Read LIP-Live in Peace by Devarakonda Phanishyam in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

LIP: Live in peace

​మంగళవారం రాత్రి 11:30 గంటలు. హైదరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని తన లగ్జరీ డూప్లెక్స్ విల్లాలో ఆదిత్య ఒక చేత్తో ఆపిల్ జ్యూస్ తాగుతూ, తన ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను తనిఖీ చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఫోన్ స్క్రీన్ మీద "అనంత్ కాలింగ్..." అని మెరిసింది.

​ఆదిత్య ముఖం చిరాకుతో ముడుచుకుంది. "మళ్ళీ వీడా? ఈ 'నెగెటివ్ ఎనర్జీ' ఒకటి," అని గొణుక్కుంటూ అయిష్టంగానే కాల్ లిఫ్ట్ చేశాడు.

​"చెప్పురా అనంత్, నీ 'మిడిల్ క్లాస్ ట్రాజెడీ' ఏంటో త్వరగా ముగించు. రేపు పొద్దున్నే హైటెక్ సిటీలో ఇంపార్టెంట్ క్లైంట్ మీటింగ్ ఉంది," అన్నాడు ఆదిత్య, ఆవులిస్తూ.

​అవతల అనంత్ గొంతు వణుకుతోంది. "ఆది... కాసేపు మాట్లాడగలవా? ఆఫీసులో ప్రకాష్ ఈరోజు టీమ్ అందరి ముందు నన్ను దారుణంగా ఇన్సల్ట్ చేశాడురా. అమ్మకు (NIMS) లో సర్జరీ టెన్షన్ లో ఉంటే, వీడేమో రిజైన్ చేయమని వార్నింగ్ ఇచ్చాడు. నాకు ఊపిరి ఆడటం లేదురా... ఒక్క ఐదు నిమిషాలు నా బాధ వినవా?"

​ఆదిత్యకు పదేళ్ల క్రితం నాటి దృశ్యం ఒకటి మెరుపులా గుర్తొచ్చింది. ఆదిత్య తన మొదటి స్టార్టప్ కోసం పది లక్షల అప్పు చేసి మునిగిపోయినప్పుడు, అనంత్ తన సొంత ఊరిలో ఉన్న చిన్నపాటి పొలాన్ని అమ్మేసి ఆ డబ్బు ఆదిత్య చేతిలో పెట్టాడు. "నువ్వు గెలవాలి ఆది, ఆ తర్వాతే మనం మాట్లాడుకుందాం," అన్న అనంత్ నవ్వు ఆదిత్య కళ్ళ ముందు కదిలింది.

​కానీ ఆ జ్ఞాపకం ఇప్పుడు ఆదిత్యకు ఒక భారంగా అనిపించింది. ఆ అప్పు ఎప్పుడో తీర్చేశాడు, కానీ ఆ 'కృతజ్ఞత' తీర్చుకోవడం తన వల్ల కాదు.

​ఆదిత్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. "చూడు అనంత్, నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు పదేళ్ల క్రితమే ఉండిపోయావు. ఎమోషన్స్ తో బిజినెస్ నడవదు. ప్రకాష్ తిట్టాడంటే నువ్వు రిజల్ట్స్ ఇవ్వలేదని అర్థం. ముందు ఆ ఏడుపు ఆపి, కొంచెం 'మెంటల్ టఫ్నెస్' పెంచుకో. సరే, నాకు నిద్ర వస్తోంది. ఎంజాయ్ యువర్ స్ట్రెస్!"

​ఆదిత్య కాల్ కట్ చేసి ఫోన్‌ను బెడ్ మీద విసిరి కొట్టాడు. "ఛీ.. వీడితో ఇదే లాస్ట్ కాల్. ఆ పాత జ్ఞాపకాల్ని వాడుకుని నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు," అని మనసులో అనుకున్నాడు. ఆదిత్య దృష్టిలో అది అనంత్‌తో తనకున్న స్నేహానికి 'చివరి కాల్'. కానీ విధి వెటకారం ఏంటంటే... అది అనంత్ జీవితానికే 'చివరి కాల్' అయిపోయింది.

​రెండు రోజుల తర్వాత. రాత్రి పది దాటింది.

​బాల్కనీలో నిలుచున్న ఆదిత్య చూపులు తన గదిలో హ్యాంగర్‌కు తగిలించి ఉన్న ఆ 'లిమిటెడ్ ఎడిషన్' బ్లాక్ షర్ట్ మీద పడ్డాయి. జూబ్లీహిల్స్ లోని ఒక ఎలైట్ బోటిక్ లో కొన్న ఆ షర్ట్ మీద ఉన్న ప్రీమియం సిల్క్ మెరుపు, రేపు మహాప్రస్థానంలో జరిగే అంత్యక్రియల దగ్గర మీడియా కెమెరాల ముందు తన 'గౌరవప్రదమైన శోకాన్ని' ఎంత బాగా ఎలివేట్ చేస్తుందో ఊహించుకుని ఒకసారి గర్వంగా ఆ షర్ట్ ని ముట్టుకున్నాడు. ఆ మృదువైన స్పర్శ అతనికి ఒక రకమైన విజేత భావనను ఇచ్చింది.

