Read Kshantavyulu - 2 by Bhimeswara Challa in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

క్షంతవ్యులు - 2

క్షంతవ్యులు – Part 2

చాప్టర్ 2

కొన్ని కొన్ని సంఘటనలు, ముఖ్యంగా మనమెన్నడూ ఆశించననవి, జీవిత కాలక్రమాన్నే మార్చేస్తాయి. తిన్నగా సాఫిగా సాగుతూన్న జీవితపు బాట వక్రమార్గాలు తొక్కుతుంది. దీనికి కారణం వెతకటం అవివేకమూ, అవాంఛనీయమూ కూడాను. లోకాన్ని చూసిన పెద్దలు క్రింద పెదిమ నొక్కిపెట్టి ‘విధిచేష్టలు’ అంటారు. ఏమో అయివుండవచ్చు, కానీ ఈ విధి, ఈనియంత, ఇంత పక్షపాతంగా ఎందుకు ఉంటాడా అని అసహ్యం వేస్తూవుంటుంది. ఎవరైనా సుఖపడుతూంటే ఇతగాడు ఓర్వలేడు.

ఏమయితేనే, సుశీ సాంగత్యమూ, స్నేహమూ నాకు లభించాయి. ఎనిమిది సంవత్సరాల తర్వాత పసి యవ్వనంలో తిరిగి ఈమె నాకు దొరికింది. సంతోషించానని వేరే చెప్పాలా? ఆనందంగా, ఆహ్లాదంగా, కులాసాగా ఆ సంవత్సరము గడిపేశాము. క్లాసులో సుశీకి ఎప్పుడూ నాకంటే ఎక్కువ మార్కులు వచ్చేవి. సుశీ కొంటెగా ‘‘నన్ను చూసి మార్కులు వేస్తున్నారు, జర్మన్ ప్రొఫెసర్ కి నేనంటే చాలా ఇష్టం తెలుసా’’ అంది.

ఓసారి క్లాసులో జర్మన్ ప్రొఫెసర్ బ్లాకు బోర్డు మీద ‘ఇష్ లీజర్ జీ మేర్’ అని జర్మన్ లో రాసి, సుశీని ఇంగ్లీషులోకి తర్జుమా చేయమన్నాడు. అంటే దాని అర్ధం, ‘నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’ అని, సుశీ నిస్సందేహంగా తర్జుమాచేసింది. క్లాసు అయిపోయింది. తర్వాత “ఈ రాత్రి ప్రొఫెసర్ నిద్రపోడు, బట్టతల గోక్కుంటూ కూర్చుంటాడు,” అంది.

రోజులు వారాలుగాను, వారాలు నెలలుగాను శరవేగంతో మారిపోతున్నాయి. సాయం సమయాల్లో సుముద్రతీరానికి వెళ్లేవాళ్లం. విరామరహితంగా విరుచుకుపడే కెరటాలను చూస్తూ చీకటిపడేదాక ఉండిపొయే వాళ్లం. ఒక రోజు సాయంకాలం లాజన్సేబేవద్ద ఇసుకలో కూర్చొని ఉన్నాము. ఎందుచేతో సుశీ ఆ రోజు పరధ్యాన్నంగా ఉన్నట్లు కనబడింది. చీకటి పడిపోయింది. కాని లేచి రూముకు పోవాలనిపించడం లేదు. సుశీకూడ లేచే ప్రయత్నం చేయలేదు.

‘‘ఇసుకలో ఏమని రాశానో చెప్పుకో,’’ అన్నాను.

నా పక్కనే ఉన్న సుశీ ముఖకవళికలు స్పష్టంగా కనబడటంలేదు. కాని పెదిములు విడచుకుని తెల్లటి రెండు పళ్ల వరుసలు కనబడ్డాయి. బుగ్గలమీద రెండు గుంటలు పడ్డాయని ఊహించుకున్నాను. ఎందుకంటే చిరునవ్వుకి వాటికి ఏదో అవినాభావ సంబంధము ఉందని నాకు తెలుసు.

‘‘ఇంకేమి రాస్తావు? నీవు ఎప్పుడూ ఆలోచించే ఆ ఒక్కటేగా,” అంది.

‘‘తప్పు చెప్పావు, సుశీల అని రాయలేదు. సుశీ అని రాశాను,’’ అన్నాను.

“రెండింటికి తేడాయేమిటో?” అంది.

‘‘సుశీల నా క్లాసుమేటు, సుశీ నా బాల్య స్నేహితురాలు, ఫిజిక్సునోట్స్ తోపాటు తిరిగి నేను ఆమెకు దొరికాను,’’ అన్నాను.

‘‘అవును, ఇంతకీ నువ్వు నాకు నీ ఫిజిక్సు నోట్సుఇవ్వనేలేదు రామం. ఆనాడు మరచిపోయాను,’’ అంది.

‘‘దాంతో ఇక అవసరమేముంది సుశీ, అది నీకు వంక మాత్రమే కదా,’’ అన్నాను.

‘‘నన్ను గురించి నువ్వేమనుకున్నావు? ‘మీ రూముకు తీసుకెళ్లమంటె’ నువ్వేమని భావించావు,’’ అంది.

