Read Appendix by SriNiharika in Telugu నాటకం | మాతృభారతి

Featured Books
  • అనుబంధం

    ‘ప్రేమించుకున్న వాళ్ళు కలిసుండటానికి పెళ్లి అవసరమేమో కానీ పె...

  • ఈర్ష్య ద్వేషం

    సాయంత్రం నాలుగు గంటల సమయం...మీరట్‌ పట్టణం నుంచి దూరంగా విసిర...

  • ఛాలెంజ్ 18

    జీవితం అంటే ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకి ప్రయాణం.------------...

  • తన మనము తోడైతే..

    తన మనము తోడైతే"నీకిప్పుడేం కావాలి" అనునయంగా అడిగాడు స్వరూప్....

  • అమ్మాయి - పెళ్లి

    అయ్యా....!ఆ..ఏంటి రంగయ్య......?అయ్యా...పెళ్ళివారు బయలుదేరారం...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అనుబంధం

‘ప్రేమించుకున్న వాళ్ళు కలిసుండటానికి పెళ్లి అవసరమేమో కానీ పెళ్ళైన వాళ్ళు కలిసుండటానికి ప్రేమ అవసరం లేదు’ అని చెప్పడానికా అన్నట్టు ఇరవై ఏళ్ళ క్రితం ఇత్తడి లెటర్స్‌తో చేసిన ‘ఇందిరా చక్రపాణి’ నేమ్‌ ప్లేట్‌ కిలుం పట్టి మెరవకపోవడంతో, విసుగొచ్చిన సూర్యుడు తన తొలికిరణాల్ని నెమ్మదిగా పక్కింటికి మరల్చాడు.క్రమశిక్షణ గల కార్మికుడిలా అలారం తన పని తాను చేసింది. రెండో కాన్పు అవగానే విడిపోయిన రెండు సింగల్‌ కాట్‌లలో ఒకదానిమీంచి లేచిన ఇందిర నేరుగా వంటింట్లోకి నడిచింది.