​అతను సోషల్ మీడియా ఓపెన్ చేశాడు. అక్కడ అప్పుడే శవాల మీద పేలాలు ఏరుకునే పోటీ మొదలైపోయింది.

​మొదటగా రాకేష్ పోస్ట్. ఆశ్చర్యంగా రాకేష్ తన మెర్సిడెస్ కారు ఫోటో పెట్టలేదు. కేవలం నల్లటి బ్యాక్‌గ్రౌండ్ పెట్టి ఒకే ఒక్క వాక్యం రాశాడు: "I'm sorry Ananth. నీ ఐడియాను ఎగతాళి చేసిన ఆరోజు... నువ్వు కనీసం భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయావని నాకు తర్వాత తెలిసింది. నన్ను క్షమించు." ఆదిత్యకు రాకేష్ ని చూసి జాలి వేసింది. "అయ్యో పాపం.. గిల్ట్ తో కొట్టుకుంటున్నాడు. వీక్ మైండెడ్ ఫెలో," అని నవ్వుకున్నాడు.

​కానీ అనంత్ బాస్ ప్రకాష్ మాత్రం ఆదిత్య లాగే 'స్ట్రాంగ్'. అనంత్ చనిపోయిన గంటలోనే అతని సీటులో ఎవరిని కూర్చోబెట్టాలా అని హెచ్.ఆర్ కి మెయిల్ పంపిన ప్రకాష్, ఇప్పుడు 'జెమ్' అంటూ కవిత్వాలు రాస్తున్నాడు.

​ఆదిత్య సిగరెట్ వెలిగించి, దూరాన మెరుస్తున్న కేబుల్ బ్రిడ్జ్ వైపు చూస్తూ తనలో తాను నవ్వుకున్నాడు.

​"చిత్రం ఏంటంటే... ప్రతి ఒక్కరూ తమ సొంత కథలో హీరోలే. తాము చేసే ప్రతి తప్పుకీ వాళ్ళ దగ్గర ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. కానీ, ఎదుటివాళ్ల కథలో మాత్రం తెలియకుండానే విలన్లు అయిపోతారు. అనంత్ కథలో ఈరోజు నేను, రాకేష్, ప్రకాష్... మేమంతా విలన్లమే. కాకపోతే రాకేష్ లాంటి వాళ్ళు మధ్యలోనే భయపడి ఆగిపోతారు. నాలాంటి వాళ్ళే చివరి వరకు పర్ఫెక్ట్ గా నటించగలరు!"


​అతను తన టీమ్‌లోని జూనియర్ విజయ్‌కి మెసేజ్ టైప్ చేశాడు. విజయ్ ఈ మధ్య వర్క్ ప్రెజర్ వల్ల సరిగ్గా నిద్రపోవట్లేదని ఆదిత్యకు తెలుసు. నిన్ననే ఆదిత్య అతన్ని అందరి ముందు 'యూస్‌లెస్' అని అవమానించాడు.

​"విజయ్, నిన్న నిన్ను తిట్టినందుకు సారీ. రేపు ఆఫీస్ కి రా, మనం కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. పని కంటే మనుషులు ముఖ్యం కదా!" అని సెండ్ కొట్టాడు. ఆ మెసేజ్ విజయ్‌కి చేరిందా లేదా అన్నది ఆదిత్యకు అనవసరం. ఆ మెసేజ్ పంపడం ద్వారా తనలోని 'విలన్'ను హీరోగా రీ-బ్రాండింగ్ చేసుకున్నాననే తృప్తి కలిగితే చాలు.

​తర్వాతి అడుగు—తన సోషల్ మీడియా ప్రొఫైల్. అనంత్ ఫోటో పెట్టి, ఒక తత్వవేత్తలా ఇలా రాశాడు:

​"Let others live in peace(LIP)… before they rest in peace(RIP)".. మనిషి పోయాక శాంతించమని కోరడం కంటే, బతికున్నప్పుడే ప్రశాంతంగా బతకనివ్వడం గొప్పది. #Humanity #LIP #Hyderabad"


​వెంటనే లైకులు, కామెంట్లు వెల్లువెత్తాయి. ఆదిత్య ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి, తన ప్రతిబింబాన్ని బాల్కనీ గ్లాస్‌లో చూసుకున్నాడు. సిగరెట్ పొగను గాల్లోకి వదిలినప్పుడు, అది ఒక నకిలీ శాంతిని మోసుకొచ్చింది. అనంత్ ఆఖరి ఫోన్ కాల్ లో ఉన్న వణుకు ఒక క్షణం గుర్తొచ్చినా, ఆ పొగతో పాటే దాన్ని కూడా బయటకు ఊదేశాడు.

​లోపలికి నడిచి, అద్దం ముందు నిలబడి తన 'దుఃఖాన్ని' ఒకసారి ప్రాక్టీస్ చేశాడు. కనురెప్పల చివర చిన్న తడి.. పెదవి మీద ఒక చిన్న వణుకు. పర్ఫెక్ట్. ఆత్మసంతృప్తితో లైట్లు ఆర్పేసి, రేపటి 'పర్ఫార్మెన్స్' కోసం నిద్రలోకి జారుకున్నాడు.

​ఆఖరిగా అతను అనుకున్న మాట...

"RIP అనంత్... థాంక్స్ ఫర్ ద కంటెంట్!"