Read Burglars by SriNiharika in Telugu Detective stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఇంటిదొంగలు

ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసెఫ్ లు మేనేజర్ గున్నారెడ్డి ఎదుట దోషుల్లా నిలుచున్నారు. గతదినం తాను ఛార్జ్ తీసుకున్న మొత్తం సొమ్ము…ఏ ఎ.టి.ఎమ్. లో ఎంత లోడ్ చేసాడో…బ్యాలెన్స్ ఎంత వుండాలో – వేసిన లెక్కలే వేస్తూ బుర్ర పగులగొట్టుకుంటున్నాడు ఏడుకొండలు. “మీకు ఇరవయ్ నాలుగు గంటల వ్యవధి ఇస్తున్నాను. రేపు ఈపాటికల్లా సొమ్ము తెచ్చి జమకట్టకపోతే, విషయం ఎమ్డీగారి వరకూ వెళుతుంది. ఆయనకు తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా? మీ ఉద్యోగాలు ఊడడమే కాదు, మీరంతా జెయిలు ఊచలు లెక్కపెట్టడం ఖాయం…” అంటూ తీవ్రంగా హెచ్చరించాడు మేనేజర్…

జంటనగరాలలోని బ్యాంక్స్ యొక్క ఎ.టి.ఎమ్స్. లో క్యాష్ లోడ్ చేసే కంపెనీ, ‘ఎక్స్-వై-జెడ్ కరెన్సీ’ లో ఆ ఉదయం గొప్ప కలకలం రేగింది. అందుక్కారణం – పది లక్షల క్యాష్ మిస్ అవుతోంది. 


ముందురోజున ఎ.టి.ఎమ్స్. లో  క్యాష్ లోడ్ చేసిన ఎగ్జిక్యూటివ్ సాయంత్రం పని ముగించుకుని కంపెనీకి తిరిగిరాగానే మిగిలిన క్యాష్ ని సూపర్ వైజర్ కి అప్పగించవలసియుంది. ఆత్యవసరంగా ఎక్కడికో వెళ్ళవలసియుండడంతో క్యాష్ ని లాకర్ లో పెట్టి తాళంవేసి వెళ్ళిపోయాడు – మర్నాడు అప్పగించవచ్చునని. కానీ, మర్నాడు లాకర్ లోంచి  క్యాష్ ని తీసి లెక్కపెడితే పది లక్షలు తగ్గాయి! 


ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసెఫ్ లు మేనేజర్ గున్నారెడ్డి ఎదుట దోషుల్లా నిలుచున్నారు. గతదినం తాను ఛార్జ్ తీసుకున్న మొత్తం సొమ్ము…ఏ ఎ.టి.ఎమ్. లో ఎంత లోడ్ చేసాడో…బ్యాలెన్స్ ఎంత వుండాలో – వేసిన లెక్కలే వేస్తూ బుర్ర పగులగొట్టుకుంటున్నాడు ఏడుకొండలు. 


“మీకు ఇరవయ్ నాలుగు గంటల వ్యవధి ఇస్తున్నాను. రేపు ఈపాటికల్లా సొమ్ము తెచ్చి జమకట్టకపోతే, విషయం ఎమ్డీగారి వరకూ వెళుతుంది. ఆయనకు తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా? మీ ఉద్యోగాలు ఊడడమే కాదు, మీరంతా జెయిలు ఊచలు లెక్కపెట్టడం ఖాయం…” అంటూ తీవ్రంగా హెచ్చరించాడు మేనేజర్…




ఏం జరిగిందో తెలిసినవాడు జోసెఫ్ ఒక్కడే!!... జోసెఫ్ కి నలభయ్యేళ్ళుంటాయి. భార్య, స్కూల్లో చదువుకుంటూన్న ఇద్దరు పిల్లలు, విధవరాలైన తల్లి, పెళ్ళికి ఎదిగిన చెల్లి – ఇవీ అతని బాధ్యతలు. మొదట్లో అద్దె ఆటో నడిపేవాడు. అప్పుడు రాబడి పరవాలేదు. కానీ ఓలా, ఊబర్ సంస్థలు రంగప్రవేశం చేసాక క్యాబ్ కల్చర్ పెరిగి ఆటోలకు గిరాకీ తగ్గిపోయింది. 


