తా తలనాటి ఆస్తి, దాయాదుల మధ్య, కోర్టులలో నలిగి నలిగి దివాకరానికి పదిలక్షలు వచ్చాయి. ఆ పది లక్షలతో దివాకరం తన తల్లి పేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ లు చేయించాడు. "నాకెందుకురా రేపో మాపో పోయ్యేదాన్ని ఇన్ని లక్షలు నా మీద పెట్టావు" అడిగింది దివాకరం అమ్మ మహాలక్ష్మమ్మ.
"అదేమిటమ్మా! అలా అంటావు. ఇది నాన్న గారి డబ్బు. నీ పేరు మీద ఉండడమే ధర్మం." చెప్పాడు ధర్మరాజులా దివాకరం. కొడుకు తనమీద చూపించిన ప్రేమకు మహాలక్క్ష్మమ్మకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కొడుకు తనమీద చూపించిన ప్రేమను నలుగురితో చెప్పుకోడానికి ఎదురింటికి వెళ్ళింది.
తల్లికొడుకుల సంభాషణను ప్రక్క గదిలోంచి వింటున్న దివాకరం భార్య రాణి చండీరాణియే అయ్యింది. ఉక్రోషంతో దివాకరం దగ్గరకెళ్ళి "ఎప్పుడైనా పట్టు చీరో, నగలో కొనమని నేను అడిగితే డబ్బులు, దాని విలువ అంటూ గంటలు గంటలు క్లాసు పీకే నువ్వు రేపో మాపో గుంటలోకి వెళ్ళే మీ అమ్మ పేరు మీద లక్షలు లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తావా? నన్ను నా బిడ్డని అనాధలని చెయ్యాలనికున్నావా" అంటూ పదర మనం ఏ నుయ్యో, గొయ్యో చూసుకొందాం" అంటూ ముక్కు చీదేసింది. అమ్మ చేసే ఓవరాక్షన్ తెలీక నాని గాడు బిక్కమొహం వేస్కుని నిలబడ్డాడు.
"అయిపోయిందా..ఇంకా ఏమన్నా మిగిలుందా" విసుక్కున్నాడు దివాకరం. "లేదు..ఇంకా ఏమీ మిగల్లేదు. ఆ కోర్టులో వచ్చిన డబ్బులన్నీ మీ అమ్మ పేరుమీదేగా వేసావు. ఒక్క రూపాయి కూడా మిగల్లేదు. మాకు ఏడుపే మిగిలింది." పెద్ద పెట్టున ఏడుపు లంకించుకుంది రాణి. రాణి ఏడవడం చూసి నాని గాడు కూడా ఏడవడం మొదలుపెట్టాడు.
"ఆపుతావా.... ఎవరన్నా వింటే నేను పొయ్యాననుకుంటారు. అవును మా అమ్మంటే నాకు ఇష్టం. చిన్నప్పుడు మా నాన్న చనిపోతే నాకు ఏ లోటూ తెలీకుండా నన్ను చదివించి, ప్రయోజకుడ్ని చేసింది. అలాంటి మా అమ్మకు నేను ఎంత చేసినా తక్కువే." ఉద్వేగంతో చెప్పాడు దివాకరం.
ఇంట్లో ఏడుపులు విని కంగారుగా లోపలికి వచ్చిన మహాలక్ష్మమ్మకు లోపలి దృశ్యం చూసి కొడుకుకి తన మీద ఉన్న ప్రేమకు తల్లి హృదయం ఆనందంతో ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక క్రింద పడింది.
పెద్ద కార్పోరేట్ హాస్పిటల్లో మహాలక్ష్మమ్మ చుట్టూరా బంధువులు. " నీకేం వదినా! నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే కొడుకు ఉండడం నీ అదృష్టం రెండు లక్షలు పెట్టి నీ గుండె ఆపరేషన్ చేయించాడు. ఈ రోజుల్లో తల్లికి అన్నం పెట్టడడమే దండగ అనుకుంటున్నారు. మావాడు వున్నాడు, ఎందుకు పనికి రాని చవట, పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతాడు." ఎదురింటి వెంకట లక్స్మి చెబుతూంటే మహాలక్ష్మమ్మ గుండె ఆనందంతో నిండిపోయింది. దివాకరం లాంటి కొడుకు ఉన్నందుకు. అదీ తను కన్నందుకు.
దివాకరం తల్లి ఆపరేషన్ కి రెండు లక్షలు ఖర్చు పెట్టాడని తెలియగానే రాణి ఒంటికాలిపై భర్త పైకి వెళ్ళింది.
"ఉన్న డబ్బంతా మీ అమ్మకే ఖర్చు చేసేస్తే నేను, నా కొడుకు అడుక్కు తింటాం. అప్పుడు హాయిగా నువ్వొక్కడివే వుందువుగాని" మళ్ళీ ముక్కు చీదేసింది.
