Read Jealousy and hatred by SriNiharika in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈర్ష్య ద్వేషం

సాయంత్రం నాలుగు గంటల సమయం...మీరట్‌ పట్టణం నుంచి దూరంగా విసిరి వేసినట్టుండే కాజీసరాయ్‌ ప్రాంతం.వీధిలో జనసంచారం తక్కువగా ఉంది.పోలీస్‌ జీపు వేగంగా వచ్చి అక్కడ ఆగింది.జీపులో వచ్చిన పోలీసులు హుటాహుటిన జీపు దిగారు. ఇన్‌స్పెక్టర్‌ జాదవ్ జీపు నుంచి కిందికి దిగి చుట్టుపక్కలంతా దృష్టి సారించాడు.ఊరి నుంచి దూరంగా ఉన్న ఆ ప్రాంతంలో ఓ వేపచెట్టు.ఆ చెట్టు కింద ఓ గుడిసె.సరిగ్గా ఆ గుడిసె ముందు కొందరు గుమిగూడి ఉన్నారు.పోలీస్‌ జీపు ఆగటం చూసిన జనం భయంతో పక్కకు తప్పుకున్నారు.ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ తన సిబ్బందితో ఆ గుడిసెను సమీపించాడు.చూపరుల గుండెల్ని జలదరింపచేసేలా పాతికేళ్ళ యువతి శవం రక్తపు మడుగులో వెల్లకిలా పడి ఉంది. ఆమె వొంటి మీది దుస్తులు అస్తవ్యస్తంగా చెదిరిపోయి ఉన్నాయి. ఆమె మెడ మీద, వక్ష స్థలంలోను, పొట్టమీద కత్తిపోట్ల తాలూకు గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ గాయాల నుండి స్రవించిన రక్తంతో ఆమె శరీరమంతా దాదాపు రక్తమయంగా ఉంది. ఆమె సమీపంలోనే నాలుగైదు నెలల పసికందు శవం కూడా పడి ఉంది.ఆ పసిగుడ్డు ముఖమంతా మట్టికొట్టుకుని నల్లగా కమిలిపోయి, రక్తసిక్తమై ఉండటాన్ని బట్టి బహుశా ఆ పసిదాని కాళ్ళను పట్టుకుని నేలకేసి బాది చంపినట్టు తెలుస్తోంది. బహుశా మృతులిద్దరూ తల్లీబిడ్డలై ఉండొచ్చు.ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ శవాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. రాతిగుండె గల రాక్షసుడు మాత్రమే ఇలాంటి దారుణ మారణకాండకు పూనుకుని ఉంటాడని అనుకున్నాడు. అయితే ఆ నరరూప రాక్షసుడ్ని పట్టి బంధించడానికి ఉపయోగపడే ఆధారమేమీ ఘటనా స్థలంలో దొరకలేదు. అక్కడ గుమిగూడిన జనం నుంచి కూడా పరిశోధనకు ఉపయోగపడే సమాచారం దొరకలేదు. ఆ శవాన్ని గుర్తు పట్టకపోవటంతో మృతిచెందిన ఇద్దరూ తల్లిబిడ్డలు కావచ్చని, అయితే కాజీసరాయ్‌ ప్రాంతానికి చెంది ఉండక పోవచ్చని జాదవ్‌ ఒక నిర్ణయానికి వచ్చాడు.పోలీస్‌ ఫొటోగ్రాఫర్లు, ఫింగర్‌ప్రింట్స్‌ ఎక్స్‌పర్ట్‌లు తమ పనులు ముగించుకుని పోయాక, ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ శవ పంచనామా జరిపించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు.ఐ.పి.సి. సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాడు.అయితే హత్య చేయబడిన తల్లిబిడ్డలు ఎవరో, ఎక్కడివారో, వారు ఎందుకు హత్య చేయబడ్డారో, వాళ్ళను హత్య చేసిన వారెవరో పోలీసుల ఊహకు అందలేదు.దాంతో పోలీసుల పరిశోధన ఒక్క అడుగు ముందుకు సాగలేదు. అదే సమయంలో పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చింది. అందులో పోలీసుల పరిశోధనకు ఉపయోగపడే అంశమేదీ కనిపించలేదు.రెండు రోజులు గడిచాయి.ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక వ్యక్తి కాజీసరాయి పోలీస్‌స్టేషన్‌లోకి అడుగుపెట్టాడు.చాలా ఆందోళనగా కనిపిస్తున్న వ్యక్తి తన పేరు చున్నీలాల్‌ అని, తన భార్య పులవంతి రెండు రోజులుగా కనిపించటం లేదని ఫిర్యాదుచేశాడు. నిజానికి రెండు రోజుల క్రితం తన భార్య కూతురు పూనమ్‌ను తీసుకుని శేర్‌గడి నుంచి ఆమె పుట్టింటికి ఖటకీకి బయలుదేరిందని, మరుసటి రోజు తను కూడా అక్కడికి వెళ్ళానని, అయితే పులవంతి అక్కడికి రాలేదని తెలిసి, తను, తన మామ తమకు తెలిసిన అన్నీచోట్ల వెతికామని ఆమె ఎక్కడా కనిపించక పోవటంతో చివరికి పోలీసు కంప్లయింట్‌ ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు.ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుపోయి శవాల గదిలో ఉంచిన రెండు శవాల్ని చూపించాడు. ఆ శవాల్ని చూడగానే చున్నీలాల్‌ బోరున ఏడుస్తూ నేలకూలాడు. అవి అతడి భార్యాబిడ్డల శవాలే అని ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌కు అర్థమైంది.చున్నిలాల్‌ దుఃఖంనుంచి కాస్త తేరుకున్నాక ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ అతడిని రకరకాలుగా ప్రశ్నించి అనేక విషయాలు రాబట్టాడు. తన భార్య, బిడ్డల హత్యల వెనుక తన మేనత్త కొడుకు కాంతిలాల్‌ హస్తం ఉండొచ్చని చున్నీలాల్‌ తన అనుమానం బయట పెట్టాడు.పరిశోధన కొనసాగించడానికి తీగ దొరకడంతో ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ వెంటనే కాంతిలాల్‌ను అరెస్ట్‌చేసి విషయమంతా రాబట్టాడు. అప్పుడు జరిగిన పోలీసుల ఇంటరాగేషన్‌లో ఆ జంట హత్యల వెనుకగల చీకటి కథ బయటికి వచ్చింది.ఇంతకీ పులవంతి, పూనమ్‌ల హత్య ఎందుకు ఎలా జరిగిందంటే? పులవంతి పూలగుత్తిలా ఉంటుంది.చుట్టుపక్కల ఉన్న అయిదారు గ్రామాల్లో అంతటి అందగత్తె లేదంటే అది అతిశయోక్తి కాదు.

