Read Aa Voori Pakkane Oka eru - 17 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 17

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

"నేను ఈ స్ప్లిట్ పర్సనాలిటీ, ఇంకా మల్టిపుల్ పర్సనాలిటీలగురించి కొంచెం విన్నాను. కానీ నాలో స్ప్లిట్ పెర్సనాలిటీ డెవలప్ అవుతూందని నీకెందుకు అనిపించింది?" భృకుటి ముడేసి ఆశ్చర్యంగా అడిగింది సుస్మిత.

"ఈ రోజు నువ్వు వూళ్ళో ఎక్కడెక్కడికి వెళ్ళావో కొంచెం ఆలోచించుకుని చెప్పు." తనూజ అంది.

కిందపెదవిని పలువరసల మధ్య బిగించి దీర్ఘంగా ఆలోచనలో ఆగిపోయింది. "ఏమో నాకు గుర్తుకు రావడం లేదు." కాస్సేపటితరువాత పెదవిని రిలీజ్ చేస్తూ అంది.

"నువ్వు మొదట తోటలో ఆ రోజు చిట్టిరాణి ని చూసాననుకున్న చోటికి వెళ్లవు. తరువాత దారిలో చిట్టిరాణి ఇంట్లోకి  వెళ్ళావు." తనూజ అంది.

"నేను అక్కడే వుండి గమనించాను. నువ్వు పదినిమిషాలు అలాగా చిట్టిరాణి ఇంట్లో వున్నావు. తోటలోను, ఇంక చిట్టిరాణి ఇంట్లో కి వెళ్తూ వుండగానూ కూడా నిన్ను నేను పిలిచాను. నువ్వు వినిపించుకోనట్టుగా వచ్చేసావు." ముకుందం అన్నాడు.

"మై గాడ్! నేనెందుకు ఆలా చేసాను?" గొంతు కొంచెం వణుకుతూ ఉంటే అంది సుస్మిత.

"దటీజ్ స్ప్లిట్ పెర్సనాలిటీ. కొన్ని కారణాల వల్ల నువ్వు చిట్టిరాణి గురించి బాగా ఆలోచించావు, ఆలోచిస్తున్నావు కూడా. దానితో కొన్ని సందర్భాల్లో నీకు తెలియకుండానే చిట్టిరాణిగా మారిపోతున్నావు. చిట్టిరాణి గా నువ్వు చేసినవేవీ నువ్వు సుస్మితగా వున్నప్పుడు నీకు గుర్తుకు రావు. అలాగే నువ్వు చిట్టిరాణిగా వున్నప్పుడు నీకు సుస్మితనన్నవూహ కూడా ఉండదు. స్ప్లిట్ పెర్సనాలిటీ సాధారణంగా ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మెయిన్ సబ్జెక్టు కి కూడా స్ప్లిట్ పెర్సనాలిటీ గురించి తెలిసి దానితో పరిచయం కూడా ఏర్పడుతుంది."

"వినడానికే నాకు చాలా భయంగా వుంది." మరోసారి గొంతు వణికింది సుస్మితకి.

"నేనుండగా నీకు భయమేమీ అవసరం లేదు." సుస్మిత కుర్చీ వెనక్కి వచ్చి తన మెడచుట్టూ రెండు చేతులూ వేసి అంది తనూజ. "నీ సమస్య పూర్తిగా తీర్చేవరకూ నేనిక్కడనుండి వెళ్ళేదే లేదు."

సుస్మిత కూడా కుర్చీలోనుంచి లేచి, తనూజ చుట్టూ చేతులు వేసి అంది. "నీలాంటి క్లోజ్ ఫ్రెండ్ నాకుండగా నేను దేనికైనా ఎందుకు భయపడతాను?"

"ఇక్కడ నేనొక్క విషయం చెప్పాలనుకుంటున్నా" వంశీ సడన్ గా అన్నాడు.