‘‘చాలా ఆశ్చర్యపోయాను, ఒక అపరిచిత యువతి అలాంటి పని చేస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు. ఆ సుందరాంగి సుశీ అనే అనుమానమే నాకు కలుగలేదు,’’ అన్నాను.

‘‘అవును; అదే స్త్రీ పురుషులకున్నతేడా, పురుషుని జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే. కాని స్త్రీకి అదే సర్వస్వము. జీవిత కాలంలోని అనుక్షణము అందుకే అర్పిస్తుంది. స్త్రీ హృద‌యాన్ని అలా ఎందుకు సృష్టించాడో నాకు తెలియదు. బహుశా సృష్టికర్తకి కూడా స్త్రీ అంటే చిన్న చూపేయేమో. ఎందుకంటె దానివలన స్త్రీకి లభించేది దు.ఖం మాత్రమే,’’ అంది.

సుశీ మాటల్లోని సత్యాన్ని ఇప్పుడు గ్రహించినంత సుస్పష్టంగా నేను అప్పుడు గ్రహించలేదు. నాకు అది నిరూపించవలసిన దౌర్భాగ్య స్థితి కలిగింది. నేను మౌనంగా ఉండిపోయాను. ఆమె మాటలకంటే ఆమె కంఠస్వరం నన్ను వ్యాకులపరచింది. ఆ విధంగా ఆమె ఎప్పుడూ అంతకుముందు మాట్లాడలేదు. సీరియస్గా దేని గురించి సుశీ మాట్లాడేది కాదు. అలాంటి చిన్న విషయాలను గురించి చింతించటం ఆమె స్వభావానికే విరుద్ధం. నేను అన్నమాటలు ఆమె హృద‌యాన్ని గాయపరిచాయని గ్రహించాను. అనాలోచితంగా అపరిచిత యువతి అన్నాను – చిన్ననాటి సుశీని చాలావరకు మరచిపోయిన మాట నిజమే.

చీకటి నలుమూలలా దట్టంగా వ్యాపించింది. కనుచూపు మేరలో ఉన్న సముద్ర తీరమంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంది. నురుగలు కక్కుకుంటూ సముద్రం భీకరంగా ఉంది. దూరాన వున్న ఓడలోని దీపాలు, ద్వీపంలోని భవనపు దీపాన్ని జ్ఞాప్తికి తెస్తున్నాయి. మలుపు తిరుగుతున్న కారులైటు కాంతి మా ఇద్దరిమీద ఒక సారి పడింది.

‘‘చాలా ఆలస్యమయినట్టుంది... సుశీ ఇక పోదామా ...’’ అన్నాను.

‘‘అప్పుడేవద్దు. రేపు ఆదివారం కదా? ఇంకా కాసేపు కూర్చుందాము,’’ అంది.

నేను ఇంకేమీ మాట్లాడలేదు. రూముకు పోవాలనే తొందర నాకూ లేదు. కొన్ని నిమిషాలు గడిచిపోయాయి. నిద్రిస్తున్న నిశ్వబ్దాన్ని భంగపరుస్తూ సముద్రం ఘోషపెడుతూంది. ఎవరో ఒక జంట మా ముందు నడిచి వెళ్లేరు. సముద్రానికి ప్రేమికులకు యుగయుగాల నుంచీ సంబంధముంది. సాగర గర్భంలో ఎంత మంది ప్రేమికులు ఇమిడి ఉండలేదు. సముద్రం మీద ఏకాంత యాత్ర ఎంత మధురంగా ఉంటుంది. సముద్ర తీరం ప్రేమ కలాపాలకి ఎంత అనువైన స్థలం!

‘‘చదువైపోయిన తర్వాత నువ్వేం చేస్తావు, ’’ అంది సుశీ హఠాత్తుగా.

‘‘ఏం చేస్తాను సుశీ . అందరూ చేసేదే నేనూ చేస్తాను, ఏదో ఒక ఉద్యోగం దొరకక పోతుందంటావా?’’ అన్నాను.

“నువ్వు ఉద్యోగం చేస్తావా? అయితే చూడాలని ఉంది. కాని అది నీకు సరిపడదు,’’ అంది సన్నగా నవ్వుతూ.

‘‘ఉద్యోగం చేయక ఇంకేమిచేస్తాను సుశీ? హోటలు పెట్టమంటావా?’’ అన్నాను నవ్వుతూ.

‘‘అదికాదు, నువ్వు బహుశా కవివి అవుతా వేమో . లేకపోతే రచయిత అవుతావు . చిన్నతనంలో నువ్వు పాడుకధలు చెప్పి అందరినీ భయపెట్టే వాడివికాదా,’’ అంది.

