Read AnuPallavi by Soudamini in Telugu Women Focused | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అను పల్లవి

అపార్ట్మెంట్ పార్కింగ్ లో కార్ పార్క్ చేసి లెటర్ బాక్స్ లో లెటర్స్ కోసం వెతికాను. అరవింద నేత్రాలయం నుండి వచ్చిన ఉత్తరం ఉంది.

టు అనురాధా అండ్ అనిరుధ్ అని అడ్రసు లో రాసి ఉంది.

పాత అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి పంపినట్లున్నారు. చేత్తో అందమైన డ్రాయింగ్ వేసి దాని పైన హ్యాపీ న్యూ ఇయర్ అని విషెస్ రాసి ఉన్నాయి. ఎంత అందమైన డ్రాయింగ్ వేశారు, నా బుజ్జి పిల్లలు - కళ్ళు ఉన్న వారి కంటే ప్రపంచాన్ని ఎంత అందంగా చూపించారు అని మురిసిపోయాను.

అనిరుధ్ కి నాకు ప్రేమ కు గుర్తు గా మిగిలింది వీళ్ళు. మూడు సంవత్సరాల క్రితం నా బర్త్డే కి అనిరుధ్ నన్ను ఈ ఆశ్రమానికి తీసుకు వెళ్ళాడు. అందులో నుండి ఐదుగురు పిల్లలను దత్తత తీసుకొని వారికి చదువు చెప్పిస్తున్నాం. వారి నుండి వచ్చినవే ఈ కార్డ్ లు. ప్రతి గా నేను కూడా వాళ్ళకి విషెస్ పంపాలి అనుకుంటూ లిఫ్ట్ ఎక్కాను.

లిఫ్ట్ ఎక్కగానే పక్కింటి శారద గారు కలిశారు. మొహమాటం గా చిన్న నవ్వు నవ్వాను, ఆవిడ కూడా చిరునవ్వు తో సమాధానం ఇచ్చారు. ఇంటి తలుపు తీసి లెటర్ టేబల్ మీద పెట్టి ఫ్రిడ్జ్ లో నీళ్ళు తీసుకొని సోఫా లో కూల బడ్డాను.

గుమ్మం వద్ద శారద గారు లోపలికి రావాలా వద్దా అన్న సంశయం లో ఉండటం చూసి రమ్మని పిలిచాను.“నువ్వు వచ్చి నెల రోజులయ్యింది, అప్పటి నుండి ప్రయత్నిస్తున్నాను, నిన్ను పరిచయం చేసుకుందామని” అన్నారు.

“నా పేరు అనురాధ ఆంటీ” అని పరిచయం చేసుకుని ఆవిడకు మంచి నీళ్ళ గ్లాస్ అందించాను.

గుమ్మానికి ఎదురు గా అమ్మా నాన్నల ఫోటో లకి దండలు చూసి ఆవిడ కొంత విషయం గ్రహించినట్లున్నారు.

“ఒక్క దానివే ఉంటున్నావా అమ్మా” అని ఆవిడ సందేహాన్ని అడిగేశారు.అవును ఆంటీ అని చెప్పాను.

"ఇంకా పెళ్లి కాలేదా అమ్మాయి?" అన్నారు శారద గారు."అయ్యింది ఆంటీ.. మేము విడిపోయాము" అని ఆవిడ ఆడగబోయే తరువాతి ప్రశ్న కు కూడా సమాధానం చెప్పాను.

“అయ్యో పాపం, అబ్బాయి ఏ లోపం ఉన్న వాడో, శాడిస్ట్ అయి ఉంటాడు, పోనీలే” అన్నారు ఆవిడ కాసేపు తర్వాత తేరుకొని.

“లేదు ఆంటీ అతను మంచి వాడే, మా ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చాయి. అందుకే విడిపోవలసి వచ్చింది, అంతే" అని ఆవిడ వైపు చూశాను. నా నిర్ణయాలకి అవతల వాళ్ళని బాధ్యులని చేయటం నాకు ఇష్టం ఉండదు మరి.

