Read MeToo by SriNiharika in Telugu నాటకం | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

మీ టూ

“సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బెదిరించేస్తే అబ్బాయి అమ్మాయిని ముట్టుకోవడానికే భయపడిపోతాడు. ఇంక ఆపండి” ఒక పెద్దావిడ విసుక్కుంది. మీ టూ...         “మొదటిరాత్రే ఆ అమ్మాయిని భయపెట్టేయకురా అని నీకు ముందు నుంచీ చెబుతూనే  ఉన్నాం. విన్నావా?  భార్యాభర్తలన్న మాటేగానీ అసలు మీ ఇద్దరి మధ్యనా ఏం పరిచయం ఉదని? నెమ్మదిగా  ఆ మాటా  ఈ మాటా మాట్లాడి, దగ్గిరతనాన్ని పెంచుకోవాలి.  నీ మీద నమ్మకాన్ని కలిగించాలి. ఆ తరువాత నువ్వు ఏం చేసినా కాదననలేని స్థితికి చేరుకుంటుంది. చదువుకున్న వాడివి నువ్వు కూడా ఇలా మొరటుగా ప్రవర్తిస్తావనుకోలేదు”     ప్రహ్లాద్‍కి చీవాట్లు పెడుతూ అన్నారు  స్నేహితులు.  “మరేం ఫరవాలేదులే.  ఇవాళైనా కనీసం తొందరపడకుండా ఆమెతో మనసు విప్పి మాట్లాడు. ఒకరినొకరూ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తరువాతే  శృంగారానికి ప్రయత్నించు”   అంటూ హితబోధలు చేసారు.ప్రహ్లాద్ వాళ్ళ మాటలకి సమాధానం చెప్పకుండా అతడి ఆలోచనలో అతడున్నట్టుగా తల దించుకున్నాడు. తన భార్య  నీహారికకీ తనకీ మొదటి రాత్రి ‘జరగాల్సిన విషయం’ జరగలేదన్న బాధని  స్నేహితులతో పంచుకున్నప్పుడు స్నేహితులు దాన్ని ఆ విధంగా విశ్లేషించారు.  కానీ ప్రహ్లాద్‍కి మాత్రం  ఆమె తనకి చేరువ కాకపోవడానికి కారణం  వాళ్ళనుకుంటున్నట్టుగా తమకి  అవగాహన లేకపోవడం, తను తొందరపడడం వంటివి కాదని తెలుస్తూనే ఉంది. తామిద్దరూ చదువుకున్నవాళ్ళు.   శృంగారం అంటే తెలియని వాళ్ళేం కాదు. ఒకరినొకరూ ఇష్టపూర్వకంగానే పెళ్ళి  చేసుకున్నారు.  మరి అలా ఎందుకయ్యింది?!  అతడికి ముందు రోజు రాత్రి జరిగిన  సంగతులు  గుర్తుకొచ్చాయి.శోభనం గదిలో ముందుగా పూలతో నిండుగా అలంకరించిన పందిరిమంచమ్మీద  ఇద్దరినీ కూర్చో పెట్టి బంతులాట ఆడించారు అమ్మలక్కలు.   ప్రహ్లద్ నీహారిక మీదకి ఉత్సాహంగా బంతిని  విసురుతుంటే “మా అమ్మాయి ఈ పూబంతికన్నా సుకుమారం. కొంచెం జాగ్రత్త నాయనా”  అందొక అమ్మలక్క. “మంచమ్మీద చల్లిన మల్లెపూలు కూడా నలక్కుండా కార్యం చక్కబెట్టుకోవాలి. అప్పుడే నువ్వు మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోగలవని మాకు అర్ధమౌతుంది”  ఇంకో ఆవిడ నవ్వుతూ అంది.“సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బెదిరించేస్తే అబ్బాయి అమ్మాయిని ముట్టుకోవడానికే భయపడిపోతాడు. ఇంక ఆపండి” ఒక  పెద్దావిడ విసుక్కుంది.కొద్దిసేపటి  తరువాత సుముహూర్తం దగ్గరపడుతోందని  గదిలో  ఇద్దరినీ వదిలేసి  అందరూ బయటికి వెళ్ళిపోయి తలుపు బయట నుంచి గడియ వేసారు.   