Read Tulasi Kalyanam by Dinakar Reddy in Telugu ఆధ్యాత్మిక కథ | మాతృభారతి

Featured Books
  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

తులసీ కళ్యాణం

శ్రీ మహావిష్ణువు ఆలయం.ప్రక్కనే తోట.తోటలో ఉసిరి చెట్టు.కార్తీక మాస వన భోజనాలకి ఇంతకంటే అనువైన చోటు ఏముంటుంది.ఇవాళ శారదమ్మ కుటుంబంలోని వారంతా వన భోజనాలకి రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది.

అసలు ఆ గుడి కట్టించింది శారదమ్మ వాళ్ళ తాత గారు.చిన్నప్పటినుంచీ ఆ గుడికి రావడం ఆమెకు అలవాటు.

పెరిగి పెద్దయినా పెళ్లయినా ఆమె ఆ గుడికి వచ్చే అలవాటు మానలేదు.

పెద్దయ్యాక ప్రతి కార్తీక మాసంలో తులసీ కళ్యాణం చేయించడం.వన భోజనాలు.ఆ హడావిడే వేరు.భర్త కాలం చేసినా గుడికి సంబంధించిన ఏ విషయంలోనూ లోటు రానివ్వలేదు.

ఈ సారి వన భోజనాలకి కూతుళ్ళు,అల్లుళ్ళు,కొడుకులు,కోడళ్ళు,మనుమలు అందరూ కలిసి రావడంతో ఆవిడ ఆనందానికి అవధుల్లేవు.

అందరూ బంతిలో కూర్చున్నారు.బంధువులంతా మాటలతో కాలక్షేపం చేస్తూ విందు ఆరగిస్తున్నారు.

ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ముసలామె వచ్చి బంతి చివరిలో ఉన్నశారదమ్మ ప్రక్కన కూర్చుంది.

పోవే పో.ముదనష్టపు దానా.నువ్వు నా ప్రక్కన కూర్చుంటావా.ఎంత ధైర్యం నీకు.కులం గోత్రం లేదూ.

వెధవ కంపు.వెధవ మనుషులు అని శారదమ్మ ఈసడించుకుంది.

చూస్తే తన కంటే ఎక్కువ వయసున్నట్లే ఉంది.లేత పసుపు రంగు ముతక చీర.ఓ చివర చిరుగు స్పష్టంగా తెలుస్తోంది.

మనిషి చిక్కినట్లే ఉన్నా మొహంలో మాత్రం ఏదో ప్రసన్నత.

అమ్మగారూ క్షమించడమ్మా.దణ్ణం పెట్టుకుందామని గుడికి వచ్చినానమ్మ.దూరం నుంచి చూసి ఇక్కడేదో భోజనాలు పెడుతున్నట్టు ఉంటే కాసింత తిందామని వచ్చాను అంది.

శారదమ్మ కోపం ఏమీ తగ్గలేదు. మిగతా వాళ్ళెవరూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

వడ్డించే వాళ్ళు వచ్చి ఆమెను దూరంగా కూర్చోమని చెప్పారు.శారదమ్మ బంధువుల్లోనే ఉన్న శాస్త్రి గారు ఆమెకు అన్నం పెట్టమని వడ్డించే వాళ్లని పురమాయించారు.

కాస్త అన్నం పప్పు అరటి పళ్ళు కలిపి ఒక ఆకులో పెట్టి ఇచ్చారు.

ఎంతో ఆనందంతో కళ్ళకద్దుకుని దానిని తిని మళ్ళీ శారదమ్మకు నమస్కారం చేసి వెళ్ళిపోయింది ఆ ఆడమనిషి.

ఆ రోజంతా శారదమ్మ మనసేం బాగోలేదు.ఏదో తప్పు చేశానన్న భావన.

ఎవరో పెద్దావిడ.అన్నం వేళకు వచ్చింది.తనెందుకు అంత ఈసడించుకుందో తనకే అర్థం కాలేదు.

మరుసటి రోజు ఇంట్లో కార్తీక పురాణం పారాయణం చేస్తుంటే మనవరాలు స్పందన వచ్చి ప్రక్కనే కూర్చుంది.

కథలో చెబుతున్నారు.కార్తీక మాసంలో ఏ కులం వారయినా శివుడు ఇంకా విష్ణువు ఆలయాల ప్రవేశం చేయవచ్చని.కులాలకతీతంగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించవచ్చునని.

ఈ మాసంలో దానం ఎంతో పుణ్యాన్ని అందిస్తుంది అని.

మనవరాలికి మళ్ళీ మళ్ళీ చదివి వినిపించింది.చదువుతుంటే తన కళ్ళలో నీళ్ళు తిరిగాయి.ఏదో మనసుకు బోధపడింది.

శాస్త్రి గారికి కబురు పంపింది.ఆవిడ చెప్పిన మాట విన్నాక ఆయన మొదట ఆశ్చర్యపోయారు.

ఈ విషయానికి ఊరి పెద్దలు ఒప్పుకుంటారా అని ఆయన అనుమానం.ఆ విషయం నేను చూసుకుంటాను అందావిడ నమ్మకంగా.

అమ్మకి పిచ్చి పట్టింది అని తేల్చేశారు పిల్లలందరూ.ఇన్నాళ్ళూ లేనిది ఇవాళ ఏంటత్తయ్యా ఇది అని కోడళ్ళు సణుగుడు.

అదంతా నాకు తెలీదర్రా.ఈ కార్తీక పౌర్ణమికి తులసీ కళ్యాణం దాని తరువాత కులం పట్టింపు లేకుండా అన్న దానం జరగాలి.అందరూ కలిసి ఒకే బంతిలో కూర్చోని భోజనం చేయాలి అని పట్టు పట్టింది.

