Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

‘ప్రేమ’ చేతిలో ఓడిన ఓ ‘విజేత’ కథ..

‘ప్రేమ’ చేతిలో ఓడిన ఓ ‘విజేత’ ..

తిరుపతి నుంచి హైదరాబాదు వెళ్ళే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ మరికొద్దిసేపట్లో ఫ్లాట్‌ఫారం పైకి వస్తుందన్న అనౌన్స్‌మెంట్‌ విని ఉలిక్కిపడింది సౌందర్య. ‘సుందర్‌ ఇంకా రాలేదు’ అనుకుంది. చేతిలోని హ్యాండ్‌బ్యాగ్‌ని గట్టిగా రెండు చేతులతో పట్టుకుని చుట్టూ చూసింది. సుందర్‌ ఎక్కడా కనిపించలేదు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఊరు వదలి వెళ్తున్నందుకు ఆమెకు ఎంతో బాధగా మరెంతో భయంగా ఉంది. ఇప్పుడు సుందర్‌ కనపడకపోవడంతో ఆమెకి మనసులో ఏ మూలో ఆశ మొదలైంది.

‘సుందర్‌ రాకపోతే తను ఇంటికి వెళ్ళిపోవచ్చు. అమ్మానాన్నలు ఎక్కడికెళ్ళావని అడిగితే ఏదో ఒక కారణం చెప్పి నమ్మించవచ్చు. తనను రమ్మని చెప్పి అతను రాకపోవడం సుందర్‌ తప్పు కనుక తనను నిందించడు’ అనుకుంది.

ఆ ఆలోచన రాగానే ఆమెకి నిశ్చింతగా అనిపించింది. 

ఇంతలో ట్రైను వచ్చి ఫ్లాట్‌ఫారం పైన ఆగింది. తను ఎక్కవలసిన ‘ఎస్‌-టూ’ కంపార్ట్‌మెంట్‌ తన ఎదురుగానే ఉంది. 

ఆమె బెంచీపైనే కూర్చుని ఉరుకులు పరుగులు పెడుతూ ట్రైను వైపు వస్తున్న ప్రయాణికులను చూస్తూ ఉండిపోయింది. 

గార్డ్‌ విజిల్‌ ఊదాడు. సుందర్‌ ఇక రాడని నిశ్చయించుకుని ఆమె లేచి నిలబడింది. అప్పుడు మోగింది ఆమె ఫోన్‌.

సుందర్‌ చేస్తున్నాడు. వెంటనే కాల్‌ రిసీవ్‌ చేసుకుని ‘‘సుందర్‌...ఎక్కడున్నావ్‌?’’ అని అడిగింది.

‘‘ముందు నువ్వు ట్రైను ఎక్కు’’ అన్నాడు సుందర్‌.

‘‘నువ్వు..?’’

‘‘నేను జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లో ఉన్నాను. తెలిసినవాళ్ళు మనిద్దరినీ చూస్తే ఇబ్బందవుతుంది. నేను కావలిలో నీ దగ్గరికి వస్తాను. త్వరగా ఎక్కు.’’

ఆమెకు ఆలోచించడానికి కూడా సమయం దొరకలేదు. పరుగున వెళ్ళి ట్రైను ఎక్కేసింది.

కావలిలో సుందర్‌ ఆమెని కలుసుకున్నాక అంతవరకూ ఆమెలో ఉన్న ఆందోళన మాయమైంది. అతనితో కబుర్లు చెబుతూ ఉత్సాహంగా గడిపింది. 

*                       *                       *

బెర్తుపై పడుకుని ఉన్న సౌందర్యకు నిద్ర పట్టలేదు. సుందర్‌ వైపు చూసింది. అతను మంచి నిద్రలో ఉన్నాడు. ఆమెకి తన తల్లిదండ్రులు పదే పదే గుర్తుకు వస్తున్నారు. 