గదిలో మంచానికిటువైపు అతడు, అటువైపు ఆమె మాత్రం మిగిలారు.మౌనాన్ని ఛేదించాల్సిన పని తనదేనని అర్ధమైందతడికి. అమెతో అప్పటివరకూ తనెన్నిసార్లు మాట్లాడాడో లెక్కపెట్టుకున్నాడు. పెళ్ళి చూపుల్లో ఒక సారి,  పెళ్ళి కుదిరాక ఫోన్లలో రెండు మూడు సార్లు,  ఎంగేజ్ మెంట్లో  పది నిమిషాలు, ఆ తరువాత ఫోన్లో మరో రెండు మూడు సార్లు. పెళ్ళి కుదిరిన దగ్గరనుంచీ ఆమెతో ఏదేదో మాట్లాడలని చాలా అనిపించేది కానీ  ఇద్దరివీ సంప్రదాయ కుటుంబాలు కావడంతో  అంతకు మించి అవకాశం దొరకలేదు.  ఇప్పుడు తమ ఏకాంతాన్ని అడ్డుకోవడానికి ఎవరూ లేరు.   ఉత్సాహంగా లేచి ఆమె దగ్గరగా నడిచాడు.  ఆమె వంక చూసి చిన్నగా నవ్వాడు.  ఆమె కూడా నవ్వింది.అతడికి ఏమ్మాట్లాడాలో అర్ధం కాలేదు.   ‘మాటలు తరువాత. కాలాన్ని  వృధా చెయ్యకు’ అని లోపలనుంచెవరో హెచ్చరిస్తున్నట్టనిపిస్తుంటే,  అన్నీ మర్చిపోయి ఆమెని రెండు భుజాలూ పట్టుకుని పైకి లేపాడు.చేతికి సున్నితంగా,  సుకుమారంగా తగిలిన ఆమె భుజాల స్పర్శ అతడికి గమ్మత్తుగా అనిపించింది.  ఊహించని అతడి చర్యకి తత్తరపడినట్టుగా ఆమె కనురెప్పలు అల్లాడిస్తుంటే, క్లోజప్ లో ఆమె  ముఖాన్ని మొదటిసారి చూస్తున్న అతడికి కాటుక పెట్టుకున్న ఆమె పెద్ద పెద్ద  కళ్ళు మరింత అందంగా కనిపించాయి. చెక్కిళ్ళమీద చెంపల క్రింద చిరు చెమటలు  గులాబీ రేకుమీద మెరుస్తున్న నీహారికా బిందువుల్లా అనిపించాయి.ఆశ్చర్యంతో చిన్నగా తెరిచిన ఆమె నోరు ఎర్రని   మధుపాత్రలా  అనిపించి,  తెలుగు కూడా సరిగ్గా రాని తనకి ఇంత కవిత్వం ఎలా వచ్చేస్తోందా అని ఆశ్చర్యంగా అనిపించింది అతడికి.  అమెనంత దగ్గరగా చూస్తుంటే, మన్మధుడు బాణాలతో ఒళ్ళంతా కితకితలు పెడుతున్నట్టు  ఎవేవో పులకింతలు.ఒక చిన్న రాపిడి అంతటి వేడిని పుట్టించగలదనీ,  ఒక వేడి సెగ అంతటి సౌఖ్యాన్నిస్తుందనీ మొదటిసారి తెలిసింది. మరింత వేడిని రాజేయాలన్నట్టుగా అతడు ఇంకొంచెం  కదిలాడు. ‘అయ్యో మేము నలగకూడదని అమ్మలక్కలు హాస్యానికి అన్నారు. మీకు సౌఖ్యాన్నివ్వడానికి కాకపోతే మేమిక్కడున్నది ఎందుకు?’ అనుకున్నాయి మంచమ్మీద ఉన్న మల్లెలు వాళ్ళిద్దరూ అలా నిలబడే ఉండడంతో. మల్లెల బాధని మన్మధుడు అతడి చెవులకి చేరవేసాడేమో అన్నట్టుగా  అతడు ఆమెని మంచమ్మీద కూర్చోపెట్టాడు.ఆతడి పెదవులు ఆమె మెడ  ఒంపులోంచి ఎద ఒంపులోకి చేరాయి. చేతులు మాత్రం నడుము ఒంపులోంచి కదలమన్నాయి.  ఆ మారం ఎంత సేపు గడిచిందో ఇద్దరికీ తెలియలేదు. ఆరాటంలో దుస్తుల పరదాలు తొలగించబోయాడు అతడు.  పరిగెత్తి, పరిగెత్తి  ఉరకలెత్తే సెలయేరు నదిలో కలిసే సమయానికి... నెమ్మదించినట్టుగా...  