తెనాలి రైల్వే స్టేషన్
అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల టైముంది.
వీపున పది కిలోల బ్యాగులు మోస్తూ, తిరుపతి నుండి రాబోయే నారాయణాద్రి కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరు యువకులు.
ఇద్దరి డ్రెస్సింగ్ మోడ్రన్‍గా ఉన్నా మొహాల్లో కళ లేదు. జీవితంలో ఏదో కోల్పోయినట్లు దిగులుగా ఉన్నారు. కానీ ఆ దిగులును బయట పెట్టుకోకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
ముందుగా తనే ఓపెన్ అయ్యాడు ఓంకార్. “జరిగిన దాని గురించి బాధ పడకురా తేజా…” అన్నాడు పక్కవాడి భుజం మీద చెయ్యి వేయటానికి ప్రయత్నిస్తూ. “పెళ్లి చూపులనేవి బ్యాచిలర్ జీవితంలో ఒక ఫేజ్. నడవక తప్పని బాటలో దాటక తప్పని స్పీడ్ బ్రేకర్లు. ఆ ఫేజ్ దాటి అన్ని ఆటంకాలు ఎదుర్కొంటే కానీ సంసారం అనే స్వర్గం సాకారం కాదు.”
“ఆ విషయం ఎవడాలోచిస్తున్నాడెహె…” ఆ చేతిని విదిలించి కొడుతూ అన్నాడు తేజ.
“మరెందుకంత దిగులుగా ఉన్నావ్?” సంభాళించుకుని అడిగాడు ఓంకార్.
“నా మూడ్ నీకు అలా అర్ధం అయిందా? దీన్ని దిగులుగా ఉండటం అనరు. గంభీరంగా ఉండటం అంటారు.”
“పళ్ళూడగొట్టుకోవటానికి పకోడీలో రాయి అయినా, పలావులో రాయి అయినా ఒకటే. మనలో మన మాట… ఆ గంభీరానికి కారణం మరోసారి పెళ్లి చూపుల్లో ఛీ కొట్టించుకోవటమేగా. కవరింగులు ఆపి ఒరిజినల్ తేజని బయట పెట్టరా...”
“జీవితంలో ఒక గాఢ నిర్ణయం తీసుకున్నపుడు ఎక్స్‍ప్రెషన్ అలానే ఉంటుంది.”
“నిర్ణయం గట్టిగా తీసుకుంటారు. గాఢంగా కాదు. అయినా ఈ పిచ్చి ప్రేలాపన ఆపి నువు తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటో చెప్పు?”
“ఇక జీవితంలో పెళ్ళి చూపులకు అటెండ్ కాను.”
తేజ చెయ్యి పట్టుకుని గట్టిగా ఊపుతూ, “అదీ మాటంటే! అదే మాట మీద నిలబడు. నీకు తోడు వచ్చీ వచ్చీ నా రెప్యూటేషన్ కూడా దెబ్బతింటోంది.” అన్నాడు ఓంకార్ సంతోషంగా. అప్పటిదాకా అతనిలో గూడు కట్టుకున్న దిగులు ఉఫ్ఫుమని ఊదినట్లు ఎగిరి పోయింది.
అతని ఉత్సాహం చూసి మండుకొచ్చింది తేజకి. “నీ మొహానికి రెప్యుటేషన్ కూడానా? అసలు పిల్లిలాగా నిన్ను వెంట పెట్టుకుని వెళ్లటంతోనే నాకీ దరిద్రం అని గాఢంగా డౌటొస్తోంది.”
“మళ్లీ గాఢంగా అన్న పదం తప్పుగా వాడావ్…”
ఇంతలో ఇద్దరి మాటలకీ అంతరాయం కలిగిస్తూ ప్లాట్‍ఫాం మీదకు వస్తున్న నారాయణాద్రి కనిపించింది.
అర్ధరాత్రి కావటంతో రిజర్వేషన్ చేయించుకున్న అయిదారుగురు తప్ప పెద్దగా జనాలు లేరు.
ఇద్దరు తమ S-6 బోగీ ఆగే చోటుకు వెళ్లి నిలబడ్డారు.
ఆగిన ట్రైన్‍లోకి ఎక్కారు వారు.
ముందు ఎక్కిన ఓంకార్ కంపార్ట్‍మెంటు లోపలికి నడవబోతూ డోర్ దగ్గరే ఆగిపోయిన తేజని చూసి, “లోపలకి నడువ్…” అన్నాడు.
“ట్రైన్ కదలనియ్యరా...”
“ఏం ఈ లోపు ఏమన్నా ఈ స్టేషన్లో అద్భుతం జరుగబోతుందా? సిగ్నల్ స్థంభంలాగా నువు ఇక్కడ నిలబడకపోతే జరిగే అద్భుతం ఆగిపోతుందా?” వెటకారంగా అన్నాడు.
“దిల్‍వాలే దుల్హనియా లే జాయెంగే సినిమాలో షారుక్ నుండి మర్యాద రామన్నలో సునీల్‍దాకా తమ ఫియాన్సీలని ఇలా కదులబోతున్న రైల్లోనే కలుసుకున్నార్రా…” ఆశగా ప్లాట్‍ఫాం వైపు చూస్తూ అన్నాడు తేజ.
