అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన్ రోడ్ కి దూరంగా ఉండడంతో పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఓసారి బిల్డింగ్ చుట్టూ తిరిగొచ్చి మెయిన్ గేట్ ని చేరుకున్నాను. ఇనుపగేట్ పైకెక్కి లోపలికి దిగాను. సెక్యూరిటీ లాడ్జ్ లోపల కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు వాచ్ మేన్. మెల్లగా తట్టిలేపాను. ఉలికిపడి లేచి, ‘కౌన్ హై?’ అన్నాడు. మాట్లాడకుండా పిస్టల్ బట్ తో తలపైన కొట్టాను. తల వాల్చేసాడు.
గెస్ట్ హౌస్ ముఖద్వారానికి టూ-వే లాక్ ఉంది. పిస్టల్ ని కీహోల్ లో పెట్టి షూట్ చేసాను. సైలెన్సర్ అమర్చబడియున్నందున్న శబ్దం రాలేదు. తాళం తెరచుకుంది.
. లోపల పెద్ద హాలు, రెండు గదులు, కిచెను, మేడపైకి మెట్లూ ఉన్నాయి. హాల్లో డిమ్ లైట్ వెలుగుతోంది. ఓ గదికి బైట గెడపెట్టి వుంటే, రెండవది దగ్గరగా మూసివుంది. ఆ గది దగ్గరకు వెళ్ళి తలుపు తెరచి చూసాను. పనివాళ్ళు కాబోలు – ఆడ, మగ – సింగిల్ కాట్ మీద నిద్రపోతున్నారు. తలుపు మూసేసి బైట గెడ పెట్టేసాను.
మెట్లెక్కి మేడపైకి వెళ్ళాను. రెండు గదులు ఉన్నాయి పైన. వాటి తలుపులు మూసివున్నాయి. ఓ గది తలుపు తెరచి చూసాను. ఖాళీ బెడ్ రూమ్ అది. రెండవ గదిలో డబుల్ కాట్ బెడ్ మీద అర్థనగ్నంగా ఓ యువతిని కావలించుకుని నిద్రపోతున్నాడు ధర్మారావు. నా టార్గెట్ వాడే!
యాభయ్యేళ్ళుంటాయి అతనికి. పాలకవర్గానికి చెందిన ఓ ముఖ్య రాజకీయనాయకుడు. పేదల భూములు, స్థలాలూ అన్యాయంగా ఆక్రమించుకుంటూ ‘కబ్జాకింగ్’ అన్న పేరు సంపాదించాడు. ఇంట్లో భార్య ఉన్నా, వీకెండ్స్ లో గెస్ట్ హౌసులో కోరిన స్త్రీలతో కులుకుతుంటాడు.
ధర్మారావును చంపడానికి ఎందుకు వచ్చానో తెలియాలంటే, ముందుగా నాగురించి తెలియాలి…..
#
నేను ఓ ప్రొఫెషనల్ కిల్లర్ ని. ‘సుఫారీ’ ఇస్తే ఎవరినైనా చంపేస్తాను. కారణంతో నాకు సంబంధంలేదు. ఎందుకంటే మనుషుల మీద, సమాజం మీద కసి, పగాను నాకు. అందుక్కారణం – నా కల్లోలపు బాల్యం.
అమ్మ, నాన్నలది ప్రేమ వివాహం. నాన్న ఏం పని చేసేవాడో తెలియదు. అమ్మ ఓ బట్టలకొట్టులో సేల్స్ గాళ్ గా పనిచేసేది. నాన్న రోజూ త్రాగొచ్చి డబ్బులు ఇవ్వమంటూ అమ్మను చితగ్గొట్టేవాడు. నా మూడో ఏటను మమ్మల్ని వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు నాన్న. అమ్మ అందంగా ఉంటుంది. ఎప్పట్నుంచో తనమీద కన్నేసిన షాపు యజమాని, అమ్మ దుస్థితిని ఆసరాగా తీసుకుని బలాత్కరించి లొంగదీసుకున్నాడు. బైటకు చెప్పుకుంటే ఉన్న ఆ ఒక్క ఆధారమూ పోతుందనీ, నేను పస్తులు వుండవలసివస్తుందనీ భయపడింది అమ్మ. కొన్నాళ్ళ తరువాత అమ్మను తన స్నేహితులతో పంచుకోనారంభించాడు అతను. అప్పటికి ఆరేళ్ళు వచ్చాయి నాకు.