‘‘అలారాలు, కుక్కర్‌ విజిల్స్‌, నీకు సంబంధించిన రాగాలు’’ అన్నట్టు చక్రపాణి రెండో సింగల్‌ కాట్‌ మీద కాసేపు విసుగ్గా దొర్లి, పడుకునే ఫోన్‌ చూసుకున్నాడు. ఆమె కాఫీ పెట్టిచ్చింది. అతడు పేపర్‌ చదివాడు. ఆమె స్టవ్‌ మీద ఇడ్లీ పెట్టింది. అతడు వాకింగ్‌కి వెళ్ళొచ్చాడు. ఆమె కుక్కర్‌ పెట్టింది. అతడు స్నానం చేసొచ్చి పొట్టమీద పౌడర్‌, షర్ట్‌ మీద సెంట్‌ పూసుకున్నాడు. ఆమె టిఫిను, రెండోసారి కాఫీ ఇచ్చి క్యారేజీ హాల్లో పెట్టింది.అతడు కాఫీ తాగుతూ మిగిలిపోయిన పేపర్‌ చదివేసి, క్యారేజ్‌ పట్టుకుని ఆఫీస్‌కి బయల్దేరాడు.ఆమె తలుపేసుకుని స్టవ్‌ మీద బార్లీ పెట్టింది. అతడు సాయంత్రం వచ్చి తాగుతాడు. ఆమె డబ్బాలోకి జంతికలో, చేగోడీలో చేస్తుంది. అతడు ఎప్పుడు పడితే అప్పుడు తింటాడు. భర్తకి ఏ పూటకాపూట వేడిగా కంచంలో కనీసం మూడు ఐటమ్స్‌తో వడ్డించాలని అత్తగారు నేర్పించిన అలవాటు ప్రకారం ఆమె మళ్ళీ రాత్రికి ఏమున్నాయో తడుముకుంటుంది. పుల్కాలకి పిండి కలుపుతుంది. అతడు టి.వి. చూస్తాడు. ఆమె పుల్కాలు కాలుస్తుంది. అతడు అరగంట క్రితమే బై చెప్పిన కొలీగ్‌ తో ఫోన్‌ మాట్లాడతాడు. ఆమె దుంపలు ఉడకేస్తుంది. అతడు ఉక్కపోతగా ఉందని ఏ.సి వేసుకుంటాడు. ఆమె చెమట్లు కక్కుతూ కూర కలియబెడుతుంది. అతడు టి.వి. చూస్తూ లాగిస్తాడు. ఆమె కిచెన్‌ శుభ్రం చేసుకుంటుంది. అతడు గుర్రు పెట్టి పడుకుంటాడు. ఆమె అలారం పెట్టుకుంటుంది. ఓరాత్రప్పుడు అది ఆన్‌లో ఉందో లేదో కంగారుగా టైం చూసుకుంటుంది. అతడు నిశ్చింతగా నిద్రపోతాడు.
ఆదివారం స్వల్ప మార్పు. ఆమె మధ్యాన్నం మరో కప్పుటీతో బాటు పకోడీలో, బజ్జీలో వేయిస్తుంది. అతడు లైవో, రిపీటో, క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూనో తింటాడు.ఇందిరకి ఇదీ అని చెప్పుకునే కష్టమేమీ లేదు. ‘‘భర్త పల్లెత్తు మాట అనడు’’ అని కొంతమంది కాంప్లిమెంట్‌గా చెప్పుకునే విషయమే ఆమె అవ్యక్త అభ్యంతరం. బూరెలు చేసినా, బొబ్బర్ల పిండి చేసినా, బెనారస్‌ చీర కట్టినా, బెంగాలీ కాటన్‌ కట్టినా, దేనికీ ‘బాగుంది’, ‘బాలేదు’అన్నమాట లేదు. సగం రోజు పొగచూరి పోతున్నా పట్టించుకోడు. అలా అని వాళ్ళిద్దరి మధ్య గొడవలేం లేవు. ప్రేమ లేదంతే. కర్పూరంలా ఎప్పుడు కరిగిపోయిందో కూడా తెలియలేదు. పిల్లలిద్దరూ వేరే ఊళ్లలో చదువుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఒకరిగురించి ఒకరికి ఏ తలంపూ లేకుండా ఒకే తలుపుకి చెరో రెక్కలా, పిల్లల ప్రగతి రథానికి చెరో పట్టాలా, గడిపేస్తున్నారు.ఓ పక్క పనులూ మరోపక్క ఆలోచనలతో ఉండగా పనిమనిషొచ్చింది.అడివమ్మకి ముప్ఫైఏళ్ళుంటాయి. ధృడమైన మానసిక ఆరోగ్యానికి గుర్తుగా కొప్పు ముడేస్తే బోర్లించిన కుండలా, విడిస్తే చెట్టుమీంచి జారే కొండచిలువలా ఉండే జుట్టు, రెండు గంటల పాటు ఎండలో గొంతుక్కూర్చుని బండెడంట్లు తోమినా చెక్కు చెదరని టి.ఎం.టి బార్‌ లాంటి ఉక్కు శరీరం, వెరసి కాన్ఫిడెన్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌లా ఉంటుంది. పదేళ్లనించి పని చేస్తోంది. 