ఇంతలో గట్టిగా కూత పెట్టిన ట్రైన్ మెల్లగా కదిలింది.
“అంటే ఇప్పుడు నీకు కూడా ఒక హీరోయిన్ ఇక్కడ దొరుకుదంటావా?” తేజ పక్కకి వచ్చి ప్లాట్‍ఫాం మీదకు తొంగి చూశాడు ఓంకార్. “మన దరిద్రానికి అంత అదృష్టం కూడానా? కలరింగ్ కాదు కదా, ఆడ జీవి ఏదీ ప్లాట్‍ఫాం మీద లేదు…” అనబోయి ఆఖరి మాటను నోట్లోనే మింగేస్తూ ఆగి పోయాడు.
అతని మాటల్లో తేడా గమనించి అతను చూస్తున్న వైపు తను కూడా చూపు సారించాడు తేజ. తెల్ల చీర కట్టుకున్న ఒక డెబ్భై ఏళ్ల బామ్మ అప్పుడే ఓవర్ బ్రిడ్జి మీద నుండి ప్లాట్‍ఫాం మీదకు ఎగిరి దూకింది. ఆమె వెనుక ఒక పోర్టర్. అతని చేతిలో రెండు మూడు భారీ లగేజీలు ఉన్నాయి.
“చైను లాగుదామా?” అన్నాడు తేజ.
“ఆవిడకి డెబ్భై పైనే ఉన్నట్లున్నాయిరా…” తేజ వంక అనుమానంగా చూస్తూ అన్నాడు ఓంకార్.
“ఛీ… అందుకు కాదు. పాపం పెద్దావిడకి ట్రైన్ మిస్సవుతుందేమో…”
“ఇప్పుడావిడ అర్జంటుగా ఈ ట్రైన్ ఎక్కి ఏ దేశాన్ని ఉద్ధరించాలి? దారిన పోయే తద్దినాన్ని పిలిచి నెత్తికెక్కించుకోమాకు…” నిర్దయగా అన్నాడు ఓంకార్.
అయితే కదులుతున్న కంపార్ట్‍మెంట్ చూసి ఆ బామ్మ ఏమాత్రం బెదర్లేదు. అర క్షణంలో చెప్పులు విప్పి చేత్తో పట్టుకుంది. కుచ్చిళ్లు బొడ్లో దోపింది. ఆ తరువాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 400 మీటర్ల రేసులో పిస్టల్ మోత విన్న పి.టి.ఉషలా S-6 బోగీ వైపు దూసుకు వచ్చింది. రెండు చేతులూ ఇంజిన్లో పిస్టన్‍లా చకచక ఊపుతూ ఆమె పరుగెత్తుతుంటే మడి చీర కట్టుకున్న మరమనిషి పరుగెత్తుతున్నట్లుంది. ఆమె వేగానికి ఏమాత్రం సరి తూగని పోర్టర్ కనీసం రేసులో ఆఖరి స్థానం అయినా రాక పోతుందా అన్నట్లు నీరసంగా ఆమెను అనుసరిస్తున్నాడు.
ఆ వేగానికి అచ్చెరువొందిన ఓంకార్ ఆశ్చర్యం నుండి తేరుకోక ముందే ఆమె కంపార్ట్‍మెంట్ డోర్ దగ్గరకు వచ్చేసింది. అలా పరుగెత్తుతూనే బోగీ మీద ఉన్న కంపార్ట్‍మెంట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకుంది. తరువాత “కమాన్ క్యాచ్…” అంటూ చేతిలో ఉన్న చెప్పులు రెండూ ఓంకార్ వైపు విసిరేసింది.
జీవితంలో ఎన్నో క్రికెట్ మ్యాచులు ఆడాడు ఓంకార్. బ్యాటింగూ, బౌలింగూ బ్రహ్మాండంగా చేసేవాడు. కానీ… ఏనాడూ ఒక్క క్యాచ్ కూడా పట్టిన పాపాన పోలేదు. ఏంటో ఎప్పుడూ చేతికి అందినట్లే అంది బాల్ జారిపోయేది. అందుకే వాడిని ఎవరూ తమ టీములో ఆడనిచ్చే వారు కాదు. అలాంటిది ఇప్పుడు మాత్రం వద్దనుకున్నా ఆ చెప్పులు రెండూ సరిగ్గా వచ్చి అతని చేతుల మధ్య ల్యాండయ్యాయి.
కళ్ల ముందు జరుగుతున్న సంఘటనను సినిమా చూసినట్లు చూస్తున్న తేజ, “ఏంట్రా బడుద్ధాయ్! చెయ్యి అందుకో…” అంటున్న బామ్మ మాటతో ఈ లోకంలోకి వచ్చాడు.
తను చెయ్యి ఇవ్వక పోయినా ఆమె లోపలకు వచ్చేటట్లే ఉంది. అందుకే చెయ్యి ముందుకు చాచాడు తేజ.
ఆ చెయ్యి అందుకుని చులాగ్గా చెంగుమని ఒక్క గెంతు గెంతి కంపార్ట్‍మెంట్లోకి వచ్చి పడింది బామ్మ. బామ్మ వెనుక పరుగులు పెడుతున్న పోర్టర్ ఆమెను అందుకోలేక పోయినా, వాడి దగ్గరకు కంపార్ట్‍మెంటే వచ్చింది. బామ్మ లాఘవంగా వాడి చేతుల్లో ఉన్న లగేజీ ఒకొటొకటిగా లాక్కుని వెనక్కి పెట్టెలోకి విసిరేసింది.