పాలపొంగు మీద ఎవరో నీరు చిలకరించినట్టుగా...  ఉవ్వెత్తున ఎగసిన కెరటం తీరం చేరకుండానే వెనక్కి తగ్గినట్టుగా...  ఇద్దరూ ఆగిపోయారు. కాస్సేపు ఇద్దరూ ఒకరితో ఒకరూ మాట్లాడుకోలేదు.“సారీ...”  వినీ వినపడనట్టుగా నెమ్మదిగా అంది ఆమె.   ఆమె సారీ చెబితే అతడికి గిల్టీగా అనిపించింది. “వైవాహిక  జీవితం అంటే  కేవలం మొదటి రాత్రి మాత్రమే కాదు.  జీవితంలో అనుభవించడానికి ఇంకా ఎన్నెన్నో రాత్రులుంటాయి”   ఆలోచిస్తున్న ప్రహ్లాద్ భుజం తడుతూ  అన్నాడు ఒక స్నేహితుడు.****జరిగిన విషయాన్ని ప్రహ్లాద్ తన స్నేహితులకైతే చెప్పగలిగాడు కానీ  పెద్దవాళ్ళకి చెప్పుకోలేకపోయారు ఇద్దరూ.  ఆచారం ప్రకారం ఆ ముచ్చట మూడు  రోజులు జరగాలి.   రెండో రోజు కూడా ఇద్దరినీ పూలతో అలంకరించిన పందిర మంచం మీద కూర్చోపెట్టి బంతులాట ఆడించారు. అమ్మలక్కలు. ఆటపట్టించి, జాగ్రత్తలు చెప్పారు. కాస్సేపటి తరువాత బయటకి వెళ్ళి తలుపులు వేసేసారు.మళ్ళీ ఇద్దరూ మిగిలారు గదిలో.  ముందురోజు  జరిగినదాని తాలూకు గిల్టీ ఫీలింగ్, ఖంగారూ ఇద్దరిలో  ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  అయినా సాధ్యమైనంత మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు.   కాస్సేపు ఎవేవో మాట్లాడుకున్నారు.  ఆ విషయంలో చొరవ తీసుకుంటే ఏమనుకుంటుందో, తీసుకోకపోతే ఏమనుకుంటుందో అని కాస్సేపు   మీమాంశ పడ్డాడు అతడు. ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. చివరికి అతడు చొరవ తీసుకున్నాడు కానీ ఎందుకో ముందు రోజు ఉన్న ఆవేశం అప్పుడు లేదు. ఆమె అతడికి  సహకరించాలని ప్రయత్నించింది కానీ, ఆ ‘సహకారం’  బలంగా లేదు.మంచమ్మీద పూలకి ఆరోజు కూడా నిరశే ఎదురయ్యింది.****          “కొంత మంది స్త్రీలు మరీ సుకుమారంగా ఉంటారు. వైవాహిక జీవితానికి వాళ్ళు అంత వెంటనే సిద్దపడలేరు. డాక్టర్లు దాన్ని ‘ఫ్రిజిడిటీ’ అనో ఇంకేదో అంటారు.  అలాంటి వాళ్ళతో మరింత సున్నితంగా  వ్యవహరించాలి.  జీవితాంతం చెయ్యాల్సిన సహజీవనాన్ని ఒక్క మూడు రాత్రులు నిశ్చయించకూడదు.  కొన్నాళ్ళు ఇద్దరూ కేవలం స్నేహితులుగా ఉండండి చాలు.  అన్నీ అవే సర్దుకుంటాయి”  తిరుగు ప్రయాణమౌతున్న  స్నేహితులు  సలహా ఇచ్చారు ప్రహ్లాద్‍కి.            ప్రహ్లాద్ వాళ్ళ మాటలకి  సరేనన్నట్టుగా  తలాడించాడు కానీ,  నిజానికి అతడు ఆలోచిస్తున్న విషయం వేరే ఉంది.  కొద్ది సేపటికే అతడు ఒక నిశ్చయానికి వచ్చాడు.****          అదే గది, అదే పందిరిమంచం...  దుప్పట్లు మారాయి. పూలు మారాయి.  యధావిధిగా మంచానికి ఇటు అతడు. అటు ఆమె...          “నీతో ఒక విషయం మాట్లాడాలి” అన్నాడు అతడు.          