ఇందిర దగ్గర చనువెక్కువ. ఆమె ధైర్యం, బలం చూసి, ‘నీ ఎనర్జీతో ఓ రైలు నడిపీ వచ్చే’ అంటూ ఉంటుంది ఇందిర.‘‘ఒేసయ్‌ అడివమ్మా, ఆ అంట్లు తోమడం కాసేపు ఆపి బిర్యానీ తినవే వేడిగా ఉన్నప్పుడే తినాలి’’ పనిమనిషిని ప్రేమతో పిలిచింది.‘‘ఉండండమ్మా ఈ రెండూ తోమేత్తే ఇంక ఇటేపు ఎల్లే పనుండదు’’ అంటూ మిగిలిన రెండు అంట్లూ బరా బరా తోమేసి చెయ్యి కడుక్కుని, కొంగుకి తుడుచుకుని వచ్చి బాల్కనీలో కింద కూర్చుని తింటోంది అడివమ్మ. ఎదురుగా డైనింగ్‌ టేబుల్‌ కుర్చీ మీద కూర్చుని బిర్యానీ తింటున్న అడివమ్మ కేసిజె.ఈ.ఈ రిజల్ట్‌ కోసం నెట్‌ సెంటర్‌ దగ్గర కూర్చున్న కుర్రాడిలా ఆత్రంగా చూస్తోంది ఇందిర. కామ్‌గా తినేసి వెళ్లి ప్లేట్‌ కడగటం మొదలెట్టింది అడివమ్మ.
అదేంటే పొద్దుటినించి కష్టపడి చేస్తే తినేసి బావుందో లేదో చెప్పకుండా వెళ్ళిపోయావు’’ అంది కోపంగా ఇందిర.‘‘మీరేటనుకోకండమ్మా, వణ్ణంలో ఇంత పసుపుగుండేసి, కుక్కర్లో మూడు ఇజిల్స్‌ పాటు ఒగ్గేసి దాన్నే బిర్యానీ అని మీరు మురిసిపోతారేమే. నామటుకు బిర్యానీ అంటే అది ఏరే’’అంది నిక్కచ్చిగా.‘‘నీకు బాగా అలుసైపోయానే. మసాలా, ఉప్పు, కారం ఇంత బాగా కుదిరితే నా బిర్యానీకి పేరు పెడతావా, రేపట్నుంచి నువ్వు పన్లోకి రాకు’’ అంది ఇందిర సర్రుమని లేస్తూ.‘‘అమ్మా.. మీరు నా తలతీసి మొలెయ్యండి. నేను మాత్రం సెప్పేది ఒకటే. బిర్యానీ అంటే మొగోల్లే సెయ్యాల. మనం కూడా సెయ్యొచ్చు. కానీ దాన్ని బిర్యానీ అనకూడదు. మరోటో పేరుతో పిలాల. ఓ పెద్ద డేగీశాలో అన్నీ ఏపి, ఏరేగా నాన బెట్టిన బియ్యాన్ని అందులో ఏసిఉడికిన తర్వాత మగాడు కండబలంతో గరిటతో తిప్పి కలియబెట్టి సేత్తే ఉంటాదమ్మా బిర్యానీ .. ఆ రుసే ఏరు..’’ అంది మైమరిచిపోతూ.‘‘అంత ఇదిగా చెప్తున్నావు మీ ఆయన నీకెప్పుడైనా వండిపెట్టేడేంటే’’ అంది ఇందిర ఆశ్చర్యంగా.‘‘ఎప్పుడైనా ఏటమ్మా ... ప్రతీ ఆదోరం వంట డ్యూటీ ఆడిదే’’ అంది అడివమ్మ గర్వంగా.

‘‘మగాడి చేత వంట చేయిస్తావా సిగ్గులేదూ’’ అంది ఇందిర అడివమ్మని వింతగా చూస్తూ.‘‘మొగోడయితే ఏటమ్మగోరూ ముమ్మారు పుట్టాడా ఏటి ... ఆమాట కొత్తే మనమే మొగోల్లని కనే యాతనలో ముమ్మారు పుడతాం.అయినా మొలతాడు కట్టేటప్పుడూ తెలీదు, కోసేటప్పుడూ తెలీదు. మద్దెలోనేనమ్మా ఈ మగతనమంతా. అదీ మనమీదే’’ అంది అడివమ్మ అక్కసుతో, తాగొచ్చి తల్లిని కొట్టే తండ్రి గుర్తొచ్చి.‘‘ఏమోనే, మా ఇళ్లల్లో మగాళ్లు ఇంటి పనులు చేస్తే ఎంత నామర్దా వో తెలుసా? అయినా మగాడంటే ఇంటి యజమాని. దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటేనే అందం .. బయట ఎన్ని వ్యాపకాలు, ఎన్ని టెన్షన్లు? అవన్నీ మనకోసమే కదా. ఇంటి దగ్గర మనం బాగా చూసుకుంటేనే కదా బయటికెళ్లిన మగాడికి విజయం’’ అంది ఇందిర పెళ్ళైన కొత్తలో అత్తగారు భట్టీ పట్టించిన పాఠాల్ని వల్లే వేసుకుంటూ.
‘‘అవునమ్మా. మొగాళ్ళకేం మగానుబావులు. దేవుడు కూడా ఆళ్ళ పార్టీయేనమ్మా. ఏటేటా పురిటి నొప్పుల్లేవు, నెలనెలా కడుపు నొప్పుల్లేవు. కనీసం పొయ్యి కాడైనా మూడుపూటలా మనం పడే కట్టం ఆల్లకి తెలియాలికదమ్మా . అక్కులు (హక్కులు) ఆకాశంలోంచి మన కొంగులోకి రాలిపడవమ్మా. మనమే ఎగిరి కోసుకోవాల. సమానమంటే సమానమే. అందుకే నాకూ ఆదివారం సెలవు కావాలన్నా.. తీసుకున్నా. ఏం మనం పన్లు జేయట్లేదా? మా మావ ఏమైనా ఇమానం తోల్తన్నాడా. ఆటో ఏ గదా! ఆడు వదలాలి కానీ ఆటో ఏం కర్మ నేను ఇమానమే తొలీగల్ను. అదే ఆడ్ని నాలా అంట్లు తోమ్మనండి సూద్దారి’’ అంది అడివమ్మ చేతులు గాల్లో ఊపుతూ.ఆమె ఆర్గుమెంట్‌కి కొంచెం మెత్తబడింది ఇందిర. ‘‘అదేంటే వారమంతా ఆటో నడిపి అలసిపోయిన మొగుడికి కనీసం ఆదివారమైనా రెస్ట్‌ ఇవ్వవా. నువ్వు మనిషివి కాదే రాక్షసివి’’ అంది నవ్వుతూ గొంతులో కొంత ఈర్ష్యతో.‘‘మీకేటి తెల్దమ్మగోరూ. మొగాడి సేతి వంట అదేదో పాకమంటారే. అమృతమే అమ్మగోరూ. దానికీ రాసిపెట్టుండాల. నాలాటి రాచ్చసికి అది రాసిపెట్టుంది..... ఏమాటకామాటే. 

