1947 లో దేశ విభజన తరువాత భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య అనేక యుద్ధాలు ఘర్షణలూ జరిగాయి. 1971 యుద్ధాన్ని మినహాయించి మిగిలిన ప్రధాన ఘర్షణలన్నిటికీ కాశ్మీర్ సమస్య, సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాదమే ప్రధాన కారణాలు. 1971 యుద్ధం ఆనాటి తూర్పు పాకిస్తాన్‌ను (ప్రస్తుత బంగ్లాదేశ్) విముక్తి చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నం వల్ల జరిగింది.
1947 భారత-పాక్ యుద్ధం
మొదటి కాశ్మీర్ యుద్ధం 1947 అక్టోబరులో ప్రారంభమైంది. కాశ్మీరు మహారాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీరును భారత్‌లో కలిపేస్తాడని పాక్ భయపడింది. దేశ విభజన తర్వాత, సంస్థానాలు భారతదేశం, పాకిస్తాన్‌లలో ఏదో ఒకదానిలో కలవడానికి గాని, స్వతంత్రంగా ఉండడానికి గానీ స్వేచ్ఛ ఉంది. ఈ సంస్థానాలలో అతిపెద్దదైన జమ్మూ కాశ్మీరులో ముస్లింలు మెజారిటీ కాగా, పెద్ద సంఖ్యలో హిందువులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ సైన్యం మద్దతుతో పాక్ గిరిజన ఇస్లామిక్ దళాలు జామూకాశ్మీరు లోని కొన్ని భాగాలపై దాడి చేసి, ఆక్రమించాయి. భారత సైనిక సహాయాన్ని పొందడం కోసం, మహారాజా హరిసింగ్ జమ్మూకాశ్మీరును భారతదేశంలో విలీనం చేస్తూ సంతకం చేసాడు. ఇరుపక్షాలూ తమతమ స్థానాలను పటిష్టపరచుకున్నారు.ఈ స్థానాలను వేరుచేసే రేఖయే తదనంతర కాలంలో నియంత్రణ రేఖగా పేరుపొందింది. 1949 జనవరి 1 రాత్రి 23:59 గంటలకు అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించారు. : 379 భారతదేశం మూడింట రెండు వంతుల (కాశ్మీర్ లోయ, జమ్మూ, లడఖ్) పై నియంత్రణ సాధించగా, పాకిస్తాన్ సుమారు మూడవ వంతు భాగంపై నియంత్రణ సాధించింది. పాకిస్తాన్ నియంత్రిత ప్రాంతాలను సమిష్టిగా పాకిస్తాన్ నియంత్రిత కాశ్మీర్ అని పిలుస్తారు. భారతదేశం దీన్ని పాక్ ఆక్రమిత కాశ్మీరు అని పిలుస్తుంది.
1965 భారత పాక్ యుద్ధం
పాకిస్తాన్ జరిపిన ఆపరేషన్ జిబ్రాల్టర్ తరువాత ఈ యుద్ధం ప్రారంభమైంది, జమ్మూ కాశ్మీర్లలోకి తన బలగాలను చొరబెట్టి, భారతదేశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటును లేవదీయడం ఈ ఆపరేషను ఉద్దేశం. పశ్చిమ పాకిస్థాన్‌పై పూర్తి స్థాయి సైనిక దాడి చేయడం ద్వారా భారత్ దీనికి ప్రతీకారం తీర్చుకుంది. పదిహేడు రోజుల ఈ యుద్ధం రెండు వైపులా వేలాది మంది ప్రాణనష్టానికి కారణమైంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అతిపెద్ద యుద్ధవాహనాల మోహరింపుకు, అతిపెద్ద లాంగ్వేల్ ట్యాంక్ యుద్ధానికీ ఈ యుద్ధం వేదికైంది. సోవియట్ యూనియన్, అమెరికాల దౌత్యపరమైన జోక్యం, ఆ తరువాత జరిగిన తాష్కెంట్ ప్రకటన ల తరువాత కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత యుద్ధం ముగిసింది.కాల్పుల విరమణప్రకటించే సమయానికి పాకిస్తాన్ పై భారత్ పైచేయి సాధించింది.