అయిదేళ్ళ క్రితం తెలిసినవారి సిఫారసుతో ‘ఎక్స్-వై-జెడ్ కరెన్సీ’ కంపెనీలో వ్యాన్ డ్రైవరుగా ఉద్యోగం దొరికింది జోసెఫ్ కి. స్వతహాగా నిజాయితీపరుడతను. అయితే, అవసరం ఎటువంటివాడినైనా మార్చేస్తుందేమో!


శీతాకాలం కావడంతో తల్లికి ఆస్త్మా ఉధృతమయింది. సర్కారు దవాఖానాలో ఇచ్చే మందులు పనిచేయడంలేదు. ప్రైవేట్ డాక్టర్ కి చూపించి మందులు కొని వాడాలి. అందుకు ఖర్చు బాగానే అవుతుంది. అది చాలదన్నట్టుగా, జోసెఫ్ భార్యకు గైనిక్ సమస్య ఏదో వచ్చింది. సర్జరీ చేయాలంటున్నారు డాక్టర్స్. అందుకు మూడు లక్షలైనా అవుతుందన్నారు. అంత సొమ్ము ఎక్కణ్ణుంచి తేవాలో బోధపడలేదు జోసెఫ్ కి. 


అదిగో, అప్పుడే వచ్చింది అతనికి ఆ ఆలోచన!... నగరంలోని బ్యాంకుల ఎ.టి.ఎమ్స్ లో రోజూ క్యాష్ నింపుతుంటుంది తమ కంపెనీ. ట్రంక్ పెట్టెల్లో కరెన్సీ కట్టలు పెట్టుకుని వ్యాన్ లో బయలుదేరతాడు ఎగ్జిక్యూటివ్. సెక్యూరిటీగా ఓ గన్ మేన్ ఉంటాడు. జోసెఫ్ ఆ వ్యాన్ ని నడుపుతాడు…వీలు చూసుకుని, తన అవసరానికి ఆ సొమ్ములో కొంత సంగ్రహించాలని నిశ్చయించుకున్నాడు జోసెఫ్. వారం రోజులుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ అవకాశం ఆ రోజు వచ్చింది.  

ఉదయం నుండీ నగరంలో పలుప్రాంతాలలోని ఎ.టి.ఎమ్స్ లో క్యాష్ నింపాడు ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు. సాయంత్రం అమీర్ పేటకు వచ్చేసరికి టీ త్రాగడం కోసం ఓ చోట వెహికిల్ని ఆపించాడు. జోసెఫ్ ని చూసుకోమని చెప్పి అతను,  సెక్యూరిటీ గార్డ్ గఫూర్ రోడ్ కి అవతలిపక్కనున్న రెస్టారెంటుకు వెళ్ళారు.
లోడ్ చేయవలసిన ఎ.టి.ఎమ్స్ ఇంకా కొన్ని మిగిలివున్నాయి. ప్రతిసారీ తాళం వేయడం, తీయడం విసుగ్గా అనిపించి ట్రంక్ పెట్టెలకు తాళం వేయడంలేదు ఏడుకొండలు. ఆ సంగతి జోసెఫ్ గమనించాడు.


కొలీగ్స్ ఇద్దరూ రెస్టారెంటు లోపలికి వెళ్ళగానే క్రిందకు దిగాడతను. వెనుకనుండి వ్యాన్ లో ప్రవేశించాడు. ఓ ట్రంక్ పెట్టె తెరిస్తే అయిదువందల రూపాయల సరిక్రొత్త నోట్లకట్టలు పలుకరించాయి. ఆలస్యం చేయకుండా వివిధ వరుసలలోంచి ఓ పది కట్టలు తీసుకున్నాడు. 
అది చలికాలం కావడంతో కోటు తొడుక్కున్నాడు అతను. కోటు బటన్స్ విప్పి, లోపల ఉన్న షర్ట్ వి పైరెండు బటన్సూ విప్పాడు. ఒక్కొక్క కట్టే షర్ట్ లోపలికి జారవిడిచాడు. షర్ట్ బటన్స్ పెట్టేసుకుని, కడుపు ఎత్తుగా కనిపించకుండా సరిచేసుకున్నాడు. కోటు బటన్స్ కూడా పెట్టేసుకుని, వ్యాన్ దిగి ముందుకు వచ్చాడు. ఏమీ ఎరుగనట్టు డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. 


