బంధం తల్లి ఎదురుచూపు వృద్దాప్యం మమకారం
రాత్రి భోజనం ముగించి ఆరు బయట పడుకున్న శాంతమ్మ ఫోన్ రింగ్ అవుతుండడంతో లోపలికి వచ్చి ఫోన్ అందుకుంది. అవతలి వైపు గొంతు వినగానే అప్రయత్నంగా శాంతమ్మ కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి. అది తన కొడుకు విజయ్ గొంతు. ఎలా వున్నావ్ చిన్నా ఆరు నెలలు దాటింది నీ గొంతు విని అంది శాంతమ్మ ఆవేదన, వాత్సల్యం కలగలిసిన స్వరంతో. బాగానే వున్నానమ్మ కాస్త పని ఒత్తిడిలో వుండి ఫోన్ చేయలేక పోయాను అంటూ సమాధానమిచ్చాడు విజయ్ తన తల్లి అడిగిన ప్రశ్నలకి. నువ్వు ఎలా వున్నవమ్మా, నీ ఆరోగ్యం ఎలా వుంది అని అడుగుటతాడని ఆశగా ఎదురుచూసిన శాంతమ్మకు నిరాశే మిగిలింది. చెప్పదలుచుకున్న విషయాన్ని తన సమయం వృధా కాకుండా రెండు ముక్కల్లో చెప్పేసి తనకి ‘అనవసరమైన’ విషయాలను ప్రస్తావించకుండా ఫోన్ పెట్టేయడం అలవాటే విజయ్ కి. తన క్షేమ సమాచారం తెలుసుకోవడం కూడా ఆ ‘అనవసరమైన’ విషయాలలో ఒకటి. కానీ ఈసారి తన తల్లి ఆనందంతో ఎగిరి గంతేసే విషయం ఒకటి చెప్పి, శాంతమ్మ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే తనకు వేరే పనుందని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇంతకీ ఆ విషయమేమిటంటే, విజయ్ తనకి రెండు నెలలు సెలవులు ఇవ్వడంతో తన తల్లిగారింట్లో నెల రోజులు , అత్తగారింట్లో నెలరోజుల పాటూ సరదాగా గడపడానికి తన భార్య , పిల్లలతో అమెరికా నుండి ఇండియాకు రెండు వారాల్లో వస్తున్నాడు. ఈ విషయం తెలిసిన దగ్గరనుంచి శాంతమ్మ ఆనందానికి అవధులు లేవు. మూడున్నర సంవత్సరాల తర్వాత తన కొడుకు ని చూడబోతుంది ఆమె.
ఫోన్ పెట్టేసి తిరిగి ఆరు బయటకు వచ్చి పడుకున్న శాంతమ్మ కు నిద్ర పట్టడంలేదు. తన కొడుకు చిన్ననాటి సంఘటనలు, అతడిని పెంచడానికి ఆమె పడ్డ కష్టాలు, ఉద్యోగ నిమిత్తం తల్లిని వదిలి అమెరికా వెళ్ళిపోవడం లాంటివన్నీ తలుచుకుంటుంటే అంతా ఒక కల లా అనిపిస్తుంది ఆమెకి.