“బామ్మగోరూ… నా డబ్బులండీ.” గోల చేస్తున్నాడు పోర్టర్.
“ఉరేయ్! ఒక యాభై వాడికి ఇవ్వు.” తేజకి ఆర్డర్ వేసి వెనక్కి తిరిగింది బామ్మ.
ఒక భారీ సూటుకేసు నెత్తి మీద, ఒక బ్యాగు కుడి చంకలో మరో బ్యాగు ఎడమ చేతిలో వేలాడుతూ నిలబడి ఉన్నాడు ఓంకార్.
“ఎందుకురా అట్టా నేల చూపులు చూస్తూ నిలబడ్డావ్. నడువ్. 41 నెంబర్ బెర్త్ దగ్గరకి పద…” అంటూ అతని రియాక్షన్ కోసం ఎదురు చూడకుండా తను వెళ్లి పోయింది.
ఇంతలో పోర్టర్‍కి డబ్బులు ఇచ్చిన తేజ ఓంకార్ నెత్తి మీద నుండి ఆ భారీ సూట్‍కేసు దించాడు.
“ఇది రైలు కాబట్టి సరిపోయింది అదే ఏ విమానమో అయితే ఈ సూటుకేసు బరువుకి కూలిపోయి ఉండేది. అంత బరువుందది. పైగా నేల చూపులు చూస్తున్నానని నామీద వెటకారం బాంబు వేస్తుందా ముసల్ది…” పళ్లు కొరుకుతూ అన్నాడు ఓంకార్.
వీళ్లిద్దరూ ఆమె సామాను 41 వ నెంబర్ బర్త్ దగ్గరకు చచ్చిన శవాన్ని ఈడ్చుకు వచ్చినట్లు తెచ్చేసరికి అప్పటికే ఆ సీట్లో పడుకున్న ఒక వ్యక్తిని బెదరగొట్టి దూరంగా తరిమి, “రండ్రా పిల్లలు… మీ నెంబర్లెంత?” అంది ఆమె.
తమ టిక్కెట్ తీసి చూసుకుని, “ఈ మిడిల్ బెర్తూ, అప్పర్ బెర్తూ…” అంటూ ఆమె సీటు మీద ఉన్న బెర్తులను చూపించారు.
“కూర్చోండిరా…” అప్పుడే రిలీజ్ అయిన ఐఫోన్ సగం రేటుకు ఆఫర్ చేస్తున్నట్లు పక్కన చోటు చూపిస్తూ అంది బామ్మ.
“మీరు పడుకోరా?” అనుమానంగా అడిగాడు తేజ.
“తొందరేముంది? అయినా రాత్రి పూట నిద్ర ఎక్కడ పట్టి ఛస్తుంది?”
“అంటే పగలు మాత్రమే పక్కవాళ్లకి ప్రశాంతతనిస్తారా?” అమాయకంగా అడిగాడు ఓంకార్. ఇప్పుడతను నేల చూపుల నింద నుండి తప్పించుకోవటానికి తల పైకి ఎత్తి పట్టి నడుస్తున్నాడు.
“వీడికి కాస్త వెటకారం ఎక్కువ అనుకుంటానే… అయినా అలా కళ్లు నెత్తి మీదకు తెచ్చుకుంటే బొక్కబోర్లా పడతావ్.” తల ఎత్తి నడుస్తున్న అతన్ని చూసి అంది.
ఠక్కున తల మామూలుగా దించాడు ఓంకార్.
“వాడి మాటలు పట్టించుకోకండి.” మొహమాటంగా అన్నాడు తేజ.
“పెళ్లయిందా?” అడిగింది బామ్మ ఇద్దరి వేపూ చూస్తూ.
అవలేదు… అన్నట్లు జమిలిగా తల అడ్డంగా ఊపారు వారు.
“ఇప్పట్నుండే ఆ నోటి దూల తగ్గించుకో. లేకపోతే… ఆరు నెలలకి మించి ఏ అమ్మాయీ నిన్ను భరించదు.”
“ఇంత సహాయం చేస్తే కృతజ్ఞత అన్నది లేకుండా ఇలా శాపం పెడతారా?” ఏడుపు గొంతుతో అన్నాడు ఓంకార్.
“శాపం కాదురా పిచ్చి సన్నాసీ. లోక జ్ఞానం నేర్పుతున్నాను. లోకం ఎట్టా ఉంది? రోజూ ఎంత మందిని చూస్తున్నాను… అమ్మాయిలు మునుపట్లా లేరురా. అణిగిమణిగి ఉండటం ఇప్పట్నుండే ప్రాక్టీస్ చెయ్యకపోతే నీ గతి అధోగతే...” అని ఉన్నమాట చెప్తున్నాను.
“ఏంటి మీరు జోస్యం కూడా చెప్తారా?”
“నీ ఫ్యూచర్ చెప్పటానికి జోస్యం చెప్పటం తెలియనవసరం లేదు. వాలం లేకపోయినా నీ వాలకం చూసి చెప్పొచ్చు వాలి వారసుడివని.”