1971 భారత-పాక్ యుద్ధం
కాశ్మీరుతో సంబంధం లేకుండా భారత పాకిస్తాన్‌ల మధ్య జరిగిన ఏకైక యుద్ధం ఇది. ఒకప్పటి తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నాయకుడు షేక్ ముజిబూర్ రెహ్మాన్కు పశ్చిమ పాకిస్తాన్ నాయకులు యాహ్యాఖాన్, జుల్ఫికర్ ఆలీ భుట్టోలకూ మధ్య గల రాజకీయ సమరం వలన ఏర్పడిన సంక్షోభం ఈ యుద్ధానికి దారితీసింది. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ భాగం నుండి వేరుపడి బంగ్లాదేశ్ ఏర్పడడంతో ఈ యుద్ధం ముగిసింది. అప్పటికే జరుగుతూన్న బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో భారత్ జోక్యం చేసుకుంది. [17] పాకిస్తాన్ పెద్ద ఎత్తున ముందస్తు దాడి చెయ్యడంతో, ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలైంది.
1999 భారత-పాక్ యుద్ధం
కార్గిల్ యుద్ధం అని పేరొందిన యుద్దమిది. 1999 ప్రారంభంలో, పాకిస్తాన్ దళాలు నియంత్రణ రేఖ (ఎల్ఓసి) నుండి కార్గిల్ జిల్లాలో భారత భూభాగం లోకి చొరబడ్డాయి. పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమికొట్టడానికి భారతదేశం పెద్ద ఎత్తున సైనిక, దౌత్యపరమైన దాడిని ప్రారంభించింది.[18] ఘర్షణ మొదలైన రెండు నెలల తరువాత, భారత దళాలు చొరబాటుదారులు ఆక్రమించిన చాలా శిఖరాల నుండి వారిని తరిమికొట్టాయి.[19] అధికారిక లెక్కల ప్రకారం, చొరబడిన ప్రాంతంలో 75% -80% వరకూ భూమి తిరిగి భారత తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఘర్షణ ముదిరి పెద్ద ఎత్తున యుద్ధానికి దారితీస్తుందని భయపడిన అమెరికా మిగిలిన భారత భూభాగం నుండి బలగాలను ఉపసంహరించుకోవాలని పాకిస్తాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది.[20] అంతర్జాతీయంగా ఒంటరవడంతో, అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడింది.[21] నార్తరన్ లైట్ పదాతిదళంలోని అనేక యూనిట్లు భారీ ప్రాణనష్టానికి గురైనందున ఉపసంహరణ తరువాత పాకిస్తాన్ దళాల స్థైర్యం క్షీణించింది.[22] యుద్ధంలో మరణించిన చాలామంది అధికారుల మృతదేహాలను స్వీకరించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిరాకరించింది. ఈ సమస్య ఆ దేశ ఉత్తర ప్రాంతంలో ఆగ్రహాన్ని, నిరసనలనూ రేకెత్తించింది.[23][24] మొదట్లో పాకిస్థాన్ తన సైనికుల మరణాల లెక్కలను చాలావరకూ ఒప్పుకోలేదు. కానీ తరువాతి కాలంలో నవాజ్ షరీఫ్, 4,000 మంది పాకిస్తానీ సైనికులు మరణించారనీ పాకిస్తాన్ ఈ యుద్ధంలో ఓడిపోయిందనీ అంగీకరించాడు.[25] 1999 జూలై చివరి నాటికి, కార్గిల్ జిల్లాలో అధికారికంగా కాల్పులు ఆగిపోయాయి. ఈ యుద్ధం పాకిస్తాన్ సైన్యానికి పెద్ద ఓటమిని మిగిల్చింది.
ఇతర సాయుధ ఘర్షణలు
పైన పేర్కొన్న యుద్ధాలు కాకుండా, ఎప్పటికప్పుడు ఇరు దేశాల మధ్య చిన్నపాటి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని పూర్తిస్థాయి యుద్ధాలకు చేరువగా రాగా, కొన్ని చిన్న ఘర్షణలుగానే ముగిసాయి. 1955 లో ఇరుపక్షాలూ యుద్ధం తరహాలో సన్నాహాలు జరిపినా, పూర్తి స్థాయి యుద్ధం జరగలేదు.