ఆవిడ నుండి నేను ఊహించిన ప్రతిస్పందనే వచ్చింది. ఆవిడ కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాక “అన్నట్లు మరచి పోయాను, పని అమ్మాయి వచ్చే వేళ అయ్యింది, నేను మళ్ళీ వస్తాను” అని చెప్పి గ్లాస్ పెట్టి వెళ్ళి పోయారు.

కానీ ఆవిడ ముఖం లో మార్పుని గమనిస్తూనే ఉన్నాను. ఆవిడ వచ్చినప్పుడు నా మీద ఉన్న కుతూహలం, సింపతీ ఇప్పుడు లేవు. నేను తప్పు చేశానన్న భావన ఆవిడ ముఖం లో స్పష్టం గా కనిపించింది.

భర్త లేకుండా ఉన్న స్త్రీ అంటే తీగ తెగిన వీణ లాంటిదా - ఉన్నా విలువ ఉండదా. విడాకుల లో తప్పు ఆడదో లేక మగదో ఎందుకు కావాలి? పరిస్థితులది ఎందుకు కాకూడదు ? ఈ విషయం అర్థం చేసుకునే మనస్సు ఎవరికి ఉంటుంది, అయినా ఎందుకు ఉండాలి? నా మనస్సాక్షి కి తెలిస్తే సరిపోదా...

ఫోన్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ వాట్సాప్ మెసేజ్ చూసి ఒక సారి షాక్ అయ్యాను. నా చిన్ననాటి స్నేహితురాలు పల్లవి నుండి మెసేజ్. ఆమె ఈ లోకాన్ని వదలి వెళ్ళిపోయింది అని వాళ్ళ అమ్మ గారు పంపిన మెసేజ్. ఆ మెసేజ్ చదివి గుండె దడ తగ్గకుండా కొట్టుకుంటూనే ఉంది. అదుపు తప్పి కొట్టుకుంటున్న గుండెను లయబద్ధం చేయటానికి కొద్ది సమయం పట్టింది. ఆమె జీవితం ఇలా ఉన్నట్లుండి మూగబోయింది ఏమిటి?

పల్లవి, నేను చిన్నప్పుడు పక్క పక్క వీధుల్లోనే ఉండేవాళ్లం. పల్లవి వాళ్ళది ఉన్న కుటుంబం. వాళ్ల నాన్న గారు ఎల్ ఐ సి లో ఆఫీసర్ గా పని చేసే వారు. మా నాన్నది ఆయన ఆఫీసు లోనే చిన్న ఉద్యోగం. పల్లవి, వాళ్ళ అమ్మ గారు, నాన్న గారు నన్ను కూడా ప్రేమ గా చూసేవారు. ఇద్దరం కలసి రోజూ సంగీతం క్లాస్ కి వెళ్ళి వచ్చేవాళ్ళం. ఒకే కంచం, ఒకే మంచం అన్నట్లు పెరిగాం. కాలేజీ అయిపోయాక ఇద్దరం వేరు వేరు చోట్ల స్థిర పడి పోయాం. అప్పుడప్పుడు వాట్సప్, ఫేస్బుక్ లోనే పలకరింపులు. పల్లవి అలా పంపిన తమ చిన్నప్పటి పాత ఫోటో నే చూస్తూ ఉండిపోయాను. నా మనసు అంతా ఎవరో తొలిచేసినట్లు బాధ గా ఉంది.

ఆలోచనల నుండి బయటకు వచ్చి పల్లవి వాళ్ళ ఊరు రామాపురానికి బయలుదేరాను.బస్ కదులుతుండగా నా ఆలోచనలు అంతకు మించి వేగం గా కదులుతున్నాయి. ఇయర్ ఫోన్ తో కర్ణాటక సంగీతం పాటలు పెట్టుకొని వింటూండగా గతం గుర్తుకొస్తోంది.

ఇంటర్ చదివే సమయం లో మేము శ్రీరామనవమి సందర్భం గా రామాలయం లో పిబరే రామ రసం పాట కచేరీ ఇస్తున్నాము. అయితే పల్లవి ధ్యానం ఆ గుడి లోని రాముడి పై కాకుండా అదే గుడి లో వేరేవరి మీదో ఉండటం గమనించాను. శంకరాభరణం లో శారద లాగా ఆమె పాట లో కూడా అపశృతి దొర్లింది.