మార్పు ఎలా జరిగిందో తెలియదు, నాకు పదేళ్ళు వచ్చేసరికి అమ్మ ‘వ్యభిచారిణి’ అయింది. విటులు ఇంటికి వచ్చేవారు. అలా సంపాదించినదానితో నాకు ఏ లోటూ లేకుండా చూసుకునేది అమ్మ. కానీ, తన ఆరోగ్యం క్షీణించసాగింది. ఓ చిన్న అద్దెకొంపలో ఉండేవాళ్ళం మేము. ఒకటే గది, బైట చిన్న అరుగు. ఎవరైనా వచ్చినప్పుడు నన్ను అరుగుపైన నులకమంచం వేసి పడుకోబెట్టేది అమ్మ.
వయసు పెరుగుతూంటే, రకరకాల వ్యక్తులు మా ఇంటికి రావడం నాకు నచ్చేదికాదు. కొందరు ఎందుకో అమ్మతో గొడవపడేవారు. మరికొందరు కొట్టేవారు కూడాను. అమ్మ నిశ్శబ్దంగా ఏడ్వడం నాకు తెలిసేది. నాకోసమే వాళ్ళను భరిస్తోందని నేను ఎరుగుదును. వాళ్ళను ఏదైనా చేయాలన్న కసిగా ఉండేది నాకు. నేను బడికి వెళ్ళడం మానేసాను. ఎందుకంటే, ‘మీ అమ్మ వ్యభిచారిణి’ అంటూ తోటిపిల్లలు హేళనచేసేవారు నన్ను.
తరచుగా ఓ వ్యక్తి అమ్మ దగ్గరకు వచ్చేవాడు. నలభయ్యేళ్ళుంటాయి అతనికి. పోలీస్ ఇన్స్ పెక్టరట. డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఎదురు లంచంకోసం అమ్మను వేధించేవాడు. లేదంటే కొట్టి హింసించేవాడు. జెయిల్లో పెడతానని బెదిరించేవాడు.
అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించుకుపోవడంతో రావడం మానేసారంతా. ఇల్లు గడవడం కష్టమయిపోయింది. పోలీసాయన మాత్రం వచ్చి డబ్బులకోసం వేధిస్తుండేవాడు…ఓ రోజున త్రాగొచ్చి నీరసంగా ఉన్న అమ్మపైన బలవంతంగా పడడమే కాక, డబ్బులు లేవందని బెల్టుతో ఇష్టం వచ్చినట్టు బాదసాగాడు అతను.
ఇక చూస్తూ ఊరుకోలేకపోయాను నేను. లోపలికి పరుగెత్తి, ఏం జరుగుతోందో గ్రహించేలోపునే, రాగానే జేబులోంచి తీసి మంచం మీద పెట్టిన అతని పిస్టల్ ని అందుకున్నాను. కసిదీరా అతన్ని కాల్చేసాను. కుప్పలా కూలిపోయాడు.
అలా పదో ఏటను - మొదటిసారిగా – నేను ‘కిల్లర్’ ని అయ్యాను…నన్ను తీసుకుని ఊరు వదలి పట్టణం పారిపోయింది అమ్మ. ఓ స్కూటర్ గరేజ్ లో పనికి కుదిరాను నేను. ఆర్నెల్లు తిరక్కుండానే అనారోగ్యంతో అమ్మ మరణించింది. మునుసిపాలిటీవాళ్ళు అమ్మ శవాన్ని తీసుకుపోతూంటే ఏడుస్తూ చూడడం మినహా ఏమీ చేయలేకపోయాను. ఒంటరిపక్షిలా మిగిలిపోయిన నేను మనుషుల మీద, సమాజం మీద కసి పెంచుకున్నాను. దేవుడి మీద కూడా! ఏం పాపం చేసామని, మా జీవితాలు అలా నాశనంచేసాడు?
అనంతరం నాకు తెలియకుండానే ప్రొఫెషనల్ కిల్లర్ గా ఎదిగాను. నా ప్రొఫెషన్ నాకు సంతృప్తినిస్తోంది – ఆ విధంగా సమాజం మీద పగ తీర్చుకుంటున్నందుకు. నాన్న కనిపిస్తే నా పిస్టల్ లోని గుళ్ళన్నీ అతని శరీరంలో దింపాలన్నంత కక్షగా ఉంది నాకు - ప్రేమ పేరుతో అమ్మను మోసగించి తన జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేసినందుకు!
