Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

మనస్ పూర్తిగా!

ఒకతను, మండుటెండలో, ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఎవరో వెంటాడుతున్నట్టుగా పరుగులాంటి నడకతో వేగంగా ముందుకి వెళ్తున్నాడు. "ఇకనైనా ప్రాక్టికల్ గా ఆలోచించరా...", "నీకు నిలకడ లేదు!", "నువ్వు కష్టపడలేవు!", "you don't have enough experience", "we will get back to you soon...", "we will let you know!", "నువ్వు చాలా ఎక్కువ అడుగుతున్నావు!", "you are talented but...", "ఎన్నాళ్ళురా ఇలా?", "నీకంటూ ఓ క్లారిటీ ఉందా?", "మూడు పుస్తకాలు రాసావు... ఏం ప్రయోజనం?", "నువ్వు అన్నీ బానే రాయచ్చు, కానీ నీకు పేరు, గుర్తింపు వచ్చేసరికి నీకో నలభై ఏళ్ళు వస్తాయి!", "seriousness లేదురా నీ దగ్గర అస్సలు!", "మీ వాళ్ళు చెప్పినట్టు ముందు వేరే ఏదైనా ఉద్యోగం చేసుకోరా...", "నీకిష్టమైన పనే అయినా, కష్టమైతే చేయవు!", "ఏంటోరా... నువ్వేంటో మాకర్థం కావట్లా...", "మీ వాడు ఏం చేస్తున్నాడని అడిగినప్పుడల్లా ఏం చెప్పాలో తెలీక, ఏదో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడని అబద్దం చెప్పాల్సొస్తుంది!"... ఇలా ఎన్నో గొంతులు అతన్ని వెంటాడుతున్నాయి. అతను ఆ వాక్శబ్దాల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు, పరిగెడుతున్నాడు, మధ్యలో పడిపోతున్నాడు, మళ్ళీ లేచి పరిగెడుతున్నాడు, పడుతున్నాడు, లేస్తున్నాడు... అలా పడుతూ... లేస్తూ.... ముందుకి సాగుతున్నాడు.

కానీ, ఆ గొంతులు తనని వదిలిపెట్టట్లేదు. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. అలసట వలన అడుగులు తడబడుతున్నాయి. అలా మళ్ళీ తన కాలికి ఓ రాయి అడ్డుపడి పడిపోబోతే, తన ఎదురుగా ఉన్న ఓ చెట్టు-కొమ్మ తనని పడిపోనివ్వకుండా ఆపుతుంది. దాంతో నెమ్మదిగా, ఆ చెట్టుకి జారబడి ఆ నీడలో కూర్చుంటాడు. అక్కడ ఒక చోటే ఎందుకో గాలికి ఊగే కొమ్మలు, ఆ కొమ్మకున్న ఆకుల సవ్వడి తప్ప మరే శబ్దం వినిపించడం లేదు. ఆ చెమటలు మధ్య కూడా ఏదో తెలియని దిగులు, బెంగ, బాధ, ఆవేదన, నిరాశ-నిస్పృహలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి అతని ముఖంలో.

అంతటి నీడలో కూడా, అలాంటి ఓ ప్రశాంతమైన ప్రదేశంలో కూడా చాలా ఇబ్బందిగా కూర్చున్నాడు, ఎంతో అసహనాన్ని ప్రదర్శిస్తున్నాడు. మనిషి అక్కడే ఉన్నాడు గాని, అతని మనసు అక్కడ లేదు. ఏటో సూన్యంలోకి చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనల పరంపర ఈ విధంగా కొనసాగుతుంది....

"నేను రాసే ప్రతీ వాక్యంలో ఎంతో పరిపక్వత ప్రతిబింబిస్తుంటుంది... అలాంటిది నాలో పరిపక్వత లోపిస్తుందంటారు! ప్రాక్టికల్ గా ఆలోచించే, నాకు ప్రాణం అయిన సినిమా ఫీల్డ్ ని వద్దనుకుని, ఉద్యోగాలను వెత్తుకుంటూ వెనక్కొచ్చింది. అలా కాకుండా తెగించి ముందుకెళ్ళుంటే, అయితే కనీసంలో కనీసం ఒకటో, రెండో సినిమాలకు పనిచేసి, తరువాతి సినిమాలకి ప్లాన్ చేసుకుంటూ అక్కడే ఎక్కడో ఉండేవాడిని, లేదా ఎటూ కాకుండా పోయేవాడిని. అలా జరుగుద్దేమో అనే భయంతోనే కదా తిరిగొచ్చేశాను! అయినా, నాలాగా మెత్తగా ఉండే మనుషులు అక్కడ అంత సులువుగా రాణించలేరు... ఆ విషయం నాకు కొద్దీ రోజులకే బోధపడింది, వచ్చేసాను. ఇది ఎన్ని సార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా, ఇష్టమైందని వెళ్ళావు, మళ్ళీ నువ్వే ఉండకుండా తిరిగొచ్చేసావు అంటారు.