"ష్..గట్టిగా అరవకు ప్రక్క గదిలో అమ్మ నిద్ర పోతుంది." అన్నాడు దివాకరం.
చూసావా..ఇప్పుడు నేను ఏడిస్తే మీ అమ్మ నిద్ర పాడవుతుందని బాధ పడ్తున్నావుగానీ నా ఏడుపు మీకు అక్కర్లేదు." మళ్ళీ ముక్కు చీదేసింది.
" పిచ్చి మొహమా దగ్గరికి రా నీకొక దేవ రహస్యం చెబుతాను. సీనియర్ సిటిజన్స్ కి బ్యాంక్ వాళ్ళు ఎక్కువ శాతం వడ్డీ రేటు ఇస్తారు. అందుకే అమ్మ పేరుమీద ఫిక్స్ డ్ డిపాజిట్ చేసాను. నామినీగా నీపేరే పెట్టాను. ఇన్సూరెన్స్ లంటావా, ఎక్కువ కాలం మా అమ్మ బతకదు కాబట్టి ప్రీమియంలు అన్ని చెల్లించకుండానే ఇన్సూరెన్స్ మొత్తం మిగులుతుంది. చనిపోయిన తర్వాత భారీ మొత్తంలో డబ్బు మన చేతికి వస్తుంది. ఇక గుండె ఆపరేషన్ డబ్బులు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చారు. ఒక్క ప్రీమియం అమౌంటే ..." దివాకరం చెప్పుకుంటూ పోతున్నాడు.
భర్త చెబుతున్న మాటలకు రాణి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. "మరి ఈ విషయం ఆ రోజే ఎందుకు చెప్పలేదు" అనడిగింది.
"చెబుదామనే అనుకున్నా...ఇంతలో మా అమ్మ రావడం గమనించా, అందుకే మా అమ్మ మీద ప్రేమ ఉన్నట్టు నటించా" అసలు విషయం చెప్పాడు దివాకరం.
"అయ్యో అనవసరంగ మిమ్మల్ని నానా మాటలు అన్నాను నన్ను క్షమించండి." గారాలు పోతూ చెప్పింది రాణి.
నీళ్ళు తాగుదామని లేచిన మహాలక్ష్మమ్మ కొడుకు దివాకరం మాటలు విని, కొడుకు తనపై చూపించిన ప్రేమ వెనక అసలు రహస్యం తెలుసుకుని బాధతో విలవిలలాడింది.
నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద తిన్నగా వెళుతూన్న చిన్న వ్యాన్ ను , పొదలచాటు నుంచి వచ్చిన ఇద్దరు మను షులుఅడ్డగించారు. ఆ ఇద్దరిలో ఒకడు, పొడవుగా, సన్నగా, ఆత్రుతగా ఉన్నాడు. రెండవవాడు పొట్టిగా, లావుగా నెమ్మదిగాఉన్నాడు. తుపాకీ గురిపెట్టి, వాహనంలోని ఇద్దరిని బయటకు లాగారు. వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి లాక్కుపోయి దాపులనున్న చెట్టుకు కట్టారు.
ఆ తరవాత వ్యానులోకి జొరబడి, అందు లోని ఆరుసంచీల చిల్లర నాణేలనూ , నోట్లు కుక్కిన అట్టపెట్టెనూ కొద్ది దూరంలో ఆపినకారులోకి చేరవేసి, శరవేగంతో దూసుకుపోయారు.
పట్టపగలు జరిగిన భయంకరమైన దొంగతనం అది! ఆ వ్యాన్ స్టేట్ బ్యాంక్ కు చెందినది.
చాలా సేపయ్యాక, చెట్టుకు బంధించబడ్డ ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు, ఆ దారిగుండా వెళుతున్నవారి సాయంతో బయట పడ్డారు. ఐ ఎల్ టి డి కంపెనీ కార్మికుల జీతాల కోసం బ్యాంకు నుంచి తీసుకువెళుతున్న ధనాన్ని భద్రంగా అక్కడికి చేర్చే తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చలేకపోయినందుకు వాళ్ళు ఎంతగానో బాధపడ్డారు.
ఘోరమైన నేరానికి పాల్పడ్డ దొంగల మీద అపహరణ, దారిదోపిడీ నేరాలు ఆరోపించబడ్డాయి. దొంగిలించిన మొత్తాన్నిపట్టుకోవాలంటే కేసు త్వరగా పరిష్కారం కావాలి. పోలీసులకూ, నేరపరిశోధకులకూ ఇదొక పెద్ద సవాలు.