కచేరీ అయిపోయాక అడిగాను “ఎవరే అతను?” అని అడిగాను.

“అతని పేరు చరణ్. ప్రక్క వీధి లోనే ఉంటాడు. నేనంటే అతనికి పిచ్చి ప్రేమ. నన్ను నెల రోజు లు గా వెంబడిస్తున్నాడు తెలుసా?” అని గర్వం గా చెప్పింది.

“నువ్వు ఇంకా మేజర్ వి కూడా కావు, ఈ గోల అంతా ఎందుకు? ఇంతకీ అతను ఏం చేస్తాడు ?” అని కోపం గా అడిగాను.

“అతను పెద్ద చదువుకోలేదు. కార్ డ్రైవింగ్ నేర్పుతాడు, అందుకే నన్ను కాలు కూడా క్రింద పెట్టకుండా చూసుకుంటాడు” అని సిగ్గుతో తలవంచుకొని చెప్పింది.

అంటుండగానే అతను ఆమె పక్కనే కార్ ఆపాడు.“ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. తరువాత ప్రేమ దోమ అన్నీ ” అని గట్టిగా చనువు తో చెప్పాను.

“మా ప్రేమ నిర్మలమైనది తెలుసా. మేమిద్దరం పల్లవి చరణాల లాగా కలసి పోతాం, చూడు పేర్లు కూడా ఎంత బాగా కలిసాయో...అయినా నీ వెంట ఎవరూ పడకుండా నా వెంటే పడుతున్నారని నీకు బాధ గా ఉంది కదా .” అని నిర్లక్ష్యం గా నా వైపు ఒక చూపు విసిరి కార్ ఎక్కి వెళ్ళిపోయింది.

నాకు తన మీద కోపం రాలేదు కానీ ఆమె అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. తనకి తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దురుపయోగం చేస్తోందని అనిపించేది.నా మటుకు నాకు నాన్న ముఖం లో సంతోషం చూసినప్పుడే గర్వం గా ఉంటుంది.. నాకు ఊహ తెలియని వయసు నుండి నాన్న అమ్మ లేని లోటు తెలీకుండా పెంచాడు. పొద్దున్నే వంట వండి, ఇల్లు సర్ది వెళ్లిపోయేవాడు. సాయంత్రం మళ్ళీ వేడి వేడి గా అన్నం వండి తన చేత్తో తినిపించేవాడు, రాత్రికి నీతి కధలు చెప్పేవాడు. నాన్న కు నేను తప్ప వేరే లోకం తెలీదు, పెద్దగా స్నేహితులు కూడా ఉండేవారు కాదు. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని చుట్టాలు అందరూ సలహా ఇచ్చినా వారిని గట్టిగా వారించేవాడు. నాన్నకు నా పాటలంటే ప్రాణం. రోజు నాతో పాట పాడించుకొని సేద తీరేవాడు. నాన్న కు నేను ఇవ్వగలిగే చిరు కానుక అదే. అటువంటి నాన్న ని పెద్దయ్యాక బాగా సుఖ పెట్టాలని కలలు కన్నాను.

పల్లవి వాళ్ళ అమ్మ గారి చెవిలో ఈ విషయం నెమ్మది గా చెప్పాను. దానితో ఇంట్లో ఆమె ను బాగా కట్టడి చేశారు. వారు ఆమెకు వివరించి చెబితే బాగుండేదేమో...ఆ రోజు తో గొడవ సమసిపోతుందని భావించాను.ఇంటర్, ఎం సెట్ వల్ల నేను బిజీ అయిపోయి కొన్నాళ్ళు కచేరీ లకు దూరం గా ఉన్నాను. ఇంటర్ అయ్యాక నేను ఎంబిబిఎస్ లో జాయిన్ అయ్యాను. పల్లవి డిగ్రీ లో జాయిన్ అయ్యింది. ఇక మాకు కలవటం కుదరలేదు.