కొంతసేపటికి టీ త్రాగడానికి వెళ్ళినవాళ్ళు తిరిగివచ్చారు. పేపర్ కప్పుతో తీసుకొచ్చిన టీని జోసెఫ్ కి ఇచ్చాడు గఫూర్. టీ త్రాగేసి, వాళ్ళు ఎక్కగానే వ్యాన్ ని స్టార్ట్ చేసాడు జోసెఫ్…
డ్యూటీ అయిపోగానే వ్యాన్ ని గరేజ్ లో పెట్టేసి, రోజుటిలా ఆఫీసు  లోపలికి వెళ్ళకుండానే ఇంటికి బయలుదేరాడు జోసెఫ్. త్రోవలో ఓ షాపింగ్ మాల్ లో ప్రవేశించాడు. అక్కడ చిన్న బ్రీఫ్ కేస్ ఒకటి కొని వాష్ రూమ్ కి వెళ్ళాడు. గెడ వేసుకుని, షర్ట్ లోపలి నుండి నోట్లకట్టలను బైటకు తీసి బ్రీఫ్ కేసులో పెట్టాడు. డ్రెస్ సరిచేసుకుని బ్రీఫ్ కేసుతో వాష్ రూమ్ లోంచి బైటపడ్డాడు. బిల్లింగ్ కౌంటర్ కి వెళ్ళి బ్రీఫ్ కేసుకు బిల్లు చెల్లించి, మాల్ లోంచి బయటకు నడిచాడు.


కొంతదూరం వెళ్ళి బస్టాండులో నిలుచున్నాడు అతను. పావుగంట తరువాత ఇంటికి వెళ్ళే సిటీబస్ వచ్చింది. బస్ లోపల చాలా రద్దీగా ఉంది. ఎలాగో త్రోసుకుని బస్  ఎక్కాడు. జనంలోకి చొచ్చుకుపోయాడు. 
జోసెఫ్ కి రెగ్యులర్ బస్ పాస్ ఉంది. అది చొక్కాజేబులో ఉంది. కోటు బటన్స్ విప్పితే కానీ దాన్ని తీయడం వీలుపడదు. ఓ చేతిలో బ్రీఫ్ కేసు ఉంది. రెండో చేతిని కదపడానికి వీలుకాని పరిస్థితి. 


కండక్టర్ విసుక్కున్నాడు. “పెట్టెను క్రిందపెట్టి పాస్ తీయవయ్యా మగడా!” అంటూ. 


జోసెఫ్ అతను చెప్పినట్టే చేసాడు. 


సిటీబస్ దిగాక బస్టాపు నుండి పది నిముషాల నడక అతని ఇంటికి. బ్రీఫ్ కేసును పట్టుకుని నడుస్తూంటే, ఆకాశంలో తేలిపోతున్నట్టుంది అతనికి. అంత పెద్ద మొత్తం తన జీవితంలో కళ్ళచూడలేదు. ఆనాటితో తన కష్టాలన్నీ తొలగిపోతున్నందుకు మిక్కిలి ఆనందంగా ఉంది. 
ఇంటికి చేరుకోగానే తిన్నగా బెడ్ రూమ్ కి వెళ్ళి బ్రీఫ్ కేసును మంచం క్రింద దాచాడు. బాత్ రూమ్ కి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. అనంతరం పడగ్గది మూసుకుని ‘ఓ దయగల ప్రభువా!’ అంటూ ప్రార్థన చేసాడు. తరువాత బ్రీఫ్ కేసును తీసి హుషారుగా తెరిచాడు. అతని గుండె గుభేలుమంది. 
లోపల నోట్లకట్టలు లేవు! పాత వార్తాపత్రికల దొంతర ఒకటి ఉంది!!


షాక్ తో కొయ్యబొమ్మలా బిగుసుకుపోయిన జోసెఫ్, కొన్ని సెకన్లపాటు ఊపిరి పీల్చుకోవడం మరచిపోయాడు. ఓ పక్క అయోమయం, మరోపక్క ఎనలేని నీరసం ఆవరించుకున్నాయి అతన్ని. 