ఆదోరం సొర్గమే అమ్మగోరూ. మీరు కూడా ఆదోరం పొద్దున్న రానంటే ‘సర్లేవే అడివీ’ అనడంతో, పదంటే పదికి లెగుత్తానమ్మగోరూ. అంటే మద్దెలో ఓ పాలి ఆళ్ల పాట్లు ఓరకంట సూత్తాననుకోండి. ఆ తల్లి, కొడుకు వంటింట్లో యమ యాతన పడతారంటే ఒట్టు. ఏదెక్కడుందో నన్నుడగడానికి నామోషీ. ఇసుక్కుని సత్తారు. కూసింత జాలేత్తాది కానీ, అంతలోనే ఆల్ల మొకాల్లో పట్టుదల సూసి మళ్ళీ ఏమీ ఎరగనట్టు తొంగుంటా. బిర్యానీలో నీసు కలిపితే నాకిట్టముండదు అమ్మగోరూ. అది ఏరే ఒండాల. రెండో గంటకి ఏడి ఏడి బిర్యానీ తిని మళ్ళీ తొంగుని, రాత్రికి మళ్ళీ అదే తినేసి ఆ వారం పొద్దు కట్టబడిందీ మర్సిపోతానమ్మగోరూ’’ అంటూ చేస్తున్న పనాపి,‘‘సీతమ్మగోరు లాంటి మీకాడ సెప్పడానికి సిగ్గే కానమ్మగోరూ, సెప్పి తీరాల. అయ్యేల సాయంత్రం డాబా మీద నా ఒళ్ళో తలెట్టుకుని ఆడు నా బిడ్డయిపోతాడమ్మగోరూ. ఆ ఓరం జరిగిన ఇసయాలన్నీ సెప్పుకుని గడిపేత్తాం. దీన్నే నా పెనివిటి ‘ఆదోరం అనుబందం’ అంటా ఉంటాడమ్మగోరూ’’ అంటూ సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ, ఠక్కున ఆగిపోయి,
‘నా మాటిని మీరుకూడా ఆదోరం ఆదోరం అయ్యగారి సేత బిర్యానీ ఒండించండి. సోమవారం నించి ‘‘ఒేస అడివి, ఆ మంచాలు రెండూ కొద్దిగా కలిపీసి ఏకాండీ దుప్పటీ సాకింటిది తీసి పరిసీయే’’ అనకపోతే నా పేరు అడివమ్మే కాదు’’ అంది అడివమ్మ ఇందిర కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ.‘‘నోర్ముయ్యవే. నీకు చనువెక్కువైంది. కాళ్ళిరగ్గొడతా. వెళ్ళు ముందు. రేపట్నుంచి పన్లోకి రాకు’’ అంటూ నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇందిర, ఇంకా వినాలని ఉన్నా.అది గమనించిందో ఏమో అడివమ్మ చీపురు పట్టుకుని వంటింట్లోకొచ్చి నిష్ఠూరంగా ‘‘ఓయమ్మో రామకోటిలా ఏ లచ్చో సారో సెప్పుంటారీ ముక్క. ఓ పూట రాకపోతే మళ్ళీ ఇంటికొచ్చి కొప్పట్టుకుని లాక్కొత్తారు’’ అని,‘‘అయినా మంచం అనగానే సంసారమేనేటమ్మా. సెడ్డ కలలు రాకుండా ఒకరికోరు దన్నంతే’’ అంది సర్దుబాటుగా.‘‘నీ మాట చూసి పెట్టుంటారే నీకా పేరు అడివమ్మ అని. వట్టి అడివి మనిషివి. మాట తీరు లేదు’’అంది ఇందిర కోపంగా టీ ఇస్తూ.‘‘అవునమ్మా నానడివమ్మనే. నా మనసుకీ, మాటకీ మద్దెలో గల్లా లేదు. అంతనుకుని ఇంత మాటాడ్డానికి. అడివిలా సొచ్చంగా ఆలోసిత్తా సొచ్చంగా మాటాడతా’’ అంటూ టీ గ్లాసు పట్టుకుని తన రాజ్యమైన బాల్కనీ లోకెళ్ళిపోయింది .