ఆమె చెప్పింది ఏంటో సరిగ్గా అర్ధం కాక పోయినా మాటల్లో ఆమెను ఓడించటం అసాధ్యం అని డిసైడ్ అయ్యారు వారు.
ఇంతలో ఇంకో పాసెంజర్ ఎక్కడ ఎక్కాడో అప్పుడే వచ్చాడు. భారీ కాయంతో ఆపసోపాలు పడుతూ వచ్చి “ఈ బెర్తు నాది…” అన్నాడు బామ్మ లోవర్ బెర్తు వైపు వేలు పెట్టి చూపిస్తూ.
గజగజ వణకుతూ ఎదురుగా నిలబడ్డ మేకపిల్లని సావకాశంగా చూసే పులిలా అతన్ని కింద నుండి పైదాకా తేరిపార చూసింది బామ్మ. “నీదయితే రేపు ఇంటికెళ్ళేటపుడు పట్టుకుపోరా అబ్బీ…” అని ఒక జోకు జోకి తేజ, ఓంకార్ వైపు తిరిగి కన్ను కొట్టింది.
కిసుక్కున నవ్వారు వారు.
“నా దగ్గర రిజర్వేషన్ ఉంది.” అవమానంగా అన్నాడు ఆ పాసెంజర్ తన టికెట్ పర్సులో నుండి తీస్తూ.
“మడిచి…” అని కాస్త గ్యాప్ ఇచ్చి, “పర్సులో పెట్టుకో. టికెట్ నా దగ్గరా ఉంది.” కాళ్లు రెండూ పైకెత్తి బెర్తు మీద బాసింపట్టు వేస్తూ అంది.
ముక్కు పుటాల నుండి వేడి ఆవిర్లు వస్తుంటే, కాలకేయుల కిలికి భాషలో కొన్ని తిట్లు తనని తాను తిట్టుకుని, అందరికీ అర్ధమయ్యే భాషలో “ఇప్పుడే టి.సి.ని తీసుకు వస్తాను…” అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళి పోయాడతను.
“అబ్బాయిలూ! మీరు పక్కన ఉండటం మంచిదయింది. లేకపోతే నన్ను ఒంటరిదాన్ని చేసి బెర్తు మీద నుండి లేపేసినా లేపేశేవాడు…”
‘రామేశ్వరంలో శివలింగం అన్నా కదులుతుందేమో గానీ… నువ్వు ఆ బెర్తు మీద నుండి కదులతావటే.’ అని మనసులో అనుకుని, “నేను వెళ్లి పడుకుంటున్నాను.” తన అప్పర్ బెర్తు వైపు చూస్తూ అన్నాడు ఓంకార్.
“పూరీలు తింటావా?” అడిగింది బామ్మ వాడిని పైకి ఎక్కనీయకుండా టెంప్ట్ చేయటానికి అన్నట్లు.
“ఇప్పుడా. అయినా మేము మస్తాన్ హోటల్లో మటన్ బిర్యానీ తిని వచ్చాం.” గర్వంగా అన్నాడు ఓంకార్.
“అయితే పెరుగన్నం తిను.”
“బిర్యానీ తిని పెరుగన్నం తినకుండా ఎలా ఉంటాం? అది కూడా తిన్నాం?”
“పోనీ అరిశెలు టేస్ట్ చేస్తావా?”
“బామ్మా! ఇప్పుడు టైము ఒంటి గంట అవుతోంది. అయినా అరిశెలు కావాలంటే ఇదుగో… మా వీపుల మీద ఉన్న ఈ బస్తాల నిండా అవే ఉన్నాయి. మా బతుకులకి పెళ్లి యోగం ఎలాగూ లేదని మేము కూడా డిసైడ్ అయ్యాము. అందుకే… నోరు కూడా కట్టుకుని బతకటం ఎందుకని, ఇంట్లో వాళ్లు ఇచ్చినవి ఇచ్చినట్లు మూట కట్టుకుని బయలుదేరాం.” అతను ఒక అడుగు పైకి లేపి పై బెర్తు ఎక్కటానికి ప్రిపేరవుతూ అన్నాడు.
“సరే వెళ్లు…” అంటూ ఉడక పెట్టిన వేరుశెనక్కాయలు బెర్తు మధ్యలో వొంపింది. పి.సి.సర్కార్ మ్యాజిక్ షోలో కళ్లు మూసి తెరిచే లోపు ప్రత్యక్షమయిన పావురాల్లా ఇంతలో ఆ వేరుశెనక్కాయలు ఆవిడ చేతిలోకి ఎలా వచ్చాయీ ఇద్దరికీ అర్ధం కాలేదు.
కమ్మటి వాసన కంపార్టుమెంటంతా వ్యాపించింది.
గాల్లోకి లేపిన కాలును ఏం చేయలో అర్ధం కాలేదు ఓంకార్‍కి.
అతని సందిగ్ధం గమనించి, “పైకి వెళ్తానన్నావుగా, వెళ్లూ...” అంది కొంటెగా.
పళ్లు కొరికి, రెండు గుప్పిళ్ల కాయలు ఆపళంగా ఒడిసిపట్టి లాఘవంగా పై బెర్తు మీదకు ఒక్క జంపు చేసి వెళ్లి పోయాడు ఓంకార్.
