నిండు పున్నమి రాత్రి... ఈ లక్డౌన్లూ, ఇంట్లోంచి పనిచేసే పద్ధతులూ ఒకరకంగా మంచివే అయినా పని మాత్రం చాలా పెరిగిపోయింది అనుకుంటూ అప్పడికి చాలా గంటలుగా తాను చేస్తున్న పని ఆపి వెనక్కి వాలాడు రాజారామ్...
ఉద్యోగం ఇచ్చిన ఒత్తిడి నుంచి బయట పడేందుకు ప్రయత్నం చేస్తూ ఫోన్లో మృదువుగా మోగుతున్న తలత్ పాటలు వింటూ, కిటికీ లోంచి బయటకు చూసాడు... ఎల్ పి రికార్డ్స్ నుంచి రేడియో దాకా , కాసెట్ల నుంచి సీడీ ల దాకా, ఇప్పటి డిజిటల్ సంగీతం దాకా టెక్నాలజీ లో ఎన్నో మార్పులు వచ్చినా, మన రాగద్వేషాలలో మార్పులేమీ లేవు, తలత్ గొంతులో అదే మాధుర్యం మన మనస్సులో అదే వణుకు...నవ్వుకున్నాడు రాజారామ్
మెల్లిగా మధ్యరాత్రవుతోందేమో చుట్టూ ఉన్న ప్రపంచం సద్దుమణుగుతోంది...
అప్పుడప్పుడు దూరం నుంచి వినిపించే కుక్కల అరుపులు, మధ్య మధ్య దూరంగా రోడ్డు మీద పోతున్న వాహనాల రొదా మించి అంతా నిశ్శబ్దం...
అకస్మాత్తుగా దూరం నుంచి అంబులెన్సు శబ్దం వినిపించి నెమ్మదిగా దూరమైంది...కరోనా వల్లో, మరో కారణం తోనో ఎవరో ఈ దుర్భర మానవ జన్మ నుంచి విముక్తి పొందుతున్నారేమో...ఆ సమయం వస్తే ఎవ్వరూ ఆపలేరు...అనుకున్నాడు రాజారామ్ దిగులుగా
దూరంగా కనిపిస్తున్న దట్టమైన చెట్లమీద నుంచి మందం గా గాలి వీస్తూంది...జిందగీ ఖ్యాబ్ హై అంటూ ముఖేష్ గారి పాట ఎవరింట్లోంచో లీలగా వినిపిస్తోంది...నిజమేనేమో... అయినా ఈ రోజుల్లో ముఖేష్ పాటలు వినేవాళ్లింకా ఉన్నారా,లేక అది నా ఊహా? అనుకున్నాడు ఆశ్చర్యంగా...
ఆ నిశ్శబ్ద రాత్రీ, ఒంటరితనం... తాను వింటున్న తలత్ గొంతులోని ప్రకంపనలూ లేదా ఉహించుకుంటున్న ముఖేష్ గారి గొంతులోని విచార భావాలూ అన్నీ రాజారామ్ మనసులో ముందే ఉన్న భారాన్ని ఇంకా పెంచుతున్నాయి...
కొమ్మల గువ్వలు గుస గుస మనినా...రెమ్మల గాలులు ఉసురుసురనినా...వస్తారని తాను ఎదురు చూసే వాళ్ళెవ్వరూ లేరు అనుకున్నాడు దిగులుగా నవ్వుకుంటూ...
తన ఒంటరి జీవితానికి కారణమెవరు? తనకు సమాజం వ్యసనాలుగా భావించే ఎలాంటి అలవాట్లూ లేవు...తాను పెరిగిన వాతావరణం లో మంచి అబ్బాయి అనిపించుకోవడానికి అవసరమైన అలవాట్లన్నీ ఉన్నాయి...
అయినా సౌమ్య తనను వదిలేసి పిల్లలిని తీసుకుని వెళ్ళిపోయింది...ఇన్ కంపాటిబిలిటీ అనే ఒక ఆకర్షణీయమైన ఆంగ్ల పదం మాత్రం వాడింది...
ఆ విషయం తెలియడానికి పధ్నాలుగేళ్ళు పట్టిందా? ముందే అనుకుని ఉంటే ఆవేశపడి పిల్లలని ఈ ప్రపంచంలోకి తీసుకురాకుండా ఉండేవాళ్ళం కదా...
అమాటంటే, ఒక జీవిత కాలం ఖైదు అనుభవించాను...ఇంక నావల్ల కాదు, పిల్లల్ని నేను చూసుకోగలను... అని మొహం మీదే చెప్పేసి వెళ్ళిపోయింది…
తన పాతకాలపు పద్ధతుల వల్లా, ఏ విషయానికీ ఎక్కువగా స్పందించకుండా కొంచం ఉదాసీనం గా ఉండడం వల్ల పిల్లల మీద మానసిక ఒత్తిడి పెరుగుతుందనీ, వాళ్ళ పెర్సనాలిటీల మీద దాని ప్రభావం ఉంటుందనీ...
పాతకాలం తెలుగు సాహిత్యం, పాత తెలుగు సినిమాలూ లాంటివి నెమ్మదిగా మారుతూన్న సమాజాన్ని చూపిస్తాయి కనుక ఇప్పడి దూకుడు తో కూడుకున్న సమాజాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యం పెరగదనీ అందువల్ల జీవితమంటే భయం పెరుగుతుందనీ…
మనిషికి మనో ప్రపంచం తో బాటు భౌతిక ప్రపంచం తో కూడా బంధాలుండాలి కాబట్టి ఎంతసేపూ ఇంట్లో కూర్చోవడమూ, బంధువులూ అవే కాకుండా తరచుగా సెలవుల మీద బయటకు వెళ్లాలనీ ఇలా ఎన్నో చెప్పింది...