#
ఇప్పుడు నా వయసు పాతికేళ్ళు. అండర్ గ్రౌండ్ సర్కిల్స్ లో ‘షార్ప్ షూటర్’ నన్న పేరు సంపాదించాను. ఇన్నేళ్ళలో నా గురి తప్పడం ఎన్నడూ జరుగలేదు. అలాగే, ఎగ్జిక్యూషన్లోనూ ఏ చిన్న పొరపాటూ చేయలేదు. అలా జరిగిననాడు నా ప్రొఫెషన్ ని వదిలేస్తానని ఛాలెంజ్ కూడా చేసాను…
ప్రస్తుతానికి వస్తే… ధర్మారావు నగరంలోని ఓ ప్రముఖ రియాల్టర్ ని చంపడానికి నాకు ‘సుఫారీ’ ఇచ్చాడు. ఆ రియాల్టర్ ని చంపేసాక నామీద హత్యాప్రయత్నం జరిగింది. ఎలర్ట్ గా ఉన్నందున బతికిపోయాను. నన్ను చంపబోయినవాణ్ణి పట్టుకుని చితగ్గొడితే, వాడు చెప్పిన విషయం నాకు గొప్ప షాక్ కలిగించింది. ఎప్పటికైనా తన పేరు బైటకు రావచ్చునన్న ఆలోచనతో ధర్మారావు, నన్ను లేపేయమన్నాడట! అతని కుట్రకు నా ఒళ్ళు ఉడికిపోయింది. అతన్ని చంపేయడానికి నిశ్చయించుకున్నాను.
ధర్మారావు గాఢనిద్రలో ఉన్నాడు. గదిలో టీపాయ్ మీదున్న పింగాణీ ఫ్లవర్ వేజ్ ని తీసి నేలకేసి కొట్టాను. పెద్దగా శబ్దం చేస్తూ పగిలిపోయింది అది. ఆ శబ్దానికి నిద్రిస్తూన్నవాళ్ళు త్రుళ్ళిపడి లేచారు.
నన్ను చూడగానే పక్కలో బాంబు ప్రేలినట్టు అదిరిపడ్డాడు ధర్మారావు. “ఏయ్, ఎవరు నువ్వు?” కంగారుగా లేచి కూర్చుంటూ అడిగాడు. “నీ మృత్యువును!” కరకుగా జవాబిచ్చాను.
తలగడ క్రింద చేయి పెట్టబోయాడు అతను, ఆయుధం కోసం కాబోలు. చటుక్కున జేబులోంచి పిస్టల్ తీసి షూట్ చేసాను. అతని చేతినుండి రక్తం చిప్పిల్లింది. గిలగిలలాడిపోయాడు.
ఆ యువతికి పాతికేళ్ళుంటాయి. భయంతో ‘కెవ్వున’ అరచి ఒంటికి దుప్పటి చుట్టుకుని బెడ్ మీంచి క్రిందకు ఉరికింది. బాత్ రూమ్ వైపు పరుగెత్తింది. లోపల దూరి తలుపు మూసుకుంది.
“ఎ…ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావ్?” ముఖంలో భయం ప్రస్ఫుటమవుతూంటే కంపించే స్వరంతో అడిగాడు ధర్మారావు.
“కిల్లర్!” దర్పంగా అన్నాను నేను. “నీ దగ్గర సుఫారీ తీసుకుని రియాల్టర్ ని చంపినవాణ్ణి”.
“నువ్వా! నీ సొమ్ము నీకు ముట్టిందిగా?” అడిగాడు అతను.
“సొమ్ము ముట్టింది కానీ లెక్కలు తేలలేదు” అన్నాను కటువుగా.
“అంటే? నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని వచ్చావా?”
“షటప్!” కోపంగా అరచాను నేను. “నేను కిల్లర్ ని. నీలా చీట్ ని కాదు. నీ గుట్టు బైటపడుతుందన్న భయంతో నన్ను లేపేయడానికి నీ మనిషిని పంపించావు నువ్వు”.
ఖంగుతిన్నాడు అతను. “సారీ! పొరపాటయిపోయింది. నీకు ఏం కావాలో చెప్పు”.
“నీ ప్రాణాలు!” కర్కశంగా అన్నాను.
అదిరిపడ్డాడు అతను. “ప్లీజ్! నన్నేమీ చేయకు. నువ్వు కోరినంత సొమ్ము ఇస్తాను” ప్రాధేయపడ్డాడు.