కొనసాగుతూ ఉన్న ఘర్షణలు
జమ్మూ కాశ్మీర్‌లో ఆందోళన: కాశ్మీర్‌లోని ఆందోళన ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమౌతూ ఉంది. పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద గుంపులు భారతదేశం అంతటా అనేక ఉగ్రవాద దాడులు చేస్తున్నాయని భారత్ ఆరోపించింది .
సియాచెన్ ఘర్షణ: 1984 లో, సియాచెన్ హిమానీనదం మొత్తాన్ని ఆపరేషన్ మేఘదూత్ ద్వారా భారత్ ఆక్రమించింది. ఈ ప్రాంతంలో 1985, 1987, 1995 లలో జరిగిన ఘర్షణల్లో భారత్‌ను ఇక్కడి నుండి వెళ్ళగొట్టాలని పాకిస్తాన్ ప్రయత్నించినా, విఫలమైంది.[8][28]
సర్ క్రీక్: కచ్, సింధ్ మధ్య సముద్ర సరిహద్దు రేఖ విషయంలో ఈ వివాదం రేకెత్తింది. స్వాతంత్ర్యానికి ముందు, ఈ రెండు ప్రాంతాలూ బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యానంతరం సింధ్ పాకిస్తాన్లోను కచ్ భారతదేశంలోనూ భాగమయ్యాయి. 1914 నాటి బాంబే ప్రభుత్వ తీర్మానం [29] లోని 9, 10 పేరాల ప్రకారం సర్ క్రీక్ మొత్తం తనకే చెందుతుందని పాక్ వాదించింది.[30]
భారతదేశం-పాకిస్తాన్ సముద్ర ఉల్లంఘన: శాంతికాలంలో భారత, పాక్‌ల జాతీయ ప్రాదేశిక జలాలను ఇరుదేశాల మత్స్యకారులూ ఉల్లంఘించడం జరుగుతూంటుంది. భౌతిక సరిహద్దు లేకపోవడం, చిన్న మత్స్యకారులకు నావిగేషనల్ టూల్స్ లేకపోవడం దీనికి కారణం. రెండు దేశాల తీరరక్షక దళాలు వందలాది మంది మత్స్యకారులను అరెస్టు చేస్తూంటారు. కాని ఇరు దేశాల మధ్య శత్రుత్వం కారణంగా వారిని విడుదల చేయించడం చాలా కష్టంగను, చాలా కాలం పడుతూనూ ఉంటుంది. [31][32][33]
బలూచిస్తాన్‌లో తిరుగుబాటు : పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో తిరుగుబాటు కూడా ఇటీవల ఉద్రిక్తతలకు కారణమైంది. బహిష్కరించబడిన బలూచ్ నాయకులు, మిలిటెంట్ గ్రూపులు, బలూచిస్తాన్ విమోచన సైన్యం వంటి ఉగ్రవాద సంస్థలకు సహాయం చేస్తూ భారతదేశం, తమ దేశంలో తిరుగుబాటుకు దోహదపడుతోందని పాకిస్తాన్ ఆరోపించింది. పాకిస్తాన్ అధికారుల ప్రకారం ఈ ఉగ్రవాదులకు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో శిక్షణ ఇస్తున్నారు. బలూచిస్తాన్‌లో జరిగిన కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ సందర్భంగా కులభూషణ్ జాదవ్ అనే భారత గూఢచారిని తమ బలగాలు అరెస్టు చేశాయని 2016 లో పాకిస్తాన్ ఆరోపించింది.