‘‘లేదు సుశీ! అదేమీ సులభం కాదు. కవి కావాలన్నా, కవిత్వం రాయాలన్నా సత్యాన్ని అసత్యం నుంచీ, సంభవాన్ని అసంభవము నుంచీ, శుచిత్వాన్ని కల్మషం నుంచీ, విడదీసి విశదీకరించ గలిగే ఆత్మ పరిశోధనా శక్తి కావాలి. విజ్ఞానం అనుభవంగానూ, అనుభవం విజ్ఞానంగానూ, రెప్పపాటు కాలంలో మార్చగలిగే శక్తి కావాలి. బాహ్యనేత్రానికి కనబడని దానిని మనో నేత్రంతో పరిశోధించ గలిగే శక్తి కావాలి. అదిలేకుండా కలం కాగితంమీద పెట్టడం దుర్లభం, అది దుస్సాహాసం అవుతుంది. కేవలం మనం దేనినీ ఊహించి సృష్టించ‌లేము. అస్థిపంజరం లేకుండా శరీరాన్నీ ఊహించుకోలేము అలాగే ఆత్మలేకుండా మానవుడే ఉండడు,’’ అన్నాను.

‘‘కవిత్వం చేతకాదంటూ కవిత్వం మీద ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చారు,’’ సుశీ ఈ మాటలు అంటూంటే ఒక పెద్ద కెరటం వచ్చి మా ముందర విరుచుకుపడింది. తరువాత భయపడుతూ, భయపడుతూ బుల్లి బుల్లి కెరటాలు సుశీ పాదాలను ముద్దుపెట్టుకున్నాయి.

‘‘సుశీ! నాకు ఈ సముద్రాన్నీ, ఈ నురుగనీ చూస్తుంటే టాగూర్ రాసినది జ్ఞాపకం వస్తూంది. సముద్రతీరం సముద్రాన్ని అడిగిందట ... ‘నీ కెరటాలు నిరంతరం చెప్పడానికి ప్రయత్నిస్తున్నదేమిటో రాసి చూపించు.’ సముద్రం నురుగుతో పదే పదే చెప్పదలచుకున్నది రాసి, నిరాశా నిస్పృహ‌ల‌తో ఆ అక్షరాలను చెరిపివేసిందట’…అంటే దాని అర్థం ఆగమనంలోనే పురోగమనం ఇమిడి ఉందని కదా! సముద్రంలాగే మానవుడికి కూడా అందని అంతస్తులో అర్రులు చాచే ఆభరణం ఒకటుంటుంది. దానిని అందుకునే ప్రయత్నంలోనే చెయ్యి జారిపోయే విధానం కూడా ఇమిడి ఉంటుందని కదా?’’ అన్నాను.

‘‘అయివుండవచ్చు. అవును నువ్వు చెప్పిందే నిజం కావచ్చు. తప్పు సముద్రానిది కాదని తెలుస్తూనే ఉంది. అయితే ఇంకెవరిది? దానినిసృష్టించిన‌వారిదే కదా? వారెవ్వరు? నిన్ను, నన్నూ సృష్టించిన‌ వారే కదా?’’ అంది.

అప్పుడు నా ఆశ్చర్యానికి మేరలేదు, సుశీ ఎందుకీవాళ ఇలాఉంది. ఎన్నోసార్లు నేను ఇలా మాట్లాడుతూవుంటే మందలించేది. రాబోయే దానిని రహస్యంగా ఆమె అంతరంగం గుర్తించగలిగిందా? అయితే రాబోయేదేమిటి?

‘‘అదిసరే, ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాం మనము, ’’ అంది.

‘‘అది నాలుగు సంవత్సరాల తర్వాత సంగతి కదా , అప్పుడు మనమెలా ఉంటామో, ఎక్కడ ఉంటామో ఎవరికి తెలుసు,’’ అన్నాను మాట తప్పించుకుందామని.

సుశీ మనస్సుని ప్రాపంచక విషయాల మీద మరలించడానికి అడిగిన ప్రశ్న అది. అయినా అది కూడా సరైన ప్రశ్న కాదు.

‘‘మీ కేమీ ఆ భయం అక్కర్లేదు, అప్పటికి నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడే ఉంటావు,’’ అంది.

ఈ మాటలు పరధ్యానంగా అన్నట్టు కనబడింది. మనస్సు ఎక్కడో విహరిస్తున్నట్టుంది.

‘‘ఏమో సుశీ. జరగబోయే దానిని గురించి ఎవరికి తెలుసు?’’ అన్నాను.

‘‘అంటే నీ ఉద్దేశం ఏమిటి రామం? అంత నిగూఢంగా ఎందుకు మాట్లాడుతున్నావు?’’ అంది.

‘‘నిగూఢంకాదు సుశీ. గమ్యస్థానం తెలియని గుడ్డివాడిని చెయ్యిపట్టుకుని ఎవరో ఒకరు తీసుకువెళ్లాలి కదా? ఆశయంలేని వారికి అసహాయత విషం లాంటిది,’’ అన్నాను.

‘‘గమ్యస్థానం నీకేకాదు ఎవరికీ తెలియదు. నువ్వేమీ గుడ్డివాడివి కాదు. అయినా నా చెయ్యి మీకు ఎప్పుడూ లభిస్తుంది, అనవసరంగా భవిష్యత్తును గురించి ఆలోచించకు రామం. దాని వలన కలిగే లాభమేమిలేదు. మన ఇద్దరి జీవితాలు ఒకే పంథాతో నడుస్తాయి, ఆ భారం నేను వహిస్తాను,’’ అంది.