జవాబుగా నా చేతిలోని పిస్టల్ ప్రేలింది. చావుకేక పెట్టి బెడ్ మీద కుప్పకూలిపోయాడు.
వచ్చిన దారినే కూల్ గా బైటకు నడచాను నేను.
#
హై ప్రొఫైల్ వ్యక్తుల కిల్లింగ్ తరువాత కొన్నాళ్ళపాటు సిటీలో ఉండను నేను. ఆ గొడవ సద్దుమణిగాక తిరిగివస్తుంటాను. ఈసారి ఒడిస్సాలోని కటక్ కి వెళ్ళాను. బారాబత్తీ స్టేడియమ్ సమీపంలో ఓ గది అద్దెకు తీసుకున్నాను. అప్పుడప్పుడు భువనేశ్వర్ కి వెళ్ళొస్తూండేవాణ్ణి. అక్కడే పరిచయమయింది నందిని నాకు.
భువనేశ్వర్ లో రెడ్ లైట్ ఏరియాలుగా పేరుగాంచిన స్ట్రీట్ లైట్ ఏరియా, రాజ్ మహల్ స్క్వైర్ లలో పట్టపగలే పబ్లిక్ గా వ్యభిచారం సాగడం చకితుణ్ణి చేసింది నన్ను. స్త్రీలు కొందరు యూనిట్-2 వెనుకపక్క చేరి తమ హొయలతో, పలుకులతో విటులను ఆకర్షించుకునేందుకు ప్రయత్నించడమూ, బేరసారాలు సాగిస్తూండడమూ నాకంట పడేది
ఓ రాత్రి రాజ్ మహల్ స్క్వైర్ లోని ‘కోటీ’ కి వెళ్ళాను నేను, అక్కడ ‘గానాబజానా’ ఉంటుందని తెలిసి…ఓ చిన్న సైజు వేదిక మీద డ్యాన్స్ చేస్తోంది ఓ యువతి. ఇరవై రెండేళ్ళు ఉంటాయి. స్లిమ్ గా, తెల్లగా, పొడవుగా ఉంది. చూపులు మరల్చుకోలేనంత అందం…యువకులు, నడివయస్కులతో కూడుకున్న ఆడియన్స్ ని ఉర్రూతలూగించేస్తోంది.
అంతవరకూ ఎందరో స్త్రీలను చూసాను నేను. మరెందరితోనో అనుభవం ఉంది నాకు. కానీ, తొలిచూపులోనే నా మనసును దోచుకున్న మొదటి స్త్రీ ఆమె...ఆ ‘కోటీ’ యజమానురాలికి అడిగినంత డబ్బిచ్చి ఆ రాత్రికి నందినితో గడిపేందుకు ఏర్పాటుచేసుకున్నాను.
ఒరియా యువతి ఆమె. పేరు ‘నందిని’ అని చెప్పింది. ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాను నేను…నందినిది ఒడిశ్శాలోని కేంద్రపారా. నాలుగేళ్ళ క్రితం ఒకడు ప్రేమిస్తున్నానంటూ ఇంటినుండి లేపుకువచ్చేసాడు. మోజు తీరాక భువనేశ్వర్ లోని ఆ కోటీకి అమ్మేసాడు…ఆమె వెక్కివెక్కి ఏడుస్తూంటే అమ్మ గుర్తుకు వచ్చింది నాకు.
నా దవడలు బిగుసుకోవడం చూసి, కించిత్తు కంగారుగా అడిగిందామె ఒరియాలో – “కోన హల్లా?” (ఏమయింది?).
“కిచ్చీ నై” (ఏమీ లేదు), తల అడ్డుగా త్రిప్పాను. ఆ నెల్లాళ్ళలో ఒరియా కొద్దిగా పట్టుకున్నాను నేను.
ఎలాగైనా ఆమెను అక్కణ్ణుంచి తప్పించి పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను నేను.
నాగురించి ఆమె దగ్గర ఏదీ దాచలేదు నేను. నా వృత్తి గురించి ఆలకించి భయంతో గుండెలపైన చేతులు వేసుకుంది. “మన పెళ్ళయ్యాక ఆ వృత్తిని మానేస్తాను. దూరంగా ఎక్కడికైన వెళ్ళి గౌరవంగా బతుకుదాం” అంటూ హామీ ఇవ్వడంతో, నాతో పెళ్ళికి ఒప్పుకుందామె. అయితే అక్కడనుండి బయటపడడం అంత సులభం కాదంది.