బ్రీఫ్ కేసు వంక పరీక్షగా చూసాడు. అంతకుముందు షాపింగ్ మాల్ లో తాను కొన్న లైట్ బ్రౌన్ కలర్ బ్రీఫ్ కేసు అదే! వాష్ రూమ్ లో షర్ట్ లోంచి నోట్లకట్టలు తీసి అందులో పెట్టాడు తాను. నోట్లకు బదులు ఆ పాత పేపర్లు  అందులోకి ఎలా వచ్చాయో బోధపడడంలేదు. 


ఆలోచిస్తూంటే…సిటీబస్ లో పాస్ తీయడం కోసం క్రింద పెట్టినప్పుడు బ్రీఫ్ కేసు మారిపోయివుండాలి అనిపించింది. పొరపాటున మారిందో, లేక అది దొంగల పనో అర్థంకాలేదు… చేతికి వచ్చిన సొమ్ము చేజారిపోయింది. ’వ్రతం చెడ్డా, ఫలం దక్కలేదు!’ … జోసెఫ్ కి దుఃఖం ముంచుకొచ్చింది…
మర్నాడు డ్యూటీకి వెళ్ళాక సొమ్ము పోయినట్టు తెలిసి మేనేజర్ రంకెలు వేస్తూంటే భయం వేసింది జోసెఫ్ కి. ‘కంపెనీ పోలీసు కంప్లెయింట్ ఇస్తే…ఆ సొమ్ము తన దగ్గర దొరికుంటే…’ – అటుపైన జరిగే పరిణామాలను ఊహించుకోవడానికే ధైర్యం చాల్లేదు అతనికి. తనను కాపాడేందుకే ‘ప్రభువు’ రాత్రి ఆ సొమ్మును తనవద్ద నుండి పోగొట్టివుంటాడనిపించింది. మదిలోనే జీసస్ కి ధన్యవాదాలు  తెలుపుకున్నాడు.

మరుసటి దినం ‘ఎక్స్-వై-జెడ్ కరెన్సీ’  కంపెనీకి పోలీసులు వచ్చారు…రెండు రోజుల క్రితం పోలీసులు ఓ పాత నేరస్థుణ్ణి పట్టుకున్నారు. వాడు అర్థరాత్రి తప్పతాగి ఇంటికి వెళుతూ బీట్ కాన్ స్టబుల్స్  దృష్టిలో పడ్డాడు. వాడి చేతిలో బ్రీఫ్ కేస్ ఉండడం చూసి అనుమానంతో చెక్ చేస్తే, అందులోంచి పది లక్షల విలువచేసే సరికొత్త ఐదువందల రూపాయల నోట్ల కట్టలు బైటపడ్డాయి. ఆ సొమ్ము తనదేనంటూ బుకాయించబోయాడు వాడు. తరువాత లంచం ఇవ్వబోయాడు. పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి ఉతకడంతో, అసలు సంగతి బైటపెట్టాడు.


‘ఆ రోజు రాత్రి బ్రీఫ్ కేసుతో ఓ షాపింగ్ మాల్ నుండి బైటకు వచ్చిన ఓ వ్యక్తిని అనుసరించాడు వాడు. త్రోవలో ఓ షాపునుండి అలాంటిదే ఓ బ్రీఫ్ కేసును కొన్నాడు. అతనితోపాటే సిటీబస్ ఎక్కి రద్దీగా ఉన్న సమయంలో ఆ వ్యక్తి యొక్క బ్రీఫ్ కేసును మార్చేసాడు. అలా బ్రీఫ్ కేసులు, బ్యాగ్ లూ మార్చేయడం వాడి వృత్తి. పదిలక్షల రూపాయలు దొరకడంతో, బార్ కి వెళ్ళి ఆనందంతో పూటుగా త్రాగాడు. ఇంటికి వెళ్తూ పోలీసులకు పట్టుబడిపోయాడు.