సౌమ్య చెప్పిన అననుకూలతా సిద్ధాంతాన్ని విడాకులకు సరిపోయే కారణం గా కోర్టు ఒప్పుకోలేదు. ఇద్దరూ కలిసి ఉండక పోయినా పిల్లలు సౌమ్య దగ్గరే ఉన్నా, బంధాలూ, బాధ్యతలూ ఇద్దరివీనూ అని కోర్టు తేల్చింది..
రాజారామ్ ఒప్పుకుంటే పరస్పరామోదం తో విడాకులు ఇవ్వొచ్చు...అందుకోసం అతని మీద సౌమ్య, వాళ్ళ అన్నా ఎంతో ఒత్తిడి తెస్తున్నారు...అయినా రాజారామ్ ఒప్పుకోలేదు, సంతకం పెట్టనూ లేదు...
తుమ్మితే ఊడే ముక్కులాంటి ఈ జీవితం ఆ సంతకం తో నిలబడుతుందని కాదు...పిల్లల్ని వదులుకోలేక...
కొంత కాలం గడిస్తే సౌమ్య మనసు కుదుటపడి ఈ జీవితం తో మనం ప్రయోగాలు చేసే వయసు దాటి పోయిందనీ, ఎదో రకంగా సమాధాన పడటం మంచిదని తెలుసుకుంటుందని అతని ఆశ…
ఇలాంటి ఆశలను నీరు గార్చే సలహాదారులు సౌమ్యకు చాలా మందే ఉన్నారు...
అయినా ఏమో, ఎప్పుడేం అవకాశం వస్తుందో అన్న ఆశ రాజారామ్ ను బతికిస్తోంది...
పగలంతా తన ఆఫీసు పనిలో ములిగి ఉండి ఈ ఆలోచనలూ దిగులూ దూరం గా పెట్టుకోగలిగినా, రాత్రి ఒంటరితనాన్ని ఎదుర్కోవడం నరక ప్రాయమైపోయింది...
మనిషికి మనిషే శత్రువు అంటారు...అది తప్పు, మనిషికి తానే శత్రువు...ఎంత గొప్ప తత్వవేత్త అయినా తన మనస్సాక్షిని ఎదుర్కోవడం చాలా కష్టం...
ఈ రేయి గడిచేదెలా...నీ ఆలోచనల అలలు...నా మనసుని...జోరీగలలా రొదపెడుతూ...కల్లోలం లో ముంచెత్తుంటే అనుకున్నాడు...తల విదిలించాడు…
కొద్దిగా తల నొప్పిగా అనిపిస్తోంది...మనసులో గూడు కట్టుకున్న భావాలు ఇచ్చే నొప్పి కన్నా ఇదేమీ ఎక్కువ కాదు అనుకున్నాడు...
రకరకాల ఆలోచనలతో సతమతమౌతూ దొర్లుతూ నిద్ర పోయాడు...
ఎంతసేపు గడిచిందో తెలియదు...అకస్మాత్తు గా మెలకువ వచ్చింది...ఫోన్ మోగుతోంది...
అప్పుడే తెల్లారి పోయిందా? ఆకాశంలో ఇంకా వెలుగు కనిపించడం లేదే, ఇంత పొద్దున్నే ఎవరు ఫోన్ చేసుంటారు...
లేచి టేబుల్ దగ్గరకు వెళ్లి సెల్ ఫోన్ చూసాడు...రాత్రి రెండున్నర...
ఫోన్ చేస్తున్న నెంబర్ తనకు తెలియదు...తియ్యాలా లేక తన అలవాటు ప్రకారం తెలియని నంబర్లను పట్టించుకోకుండా వదలాలా...తేల్చుకోవడం కష్టం గా ఉంది...
ఒక్క క్షణం ఆగి ఫోన్ తీసాడు...
"రాజారామ్ గారా" అనడిగింది ఫోన్ లోని గొంతు...కొద్దిగా వణకుతున్న ఆ మృదువైన మాట ఆ అర్ధ రాత్రిలో రాజారాంలో అలజడి పెంచింది...గుండె గొంతులో కొట్టాడుతోంది...
కొంచం ధైర్యం కూడదీసుకుని "అవును, మీరెవరు...ఇంత రాత్రి ఫోన్ చేసారు" అనడిగాడు
"నా పేరు వెంకట రత్నం...లాయర్ ని" అందా గొంతు
"కోర్ట్ విషయాలేమైనా ఉంటే రేపు పగలు మాట్లాడుకోవచ్చు కదా, ఇంత అర్ధరాత్రి మాట్లాడాల్సిన విషయం ఏముంది" అనడిగాడు విసుగ్గా
"క్షమించాలి, కోర్ట్ విషయాలేమీ లేవు...మీకొక వార్త చెప్పాలి" అందా గొంతు కొంచం సంకోచంగా
"సౌమ్య చెప్పాల్సిన విషయలింకా ఏమున్నాయి" అనడిగాడు రాజారామ్ చిరాగ్గా..
"ఇది మీ విడాకులకు సంబంధించిన విషయం కాదు, మరో వార్త" అందా గొంతు …
"చెప్పండి" అన్నాడు రాజారామ్
"రాధ ఒక గంట క్రితం మరణించింది" అందా గొంతు భారంగా…
"ఏ రాధ, నాకెందుకు చెబుతున్నారు" అనడిగాడు రాజారామ్…
"మీ చిన్నప్పుడు మీ పక్కింట్లో ఉండే రాధ...సూటిగా చెప్పాలంటే మిమ్మల్ని ప్రేమించిన రాధ" అందా గొంతు…
షాక్ తిన్నాడు రాజారామ్...ఎప్పటి రాధ... ఆవిడని గురించిన ఆలోచనలే తన జీవితం నుంచి మాయమై పోయాయి, కానీ రాధ మాత్రం ఇంకా గుర్తు పెట్టుకోవడమే కాకుండా తన ఫోన్ నెంబర్ కూడా సేకరించింది...