ఆమె అందాన్ని చూసే చున్నీలాల్‌ ఆమెను ఏరికోరి చేసుకున్నాడు.ఆమె కాపురానికి వచ్చినప్పుడు వసంతమే తన ఇంట్లోకి వచ్చినంత సంబరపడ్డాడు. అందమైన తన భార్యను కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నట్టు ప్రేమగా చూసుకునేవాడు. ఊళ్ళోకంతా తన భార్య అందరి భార్యల కన్నా అందగత్తె అని గర్వంగా ఫీలయ్యేవాడు.అందమైన భార్య దొరికిన అతడి అదృష్టానికి చాలామంది ఈర్ష్యతో కుళ్ళుకునేవాళ్ళు. అతను చూడకుండా అప్పుడప్పుడు ఆమెను చూసి లొట్టలు వేసేవాళ్ళు. అలా లొట్టలు వేసే వాళ్ళలో కాంతిలాల్‌ కూడా ఒకడు.పులవంతి ఆ ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి అతడి కళ్ళు ఆమె మీద ఉన్నాయి.కాంతిలాల్‌ అతడి మేనత్త కొడుకు. అంటే చున్నీలాల్‌ తండ్రి ఒక్కగానొక్క చెల్లెలు బసంతి కొడుకు. అతి గారాబం వల్ల అతడికి చదువు అబ్బలేదు. డబ్బులు బాగా ఉండడంతో వాటిని ఎన్నిరకాలుగా ఖర్చు పెట్టడం బాగా తెలుసుకున్నాడు. 


ఇదంతా గమనించిన చున్నీలాల్‌ మేనత్త బసంతి కొడుకు తన దగ్గర ఉంటే పూర్తిగా పాడవుతాడని, చున్నీలాల్‌ దగ్గరికి పంపి వాడిని ఎలాగైనా దారిలో పెట్టమని చెప్పి పంపింది.కాంతిలాల్‌ మేనమామ ఇంట్లో ఉండి చున్నీలాల్‌ వ్యాపార వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు.ఇలాంటి సమయంలోనే చున్నీలాల్‌ పెళ్ళి చేసుకుని ఆ ఇంట్లో పులవంతి కాలు పెట్టింది.‍‍సహజంగానే పోకిరి స్వభావం కల కాంతిలాల్‌ పులవంతిని చూడగానే మతిపోగొట్టుకున్నాడు. చున్నీలాల్‌ అదృష్టానికి ఈర్ష్య చెందాడు. ఎలాగైనా పులవంతిని పొందాలని కాచు క్కూర్చున్నాడు.బంగారం లాంటి అవకాశం అతడికి రానే వచ్చింది.ఓసారి కాంతిలాల్‌ పులవంతి పుట్టిన ఊరైన ‘ఇటకీ’ వెళ్ళాడు. అక్కడ అనుకోకుండా అతనికో విషయం తెలిసింది. ఇటికిలో పులవంతికి పెళ్ళికాకముందు ఓ వ్యక్తితో ప్రేమకలాపాలు సాగించిందని, అతడితో ఆమెకు చాలా దగ్గరి సంబంధం ఉందని తెలిసింది. ఆ విషయం తెలియగానే కాంతిలాల్‌ ఎగిరి గంతేశాడు. తన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అనిపించింది. ఇక పులవంతిని తనకు తెలిసిన రహస్యం ఆధారంగా ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి ఆమె అందాన్ని అనుభవించాలనే నిర్ణయానికి వచ్చాడు..