“నేను చెప్పలా వాలి వారసుడని…” అంది బామ్మ.
ఇంతలో టి.సి. వచ్చాడు. అతని వెనుకే భారీకాయుడు భయం భయంగా నిలబడి ఉన్నాడు.
టి.సి. బామ్మని టిక్కెట్టు అడిగాడు.
ఆమె తీసి చూపించింది.
“ఇది నిన్నటి టికెట్ బామ్మ గారూ…” విసుగ్గా అన్నాడు టి.సి.
“నిన్నటి టికెట్ ఏంట్రా వెధవా? ఇరవై నాలుగో తారీకుదేగా?”
“కానీ ఇవాళ ఇరవై అయిదుగా బామ్మా?”
“ఏంట్రా మందు కొట్టి వచ్చావా? ఇవాళ ఇరవై అయిదు ఏమిటి?”
“మీకు ఎలా చెప్పాలి బామ్మగారూ… సరిగ్గా మీరు ట్రైన్ ఎక్కే సమయానికి తేదీ మారి పోయింది.”
“ఏం తారీకులు కూడా రైల్వే వాళ్లు చెప్పినట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా మారిపోతాయా? ఇవాళ ఇరవై నాలుగే…”
“అలా కాదు బామ్మా! రాత్రి పన్నెండుకి కొత్త తారీకు వచ్చేస్తుంది. నిడుబ్రోలు వాళ్లు ఈ ట్రైన్ ఎక్కాలంటే ఇరవై నాలుగో తారీకుకి టికెట్ కొనుక్కోవాలి. కానీ తెనాలి వాళ్లు ఈ ట్రైన్ ఎక్కాలంటే ఇరవై అయిదో తారీకు టికెట్ కొనుక్కోవాలి.”
బామ్మ తేజ వైపు చూసింది. అతను ఆ మాటలు నిజమే అన్నట్లు తల ఊపాడు.
“అయితే నేను నిడుబ్రోలులోనే ఎక్కాననుకో…” సమస్యని సాల్వ్ చేసిన ఫీలింగ్‍తో అంది.
“నువ్వెక్కాల్సి ట్రైన్ నిన్నే వెళ్లి పోయింది… నా ఖర్మ కాలి నా డ్యూటీ ఈ ట్రైన్‍లో తగలడింది.” కోపంగా అని, “నువ్వయినా చెప్పవయ్యా…” అంటూ తేజని అభ్యర్ధించాడు టి.సి.
తేజకి చెప్పే ఛాన్సు ఇవ్వలేదు బామ్మ. కానీ… కొద్దిగా తగ్గింది. “నువ్వు ఏమయినా చెప్పరా అబ్బాయ్. నీ తల్లి వయసు దాన్ని. నన్ను లేపి ఆ బండ వెధవకి బెర్తు ఇస్తావట్రా?” అంటూ ఎమోషనల్ బ్లాక్‍మెయిల్‍కి దిగింది.
“లేకపోతే నా ఉద్యోగం పోతుంది.” బ్లాక్‍మెయిల్‍కి లొంగకుండా అన్నాడు టి.సి.
“మీరు నా బెర్త్ మీద పడుకోండి…” అంటూ తన బెర్త్ ఆఫర్ చేశాడు తేజ. అందరూ ఆ ఏర్పాటుకు సంతోషించారు. టి.సి. సహాయం చెయ్యగా భారీకాయుడ్ని మిడిల్ బెర్తు మీదకు ఎక్కించాడు తేజ.
“ఇప్పుడు టికెట్ డబ్బులు 500 కట్టండి.” రశీదు పుస్తకం తీస్తూ అన్నాడు టి.సి.
“నా దగ్గర లేవు…” ఖరాఖండిగా చెప్పింది బామ్మ.
“అయితే గుంటూరులో దిగిపోండి.”
“నన్ను దిగి పొమ్మంటానికి నువ్వెవడివిరా”
“టిక్కెట్టు లేదు కదండీ.”
“ఇదుగో! ఉందిగా.”
“అది నిన్నటిదండీ.”
“కానీ నిన్న నేను రైలు ఎక్కలేదుగా అందుకే దాన్ని ఇవాళ వాడతాను.”
తల పట్టుకున్నాడు టి.సి. అతన్ని పక్కకి తీసుకెళ్ళి తన దగ్గర ఉన్న 500 ఇచ్చాడు తేజ. అటు నుండి అటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లి పోయాడు టి.సి.
“మరి నువ్వెక్కడ పడుకుంటావబ్బాయ్?” ఇక నా బెర్తు మీద నుండి లెగవమన్నట్లు మొహమాటం లేకుండా చెప్పింది ఆమె.
“రెండు పాత న్యూస్ పేపర్లు పరచుకుని ఈ రెండు బెర్తుల మధ్య పడుకుంటాను.” చెప్పాడు తేజ, ట్రైన్‍లో రిజర్వేషన్ దొరకనప్పుడు చేసే పనిని మరోసారి చేస్తూ.
“దారిన పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకోవటమంటే ఇదే…” పై నుండి సౌండ్ వినిపించింది.