చిన్నా తన ఒక్కగానొక్క కొడుకు. ఎప్పుడూ విజయం తప్ప అపజయం అతని దరి చేరకుడదని విజయ్ అని పేరు పెట్టుకున్నా ముద్దుగా చిన్నా అని పిలుచుకుంటూ వుండేది. పేరు కు తగ్గట్టుగానే విజయ్ ఆటల్లోనూ, చదువుల్లోనూ అందరికంటే ముందుండేవాడు. చిన్నప్పుడు చిన్నా ఎంతో ముద్దు గా ఉండేవాడు, చాలా అల్లరి చేసేవాడు తను పెడితే కాని అన్నం తినేవాడు కాదు. విజయ్ చిన్ననాటి రూపం తన కళ్ళల్లో మెదులుతుంటే ఆ రూపాన్ని తన కళ్ళల్లో అలాగే బంది౦చాలనుకుందో ఏమో కళ్ళను గట్టిగా మూసింది. అప్పటిదాకా తన కళ్ళల్లో కదలాడిన జ్ఞాపకాలు కన్నీరు గా కరిగి కళ్ళ నుండి బయటకు వచ్చి చెక్కిళ్ళ మీదుగా ప్రవహి౦చసాగాయి. చిట్టి చిట్టి చేతులతో తన చిన్నా ‘ఏడవకు అమ్మా’ అంటూ చెంపల పై చేరిన కన్నీటిని తుడుస్తున్నట్టు అనిపించి, ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసింది శాంతమ్మ. అంతా తన భ్రమ, అయినా తన పిచ్చికాని చిన్నా ఇప్పుడు చిన్నవాడు కాదు కదా. ఇద్దరు పిల్లలకి తండ్రి. వాడి కుటుంబం, ఆఫీసు తప్ప మరొక ధ్యాస లేనంత పెద్దవాడైపోయాడు, కన్నతల్లి యోగక్షేమాలు కూడా తెలుసుకోలేనంత గోప్పవాడైపోయాడు అనుకుంది పొంగుకొస్తున్న కన్నీటిని కొంగు తో తుడుచుకుంటూ. శాంతమ్మ ఇలా భ్రమ పడడం ఇది మొదటిసారి కాదు, తను బాధ పడిన ప్రతిసారి చిన్నా తన కన్నీళ్లను తుడుస్తున్నట్టూ, ఆరోగ్యం సహకరించక తనకేమవుతు౦దో అని భయపడిన ప్రతిసారి నీకేం కాదమ్మా, భయపడకు నేనున్నాను కదా అని తన భుజం తడుతూ భయాన్ని పోగొడుతున్నట్టూ భ్రమపడుతుంటుంది. అంతలోనే అదంతా నిజం కాదని తెలుసుకోని కన్నిటి పర్యంతం అవుతుంది.
ఆ రాత్రంతా తన కొడుకు ఆలోచనలతోనే గడిచిపోయింది. ఎప్పుడు తెల్లారిందో కూడా గమనించలేదు ఆమె. పాలవాడు పాలు తీసుకోమని బయట నుంచి అరుస్తుంటే ఆ అరుపులకి ఈ లోకంలోకి వచ్చింది శాంతమ్మ. సూర్య కిరణాలూ చీకటిని చీల్చుకోని సంపూర్ణ వెలుగు ని ప్రసాదిస్తూ నెలతల్లినీ, ఆ తల్లి ఒడి లో వున్న తననీ తాకుతున్నాయి. అప్పుడే తెల్లారిందా అనుకుంటూ లేచి సుర్యభగవానుడికి నమస్కరించి పాలవాడి దగ్గరికి వెళ్లి రోజిటి కంటే నాలుగు లీటర్ల పాలు అదనంగా పోయి౦చుకుంది. విషయమేమిటని పాలవాడు అడిగితే రెండు వారాల్లో తన కొడుకు వస్తున్నాడనీ అతడికోసం పాలకోవాలు చేయడానికని చెప్పి౦ది. అలాగే ఎదురింటి తాయారమ్మ కి, పక్కింటి మాధురి కి వెనుకింటి జయమ్మ కి ఇలా చుట్టూ పక్క ఇళ్ళ వాళ్ళందరికీ చెప్పి వచ్చింది తన కొడుకు రాక గురించి. ఈ మద్య కాలం లో ఇరుగుపొరుగు వారెవరు ఆమె ఇంత ఆనందం గా ఉండడాన్ని చూడలేదు.
తిరిగి ఇంట్లోకి వచ్చిన శాంతమ్మ కొడుకు కి ఏమేమి ఇష్టమో లిస్టు తయారు చేసుకుంది. ఆ లిస్టు ప్రకారం మొదట పాలకోవాలు చేయడం మొదలు పెట్టింది, తరువాత జంతికలు, అరిసలు, కజ్జికాయలు, రవ్వలడ్డూలు, సజ్జబూరెలు చేసింది. ఊరమిరపకాయలు, వడియాలు పెట్టింది. ఇలా వారం రోజుల పాటూ ఆరోగ్యం సహకరించకున్నా తన కొడుక్కి ఇష్టమైన వంటకాలన్నీ చేసి సిద్దం గా వుంచింది. ఇంకా తన కొడుకు రావడానికి వార౦ రోజులు వున్నాయి. ప్రతి క్షణం ఒక యుగం లా గడుస్తుంది శాంతమ్మకు.