******************

క్యారేజీ పట్టుకుని ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఆటో స్టాండుకి బయల్దేరాడు చక్రపాణి. అంత దూరంనుంచి అతన్ని చూడగానే ఆటో స్టార్ట్‌ చేసి దగ్గరకొచ్చి విష్‌ చేసాడు ఆటోమేన్‌ కృష్ణ.కృష్ణ - బొద్దుగా, నున్నగా దువ్విన క్రాఫుతో, నుదిటిన బొట్టు, చేతికి ఎర్రటి తాడు, వేలికి వెండి ఉంగరం, శుభ్రమైన ఖాకీ డ్రెస్‌, అంతకంటే శుభ్రంగా, డెకరేట్‌ చెయ్యబడిన ఆటోలో, ఉదయమే స్కూల్‌ పిల్లల్ని దింపేసి తొమ్మిదికల్లా స్టాండ్‌లో కూర్చోడం, ఎట్టి పరిస్థిల్లోనూ ఆరుకల్లా ఇంటికెళ్లిపోవడం, ఆదివారం శెలవు, వెరసి ఆనందానికి ఆధార్‌ కార్డులా ఉంటాడు.చక్రపాణి ఎక్కగానే ఆటో బయలుదేరింది. రెండేళ్ల క్రితం బండి యాక్సిడెంట్‌ అయిన దగ్గరనుంచి ఆఫీస్‌కి ఆటోలోనే వెళ్తున్నాడు.రోజూ ఒకే టైం కావటంతో వెళ్ళేటప్పుడు కృష్ణ స్టాండ్‌లో రెడీగా ఉంటాడు. వచ్చేటప్పుడు కొలీగ్‌ దింపేస్తాడు. కృష్ణ దారి పొడుక్కీ ఏదో కబుర్లు చెబుతూనే ఉంటాడు. చక్రపాణి ఎక్కువ మాట్లాడడు కానీ వింటాడు. అలా ఇద్దరూ రోజూ ఆఫీస్‌కి చేరే నలభై నిమిషాల్లో ‘అంతరిక్షం’ నుంచి అంతరంగం వరకూ, సినిమాల నుంచి సినీవాలి వరకూ మాట్లాడుకుంటూ ఉంటారు.
‘‘ఏంటి సర్‌, క్యారేజీలో బిర్యానీ అనుకుంటా, కొంచెం ఘాటు తక్కువైనట్టుంది?’’అన్నాడు కృష్ణ గ్రీన్‌ సిగ్నల్‌ పడగానే గేర్‌ మారుస్తూ.‘‘ఏమోనయ్యా. నేను అవేమీ పట్టించుకోను, ఏదో బతకడానికి ఇంత తినాలి కదా’’ అన్నాడు చక్రపాణి ఫోన్‌ చూసుకుంటూ.‘‘అమ్మమ్మా ఎంత మాటన్నారు సర్‌. బతకడానికి మాత్రమే తినాలంటే గుహల్లోనే ఉండేవాళ్ళం కదా. గ్రహాలు దాటి ఎందుకు సర్‌ వెళ్ళటం. అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన వాడికి అక్కడ తిండే ఇక్కడా పెట్టం కదా. మధ్యలో ఓ మాంచి ధమ్‌ బిర్యానీ రుచి చూస్తే, హ్యాపీగా మళ్ళీ రెడీ అవుతాడు.రుచి ప్రగతికి తివాచీ సర్‌’’ అన్నాడు కృష్ణ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తూ.‘‘ఏం చదివావు కృష్ణా నువ్వు’’ ఆశ్చర్యంగా అడిగాడు చక్రపాణి ఫోన్‌ జేబులో పెట్టి.‘‘పేపర్‌ సర్‌’’ అన్నాడు నవ్వుతూ కృష్ణ. చక్రపాణి కూడా నవ్వేశాడు.‘‘సర్‌, అసలు బిర్యానీ అంటే మగాళ్లే చెయ్యాలి సర్‌. ప్రతీ ఆదివారం నేను చేసే బిర్యానీ కోసం మా ఆవిడ వెర్రెత్తిపోతుందంటే నమ్మండి’’ అన్నాడతను గర్వంగా.