"ఇక్కడ ఎవరు ఏం చెప్పాలనుకున్నానిర్మొహమాటంగా చెప్పొచ్చు. ముందు పెర్మిషన్ తీసుకోఅక్కరలేదు." మదన్ అన్నాడు చిరునవ్వుతో.

"ఒకవేళ చిట్టిరాణి దెయ్యంగా వుంది అనుకున్నా, అది ఆ తోటని వదలి ఈ ఇంట్లోకే వచ్చేసింది, ఇంకా చెప్పాలంటే నీలోకే వచ్చేసింది. ఇంక మదన్ కి ఆ తోటలోకి రావద్దని కండిషన్ దేనికి? నేను, అన్నయ్య మేమిద్దరమే పొలంలో పనులన్నీ చూసుకోలేక చాలా ఇబ్బంది అయిపోతూంది." వంశీ అన్నాడు.

"వంశీ చెప్పింది నిజమే. మేమిద్దరమే పొలంలో అన్నిపనులూ చూసుకోలేకపోతున్నాము. వీడేమో హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు." ముకుందం అన్నాడు.

"అయితే సరే. తనింక తోటలోకి, పొలంలోకి వెళ్లొచ్చు." సుస్మిత అంది. "కాకపోతే ఆ మామిడి చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళకు."  

"నిజంగా బ్రతికించావ్!" మదన్ అన్నాడు. "నేను ఈ నిమిషం కోసమే ఎదురు చూస్తున్నాను."

తరువాత మరికాస్సేపు మాట్లాడుకున్నారు వాళ్లంతా, ఆ కుర్చీలు ఖాళీ చేసి వెళ్ళబోయేముందు.

&&&

అప్పుడు ఉదయం పది గంటల సమయం. పదిరోజుల తరువాత మళ్ళీ తోటలోకి, ఇంకా పొలంలోకి వెళుతూ ఉంటే అంత డిప్రెస్సివ్ మూడ్ లోనూ కొంత హ్యాపీగా అనిపించింది మదన్ కి. ఇలా ఇల్లు దాటి పది అడుగులువేసాడో లేదో నాగరాజు ఎదురొచ్చాడు. సరిగ్గా మదన్ కి ఎదురుగా వచ్చి ఆగాడు.

"చిట్టిరాణి నాకు ఏ ఫోన్ చెయ్యలేదు. చేస్తే నీకు చెప్తాను." చిరాగ్గా అన్నాడు మదన్.

"చిట్టిరాణి నీకు ఇంక ఏ ఫోన్ చెయ్యదు. అందుకు అవకాశంలేదు." అన్నాడు వాడు.

"ఏమిటి వాగుతున్నావు?" గుండె వేగం పెరుగుతూ ఉంటే అడిగాడు మదన్.

"నువ్వెంత వెంటపడ్డా ప్రేమించలేదని మధనపడి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన తల్లికి కలలో కనిపించి చెప్పింది. అంతేకాదు తను మీ తోటలో ఆ పెద్ద మామిడి చెట్టు వుందే దానిమీద ఉంటున్నానని చెప్పింది."

"చనిపోయిన తరువాత ఆలా ఎలా ఉంటుంది?"

"తను దెయ్యంగా మారిపోయింది."

"పిచ్చి పిచ్చిగా వాగకు. నాకు ఇలాంటి దెయ్యాలు, భూతాలూ లాంటి వాటిమీద నమ్మకం లేదు." లోపల మనసంతా భయంతో నిండిపోయినా, బయటకి చిరాగ్గా అన్నాడు మదన్. సుస్మిత, చిట్టిరాణి ఆ మామిడి చెట్టు మీద ఉందని చెప్పింది. ఇక్కడ కలలో చిట్టిరాణి వాళ్ళ అమ్మకి ఆ మామిడి చెట్టుమీద వుంటున్నాననే చెప్పింది. ఇది కేవలం కాకతాళీయమేనా?