ఇక్కడ కాస్త ఒక విషయం విశదీకరించాలేమో! సుశీ నన్ను అప్పుడప్పుడు ‘మీరు’ అని సంబోధించేది; అప్పుడప్పుడు అలవాటు ప్రకారం ‘నువ్వు’ అనేది, ఈ విధం తెలుగు భాషలోనే స్పష్ఠంగా కనబడుతుంది. ఇంగ్లీషులో ఈ రెండింటికీ తేడా ఏమీలేదు. ‘‘యూ’’ అనే పదానికి రెండు అర్ధాలు వస్తాయి. ఏదయితేనేం ఒక సారి ‘ఎందుకు సుశీ ఈ బాధ? అలవాటు ప్రకారమే ‘నువ్వు’ అని పిలవకూడ దూ,’ అన్నాను.

సుశీ ‘‘ఇప్పటినుంచీ అలవాటు చేసుకోకపోతే తర్వాత కష్టపడాల్సి వస్తుంది. అందరి ఎదుట చిన్నతనంగా ఉండదా?’’ అంది.

‘‘స్త్రీలకు పురుషులతో సమానహక్కులు కావాలని ఇంటికప్పు లెక్కి అరచే వనితలలో ఒక దానివి కదా నువ్వు? మొన్న దాని మీద ఒక చిన్న ఉపన్యాసం కూడా యిచ్చావు. అందులో టాగూర్ నాటకం చిత్రాంగదలో చిత్ర చెప్పిన మాటలు ఉదహరించావు. ‘నేను చిత్రని. పూజ చేసే దేవతను కాదు. అడుగులొత్తే దాసీనికాను. నీ సర్వస్వంలోనూ నాకు సమభాగం కావాలి’ అంటూ చెప్పావు. అలాంటప్పుడు భార్య భర్తని మీరు అని ఎందుకు పిలవాలి? భార్యని భర్త ఎందుకు అలా సంబోధించకూడదు,’’ అన్నాను.

‘‘అవును అదీ నిజమే. కాని మనం సమాజంలో కొన్ని కొన్ని నియమాలకు బద్ధులమయి ఉండాలి. అంటే నా ఉద్దేశం అన్నింటికి తల ఒగ్గమని కాదు. ఆత్మ గౌరవాన్ని అణగతొక్కే వాటిని ప్రతిఘటించాలి. కానీ అందువలన కలిగే నష్టమేమీ లేదు. మీరు నాకంటే ఆరు నెలలు పెద్ద వారు. ఎలాగైనా పెద్దవారిని గౌరవించాలి కదా!’’ అంది.

‘‘నీకంటే ఆరు నెలలు చిన్నవాడినైతే ఏం చేద్దువు సుశీ?’’ అన్నాను.

‘‘చెయ్యడానికేముంది? అదే విధంగానూ అడ్డురాదు మన దారికి,’’ అంది.

‘‘కాని మన సమాజం అది ఒప్పుకోదు కదా! ఇది తల ఒగ్గవలసిన కట్టుబాటు కాదా?’’ అన్నాను.

‘‘కాదు. భార్యకన్నా భర్త ఒక మెట్టు పైన ఉండాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు పెట్టిన నియమం ఇది. ఈనాడు ఇది అర్థంలేనిది,’’ అంది.

‘‘అలా అయితే నన్నునువ్వు అని పిలిచేదానివా?’’ అన్నాను.

‘‘అవును. అల్లరిచేస్తే చెవులుకూడా మెలివేసేదానిని,’’ అంది నవ్వుతూ.

‘‘మన ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుంది సుశీ?’’ అన్నాను.

‘‘ఇంకెవరిది? నాదే, నేనే కాదు..మీరు ఎవరిని కట్టుకున్నా ఆమెదే అవుతుంది. మీ స్వభావమే అంత,’’ అంది ధీమాగా .

ఆమె మాటలు నాకేమంత కష్టం కలిగించలేదు. ఆమె చెప్పినదే నిజమనిపించింది. తల్లిదండ్రులకి ఏకైక పుత్రుడిని అవటం వల్ల వచ్చిన నష్టమిది. సుశీ నామీద అనవసరమైన అధికారం చెలాయిస్తుందనే భయం నాకు కలుగలేదు, ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుందనే విశ్వాసం నాకు. ముఖ్యమైన విషయాల్లో ఎప్పుడూ నామాట చెల్లేది. మా ఇద్దరి మధ్య ఆనాడు ఉన్న సంబంధం ఈనాడు నాకు ఎంతో విచిత్రంగా కనబడుతుంది. భూతకాలాన్ని వర్తమానపు దీపంతో పరీక్షిస్తూంటే ఎప్పుడూ మేము ప్రేమ వాక్యాలు చెప్పుకునేవాళ్లం కాదు. వాటి అవసరం ఎప్పుడూ కలగలేదు. ఒకరి హృద‌యం ఇంకొకరికిస్పష్టంగా తెలుసు. అక్షర శబ్దాలని మించిన అనురాగం అది. సుశీ అప్పుడప్పుడు ఆమె చెప్పదలచుకొన్నది నేత్రాలతో వ్యక్తం చేసేది. ఎప్పుడైనా నేను కాలేజికి వెళ్లకపోతే ఆ సాయంత్రం నారూముకి వచ్చేది. తలుపు తోసుకొని రూములోకి వస్తూన్నప్పుడు ఆమె కళ్లు చూస్తే అప్పుడు నాకు వాటిలో ఆమె హృద‌యమంతా అద్దంలోని ప్రతిబింబములా కనపడేది. ‘క్లాసులో ఈవేళ ఏం చేప్పారు?’ అని అడిగితే, నవ్వుతూ ఏమో నాలుగు మాటలు చెప్పేది. ఇంక నేనేమి అడిగేవాడిని కాను, పాఠాలు వినలేదని స్పష్టంగా తెలిసిపోయేది.

