హాయ్... ఏంటీ నిన్న టచ్‌లో లేవు... ఎటెళ్లావు?’’‘‘నా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేశా...’’‘‘అవునా... ఏం చేశారు...’’‘‘అబ్బా... ఆశ... అదేంటో గానీ అతడు ముద్దు పెట్టినా, ముట్టుకున్నా ఏదోలా ఉంటుంది...’’ఫేస్‌బుక్‌లో సాగుతున్న చాటింగ్ మున్నీని ఎగ్జయిట్ చేస్తోంది.రష్మీ తనను రెచ్చగొడుతోంది. ఫేస్‌బుక్‌లో కొన్ని సెక్సీ ఫోటోలు కూడా పెట్టింది.చాటింగ్ కొనసాగుతుండగానే ‘మున్నీ’ అంటూ తల్లి పిలవడంతో ‘బై.. సీ యూ...’’ అంటూ గబగబా టైప్ చేసి లాగౌట్ అయ్యింది.‘‘ఏమండీ... మున్నీ వారం రోజులుగా డల్‌గా ఉంటోంది. రెండు రోజుల నుంచీ కాలేజీకి కూడా వెళ్లడం లేదు...’’‘‘అదేంటి రాజేశ్వరీ... జ్వరంగానీ వచ్చిందా...’’‘‘ అస్తమానం ఫేస్‌బుక్, వాట్సాప్‌లో చాటింగ్ చేసే మున్నీ ఫోన్ రింగ్ వింటేనే ఉలిక్కిపడుతోంది...’’ఆఫీసుకు వెళ్లబోతున్న అనిల్ భార్య చెప్పిన విషయం విని వెంటనే మున్నీ బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. అతడి వెనకే వెళ్లింది రాజేశ్వరి.బెడ్ మీద మునగదీసుకుని పడుకున్న కూతురి పక్కనే కూర్చుని నుదుటిపై చేయి వేసి చూస్తూ ‘‘మున్నీ ఏమైందమ్మా...’’ లాలనగా అడిగాడు.
‘‘ఏం లేదు డాడీ... ఐయామ్ ఫైన్’’ అంటూ అటువైపు తిరిగి పడుకుంది.చేసేదేం లేక గది బయటకు వచ్చాడు అనిల్. భర్తను అనుసరించింది రాజేశ్వరి.‘‘కాలేజీలో ఏమైనా గొడవ జరిగిందా? అసలే ఇంటర్ సెకండియర్‌లో ఉంది. అయినా, కాలేజీ వాళ్లు ఏదైనా సమస్య ఉంటే వెంటనే చెబుతారే! అసలేమైందో నువ్వే బుజ్జగించి తెలుసుకో. వీలైతే ఈ రోజు ఆఫీసుకు సెలవు పెట్టు...’’ అంటూ ఆఫీసుకు బయల్దేరాడు అనిల్.అనిల్, రాజేశ్వరి ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వారి ఒక్కగానొక్క కూతురు మున్నీ. ఆల్‌మోస్ట్ ఒకేసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు.
సాయంత్రం ఒకరి తర్వాత ఒకరు ఇంటికి చేరుకుంటారు.గత కొన్ని రోజులుగా మున్నీ ప్రవర్తన గమనిస్తున్న రాజేశ్వరిలో ఆందోళన మొదలైంది.గంట తర్వాత మున్నీ గదిలోకి వెళ్లి నెమ్మదిగా కుమార్తె భుజంపై చెయ్యి వేసి ‘‘ఏమైందమ్మా... ఎందుకంత దిగులుగా ఉన్నావు’’ అంటూ దగ్గరకు తీసుకుంది.అప్పటిదాకా తనలో తానే కుమిలిపోతున్న మున్నీ ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ తన బాధను తల్లితో షేర్ చేసుకుంది.
