Read Kamala Sri by కమల శ్రీ in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

చిరుదివ్వె

"చిరుదివ్వె"

°°°$°°°

సాయంత్రం ఏడు అవుతున్నా ఆ ఇంట్లో దీపాలు వెలగలేదు. దీపం వెలిగించాల్సిన వ్యక్తి దీనం గా మంచం మీద కూర్చుని ఉంది. విచారానికి నిలువెత్తు రూపం లా ఉంది ఆమె. జుట్టు విరబూసుకుని, రెండు కాళ్ల మధ్య తలని పెట్టుకుని ఉంది. మనసులో కొండంత దుఃఖం ఉన్నా అదేంటో కళ్ళమ్మట నీరే రావడం లేదు... ఏడ్చి ఏడ్చి ఇంకిపోయాయేమో మరి.

వారం క్రితం సంతోషానికి చిరునామాల ఉన్న తను ఈ రోజు దుఃఖానికి ప్రతీకగా నిలిచింది. భర్త తో ఆనందం గా జీవిస్తున్న తన జీవితాన్ని చీకటి లోకి నెట్టి దేవుని దగ్గరికి వెళ్లిపోయాడు తన భర్త ధీరజ్.

“దీపా...దీపా” అంటూ వెనకాలే తిరిగే తన భర్త వారం క్రితం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వెనుక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ గుద్దడం తో స్పాట్ లోనే చనిపోయాడు. ధీరజ్ కీ, దీపా కీ నా అన్న వాళ్ళు ఎవరూ లేకపోవడం తో చుట్టు పక్కల ఇళ్ళల్లో ఉన్నవాళ్లూ, ధీరజ్ కొలిగ్స్ వచ్చి జరగాల్సిన కార్యక్రమాలు చేసి వెళ్లారు. ధీరజ్ పార్ధివ దేహం మట్టిలో కలిసిపోయినట్టే దీప సంతోషాలు కూడా మట్టిలోనే కలిసిపోయాయి.

ఆ రోజు నుంచి గదిలో ఏడుస్తూ ఉండటమే కానీ బయటకు వచ్చింది లేదు. పక్కింట్లో ఉండే సావిత్రి అప్పుడప్పుడూ వస్తూ దీపని చూస్తూ ఉంటుంది.

చాలా సేపు భాదపడుతూ ఉన్న దీప ఓ నిర్ణయానికి వచ్చినట్టు గా మంచం మీద నుంచి లేచి వంట గది వైపు వెళ్లింది. ఓ చాకు తీసుకుని దాని వైపు సూటిగా చూసి తన చేతి మణికట్టు కి ఆన్చి లోతుగా దింపడానికి సిద్దం అయ్యింది. ఇంతలో కళ్లు తిరిగి , ఒళ్లంతా తూలుతున్నట్టై నేల మీద పడి స్పృహ కోల్పోయింది.

కాసేపటికి దీప ని చూడటానికి వచ్చిన సావిత్రి ఇల్లు చీకటి గా ఉంది "లైట్ కూడా వేసుకోకుండా చీకటిలోనే ఉన్నావా దీపా?!.” అంటూ లైట్ వేసి దీప గదిలోకి వెళ్లి చూసింది. అక్కడ దీప కనపడక పోవడం తో ‘పూజ గదిలో ఉందేమో ఎందుకిలా చేశావని దేవునితో పోట్లాడటానికి’ అనుకుంటూ పూజ గదిలోకి వెళ్లి చూసింది. అక్కడా కనపడలేదు.

“దీపా... దీపా… ఎక్కడమ్మా?.”అంటూ చుట్టూ చూస్తూ వంట గదిలోకి వెళ్లింది. అక్కడ నేల మీద పడి స్పృహ కోల్పోయిన దీప కనపడటం తో కంగారుగా ఆమె దగ్గరికి వెళ్లి “దీపా... దీపా...ఏమయ్యిందమ్మా?.” అంటూ లేపింది.కానీ దీప లేవకపోయేసరికి దీపం ముఖం పై నీరు చల్లడం తో నెమ్మదిగా కళ్లు తెరిచింది దీప.

“ఏమయ్యింది దీపా?.” అంది సావిత్రి కంగారుగా.

“ఏమో ఆంటీ దాహం గా అనిపిస్తే వంట గదిలోకి వచ్చాను నీరు త్రాగుదామని, ఉన్నట్టుండి కళ్లు తిరిగినట్టు అనిపించి పడిపోయాను.” అంది అబద్దం చెప్తూ.

“చనిపోయిన ధీరజ్ నే తలుచుకుంటూ తిండీ తిప్పలు మానేస్తే కళ్లు తిరగక ఏమౌతుంది చెప్పు. కళ్లు చూడు ఎలా పీక్కుపోయాయో?.ఇలాగైతే ఎలా దీపా.” అంటూ దీప చేతిని చూసింది సావిత్రి. ఆమె చేతిలో ఉన్న చాకుని చూసి కంగారుపడుతూ "ఏంటి దీపా ఇదీ?.” అంది.

“ధీరజ్ లేని లోకంలో ఉండలేకపోతున్నాను ఆంటీ. అందుకే...” అంది బాధగా.