"నువ్వు చిట్టిరాణిని ప్రేమించలేదని మాకెవరికీ కోపంలేదు. తనని ప్రేమించని వాళ్ళని ప్రేమించమని వెంటపడే హక్కు ఎవరికీ లేదు. కానీ చిట్టిరాణి నీ మీద ఇప్పుడు చాలా కోపంగా వుంది. నిన్ను ముప్పుతిప్పలూ పెట్టి నానా హింసలూ పెడతానని కూడా వాళ్ళమ్మకి చెప్పింది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా వుండు." హెచ్చెరికగా చూస్తూ అన్నాడు నాగరాజు.

"సరే, ఉంటాలే." ఇంకా ఏం అనాలో తెలియక చిరాగ్గా అని అక్కడనుండి కదలబోయాడు మదన్.

"నువ్వు పొలంలోకి వెళ్ళబోతున్నట్టున్నావ్. ఆ మామిడి చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళకు. నేను అక్కడికి వెళ్లి చూసాను. నాకు చిట్టిరాణి కాలి మువ్వల సవ్వడి అక్కడ వినిపించింది. తను నిజంగానే ఆ మామిడి చెట్టుమీద వుంది.

ఏం మాటలాడకుండా ముందుకే నడిచాడు మదన్.  సుస్మిత, నాగరాజు ఇద్దరూ ఆలా చెప్పినా, ఆ రెండు రోజులూ సుస్మిత, తనూ కలిసి మాట్లాడుకున్న చోటికే స్ట్రెయిట్ గా వెళ్ళాడు.

అక్కడేదో కొంచెం ఓపెన్గా వుండి, ఏవో రెండు మూడ్ పెద్ద రాళ్లు కూచోడానికి వున్నా, అక్కడ తోట చాలా దట్టంగానే వుంది. చీకటి పడ్డాక అక్కడ నిజంగానే దెయ్యాలు, భూతాలూ వున్నట్టుగా అనిపించడంతో ఆశ్చర్యం లేదు. ఆ చీకట్లో, ఆ ఎన్విరాన్మెంట్లో, చిట్టిరాణి గురించి బాగా అలోచించి ఉండడంవల్ల తనలా తనకి తెలీకుండానే ఇమాజిన్ చేసుకుంది. అదే తనూజ చెప్తూన్న స్ప్లిట్ పెర్సనాలిటీకి ఫౌండేషన్ అయింది. అంతకన్నా మరేం కాదు.

కూతురు కనిపించకుండా పోయిన తరువాత బాగా బాధ పడి ఉండడం వల్ల చిట్టిరాణి తల్లికి  అటువంటి కల వచ్చి ఉంటుంది. చిట్టిరాణి తను ఈ మామిడి చెట్టుమీద ఉంటున్నానని వాళ్ళమ్మకి కలలో చెప్పడం కేవలం కాకతాళీయం. ఆ పెద్ద మామిడి చెట్టుమీద చూస్తూ ఉంటే నవ్వు వచ్చింది మదన్ కి. అలాగే నాగరాజు గాడు కూడా ఆ అందెల సవ్వడి కేవలం తనకి తెలియకుండానే ఇమాజిన్ చేసుకున్నాడు. చిట్టిరాణి వాళ్ళమ్మ కి తను ఈ మామిడి చెట్టుమీద ఉంటున్నానని చెప్పిందని చెప్పిన తరువాత ఇక్కడ వుండేవుంటుందని అనుకుంటూ వచ్చాడు. సో, అలాంటి హల్యూసీనేషన్ కి సబ్జెక్ట్ అయ్యాడు. అంతకన్నా మరేం కాదు. తనకి చిట్టిరాణి పెట్టుకునే మువ్వల పట్టీల గురించి బాగా తెలుసు. తను చాలా దూరంలో ఉండగానే తానొస్తున్నట్టుగా చాటి చెప్పేవి అవి.