తన జీవితం లో ఎంతో ప్రముఖ పాత్ర పోషించి దూరమైన రాధ అకస్మాత్తుగా ఈ ప్రపంచంలోంచి నిష్క్రమించడం...ఆ మాట ఇంత అర్ధరాత్రి తనకు ఎదో తెలియని గొంతు చెప్పడం...ఏమీ అర్ధం కాలేదు
"ఏమంటున్నారు మీరు...రాధ మరణించడమేమిటి? ఏం జరిగింది?" అనడిగాడు రాజారామ్
అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి...రాధ గుర్తుకు రావడం వల్ల మాత్రమే కాదు...ఆమె ప్రేమ గురించి తనకేమాత్రం పరిచయం లేని లాయర్ గారు కూడా అనడం అతడికి లోతుగా తగిలింది...
తాను చాలా మంచిదీ, చురుకైనదీ మాత్రమే కాదు చాలా మంచి భావుకురాలు ...అన్నింటి కన్నా ముఖ్యం చాలా పరిణతి చెందిన మనిషి...
అలంటి అమ్మాయి తాను గా వచ్చి ప్రేమిస్తున్నట్టు చెప్తే తాను ఎలా భయపడి దూరమైపోయాడో గుర్తుకొచ్చి చాలా అసహ్యం వేసింది...
"రాధ కాన్సర్ వల్ల మరణించింది...ఇంక సమయం దగ్గర పడిందని తెలుసుకుందో ఏమో, సాయంత్రమే మీ ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఇచ్చి తాను మరణిస్తే ఆ మాట తప్పకుండా మీకు చెప్పమంది" అన్నాడు లాయర్ గారు
"నాకెందుకు...నేనొక అనర్హుడిని, జీవన సమరంలో ఓడిపోయిన వాడిని...నావల్ల తను జీవించి ఉండగా ఎంతో వేదన పడింది అలాంటి నాకు ఈ విషయం తెలియడం వల్ల ఆమె ఆత్మకు ఎలాంటి శాంతీ కలగదు" అన్నాడు రాజారామ్ గద్గదమైన గొంతు తో
"ఆవిడ మీరెలా ఉంటే అలాగే అంగీకరించింది...అందుకనే మీకు చెప్పమంది...ఆవిడ కోసం ప్రార్ధన చెయ్యండి...ఆవిడకు జీవితం లో రక్త బంధువులెవరూ లేరు...అందుకే ఆత్మ బంధువుగా మిమ్మల్ని తలకొరివి పెట్టమంది" అన్నారు లాయర్ గారు...
"అదేమిటి, తన తమ్ముడు సునీల్ ఏమయ్యాడు...అతనికి పిల్లలు కూడా ఉండాలే...వాళ్ళు కూడా రాధను వదిలేశారా?" అనడిగాడు రాజారామ్ బాధగా
"సునీల్, అతని భార్య, కొడుకూ ఒక ఆక్సిడెంట్ లో మరణించి దాదాపు పదేళ్లు కావస్తోంది...ఒక కూతురుంది...తనను రాధే పెంచి పెద్ద చేసింది...ఆస్తి గురించి గొడవ పెట్టుకుని తాను కూడా రాధను వదిలి వెళ్లి పోయింది" అన్నాడు లాయర్ గారు...అయన గొంతులో మార్దవం నెమ్మదిగా బాధగా మారడం రాజారామ్ కు అర్ధం అవుతోంది...
ఒక బంధాన్ని నిలబెట్టుకోలేక తన పద్ధతులే మంచివని మార్చుకోకుండా జీవితాన్ని దుఃఖం లోకి నెట్టేసుకుని తన మీద తానే జాలి పడుతూ నేను బతికేస్తుంటే...జీవితం అడుగడుగునా కొట్టిన దెబ్బలను సహిస్తూ కూడా మనుషుల మీద తన ప్రేమను కోల్పోకుండా జీవించ గలిగింది రాధ...తనకిలాంటి మరణమా... ఆమె శరీరం ఒక అనాధ ప్రేతం లా పడుందా...
గుండె బద్దలయ్యింది రాజారామ్ కి...కళ్ళల్లోంచి నీళ్లు ధారాపాతం గా కారుతున్నాయి...
"రాధ ఎక్కడుంది...నేనొస్తున్నాను" అన్నాడు కంగారుగా
"ఇంకా మృత శరీరాన్ని మాకివ్వలేదు...కరోనా లేదని తేలితే గానీ ఇవ్వరుట...పొద్దున్న రండి... పొద్దున్నే మీకు మావాళ్లెవరైనా ఫోన్ చేస్తారు " అన్నారు లాయర్ గారు
"ఆలా కాదు, దయచేసి చెప్పండి" అని బతిమాలాడు రాజారామ్
దానికి ఏమీ స్పందించకుండా "నేను తరువాత మాట్లాడతాను" అని ఫోన్ పెట్టేసాడు లాయర్ గారు...నిరాశ పడ్డాడు రాజారామ్...తనకు ఫోన్ వచ్చిన నెంబర్ కు తానే ఫోన్ చేసాడు...పలకటం లేదు...
రాధ జీవితం నుంచి తాను ఎంతగా దూరమైపోయాడంటే...అదొక ఒంటి దారి...వెనక్కు తిరిగే అవకాశమే లేదు...
ఆలోచనలు ముసురుకున్నాయి...
ఈ ప్రపంచంలో తన తల్లిదండ్రుల తరువాత అసలంటూ తనను ఎలాఉంటే ఆలా అంగీకరించి ప్రేమించిన ఒకే మనిషి రాధ...
ఎంతగానో ప్రేమించి కట్టుకున్న భార్య తాను ఎలా పెరిగాడు, ఎలాంటి పద్ధతులకు అలవాటుపడ్డాడు, ఎన్నివిషయాల్లో తన పద్ధతులు భార్య కోసం మార్చుకున్నాడు లాంటివేవీ పట్టించుకోకుండా అసంతృప్తి పెంచేసుకుంది... తాను కూడా భార్య భావాలూ అవసరాలూ పెద్దగా గుర్తించకుండా తన ప్రపంచంలో బతకడం గుర్తుకు వచ్చింది…
ఈ ప్రపంచం లో తనకంటూ ఎవరూ లేవని నిరాశపడుతూన్న సమయంలో రాధ ఉందని తెలిసే సరికే లేటైపోయింది...రాధ పంచ భూతాల్లో కలిసిపోయింది...ఒక దివ్యశక్తి అయిపోయి పైకెళ్ళి పోయింది...