‘అమ్మానాన్నా తను ఇంటికి రాకపోవడంతో బాగా కంగారుపడి ఉంటారు. నాన్న తనను వెతుకుతూ స్కూటర్‌పైన ఊరంతా తిరుగుతూ ఉంటాడు. తన స్నేహితురాళ్ళ ఇళ్ళకు పరుగులు పెడుతూ ఉంటాడు. 

అమ్మ తను నమ్మే దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉంటుంది.’

సౌందర్యకి అమాయకంగా కనిపించే తన తల్లి ముఖం గుర్తొచ్చింది. మాటలతోకన్నా తన చేతలద్వారా ఎక్కువ ప్రేమని చూపే తండ్రి గుర్తొచ్చాడు... ఆమె కళ్ళనిండా నీళ్ళు నిండాయి.

నిజానికి తల్లికంటే తండ్రితోనే తనకు బంధం ఎక్కువ. చిన్నప్పట్నుంచీ- ఆయన ఎక్కడికి వెళ్ళినా తనను కూడా స్కూటర్‌పైన ఎక్కించుకుని వెళ్ళేవాడు. స్నేహితుల ఇళ్ళకూ గుళ్ళకూ మార్కెట్‌కూ సినిమాలకూ... ఇలా ఆయన వెళ్ళే ప్రతిచోటికీ తనని వెంటేసుకుని వెళ్ళేవాడు. వ్యాయామం కోసం ఉదయంపూట ఓ క్లబ్‌లో షటిల్‌ ఆడేవాడు. స్కూలు సెలవురోజుల్లో అక్కడికి తనని తీసుకుని వెళ్ళేవాడు. అందరూ ఆడటం అయిపోయాక తనతో కొంతసేపు ఆడేవాడు. 

ఇంటర్‌లో తను బైపీసీ గ్రూపు తీసుకుంటాననీ తనకు డాక్టర్‌ కావాలని ఉందనీ చెబితే నాన్న సరేనన్నారు. నాన్న చేస్తున్నది ప్రైవేటు ఉద్యోగం. ఆ గ్రూపు చదవడానికీ, తర్వాత కోచింగులకూ, ఆ తర్వాత మెడిసిన్‌ చదవడానికీ ఎంతో ఖర్చవుతుందని తెలిసినా తన కోరికని కాదనలేదు. 

కాలేజీలో రోజూ రెగ్యులర్‌ క్లాసులు అయ్యాక ఎంసెట్‌ కోచింగ్‌ క్లాసులు ఉండేవి. నాన్న సాయంత్రం కాలేజీ దగ్గరికి వచ్చి తనకు తినడానికి ఏదో ఒకటి ఇచ్చేవాడు. తన కాలేజీ నాన్న ఆఫీసు 
నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు ఉండేది. అయినా శ్రమ అనుకోకుండా వచ్చేవాడు. తర్వాత రాత్రి తొమ్మిది గంటల వరకూ అక్కడే ఎక్కడో తిరుగుతూ ఉండేవాడు. 

తన క్లాసులయ్యాక తనని స్కూటర్‌ మీద ఇంటికి తీసుకెళ్ళేవాడు.

ఎంట్రన్స్‌లో సరైన ర్యాంకు రాకపోవడంతో చాలా డీలా పడింది తను. అప్పుడు అమ్మానాన్నలు తననెంతో ఊరడించారు. బాధ మరచిపోవడానికి రోజూ తనని బయటకు తీసుకెళ్ళేవారు. నాన్న ఎక్కువ సమయం తనతోనే గడిపేవాడు. తను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా స్ఫూర్తిదాయకమైన విషయాలు ఎన్నో చెప్పేవాడు. తను తొందరగానే ఆ బాధనుంచి బయటికివచ్చి బీఎస్‌సీలో చేరింది.
తమ ఇంటి పక్కనున్న ఖాళీ స్థలం శుభ్రం చేయించి- షటిల్‌ కోర్టు తయారుచేసి- తనతో, తల్లితో షటిల్‌ ఆడేవాడు నాన్న. తను బాగా ఆడటం గమనించి టౌన్లో జరిగే టోర్నమెంట్లకు తీసుకెళ్ళి ఆడించేవాడు. క్రమంగా తను ఊర్లో మంచి షటిల్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

నాన్న తనకు స్కూటీ కొనిచ్చి డ్రైవింగ్‌ నేర్పించాడు. తర్వాత నాన్నకు ఆఫీసు ఉన్న సమయాల్లో తనే స్కూటీ డ్రైవ్‌ చేసుకుంటూ షటిల్‌ ప్రాక్టీస్‌కు వెళ్ళేది.