బందిపోట్లు ఏవైనా ఆనవాళ్ళు వదిలారా? చాలామంది దగ్గర విచారణ జరిపారు వాళ్లు . దోపిడీకి గురైన ఇద్దరు బ్యాంకుఉద్యోగులను కూడా ప్రశ్నించారు. తన కళ్ళకు గంతలు కడుతూన్నప్పుడు, లావుపాటి చిన్న దొంగ చొక్కా మీద ఒక బ్యాడ్జ్కనిపించిందనీ, అది ఐ ఎల్ టి డి సంస్థ ఎంబ్లెమ్ అనీ వారిలో ఒక ఉద్యోగి చెప్పాడు. అంటే, ఆ దొంగ ఆ సంస్థలోపనిచేస్తూన్నట్టు చూపించుకోవడానికి అలా చేసి ఉండవచ్చు.
ఒకనాడు ఒక పోలీసు అధికారికి, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఒక కారు కనిపించింది. ఆ కారులోపల ఒక కాగితం ముక్కపై, ఒక వ్యక్తి పేరూ, చిరునామా కనిపించాయి. వెంటనే అక్కడికి వెళ్ళి, ఆ ఇంటి తలుపు తట్టాడు పోలీసు అధికారి. ఒక స్త్రీ తలుపుతీసి, పోలీసులకేసి ఆశ్చర్యంగా చూసింది.
దర్యాప్తు కోసం వచ్చాం' అన్నారు పోలీసులు.
' సరే కానివ్వండి' అందామె. మధ్యవయసులో ఉన్న ఆమె పేరు శ్రీలక్ష్మి అని వెల్లడియింది విచారణలో .
పోలీసులు ఇల్లంతా గాలించారు . ఆ క్రమంలో పిల్లలు బంతి ఆట ఆడుకుంటూన్న తోటలోకి వెళ్ళారు. ఓ కుర్రాడు విసిరేసిన బంతి కాంపౌండ్ చివరన ఉన్న షెడ్డు వైపుకు దొర్లుకుంటూ తలుపు కింది సందు గుండా లోపలికి వెళ్ళిపోయింది . పిల్లలుదాని వెనక పరిగెత్తారు. కాని, తలుపుకు తాళం వేసి ఉంది.
' ఆ షెడ్డులో ఏం వుంది?' అని అడిగాడు పోలీసాఫీసరు
' రెండు వారాల క్రితం ఇద్దరు యువకులు వచ్చి దానిని అద్దెకు తీసుకున్నారు. అయినా కొన్ని రోజులుగా వాళ్ళు అక్కడకనిపించడం లేదు' అన్నది శ్రీలక్ష్మి.
పోలీసు అధికారులు అనుమానంతో షెడ్ తలుపులు పగలగొట్టారు.
బంతి దొరికినందుకు పిల్లలు సంబరపడ్డారు . పోలీసువాళ్లు అంతకన్నా ఎక్కువగా సంతోషించారు• షెడ్డులో నేల మీద ఐఎల్ టి డి వారి గుర్తింపు బేడ్జీ ఉన్న చొక్కా, , బ్యాంకు గార్డులు వాడే నాటు తుపాకులు కనిపించడమే ఆ సంతోషానికికారణం .
పోలీసులు బేడ్జీ తీసుకుని కంపెనీకి వెళ్లారు. కానీ, బేడ్జీ మీది నంబరుకూ అక్కడి ఉద్యోగుల పేర్లకూ సంబంధం లేదని తెలిసింది. అంటే దొంగలు తెలివిగా, అసలు అంకెను చెరిపేసి, ప్రత్యేకమైన పెన్నుతో దొంగనంబరు రాశారన్న మాట. అయితే, ప్రయోగశాలలో అల్ట్రా వయొలెట్ వెలుతురు కింద, బ్యాడ్జ్ మీద కొన్ని అంకెలు కనిపించాయి. వాటిలో ఒరిజినల్ గా ముద్రించబడిన అంకెల జాడలు కనిపించాయి.
వెంటనే పోలీసులు కంపెనీ ఉద్యోగుల రికార్డులను నిశితంగా పరిశీలించారు. బ్యాడ్జ్ మీది పాత నంబరు-పొడవాటి కార్మికుడికి చెందినదని కనుక్కున్నారు . పొట్టి శాల్తీ అతగాడి స్నేహితుడనీ అర్థమయింది . ఇద్దరూ కంపెనీ వర్కర్సే . రహస్యంబయటపడింది. నేరస్థులు దొరికారు .
అయితే, తోడుదొంగలు ఆపాటికే కంపెనీని వదిలి పెట్టారు. ఫ్యాక్టరీ రికార్డుల నుంచి తీసుకున్న వాళ్ల ఫోటోల సాయంతో, పోలీసులు పొడవాటి మనిషిని ఓ చిన్న హోటల్లో పట్టుకుంటే . ఆరోజు సాయంకాలమే పొట్టివాడు కూడా అదే హోటల్చుట్టుపక్కల తచ్చాడుతూ పట్టుబడ్డాడు. ఇద్దరనీ జైల్లో బంధించారు.