ఆమె  తల పైకెత్తి చూసింది. పంచె కట్టుకుని, దానిమీద కట్ బనియన్ వేసుకుని మగసిరితో మెరుస్తున్న అతడి ముఖం గంభీరంగా ఉంది.  “మొదటి రాత్రి మన మధ్యన జరిగినది మా స్నేహితులకి చెప్పాను. వాళ్ళేమన్నారో తెలుసా?  కొంతమంది అమ్మాయిలు చాలా సుకుమారంగా ఉంటారనీ, పెళ్ళైన కొత్తలో చాలా రోజులు వాళ్ళలో ఫ్రిజిడిటీ ఉంటుందనీ, అందుకే మన మొదటి రాత్రి ఫెయిలందనీ అన్నారు. బహుశా నువ్వు కుడా అలాగే అనుకుని  ఉంటావు. అందుకే వెంటనే నాకు సారీ చెప్పావు. అవునా?!”           ఆమె మాట్లాడకుండా అతడ్నే చూసింది. “కానీ నీకూ, మా స్నేహితులకీ తెలియని విషయం ఒకటుంది. మన మొదటి రాత్రి విఫలమవ్వడానికి  అసలు కారణం నువ్వు కాదు. నేను !!”ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని  అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. “రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లవుతాయి.  శృంగారం కూడా అంతే.   నిన్ను చూడగానే ఆవేశపడ్డ నేను అసలు విషయం దగ్గరకి వచ్చేసరికి చల్లబడిపోవడానికి కారణం నాలో ఉన్న ఒక గిల్టీ ఫీలింగ్.  అసలు నేను నీకు మొదటి రాత్రే ఈ విషయాన్ని చెప్పి ఉండాలి. కానీ, భయం వల్ల  చెప్పలేకపోయాను. ఇప్పటికి కూడా అసలు విషయాన్ని నీకు చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను. అందుకే చెప్పాలన్న  నిశ్చయానికి వచ్చేను”          తన ముఖాన్ని ఆమెకి చూపించలేనట్టుగా అటువైపు తిరిగి కన్ఫెషన్ ఇస్తున్నట్టుగా చెప్పుకుపోతున్నాడు అతడు  “నా జీవితంలో నువ్వు మొదటి స్త్రీవి కాదు. నాకు ఇంతకు ముందే శృంగార అనుభవం ఉంది.  నాకు ఇష్టం లేకపోయినా బలవంతమ్మీద ఒక అమ్మాయితో తప్పు చేసాను నేను.  చదువుకునే రోజుల్లో  మా పక్కింట్లో ఉండే ఒక అమ్మాయి నాతో క్లోజ్ గా ఉండేది. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో నన్ను ఇంటికి రమ్మని పిలిచి రెచ్చగొట్టింది.  వయసు ప్రభావం, సినిమాల  ప్రభావంతో  నేనేం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితిలో,  ఆవేశంలో ఆ క్షణంలో అమెతో తప్పు చేసాను.  తరువాత తరువాత నేను  చేసిన పని  నాకు  చాలా గిల్టీఫీలింగ్ కలుగ చేసేది. చాలా మంది మగాళ్ళలా ఈ విషయాన్ని నేను మామూలుగా తీసుకోలేకపోయాను. ఎంత మర్చిపోదామనుకున్నా ఆ విషయం పదే పదే గుర్తొచ్చి నన్ను ఇబ్బంది పెట్టేది. అసలు పెళ్ళికి ముందే ఈ విషయం నీకు చెప్పి,  నీకు ఇష్టమైతేనే పెళ్ళి చేసుకుందామనుకున్నాను. కానీ నా స్నేహితులు  వద్దని వారించారు. ఇలాంటి అనుభవాలు ఆ వయసులో చాలామందికి సహజమేననీ,  వాటిని బయటకి చెప్పడం వల్ల  సజావుగా సాగిపోవాల్సిన వైవాహిక జీవితం మీద వాటి దుష్ప్రభావం పడుతుంది కనుక  దాన్ని ఒక  ‘పీడకల’ గా  భావించి మర్చిపొమ్మని సలహా ఇచ్చారు.          