ఎక్కువమంది ప్లేయర్లతో ఆడితే తన ఆట మరింత మెరుగవుతుందని ఓ స్పోర్ట్స్‌ క్లబ్‌లో తనని చేర్పించాడు నాన్న. అక్కడ పరిచయమయ్యాడు సుందర్‌. అతను తరచుగా క్లబ్‌కు వచ్చి క్యారమ్స్‌ ఆడేవాడు. తనతో పరిచయమయ్యాక షటిల్‌ ఆడేవాడు. ఒక్కోసారి తనతో ఆడేవాళ్ళు ఎవరూ లేకుండా ఖాళీగా కూర్చుని ఉంటే సుందర్‌ ‘నేను వస్తాను పదండి... మీకు ప్రాక్టీస్‌ అవుతుంది’ అంటూ వచ్చేవాడు.

అతి త్వరలోనే అతను స్నేహితుడిగా మారాడు. మరికొద్దిరోజుల్లో ప్రేమికుడయ్యాడు. తను బీకాం చదువుతున్నాననీ తమది మధ్యతరగతి కుటుంబమనీ బిజినెస్‌ చేసి కోటీశ్వరుడు కావడం తన జీవిత ధ్యేయమనీ చెప్పేవాడు. భార్యని కార్లలో, విమానాల్లో తిప్పడం తన ఆశయమని చెప్పాడు. ఓ రోజు అతను ప్రపోజ్‌ చేయగానే తను ఓకే చెప్పేసింది. అప్పుడు ఎందుకో తనకు తల్లీ తండ్రీ గుర్తుకురాలేదు. 

సుందర్‌తో ఉంటే సమయం ఎలా గడుస్తుందో తెలిసేదే కాదు. అతనికోసం ఆత్రుతగా ఎదురుచూడటం... అతను రాగానే సంతోషపడిపోవడం... అతను ప్రేమకబుర్లు చెబుతుంటే మురిసిపోవడం... అతను వెళ్ళిపోతుంటే డీలాపడిపోవడం... రాత్రంతా అతని గురించే ఆలోచించడం... ఉదయం లేవగానే మళ్ళీ అతన్ని కలవబోతున్నానన్న ఆనందంతో క్షణాలు యుగాల్లా గడపడం అలవాటయిపోయింది.

తన ప్రేమ విషయం తండ్రితో చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించి విరమించుకుంది. ఆయన ఎంత క్లోజ్‌గా ఉన్నా ఒక్కోసారి సీరియస్‌గా ఉండేవాడు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించేవాడు కాదు. అందుకే ఆ ధైర్యం చేయలేకపోయింది.

ఓరోజు సుందర్‌ తనతో ‘మా నాన్న నీ గురించి చెప్పగానే ఉగ్రుడైపోయాడు. తన మేనకోడలితో నా పెళ్ళి చేయాలని పెద్దలు ఏనాడో డిసైడ్‌ అయ్యారట. ‘పిచ్చివేషాలేస్తే తాట తీస్తా. ఆ అమ్మాయి ఇంటికెళ్ళి ఆమె పెద్దల్ని కడిగేసివస్తా’నంటూ బయలుదేరారు. నేను కాళ్ళు పట్టుకుని ఆపాను’ అన్నాడు.

తను షాక్‌తిన్నట్టు చూస్తూండిపోయింది.

