేను ఏడుపు లంకించుకునే దాన్ని. ఎలాగైనా నాన్నకు ముద్దుల కూతురిని కదా, ఆడ పిల్లని ఏడిపిస్తావా అని నాన్న చేతిలో వాడికి గట్టిగా దెబ్బలు పడేవి. ఆ కసి తో నేను వేసుకున్న డ్రాయింగ్ లు నాలుగు చింపి పారి పోయేవాడు. అప్పుడు బాగా కోపం వచ్చేది.

పెద్దయ్యాక అర్థంఅయ్యింది వాడికి చెస్ లో ఉన్న ప్రతిభను ఎవరూ గుర్తించట్లేదు అన్న ఉక్రోషం వల్ల అలా చేసేవాడు అని. మరి ఇంటికి ఎవరొచ్చినా మీ అమాయి చదువులో ఫస్ట్ మరి మీ అబ్బాయో అనేవారు. అది విన్న వాడికి ఉక్రోషం రాదా ఏం..

కొట్లాటలు, గొడవలు ఎలా ఉన్నా, వాడు అనుభవించే ప్రతి సంతోషాన్ని నాతో పంచుకునేవాడు. ఎవరైనా ఏదైనా కొత్త వస్తువు ఇచ్చినప్పుడు వాడు నాకు షేర్ చేయకుండా ఉండేవాడు కాదు. వాడికి నచ్చిన వెరైటీ తినుబండారాలు అన్నీ నాకు రుచి చూపించందే నిద్ర పోయేవాడు కాదు. చివరకి వాడికి నచ్చిన పాటలు కూడా, హెడ్ ఫోన్ పెట్టి వినిపించి వినిపించి నా చెవులకు తుప్పు వదలచేవాడు. వాడికి నచ్చిన సినిమాలు నిద్ర మాన్పించి మరీ చూపించేవాడు.

నేను అమిత్ ని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు వాడి కళ్లల్లో అమిత్ పట్ల ఈర్ష్య చూశాను. పైకి చెప్పలేదు కానీ తన బొమ్మ ను ఎవరో లాకెళ్ళి పోతున్నట్టు వాడి ఫీల్ అవ్వటం నేను గమనించాను. అప్పుడు వాడికి నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థంఅయ్యింది. కానీ నాన్నలా పైకి చూపించడు గా. అప్పగింతలలో కూడా వాడు కనీసం ఏడవలేదు.

వాడిని ఎంత మిస్ అవుతున్నానో ఇప్పుడు అర్థంఅవుతోంది...

అంతలో గేట్ చప్పుడు కి అమూల్య ఆలోచనల లో నుండి బయటకు వచ్చింది. గుమ్మంలో ఆనంద్ ని చూసి ఆనందం పట్టలేక పోయింది. అతని చేతిలో నుండి బాగ్ లాక్కుని ఆనంద్ కి గది చూపించింది. అమిత్ ఆనంద్ తో మాట్లాడుతూ ఉంటే కాఫీ తీసుకెళ్ళి ఇచ్చి కూర్చుంది.

ఏమిటి విశేషాలు అన్నట్టు చూశాడు ఆనంద్.

ఆనంద్ ని గబగబా తన రూమ్ లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి రాఖీ పళ్ళెం తీసుకొచ్చింది అమూల్య.

"అన్నయ్యా ఈ సారి అయినా రాఖీ కట్టించుకుంటావా లేక మళ్ళీ సాకులు చెప్తావా" అని బుంగ మూతి పెట్టి అంది.

ఆనంద్ అమూల్య కళ్ళల్లోకి సూటిగా చూశాడు.

"నీకోక విషయం చెప్పాలి. ఇన్నాళ్ళూ నేను నీ చేత రాఖీ కట్టించుకొకపోవటానికి ఒక కారణం ఉంది.

నువ్వు నా మీద ఎప్పుడూ దేనికీ ఆధార పడలేదు. అన్నయ్యా, నాకు డబ్బు కావాలి అని ఆశించలేదు. పైపెచ్చు నీ ఉద్యోగం వచ్చాక ఇంట్లోకి డబ్బులు ఇచ్చి నువ్వే సహాయం చేసేదానివి. నీ పెళ్లి ఖర్చులు కూడా నువ్వే పెట్టుకున్నావు.

అలాగే నువ్వు ఎప్పుడైనా వీధిలో కుర్రాళ్ళు ఏడిపిస్తున్నారు అని ఫిర్యాదు చేస్తే నేను వాళ్ళను కొట్టడం తిట్టడం వంటివి కూడా ఎప్పుడూ చేయలేదు.