మరొకసారి చిరునవ్వు తన పెదవుల మీదకి ఉబికి రాబోతూండగా జరిగిందది. మదన్ హృదయాన్ని షాక్ తో నింపేస్తూ అందెల సవ్వడి వినిపించింది. కచ్చితంగా చిట్టిరాణి పెట్టుకునే పట్టీల మువ్వల శబ్దమే. అందులో సందేహంలేదు. కంగారుగా చుట్టూ తిరిగి చూసాడు. ఎవ్వరూ లేరు.

"బావా....." అది చిట్టిరాణి గొంతే. తనని పిలుస్తోంది. ఆ గొంతు వినిపించిన వైపు చూసాడు. దట్టమైన చెట్లమధ్య ఎవరూ కనిపించడం లేదు.

"చిట్టిరాణీ....." మదన్ గొంతు కొంచెం గా వణికింది ఆలా అంటున్నప్పుడు.

"నిన్నిక్కడికి రావద్దని సుస్మిత చెప్పినా కూడా ఎందుకు వచ్చావు?"

వంశీ గొంతువిని వెనక్కి తిరిగాడు మదన్.

"నువ్వెప్పుడూ వచ్చావు?"

"ఇప్పుడే వచ్చాను. నువ్వు పొలంలోకి వస్తానన్నావు. కానీ రాలేదు. ఇక్కడికే వచ్చివుంటావేమోనన్న ఆలోచనతో వచ్చాను. నా అనుమానం నిజం అయింది." వంశీ అన్నాడు.

"వంశీ...." గొంతు చిన్నగా వణుకుతూ ఉండగా అన్నాడు మదన్. "నేను చిట్టిరాణి పట్టీల మువ్వల శబ్దం విన్నాను. తన గొంతు కూడా. తను నన్ను బావా అని పిలిచింది. నన్ను తనెప్పుడూ అలాగే కదా పిలుస్తుంది."

"ఆ మువ్వల శబ్దం నేనూ విన్నాను ఇక్కడ. సుస్మిత అబద్ధం చెప్పడం లేదు. తను ఆ రోజు చిట్టిరాణిని నిజంగానే ఇక్కడ చూసింది. తను ఈ మామిడి చెట్టుమీదే వుంది." వంశీ అన్నాడు. "కాబట్టి నీక్కలిగిన ఆ అనుభవం నిజమే. నీ భ్రమ కాదు."

"కానీ సుస్మిత చెప్పిన దాని ప్రకారం తను తన శరీరం లోకి ప్రవేశించేసింది కదా. మరి ఇక్కడ కూడా ఎలా ఉంటుంది?" అయోమయంగా అడిగాడు మదన్.

"తన శరీరంలోనే ఉండిపోవాలని రూలేమి వుంది? కాసేపు తన శరీరంలో, కాసేపు ఈ మామిడి చెట్టుమీద, కాసేపు వేరే తనకి నచ్చిన చోట ఇలా వుంటూందేమో."

"నాకేం అర్ధం కావడం లేదు. ఈ సమస్యనుండి ఎలా బయటపడాలో బోధపడ్డం లేదు." నిస్సహాయంగా తలూపుతూ అన్నాడు మదన్.

"నువ్వనవసరంగా కంగారు పడకు. కేవలం ఆ తనూజ మాటలే పట్టుకుని ఉండిపోకు. నేను ఈ సమస్య నుండి బయటపడేందుకు వేరే ఉపాయం కూడా ఆలోచిస్తాను." భరోసాగా చూస్తూ అన్నాడు వంశీ.

"అది సరే. కానీ మీ ఇద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ అయినట్టుంది." సడన్ గా గుర్తుకొచ్చి అడిగాడు మదన్  ఆ డిప్రెస్సివ్ మూడ్ లో నుండి బయటకి వస్తూ.