‘మీ నాన్న చాలా స్ట్రిక్ట్‌ అని చెప్పావు. ఆయన కులాంతర వివాహానికి ఒప్పుకోకపోవచ్చు. మనిద్దరం హైదరాబాదుకెళ్ళి గుడిలో పెళ్ళి చేసుకుని, కొంతకాలం తర్వాత తిరిగొస్తే అప్పటికి పెళ్ళయిపోయి ఉంటుంది కాబట్టి మన పెద్దలు ఇంకేమనలేక మనల్ని తమతో కలుపుకుంటారు. పైగా ఇద్దరూ పరువుకోసం పాకులాడేవాళ్ళే కాబట్టి మరోసారి మనకు పెళ్ళికూడా చేస్తారు’ అన్నాడు నవ్వుతూ.

‘ఒకవేళ వాళ్ళు అలా మనల్ని క్షమించకపోతే?’‘అప్పుడు హైదరాబాదుకే వెళదాం. 

అక్కడ నాకు స్నేహితులు ఉన్నారు. 

చేతిలో డిగ్రీలు ఉన్నాయి కాబట్టి మనకు ఉద్యోగాలు చూసిపెడతారు’ అన్నాడు. 

తాను ఒప్పుకుంది. అంతేకాదు, అతని ప్రోద్బలంతో ఇంట్లోని నగలు కూడా తీసుకుని తన బ్యాగులో పెట్టుకుంది.

ట్రైను ఏదో స్టేషన్‌లో ఆగినట్లుంది. సుందర్‌ ఆమె దగ్గరికొచ్చి ఆమె చెవిలో ‘‘బ్యాగు జాగ్రత్త’’ అని చెప్పడంతో ఆలోచనల్నుంచి బయటకు వచ్చి, 

నగలున్న బ్యాగుని తన గుండెలకు హత్తుకుని, దుప్పటి కప్పుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది సౌందర్య.

*                       *                       *

వారంరోజుల తర్వాత ఓ రోజు... హోటల్‌ గదిలో నిద్రపోతున్న సౌందర్య కాలింగ్‌బెల్‌ మోగిన శబ్దానికి నిద్రలోంచి మేల్కొని తలుపు తీసింది. ఎదురుగా రూమ్‌బాయ్‌ నిలబడి ఉన్నాడు. ఏమిటన్నట్టు చూసింది అతనివైపు.

‘‘సార్, రూము బిల్లు కట్టేశారు. 

మీరు ఎనిమిది గంటలకు గది ఖాళీ చేస్తారని సార్‌ చెప్పారు’’ అన్నాడు అతను.

‘‘సార్‌ కింద ఉన్నారా?’’

‘‘లేదు మేడమ్‌. ఆయన లగేజీ తీసుకుని వెళ్ళిపోయారు.’’

నెత్తిన బాంబు పేలినట్లు ఫీలయింది సౌందర్య. ఆ రూమ్‌బాయ్‌ ముందు అవమానంగా కూడా అనిపించింది.

‘‘నేను లగేజీ సర్దుకున్నాక ఫోన్‌ చేస్తాను’’ అంటూ తలుపేసింది.

ఆమె ఇంకా షాకులోనే ఉంది. 

సుందర్‌ ఎక్కడికి వెళ్ళాడు? వెళుతున్నట్లు తనకెందుకు చెప్పలేదు. ఒకవేళ అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చినా తర్వాతైనా తనకు ఫోన్‌ చేసి ఉండొచ్చుగా.

వెంటనే డ్రెస్సింగ్‌ టేబుల్‌పైన ఉన్న మొబైల్‌ని అందుకుని సుందర్‌కు కాల్‌ చేసింది. సెల్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉందని బదులొచ్చింది.