“నీలాంటి వాడు పక్కన ఉంటే కొత్తగా దరిద్రం నెత్తికి పూసుకోవటం ఎందుకు?” అని రిపార్టీ ఇచ్చి, తేజ పూర్తిగా సెటిల్ అయ్యేవరకు ఆగి, “హైదరాబాదులో ఎక్కడుంటావబ్బాయ్?” అని అడిగింది.
“అక్కడక్కూడా వద్దామనుకుంటున్నావేమో. అది కుదరదు…” తేజ కంటే ముందు తనే చెప్పాడు పై నుండి ఓంకార్.
ఆవిడ అసలు ఆ మాటలు పట్టించుకోనట్లు, “ఏం ఉద్యోగం చేస్తున్నావ్? సాఫ్టువేరేనా?...” అంది.
“కాదండీ. బ్యాంకులో.”
“ఆ పైన పడుకున్నాడే… వాడేం చేస్తాడు?”
“ఇద్దరం ఒక చోటే అండీ.”
“ఏ బ్యాంకు?”
“సూర్యా బ్యాంకు అని ఒక చిన్న ప్రైవేట్ బ్యాంకు.”
“అదేంటబ్బాయ్! ఏదన్నా మంచి బ్యాంకులో చేరకపోయావూ…”
“దేశంలో ఉన్న బ్యాంకుల వాళ్లందరూ మా దగ్గరకి వచ్చి గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడితే లాటరీ వేసి ఈ బ్యాంకు సెలక్ట్ చేసుకున్నాం...” పై నుండి ఓంకార్ చెప్పాడు.
“చెరకు గడకి పాంటూ షర్టూ వేసినట్లు ఉంటాడు కానీ, మీ వాడి దగ్గర చాలా వగలున్నాయే. సరయిన పెళ్ళాం చేతిలో పడితే క్రషర్‍లో పెట్టి చెరకులో నుండి రసం అంతా లాగినట్లు వీడి పొగరు అణచి పిప్పి మిగిలిస్తుంది. అప్పుడు కానీ నోరు మూసుకుని పడుండడు. సరే… నువు చెప్పబ్బాయ్. ఆ బ్యాంకులో ఎలా చేరావ్? ఎందుకు చేరావ్?” తేజని అడిగింది బామ్మ.
బామ్మ మాటతో తేజకి కూడా తన ఫ్లాష్‍బాక్ రింగులు తిరుగుతూ కళ్ల ముందు కనిపించింది. దానిని చూస్తూ కామెంటరీ చెప్పినట్లు చెప్పసాగాడు.
“బాల నేరస్తుల్ని పెట్టే జైలు లాంటి స్కూల్లో బాల్యం గడిచి పోయింది. టెంత్ అయ్యాక ఒక మంచి కోళ్ల ఫారం చూసి నన్ను మా నాన్న ఇంటర్‍మీడియట్‍లో జాయిన్ చేశాడు.”
“కోళ్లఫారంలో ఇంటర్‍మీడియట్టా?” ఆశ్చర్యంగా అడిగింది బామ్మ.
“కార్పొరేట్ కాలేజీకి మేం పెట్టుకున్న ముద్దు పేరు అదే.”
“అదేంటబ్బాయ్ అలా అంటావ్? ఆ కాలేజిలో చదివినాళ్లందరికీ మంచి మంచి ర్యాంకులు వస్తాయంటనే…”
“అదే మా నాన్న కూడా ఎక్స్పెక్ట్ చేశాడు. మూడు అంకెల ర్యాంకు వస్తుందని నా మీద ఆశలు పెట్టుకున్నాడు. కనీసం నాలుగంకెల ర్యాంకు తెప్పించే పూచీ మాదని కాలేజీ వాళ్లు వాగ్దానం చేశారు. అయిదంకెల ర్యాంకు రాకుండా ఉంటే కొండకి వచ్చి గుండు కొట్టించుకుంటానని నేను మొక్కుకున్నాను.”
“ఇంతకీ ఎంత ర్యాంకు వచ్చింది?”
“దేవుడు లెక్కల్లో దిట్ట అనుకుంటా. ఎవరినీ నిరుత్సాహ పరచకుండా మూడు వాల్యూస్ యావరేజ్ చేసి ఫలితం పంపాడు.”
“అంటే?”
“అంటే 999 + 9999 + 99999 కలిపి 3 పెట్టి భాగించి 36999 ర్యాంకు ప్రసాదించాడు.”
పై నుండి కిసుక్కున నవ్వు వినిపించింది.
“నీ సంగతి సరే కానీ, ఆ పై బెర్తు వాడికి ఎంత ర్యాంకు వచ్చింది.”
“నాదే దీన గాధ అనుకుంటే వాడిది దయనీయ గాధ. నా దరిద్రాన్ని నాలుగు పెట్టి హెచ్చవేసి నలుగు పెడితే వచ్చే రిజల్టే వాడు.”
“ఒక వేలు ప్లగ్గులో పెట్టి, రెండో వేలుతో స్విచ్ నొక్కటానికి తయారయిన కొవ్వు పట్టిన కోతిపిల్ల లాంటి జాతకం వాడిదని వాడి మొహం చూసినపుడే ఊహించాలే.”