రాధ ఉందని ముందే తెలిసుంటే తనతో మనసులోని బాధను చెప్పుకునే వాడు, తన సమస్యలకు రాధ ఒక దారి చూపించేది...గత ఎనిమిది నెలలుగా ఈ ఒంటరితనం తో,ఓటమి భావనతో పడుతూన్న వేదనకు కొంత ఉపశమనం కలిగేది...
చాలాసేపు ఆలా బాధపడుతూ కూర్చున్నాడు రాజారామ్...
రాధను గురించిన ఆలోచనలు అతడిని తేనెతుట్ట చుట్టూ చేరుతున్న తేనెటీగల్లా ముసురుకున్నాయి...
తన యవ్వనపు రోజులు గుర్తుకొచ్చాయి రాజారామ్ కి...తన కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల వల్లా, కుటుంబ కలహాల వల్లా జీవితం ఎంతో కల్లోల పూరితంగా ఉండేది...ఆ రోజుల్లో తన మనో ధైర్యం చాలా తక్కువగా ఉండేది...ముందుకెళ్లడానికి సంకోచంగా ఉండేది...
ఆ రోజుల్లో రాధ పరిచయమైంది...తన పక్కింట్లో ఉండేది...తనకన్నా కొంచం పెద్దది, చదువులో రెండు క్లాసులు ఎక్కువ...
తనకు చదువు లో మాత్రమే కాదు, ఎన్నో రకాల సాయం చేసింది, జీవితాన్ని ఎలా చూడాలో నేర్పింది, సమస్యలని ఎలా సూటిగా ఎదుర్కోవాలో నేర్పింది...యవ్వనం లో ఉండే ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం నేర్పింది...
ఒకరకంగా చెప్పాలంటే తన పర్సనాలిటీ నిర్మాణంలో, బలపడటం లో రాధ పాత్ర చాలా ఎక్కువ...
అలాంటి రాధను కేవలం తాను అందమైనది కాదని వదులుకోవడం గుర్తుకొచ్చింది...
చిన్నతనంలో చదువులో పెద్దగా రాణించకపోయినా, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులు వచ్చేసరికి ఒక్కసారిగా పుంజుకున్నాడు రాజారామ్...మంచి ఉద్యోగం దొరికింది...కుటుంబం లోనూ, స్నేహవర్గం లోనూ గౌరవం పెరిగింది...
ఆ కొత్త బలం వల్ల కళ్ళు మూసుకుపోయి నోరు తెరిచి ప్రేమను వ్యక్తం చేసి పెళ్లి ప్రతిపాదించిన రాధను కాదనుకున్నాడు...
కౌమార దశలో తాను చేసిన సాయాలన్నీ ఎదో ఒక దుర్భుద్ధితోనే అని…తాను అందమైనది కాదు కాబట్టి పెళ్లి కాదనీ అందువల్లే ముందు నుంచే తనను దగ్గర చేసుకునే ప్రయత్నం చేసిందనీ, తనకు చేసిన సాయాలన్నీ అందుకోసమే అనీ చాలా సంకుచితంగా అలోచించి కాదన్నాడు...
కాదన్నందుకు రాధ బాధ పడిందని అర్థమైనా, ఆమెను ఓదార్చే ప్రయత్నం చెయ్యలేదు... అసలు ఆ విషయమే పట్టించుకోలేదు...
రాధను వీలైనంత దూరం పెట్టడం మొదలు పెట్టాడు... తరువాత మంచి ఉద్యోగం దొరకడం తో ఊరొదిలి బెంగళూరు వచ్చేసాక, తన జీవితం లో రాధ పాత్ర దాదాపు అంతమై పోయింది...
రెండు మూడేళ్లు బెంగళూరు జీవితాన్ని అనుభవించాక, తన ఆఫీసులో అందరికంటే అందమైన అమ్మాయి సౌమ్య వెంటపడి పెళ్లి చేసుకున్నాడు...
సాధారణం గా కొంచం ఉదాసీనంగా వెనక బెంచుల్లో కూర్చునే తనకు అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు...విధి లిఖితం ఎవ్వరూ తప్పించ లేరు...
సౌమ్య మంచిదే కానీ చాలా దుడుకు...ఎలాంటి మాటైనా ముందూ వెనుకా చూడకుండా అనేస్తుంది...ఆ రోజుల్లో సౌమ్యకు ఏది ఇష్టమైతే తనకూ అదే…ఆలా తన అసలు రూపం గురించి గానీ, తన ఇష్టాయిష్టాల గురించి కానీ పెద్దగా మాట్లాడుకోలేదు...
తాను కన్నడం అమ్మాయి కాబట్టి తెలుగు సాహిత్యం లాంటివి మాట్లాడే అవకాశమే లేదు...తనకు కన్నడ సాహిత్యం మీద పెద్ద అభిమానమేమీ లేదు...
సంగీతం విషయం లో ఇద్దరికీ కొన్ని సాపత్యాలున్నాయి...ఇద్దరికీ మధురమైన సంగీతం ఇష్టం ఉండడం, పాట హిందీ గాయకుల మీద అభిమానం లాంటివి ఇద్దరికీ మాట్లాడుకోవడానికి ఎంతో ఉపయోగ పడ్డాయి...
దాదాపు రెండేళ్లు తిరిగాక గానీ ఆ బంధం పెళ్లిగా మారలేదు...సౌమ్య కుటుంబానికి పెద్దగా ఇష్టం లేకపోయినా రాజారామ్ రూపం, మంచి ఉద్యోగం చూసి ఒప్పుకున్నారు...