కొంతసేపు ‘ఏం చేయాలా’ అని ఆలోచిస్తూండిపోయింది. ఎందుకో ఆమె మనసు కీడు శంకించింది. సుందర్‌ ఇక రాడని మనసు చెబుతోంది. ‘చిన్నప్పట్నుంచీ తను క్లాసులో ఫస్ట్‌ వచ్చేది. టీచర్లూ బంధువులూ స్నేహితులూ అందరూ తన తెలివితేటలను మెచ్చుకునేవారు. మరి సుందర్‌ విషయంలో తన తెలివితేటలు ఏమయ్యాయి? ప్రతి విషయంలోనూ మంచీ చెడూ బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకునే తను ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంది? సుందర్‌ ‘హైదరాబాదుకు వెళ్దాం’ అనగానే తను ఎందుకు వద్దని గట్టిగా చెప్పలేకపోయింది? వయసు ప్రభావమా లేక ప్రేమ మైకమా?’ అనుకుని బాధపడింది. 

ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడమో లేక జనారణ్యంలోకి వెళ్ళి బతుకును కుక్కలు చింపిన విస్తరి చేసుకోవడమోకన్నా... తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికే వెళ్ళి, వారిని క్షమాపణ వేడి, భవిష్యత్తులో వారికి ఎటువంటి క్షోభా కలిగించనంటూ మాటివ్వాలని నిర్ణయించుకుంది. తర్వాత లేచి తన దగ్గర ఉన్న డబ్బులు ఊరికి వెళ్ళడానికి సరిపోతాయో లేదోనని హ్యాండుబ్యాగు తెరచి చూసిన ఆమె షాక్‌ తిన్నట్టు కూర్చుండిపోయింది. 

హ్యాండుబ్యాగులో- తను తెచ్చిన నగలు లేవు. 

*                       *                       *

వైజాగ్‌ నగరంలో అత్యంత అధునాతనమైనదిగా పేరుపొందిన ‘దివ్య హాస్పిటల్‌’లోని విజిటర్స్‌ లాంజ్‌లో కూర్చుని ఉన్నాడు సుందరమూర్తి. అతని భార్య విద్యాధరి ఆపరేషన్‌ ధియేటర్‌లో ఉంది. మరికాసేపట్లో ఆమెకి సర్జరీ జరగబోతోంది. పేదవాళ్ళ హాస్పిటల్‌గా పేరున్నా, పేరొందిన డాక్టర్లు అందులో పనిచేస్తూండటం, దేశంలోనే మంచి హాస్పిటల్‌గా పేరు పొంది ఉండటం వల్ల అతను తన భార్యని ఇక్కడ చేర్పించాడు. చాలా హాస్పిటల్స్‌లో చూపించినా వ్యాధి నయంకాక, చావుతో పోరాడుతున్న ఆమెకి ఇక్కడ సరైన వైద్యం లభిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.

దాదాపు రెండుగంటలసేపు అక్కడున్న మ్యాగజైన్స్‌ తిరగేసిన అతను, కాఫీ తాగి వద్దామని బయలుదేరుతూంటే ఎదురుగా దాదాపు యాభై యాభైఅయిదు ఏళ్ళ మధ్య వయసున్న స్త్రీ కనిపించింది. ఆమెని చూసి ‘ఈమె సౌందర్యలా ఉందే’ అనుకుంటూ ఆమెవైపు పరిశీలనగా చూశాడు. అంతలో ఆమె అతన్ని చూసి పలకరింపుగా నవ్వింది.

‘‘హాయ్‌ సౌందర్యా!’’ అన్నాడు ఆమె ఇక్కడికెలా వచ్చిందని ఆశ్చర్యపోతూ. ఇంతలో ఓ గదిలోంచి నర్సు వచ్చి ‘‘సిస్టర్‌’’ అని పిలవడంతో ‘‘ఆ... వస్తున్నా’’ అంటూ ఆ గదిలోకి వెళ్ళిపోయింది సౌందర్య.