సూడి పందికి డొక్కల్లో తీవ్రమయిన దెబ్బ తగిలితే వచ్చే సౌండ్ పై నుండి వచ్చింది.
“నువు కానియ్ అబ్బాయ్…” అంటూ బామ్మ తేజని తిరిగి ఫ్లాష్‍బాక్‍లోకి రమ్మని ఆహ్వానించింది.
“అలా మాకొచ్చిన ర్యాంకుకు మేము మెచ్చిన కాలేజీలో సీటు దొరకదుగా. గంతకు తగ్గ బొంతలా మా లాంటి వాళ్లని చేర్చుకునే ఒక కాలేజీలో చేరాం. మేము కాలేజీలో చేరింది కిట్టిగాడి క్యాంటిన్లో బొద్దింకలూ, ఈగలూ జాగ్రత్తగా ఏరి మిగిలిన సాంబారులో ఇనుప ముక్కల్లాంటి ఇడ్లీలను ముంచుకు తింటానికి కాదని తెలిసేటప్పటకి సగం కోర్సు అయిపోయింది. చేరిన పిల్లలకు పాఠాలు చెప్పటం తమ బాధ్యత అని లెక్చరర్లకు తెలిసేటప్పటికి మిగిలిన పుణ్య కాలం గడిచి పోయింది. ఎట్టకేలకు లెక్చరర్లే స్లిప్పులందించి మమ్మల్ని గండం గట్టేక్కేటట్లు చేశారు.”
“అదేదో క్యాంపస్ రిక్రూట్‍మెంట్లు అని ఉంటాయంటగదరా. కోర్సు పూర్తి కాక ముందే ఉద్యోగాలొస్తయ్యంటనే…”
“అట్లాంటివి ఏవో ఉంటయ్యని మాకు కూడా చదువు మొత్తం పూర్తయ్యాక మీలాంటి బామ్మలు చెప్తే తెలిసింది. ఆ తరువాత కూడా కొన్ని ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యాం. వాళ్లిచ్చే క్వశ్చన్ పేపర్ ఆబ్జెక్టివ్ టైపులో ఉండటం ఒక్కటే మాకు కలిసొచ్చిన అంశం. మా లక్కు కిక్కు ఇచ్చి ఎప్పుడయినా ఆ రాత పరీక్ష గండం గట్టెక్కినా తరువాత ఇంటర్వ్యూలో మమ్మల్ని, మా మౌనభాషని అర్ధం చేసుకునే మానవత్వం ఉన్న మహనీయులే లోకంలో లేకుండా పోయారు. మేము సిటీ బస్సుల్లో కాలేజికి వెళ్లే రోజుల్లో మా చేత బీటు కొట్టించుకున్న అమ్మాయిలు ఉద్యోగాలొచ్చి మొదట్లో స్కూటీల మీద, ఇప్పుడు కార్లలోనూ తిరుగుతుంటే మేము మాత్రం సిటీ బస్సుల్లోనే మిగిలి పోయాం.”
“కాలం కలిసిరాక పోతే శనీశ్వరుడికయినా దరిద్రం పడుతుందంట. మీరేం చేస్తారులే?” ఓదార్పుగా అంది బామ్మ.
“మేము ఏమీ చెయ్యలేమనే వారికి బుద్ధి చెప్పటానికి డొనేషన్ కట్టి ఎమ్బీయేలో చేరాం.”
“ఈసారన్నా బుద్ధిగా చదువుకున్నారా?”
“చదువుదామనే అనుకున్నాం. కానీ… ఫేస్బుక్‍లో హైయెస్ట్ లైకులు సాధించి, వాట్సప్‍లో వీడియోలు షేర్ చేసి, ట్విట్టర్‍లో అభిమాన హీరోని ఫాలో అయి, అలసి పోయి ఇంటికి వచ్చాక చదివే ఓపిక లేక పోయేది. చూస్తుండగానే కోర్సు కాలం గడిచి పోయింది. క్యాంపస్ రిక్రూట్‍మెంట్ల కాలం వచ్చింది. ఒక దాని తరువాత ఒకటిగా ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్లామో లెక్కలేదు. వాళ్లలో ఒక్కడిక్కూడా మాకు ఏ ప్రశ్నలకి సమాధానం తెలుసో తెలిసి చావదు. వాళ్లకి ఏ ప్రశ్నలకి సమాధానం తెలుసో వాటినే అడిగే వారు. ఆఖరుగా నే చెప్పానే సూర్యా బ్యాంకని దాని ఇంటర్వ్యూకి వెళ్లాము.”
“వాడు అన్నీ మీకు తెలిసిన ప్రశ్నలు వేసి ఉంటాడు. అందుకే ఆ ఉద్యోగం వచ్చింది…”
“ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగిందో ఇంకా కళ్ల ముందు కదలాడుతోంది. వాళ్లు అడిగిన ప్రశ్నలు, నేను ఇచ్చిన జవాబులు బాగా గుర్తు ఉన్నాయి… చెప్పమంటారా?” మళ్లీ గతం గుర్తు చేసుకుంటూ అన్నాడు తేజ.
“ఇంకా నిద్ర రావటం లేదు. చెప్పు…”
పైన కంపార్టుమెంటు సీలింగ్‍కి వేలాడుతూ గిరగిర తిరుగుతున్న ఫాన్ చూస్తూ ఫ్లాష్‍బ్యాక్ లోకి జారిపోయాడు తేజ.