"నేను చెప్తాను. కానీ ఇక్కడ ఎక్కువ సేపు ఉండడం మంచింది కాదు. ముఖ్యంగా నువ్వు." వంశీ అక్కడనుండి నడుస్తూవుంటే, తనని మౌనంగా అనుసరించేడు మదన్. "నీ దగ్గర ఏదీ నేను దాచదల్చుకోలేదు. నాకు నువ్వు తప్ప వేరే క్లోజ్ ఫ్రెండ్ ఎవ్వరూ లేరు."

"నువ్వు దాచదల్చుకోకుండా చెప్పదలచుకున్నది ఏమిటో నాకు తెలుసు. మీరిద్దరూ గాఢమైన ప్రేమలో వున్నారు, అంతే కదా." నవ్వుతూ అన్నాడు మదన్.

వంశీ ఆగి మదన్ మొహంలోకి చూసాడు. "తను బాగా చదువుకుంది, ఇంకా అందమైనది. నాకు ఆ రెండూ లేవు."

"కానీ తను నిన్ను ఇష్టపడుతూంది." మదన్ అన్నాడు. "అంతేకాదు. తను నీదగ్గర అన్నివిధాలుగా సుఖపడుతుందన్న నమ్మకం నాకుంది."

"వాళ్ళమ్మ ఛస్తే ఈ పెళ్ళికి ఒప్పుకోదు. అలాగే వదిన కూడా ఏమంటుందో బోధపడడం లేదు." విచారంగా అన్నాడు వంశీ.

"ఆ విషయం నాకు వదిలేయ్. వాళ్ళని ఒప్పించే పూచీ నాది." వంశీ కుడిభుజం మీద చెయ్యివేసి అన్నాడు. "నాకు తనూజ అన్నా కూడా చాలా ఇష్టం. తనని ఎవరో ముక్కూ మొహం తెలియని వాడికి ఇచ్చేకన్నా మాకు మొదటి నుండి తెలిసిన నీలాంటి వాడికి ఇచ్చిచేయడం నాకు నచ్చిన పని. ఐ యాం స్యూర్, అన్నయ్య వదిన కూడా ఇలాగే ఫీలవుతారు."

"కానీ, వాళ్ళమ్మ..." మదన్ మాటలకి వంశీ మొహం ఆనందంతో నిండిపోయినా మంగవేణి గుర్తుకువచ్చి అన్నాడు.

"తన విషయం నాకొదిలేయమని  చెప్పాను కదా. నేను చూసుకుంటాను. నువ్వే తన అల్లుడిగా కావాలని అనేలా చేస్తాను." చిరునవ్వుతో అన్నాడు మదన్.

మదన్ ని గట్టిగ కౌగలించుకుని అన్నాడు వంశీ. "థాంక్స్"

"తనూజ నాకు ఒక మాట చెప్పింది. క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య థాంక్స్ లు వుండకూడదు." చిరునవ్వుతో అన్నాడు మదన్.

"సారీ. ఇంకెప్పుడూ చెప్పను."

"అలాగే సారీలు కూడా ఉండకూడదని చెప్పింది."

"ఒకే అయితే." గట్టిగా నవ్వేసాడు వంశీ. "ముందుగా మనం ఫామ్ హౌస్ లోకి వెళ్లి అక్కడ లెక్కలు అవీ చూసి, కొనాల్సిన ఎరువులు అవీ నిర్ణయించాలి." మదన్ ని వదలి నడవడం మొదలు పెట్టాడు వంశీ. ఇంకేం మాట్లాడకుండా వంశీని అనుసరించాడు మదన్.

&&&

"ఇప్పటివరకూ నేను ట్రీట్మెంట్ కేవలం సుస్మితకే అవసరం అనుకున్నా. కానీ నీ మాటలు వింటూంటే నీకు కూడా అవసరం ఏమో అనిపిస్తూంది." మదన్ తనకి తోటలో కలిగిన ఎక్స్పీరియన్స్ క్లియర్ గా చెప్పాక అంది తనూజ.

"అంటే అది కేవలం నా భ్రమే అంటావా?"