ఒక రోజు సాయంత్రం పల్లవి వాళ్ళ అమ్మ గారు గీత గారు కాల్ చేశారు.“అను, ఒక సారి ఇంటికి అర్జెంట్గా రా అమ్మా” అనిఇంటికి వెళ్ళే సరికి గీత గారి కళ్ళు వాచి, ముఖం అంతా ఉబ్బి పోయి ఉంది.

“ఏమయ్యింది ఆంటీ”, కంగారుగా అడిగాను.“పల్లవి కాలేజీ నుంచి ఇంటికి రాలేదు. స్నేహితులు ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు. నాకేమీ పాలు బోక నిన్ను పిలిచాను” అని దిగులు గా అన్నారు.

రాత్రంతా ఆంటీ తోనే గడిపాను. ప్రొద్దున్న పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది.కంగారు గా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాం.

పల్లవి, చరణ్ పూల దండలతో కనబడిన సన్నివేశం చూసి గీత గారు కుప్ప కూలిపోయారు. ఇంట్లో వాళ్ళు ఆమె ప్రేమ విషయం తెలుసుకని వద్దని మందలించటం తో మేజర్ అయిన తరువాత ఒక రోజు ఇంట్లో నుండి పారి పోయి పెళ్లి చేసుకుంది.

అభిమానం దెబ్బ తిన్న పల్లవి తండ్రి ఇద్దరినీ ఇంట్లోనికి అడుగు పెట్టనీయ లేదు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా, అతనిని వదలను అని చెప్పింది.

ఇంతలో గర్భవతి అయ్యిందని కూడా తెలిసి ఇంక చేసేది ఏమి లేక తల్లి దండ్రులు రాజీ పడిపోయారు.

తరువాత తాను సంతోషం గానే ఉన్నట్లు నాకు అనిపించింది. నెమ్మది గా తల్లిదండ్రులతో రాకపోకలు కొనసాగాయి. ఫేస్బుక్ లో వాట్సప్ లో ఫోటో లు షేర్ చేస్తూనే ఉండేది. ప్రేమించిన వాడితో సుఖం గానే ఉందని అనుకున్నాను. మరి అంతలో ఇంత ఘోరం ఎలా జరిగినట్లు?

ఇంతలో నా ఫేస్బుక్ నోటిఫికేషన్ టింగు మంటూ శబ్దం చేసింది. అనిరుధ్ అప్పుడే పుట్టిన వాళ్ళ పాప ఫోటో షేర్ చేశాడు. నేను ఫ్రెండ్స్ లిస్ట్ లో నుండి తీసేశాను, కానీ నా ఫ్రెండ్స్ ఎవరో లైక్ చేశారు. పాప ముద్దు గానే ఉంది, కానీ ఎంత తమాయించుకున్నా అది భరించలేకపోతున్నాను. అనిరుధ్ తో ఎంత జీవితాన్ని ఊహించుకున్నాను? అవన్నీ తలక్రిందులు అయిపోయాయి.ఇద్దరం కాలేజీ నుండి స్నేహం, కొన్ని రోజులకు ఆ స్నేహం కాస్త ప్రేమ గా మారింది.

హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే అంటూ అతను ప్రపోస్ చేసిన సంఘటన గుర్తుకొచ్చి ఎక్కడి నుండో పెదవుల్లో చిన్న నవ్వు మొలిచింది. అతను గులాబీ ఇచ్చినప్పుడు నా హృదయ వీణ ను అతను సుతిమెత్తగా సృశించినట్లు అనిపించింది.పెద్దల అంగీకారం తో ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నాం. అలాగ రెండు సంవత్సరాలు చాలా ఆనందం గా గడిచిపోయాయి.

ఒక రోజు ఆఫీసు నుండి త్వరగా వచ్చి తనకి లండన్ లో హాస్పిటల్ నుండి మంచి ఆఫర్ వచ్చిందని చెప్పాడు. “ఇప్పుడు మన కి డబ్బులకి ఏం తక్కువని, ఇండియా వదిలి వెళ్ళటం అవసరమా?” అన్నాను.