రాజారామ్ కుటుంబానికి కాదనే అవకాశమే లేదు...ఒకసారి ఉద్యోగంలో పడ్డాక, తన జీవితానికి సంబంధించిన ఏ విషయమూ తల్లిదండ్రులతో చర్చించ లేదు...
ఆ పెళ్లి విషయం తెలిసి రాధ కోపగించుకోలేదు, తన పెళ్ళికి వచ్చింది...ఇద్దరినీ మనసారా అభినందించింది...
తరువాత రాధ జీవితం లో ఎన్నో సమస్యలొచ్చాయనీ, తల్లిదండ్రులు మరణించారనీ తెలిసినా రాజారామ్ ఉదాసీనంగా ఊరుకున్నాడు...
తాను సౌమ్య ఇద్దరూ ఉద్యోగాలు చెయ్యడం, పిల్లలూ వగైరా జీవిత సమస్యలతో కాలం గడిచి పోయింది...
ఇప్పుడు, దాదాపు పదిహేనేళ్ల తరువాత రాధ ప్రసక్తి రావడమూ, అదీ ఇంత బాధాకరమైన విషయం కావడమూ జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది...
ఈ జీవితానికి అర్ధం ఏమిటి? ఒక యువకుడి గా తాను ఎటు వెడదామని చూసినా అంధ కూపాలు ఎదురవుతున్నప్పుడు విరక్తి తో జీవితాన్ని చాలించాలని అనుకుంటున్నప్పుడు రాధ చూపిన మార్గాలు, తాను చెప్పిన విక్టర్ ఫ్రాంక్ల్ నాజీ మరణ శిబిరాల్లో జీవిస్తూ ఎలా తన భవిష్యత్తుని దర్శించగలిగాడో దాని వల్ల అతని జీవితం ఎలా ముందుకు వెళ్లిందో చెప్పి తనకు కూడా జీవితం మీద ఆశ కలిగించడం గుర్తుకొచ్చింది...
రాధ తనకు దొరికిన ఒక గొప్ప వరం... దాన్ని నేల జార్చుకుని, తనకు తోచిన విధంగా ప్రవర్తించి, ఇప్పుడిలా అంధకూపాల్లో ఆమటిస్తున్నాను అనుకున్నాడు…
ఒక మనిషిలోని నిజమైన ప్రేమ మరొకరిని కదిలించి లేకపోతే తప్పెవరిది? ఆ ప్రేమ లో లోపమా లేక ఆ ప్రేమను గుర్తించలేని మనసు లోపమా...
అతిఅంతరాళం లో అంతులేకుండా మోగుతూన్న దైవదత్తమైన సంగీతం వినడమే మనిషి జీవితానికి పరమావధి అని విన్నాడు రాజారామ్...రాధ అలంటి సంగీతం...తుచ్ఛమైన ఆలోచనలతో అహంకారం తో అంతగొప్ప బంధాన్ని కాలదన్నుకున్నాను … అలాంటిది సౌమ్యను అర్ధం చేసుకుని బంధాన్ని కాపాడుకోగలననుకోవడం ఒకరకమైన అమాయకత్వం కాదా…
గడిచిన జీవితం రాజారామ్ కళ్ళ ముందు రీళ్ళలా తిరుగాడుతోంది...గ్రిమ్ వుడ్ గారి జెఫ్ విన్స్టన్ లాగ తన జీవితాన్ని రీప్లే చెయ్యగలిగితే రాధను వదులుకోకుండా జీవితాన్ని సాఫల్యం చేసుకుంటాడు...కానీ ఆలా జరగదు...
వేదనతో, నిరాశతో ఆలా ఎంత సేపు కూర్చుని ఉన్నాడో తెలియదు...నెమ్మదిగా కలత నిద్రలోకి జారుకున్నాడు...తనకు కనిపిస్తూన్న దృశ్యాలూ, వినపడుతూన్న శబ్దాలూ కలా నిజమా అర్ధం కావటంలేదతనికి...
మళ్ళీ ఫోన్ మోగటం తో మెలకువ వచ్చింది...అప్పడికి బయట బాగా వెలుగొచ్చేసింది... చూసాడు, మరో తెలియని నెంబర్...లాయర్ గారు చెప్పినట్టు తనకు సాయం చెయ్యడానికి ఎవరైనా చేస్తున్నారేమో అని తీసాడు...
"చెప్పండి" అన్నాడు మృదువుగా...అతని గొంతులోని బాధ ఇంకా పోలేదు...
అటు నుంచి ఏమీ సమాధానం రాలేదు..."నా మాట మీకు వినపడుతోందా?" అనడిగాడు
"ఇప్పుడు వినపడుతోంది రాజా" అంది ఒక ఆడ గొంతు అటువైపునుంచి...షాక్ తిన్నాడు రాజారామ్....
ఫోన్ లో సౌమ్య....
ఏమనాలో అర్ధం కాలేదు...మౌనంగా సౌమ్య మాటల కోసం ఎదురు చూడసాగాడు...
"లాయర్ అంకుల్ నీకు సాయం చెయ్యమన్నారు...రాధ బాడీ ఇచ్చేసారు...తనకు కోవిడ్ లేదు...నువ్వు రాధ ఇంటికి రా, మిగిలిన విషయాలు అక్కడే మాట్లాడుకుందాం" అంది సౌమ్య
"నీకు రాధ ఎలా తెలుసు?, మన పెళ్ళికి వచ్చింది కానీ మీ ఇద్దరూ విడిగా ఏమీ మాట్లాడుకున్నట్టు నేను చూడలేదు..." అన్నాడు రాజారామ్
"చెప్తాను, నువ్వు ముందు రా...అంత్యక్రియలు ఇవాళే చేసేద్దాం అన్నారు లాయర్ అంకుల్" అంది సౌమ్య
తన గొంతులో మామూలు గా వినిపించే తిరస్కార భావం లేదు, మృదువుగా, జాగర్త గా మాట్లాడుతోంది...రాజారామ్ కి ఏమీ అర్ధం కాలేదు...