నోట్లకట్టల పైన ‘ఎక్స్-వై-జెడ్ కరెన్సీ’ కంపెనీ లేబుల్స్ ఉన్నాయి. అందుకే ఆ దొంగనూ, బ్రీఫ్ కేసునూ తీసుకుని ఆ కంపెనీకి వచ్చి ఎమ్.డి. ని కాంటాక్ట్ చేసారు పోలీసులు…’ 


మేనేజర్ గున్నారెడ్డిని తన ఛాంబర్ కి పిలిపించాడు ఎమ్.డి. రెండు రోజుల క్రితం ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు పదిలక్షల రూపాయలు పోగొట్టుకున్న విషయం వివరించాడు మేనేజర్. పోలీసులకు దొరికిన సొమ్ము తమ కంపెనీదేనని చెప్పాడు.


రికార్డ్స్ తెప్పించి, ఆ రోజు ఏడుకొండలికి ఇష్యూ చేయబడ్డ నోట్ల సీరియల్ నంబర్లను పరిశీలించారు పోలీసులు. దొంగ దగ్గర దొరికిన బ్రీఫ్ కేసులోని నోట్లకట్టల మీది నంబర్స్ తో అవి సరిపోయాయి. ఆ సొమ్ము ఆ కంపెనీదేనని నిర్ధారింపబడింది. 

పోలీసులు ఏడుకొండల్ని పిలిపించి విచారించారు. సొమ్ము పోవడం నిజమేననీ, కానీ అది ఎలా పోయిందో తెలియడంలేదనీ చెప్పాడు ఏడుకొండలు. తన కొలీగ్స్ మీద తనకు అనుమానం లేదన్నాడు…అనంతరం సెక్యూరిటీ గార్డ్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసెఫ్ లను విడివిడిగా విచారించారు. తమకు ఆ డబ్బు సంగతి ఏమీ తెలియదన్నారు ఇద్దరూ…మేనేజర్ – తన విచారణలో ఆ ముగ్గురు ఉద్యోగులూ నమ్మకస్తులేననీ, తనకు వారెవరి మీదా అనుమానం లేదనీ నొక్కి వక్కాణించాడు. 


ఎన్ని విధాలుగా ప్రశ్నించినా, తాను ఆ సొమ్మును కంపెనీ నుండి దొంగిలించలేదనీ, సిటీబస్ లో ఆ బ్రీఫ్ కేసును కొట్టేసిన మాట నిజమనీ మొత్తుకున్నాడు దొంగ. ఆ సొమ్ము అదృశ్యంలో లోపలివారి హస్తం ఉండవచ్చుననిపించింది పోలీసులకు. అప్పటికప్పుడే ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటుచేసారు.
కంపెనీ సిబ్బంది అందరినీ వరుసగా నిలబెట్టి, వారిలో ఎవరి దగ్గర నుండి బ్రీఫ్ కేసు కొట్టేసాడో గుర్తుపట్టమన్నారు దొంగను…వాడు ఒక్కొక్కరినే పరీక్షగా చూస్తూ వస్తూంటే, జోసెఫ్ కి ముచ్చెమటలు పట్టాయి. 


అందరినీ చూసి, పెదవి విరిచాడు దొంగ. తన దృష్టి బ్రీఫ్ కేసు మీదే ఉండడంవల్ల దాని యజమాని ముఖం తాను సరిగా చూళ్ళేదని చెప్పాడు... జోసెఫ్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. 


ఎమ్.డి. తో సహా అందరి వద్దా వ్రాతమూలకంగా స్టేట్ మెంట్స్ తీసుకున్నారు పోలీసులు. 


అజాగ్రత్తతో కంపెనీ సొమ్మును పోగొట్టినందుకు ఏడుకొండల్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించాడు ఎమ్.డి.  ఆ విషయం వెంటనే తన దృష్టిలోకి తీసుకురాకుండా దాచినందుకు మేనేజర్ని ఛెడామడా తిట్టాడు.