‘‘హోటలు భోజనం నీకు పడటంలేనట్టుంది,’’ అంది ఒక సారి,

‘‘నీకు హాస్టలు భోజనం పడుతోందా?’’ అన్నాను.

‘‘ఎందుకు పడటంలేదు, నేను నిక్షేపంలా ఉన్నాను,’’ అంది. సుశీ ఏమీ నిక్షేపంలా వుండేది కాదు, పేలగా, పల్చగా, బలహీనంగా కనపడేది. చాలాకాలం అది ఆమె శరీర తత్వమే అనుకునేవాడిని. కాని చిన్నతనంలో ఎంత బొద్దుగావుండేదో జ్ఞాప‌కం వచ్చి అప్పుడప్పుడు ఆశ్చర్యపోయేవాడిని. అయినా ఆ మార్పుని యవ్వనానికి అంటగట్టేవాడిని, ఇలా ఉంటేనే అందంగా ఉంది కదా? అలాంటప్పుడు ఎందుకు విచారించాలి? క్లాసులో నవ్వుతూ నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ ఉంటే ఎంత కొంటెగా, ఎంత మనోహరంగా ఉంటుంది? ఒకసారి మా ఇంగ్లీషు మాస్టారు అది కనిపెట్టి వేశారు. అయినా ఆయన పిల్లలున్నవాడు, ఇలాంటి అనుభవాలున్న తండ్రి, అందుకు ఊరుకున్నాడు. సుశీ ఈ సుఖం క్షణికమూ, శాశ్వతమూ అని నాలో నేను అప్పుడప్పుడు తర్కించుకుంటూండేవాడిని.

వేసవి సెలవలకి ఇంటికి వెళ్లడానికే నిశ్చయించుకొన్నాము. ఇంటివద్ద నుంచి మా నాన్న గారు గట్టిగా ఉత్తరం రాశారు. మేమిద్దరం దసరాకు, సంక్రాంతికి కూడా ఇంటికి పోలేదు. ఇక తప్పదనుకుని సుశీ మద్రాసుకు, నేను రాజమండ్రికి బయలుదేరాము. నేను కనీసం వారానికొకసారైనా ఉత్తరం రాస్తానని వాగ్దానం చేశాను. వెళ్లేముందు రెండు నెలలబట్టి సుశీ ఆరోగ్యం సరిగా ఉండేదికాదు. ఏదో నీరసంగా ఉండేది. ఏమిటంటే ఏమీ లేదు వేసవికాలం అనేది.

నేను రాజమండ్రి వచ్చి ఒక పక్షంరోజులయి ఉంటుంది. ఏమీతోచేదికాదు. ఎప్పుడూ సుశీ జ్ఞప్తికి వచ్చేది. నాహృద‌యవేదనను తెలియపరుస్తూ ఒక పెద్ద ఉత్తరం రాసి ఇలా ముగించాను. ‘దైవం నీకూ నాకూ ఈ కలయిక ఎందుకు ఏర్పాటు చేశాడో నాకే తెలియదు. కానీ ఒకటి మాత్రం సత్యం సుశీ. ఈ కలయిక ఏలాంటిదైనా, ఎలా ఏర్పడినా నిన్ను మాత్రం ఇక వదలదలచుకోలేదు. నా చేతుల్లోంచి జారిపోయిందనుకున్న వజ్రం నాకు అనాయాచితంగా, సునాయాసంగా తిరిగి లభించింది. ఎందుకు మళ్లీ పారవేసుకోవాలి? దైవం నీకు శుభం చేకూర్చు గాక!’

దీనికి జవాబుగా ఒక వారంరోజులకి టెలిగ్రాం వచ్చింది. అందులో తాను బయలుదేరి వస్తున్నాననీ, స్టేషనులో కలుసుకోమనీ ఉంది. మొదట నాకది అర్ధంకాలేదు, తర్వాత ఒంటరితనం భరించలేక వచ్చేస్తుందనుకొని ఆనందించాను.