గత ఘర్షణలు, ప్రతిష్టంభనలు
మార్చు
జునాగఢ్ భారత్‌లో విలీనమవడం: జునాగఢ్ హిందూ మెజారిటీ ప్రజలూ ముస్లిం పాలకుడూ ఉన్న సంస్థానం. తమకు సముద్రమార్గం ద్వారా పాకిస్తానుతో సంబంధం ఉందని చెబుతూ తన సంస్థానాన్ని పాక్‌లో కలిపేస్తున్నట్టుగా 1947 సెప్టెంబరు 15 న ఆ సంస్థానాధీశుడు ప్రకటించాడు. కాశ్మీరులో ప్రజాభిప్రాయ సేకరణ జరపడం కోసం ఒత్తిడి తెచ్చే ఎత్తుగడతో ఈ విలీన ప్రతిపాదనను పాక్ అంగీకరించినట్లుగా భావించారు. మత ఉద్రిక్తతలు చెలరేగడంతో భారత సైన్యం జూనాగఢ్‌లో ప్రవేశించింది. దీన్ని అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడంగా పాకిస్తాన్ నిరసన తెలిపింది.తరువాత ప్రజాభిప్రాయ సేకరణ జరిగి, ఆ విలీన ప్రతిపాదన రద్దైంది.[36][37][38]
ఆపరేషన్ బ్రాస్‌టాక్స్: 1986 నవంబరు, 1987 మార్చి ల మధ్య భారత్ జరిపిన సైనిక మోహరింపులు దక్షిణాసియాలో అతి పెద్దవి. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ చేపట్టిన సమీకరణ ఉద్రిక్తతలను పెంచింది. ఇది ఇరుదేశాల మధ్య మరొక యుద్ధానికి దారితీస్తుందనే భయాలను కలిగించింది. [8] : 129 [39]
2001-2002 భారత పాక్ ప్రతిష్ఠంభన: లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ సంస్థలు 2001 డిసెంబరు 13 న భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడి చేసాయి. ఇది 2001-2002 లో ఇరుపక్షాల మధ్య సైనిక ప్రతిష్ఠంభనకు కారణమై యుద్ధానికి చేరువగా తీసుకువెళ్ళింది.[40]
2008 భారత పాక్ ప్రతిష్ఠంభన: 2008 ముంబై దాడుల తరువాత ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదం దౌత్య ప్రయత్నాల ద్వారా పరిష్కారమైంది. ఉగ్రవాదులు ముంబై అంతటా అత్యంత సమన్వయంతో పది చోట్ల కాల్పులు, బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటన వెనక పాక్ గూఢచార దళం ఐఎస్‌ఐ ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని భారతదేశం ఆరోపించింది. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి [41] [42] పాకిస్తాన్ దానిని ఖండించింది. [43] [44] [45] పాకిస్తాన్ తన వైమానిక దళాన్ని అప్రమత్తంగా ఉంచి, దళాలను భారత సరిహద్దుకు తరలించింది. భారత సైన్యపు చురుకైన కదలికల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది [46] భారత్, పాకిస్తాన్ గడ్డపై దాడులు చేసే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. [47] త్వరలోనే ఉద్రిక్తత తగ్గింది. పాకిస్తాన్ తన దళాలను సరిహద్దు నుండి వెనక్కు తరలించింది.
భారత పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణ (2016–2018): 2016 సెప్టెంబరు 29 న పాక్ ఆక్రమిత కాశ్మీరులోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లపై వ్యతిరేకంగా భారత్ జరిపిన "సర్జికల్ స్ట్రైక్స్" తో ఇరుదేశాల మధ్య సరిహద్దు ఘర్షణ మొదలైంది. [48] దాడి జరిగిందనే భారత ప్రకటనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. [49] భారత దళాలు నియంత్రణ రేఖను దాటలేదని, సరిహద్దు వద్ద పాకిస్తాన్ దళాలతో ఘర్షణలు మాత్రమే జరిగాయని, దీని ఫలితంగా ఇద్దరు పాకిస్తాన్ సైనికులు మరణించారని, తొమ్మిది మంది గాయపడ్డారనీ పాకిస్తాన్ ప్రకటించింది. [50] [51] భారతదేశం ప్రకటించిన ఇతర మరణాలను పాక్ తోసిపుచ్చింది. [52] ఈ ఘర్షణల్లో కనీసం 8 మంది భారతీయ సైనికులు మరణించారని, ఒకరు పట్టుబడ్డారని పాకిస్తాన్ వర్గాలు నివేదించాయి. [53] [54] భారతదేశం తన సైనికులలో ఒకరు పాకిస్తాన్ అదుపులో ఉన్నట్లు ధృవీకరించారు, కాని అతడికి ఈ సంఘటనతో సంబంధం లేదని చెప్పింది. తమ సైనికులలో ఎవరూ మరణించలేదని కూడా భారత్ చెప్పింది. [55] యురి వద్ద భారత సైన్యంపై సెప్టెంబరు 18 న జరిపిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఈ సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. ఆ ఉగ్రవాద దాడిలో 19 మంది సైనికులు మరణించారు. [56] [57] ఆ తరువాత కొన్ని నెలల పాటు సరిహద్దులో కాల్పులు కొనసాగాయి. రెండు వైపులా డజన్ల కొద్దీ సైనికులు, పౌరులూ మరణించారు.