అమెరికా లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న విజయ్ కు తొమ్మిదేళ్ళ క్రితం రమ్యతో వివాహమైంది. వివాహమనతరం తన భార్యని తీసుకొని అమెరికా వెళ్ళిన కొడకు ఈ తొమ్మిదేళ్ళ కాలంలో మూడుసార్లు మాత్రమే తన తల్లిని చూడడానికి వచ్చాడు. మొదటి సారి వచ్చినప్పుడు పిల్లలతో వచ్చాడు తరవాత నుంచి ఒక్కడే వచ్చేవాడు. అదేమని అడిగితే ఏవో కారణాలు చెప్పేవాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇన్నాళ్ళకైనా తన చిన్నా అతని పిల్లలను తీసుకొని తనని చూడడానికి వస్తున్నాడు. అదే చాలు అనుకోని సంబరపడిపోతుంది శాంతమ్మ.
కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్న ఆమెకు వారంలో నాలుగు రోజులు చాల భారంగా గడిచాయి. ఇంకా మూడు రోజులు అంటే 72 గంటలు, 4320 నిమిషాలు. నిమిష నిమిషానికి గడియారం వంక చూస్తుంది. మన్నుతిన్న పాములా నిదానంగా కదులుతున్న గడియారం నిమిషాల ముల్లును చూస్తుంటే చిరాకేస్తుంది శాంతమ్మకు.
కొడుకు కోసం ఇలా ఎదురుచూడడం కొత్త కాదు ఆమెకు. చిన్నా తన కడుపులో వున్నప్పుడు నవమాసాలు ఎదురుచూసింది ఎప్పుడెప్పుడు తన చిట్టి తండ్రిని తన చేతుల్లోకి తీసుకోని ముద్దాడదామా అని. అతడు పుట్టాక మళ్ళీ ఎదురు చూడడం మొదలు పెట్టింది తనని ‘అమ్మా’ అని పిలిచే రోజు కోసం. ఆ రోజు రానే వచ్చింది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఆ తల్లి. ఐదేళ్ళకి బడిలో చేర్పించింది చిన్నాని శాంతమ్మ. నాలుగేళ్ళ పాటూ తల్లికి బాగా అలవాటుపడిన తన కొడుకు ఆమెను వదిలిపెట్టి బడికి వెళ్లనని ఒకటే మారాం చేసేవాడు. అప్పుడు శాంతమ్మ’నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే వుంటాను కన్నా, ఏడవకుండా చక్కగా చదువుకో’మని సర్ధి చెప్పి స్కూల్లో దించి చిన్నా స్కూల్ వదిలిపెట్టి వచ్చేదాకా అక్కడే ఎదురుచూస్తూ కుర్చునేది. స్కూల్ వదిలిపెట్టగానే చిన్నా పరిగెత్తుకుంటూ వచ్చి ‘అమ్మా’ అంటూ తనని చుట్టేసేవాడు. ఆ స్పర్శ కోసం ఎంతసేపైనా ఎదురుచూడొచ్చు అనిపించేది ఆమెకు. నిజానికి కొడకు కోసం ఎదురుచూడడంలో ఏ తల్లికి అయిన ఆనందం వుంటుంది. అప్పటి దాకా అదే ఆనందం తనూ పొందింది.
చిన్నా స్కూల్ చదువు అయిపోయాక ఫై చదువుల కోసం వేరే ఊరు వెళ్ళి అక్కడ హాస్టల్ లో వుండి చదువుకునేవాడు. అప్పటి నుండి ఆమె ఎదురుచూపు బాధనూ, నిరాశనూ మిగిల్చింది. కారణం చిన్నా లో వచ్చిన మార్పే.