"సరే, వస్తున్నాను...అడ్రస్ గానీ, మ్యాప్ లో లొకేషన్ గానీ పంపించు...ఏ ఫ్లైట్ దొరికితే అది తీసుకుంటాను" అన్నాడు రాజారామ్
"ఫ్లైట్ అవసరం లేదు, రాధ ఇల్లు మల్లేశ్వరం లో...అడ్రస్, మ్యాప్ లో లొకేషన్ పంపిస్తాను" అంది సౌమ్య
"రాధ హైదరాబాద్ లో కాదా ఉండేది?" అనడిగాడు రాజారామ్
"గత ఏడేళ్లుగా బెంగుళూరు లో ఉంది...ఇక్కడే ఉద్యోగం చేసింది" అంది సౌమ్య
"సరే, వస్తున్నాను" అని ఫోన్ పెట్టేసాడు
తన గతంలోంచే ఒక రకమైన అస్పష్ట రూపం లోకి వెళ్లి పోయిన రాధ గురించిన వార్త మధ్యరాత్రి రావడమేమిటి, తన ప్రస్తుత జీవితం లోంచి నిష్క్రమిస్తూన్న సౌమ్య పొద్దున్నే రాధ గురించి ఫోన్ చెయ్యడమేమిటీ...రాధ గత ఏడేళ్ల గా బెంగళూరు లో ఉండటమేమిటీ... తల తిరుగుతోంది రాజారామ్ కు...
కొంచం సంభాళించుకుని తయారై మల్లేశ్వరం బయలు దేరాడు...
రాధను చూసి పదేళ్ల పైనే అయింది...ఇప్పుడెలా ఉందొ... యాభై ఏళ్ళుంటాయేమో...అప్పుడే ముసలితనం కాదు...
ఆమె శరీరం చూసి తాను ఎలా స్పందించాలి? అక్కడ ఎవరిని పలకరించాలి? ఏం ధైర్యం చెప్పాలి...అయోమయం గా, గజిబిజి గా ఉంది...
పెద్ద రోడ్లనుంచి చిన్న సందుల్లోకి దూరి ఒక పాత ఇంటి ముందు ఆగింది రాజారామ్ టాక్సీ,,,దిగి చూసాడు...
గేటు లోపల ఒక పక్కగా పెట్టి ఉన్న రెఫ్రిజిరేషన్ బాక్స్ లో ఉంది రాధ శరీరం...
రెండో పక్క కుర్చీలు వేసుకుని నలుగురు మనుషులు కూర్చుని ఉన్నారు...అందరి మొహాల్లోనూ కొంత తీవ్రత...బాధ కనిపిస్తున్నాయి...
గేట్ లోకి వెడుతూన్న రాజారామ్ కు సౌమ్య ఎదురు వచ్చింది...
ఏమీ మాట్లాడ కుండా రాధ శరీరాన్ని చూపించింది...దగ్గరగా వెళ్లి చూసాడు...అంతవరకూ గుండె బద్దలై భారం అనుభవిస్తున్నరాజారామ్ ఒక్కసారిగా నిర్వేదానికి గురయ్యాడు..
మనసులో ఆలోచన లేమీ రావటం లేదు, కళ్ళల్లోంచి నీరు కారటం లేదు...కేవలం ఉదాసీనత...
రాధ మొహం ఎంతో ప్రశాంతం గా ఉంది...పెదవుల మీద లీలగా చిరునవ్వుంది...అనారోగ్యం దాన్ని నివారించేందుకు జరిగిన వైద్యం రెండూ రాధ మీద చూపిన విధ్వంశం తన వన్నేవాడిన చర్మం, తగ్గిన జుట్టు వల్లా తెలుస్తోంది...ఎప్పుడూ లావు లేని రాధ ఇంకా చిక్కి శల్యం అయినట్టుంది...
చిత్రంగా ఇవన్నీ తెరమీద బొమ్మలు చూసినట్టు చూస్తున్నాడు రాజారామ్...విషయాలన్నీ తన మనసుతో కాక మెదడుతో చూస్తున్నాడు...మనసెందుకో మూగ బోయింది...స్పందించటం లేదు...
"వచ్చారా రాజారామ్ గారూ" అంటూ తన భుజం మీద చెయ్యవేసాడు ఒక భారీ పెద్ద మనిషి...లాయర్ గారయ్యుంటారు...
తలూపుతూ నమస్కారం చేసాడు రాజారామ్...
"శాపగ్రస్తురాలైన రాధమ్మ నంద గోకులం నుంచి వచ్చి మన మధ్య ఈ రాధమ్మ గా బతికి అకస్మాత్తుగా కృష్ణ భగవానుడి సన్నిధి చేరుకుంది...తనకు ఎవ్వరి వల్లా మంచి జగరక పోయినా తన వల్ల ఎందరికో లాభం కలిగింది...చివరికి ఇక్కడ ఇలా..."అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు లాయర్ గారు
ఏమనాలో తెలియక అయన చెయ్య పట్టుకుని నిలబడ్డాడు రాజారామ్...
ఇంతలో రాధ మేన కోడలు కాబోలు ఒక పదిహేనేళ్ల పిల్ల దగ్గరగా వచ్చి "రాజారామ్ అంకుల్ కదా" అంది...
"అవునమ్మా, నీ పేరేమిటి?" అనడిగాడు
"నా పేరు సీత అంకుల్, నేను హైదరాబాద్ లో మా పిన్ని తో ఉంటున్నాను...అత్తకు సీరియస్ గా ఉందని ఒక వారం నుంచీ ఇక్కడే ఉన్నాను" అంది
తలాడించాడు రాజారామ్...
అంత్యక్రియలు పూర్తయ్యాయి...స్నానాలు చేసి మళ్ళీ అందరూ రాధ ఇంటికి చేరారు...