“అది కాదు అను, మనకు రేపు పిల్లలు పుడితే, బోల్డు ఖర్చులు అవుతాయి.”

“ఇక్కడే ఉంటే ఎన్ని రోజుల కూ ఎదుగు బొదుగు ఉండదు. “

“నువ్వు కూడా వచ్చేయ రాదు. అక్కడే సెటిల్ అయిపోవచ్చు” అన్నాడు.

“అది కాదు అనిరుధ్. నీకు తెలుసు కదా, నాన్న ని వదలి రావటం నాకు ఇష్టం లేదు. నాన్న కి ఏమైనా అయితే నా నిర్ణయం వల్లే అయ్యిందన్న అపరాధ భావం తో నేను జీవితాంతం గడపలేను”.నా కారణం నాది.

“ఒక వంట మనిషిని, పని మనిషిని పెడదాం. మీ నాన్న గారిని ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచుదాం. ఇక నీ ఉద్యోగం అంటావా- రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే అదే వస్తుంది. అప్పటి దాకా నా జీతం ఉంది కదా. “ అనేది అతని ఆర్గ్యుమెంట్.

నేను అతని వాదన తో ఏకీభవించలేక పోయాను.అతని వైపు నుండి చూస్తే అతని ఆలోచన సరి అయినదే కావచ్చు. నా వైపు నుండి నాకు నా నార్ణయమే సరి అయిందని అనిపించింది. అతను భవిష్యత్తు గురించి కలలు కన్నాడు, నేను గతాన్ని విస్మరించి బాధ్యతలను వదులుకోలేక పోయాను.

కొన్ని రోజులు అతను లండన్ లో నేను ఇండియా లో ఉండి ప్రయత్నిద్దాం అనుకున్నాం. కానీ అతను లండన్ లో చేరిన తరువాత అక్కడ కొలీగ్ తో పరిచయం నెమ్మది గా ప్రేమ గా మారింది. మా మనసుల మధ్య కూడా దూరం పెరిగి అది విడాకులకు దారి తీసింది.

సరేలే ఏదైనా, నేను కావాలని తీసుకున్న నిర్ణయం అది. ఆ నిర్ణయం తీసుకోకపోయి వుంటే, ఇప్పుడు నాన్న ని చివరి రోజుల్లో వదిలేశానన్న అపరాధ భావం తో నేను, లేక తన కెరీర్ ని వదలుకున్నానన్న బాధ తో అతను రాజి పడవలసి వచ్చేది కదా.బస్ వెళ్లాలనుకున్న గమ్యానికి చేరింది.

బస్ దిగి నేరు గా గీత గారి ఇంటికి వెళ్ళాను.గది లో ఒక మూల పూల దండ అలంకరించి ఉన్న పల్లవి ఫోటో ను చూసి నేను కూడా ఏడుపు ఆపుకోలేక పోయాను. గీత గారిని పట్టుకొని ఏడిచేశాను.