ఒక్కో మాట వింటున్న కొద్దీ రాజేశ్వరి నెత్తిన పిడుగు పడ్డట్టయింది.‘‘ఏం కాదమ్మా... మేమున్నాం కదా... డాడీకి పోలీసు సర్కిల్స్‌లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు’’ అంటూ మున్నీకి ధైర్యం చెప్పి వెంటనే భర్తకు ఫోన్ చేసింది.‘‘మనం ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయడం కరెక్ట్ కాదు.. పోలీసులకు చెబుదాం...’’ అంటూ అనిల్ భార్యతో కలిసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిశారు.‘‘అలాంటి వాళ్లను అస్సలు వదలకూడదు. మీరు మా దృష్టికి తీసుకొచ్చి మంచి పని చేశారు. అమ్మాయి వివరాలు బయటకు పొక్కకుండా మేం చూసుకుంటాం’’ అని భరోసా ఇచ్చారు ఆనంద్.వాళ్లు వెళ్లిన తర్వాత సైబర్ క్రైమ్ ఏసీపీ జయరామ్‌ను పిలిచి విషయం వివరించారు.
‘‘ఆ అమ్మాయి ఇంటర్ చదువుతోంది. ఆమె నగ్న చిత్రాలు ఫేస్‌బుక్‌లో పెడతానంటున్నాడు స్కౌండ్రల్...’’‘‘ఫేస్‌బుక్‌లో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి టీనేజ్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న కంత్రీగాళ్లు చాలామందే ఉన్నారు సార్... కానీ అమ్మాయిలు పరువుపోతుందని బయటకు చెప్పుకోవడం లేదు...’’‘‘అసలు ఆ అమ్మాయి ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఏం జరిగింది? బెదిరింపులకు దిగినవాడు ఎవడు? వెంటనే తెలుసుకోండి’’ అంటూ ఆదేశించారు కమిషనర్.కొన్ని గంటలు గడిచేసరికి చాలా విషయాలు బయటపడ్డాయి.
వివిధ కాలేజీలకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసి, తానో అమ్మాయిలా ఫేక్ ఐడీతో వారితో పరిచయాలు పెంచుకుని, ఆ తర్వాత వాళ్లను బెదిరిస్తున్నవాడిని పోలీసులు కనుక్కున్నారు. అతని పేరు సాజిద్. కోటింగ్ ఇచ్చేసరికి అంతా కక్కేశాడు.‘‘సార్.. అమ్మాయిల పేరిట ఫేక్ ఖాతాలు తెరిచి ఫ్రెండ్స్‌గా మారిన అమ్మాయిలతో పరిచయాలు పెంచుకున్నాను. చాటింగ్‌లో వారిని సెక్సువల్‌గా రెచ్చగొట్టి ఇంట్రెస్ట్ట్ చూపుతున్నవారిని మెల్లిగా ముగ్గులోకి దింపి, వారి నగ్నచిత్రాలు సేకరిస్తాను. ఆ తర్వాత వాటితో బెదిరిస్తాను..’’
‘‘ఇప్పటిదాకా ఎంతమందిని బెదిరించావో చెప్పరా...’’ అంటూ పోలీసులు నాలుగు తగిలించారు.‘‘సుమారు 200 మంది అమ్మాయిలతో పరిచయం పెట్టుకున్నాను. నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వారి ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెడతానని బెదిరించేవాడిని. చాలామంది అమ్మాయిలు తమ పరువు పోతుందని బతిమాలుతూ, అడిగినంత డబ్బులు ఇచ్చేవారు...’’ అన్నాడు.
సాజిద్ దగ్గర 80 మంది అమ్మాయిలకు సంబంధించిన నగ్న ఫోటోలున్న పెన్‌డ్రైవ్‌లు దొరికాయి.అపరిచితుల నుంచి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ వస్తే అంగీకరించవద్దనీ, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో పర్సనల్ ఫోటోలను, నగ్న చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లోను పోస్ట్ చేయవద్దని విద్యార్థినులకు కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు.