శాంతమ్మ తను సరిగా తినకుండా పైసా, పైసా కూడబెట్టిన డబ్బులతో సరుకులను తెప్పించి రకరకాల పిండివంటలు చేసి వాటిని తీసుకెళ్ళి కొడుక్కి ఇచ్చి వచ్చేది. బదులుగా ‘బాగున్నయమ్మ’ అనే చిన్న మాట కోసం ఎదురు చూసేది. ఎందుకమ్మా ఇవన్ని? ఆయిల్ ఫుడ్ ఎవరు తింటారని తెచ్చావు అంటూ విసుక్కునేవాడు. చివుక్కుమనేది శాంతమ్మ మనసు. పండగలను తన కొడుకుతో సంతోషంగా జరుపుకోవాలని, అతడికి పండగ సెలవలు ఎప్పుడు ఇస్తారా అని ఎడురుచూసేది. తీరా సెలవలు ఇచ్చాక నేనూ, మా ఫ్రెండ్స్ టూర్ ప్లాన్ చేసుకున్నామమ్మా, ఈ సెలవులకి ఇంటికి రావట్లేదు అనేవాడు. చిన్నా పుట్టిన రోజును ఘనంగా జరపాలని కొడుకుకి కొత్త బట్టలు కొని, అతనికి ఇష్టమైనవన్ని చేసిపెట్టి చిన్నా రాక కోసం ఎదురుచూస్తూ కూర్చునేది. మా ఫ్రెండ్స్ కి బర్త్ డే సందర్భంగా పార్టీ ఇస్తున్నానమ్మా ఇంటికి రావట్లేదు అనేవాడు.
చిన్నా అయిదవ తరగతి లో వుండగా అతని తండ్రి రోడ్డు ప్రమాదం లో మరణించాడు. అప్పటి నుంచి అన్నీ తనే అయ్యి తన కొడుకును పెంచింది శాంతమ్మ. ఎంతో అపురూపంగా చూసుకునేది. ఎన్నో కష్టాలు పడి పెంచిన కొడుకు అతడికి ఉద్యోగం వచ్చాక తనని ఏ కష్టం కలగకుండా చుసుకుంటాడని కలలు కనేది. కానీ తనకు అమెరికా లో ఉద్యోగం చేసే అవకాశం వచ్చిందని తన తల్లిని ఒంటరిగా వదిలేసి విదేశానికి వెళ్ళిపోయాడు చిన్నా.
అప్పటి నుంచి కొడుకు ఫోన్ కోసం ఎదురు చూడని రోజంటూ లేదు. ఏ ఆరు నెలలకో ఒకసారి ఫోన్ చేసి రెండు నిమిషాలు మాట్లాడి పెట్టేసేవాడు. ఆమె చేస్తే బిజీగా ఉన్నానంటూ విసుక్కునేవాడు. అతని రాక కోసం సంవత్సరాల తరబడి ఎడురుచుసేది. రెండు, మూడేళ్ళకు గానీ వచ్చేవాడు కాదు. మనవడు, మనవరాలిని దగ్గరకు తీసుకోవాలనీ, వాళ్ళను తన ఒడి లో కూర్చోపెట్టుకోని రామాయణ౦ మహాభారతం కథలు చెప్పాలని మన సంస్కృతి ని వాళ్లకు తెలియజేయాలని తపించిపోయేది. ఆ అదృష్టానికి తనని నోచుకోనివ్వలేదు ఆమె కొడుకు. తనకు హార్ట్ ఎట్టాక్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు. చిన్నప్పటి నుండి సూది మందు వేయించుకోవడం కూడా అలవాటు లేని శాంతమ్మ ఆపరేషన్ అనగానే భయపడిపోయింది. ఆ సమయంలో తన చిన్నా ఆమె పక్కనుండి ధైర్యం చెప్తే బాగుండనిపించింది ఆమెకు. తను మాట్లాడలేని స్థితిలో వుండడం తో ఆమె ఇరుగు పొరుగు వారు ఈ విషయం చిన్నా కి ఫోన్ చేసి చెప్తే తనకు ముఖ్యమైన పనులున్నాయని పోన్ లోనే తన తల్లిని పలకరించి ఊరుకున్నాడు. ఆ క్షణం చచ్చిపోతే బాగుండు అనిపించింది శాంతమ్మకు.
చూస్తుండగానే మూడు రోజులు ఇట్టే గడిచిపోయి, తను ఎదురుచూసే రోజు రానే వచ్చింది. చిన్నా కోసం ఎదురు చూస్తూ బయట అరుగు మీద కూర్చున్న శాంతమ్మ రాత్రి కావస్తున్నా ఇంకా తన కొడుకు రాక పోవడంతో ఫోన్ చేద్దామనుకుంటూ వుండగా చిన్నానే ఫోన్ చేశాడు. ఏమైంది కన్నా ఇంకా రాలేదు అని ఆతృత గా అడిగిన శాంతమ్మతో మేము రావట్లేదు అమ్మ లాస్ట్ మినెట్ లో ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాం. పిల్లలు అక్కడ వాళ్లకి బోరింగ్ గా ఉంటుందని ఒకటే గోల చేసారు. అందుకే ప్యారిస్ కు వచ్చాం. ఈ సారి సెలవలకు వస్తాం సరేనా అంటూ పెట్టేశాడు. గుండెపోటు వచ్చినంత పనైంది శాంతమ్మకు. ఆమె కళ్ళు కన్నీటి సంద్ర్రాలైనాయి. తన ఎదురుచూపు కి ఫలితం ఎప్పుడూ ఇలాగే వుంటుంది కదా ఇప్పుడు కొత్తేం వుంది అనుకుంటూ మంచం పై పడుకున్న శాంతమ్మకు మత్తుగా అనిపించడం తో కళ్ళు మూసుకోని పడుకుంది.