"ఆడిటరీ హల్యూసీనేషన్. నువ్వుకూడా బాగా ఆ చిట్టిరాణి గురించే ఆలోచించడం వల్ల అలా జరిగింది. అంతకన్నా మరేమీ కాదు."

"నువ్విలాగే అంటావని నేను అనుకున్నాను. అలాగే అన్నావు." చిరాగ్గా అన్నాడు మదన్.

"మరేం అనాలి బావా? అక్కడ నిజంగానే చిట్టిరాణి దెయ్యం ఉందని, తన పట్టీల మువ్వల శబ్దమే నువ్వు విన్నావని నేను అనాలా?" కుర్చీలోనుంచి లేచి మదన్ దగ్గరికి వచ్చి, మదన్ కుడిభుజం మీద చెయ్యివేసి అంది తనూజ. "నాలా సైకాలజిస్టువి కాకపోవచ్చు. మనసు చేసే మాయల గురించి నాకున్నంత అవగాహనా నీకు లేకపోవచ్చు. కానీ దెయ్యాలు భూతాలు వున్నాయనుకోవడం చాలా అమాయకత్వం బావా."

"ఆల్రైట్. నువ్వు చెప్పిందే నిజం." ఇంకేం అనాలో తెలియక చిరాగ్గా అన్నాడు మదన్.

"ఇంకొక ముఖ్యమైన విషయం. నీకు తోటలో ఇలాంటి ఎక్సపీరియెన్స్ కలిగిందని సుస్మిత దగ్గర పొరపాటున కూడా అనకు. తన భ్రమలు ఇంకా బలపడిపోతాయి."

"ఆ మాత్రం కామన్ సెన్స్ నాకుంది." అదే చిరాకుతో అన్నాడు మదన్. "నువ్వేదో హిప్నోథెరపీ అన్నావ్, అది ఎప్పటినుండి స్టార్ట్ చెయ్యబోతున్నావు?"

"రిలాక్స్ బావా." మళ్ళీ వచ్చి తన కుర్చీలో కూలబడుతూ అంది తనూజ. "తనని నేను క్లోజ్ గా అబ్సర్వ్ చేస్తున్నాను. తన స్ప్లిట్ పెర్సనాలిటీ కొంచెం ఎక్సపోజ్ అయితే బాగుంటుంది. తనని అన్నివిధాలుగా బాగు చేసే పూచీ నాది. ఆ విషయం నాకు విడిచిపెట్టు." భరోసా ఇస్తూ అంది తనూజ. "అంతకన్నా చెయ్యగలిగింది ఏముంది? కానీ అదేదో త్వరగా చెయ్యి." దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు మదన్. అంతలోనే ఒక చిరునవ్వు మదన్ పెదవులమీదకి వచ్చి మోహంలో ఎక్స్ప్రెషన్ మారింది. "నువ్వు చెప్పలేదు కానీ, వంశీ నా దగ్గర పూర్తిగా ఓపెన్ అయ్యాడు. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారట కదా."

"అవును బావా. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాం." అలా చెప్తూన్నప్పుడు తనూజ రెండు బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కి పోయాయి.

"లవ్ చేసుకునేది పెళ్లిచేసుకోవడానికే కదా." నవ్వాడు మదన్. "మీ మామ్ ఏమంటుందోనని, ఇంకా మీ అక్క ఏమంటుందోనని భయపడ్డాడు. అదంతా నేను చూసుకుంటానని మీరిద్దరూ కావాల్సినంత ప్రేమించుకోవచ్చని చెప్పాను."

"థాంక్ యూ బావా. థాంక్ యూ వెరీ మచ్!" కుర్చీలోనుంచి వేగంగా లేచివచ్చి, మదన్ భుజాల చుట్టూ చెయ్యి వేసి కుడిబుగ్గమీద ముద్దు పెట్టుకుంది తనూజ.

"క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య థాంక్స్ లు వుండకూడదన్నావు కదా."