…^ ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పంపిన అమ్మాయి ప్రొఫైల్ ఫోటో చూస్తే టెంప్టింగ్‌గా ఉంది.ఫేస్‌బుక్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే ప్రకాశ్ మరో ఆలోచన లేకుండా ‘హలో’ అంటూ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు.మాటలు కలిశాయి. పరిచయం పెరిగింది. కొన్నాళ్లకు చాటింగ్ ‘హాయ్’ నుంచి ‘నాటీ’ల మీదుగా ‘స్వీట్ డ్రీమ్స్’ వరకు వెళ్లింది. ఆ అమెరికన్ యువతి పేరు ఫ్రాన్సిస్.హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ప్రకాశ్. అదృష్టం కలిసొచ్చి బాగా సంపాదించాడు. సోషల్ నెట్‌వర్క్‌లో యాక్టివ్‌గా ఉంటాడు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఎక్కువే. దేశ విదేశాలకు చెందిన వారితో ఫ్రెండ్‌షిప్ చేసుకున్నాడు.
వారితో రెగ్యులర్‌గా చాట్ చేస్తుంటాడు.కొత్తగా పరిచయమైన ఫ్రాన్సిస్ చిన్న వయసులోనే అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నట్టు చాటింగ్ ద్వారా తెలిసింది. మెసేంజర్‌లో పర్సనల్ ఫోటోల షేరింగ్ దాకా వెళ్లింది వ్యవహారం. ఫ్రాన్సిస్ అంటే ప్రకాశ్‌కు చచ్చేంత ఇష్టం. తను లేనిదే జీవితం లేదన్నట్టుగా తయారయ్యాడు.ఫోన్‌లో మెసేజ్ అలెర్ట్ సౌండ్ వినిపించగానే ఆత్రుతగా చూశాడు.‘‘హాయ్ ప్రకాశ్... హౌ ఆర్ యూ’’ ఫ్రాన్సిస్ పలకరింపు.‘‘ఐయామ్ ఫైన్... హౌ ఎబౌట్ యూ డార్లింగ్...’’‘‘దీజ్ ఆర్ మై న్యూ ఫోటోస్... సీ అండ్ ఎంజాయ్...’’ అంటూ కొన్ని పోస్ట్ చేసింది.రెచ్చగొడుతూ హాట్ హాట్‌గా ఉన్న ఆ ఫోటో చూడగానే ప్రకాశ్ గొంతు తడారిపోయింది.‘‘ఇండియాకు రా... నీకు స్వర్గం చూపిస్తా...’’ అంటూ వెంటనే మెసేజ్ పెట్టాడు.
ప్రకాశ్ ఊహాలోకాల్లో తేలియాడుతుండగా ఒకరోజు ఫ్రాన్సిస్ నుంచి మెసేజ్ వచ్చింది.‘అమెరికన్ ఆర్మీలో తాను పనిచేస్తున్నానని, తనను ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి దళాల్లో భాగంగా ఇరాక్ పంపించారని’ ఆ మెసేజ్ సారాంశం.ఇంకోరోజు ‘‘డియర్... నేను ఇరాక్ నుంచి నీ వద్దకు త్వరలో వస్తాను. అయితే, అమెరికాలో నా పేరిట చాలా డబ్బు ఉంది. ఎటూ జాబ్ రిజైన్ చేసి నీ దగ్గరకు రాబోతున్నా కదా!. ఆ డబ్బు నీకు పంపిస్తా...’’‘‘ ఓకే...’’‘‘నా అకౌంట్‌లో ఉన్న 5.6 మిలియన్ డాలర్లను రెడ్‌క్రాస్ ఏజెంట్ విలియమ్స్ దగ్గర డిపాజిట్ చేస్తున్నా. నువ్వు అతడితో మాట్లాడి డబ్బు తెప్పించుకో’’ అని ఫ్రాన్సిస్ మెసేజ్ ఇవ్వడంతో ప్రకాశ్ మనసు గాలిలో తేలిపోయింది.