తెల్లవారుజామున ఆరు గంటలు అయింది. శాంతమ్మ ఇంకా నిద్రలేవలేదు. కన్నకొడుకు ఏళ్ళకు తరబడి ఆమె కోసం రాకపోయినా ఆ సూర్య భగవానుడు మాత్రం ప్రతి రోజూ తన వెచ్చని కిరణాలతో నిద్రలేపి ఆమెను పలకరిస్తుంటాడు. అందుకే ఆమెకు సూర్యభగవానుడు అంటే చాల అభిమానం. ఉదయాన్నే ఆయనకు నమస్కరించి కాని ఏ పని చేయదు. ఆరోజు కూడా తన మృదువైన వెచ్చని కిరణాలతో ఆమెను నిద్రలేపడానికి ప్రయత్నించాడు. కాని శాంతమ్మ లేవలేదు. అయినా పట్టు వదలకుండా క్రమ క్రమంగా తన వేడి ని పెంచుతూ వున్నాడు, పాలవాడు ఇంటి బయట నుండి పాలు తీసుకెళ్ళమని అరుస్తున్నాడు కాని ఆమెలో చలనం లేదు. దాంతో విసిగిపోయిన పాలవాడు వెళ్ళిపోయాడు, కొంత సమయానికి సూర్యుడు అస్తమించాడు.
ఆమె సాయంత్రం దాకా బయటకి రాక పోయేసరికి ఎమై౦దోనని పక్కింటావిడ శాంతమ్మ ను పలకరించడానికి వచ్చి౦ది. శాంతమ్మ అలాగే మంచంమీద ఉంది. అనుమానం వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని చూసిన పక్కింటావిడకు విషయం అర్థమైంది. శాంతమ్మ మరణించిన విషయాన్ని ఆవిడ అందరికీ తెలియజేసింది. చుట్టుపక్కల ఇళ్లవారు, తెలిసిన వాళ్ళు అందరూ ఒక్కక్కరిగా శాంతమ్మ ఇంటికి వస్తున్నారు. ఆమె తల దగ్గర దీపం వెలిగించారు, దండలు వేస్తున్నారు, ఆమెకు దగ్గర వాళ్ళు ఏడుస్తున్నారు. కొంతమంది ఆమె మంచితనాన్ని పొగుడుతున్నారు.
ఇప్పటికైనా వస్తావా చిన్నా? నేను పోయినందుకు ఒక్క కన్నీటి బొట్టునైనా రాలుస్తావా? ఎప్పుడైనా నన్ను గుర్తుచేసుకు౦టావా? ఈ పిచ్చి తల్లి ప్రేమని, నీ కోసం పరితపించిన రోజులనీ, అర్థం చేసుకుంటావా? నీ నుంచి నేనే౦ ఆశించాను చిన్నా? నేను నీపై చూపించిన ప్రేమను నీ నుంచి తిరిగి పొందాలనుకున్నాను అంతే కదా.,
ఇప్పటికైన రా చిన్నా...
శాంతమ్మ పార్థివదేహం చిన్నాను దీనంగా అర్ధిస్తుంది. అతడి రాక కోసం మౌనం గా ఎదురుచూస్తుంది.
అతని ‘ప్రేమ‘కోసం ఎప్పటికీ ఎదురుచూస్తూనే వుంటుంది.