‘సౌందర్య ఇంకా చాలా అందంగానే ఉంది. ఆమె తనని ప్రేమించింది కానీ తను ప్రేమించలేదు. ప్రేమించినట్లు నటించాడు... అంతే! పాపం తనను నమ్మి హైదరాబాదుకు వచ్చేసింది. వారం రోజులు ఆమెతో గడిపి, ఆమె తెచ్చిన నగలు తీసుకుని చెప్పకుండా వచ్చేశాడు తను. అక్కడ్నుంచి నేరుగా విజయవాడ వెళ్ళి, ఆ నగలు అమ్మి, వచ్చిన డబ్బుతో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. క్రమంగా బిజినెస్‌ పెరిగి, కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. అలా పరిచయమైన ఓ పెద్ద కాంట్రాక్టర్‌ అతని కూతుర్నిచ్చి పెళ్ళి చేశాడు. అప్పట్నుంచీ మరింత ఎదిగి ఇప్పుడు తను విజయవాడలోనే నంబర్‌ వన్‌ కాంట్రాక్టర్‌గా ఉన్నాడు.

తను వ్యాపారం ప్రారంభించాక సౌందర్య గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే వయసు మీదపడుతున్న సమయంలో సౌందర్య గుర్తుకు వచ్చింది. ఆమెకి తను చేసిన అన్యాయం గుర్తొచ్చింది. భార్య అనారోగ్యం పాలవడంతో తనలో పాపభీతి మొదలైంది. ఆమె కనిపిస్తే పాపపరిహారంగా కొంత డబ్బు ముట్టజెప్పాలని తను అనుకున్నాడు. ఈరోజు అనుకోకుండా ఆమె కనిపించింది. ఆమెనుంచి తీసుకున్న నగలు ఆరోజు అమ్మితే లక్ష రూపాయలు వచ్చింది. బ్యాంకు వడ్డీ లెక్కవేసుకుంటే ఇప్పటికి ఆ సొమ్ము అయిదు లక్షల వరకూ ఉంటుంది. ఆ సొమ్ముకు చెక్కు రాసి సౌందర్యకి ఇస్తే తనకు పాపవిముక్తి కలుగుతుంది, నర్సుగా పనిచేస్తున్న ఆమెకు ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుంది’ అనుకున్నాడు.

అంతలో గదిలోంచి బయటికి వచ్చిన సౌందర్య ‘‘రా సుందర్‌’’ అంటూ ఓ గదిలోకి తీసుకెళ్ళి కూర్చోమని చెప్పింది. పేషెంటు కుటుంబ సభ్యులతో డాక్టర్లు వ్యక్తిగతంగా మాట్లాడేందుకు కేటాయించిన గది అది. సౌందర్య ఎవరికో ఫోన్‌ చేసి కాఫీ తెమ్మని చెప్పింది. తర్వాత సుందర్‌ వైపు చూసి ‘‘చెప్పు సుందర్‌’’ అంది.

సుందర్‌ తను చేసిన పనికి పశ్చాత్తాపపడుతున్నట్లు ఆమెతో చెప్పాడు. పాపపరిహారంగా ఆమెకి అయిదు లక్షలు ఇవ్వాలనుకుంటున్నట్లు కూడా చెప్పాడు. సౌందర్య ఏం మాట్లాడకుండా- ఎదురుగా ఉన్న దినపత్రికలోని ఓ న్యూస్‌ ఐమ్‌ని చూడమని ఇచ్చింది. చూసిన సుందర్‌ షాకయ్యాడు.

ఇటీవల విజయవాడలో వరదల వల్ల నష్టపోయిన వాళ్ళకోసం ‘దివ్య హాస్పిటల్‌’ ఎండీ సౌందర్య పాతిక లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేస్తున్న వార్తతోపాటు ముఖ్యమంత్రి పక్కన నిలబడి ఉన్న ఆమె ఫొటో కూడా వేశారు అందులో.

‘‘ఈ హాస్పిటల్‌ నీదా?’’ ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె అవునన్నట్లు తలూపింది.

‘‘మరి నిన్ను ‘సిస్టర్‌’ అని పిలిచింది ఆ నర్సు?’’ అనుమానంగా అడిగాడు.