“అందుకే చనిపోవాలని అనిపించిందా?. ఏంటి అతనికి ఆయుష్షు తీరిపోయింది అందుకే చనిపోయాడు. నువ్వెందుకు ఇలా నీ జీవితానికి అర్ధాంతరం గా ముగించాలని అనుకుంటున్నావు. ప్రతీ మనిషి పుట్టుకకు ఏదో అర్ధం పరమార్ధం ఉంటుంది. అలాగే నీ పుట్టుకకు కూడా ఏదో అర్దం ఉండే ఉంటుంది.” అంది సావిత్రి.

“ఏం అర్ధం ఆంటీ ఇలా చీకటిలో బ్రతకమని నాకున్న ఒక్క తోడుని కూడా తీసుకెళ్లి పోవడమేనా ఆ అర్దం పరమార్ధం.” అంది దీప.

ఆ మాటకి ఏం సమాధానం ఇవ్వాలో తెలీక "ఇలానే భాదపడుతూ ఉండకు లేచి వెళ్లి ఆ ముఖం కడుక్కో చూడు ఎలా ఉందో, ఓ సారి అద్దం లో చూసుకో నీ ముఖం ఎలా ఉందో నీకే తెలుస్తుంది.” అనడం తో పైకి లేవబోయింది దీప.కానీ ఒళ్ళు తూలినట్టు గా అనిపించడం తో తూలిపడబోతున్న దీపని ఒడిసి పట్టుకుంది సావిత్రి.

“దీపా దీపా ఏమయ్యింది...” అంది.

“తెలీదు ఆంటీ కళ్లు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది.”

“అయ్యో అవునా... ముందు ఈ ఛైర్లో కూర్చో."అని ఓ చైర్ మీద కూర్చో పెట్టి తాగడానికి నీరు అందించి వారం నుంచి "సరిగ్గా తినకపోవడం తో ఇలా కళ్లు తిరుగుతున్నాయి ఏమో .చాలా నీరసం గా కనిపిస్తున్నావు.ఉండు మీ అంకుల్ కి చెప్పి డాక్టర్ ని తీసుకుని రమ్మని చెప్తాను. నీరసం తగ్గడానికి సెలైన్ పెడతారు.” అని తనింటికి వెళ్లి రఘురామయ్య ( సావిత్రి భర్త) కి చెప్పి డాక్టర్ ని పిలుచుకు రమ్మని చెప్పి దీప దగ్గరికి వెళ్లింది సావిత్రి.

కాసేపటికి డాక్టర్ ని తీసుకుని వచ్చారు రఘురామయ్య గారు. దీపని నిశితంగా పరీక్షించి రఘురామయ్య గారిని, సావిత్రి ని కాసేపు బయటకి వెళ్ళమని చెప్పి దీప తో మాట్లాడిన డాక్టర్ బయటకు వచ్చి కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్న సావిత్రి వాళ్లని చూసి “అమ్మా! ఆమె కడుపుతో ఉంది. అందుకే అలా నీరసం తో కళ్లు తిరిగి పడిపోయింది. ఈ సమయం లో మంచి ఫుడ్ తీసుకోవాలి, పళ్ల రసాలూ, డ్రై ఫ్రూట్స్ తింటూ ఉండాలి. ఇలా తినకుండా ఉంటే నీరసం తో అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్త గా చూసుకోండి తనని. ఈ మందులు సమయానికి ఇస్తూ ఉండండి.” అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు.

సావిత్రి సంతోషం గా లోపలికి వెళ్తూ “అమ్మా దీపా... ఎంత మంచి శుభ వార్త,నువ్వు తల్లివి కాబోతున్నావా... చనిపోయిన మీ ఆయనే నీ కడుపున పుడుతున్నాడన్న మాట.” అంది సంతోషం గా.

“ఈ కడుపు నాకొద్దు ఆంటీ. నేను అబార్షన్ చేసుకుంటాను.” అంది ఏడుస్తూ.

“అవేం మాటలు దీపా. దేవుని ప్రసాదం వద్దనుకోకూడదమ్మా. భర్త చనిపోయాడని బాధలో మునిగి పోయిన నిన్ను సంతోషం లో ముంచెత్తడానికి ఇలా నీ కడుపులో ఓ కాయ వేశాడు దేవుడు. చీకటిలో ఉన్న నీ జీవితానికో చిరుదివ్వె అమ్మా ఈ నలుసూ. ఇక చావు ప్రయత్నాలు మాని నీ బిడ్డని ఈ భూమి మీదకి తీసుకుని వచ్చి తనలోనే నీ ధీరజ్ ని చూసుకో. అబార్షన్ చేసుకుంటాను అన్న ఆలోచనలు వదిలెయ్యి. నీరసం గా ఉన్నావు కదా ఉండు జ్యూస్ చేసిస్తాను.” అని వంట గదిలోకి దూరింది సావిత్రి.

“నిజమే.. ధీరజ్ చనిపోతూ చీకటిలో ఉన్న నాకో చిరుదివ్వె ని అందించాడు. నేనెందుకు ఈ బిడ్డని చంపుకోవాలి. నవమాసాలు మోసి నిన్ను కంటాను. నా కంటికి రెప్పలా చూసుకుంటాను. నా ధీరజ్ ని నీలో చూసుకుంటాను."అనుకుంటూ కడుపు పై చేయి వేసింది.

.... కమల'శ్రీ'✍️.