"ఒసేయ్ కనకం నోరు ఎండిపోతుంది గుక్కెడు మంచినీళ్లు ఇవ్వవే. ఎంతసేపటి నుంచి అరుస్తున్నా పట్టించుకోకుండా ఏం చేస్తున్నావ్ లోపల..." అంటూ అరిచాడు సుబ్బారావు. "అబ్బబ్బబ్బా అరవకపోతే మీరే వచ్చి తాగొచ్చుకదా పనిలో ఉన్నాను" అంటూ వంట గదిలో నుంచి సమాధానం ఇచ్చింది కనకమహాలక్ష్మి . " ఇంతకీ ఏం చేస్తున్నావ్ ఏంటి? వాసనలు తెగ గుబాళిస్తున్నాయి , "అంటూ మంచినీళ్లు తెచ్చుకోవడానికి వంట గదిలోకి వెళ్లిన సుబ్బారావు , "ఇప్పుడు ఎవరికోసం ఇవన్నీ చేస్తున్నావ్? ఉన్న పనంతా పక్కనపెట్టి వీటి ముందు కూర్చున్నావు." అన్నాడు. "ఏంటండీ అలా అంటారు! పిల్లలు వస్తున్నారు కదా పట్నం నుంచి. "
"అయ్యో పిచ్చిదానా.. వాళ్ళు రావడానికి ఇంకా చాలా రోజులు ఉంది కదా! మరి ఇప్పుడే చేయాల్సిన అవసరం ఏముంది."
" అదేంటి అలా అంటారు , ఇంకా ఎన్ని పిండివంటలు చేయాలో ఇప్పటికే ఆలస్యంగా మొదలు పెట్టానని నేను బాధపడుతుంటే , పెద్దోడికి ఇష్టమైన అరిసెలు చేయాలి , అమ్మాయికి ఇష్టమైన మురుకులు చేయాలి , చిన్నమ్మాయి కోసం రవలడ్డు చేయాలి , సున్నుండలు , కజ్జికాయలు ఇంకా ఎన్నో చేయాలి ఈ పది రోజులు ఎక్కడ సరిపోతాయండీ. అదీకాక చాలా సంవత్సరాల తర్వాత మనవళ్లు మనవరాళ్లతో వస్తున్నారు , వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఇదే మొదటిసారి అందరూ కలిసి రావడం. ఈ మాత్రమైనా చేయకపోతే ఎలా!!
"సరేగాని చిట్టి గాడి కొట్టుకెళ్ళి తాటిబెల్లం తీసుకురండి. అదంటే చిన్నోడికి చాలా ఇష్టం. చిన్నప్పుడు అదే పనిగా వచ్చి అమ్మ తాటి బెల్లం పెట్టు అని అడుగుతుండేవాడు , ఒకసారి ఇంట్లో తాటి బెల్లం అయిపోయిందని వేరే ఇస్తే నాకు వద్దు తాటి బెల్లమే కావాలని చాలా గొడవ చేశాడు గుర్తుందా!! చేసేది లేక మీరు అప్పటికప్పుడు వెళ్లి తాటిబెల్లం తెస్తే గాని ఏడుపు ఆపలేదు. అంటూ తన చిన్న కొడుకుని గుర్తు చేసుకొని నవ్వుకుంది."
"ఇప్పుడేమైనా తక్కువా నిన్న వస్తున్నామని ఫోన్ చేసినప్పుడు కూడా అడిగాడు. నాన్న తాటిబెల్లం తెప్పించు అని. " అంటూ బయటకి వెళ్ళిపోయాడు సుబ్బారావు.
ఈ పది రోజులు తన పిల్లలకు ఇష్టమైనవన్నీ చేయాలని రాత్రి , పగలు కూర్చొని సిద్ధం చేసింది. ఇంక ఈరోజు రాత్రికి బయలుదేరుతారు రేపు ఉదయానికి ఇక్కడికి వచ్చేస్తారు అనగా , వాళ్ల ఆనందానికి అవధులు లేవు. మరలా మొదలు పెట్టింది రేపు వాళ్ళు వచ్చేసరికి ఏం చేసి పెట్టాలని ఆలోచించడం. వాళ్ల నాన్న అయితే తాటి ముంజలు, పనసకాయలు, రేగిపళ్ళు , ఈత పళ్ళు ఇలా పళ్ళన్నీ సేకరించి పెట్టాడు. ఇంటినంతా శుభ్రం చేయించాడు. ఆ రోజు రాత్రంతా వాళ్ళిద్దరూ నిద్ర పోలేదు. గంటకు ఒకసారి లేచి గడియారం వైపు చూసుకుంటూ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనుకుంటూ కూర్చున్నారు.