‘‘నన్ను అలాగే పిలవమని అందరికీ చెప్పాను, ఎండీ హోదా నా తలకు ఎక్కకుండా.’’

ఇంతలో ఓ సిస్టర్‌ కాఫీ తెచ్చింది. ఇద్దరూ కాఫీ తాగసాగారు.

‘‘నిన్ను ఇలా చూస్తానని అసలు ఊహించలేదు నేను’’ అన్నాడు. అతను ఇంకా షాకులోనే ఉన్నట్టు అర్థమైంది ఆమెకి.

‘‘ఇంకెలా ఊహించావు సుందర్‌? మోసపోయినదాన్ని కాబట్టి ఇంట్లోవాళ్ళు తరిమేస్తే నాలుగిళ్ళలో పాచిపని చేసుకుంటూ నా బిడ్డని పెంచుకుంటూ ఉంటానని అనుకున్నావా... లేక ఒళ్ళమ్ముకుని బతుకుతూ జీవచ్ఛవంలా ఉంటాననుకున్నావా?’’‘‘బిడ్డా?’’ మళ్ళీ ఆశ్చర్యంగా అడిగాడు.

‘‘అవును. నువ్వు వెళ్ళిపోగానే... కాదు కాదు... పారిపోగానే నేను ఇంటికి వెళ్ళాను. తలుపు తడితే మా నాన్న తలుపు తీసి ఇంట్లోకి రమ్మన్నారు. విషయం చెబితే నన్ను గుండెలకు హత్తుకున్నారు. అమ్మ ఎంతగానో ఓదార్చింది. జీవితంలో తప్పులు చేయడం సహజమే అంది. ఒక్క తప్పు చేసినంత మాత్రాన జీవితం చీకటి చేసుకోవలసిన అవసరం లేదంది. 

మొదట్లో ‘నీపై ఎలా పగ సాధించాలా’ అని అనుక్షణం ఆలోచించేదాన్ని. మా నాన్న నా ఆలోచనల్ని తప్పుపట్టారు. ‘నువ్వు పగ సాధిస్తే, ఇక తర్వాత ఇక సాధించడానికేమీ ఉండదు. ఆ కసిని నువ్వు ఎదగడానికి ఉపయోగించు. అతనికంటే ఎత్తుకు ఎదిగాక కర్మ అతన్ని నీ దగ్గరికి రప్పిస్తుంది. నిన్ను చూసి తల దించుకునే పరిస్థితి అతనికి వస్తుంది’ అన్నారు. వాళ్ళిద్దరి ప్రోత్సాహంతో మెడిసిన్‌ ఎంట్రన్స్‌కి చదివాను. అప్పుడే నేను గర్భవతినని తెలిసింది. ఇల్లు కదలకుండా చదువుకుని వైజాగ్‌లోని ఓ మెడికల్‌ కాలేజీలో సీటు తెచ్చుకున్నాను. అమ్మానాన్నలు పాపను చూసుకుంటే నేను ఎంబీబీఎస్‌ పూర్తిచేశాను, ఎంఎస్‌ కూడా చేశాను. చిన్న క్లినిక్‌తో మొదలైన నా ప్రస్థానం ఇంత పెద్ద హాస్పిటల్‌కి ఎండీ అవడం వరకూ సాగింది. మా హాస్పిటల్‌లో పనిచేసే ఓ సహృదయుడైన డాక్టర్‌ నన్ను వివాహం చేసుకున్నారు.’’

ఆశ్చర్యంగా వింటూండిపోయాడు సుందర్‌.

‘‘మా హాస్పిటల్‌కి వచ్చే అమ్మాయిల్లో నాలా మోసపోయి గర్భవతులైన అమ్మాయిలు ఉంటే ప్రత్యేకంగా కౌన్సిలింగ్‌ ఇచ్చి వారికి పరిస్థితులతో ధైర్యంగా పోరాడటం నేర్పిస్తున్నాను. ఆర్థికంగా వెనుకబడి ఉంటే నా సహాయ సహకారాలు అందించి వారు ఉన్నత స్థాయికి చేరేలా చూస్తున్నాను. 