2019 భారత పాకిస్తాన్ ప్రతిష్టంభన: 2019 ఫిబ్రవరి 14 న, పుల్వామాలో భారత సైనిక కాన్వాయ్‌పై జరిగిన పుల్వామా దాడిలో, 40 మంది భారతీయ సైనికులు మరణించారు. పాకిస్తాన్ ఆధారిత, ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మొహమ్మద్ తామే ఈ దాడి చేసామని ప్రకటించింది. [58] దీనికి ప్రతీకారంగా, 2019 ఫిబ్రవరి 26 న భారత మిరాజ్ 2000 యుద్ధ విమానాలు నిర్వహించిన ఖైబర్ ఫక్తూన్వా ప్రాంతం లోని బాలకోట్ లోని తీవ్రవాద శిక్షణ శిబిరంపై వైమానిక దాడులు జరిపింది. [59] [60] జైషె మొహమ్మద్‌కు చెందిన చాలా మంది ఉగ్రవాదులను చంపినట్లు భారతదేశం పేర్కొంది [61] అయితే, పాకిస్తాన్ మాత్రం, తమ వైమానిక దళం భారత విమానాలను అడ్డగించిందని, దీనితో దాడి చేసే విమానాలు హడావుడిగా తమ బాంబులను బాలకోట్ సమీపంలో ఒక చెట్ల ప్రాంతంలో జారవిడిచాయనీ, అక్కడ నాలుగు పేలుళ్లు జరిగి కొన్ని కోనిఫర్ చెట్లకు నష్టం కలిగిందనీ చెప్పింది. [62] తటస్థ వర్గాల ప్రకారం, ఉపగ్రహ చిత్ర విశ్లేషణల ప్రకారమూ, భారతీయ వైమానిక దళం సంబంధిత భవనాలకు బయటి భాగంలో కనిపించే నష్టాన్ని కలిగించలేదు. [63] [64] [65] [66] ఈ సంఘటనలు భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను పెంచాయి. మరుసటి రోజు, పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు పాకిస్తాన్ వాయుసేన కాశ్మీరులో వాయు దాడుల జరిపి, కనీసం ఒక భారతీయ విమానాన్ని కూల్చివేసి ఒక పైలట్‌ను పట్టుకున్నట్లూ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఒక భారతీయ విమానం శిధిలాలు పడిపోయాయని, మరొకటి భారత భూభాగంలో కాశ్మీర్‌లో పడిందనీ పాకిస్తాన్ సైనిక అధికారులు పేర్కొన్నారు. [67] కాశ్మీర్‌లో పాకిస్తాన్ వైమానిక దళం దాడులు జరిపినట్లు భారత అధికారులు ధృవీకరించారు. పట్టుబడిన తమ పైలట్ అభినందన్ వర్ధమాన్ అని వెల్లడించారు.[68] భారతదేశం ఒక పాకిస్తానీ F-16 విమానన్ని కూల్చివేసినట్లు పేర్కొన్నారు. F-16 ఉపయోగించే AIM-120 అమరాం క్షిపణి యొక్క అవశేషాలను కూడా ప్రదర్శించారు.