వాళ్ళ సలహా మేరకు ఆ సంగతిని నేను నీ దగ్గర దాచాను కానీ, నిన్ను ఆలింగనం చేసుకుని దగ్గరకి తీసుకుంటున్న క్షణంలో నాకు నేను చేసిన తప్పు గుర్తుకు వచ్చి నా మూడ్ పాడైపోతోంది. నేను పవితృడ్ని కాదనీ,  నిన్ను పొందే అర్హత లేదని నా మనసు హెచ్చరిస్తున్నట్టనిపించి ఆవేశం అంతా  పాలపొంగు మీద నీళ్ళు చల్లినట్టు చల్లబడిపోతోంది.   నాలో ఆ గిల్టీ ఫీలింగ్ పోనంత వరకూ నేను నీతో సంసారం చెయ్యలేను.          అందుకే జరిగినది నీకు చెప్పేసాను.  ఈ సంగతి పెళ్ళికి ముందే  చెప్పకుండా నిన్ను మోసం చెయ్యడం నా తప్పే. అందుకు నన్ను క్షమించు.  జరిగినదంతా విన్నాక కూడా నేను నీకు అంగీకారమైతేనే నీ జీవితంలో కొనసాగుతాను. లేకపోతే జరిగినదాంట్లో నీ తప్పేంలేదని అందరికీ చెప్పేసి నీ జీవితంలోంచి తప్పుకుంటాను...”          అతడి ముఖంలో పశ్చాత్తాపం. ఆమె ఎలా స్పందిస్తుందా అన్నట్టుగా ఉద్విగ్నంగా చూస్తున్నాడతడు ఆమె వైపు.           కొద్ది సేపు ఆమె ఏమీ మాట్లాడలేదు.  తర్వాత  సూటిగా అతడి కళ్ళలోకి చూస్తూ అంది “మీకు జరిగిన ఈ అనుభవమే నాకు జరిగిందని  నేను చెబితే మీరు ఎలా రియాక్టయి ఉండేవారు?”           ఆమె ప్రశ్నకి అతడొక్క క్షణం తడబడ్డట్టుగా చూసాడు. ఆ తరువాత నెమ్మదిగా అన్నాడు “శీలం అన్నది శరీరానికి సంబధించినది కాదు. మనసుకి సంబంధించినది. ఆ విషయంలో ఆడైనా మగైనా ఒకటే.  మన ప్రమేయం లేకుండా బలవంతంగా  జరిగిన దాన్ని మన తప్పుగా భావించకుండా, ఒక పీడకలగా భావించి మర్చిపోవడమే మంచిది. తప్పు చేసిన స్థితిలో ఉన్నాను కనుక ఇలా చెప్పడం లేదు. ఇది నా అభిప్రాయం.   అందుకే జరిగిన దాన్ని నేను నీకు చెప్పలేదు. కానీ నా గిల్టీ  ఫీలింగ్ నన్ను నిలవనివ్వడంలేదు కనుక చెప్పాలి వచ్చింది”   అతడి గొంతులో సిన్సియారిటీ  ధ్వనించింది.          కొద్ది సేపు అక్కడ మౌనం రాజ్యమేలింది.  కాస్సేపటి తరువాత అతడి దగ్గరకి వచ్చిన ఆమె ఒక స్నేహితురాలిలా అతడి భుజమ్మీద చెయ్యి వేసింది.          “మీ ప్రమేయం లేకుండా జరిగిన దాని గురించి బాధపడుతూ జీవితాన్ని నాశనం చేసుకోవడం  నిజంగానే అవివేకం. దాన్ని ఒక పీడకలగా భావించి మర్చిపొండి”           అతడి కళ్ళు మెరిసాయి. “నన్నర్ధం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. నాలోని గిల్టీ ఫీలింగ్ పోయి నేను మామూలు మనిషిని కావడానికి కొద్ది రోజులు సమయం పడుతుంది. అప్పటిదాకా మనం స్నేహితుల్లా ఉందాం”  అన్నాడు.ఆమె అతడ్ని జాలిగా చూసింది. అతడిని సాధ్యమైనంత తొందరగా ఆ విషయం మర్చిపోయేలా చేయడం తన బాధ్యత అనిపించిందామెకి ఆ క్షణంలో. అందుకు  తన వంతు  తను చేసే ప్రయత్నంగా ఆమె రెండు  చేతులతో అతడి  నడుముని చుట్టేసి అతడి కళ్ళలోకి ప్రేమగా చూసింది.  *****          మర్నాడు సాయంత్రం గుడి దగ్గర ఎవరూ చూడకుండా నీహారిక స్నేహితురాలు రమ్య ప్రహ్లాద్‍ని కలుసుకుంది.          “నాకు నీహారిక అంతా చెప్పింది.  ఇన్నాళ్ళూ మేమతా ఎంతలా కౌన్సిలింగ్ చేసినా రాని మార్పు ఆమెలో ఒక్కరోజులో చూసాను. చెయ్యని తప్పుని మీ మీద వేసుకుని మా స్నేహితురాలి జీవితాన్ని నిలబెట్టారు. మీకెలా కృతజ్ఞతలు  చెప్పాలో తెలియడం లేదు.  మీ సంస్కారానికి  చేతులెత్తి మొక్కాలి” అంది రెండు చేతులూ జోడిస్తూ.          “నీహారిక మీ స్నేహితురాలు కాదు. నా భార్య.  మొదటిరాత్రే ఆమె ఏదో గిల్టీ ఫీలింగ్ తో బాధపడుతోందన్న విషయాన్ని గ్రహించాను.  నేను మిమ్మల్ని రహస్యంగా  అడిగినప్పుడు  ఆమెకి పదహారేళ్ళ వయసులో జరిగిన చేదు శృంగార అనుభవాన్నీ, ఆమె పడుతున్న వేదననీ మీరు  ధైర్యంగా  నాకు చెప్పి,  మా ఇద్దరికీ పెద్ద ఉపకారం చేసారు. నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి”          “నిజాన్ని మీకు చెప్పి నేను తప్పు చేసానా అని  చాలా టెన్షన్ పడ్డాను.  మీలాంటి మగాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆమె చేసిన తప్పుని మీరు చేసానని చెప్పడం... నిజంగా గొప్పతనం”           “ఇందులో  గొప్పతనం ఏమీ లేదు. మీ స్నేహితురాలు సుకుమారి అనీ,  సున్నితంగా హ్యాండిల్ చెయ్యమనీ మొదటి రాత్రే మీరంతా నన్ను హెచ్చరించారు కదా?  తన శరీరమే కాదు- మనసు కూడా సుకుమారమే అని అర్ధమైంది నాకు.  జరిగిన విషయాన్ని మీరు నాకు చెప్పారనీ, నేను దాన్ని పట్టించుకోవడం లేదనీ చెప్పినా ఆమె గిల్టీ ఫీలింగ్  పోయేది కాదు. అందుకే మీరు నాకు చెప్పారన్న విషయాన్ని ఆమెకి తెలియనివ్వద్దని చెప్పాను. ఆ రోజంతా బాగా ఆలోచించాను.అలాంటి తప్పులు జరగడం సహజమేనని,  ఆ గిల్టీ ఫీలింగ్ తో భవిష్యత్ నాశనం చేసుకోవడం అవివేకమని ఆమెతోనే చెప్పించాలన్న ఉద్దేశంతో   నా విషయంలో కూడా అలాగే జరిగిందని, గిల్టీ ఫీలింగ్ తో బాధపడుతున్నట్టుగా ఆమెకి చెప్పాను.  నా మీద ఆమెకి జాలి కలిగింది. ప్రస్తుతం ఆమె నన్ను  ఆ అపరాధభావనలోంచి ఎలాగైనా బయటపడెయ్యాలని తాపత్రయపడుతోంది.  నాకు కౌన్సిలింగ్ చేస్తున్నానన్న భ్రమలో తనకి తానే కౌన్సిలింగ్  చేసుకుంటోంది.క్రమంగా ఆమె మామూలు మనిషి అవుతుందన్న నమ్మకం నాకుంది. తన మనసులోని బాధని కూడా తనంతట తానే నాతో చెప్పుకుని భారం దించుకుని అన్నీ మర్చిపోతుంది. మీరు మాత్రం నేను అబద్దం చెప్పిన విషయం ఆమెకి ఎన్నటికీ తెలియనివ్వనని నాకు మాటివ్వండి.  మా భావి జీవితం సజావుగా సాగడం కోసం  ఆ సుకుమారిని ఇలా సున్నితంగా డీల్ చేయాల్సి వచ్చింది !”  నవ్వాడతను.