"సారీ. మర్చిపోయాను." మదన్ ని విడిచిపెడుతూ అంది తనూజ.

"సారీ లు కూడా వుండకూడదు కదా."

"ఓహ్..." మరోసారి సారీ చెప్పబోయి తమాయించుకుని గట్టిగ నవ్వేసింది తనూజ.

మదన్ బెడ్ మీద నుండి లేచి, తనూజ రెండుభుజాల మీద చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. "వంశీకి చెప్తున్నదే నీకూ చెప్తున్నా. అందర్నీ ఒప్పించి మీ ఇద్దరి పెళ్లి చేసే పూచి నాది. ప్రేమించుకుంటారో, ఇంకేం చేసుకుంటారో మీ ఇష్టం."

"ఆల్రైట్ బావా" మరోసారి థాంక్స్ చెప్పబోయి తమాయించుకుంది తనూజ. "చాలా రిలీఫ్ గా వుంది నీ మాటలు విన్నాక నాకు."

"మీరిద్దరూ ఇంక కిందకి భోజనాలకి వస్తే బాగుంటుంది." ఆ గదిలోకి వచ్చిన వనజ అంది. "ఇప్పటికే ఆలస్యం అయింది. నాకు నిద్ర వస్తూంది."

తరువాత ఆ గదిలోనుండి ముగ్గురూ కిందకి వెళ్లిపోయారు.   

&&&

"ఈ రోజు ఈ చికెన్ కర్రీ నేనే చేసాను. మీరందరూ తిని తీరాల్సిందే." డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనాలకి సెటిల్ అయ్యాక అంది తనూజ.

"సుస్మిత బ్రాహ్మిణ్. తను నాన్-వెజ్ తినదు." మదన్ అన్నాడు.

"అదెలా? నిన్ను పెళ్లి చేసుకుంటూన్నప్పుడు తనూ నాన్-వెజ్ తినాలికదా?" తనూజ అంది.

"తనూ తిననవసరం లేదు. తనకి ఇష్టం లేనిది ఏదీ చెయ్యమని నేను బలవంత పెట్టను." మదన్ చిరాగ్గా అన్నాడు.

"నేను ఒప్పుకోను. మన ఫ్యామిలీ తో కలిసేటప్పుడు మనం చేసేవన్నీ తను కూడా చెయ్యాలి. మనం తినేవన్నీ తనూ తినాలి." మొండిగా అంది తనూజ.

"తనూ ప్లీజ్." భయపడుతూ అంది సుస్మిత. "నేనెప్పుడూ కోడిగుడ్డు కూడా తినలేదు. చికెన్లు అవీ తినమని నన్ను నువ్వు బలవంతం చెయ్యొద్దు."

"ఎస్, తనూ. తనని వదిలేయ్. తనకి ఇష్టంలేనిది చెయ్యమని బలవంతం చెయ్యకు." మదన్ కూడా భయపడడం మొదలు పెట్టాడు. తనూజలో వున్న పెద్ద దురలవాటు ఒక్కసారికి మొండితనాన్ని పోయిందంటే ఎవరు చెప్పినా వినదు. అనుకున్నది చేసేదాకా ఊరుకోదు.

"కుదరదు అంతే. ఈ రోజు తను నాన్-వెజ్ తిని తీరాల్సిందే." చికెన్ ముక్కలు ఒక ప్లేటులోకి తీసుకుని సుస్మిత పక్కకి వచ్చి నిలబడింది. "నీకు ఈ రోజు మా ఇంట్లో మొదటిసారిగా నాన్-వెజ్ తినిపించబోతున్నా. అంతేకాదు నువ్విక్కడనుండి అన్ని నాన్-వెజ్ లు టేస్ట్ చేసేలా చేస్తాను."

              "తనూ..... ప్లీజ్..... నేను చెప్పేది అర్ధం చేసుకో. నన్ను బాధ పెట్టకు." వేడుకోలుగా అంది సుస్మిత.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)