ఆవేళ స్టేషనుకు వెళ్లాను సుశీకి స్వాగతం చెప్పడానికి. కాని రైల్లో నుంచి దిగిన సుశీ నేను ఊహించిన సుశీ కాదు. ‘దిగినది’ అనటంకన్నా ‘దింపబడింది’ అనటం ఉచితమనుకుంటాను. నేను ఒక క్షణం కొయ్యబారిపోయాను. ఒక చెయ్యి తల్లి భుజం మీద భారంగా వేసి, రెండవ చేత్తో తండ్రి చెయ్యి పట్టుకుని సుశీల అనే జీవచ్ఛవం రైళ్లో నుంచి నీరసంగా నాకేసి చూసి నవ్వుతూ దిగింది. సుశీల తండ్రి నా కంగారు చూసి భుజుం తట్టి ‘‘తర్వాత అంతా చెప్తాను రామం. ముందర ఒక ట్యాక్సీ పిలుచుకురా’’ అన్నాడు. నేను అక్కడనుంచీ కదిలేస్థితిలోలేను. కళ్లు చీకట్లు కమ్మాయి. ఆయనే బయటకు వెళ్లారు. తర్వాత ఆయన చెప్పిన సారాంశం ఇది...

సుశీ వాళ్ల ఊరు వెళ్లిన తర్వాత నీరసంతోపాటు దగ్గుకూడా పట్టుకుందట. అతినీరసపడిపోయింది. డాక్టరుకు చూపిస్తే సుశీలని పీడీస్తున్నది ‘క్షయ’ అనే మహా పిశాచం అని తేల్చాడట. సుశీని మాద్రాసులోనే హాస్పిటలులో చేర్పించుతానన్నాడట సుశీ తండ్రి. సుశీ తనను రాజమండ్రి శానిటోరియంలో చేర్పించమందిట, అందుకనే ఇక్కడికి వచ్చారు.

సుశీ నాతో మాట్లాడిన మొదటి మాటేమిటంటే ‘‘మీ వజ్రం కోసం మీరు ఎవరితో పోరాడాలో తెలుసా?’’ అంది.

‘‘ఎవరితో పోరాడాలో వారిని ప్రార్థిస్తాను అది నాకు దక్కనివ్వమని,’’ అన్నాను, చేతులుజోడించి.

చాప్టర్ 3

నా హృద‌యపు ఆరాటాన్ని, ఆవేదననూ నేను చెప్పలేకపోతున్నాను. నాకు బాల్యం నుంచీ దైవం మీద అచంచలమైన విశ్వాసం ఉండేది. చిన్నతనంలో రామనామం జపిస్తే దెయ్యాలు పారిపోతాయని నమ్మేవాడిని. అదే నమ్మకంతో నేను సుశీని రక్షించుకోగలనని నమ్మాను. ఎవరినైతే నేను నమ్ముకున్నానో వారు సుశీని నా నుంచీ వేరు చెయ్యరని ఆశించాను.

డాక్టరుని కలుసుకొని సుశీని దక్కనివ్వమని అడిగాను. ఆయన నాకేసి తేరిపార చూసి ‘‘ఆమె మీకేమవుతుంది’’ అన్నారు.

‘‘అవవలసినంతా అవుతుంది డాక్టరుగారు. ప్రపంచంలో ఈమె కంటే నాకు అప్తులెవరూ లేరు. ఆమెను నేను మీ చేతుల్లో పెడుతున్నాను,’’ అన్నాను.

‘‘ఫర్వాలేదు, త్వరలోనే కనుక్కున్నారు... ఇలాంటి కేసులు చాలా నయమయ్యాయి, అయినా మీరు ఇక్కడ దొరకని మందులు విదేశాలనుంచి తెప్పించుకోవాలి,’’ అన్నారు.

నాకు ఆ సమయంలో డబ్బంటే చాలా హీనంగా కనబడింది. ‘‘డాక్టరుగారు, మీరు డబ్బు గురించి ఆలోచించకండి. ఎంత డబ్బయినా ఖర్చుపెడ్తాను. చివరకు నా ప్రాణం అయినా ఇస్తాను కావాలంటే, ఆమెను నయం చెయ్యండి,’’ అన్నాను.

‘‘నీ ప్రాణం నేనేం చేసుకుంటాను, కానీ నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను,’’ అన్నారు, ఆయన నవ్వుతూ.

నా శక్తులన్నీ కూడతీసుకుని ఆమెను రక్షించుకోటానికి రంగంలో దిగాను. సుశీ వద్దంటూన్నా రాత్రి పగలు, తన పక్కనే కూర్చునేవాడిని.

‘‘ఇది పాడు రోగము. నా వద్దకు రావద్దంటూంటే మీకు వినబడదా?’’ అంది ఒక రోజున తను కొంచెము కోపంగా ముఖంపెట్టి,

‘‘నాకేమీ ఫర్వాలేదు సుశీ. కాని నాక్కూడా ఈ రోగం వస్తే మరీ మంచిది. అప్పుడేమీ ఈ అడ్డంకులుండవు. హాయిగా ఒకరి ప్రక్కన ఒకరు కూర్చుని చక్కగా ఎప్పుడూ కబుర్లు చెప్పుకోవచ్చు. చావటం తప్పకపోతే ఇద్దరమూ చద్దాము,’’ అన్నాను నేను నవ్వుతూ.