దొంగిలించిన డబ్బును గురించి అడిగినప్పుడు మొదట్లో తమకేమీ తెలియదని ఋకాయించారు . పోలీసు పద్ధతిలో అడిగినా ప్రాణాలు తీసినా ఎక్కడ దాచామో చెప్పం అన్నారు.
అయితే, ఒక రోజు రాత్రి, పొడుగోడి పడక కింది పాత్రలోని నీళ్ళ మీద తేలుతున్న నాణెమొకటి కనిపించింది .
పరిశోధన మళ్లీ మొదలయింది.
తోడు దొంగలను జైలులో విడివిడి గదులలో బంధించారు. అయితే, ఒక గార్డ్ సాయంతో వాళ్ళు పరస్పరం చీటీల ద్వారా రహస్యసందే శాలను అందజేసుకుంటున్నట్టు అధికారులకు తెలిసింది. నేర పరిశోధకులు ఈ సందేశాలను చాలావరకు సేకరించారు. దొంగల సందేశాలలో తరచూ '18' అంకె, 'కాగితం'అనే మాటలు కనిపించాయి.
వానాకాలం, మనం ఇక్కడే చాలాకాలం ఉండిపోతే, వానలకు పొలంలోని మొలకల గతేమిటి?' అని ఒక సందేశంలో కనిపిస్తే , ' మా చిన్న చెల్లెలు వాటిని భద్రంగా చూసుకుంటుందిలే! కాకపోతే, ఆమె ముళ్ళ కంప దాటి చేను చేరుకోవడమే కష్టం' అనిఇంకో సందేశంలోనూ కనిపించాయి.
‘మొలక’ అనే మాట డబ్బుకు కోడ్ అయివుంటుంది. అదే నిజమయితే, దానిని మరీ చిత్తడి ప్రదేశంలో, చిన్న పిల్లలు వెళ్ళలేనిచోట దాచారన్న విషయం అర్థమవుతుంది. మరి ఈ 18 అంకె దేనికి సంకేతం?
అది ఏదో రోడ్ మైలు రాయి అయివుండచ్చు. నేరపరిశోధనల్లో ఆరితేరిన ఆ సీనియర్ పోలీస్ బాస్ ఆదేశం మీద పోలీసులూ, జూనియర్ నేర పరిశోధకులూ '18' సంఖ్య చెక్కిన మైలు రాయి ఉన్న రోడ్డుకోసం గాలించడం ఆరంభించారు. అది కనిపించనేకనిపించింది. దానితో పాటే ఒక సన్నటి మార్గం, దాని చివర పదడుగుల ఎత్తులో కంచె ఉన్న శ్మశాన వాటికా కనిపించింది.
' అంటే ఈ18 వ నెంబర్ మైలురాయి శ్మశానం సులభంగా గుర్తుంచుకునే కొండగుర్తన్న మాట ' అన్నాడుసీనియర్ పోలీసుఅధికారి.
' కరెక్ట్! కానీ, చిన్న పిల్ల, ఎత్తయిన కంచెను దాటి లోపలికి వెళ్ళ లేదు కదా?" అన్నాడు జూనియర్ నేరపరిశోధకుడు . అందరి అనుమానాలూ ఒకే చోటికి దారి తీశాయి.
అధికారులు శ్మశాన వాటిక చేరి వరుసలు వరుసలుగా నిర్మించి ఉన్న సమాధులనన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి చూశారు. ఇంకేదైనా స్పష్టమైన ఆధారం దొరుకుతుందేమోనని ఆశ.
ఒక చోట చెత్తాచెదారం, ఆకులూ అలములూ, కొమ్మలూ రెమ్మలూ కప్పిన ఎత్తయిన మట్టిదిబ్బ కనిపించింది! దాని పక్కన ఉన్న సమాధి పలక మీద కీర్తి శేషులు ఆకుల రామసుబ్బయ్య .. జన్మించిన తేది: 01-08-1918 ; మరణించిన: తేది17-10- 1981 అని కొట్టాచ్చిన్నట్లు కనిపించింది.
అధికారులు దానిని తవ్వి చూశారు. సమాధిరాయి కింద చాలా లోతులో బ్యాంక్ కేష్ బాక్సు లో దొంగిలించిన -సొమ్ము 18 దొంతర్లలో వంద చొప్పున కట్టిన రెండువేల నోట్లు కనిపించాయి!
జైల్లో వున్న తోడుదొంగలను నాలుగు తగిలించి గట్టిగా అడిగితే ఒప్పు కోక తప్పింది కాదు ప్లాన్డ్ గా చేసిన నేరాన్ని .
***