కాసేపటి తరువాత తమాయించుకొని అడిగాను – “ఇలా ఎలా జరిగింది ఆంటీ” అని

గీత గారు ఏడుపు తమాయించుకుంటూ చెప్పారు - పెళ్లి అయిన సంవత్సరానికి పల్లవి కి ఆర్థిక పరిస్థితి మీద ఒక అవగాహన వచ్చింది. అతను కార్ డ్రైవరు అని, తన స్థితి గతులకు, కోరిక లకు తూగ లేడని తెలిసి వచ్చింది. కొద్ది సంవత్సరాలకు ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గి ప్రాక్టికల్ జీవితం లోనికి వచ్చారు. అతనికి కూడా ఆమె పై మోజు తగ్గి పుట్టింటి నుండి డబ్బు తెమ్మని వేధించేవాడుట. ఆత్మాభిమానాన్ని చంపుకోలేని పల్లవి ఉద్యోగం చేయటం మొదలు పెట్టింది. అయితే చదువు మధ్యలోనే ఆపి వేయటం వాళ్ళ ఆమె ఏదో చిన్న ఉద్యోగం చేయ వలసి వచ్చింది. తరచూ ఇంట్లో భార్య భర్త ల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉండేవిట. ఆ ఘర్షణ ల వాళ్ళ మానసిక ప్రశాంతత దెబ్బ తినటం వల్లో మరి ఏమో చివరకు పల్లవి కి బ్రైన్ ట్యూమర్ వచ్చింది. కానీ పల్లవి ఆ విషయాన్ని తల్లిదండ్రుల వద్ద దాచి పెట్టింది. పల్లవి ఆరోగ్యం విషమించే సరికి అతను సరైన వైద్యం అందించ లేక ఆ పరిస్థితి లో పల్లవి ని , ఆ పిల్లని తల్లి దండ్రుల వద్ద అప్పగించి వెళ్ళిపోయాడు. చివరి నిమిషం లో ఎంత ప్రయత్నించినా, వారు ఆమె ను బ్రతికించ లేక పోయారు.

ఇంత జరిగినా అతను మళ్ళీ పిల్లని చూడటానికి కూడా రాలేదు.

“ఈ వయసులో ఇంత చిన్న పిల్లని ఎలా పెంచాలమ్మ, ఈ జీవితం ఎప్పటికి గట్టెక్కేను” అని ఆవిడ బాధ పడుతూనే ఉన్నారు.

జరిగిన విషాదం తో సంబంధం లేకుండా ఆడుకుంటున్న పల్లవి కూతురు కీర్తన ని చూశాను. కీర్తన నిజం గా బొమ్మలా, ముద్దు గా ఉంది. గుండ్రని కళ్ళు, బూరెల లాంటి చెక్కిళ్లు, అందమైన నవ్వు. నా కళ్ల ముందు నుండి ఆ ఏడేళ్ళ పాప రూపం మరలచుకోలేకపోతున్నాను.

చటుక్కున వెళ్ళి ఎత్తుకున్నాను."నేనెవరో తెలుసా, మీ అమ్మ చిన్నప్పటి ఫ్రెండ్ ని" అని ఒక చాక్లెట్ ఇచ్చి కీర్తన కళ్ళల్లోకి చూశాను."ఓ, నాకు తెలుసు అమ్మ మీ గురించి చెప్పేది" అని చేతిలో చాక్లెట్ తీసుకొని పరిగెత్తింది.

"ఆంటీ, మీకు అభ్యంతరం లేకపోతే ఒక విషయం చెబుతాను. తల్లి దండ్రులు లేని బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కీర్తన కి ఇంత చిన్న వయసు లో ఆ లోటు తెలియనివ్వకూడదు. నాకు కీర్తన ని చూస్తే జీవితం లో క్రొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మీరు అందరూ నాతో ఉంటే నా జీవితం కూడా పరిపూర్ణమవుతుంది." అని నా మనసులో మాట చెప్పాను.

గీత గారు నన్ను దగ్గరకు తీసుకున్నారు.“నాకు అభ్యంతరం ఏముంటుందమ్మా, కానీ నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం” అన్నారు గీత గారు లాలనగా.

“అనిరుధ్ ఇంకా నా మనసులో ఉండగా వేరే ఎవరినో పెళ్లి చేసుకోలేను ఆంటీ” అన్నాను.

కాలచక్రం లో పదేళ్లు గిర్రున తిరిగాయి. కీర్తన రవీంద్రభారతి లో తన మొదటి కచేరీ ఇస్తోంది. మొదటి వరుస లో కూర్చున్న నాకు గర్వం తో కన్నీళ్లు ఉప్పొంగి వస్తున్నాయి.

ఆధునిక స్త్రీ కి జీవితం లో అడుగడుగునా చాయిస్ లే . చదువు, ప్రేమ, పెళ్లి, పిల్లలు, ఉద్యోగం, తల్లిదండ్రులు, అత్త మామలు ఇలా.. ఆ చాయిస్ లను ఎంచుకొనే వివేకం, వాటిని ఎదుర్కునే మానసిక స్థైర్యం ఎంతో అవసరం.