సంఘటనలు
అట్లాంటిక్ విమానం కూల్చివేత సంఘటన: 16 మందితో ప్రయాణిస్తున్న పాకిస్తాన్ నేవీకి చెందిన బ్రెగెట్ అట్లాంటిక్ నిఘా విమానం తమ గగనతలాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ భారత వైమానిక దళం దాన్ని కూల్చివేసింది. కార్గిల్ యుద్ధం జరిగిన ఒక నెల తరువాత, 1999 ఆగష్టు 10 న రాన్ ఆఫ్ కచ్‌లో ఈ సంఘటన జరిగింది. ఇది భారత పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. సరిహద్దు దాటినప్పటికీ విమానం పాకిస్తాన్ భూభాగంలోనే పడిపోయిందని విదేశీ దౌత్యవేత్తలు గుర్తించారు. భారతదేశపు ప్రతిస్పందన సమర్థించలేనిదని వారు అన్నారు. [70] పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో నష్ట పరిహార దావా వేసింది. అయితే కోర్టు ఈ కేసును కొట్టివేసింది. [71]
2011 భారత-పాకిస్తాన్ సరిహద్దు కాల్పుల సంఘటన 2011 ఆగస్టు 30, సెప్టెంబరు 1 ల మధ్య కుప్వారా జిల్లా / నీలం లోయలో నియంత్రణ రేఖ వద్ద జరిగింది. దీని ఫలితంగా ఐదుగురు భారతీయ సైనికులు [72] ముగ్గురు పాకిస్తానీ సైనికులూ మరణించారు. ఈ సంఘటనలో కాల్పులు మొదలుపెట్టింది మీరేనంటూ ఇరు దేశాలు పరస్పరం ఆరోపించుకున్నాయి. [73] [74]
2013 జమ్మూ కాశ్మీర్‌లోని మెన్ధార్ సెక్టార్‌లో భారత్-పాకిస్తాన్ సరిహద్దు సంఘటన: ఒక భారతీయ సైనికుడి శిరచ్ఛేదం కారణంగా ఈ సంఘటన మొదలైంది. మొత్తం 22 మంది సైనికులు (12 మంది భారతీయులు, 10 మంది పాకిస్తానీలు) మరణించారు. [75]
సరిహద్దు భద్రతా దళానికి చెందిన 1 సైనికుడిని హతమార్చడం, ముగ్గురు సైనికులను, నలుగురు పౌరులనూ పాకిస్తాన్ రేంజర్స్ గాయపరిచిన కారణంగా 2014–16 లో జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్నియా సెక్టార్‌లో భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణ జరిగింది. [76]
భారత్-పాకిస్తాన్ సరిహద్దు వాగ్వివాదం (2016–2018)
అణ్వాయుధాలు
పోఖ్రాన్- I (స్మైలింగ్ బుద్ధ): 1974 మే 18 న, పోఖ్రాన్ టెస్ట్ రేంజ్‌లో భారతదేశం 8 కిలోటన్ [77] అణు పరికరాన్ని పేల్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదుగురు శాశ్వత సభ్యులు కాకుండా, అణు సామర్థ్యం పొందిన మొదటి దేశంగా నిలిచింది. పాకిస్తాన్ కూడా అణ్వాయుధ రేసులో పాల్గొంది. [78] పాకిస్తాన్ ప్రధాన మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో "నా దేశస్థులు గడ్డి తినవలసి వచ్చినా ఫరవాలేదు గానీ, అణు బాంబును కావాలని మాత్రం కోరుకుంటారు" అని చెబుతూ, భారతదేశానికి దీటుగా సమాధానమిస్తామని ప్రకటించాడు. [79] పాకిస్తాన్ అణు ఇంధన కమిషన్ (పిఎఇసి) చైర్మన్ మునీర్ అహ్మద్ ఖాన్, ఈ పరీక్ష పాకిస్తాన్ తన సొంత అణుబాంబును తయారు చేసేందుకు పురికొల్పుతుంది అని అన్నాడు. [80]
కిరానా- I : 1980 లలో చైర్మన్ మునీర్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలో పిఎఇసి, 24 వేర్వేరు కోల్డ్ పరీక్షలను అత్యంత రహస్యంగా నిర్వహించింది. [81] సర్గోదా లోని కిరానా హిల్స్ వద్ద ఉన్న సొరంగాలు ఛగాయ్ అణు పరీక్షల తరువాత నిర్మించినట్లు చెప్పినప్పటికీ, వాటిని 1979, 1983 ల మధ్య నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ఛగాయ్‌లో లాగానే ఈ సొరంగాలను కూడా తొలిచి ఆ తరువాత మూసేసి ఉంటారు. ఈ పనిని కూడా పిఎఇసీ యే చేపట్టింది. తరువాత అమెరికా గూఢచర్యం, ఉపగ్రహాల నిఘాల కారణంగా దీన్ని వదలిపెట్టి, అణ్వాయుధ పరీక్షను కాలా చిట్టా శ్రేణికి మార్చారు.