‘‘ఏంటి నువ్వు వంట కూడా చేస్తావా’’ అన్నాడు చక్రపాణి ఆశ్చర్యంగా.‘‘అదేంటి సర్‌ అంత ఆశ్చర్యంగా అడిగారు. ఆర్రోజులు ఆటో తొక్కేనాకు ఓ రోజు సెలవు లేకపోతే బండి నడవదు సర్‌. వైరాగ్యం వచ్చేస్తుంది. అలాగే రోజూ మూడు పూటలా వండింది వండకుండా,ఒక్క పిసరు ఉప్పు, కారం తేడా రాకుండా, పొయ్యి దగ్గర మాడిపోతూ, కాలాలతో పనిలేకుండా,అదే పొయ్యి, అదే గరిటి, అదే వేడి, అదే వాసన, ఇన్ని వందల రోజుల్లో ఒక్క పూట కూడా ఒక్కరూ ఇదీ బావుంది అన్న మెచ్చుకోలు లేకుండా.. ఊహించండి సర్‌. అదే మనమైతే పిచ్చెక్కిపోతాం. అందుకే ఆదివారం మా ఆవిడకి పూర్తిగా సెలవు. కానీ ఏమాట కామాట సర్‌, ఆరోజు అన్నం తినేటప్పుడు నన్ను దేవుడిలా చూస్తుంది సర్‌. మాది ఆదివారం అనుబంధం సర్‌’’ అలా చెప్తూ ఉంటే రేర్‌ వ్యూ మిర్రర్‌ లోంచి అతని కళ్ళల్లో మెరుపు.‘‘మరి మీ అమ్మ ఏమీ అనదా?’’ అనుమానంగా అడిగాడు చక్రపాణి. అలా అడిగినప్పుడు అతనికి పెళ్ళైన కొత్తలో తన తల్లి మాటలు గుర్తొచ్చాయి.
ఒరేయ్‌ చక్రీ, మొదట్లో మోజు కొద్దీ పెళ్ళానికి వంటలో సాయం చెయ్యడం, కూరలు తరగడం లాంటి ఆడంగి పనులు చేశావంటే అది నీ నెత్తెక్కి కూర్చుంటుంది. ఖాళీగా ఉన్నా కాలుమీద కాలు తియ్యకు. మీ నాన్ననయితే మీ మామ్మ పిల్లల్ని కూడా ఎత్తుకోనిచ్చేది కాదు.’చక్రపాణి ఎక్కువ ఆలోచించకుండా, కృష్ణ అందుకున్నాడు ‘‘నాకీ విషయం చెప్పిందే మా అమ్మ సర్‌. కని, కడుపు నింపే ఆడ జాతికి ఆకేసి అన్నం పెట్టేవాళ్ళు ఎవరూ ఉండర్రా. ఎలాంటి స్థితిలోనైనా ఇంటిల్లిపాది ఆకలీ తీర్చి ఆ తర్వాత మా ఆకలి మేం తీర్చుకోవాలి’ అనేది సర్‌ నాతో. అందుకే వారానికొక్కసారైనా మా ఆవిడకి వండి పెట్టాలని నిర్ణయించుకున్నా. మా అమ్మ కూడా ఈ విషయంలో నాకు సాయం చేస్తుంది సర్‌’’అని, చేత్తో రైట్‌ సిగ్నల్‌ ఇచ్చి మళ్ళీ చెప్పాడు.‘‘సర్‌, నేను మా ఆవిడకి చీర కొన్నప్పుడు, చెవికో, ముక్కుకో ఓ పిసరు కొన్నప్పుడు, ఎప్పుడూ అంత తృప్తి చూడలేదు సర్‌. ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు ‘‘ఆ కళ్ళల్లో నీళ్లు ఏంటే’’ అంటే ‘‘కారం మావయ్యా’’ అంటుంది. వేసినోణ్ణి నాకు తెలీదా అందులో ఎంత కారం ఉందో. ఒక్కరోజు వండిపెడితే వారమంతా నన్ను రాజులా చూస్తుంది సర్‌ నా భార్య. ఇంట్లో రాజైనోడు బైట కూడా రాజే కదా సర్‌’’ అంటూ ఉండగా ఆఫీస్‌ వచ్చేసింది. చక్రపాణి డబ్బులిచ్చి దిగి లోపలికెళ్ళిపోయాడు.