“అవసరమైతే వీళ్ళందరినీ చంపి అయినాసరే నిన్ను తీసుకువెళతాను” అన్నాను నేను కించిత్తు ఆవేశంగా. నవ్విందామె. “తర్కార్ నై, ము ఆసిబి” (అవసరంలేదు, నేనే వస్తాను) అంది.
నందినిని రోజూ వెళ్ళి కలిసేవాణ్ణి. నేనిక హైదరాబాద్ కి తిరిగివెళ్ళవలసిన సమయం అయింది. నందిని నుండి వీడ్కోలు తీసుకుంటూ, బిగియార కౌగలించుకుని గాఢంగా పెదవులమీద ముద్దు పెట్టుకున్నాను. “ఛాడంతు, సబొ దేఖ్ చంతి” (వదలండి, అందరూ చూస్తున్నారు)” అంది సిగ్గుతో ముడుచుకుపోతూ.
ఆ సిగ్గులు నాసొంతం కావాలి. త్వరలోనే వచ్చి ఆమెను తీసుకువెళతానని చెప్పాను. ఇప్పటికే అందరికీ అనుమానంగా ఉందనీ, నన్ను రావద్దనీ, అదను చూసుకుని తానే తప్పించుకుని వచ్చేస్తాననీ చెప్పింది. హైదరాబాదులోని నా చిరునామా తీసుకుంది.
#
ఓ క్యాబరే డ్యాన్సర్ ని చంపడానికి ‘సుఫారీ’ అందింది నాకు. ఓ నైట్ క్లబ్ లో పనిచేస్తోందామె…ఆ రాత్రి ఆ నైట్ క్లబ్ కి వెళ్ళాను. విశాలమైన హాల్లో ఓ పక్క బార్, మరోపక్క డ్యాన్స్ ఫ్లోర్ ఉన్నాయి. హాల్లోని టేబుల్స్ గెస్టులతో నిండిపోయివున్నాయి. చాలమంది డ్రింక్ చేస్తున్నారు. డిమ్ లైట్ వెలుగుతోంది. ఆ రోజు నా టార్గెట్ యొక్క డ్యాన్స్ ఉన్నట్టు నిర్ధారించుకుని, ఓమూలగా క్రీనీడలో ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాను నేను.
హఠాత్తుగా డ్యాన్స్ ఫ్లోర్ పైన కలర్ లైట్స్ ఫోకస్ చేయబడ్డాయి. వెనుకనున్న స్క్రీన్ మీద ‘సోనియా’ అన్న అక్షరాలు ఫ్లాష్ అయ్యాయి. ఓ యువతి ప్రత్యక్షమయింది…ముఖానికి సన్నటి నెట్టెడ్ ముసుగు, అర్థనగ్నపు దుస్తులలో ఉన్న ఆమెను చూడగానే హాల్లో ఈలలు, కేకలు, చప్పెట్లూ మార్మ్రోగాయి.
డ్యాన్స్ చేస్తూంటే ఆమె ప్రతిభంగిమా అందంగా అలరిస్తోంది. ఆమెలో నైపుణ్యం ప్రస్ఫుటమవుతూ మైమరపింస్తోంది…సోనియాని చంపవలసివచ్చినందుకు ఓ క్షణం నా మనసు గింజుకుంది. కానీ, నాలోని ‘కిల్లర్’ బయటకు వచ్చి గట్టిగా నెత్తిమీద మొట్టాడు నన్ను.
ప్రోగ్రామ్ ముగియగానే ఫ్లయింగ్ కిసెస్, చప్పెట్ల మధ్య అదృశ్యమయిపోయింది సోనియా. కూర్చున్నచోటు నుండి లేచి, గ్రీన్ రూమ్ వైపు నడచాను నేను.
గదిలో ఆరెంజ్ కలర్ లైట్ వెలుగుతోంది. సోనియా డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉంది. ఆమె వీపు గుమ్మంవైపు ఉండడంతో నన్ను చూళ్ళేదు. చప్పుడుకాకుండా వెళ్ళి పిస్టల్ని ఆమె డొక్కకు ఆనించి పాయింట్ బ్లాంక్ లో షూట్ చేసాను. సైలెన్సర్ వల్ల శబ్దం రాలేదు. ముందుకు ఒరిగిపోయిందామె.