ఇంటర్వ్యూ కమిటీ : నీ పేరు?
తేజ : అప్లికేషన్‍లో ఉంటుంది. (ఆ రోజు అప్పటికే రెండు ఇంటర్వ్యూలలో రిజెక్ట్ అయిన కోపం అలా మాట్లాడించింది.)
ఇం. క. : పోనీ ఇది చెప్పు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేరు ఏమిటి?
తేజ : తెలియదు.
ఇం. క. : సమాధానం నీ జేబులోనే ఉంటుంది. (వాళ్ల ఉద్దేశ్యం కరెన్సీ నోటు మీద పేరు చూసి చెప్పమని.)
తేజ : స్లిప్పులు రాసుకుని కాపీ కొట్టే అలవాటు లేదు.
ఇం. క. : అంటే అన్ని సబ్జెక్టులూ చదివే పాస్ అయ్యానంటావ్.
తేజ : మీకలా అర్ధమయిందా? స్లిప్పులు లెక్చరర్ రాసిస్తే కాపీ కొట్టి పాసయ్యాను.
ఆ సమాధానానికి కమిటీ మెంబర్లందరూ ఒకరినొకరు చూసుకుని తలలు విచిత్రంగా ఆడించుకున్నారు.
ఇం. క. : అసలు బ్యాంకులో ఏం జరుగుతుంటుందో తెలుసా?
తేజ : తెలుసు సార్. అవసరం లేకపోయినా అధికంగా సంపాదించిన వారి డబ్బు డిపాజిట్‍గా తీసుకోవటం ఫస్ట్ స్టెప్. తరువాత అధికంగా సంపాదించాలన్న వేరే వారి ఆశని ఆసరాగా తీసుకుని, వారి అవసరం కోసం అప్పు ఇచ్చి, అవసరం తీరక ముందే గొంతు మీద కూర్చుని వసూలు చేసి బాగుపడే దాన్నే బ్యాంకు అంటారు.
ఇం. క. : డెఫినిషన్ బాగుంది. ఏ పుస్తకంలో చదివావ్?
తేజ : పుస్తకాలు చదివే అలవాటు లేదు సర్. ఎప్పుడో వాట్సప్‍లో చూసి ఉంటాను.
ఇం. క. : మనం ఇచ్చిన అప్పు కస్టమర్ కట్టటం లేదనుకో. ఆ డబ్బు వసూలు చెయ్యటానికి ఏం చేస్తావ్?
తేజ : వెనకటి సినిమాల్లో కాబూలీ వాలాలు ఉండేవారు. బ్రతిమాలో, బెదిరించో, భయపెట్టో ఎలాగోలా డబ్బులు వసూలు చేసేవారు. అదే పాలసీ ఫాలో అవుతాను.
ఇం. క. : అయినా ఎదురు తిరిగితే?
తేజ : ముందు మనమే నాలుగు వడ్డించేస్తే సరిపోతుంది.
మళ్లీ ఒకరినొకరు చూసుకుని విచిత్రంగా నవ్వుకున్నారు.
ఇం. క. : ఆఖరి ప్రశ్న. నువ్వు మా ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావ్?
తేజ : ఇంకో గతిలేక.
ఇం. క. : వెల్ డన్. నూటికి నూరు శాతం కరెక్ట్ మాట చెప్పావ్. నీకు ఈ ఉద్యోగం వచ్చింది.
తేజ : మీకు కూడా ఇంకో గతి లేదన్న మాట. కానీ నేను ఈ ఉద్యోగం చెయ్యాలంటే బయట నా ఫ్రెండు ఉన్నాడు. వాడికి కూడా ఉద్యోగం ఇవ్వాలి.
ఇం. క. : వాడిది కూడా నీలాంటి బ్రెయినేనా?
తేజ : నాకంటే పెద్ద లుచ్ఛా లఫంగా గాడు.
ఇం. క : అయితే ఇద్దరికీ ఉద్యోగం ఇస్తున్నాం…
తేజ : జీతం ఎంత సార్? (మొదటిసారి కొద్ది వినయాన్ని మాటల్లో రంగరించి ఆనందంగా అడిగాడు)
ఇం. క. : (మొదటిసారి ఇబ్బందికరంగా ఫీలింగ్స్ పెట్టారు ఉమ్మడిగా) “ఇదొక కొత్త రకం సెల్ఫ్ ఎంప్లాయ్‍మెంట్ స్కీం లాంటిదనుకో. మీరు వసూలు చేసే సొమ్ములో 10% ఇస్తాం.”
తేజ : ఏమీ వసూలు కాకపోతే?
ఇం. క. : మీ సామర్ధం మీద మాకే అంత నమ్మకం ఉంది. మీకు లేదా?
“ఫ్రీగా ఇస్తున్నపుడు ఓన్లీ ఇన్‍కమింగ్ అయితే మాత్రం వద్దనటం ఎందుకని ఒప్పుకున్నాను. ఆ విధంగా మా ఇద్దరికీ ఆ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది.” ఫ్లాష్‍బాక్ ముగిస్తూ అన్నాడు.
పై నుండి ఓంకార్ గురక వినిపిస్తోంది.