పోఖ్రాన్ -2 (ఆపరేషన్ శక్తి): 1998 మే 11 న పోఖ్రాన్ టెస్ట్ రేంజ్‌లో భారత్ మరో ఐదు అణు బాంబులను పేల్చింది. ఈ పరీక్షకు భారతీయులు పెద్ద ఎత్తున ఆనందం, ఆమోదం వెలిబుచ్చగా, అంతర్జాతీయంగా ఆంక్షలు ఎదురయ్యాయి. భారతదేశం అణ్వాయుధ రేసును ప్రేరేపిస్తోందంటూ పాకిస్తాన్ ప్రకటించింది. భారతదేశానికి దీటుగా సమాధానమిస్తామని ప్రకటించింది: "మేము ఉపఖండంలో భారీ ఆయుధ పోటీలో ఉన్నాము". [82] [83]
ఛగాయ్-1 : (యూమ్-ఎ-తక్బీర్) పోఖ్రాన్- II జరిగిన పక్షం రోజుల్లోనే 1998 మే 28 న పాకిస్తాన్ ఐదు అణు పరికరాలను పేల్చింది. పాకిస్తాన్ ప్రజానీకం, భారతీయుల మాదిరిగానే, ఉత్సవాలు జరుపుకున్నారు. భారత అణుపరీక్షలకు దీటుగా స్పందించి, అణుసామర్థ్యం గల ఒకే ఒక్క ముస్లిం దేశంగా అవతరించినందుకు వారు సంతోషించారు. ఆ రోజును యూమ్-ఎ-తక్బీర్ గా పిలుచుకుంటారు.
ఛగాయ్- 2 : రెండు రోజుల తరువాత, 1998 మే 30 న, పాకిస్తాన్ ఆరవ అణు పరీక్ష జరిపింది. ఈ రెండు దేశాలు నిర్వహించిన అణుపరీక్షల్లో ఇది చివరిది.
వార్షిక వేడుకలు
మార్చు
భారత పాకిస్తాన్‌లు కింది వార్షిక ఉత్సవాలు జరుపుకుంటాయి.
మే 28 (1998 నుండి) పాకిస్తాన్‌లో యూమ్-ఎ-తక్బీర్ (గొప్పతనం దినం) గా.[87][88]
జూలై 26 (1999 నుండి) భారతదేశంలో కార్గిల్ విజయ్ దివస్ (కార్గిల్ విక్టరీ డే) గా.
సెప్టెంబరు 6 (1965 నుండి) పాకిస్తాన్‌లో రక్షణ దినోత్సవం (యూమ్-ఎ-డిఫా).[89]
సెప్టెంబరు 7 (1965 నుండి) పాకిస్తాన్‌లో వైమానిక దళం (యూమ్-ఎ-ఫిజయా) గా.
పాకిస్తాన్‌లో సెప్టెంబరు 8 (1965 నుండి) విక్టరీ డే / నేవీ డే (యూమ్-ఎ-బహ్రాయా) గా.
డిసెంబరు 4 (1971 నుండి) భారతదేశంలో నేవీ డేగా
డిసెంబరు 16 (1971 నుండి) భారతదేశంలో విజయ్ దివస్ (విక్టరీ డే) గా.
డిసెంబరు 16 (1971 నుండి) బంగ్లాదేశ్‌లో బిజోయ్ దిబోష్ (విక్టరీ డే) గా.
సెప్టెంబరు 29 (2018 నుండి) పరాక్రమ్ పర్వ్ గా.