ఒకటా, రెండా... సుమారు 39 కోట్ల రూపాయలు... అప్పనంగా అందబోతున్నాయని తెగ ఆనందపడ్డాడు.ఫ్రాన్సిస్ చెప్పినట్లే మరునాడు విలియమ్స్‌కు ఫోన్ చేశాడు.‘‘ఎస్... ఫ్రాన్సిస్ చెప్పింది. ఆ డబ్బు మీకు పంపిస్తా. మీ అకౌంట్ డీటైల్స్ పంపండి. ఫారిన్ ఫండ్స్ రిసీవ్ చేసుకోవడానికి మీకు అనుమతి ఉందా?’’‘‘నేను తెలుసుకుని చెబుతా’’ అని ప్రకాశ్ రిప్లై ఇచ్చాడు.‘‘డియర్ బ్రో... నో ప్రాబ్లమ్... నేను చూసుకుంటా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీలో మా రెడ్‌క్రాస్ ఏజెంట్ మార్షల్ ఉన్నాడు. హి విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్’’ అంటూ మార్షల్ ఫోన్ నెంబరు పంపాడు విలియమ్స్.
ఆ తరువాత మార్షల్‌తో ప్రకాశ్ పలుమార్లు మాట్లాడాడు.విదేశీయుల డబ్బును భారతీయుల ఖాతాలోకి బదిలీ చేయడానికి అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి, కొంత మొత్తాన్ని మార్షల్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు ప్రకాశ్. వివిధ ఫీజుల రూపేణా అప్పటికే దాదాపు కోటిన్నర రూపాయలకు పైగా మార్షల్ వసూలు చేశాడు. అయినా ఫ్రాన్సిస్‌కు సంబంధించిన డబ్బు ఇంకా చేతికి అందలేదు.అదే విషయాన్ని ఫ్రాన్సిస్‌కు చాటింగ్‌లో చెప్పాడు.‘‘మార్షల్ నాక్కూడా ఫోన్ చేశాడు. డబ్బు వచ్చేస్తోంది. నేనూ వస్తున్నా...’’‘‘ఎప్పుడు...?’’
‘‘ఇంకో వారం రోజుల్లో డబ్బుతో పాటు నేనూ ఇండియాకు వచ్చేస్తున్నా. అప్పుడిక మనం ఆ డబ్బుతో హ్యాపీగా ఉండొచ్చు. ఏదో డ్యూటీ ఫీజు కట్టాలట. ఇదే లాస్ట్ అని చెప్పాడు మార్షల్’’‘‘ఇప్పటికే కోటిన్నరకు పైగా కట్టా. ఇంకా యాభై లక్షలంటే నావల్ల కాదు...’’ అని ప్రకాశ్ కాస్త గట్టిగా చెప్పడంతో ఫ్రాన్సిస్ చాటింగ్ ఆపేసింది.అంతే... తాను మోసపోయానని గుర్తించిన ప్రకాశ్ లబోదిబోమంటూ, జరిగిన కథంతా తెలియజేస్తూ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మార్షల్ ఫేస్‌బుక్ ఐడీ, ఫోన్‌నెంబర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన సైబర్‌క్రైమ్ పోలీసులు ఢిల్లీలో మార్షల్‌ను పట్టుకున్నారు.
అప్పుడు తెలిసింది అసలు సంగతి ప్రకాశ్‌కు. అసలు ఫ్రాన్సిస్ అనే యువతి లేదనీ, ఇదంతా విలియమ్స్, మార్షల్‌లు కలిసి ఆడిన నాటకమనీ.నేరస్థుడు మార్షల్ దొరికాడు కాబట్టి, అతడి దగ్గరి నుంచి తన డబ్బు వసూలు చేసి పెట్టమని పోలీసులను బతిమాలాడు ప్రకాశ్.
అయితే అప్పటికే ఆ డబ్బును వారు స్వదేశమైన నైజీరియాకు పంపారు.వీటినే నైజీరియన్ మోసాలంటారనీ, ఆ డబ్బు రికవరీ చేయడం సాధ్యం కాదనీ, ఆ మొత్తం ఇప్పటికే అనేక చేతులు మారి ఉంటుందనీ పోలీసులు చెప్పడంతో ప్రకాశ్ బిక్కమొహం వేశాడు. ‘అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్స్‌ను యాక్సెప్ట్ చేస్తే జరిగేది ఇదే’ అంటూ సైబర్‌క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.
(గోప్యత కోసం పేర్లు మార్చి రాయడం జరిగింది)