మొదటిసారిగా సుశీ కళ్లల్లో నీరు అప్పుడే నేను చూశాను. వ్యాకుల కంఠంతో ‘‘ఛీ, ఛీ. అలాంటి మాటలనకండి. అసలు మన మిద్దరమూ కలుసుకోక పోయినట్లైతే ఎంత బావుండును. ఎక్కడో చచ్చేదానిని,’’ అంది.

సుశీ నోటివెంట అలాంటి మాటలువస్తే నేనెలా సహించగలను. కట్టతెగిన ప్రవాహంలా ఒక ఆశ్రుధార సుశీ శుష్క వక్షస్థలం మీదుగా ప్రవహించింది.

రోజులూ, వారాలూ గడిచిపోతూన్నాయి. సుశీ ఆరోగ్యం బాగవుతూంది, ప్రక్కన కూర్చుని వేళ తప్పకుండా మందులు ఆహారం ఇచ్చే వాడిని, నర్సులు నేను లేనప్పుడు వేళాకోళం చేసేవారట.

‘‘అతను మీకేమవుతాడు?’’ అని అడిగితే ‘‘నా కాబోయే భర్త’’ అని చెప్పేదట. ఎందుకలా అన్నావని అడిగితే ‘‘ఏం! కారా?’’ అంది. ఆ ఒక్కమాట నాకు ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్నీ ఇచ్చింది. ఆమెలో కోరికలున్నాయి. అదేచాలు.

కాని ఒక్కొకప్పుడు ఎంతో విచారంగా కుంగిపోయి మాట్లాడేది.

‘‘నేనొకమాట చెప్తాను వింటారా?’’ అంది ఒకసారి మంచంమీద లేచి కూర్చుని.

‘‘చెప్పు సుశీ. ఎందుకు వినను,’’ అన్నాను.

‘‘నేనొకవేళ చనిపోతే మీరు... ’’ అని ఏదో అనబోయింది.

‘‘అలాంటి మాటలనకు సుశీ. నాకు చాలా బాధ కలుగుతుంది. నీకు తప్పకుండా స్వస్థత కలుగుతుంది. నాకు తెలుసు,’’ అన్నాను నెమ్మదిగా చెయ్యి ఆమె నోటిమిద పెట్టి.

సుశీ నెమ్మదిగా చెయ్యితీసి తన చెంపమీద పెట్టుకొని పక్కకు ఒరిగిపోయింది. నేను ముఖం పక్కకు తిప్పి చూద్దునుగదా, సుశీ కళ్లలోంచి స్వేచ్ఛగా, నిరాటంకంగా అశ్రుధార స్రవిస్తోంది.

చాప్టర్ 4

రెండు మాసాలు గడచిపోయాయి. సుశీ చాలావరకూ కోలుకుంది. టెంపరేచర్ నార్మల్ కి వచ్చేసింది. శరీరం నిగనిగలాడుతూ ఉండేది. గండం గడిచిపోయిందనుకున్నాను. డాక్టరు కూడా అదే అన్నారు. ఇంకొక నెల లోపున పూర్తిగా తగ్గకపోతే ఆపరేషన్ చేస్తానన్నారు.

నేను ఒక రోజున మా ఇంటికి భోజనానికి వచ్చాను. అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టబోయే సమయానికి మా బంట్రోతు గబగబా పరుగెత్తుకుంటూ వచ్చి ‘‘చిన్నబాబుగారు, అయ్యగారు మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు. చిన్నమ్మగారి నోట్లోంచి రకతం పడుతూంది’’ అన్నాడు. అలాగ ఎప్పుడూ అంతకుముందు జరగలేదు.

నేను వెంటనే అక్కడికి వెళ్లి చూసిన దృశ్యం నేనెన్నటికి మరువలేను.

సుశీ మంచంమీంచి క్రిందకు వంగి రక్తం కక్కుతూంది. సుశీ తల్లి, తండ్రి ఇద్దరూ కూడా ఆమెను పట్టుకోలేకపోతున్నారు. పక్కనిండా నెత్తురు, ఒంటి నిండా నెత్తురు. ఎర్రటి నెత్తురులో అక్కడక్కడ చిన్న మాంసపు కండలున్నాయి. ఇంతలో డాక్టరు వచ్చి ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు. కొంత సేపటికి నెత్తురుపడటం తగ్గింది. కానీ సుశీకి వంటిమీద సృహ‌లేదు, ఆశాజ్యోతి ఆరిపోయే సమయం ఆసన్నమైందా అనే భయంతో వణికిపోయాను. కాని ఆ దినం గడిచిపోయింది. అయినా నెత్తురుపడటం తగ్గిపోలేదు, అలా జరిగినప్పుడల్లా తోకతెగిన పాములా కొట్టుకునేది. అంత కన్నీరు నాలో ఎక్కడ దాగివుందో. సుశీని చూసినప్పుడల్లా కళ్లు నీటితో నిండిపోయేవి. ఇక సుశీకి ఆ బంధనాల నుంచీ శాశ్వత విముక్తిలేదని గ్రహించాను.