నేను ఏ రకం గాను నీకు రక్ష ఇవ్వలేదు, అందుకే నీతో రాఖీ కట్టించుకోవాలంటే సిగ్గు పడే వాడిని" అని తల వంచుకున్నాడు.

ఇప్పటిదాకా నేను పని చేసిన సెంటర్ లో నాకు ట్యూటర్ గా మంచి పేరే వస్తోంది. ఇక నుండి నిన్ను, అమ్మా నాన్నా లను కూడా బాగా చూసుకుంటాను అన్నాడు" ఆనందంగా.

అమూల్య ఒక్క క్షణం నిట్టూర్చింది.

"భలే వాడివి అన్నయ్య, డబ్బులు ఇచ్చినంత మాత్రాన, దెబ్బలు కొట్టినంత మాత్రానే రక్షణ ఇచ్చినట్లు అవుతుందా.

నాకు చిన్నప్పుడు మాథ్స్ లో సందేహాలు వస్తే నువ్వు చెబితేనే అర్థమయ్యేది. నాకు నూటి కి నూరు శాతం మార్కులు రావటానికి, ర్యాంక్ రావటానికి కారణం నవ్వు కాదూ.

నువ్వు ఎవరైనా ఏడిపిస్తే కొట్టలేదు అన్నావు, కానీ నన్ను సెల్ఫ్ డిఫెన్సు క్లాసులో జాయిన్ చేసినది ఎవరు, నువ్వు కాదు.. నువ్వు నన్ను రక్షించటం గొప్ప కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేశావు. అదీ గొప్పదనం అంటే.

నాకు చిన్నప్పటి నుండి చదువు మీదే శ్రద్ధ, ఏదో అదృష్టం కొద్ది నాకు కొంచెం ముందు ఉద్యోగం వచ్చింది. నీకు చెస్ లో ఉన్న ప్రతిభకు తగ్గ ప్రోత్సాహం లభించటానికి, నిలదొక్కుకోవటానికి కొంచెం ఎక్కువ సమయం పట్టింది అంతే.

తోబుట్టువు లలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే పోలిక ఏమిటన్నయ్య. రేపు నాకు ఉద్యోగం ఎప్పుడైనా పోవచ్చు, అప్పుడు నన్ను పట్టించుకోవటం మానేస్తావా, మానేయవు కదా.

నాకు అవసరం అయినప్పుడు నువ్వు సహాయం చేయాలి, నీకు అవసరం అయినప్పుడు నేను. అంతే గాని మనం ఒకరితో ఒకరు పోటీ పడటం ఏమిటి ? ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు అర్థమయ్యిందా. చేస్తే ఏం చేస్తానో తెలుసు కదా, నాన్న తో చెప్పి దెబ్బలు పడతాయి" అని నవ్వుతూ ఆనంద్ చేతికి రాఖీ కట్టేసింది.

"అది సరే గాని ఇంతకీ నాకు ఏమి గిఫ్ట్ తెచ్చావు" అంది అమూల్య కుతూహలంగా.

"చిన్నప్పుడు ఒక విలువైన వస్తువు కోసం ఇద్దరం దెబ్బలాడుకునే వాళ్ళం గుర్తుందా, అదే తెచ్చా. హాల్లో ఉంది" అన్నాడు.

అమూల్య అనుమానం నిజమయ్యింది , హల్లో అమ్మా నాన్న ఉన్నారు. వాళ్ళని చూసి అమూల్య ఆనందానికి అవధులు లేవు.

"నీకొక విషయం చెప్పాలి. అమ్మా నాన్న కూడా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నారు. నేను కూడా నా కొత్త కోచింగ్ సెంటర్ ఇక్కడే ప్రారంభిస్తున్నాను." అని ఆనంద్ అసలు శుభ వార్త చెప్పాడు.

"ఓహ్ కంగ్రాట్స్ , ఇన్ని శుభ వార్తలు ఇన్నాళ్ళూ దాచి ఉంచారా" అంది అమూల్య ఆశ్చర్యం గా.

"అసలు ఇదంతా చేయటానికి నాకు సహాయం చేసింది ఎవరో తెలుసా బావగారే, నీకు సర్ప్రైస్ ఇద్దామని ఇన్నాళ్ళూ రహస్యంగా ఉంచాము" అని అసలు విషయం బయట పెట్టాడు ఆనంద్ .

మాయల మరాఠీ అని ఇందాకే తిట్టుకున్నా, కాదన్నమాట మంచి మరాఠీ నే అనుకుంది అమూల్య.