"ఈ పది రోజులూ నేను వచ్చి అవసరమైన కర్మ కాండ జరిపిస్తాను" అన్నాడు రాజారామ్
"మంచిందండీ రాజారామ్ గారూ...దానివల్ల రాధమ్మ ఆత్మకు పూర్తి శాంతి కలుగుతుంది" అన్నాడు లాయర్ గారు
"నేనూ, పిన్నీ హైదరాబాద్ వెళ్ళిపోతాం...మళ్ళీ పదో రోజుకి వస్తాం" అంది రాధ మేనకోడలు సీత
తలాడించాడు రాజారామ్...
"ఒక్క నిముషం సీతమ్మా, అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి విషయాలు చెప్పేస్తాను...రాధమ్మ మంచి ఉద్యోగం చేసింది...బాగా సంపాదించింది...తండ్రి ఇచ్చిన ఇల్లు కాకుండా హైదరాబాద్ లో మరో ఇల్లూ, బెంగళూరు లో ఈ ఇల్లూ ఆవిడ ఆస్తి...కొద్దిగా బంగారం మాత్రం ఉంది...బ్యాంకులో డబ్బుంది...
రాధమ్మ తన ఆస్తి మొత్తాన్ని సీతమ్మ పేరున రాసింది...అయితే తను మైనర్ కాబట్టి సంరక్షకుడి గా రాజారామ్ గారిని ఉండమంది...
సీత కు 21 ఏళ్ళు నిండాక ఆస్తి మీద పూర్తి హక్కులు వస్తాయి…అంతవరకూ తను ఆ ఇళ్లను వాడుకోవచ్చు , అద్దెకు ఇచ్చుకోవచ్చు...అమ్మడం గానీ, పేరు మారటం కానీ కుదరదు...
సీత పెళ్లి రాజారామ్ చేతుల మీదుగా జరిగితే బాగుంటుందని రాధమ్మ కోరిక...
ఈ విల్లు రెండేళ్ల క్రితం తన రోగం బయట పడగానే రాసేసింది...కిందటేడు మీరు ఆస్తి గురించి గొడవ చేసినప్పుడు కూడా ఈ విషయం బయట పెడితే ఆ విల్లు మార్చమని ఆమె మీద ఒత్తిడి తెస్తారని చెప్పలేదు...
ఇంతకు మించి ఆమె జీవితం లో రహస్యాలేమీ లేవు" అన్నారు లాయర్ గారు
"నేను చెప్పాను కదా పిన్నీ...ఈవిడ నా అత్త కాదు నా తల్లి, మీరే నన్ను తన నుంచి దూరం చేసారు...అయినా ఆవిడ నిజమైన తల్లిలాగే నా జీవితం గురించి ఆలోచించింది" అంది సీత కళ్ళలోంచి నీళ్లు కారుతూండగా
సీత పక్కెనే నిలబడిన సౌమ్య "తప్పు సీతా, మీ పిన్ని చేసింది తక్కువేమీ కాదు...ఆలా మాట్లాడకు " అంది
సౌమ్య అంత పరిణతి చూపించడం చూస్తే ఆశ్చర్యం వేసింది రాజారామ్ కు...
లాయర్ గారు తన పెట్టి తెరిచి ఒక చిన్న సంచి లాంటిది తీసి సీతకు ఇచ్చారు "ఇందులో రాధమ్మ బంగారం ఉంది...అంతా నీకే ఇమ్మంది...నువ్వు తరువాత నాకు నీ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇస్తే రాధమ్మ అకౌంట్ లో ఉన్న ఆరు లక్షలు నీ అకౌంట్ లో వేసేస్తాను...తన చికిత్స కోసం మెడికల్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన డబ్బూ, కొంత తన డబ్బూ ఖర్చయ్యాయి...తన అంత్యక్రియల కోసం విడిగా నాక్కొంత డబ్బించింది అందువల్ల ఆ డబ్బుతో పని లేదు" అన్నారు
"ఈ బంగారం, డబ్బూ కొంత సౌమ్య అక్కకు కూడా ఇస్తాను" అంది సీత
సౌమ్య నవ్వి సీతను దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుని "నీ దగ్గరే ఉండనీ, సమయం వచ్చినప్పుడు తీసుకుంటాను" అంది
రాజారామ్, లాయర్ గారు కలిసి తరువాత రోజుల్లో రాధకు జరగాల్సిన కర్మకాండ అంతా శ్రద్ధగా జరిపించారు... అన్నిరోజులూ సౌమ్య కూడా వచ్చింది...
పదో రోజున అందరూ భోజనాలు చేసాక, ఇంటి తాళం లాయరు గారి దగ్గరనుంచి తీసుకుని సీతకు ఇచ్చేసాడు రాజారామ్..
ఆస్తి పత్రాలు కూడా ఆమెకే ఇచ్చేసాడు...ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేనొచ్చి సంతకాలు పెడతాను...అని మాటిచ్చి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు...
భారమైన గుండెతో రాధ ఇంటి నుంచి బయలు దేరుతూన్న రాజారామ్ ను ఆపారు లాయర్ గారు.."కాసేపు నీతో మాట్లాడ వచ్చా?" అనడిగారు
"తప్పకుండా, రాధ ఇంకేమైనా చెప్పిందా?" అనడిగాడు
"అవును, నీ జీవితం ఇలా మోడై పోతోందని చాలా బాధ పడింది...అయిదు నెలల క్రితం తను స్వయంగా వెళ్లి సౌమ్యను కలిసి మాట్లాడింది...
ఈ అయిదు నెలల్లో జీవితం గురించీ, ప్రేమను గురించీ, పిల్లలను గురించీ, జన్మ పరంపర గురించీ ఎంతో మాట్లాడింది...వాళ్లిద్దరూ ఎంతో మంచి మిత్రులయ్యారు...రాధమ్మ మరణించే ముందు సౌమ్య ఈ గొడవకు స్వస్తి చేబుతానని మాట ఇచ్చింది...