మొదట్లో ఊరి పెద్దలు ససేమీరా అన్నారు.శాస్త్రి గారు కార్తీక పురాణం పారాయణం ఆరంభించారు.

అందులో ఎక్కడా కులం పట్టింపు చూపించమని వ్రాయలేదు కదా అని నచ్చజెప్పారు.చాలా సేపు తర్జన భర్జన పడ్డాక సరేనన్నారు.

కార్తీక పౌర్ణమి రోజు గుడి ప్రక్కన తోటలో అందరికీ అన్నదానం ఉంటుందని చాటింపు వేయించారు.

కార్తీక దామోదరుడి స్వరూపంగా సాలిగ్రామాన్ని ఉంచుతారు. ఉసిరి కొమ్మను కూడా విష్ణు స్వరూపంగా భావించి తులసి కోటలో ఉంచుతారు.శారదమ్మ పిల్లల చేతుల మీదుగా వైభవంగా తులసీ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది.

అందరి దృష్టి కల్యాణం మీద ఉంటే శారదమ్మ కళ్ళు మాత్రం ఎవరి కోసమో ఆత్రంగా వెతుకుతున్నాయి.

ఉపవాసం బడలిక వల్ల ఆమె శరీరం విశ్రాంతిని కోరుతోంది.

భోజనాల వేళయ్యింది.హరి నామాన్ని తలచుకొని అందరూ భోజనం చేస్తున్నారు.కులం పట్టింపు లేకుండా అందరూ ఒకే బంతిలో కూర్చొని తింటుంటే శాస్త్రి గారు ఆ విషయాన్ని చెప్పడానికి శారదమ్మ కోసం వెతికారు.

కల్యాణం జరిగిన చోటే ఆవిడ ఒంటరిగా కూర్చొని ఉంది.

గుడి ప్రవేశ ద్వారం వైపు పదే పదే చూస్తోంది.ఎవరి కోసమమ్మా అంతలా చూస్తున్నావ్ అని శాస్త్రి గారు అడిగారు.

అదే శాస్త్రి గారూ ఆ వేళ వన భోజనంలో నా ప్రక్కన కూర్చుందని ఈసడించుకుని తిట్టానే ఆ పెద్దావిడ కోసం చూస్తున్నాను.

ఏ ఊరు మనిషో ఏమో ఆవిడ వస్తుందో రాదో ఎంత సేపు అలా ఎదురు చూస్తావు?

వెళ్లి స్వామికి ఓ నమస్కారం పెట్టి భోజనం చేయమ్మా.నువ్వు చేయాలనుకున్న మంచి పని చేశావు.రేపటి తరానికి ఒక ఆదర్శాన్ని అందించావు అని అన్నారు శాస్త్రి గారు.

ఆవిడ సంతృప్తి పడలేదు.ఆ రోజు ఆమెను తిట్టడం పదే పదే గుర్తుకు వస్తోంది.ఇక తప్పదు అన్నట్లు ఒక తులసి మాల

పట్టుకొని గుడిలోకి వెళ్ళింది.గర్భ గుడి నిండా దీపాలు అలంకరించబడి ఉన్నాయి.ఆ వెలుగులో లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ మూర్తి ప్రకాశిస్తున్నారు.

తండ్రీ నీ ప్రసాదంగా భావించి భోజనం చేస్తున్న వేళ ఒక పెద్దావిడ ఆకలంటూ వచ్చి నా ప్రక్కన కూర్చుంది.

కులం గోత్రం ఇంకా ఏవేవో అంటూ ఆమెను ఈసడించుకున్నాను.అన్ని ప్రాణుల ఆకలిలో ఉన్నది నీవే అని మరచి తప్పు చేశాను.ఈ అన్నదానంతో నా తప్పును మన్నించు.

నా తప్పును నువ్వు మన్నిస్తే ఆ పెద్దావిడను ఒక్క సారి నాకు చూపించు స్వామీ అని ఆ తులసి మాలను అలంకరించింది.

బయటకి వచ్చి మనవరాలు స్పందన కోసం వెతికింది.స్పందన తన చిట్టి పొట్టి చేతులతో తులసి కోటలోని మట్టిని అటూ ఇటూ కదుపుతోంది. కళ్యాణం జరిగిన తరువాత అందులో పడిన రంగు రంగుల అక్షతలు తీసి దాచుకోవాలని తన ప్రయత్నం.అప్పుడే అటుగా వచ్చిన శారదమ్మ మనవరాలి చేయి పట్టుకొని అలా మట్టిలో ఆడకూడదు అని చెప్పింది.

ఒక్క క్షణం తను నిశితంగా చూసింది ఆ మట్టి వైపు.ఏదో చిన్న గుడ్డ పీలిక లాంటిది కనిపించింది.

అదేమిటా అని బయటకు తీసి చూసింది.ఆమె కళ్ళు తడి అయ్యాయి.తను చూస్తుంది నిజమేనా అని కళ్ళు తుడుచుకుని మళ్ళీ మళ్ళీ తడిమి చూసింది.

ఆమె చేతిలో లేత పసుపు రంగు చిరుగు వస్త్రం.ఆ రోజు ఆ పెద్దావిడ ఏ చీర కట్టుకుందో అదే రంగు.తను గమనించిన చిరుగునే ఇప్పుడు మళ్ళీ గుర్తించగలిగింది.

ఆ పెద్దావిడ ఎవరో ఎందుకు వచ్చిందో అంతరార్థం బోధపడింది శారదమ్మకు.

బేధ భావాలు లేకుండా అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేస్తున్నారు.

ఆవిడ భోజనాల బంతి వైపు అడుగులు వేసింది.

ఉసిరి చెట్టు ఆనందపడినట్లు చల్లటి గాలి వీచింది.