ఆ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పులవంతి చెయ్యి పట్టుకుని నవ్వుతూ చూశాడు.పులవంతి అతడి చేతిని విదిల్చుకుని కోపంగా, ‘‘ఏమిటిది?’’ అంది.‘‘నీ అందం నన్ను పిచ్చెక్కిస్తోంది. ఈ దీనుడ్ని కరుణించు’’ అన్నాడు నాటకీయంగా.వెంటనే ఆమె అతడి చెంప ఛెళ్ళుమనిపించింది.‘‘దుర్మార్గుడా! నీకిదేం బుద్ధి. వావీ వరుసలు లేకుండా వాగుతావా? ఇంకొకసారి ఇలా చేశావంటే మా ఆయనకు చెప్పి నిన్ను ఇంటి నుంచి గెంటేస్తాను’’ అంది.‘‘ఇంత చిన్న విషయానికి ఇంత కోపమెందుకు? ఇటకీలో నువ్వు నడిపిన ప్రేమకలాపాలు, ఆ ఠాకూర్‌ కొడుకుతో నీకు ఉన్న సంబంధం మీ ఆయనకు చెబితే నన్ను ఇంటి నుంచి గెంటుతాడో, నిన్ను గెంటుతాడో చూద్దాంలే’’ అన్నాడు కపటంగా నవ్వుతూ.ఆ మాటలకు పులవంతి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది.ఆ మాటలు అర్థమవుతుండగా ఆమె ముఖం వివర్ణమైంది.


అప్పటిదాకా భగ్గుమని నిప్పులు కురిపించిన ఆమె కళ్ళల్లో భయం తొంగిచూడటంతో కాంతిలాల్‌ నవ్వుతూ ఆమెను సమీపించాడు. పులవంతి మనస్సు ఎదురు తిరుగుతున్నా ఒక విధమైన నిస్సహాయత ఆమెను ఆవరించింది.ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అన్నట్టు ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు.ఆమె ఆమె ముఖాన్ని ముద్దులతో నింపాడు.ఆమె శరీరాన్ని తడుముతూ ఆమెను క్షణాల్లో వివస్త్రను చేశాడు.ఆమెను మంచం మీదికి తోసి ఆమెను ఆక్రమించుకున్నాడు. అప్పటినుంచి కాంతిలాల్‌ ఆమెకు అవకాశం దొరికినప్పుడల్లా అనుభవించసాగాడు.పులవంతి ఇష్టం లేని మనస్సుతోటే అతడికి తన శరీరాన్ని అప్పగించేది.రాను రాను ఆమె మనస్సు కాంతిలాల్‌ వైపు మొగ్గింది. వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ కాలం దాగలేదు.


ఒకరోజు వాళ్ళిద్దరూ పక్కలో ఉన్నప్పుడు చున్నీలాల్‌ వచ్చాడు.వాళ్ళిద్దరిని అలా చూడగానే అతడి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి.చున్నీలాల్‌ను చూడగానే కాంతిలాల్‌ అక్కడి నుంచి పరుగెత్తి పోయాడు.పులవంతిని చున్నీలాల్‌ చితకబాదాడు.పులవంతి ఏడుస్తూ అతడి ముందు తన తప్పంతా ఒప్పుకుంది.పెళ్ళికి ముందు తన ప్రేమవిషయం కూడా చెప్పి ఆ విషయం తెలిసిన కాంతిలాల్‌ తనను బ్లాక్‌ మెయిల్‌ చేసి లోబరుచుకున్నాడని చెప్పి తన తప్పును మన్నించమని వేడుకుంది.ఆమె తన తప్పు ఒప్పుకోవటంతో చున్నీలాల్‌ కొద్దిసేపటికి శాంతపడ్డాడు.తరువాత ఆరు నెలలు గడిచాయి.వారి సంసారం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగింది.