కానీ మీతో ఆ విషయం ఇలా మాట్లాడాలో తెలియక సతమతమౌతోంది సౌమ్య...ఆమె తరపున నేను ఈ సంభాషణ ప్రారంభించాను" అన్నారు లాయర్ గారు
తను ఇంత అసహ్యం గా ప్రవర్తించి, తనను పట్టించుకోకుండా ఉన్నా, రాధ తన జీవితంలో ఏం జరుగుతోందో బిడ్డను కనిపెట్టి ఉన్న ఒక తల్లి లాగా తన జీవితాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసింది అనుకున్నాడు రాజారామ్
"లాయర్ గారూ, నా వైపునించి ఎలాంటి అభ్యంతరాలూ లేవు...సౌమ్యా, పిల్లలూ ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నాను" అన్నాడు
"సౌమ్య అభ్యంతరాలను ఎలా ఎదుర్కొంటారు...గడిచిన ఎనిమిది నెలల్లో మీరు ఆ విషయం ఆలోచించు కున్నారా లేక అలాగే ఘర్షణ పడుతూ బతకడానికి నిర్ణయించుకున్నారా" అనడిగారు లాయర్ గారు
"ఇద్దరమూ కూర్చుని మాట్లాడుకుంటాము...కొన్ని మార్చుకో గలను కొన్ని మార్చుకో లేను...కానీ అన్నివిషయాల్లోనూ ఓపెన్ మైండ్ తో ఉండగలను...అదే ఒక దారి చూపిస్తుంది" అన్నాడు రాజారామ్
పక్కగదిలోంచి బయటకు వచ్చింది సౌమ్య...
"థాంక్ యు రాజా...ఏనాటి బంధమో తెలియదు గానీ రాధక్క నాకు బతకడం నేర్పింది...నిన్ను వదిలి వచ్చేసి ఉద్యోగంలో చేరిన నాకు ఆ కంపెనీలో బాస్ రాధక్క...నేను గుర్తు పట్టలేదు, కానీ తాను వెంటనే గుర్తు పట్టింది...
నెమ్మదిమీద మన మధ్య మొదలైన ఘర్షణ, మనం విడిపోవడం అన్నీ తెలుసుకుంది...
ఒకసారి నన్ను కూర్చోపెట్టి తన జీవితం ఎలా నడిచిందో చెప్పింది...
ఆవిడ తన ప్రపంచాన్ని ఏమీ కోరుకో కుండా ప్రేమించింది... అందువల్ల తనకు తిరిగి ఈ ప్రపంచం ఏమీ ఇవ్వలేదనే బాధ లేదు...ఒకరకమైన ఉత్సుకత మాత్రం ఉండేది...న్యూటన్ గారి సిద్ధాంతం ఫిజిక్స్ కే గాని జీవితానికి అన్వయించదేమో అనుకుందిట…
మన మధ్య ఈ వియోగానికి కూడా అలాంటి కారణాలే ఉంటాయనీ, మనం అనుకుంటున్న కారణాలు కేవలం బాహ్య ప్రదర్శనలే అనీ చెప్పింది...
తన జీవితం తో పోలిస్తే నేను ఎంతో అదృష్టవంతురాలిని, మామూలుగా ఎలాంటి సమస్యలూ లేని జీవితంలో కష్టపడి సమస్యలు సృష్టించుకోవడం, మనం ఇబ్బందుల్లో పడటం, మన కుటుంబాలు బాధపడటం ఇవన్నీ అనవసరమైన ఏర్పాట్లు...
పిల్లలు నీగురించి అడుగడుగునా గుర్తు చేసుకుంటుంటే ఒక మనిషిని ఎలా ప్రేమించాలో అర్ధమయ్యింది…వాళ్లకు నీలో ఒక తండ్రే కనిపించాడు, ఆ తండ్రి ఎలా ఆలోచిస్తాడు, ఏం చేస్తాడు అవే వాళ్లకు ముఖ్యం, మరోలా లేడు అనే బాధ లేదు" అని ఆగింది...ఆమె కళ్ళల్లో నీళ్లు
"మనం సుఖంగా ఉండడమే రాధక్కకు మనం ఇవ్వగలిగే నివాళి...నాకిద్దరూ కొడుకులే కాబట్టి సీతను నా కూతురుగా చేసుకుని సమయం వచ్చినప్పుడు పెళ్లి చేస్తాను" అంది
"నేను కూడా నా పద్ధతులే నేను పాటిస్తాను, నువ్వు అనేవిషయం పట్టించుకోను అనే మూర్ఖత్వం నుంచి బయటకు వస్తాను...మనిద్దరం కలిసి ప్రయత్నిస్తే మన జీవితాల్లోని అసంతృప్తిని దూరం చేసుకోవచ్చు" అన్నాడు రాజారామ్
"శుభం, ఈ ఘట్టం రాధ బతికుండగా జరిగుంటే బాగుండేది, తాను ఎంతో సంతోషించేది...ఇప్పుడు ఆవిడ ఆత్మ తప్పకుండ శాంతిస్తుంది...ఏ బంధాలూ లేకుండా మనిషిని మనిషి ప్రేమించడం ఎలా అనే విషయం రాధ చూపించినట్టు ఇంకెవ్వరి దగ్గర చూడలేదు" అన్నారు లాయర్ గారు
"నేను ఏం చేసినా రాధ ఋణం తీర్చుకోలేను...తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులూ మాత్రమే మనను ఎలా ఉంటే అలాగే ప్రేమిస్తారు...రాధ బంధం వాటికీ వేటికీ అందదు...అదో ప్రత్యేకమైన బంధం...రాధ తాను వెళ్ళిపోయి మన జీవితాన్ని మనకు వెనక్కిచ్చేసింది" అన్నాడు రాజారామ్ బాధగా
"బయల్దేరండి...సుఖంగా ఉండండి" అని దీవించారు లాయర్ గారు కళ్ళు తుడుచుకుంటూ...