కేసు నమోదుచేసి దొంగను, సొమ్మును కోర్టులో హాజరుపరుస్తామనీ, ఆనక కంపెనీ తమ సొమ్మును కోర్టు ద్వారానే తీసుకోవలసియుంటుందనీ చెప్పారు పోలీసులు. సమన్స్ వచ్చినప్పుడు వారంతా కోర్టుకు హాజరు కావలసియుంటుందని హెచ్చరించారు.
అయితే – కొద్ది గంటలలోనే ఆ కేసు కొత్త మలుపు తిరగబోతోందన్న విషయం ఎరుగరు ఎవరూ!
వారం రోజుల తరువాత – ‘ఎక్స్-వై-జెడ్ కరెన్సీ’ కంపెనీ ఆఫీసు, ఎమ్.డి., మేనేజర్, ఎగ్జిక్యూటివ్స్ నివాసాల పైన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒకేసారి రెయిడ్ చేసారు. మేనేజర్ గున్నారెడ్డి ఇంట్లో సుమారు రెండుకోట్ల రూపాయల విలువచేసే ఫేక్ కరెన్సీ - సరికొత్త ఐదువందల రూపాయల డినామినేషన్ వి దొరికాయి! గున్నారెడ్డి అరెస్ట్ చేయబడ్డాడు. 


ఆ రెయిడ్స్ కి దారితీసిన కారణాలలోకి వెళ్తే –
దొంగ దగ్గర బ్రీఫ్ కేసులో దొరికిన నోట్లకట్టలను కోర్టులో జమచేసే ముందు, పోలీసులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పరీక్షార్థం పంపడం జరిగింది. ఆ టెస్ట్ ఫలితాలు వారిని నివ్వెరపరచాయి. 
ఆ సొమ్ములో నాలుగో వంతు నోట్లు నకిలీ అని తేలింది!!


‘ఎక్స్-వై-జెడ్ కరెన్సీ’ కంపెనీలోకి నకిలీ నోట్లు ఎలా వచ్చాయా అని అయోమయంలో పడిపోయారు పోలీసులు. అది సింపుల్ ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ కేసు కాదనీ, సీరియస్ వ్యవహారమనీ గుర్తించి – ఆ కేసును క్రైమ్ బ్రాంచ్ కి బదిలీచేయడం జరిగింది. 
క్రైమ్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శివరామ్ ఆ కేసు యొక్క పూర్వాపరాలను అధ్యయనం చేసాడు. ఆ కంపెనీ ఎమ్.డి. తో సహా క్యాష్ ని హ్యాండిల్ చేసే ముఖ్య సిబ్బంది యొక్క యాంటిసిడెంట్స్ ని రహస్యంగా విచారించాడు…ఎ.టి.ఎమ్స్ లో దొంగనోట్లు వస్తున్నాయంటూ కస్టమర్స్ నుండి తరచు ఫిర్యాదులు వస్తున్నా, అంతవరకు వాటిని ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్టు కనపడదు. దాన్ని క్షుణ్ణంగా పరిశోధించాలని నిశ్చయించుకున్నాడు.


ముందుగా ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతిని పొంది నగరంలోని ఎ.టి.ఎమ్స్. అన్నిటినీ తెరిపించి, వాటిలో మిగిలియున్న నోట్లను స్వాధీనం చేసుకున్నాడు ఇన్స్ పెక్టర్. ఎ.టి.ఎమ్స్ ని ఫ్రెష్ క్యాష్ తో నింపించాడు. అలా స్వాధీనం చేసుకున్న నోట్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి పరీక్ష చేయించాడు. వాటిలో నకిలీ నోట్లు కొన్ని వున్నట్టు తేలింది. దాంతో ‘ఎక్స్-వై-జెడ్ కరెన్సీ’ మీద అనుమానం కలిగింది. కోర్ట్ నుండి సెర్చ్ వారెంట్స్ సంపాదించి అకస్మాత్తుగా సోదాలు జరిపాడు. ఫలితంగా, ‘మేనేజర్ చేప’ వలలో చిక్కుకుంది…