"అవునే కనకం పోయిన సారి పండక్కి మన పెద్దోడు నీకోసం ఒక చీర పంపించాడు కదా ఆ చీర కట్టుకోవే రేపు. పెద్దోడు చూస్తే సంతోషిస్తాడు."
"అవునయ్యో ఆ చీర సంగతే మరిచిపోయాను , సమయానికి గుర్తుచేశావ్. నువ్వు కూడా అమ్మాయి పెట్టిన పంచె కట్టుకోవయ్య బాగుంటావు . "
"అలగలగేలేవోయ్..." ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ సమాధానం ఇచ్చాడు సుబ్బారావు.
"అయినా మన పిల్లలు అప్పుడే ఎంత పెద్దోళ్ళు ఐపోయారయ్య..చూస్తుండగానే పెళ్లిళ్లు అయిపోయాయి పిల్లలు కూడా పుట్టేశారు. మొన్న ఆ చిన్నోడైతే అమ్మ నువ్వు , నాన్న ఇంకా ఎన్నేళ్లు కష్టపడతారు ఇంక విశ్రాంతి తీసుకోండి , మిమ్మల్ని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా , నా దగ్గరికి వచ్చేయొచ్చుకదా అన్నాడయ్యా. మన పిల్లలకి మనమంటే ఎంతప్రేమో" అని
వాళ్ళ పిల్లల జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు . ఇంతలో తెల్లవారింది. కనకమహాలక్ష్మి లేచి ఇల్లంతా శుభ్రం చేసి బయట కల్లాపు లాంటివి చేసి రంగురంగుల రంగవల్లులు పెట్టి స్నానం చేసి పూజ చేసి వాళ్ళు వచ్చే సమయానికి తినడానికి అన్నీ సిద్ధం చేసి ఎదురుచూస్తూ కూర్చుంది.
బయలుదేరడానికి ఇంక ఒక్క గంట ఉంది అనగా రావడానికి వీలు పడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు పిల్లలు. ఇలా చెప్పడం వాళ్ళకేం కొత్త కాదు , పిల్లలు పుట్టక ముందు ఎప్పుడో వచ్చారు, పిల్లలు పుట్టి ఇప్పటికే మూడు సంవత్సరాలయింది ప్రతి సంవత్సరం ఇలాగే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాము , బయలుదేరుతున్నాము అంటారు చివరి నిమిషంలో కుదరలేదు అంటారు. కానీ ఆ తల్లి మాత్రం వస్తున్నాము అన్న ప్రతిసారి ఇదే విధంగా ఆనందంతో అన్నీ పిండి వంటలు చేసి పెట్టేది.
కానీ ప్రతీ సారీ వాళ్ళ నుండి వచ్చే సమాధానం ఇదే. ఈసారైనా తప్పకుండా వేస్తారేమో అని కోటి ఆశలతో , ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురుచూశారు ఆ దంపతులు.
" అదేంటండీ ఈ సారి కూడా ఇలానే చేశారు. ఈసారైనా తప్పకుండా వస్తారు అనుకున్నాను." అని బాధపడింది కనకమహాలక్ష్మి. "బాధపడకు కనకం వాళ్ళకి మాత్రం రాకూడదు అని ఉంటుందా! చేసే ఉద్యోగాలు అలాంటివి మరి ఏం చేస్తాం ఇంకొక సంవత్సరం ఎదురు చూడటం తప్ప." అని బయటికి వెళ్లిపోయాడు సుబ్బారావు.
మరుసటి రోజు ఉదయం కనకం నిద్ర లేచి చూసే సరికి ఇల్లంతా సందడిగా ఉండడంతో గదిలోనుండి బయటకి వెళ్లి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తన నలుగురి పిల్లలు , మనవళ్లు , మనవరాళ్లు అంతా కళ్ళముందు ప్రత్యక్షమయ్యేసరికి ఆనంద బాష్పాలతో కళ్ళు తడిచి ముద్దయిపోయాయి. ఒక్కక్షణం కళ్ళు నలుపుకొని తిరిగి చూసింది. ఎదురుగా ఉన్న పిల్లల్ని చూసి అవును ఇది నిజమే అనుకొని తనివితీరా పిల్లల్ని దగ్గరకి తీసుకుని ముద్దాడింది.