***************************

ఆదివారం మధ్యాన్నం.అడివమ్మ అంట్లు తోముతోంది. అప్పుడే లేచిన చక్రపాణి సోఫాలో కూర్చుని టి.వి చూస్తున్నాడు.‘‘ఇదిగోనే బిర్యానీ తిని ఎలా ఉందొ చెప్పు’’ అంది ఇందిరబిర్యానీ కప్పులో పెట్టి ఇచ్చి. ఎప్పుడూ అమ్మగారింట్లో బిర్యానీ తినడానికి ఇష్టపడని అడివమ్మ గభాల్న లాక్కుని ఓ ముద్ద నోట్లో పెట్టుకుని, కాసేపాగి, ‘‘అమ్మగోరూ బిర్యానీ అదుర్స్‌, నాకు తెలిసి ఇది మీరు చేసింది కాదు.ఇది కచ్చితంగా అయ్యగోరే చేసుంటారు.’’‘‘నోర్ముయ్యవే. ఎప్పుడూ వాగుతూనే ఉంటావు. నోరుమూసుకుని తిను’’ అంటూ కంగారుగా సోఫా కేసి చూసింది ఇందిర.
‘‘మీరు నా నోరు నొక్కలేరమ్మగోరూ, మర్యాదగా మీరే చెప్తారా లేక అయ్యగారినే కనుక్కోమంటారా? ఈ బిర్యానీ మాత్రం మీరు చేసింది కాదమ్మగోరూ’’అంటూ హడావిడి చెయ్యటం మొదలెట్టింది అడివమ్మ .‘‘ఒసేయ్‌ నువ్వు చేసిన పని చాలు కానీ అర్జెంటుగా ఇంటికెళ్ళు’’ అంటూ కేకలేసింది ఇందు.‘‘అలాగేనమ్మగోరూ నాకేం పనిక్కడ ఎల్తా’’ అంటూ, ‘‘అమ్మా! ఏటీ అనుకోకుండా బిర్యానీ కొద్దిగా బాక్స్‌లో ఎట్టి ఇయ్యండమ్మా మా మావకి అట్టికెళ్తా. ఏ పెద్దాయన మాటలు ఆలకించాడో ఈ మద్దెలోఆదివారం బిర్యానీ చెయ్యటం మానేశాడమ్మ. ఏవన్నాఅంటే ‘నేను మొగోన్ని వంటపొయ్యి కాడకి రాకూడదంట’ అంటూ కూత్తన్నాడమ్మా.అయినా నేనేం ఒదల్ననుకోండి’’ అంది ధీమాగా.అప్పటివరకూ హాల్లో సోఫాలో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్న చక్రపాణి ఆ మాటవిని గతుక్కుమన్నాడు.ఎప్పుడొదిలిందో తెలీదు. వీధిలో నేమ్‌ బోర్డు అక్షరాలు కిలుం వదిలి మెరుస్తున్నాయి.ఎవరు జరిపారో తెలీదు రెండు సింగల్‌ కాట్‌లూ ఒకటయ్యాయి.