‘‘నేను ఎలాగా చచ్చిపోతాను. అయితే నేను ఏమయిపోతాను? మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి పోతాను చెప్పండి? నాకు మిమ్మల్ని విడిచిపోవాలని లేదు, నేను పోతే మీరు చాలా బాధపడతారు కదూ,’’ అంది ఒకసారి సుశీ అయాసపడుతూ,

అలాంటి మాటలు విని నేనెలా సహించగలను?

‘‘నువ్వు చనిపోవటానికి వీల్లేదు సుశీ. ఎన్నటికీ వీల్లేదు. నేను చనిపోనివ్వను. నువ్వు నాకోసం జీవిస్తావు. లేకపోతే నేనూ చచ్చిపోతాను,’’ అన్నాను సుశీ చెయ్యి తీసుకుని నా హృద‌యం వద్ద పెట్టుకుని.

‘‘ఛీ, ఛీ. నేను చనిపోతే మీరు చనిపోవటమేమిటి? మీరింత పిరికివారా? నేనెవర్ని మీకు? అసలు మీకూ నాకు సంబంధం ఏమిటి? ఏదో కొంచెం స్నేహం కలిగింది అంతే,’’ అంది సుశీ గబుక్కున చెయ్యి లాక్కుని.

ఆ చివరి మాటలు ఆమె హృద‌యంలోంచి రాలేదన్న విషయం నాకు బాగా తెలుసు.

ఈ విధంగా ఒక పక్షంరోజులు దినదిన గండంగా గడచిపోయాయి. డాక్టరు వద్దంటున్నా, మా తల్లిదండ్రులు ఎంత బతిమాలినా, సుశీ ఎంత మందలించినా ఆమె దగ్గరే రేయింబగళ్లు గడిపేవాడిని. అమావాస్య కాలం సమీపిస్తూంది. ‘నాకేమయినా సరే, ఈ తిరిగిరాని కాలాన్ని వృధా చెయ్యను. సుశీ పోయిన తర్వాత నేనేమవుతే ఏమిటి?’ అని నిశ్చయించుకున్నాను.

సుశీ పరిస్థితి నానాటికి క్షీణించిపోతూంది. నా వజ్రాన్ని కాపాడమని భగవంతుడ్ని అహర్నిశలూ ప్రార్థించేవాడిని. ‘‘సుశీని కాపాడు, కావాలంటే నన్ను తీసుకుపో’’ అని రోదించేవాడిని.

ఆనాడు సుశీ పరిస్థితి మరీ విషమించి పోయింది. డాక్టరు చివరి గండం గడవటం చాలా కష్టమని చెప్పారు. డాక్టరుని తీసుకుని సుశీ వద్దకు వెళ్లాను. సుశీ నరకయాతన అనుభవిస్తుంది. డాక్టరు ఇంజక్షన్ ఇస్తానంటే మొదట చెయ్యి చాచలేదు. బలవంతాన చివరకి యివ్వగలిగేడు. కాని మరుక్షణంలోనే ఆమెకు స్పృహ‌పోయింది. మరికొంత సేపటికి స్పృహ‌ వచ్చింది. కాని మాట పోయింది.‘సుశీ, సుశీ.’ అని ఎంతో సేపు పిలిచిన మీదట ఆమె కళ్లు విప్పింది. నాకు ఏదో చెప్పాలని ఎంతో ప్రయత్నించింది. నాకేమి అర్థం కాలేదు. అప్పుడు డాక్టరు ‘‘తన తల మీ ఒడిలో పెట్టుకోమంటూంది.’’ అన్నాడు. సుశీకేసి చూశాను. ఆమె ‘అవును’ అన్నట్లు తల ఊపింది.

ఒక సారి నేను అలా చేస్తానని మాట ఇచ్చాను. సమయానికి ఆమె జ్ఞప్తికి తెచ్చేవరకూ అది మరచేపోయాను. ఆమె కోరిక ప్రకారం చేశాను. అలా చేసిన వెంటనే నేను సర్వం మరచిపోయాను. నాకు అప్పుడు కనిపించినదీ తెలిసినదీ ఒకటే. నాకోసం విధితో పోరాడే సుశీ... ఆమెమీద ప్రేమతో పెల్లుబికే నా హృద‌యం.... అంతే. మిగతాదంతామరచిపోయాను. ‘సుశీ, సుశీ’’ అంటూ పిచ్చివాడిలా అరచాను. సుశీ ఒక సారి కళ్లుతెరచి చూసింది. ఆచూపుతోనే నాకు వీడ్కోలు చెప్పింది. ఒక సారి చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నించింది. పెదిమలు వణికాయి. ఆ పరిస్థితిలో ఆ శ్రమకు కూడా ఆమె తట్టుకోలేక పోయింది. కళ్లు మూసేసింది. అంతే, అందమైన కనురెప్పలు ఇక తెరుచుకోలేదు. డాక్టరు పల్సు చూస్తున్నారు. నేను బయటకి వచ్చేశాను. నాకేసి చూడనీ, నన్ను పలకరించనీ….సుశీని నేను ఇక చూడలేకపోయాను. జరగాల్సిన తతంగం అంతా జరుగుతూంది. ఇక నేనెందుకు.