గది తలుపు మూసి బైట గెడపెట్టేసాను. హాలు దాదాపు ఖాళీ అయిపోయింది. హత్య చేసాక డ్రింక్ చేయడం అలవాటు నాకు. బార్ కి వెళ్ళి డ్రింక్ ఆర్డర్ చేసాను.
త్రాగుతూంటే, ఎంత మెల్లగా మాట్లాడుకుంటున్నా, బార్ మెన్ పలుకులు నా చెవిలో పడుతున్నాయి…‘ఈరోజు సోనియా మేడమ్ డ్యాన్స్ సరికొత్తగా ఉందికదూ?’ అన్నాడు ఒకడు.
రెండోవాడు గొంతు తగ్గించి, ‘నీకో విషయం చెప్పనా? ఇందాక డ్యాన్స్ చేసింది సోనియా మేడమ్ కాదు. ఆమె ఫ్రెండ్. మేడమ్ కి ఒంట్లో బాగోలేదు. డ్యాన్స్ చేయలేనంటే మేనేజర్ ఊరుకోడు. అందుకే తనను చూడ్డానికి వచ్చిన ఆమె ఫ్రెండ్, మేడమ్ బదులు తాను ఫ్లోర్ ఎక్కుతానందట. ఇద్దరూ ఇంచుమించు ఒకేలా ఉందడంతో ఎవరికీ అనుమానం రాలేదు…’
‘అంటే, ఇప్పుడు డ్యాన్స్ చేసింది వేరే అమ్మాయా!?’ విస్తుపోయాడు మొదటివాడు.
‘ఇష్! గట్టిగా అనకు. ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి. లేకపోతే సోనియా మేడమ్ జాబ్ ఊడిపోతుంది’ నోటిపైన వ్రేలేసుకుని చిన్నగా హెచ్చరించాడు రెండవవాడు.
ఉలిక్కిపడ్డాను నేను. ఎక్కుతున్న నిషా సర్రున దిగిపోయింది. ఇన్నేళ్ళ వృత్తిలో ఎన్నడూ పొరపాటు చేయలేదు. వారి పలుకులే నిజమైతే, నా టార్గెట్ కి బదులు ఎవరో అమాయకురాలు బలయిపోయింది!
లేచి, గ్రీన్ రూమ్ కి పరుగెత్తాను. బైట గెడ అలాగే ఉంది. తలుపు తెరచుకుని లోపలికి వెళ్ళాను.
ఆ యువతి ప్రాణం పోయింది. జేబులోంచి సోనియా ఫొటో తీసి చూసాను. తరువాత ఆ యువతిని వెనక్కి త్రిప్పి ముఖం పరీక్షగా చూసాను.
అంతే! మిన్ను విరిగి మీద పడినట్టయింది. నా కాళ్ళక్రింద భూమి కదలుతున్నట్టనిపించింది. “నందినీ…!” అంటూ అరచాను.
ఏం జరిగుంటుందో అర్థమయిపోయింది నాకు…చెప్పినట్టే కోటీ నుండి ఎలాగో తప్పించుకుని పారిపోయి హైదరాబాద్ వచ్చుంటుంది నందిని. ముందుగా స్నేహితురాలు సోనియాని కలిసి తరువాత నా దగ్గరకు రావాలనుకునివుంటుంది. అనుకోకుండా స్నేహితురాలికి బదులు తాను డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కవలసివచ్చింది. ముఖానికి పరదా ఉండడంతో పోల్చుకోలేకపోయాను నేను. సోనియా అనుకుని నందినిని చంపేసాను…
హఠాత్తుగా జబ్బుపడ్డవాడిలా అయిపోయాను. నా మనసు దోచుకున్న తొలి స్త్రీ, నన్ను మనిషిగా మార్చాలనుకున్న స్త్రీ – నా నందినిని - నేనే చంపేసానన్న వాస్తవం మదిలో ములుకులా పొడుస్తూంటే, ట్రాన్స్ లో ఉన్నవాడిలా బైటకు నడచాను.
‘మనిషి చేసే పాపం ఎప్పటికైనా పామై తిరగబడి కాటేయకమానదురా, కన్నా!’ అనేది అమ్మ. నిజమే, నేను ఘోరపాపం చేసాను.
చటుక్కున ఆగిపోయాను. జేబులోంచి పిస్టల్ తీసి నా కణతకు గురిపెట్టుకున్నాను. వ్రేలు నా ప్రమేయం లేకుండానే ట్రిగ్గర్ నొక్కింది.....