ఇంటరాగేషన్ లో గున్నారెడ్డి అంతా కక్కేసాడు - ’ఏడాది క్రితం ఇద్దరు వ్యక్తులతో పరిచయమయింది అతనికి. అది స్నేహంగా మారి, ‘బిజినెస్’ పార్ట్ నర్స్ ని చేసింది. వాళ్ళకు నకిలీ నోట్లు సరఫరా చేసే ముఠాతో సంబంధముంది. ఒకటికి మూడింతలు లాభం వుంటుంది. గున్నారెడ్డి ఎ.టి.ఎమ్స్ లో క్యాష్ లోడ్ చేసే కంపెనీకి మేనేజర్ కనుక ఫేక్ కరెన్సీని మార్చడం కష్టంకాదు. అసలుకు, నకిలీకీ తేడా తెలియనంత పక్కాగా వున్న నోట్లను చూస్తే గున్నారెడ్డికి ఆశ పుట్టింది. వారితో చేతులు కలిపాడు. ఒక లక్ష  అసలు నోట్లకు మూడు లక్షల నకిలీ నోట్లు ఇస్తున్నారు వాళ్ళు…మూడోకంటికి తెలియకుండా దాదాపు ఏడాదిగా వ్యవహారం సాగిస్తున్నాడతను. కంపెనీలో వేరెవరికీ ఆ సంగతి తెలియదు…ఏడుకొండలు సొమ్ము పోగొట్టుకుని వుండకపోతే ఆ రహస్యం అంత త్వరగా బైటపడేది కాదు…’ - మేజిస్ట్రేట్ సమక్షంలో గున్నారెడ్డి వాంజ్ఞ్మూలం నమోదుచేయబడింది.
గున్నారెడ్డికి నకిలీ నోట్లను సరఫరాచేసే ముఠాను పట్టుకోవడానికి వలపన్నాడు ఇన్స్ పెక్టర్ శివరామ్. గున్నారావు అరెస్టు, అతని వద్ద నకిలీనోట్లు లభ్యమైన వైనమూ గోప్యంగా ఉంచాడు. ‘కొత్త సరుకు కావాలంటూ’ గున్నారావు చేత అతని పార్ట్ నర్స్ కి వాట్సాప్ మెసేజ్ పంపించాడు. నిర్ణీత సమయంలో, నిర్ణీత ప్రదేశానికి ‘సరుకు’ తో వచ్చిన ఆ వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. 


వారి పరీక్షలో ఆ ‘ర్యాకెట్’ యొక్క ‘కింగ్ పిన్’ వివరాలు బయటపడ్డాయి. అతను పశ్చిమ బెంగాలుకు చెందిన ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనీ, పాసయి అయిదేళ్ళయినా ఉద్యోగం దొరకలేదనీ, చివరకు అ ‘దందా’ లోకి దిగాడనీ, హౌరాలోని తన ఇంట్లోనే నోట్లను ముద్రించి, తన నెట్ వర్క్ తో దేశమంతటా సర్క్యులేట్ చేస్తాడనీ చెప్పారు ఆ వ్యక్తులు. 

శివరామ్ వెంటనే కోల్ కత్తా వెళ్ళి, లోకల్ పోలీసుల సహకారంతో ఆ కింగ్ పిన్ స్థావరంపైన రెయిడ్ చేసి అతన్నీ, అతని అనుచరులనూ అరెస్ట్ చేసాడు. నోట్ల తయారీలో ఉపయోగించే కంప్యూటర్ వగైరా ఆధునిక పరికరాలనూ, ఇంక్రిమినేటింగ్ డాక్యుమెంట్స్ నీ స్వాధీనం చేసుకున్నాడు. ‘ట్రాన్సిట్ వారెంట్’ తో నిందితులను హైదరాబాద్ కి తీసుకొచ్చాడు. 


వారి ఇతర లింకులను గూర్చి ఇంటరాగేట్ చేయడం కోసం, కింగ్ పిన్ యొక్క పోలీస్ కస్టడీని కోరుతూ కోర్ట్ కి అర్జీ తయారుచేస్తూన్న ఇన్స్ పెక్టర్ కి హఠాత్తుగా అనిపించింది – ‘నకిలీనోట్లు పట్టుబడ్డపుడల్లా పొరుగుదేశాల నుండి వస్తున్నాయన్న ఆరోపణలు తప్ప…ఇంటిదొంగలపైన ఎవరూ దృష్టి సారించకపోవడం శోచనీయం!’.
ఇకపోతే – ‘ఎజ్ఫిక్యూటివ్ ఏడుకొండలి కస్టడీలోని పదిలక్షల క్యాష్ ఎలా మాయమయిందా?’ అన్నది మిస్టరీగానే మిగిలిపోయింది అందరికీను – ఒక్క జోసెఫ్ కి తప్ప!