పులవంతి ఒక ఆడపిల్లకు జన్మ ఇచ్చింది. పాపకు పూనమ్‌ అని పెట్టారు.మరో రెండు నెలలు గడిచాయి.ఇదే సమయంలో చున్నీలాల్‌ పొరుగున ఉన్న కుటుంబంలోని వ్యక్తి చున్నీలాల్‌కు అతను లేని సమయంలో ఒక వ్యక్తి తరుచుగా వచ్చిపోతుంటాడని తెలిపాడు.ఆ మాటలు వినగానే చున్నీలాల్‌ తల తిరిగి పోయింది.ఒకరోజు బయటికి పోయినట్టు పోయి, దూరంలో చాటుగా నిలబడి గమనించాడు.కొద్దిసేపటి తరువాత తన ఇంట్లోకి ఒక వ్యక్తి గబగబా వెళ్లటం తన భార్య గబుక్కున తలుపులు వేసుకోవటం గమనించాడు. అలా లోపలికి వెళ్ళిన వ్యక్తిని కాంతిలాల్‌గా గుర్తించగానే అతడి కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది.భార్య చేసిన తప్పు తెలిసినా క్షమించాడు. ఆమెకు మళ్ళీ భార్య స్థానం ఇచ్చాడు. అయినా ఆమె తనను మోసం చేసింది. చున్నీలాల్‌ జీర్ణించుకోలేకపోయాడు. 


అదే సమయంలో అతడి బుర్రలో మరొక ఆలోచన వచ్చింది. తనకు తెలియకుండా రహస్యంగా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న భార్యకు పుట్టిన పూనమ్‌ ఎవరి సంతానం?ఇలాంటి ఆలోచనలతో అతడికి పిచ్చిపట్టినట్టయ్యింది. క్షణక్షణానికి అతనిలో తల్లీబిడ్డల పట్ల కోపం, అసహ్యం పెరిగిపోయింది. వాళ్ళిద్దరిని అంతం చేస్తేనే తనకు మనశ్శాంతి అనుకున్నాడు. వీళ్ళను అంతం చేశాక తన సంసారం నాశనం చేసిన కాంతిలాల్‌ అంతు చూద్దామనుకున్నాడు.వెంటనే ఓ పథకం పన్నాడు. ఇద్దరు స్నేహితుల సహాయం తీసుకున్నాడు.కాజీసరాయ్‌లో తమ కోసం ఓ కొత్త ఇంటిని అద్దెకు మాట్లాడి వచ్చానని పులవంతికి చెప్పాడు. ఇంటిని చూడటానికి ఆమెను బయలుదేరదీశాడు. వాళ్ళ వెనుకనే అతడి ఇద్దరి స్నేహితులు అనుసరించారు.


కాజీసరాయ్‌కు ఒక కిలోమీటరు దూరంలోని నిర్జన ప్రదేశంలోని ఒక గుడిసె దగ్గర విశ్రాంతి తీసుకుందామని చెప్పాడు.అదే సమయంలో అతడి స్నేహితులు అక్కడికి వచ్చారు. వాళ్ళను చూడగానే ఆమెకు ఏదో ప్రమాదం జరగబోతుందని అర్థమైంది. అక్కడినుంచి తప్పించుకుందామని పరుగెత్త బోయింది.చున్నీలాల్ స్నేహితులు గట్టిగా ఆమెను కదలకుండా పట్టుకున్నారు.చున్నీలాల్‌ దాచుకున్న కత్తిని బయటికి తీశాడు.‘‘నువ్వు తప్పు చేశావని తెలిసి నిన్ను క్షమించాను. అయినా నీ బుద్ధి మారలేదు. వాడితో సంబంధాన్ని కొనసాగించావు. నీకు ఇదే శిక్ష’ అంటూ ఆమెను ఎడాపెడా పొడిచేశాడు. పులవంతి గిలగిలా తన్నుకుని తల వాల్చేసింది.చున్నీలాల్‌ భార్య శవం వైపు ఒకసారి చూసి, పూనమ్‌ను చేతిలో తీసుకున్నాడు.అతడికి బాధ, దుఃఖము, అసహ్యము ఒకేసారి కలిగాయి.అంతే, పూనమ్‌ కాళ్ళు పట్టుకుని ఎత్తి నేలకేసి గట్టిగా బాదాడు.అలా పులవంతి, పూనమ్‌ల హత్యలు జరిగాయి. ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ చున్నీలాల్‌ను, అతడి స్నేహితులను కోర్టులో హాజరు పరిచాడు.ప్రస్తుతం నేరస్తులు జైల్లో ఉన్నారు.