అలా నేను ప్రోత్సహించినవారంతా ఈరోజు డాక్టర్లుగా ఇంజినీర్లుగా కలెక్టర్లుగా పనిచేస్తున్నారు.’’

‘‘నిన్ను మోసం చేశానని నా మీద కోపంగా లేదా?’’

‘‘అయ్యో, నువ్వు మోసం చేయడం ఏమిటి సుందర్‌? నువ్వు నా గురువువి. నాకు ఎన్ని పాఠాలు నేర్పావు... మనుషుల్ని గుడ్డిగా నమ్మకూడదని నేర్పించావు. పైకి ప్రేమ చూపుతూనే అదను చూసి కాటేసే విషసర్పాల్లాంటి మనుషులు ఎలా ఉంటారో చూపించావు. డబ్బు దగ్గర నిర్లక్ష్యం ఉండకూడదని నేర్పావు. కనిపెంచిన తల్లిదండ్రులను మోసం చేయకూడదని తెలియచెప్పావు. నువ్వు చేసిన పనివల్ల జీవితంలో ఎలా పోరాడాలో నేర్చుకున్నాను, ఓ ధ్యేయం ఏర్పరచుకుని ఎలా ఎదగాలో నేర్చుకున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళకుండా ఉండి ఉంటే, నీతో జీవితం పంచుకోవడంతోపాటు నీ పాపాలు కూడా నేను పంచుకోవలసి వచ్చేది. ఆ పాపాల నుండి నన్ను కాపాడిన నీపైన నాకు కోపం ఎందుకు ఉంటుంది సుందర్‌? అసలు నువ్వు ఆరోజు అలా వదిలి వెళ్ళిపోకుంటే నేను ఈరోజు ఇలా ఉండేదాన్నా? అందుకే నువ్వంటే నాకు గౌరవం’’ నిర్మలంగా నవ్వుతూ అంది సౌందర్య.

ఇంతలో తెల్లని కోటు ధరించి, మెడలో స్టెతస్కోపుతో ‘‘అమ్మా’’ అంటూ ఆ గదిలోకి రాబోతూ గుమ్మం దగ్గరే ఆగిపోయిన యువతిని చూసి ‘‘రా దివ్యా, ఏమిటి విషయం?’’ అని అడిగింది సౌందర్య.

‘‘కంగ్రాట్స్‌ అమ్మా! విద్యాధరిగారికి స్పృహ వచ్చిందట. డాక్టర్‌ పరిమళ ఫోన్‌ చేసి చెప్పింది. ఆవిడ భర్త కదా ఈయన?’’ అని అడిగింది ఆ అమ్మాయి సుందర్‌ను చూస్తూ.
ఆ వార్త వినగానే అతని ముఖం ఆనందంతో నిండిపోయింది.

అవునన్నట్టు తలూపి ‘‘థాంక్యూ’’ అన్నాడు ఆ అమ్మాయివైపు చూస్తూ.

ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోగానే ‘‘నీ భార్యతో ఈ హాస్పిటల్‌లో అడుగు పెడుతున్నప్పుడే నిన్ను చూసి గుర్తుపట్టాను. మా గురువులు నేర్పించిన ‘అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!’ పద్యం గుర్తొచ్చింది. నీ భార్య కేసుని ఓ ఛాలెంజ్‌గా తీసుకుని మా టీముతో కలసి విజయం సాధించాం’’ అంది సౌందర్య నవ్వుతూ.
‘‘థాంక్యూ’’ అన్నాడు సుందర్‌. ‘‘ఇప్పుడు వచ్చి వెళ్ళిందే... ఆ అమ్మాయి మన బిడ్డా?’’ సంకోచిస్తూనే సౌందర్యని అడిగాడు సుందర్‌.

‘‘కాదు... ‘నా’ బిడ్డ’’ అంది సౌందర్య గర్వంగా.



        The End

Thank you