"మనిషినైతే వచ్చేసా గాని, మనసులో ఏ మాత్రం మార్పు రాలేదు. సిగెరెట్ కో, మందుకో అలవాటు పడ్డవాడు వాటిని ఎలా మానుకోలేడో, నేను కూడా నా కలాన్ని, రాతల్ని వదల్లేకపోయాను. దానికి తోడు ఎందుకో ఈ సాఫ్ట్ వేర్ జాబ్స్ అంటే ముందు నుండి ఇష్టం లేదు, ఆ తరువాత ఎన్నిసార్లు ఏదైనా నేర్చుకుందాం అని ప్రయత్నించినా బుర్రకెక్కేది కాదు! ఎందుకంటే నేను ఎప్పుడూ చివరిదాకా మనసు పెట్టలేదు కాబట్టి! అందుకే ఈ ఆశను చంపుకోలేక ఈ కంటెంట్ రైటింగ్ జాబ్స్ ని వెత్తుకుంటూ వెళ్లాను. నాకేం తెలుసు, ఇక్కడ వీళ్ళు కూడా నా ప్రతిభను వాడుకుని, నెల చివర్లో నాకు ముష్టి వేస్తారని!

"ఈ దునియాలో నేను తప్ప అందరూ డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తారని నాకు తరువాత అర్థమయ్యింది. అంటే, నాలా ఇంకొంతమంది ఉండుంటారేమో కానీ, నాకిప్పటివరకూ ఎదురుపడలేదు. ప్రతొక్కడు నాతో నానా రాతలు రాయించుకుని, ఇంతిస్తా, ఇంతే ఇస్తా అని బేరమాడే వాళ్లే. నేనే పిచ్చి మాలోకాన్ని! వాస్తవాలు గ్రహించి, నాకింత కావాలి అని డిమాండ్ చేస్తుంటే, అప్పుడు దాకా ఆహా ఓహో అన్నవాళ్ళే నా దగ్గర అది తక్కువైంది, ఇది తక్కువయిందని వంకలు పెట్టడం, నేను కాదు కూడదు అంటే, వాళ్ళింక నన్నొదిలేసి నా తరువాత నాలాంటి బకరాకి ఎర వేసి, తక్కువకి వాడిని తీసుకోవడం. ఇదే సాగుతుంది... కంపెనీల యాజమాన్యాలు ఇలా ప్రవర్తిస్తుంటే నేనేం చేసేది?

"ఒకచోట డబ్బులు సరిగ్గా రావటం లేదని, నచ్చని ఉద్యోగం చేయాలంటే, 20 ఏళ్ళు కష్టపడింది ఎందుకు? మిగతా 30 ఏళ్ళు కూడా మనసు చంపుకుని బ్రతకడానికా? అంటే, పరువు కోసం, మంచి ఉద్యోగం ఉంటే, మంచి-ఇంటి పిల్ల వస్తుందని... ఇలా పల్చని కారణాల కోసం మనసుకి విరుద్ధంగా ఎలా బ్రతికేది? నేను అందరిలా డబ్బు వెనుక, ఆ డబ్బు వల్ల వచ్చే కృత్రిమ సంతోషాలు, సౌకర్యాలు, సుఖాల వెంట పరిగెత్తలేను, నాకు చేతకాదు, నా వల్ల కాదు! నా దృష్టిలో, సంతోషానికి మించిన ఐశ్వర్యం, సంతృప్తికి మించిన సౌకర్యం మరొకటి లేవు!

"అలాగే, ముందు నుండి రైటింగ్ లేదా టీచింగ్... ఈ రెంటికే నా ప్రాధాన్యత. ఒకోసారి, మీ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక, మధ్యలో రకరకాల కోర్సులు నేర్చుకోవడానికి ప్రయత్నించాను. కానీ, నేను సవ్యంగా నేర్చుకోలేక మధ్యలో వదిలేసే వాడిని, మళ్ళీ ఈ కంటెంట్ రైటింగ్ జాబ్స్ చూసుకునే వాడిని. ఏ రోజూ నేను పట్టిన కలం వదల్లేదు... ఈ రోజుకీ ఏదైనా స్కూల్ బస్, లేదా కాలేజ్ బస్ చూస్తే వెళ్లి టీచింగ్ చేయాలి అనుకుంటాను... అంటే నా ఆలోచనల్లో ఎలాంటి మార్పు లేదు నాలుగున్నర సంవత్సరాలుగా! మరి ఎందుకని నాకు నిలకడ లేదు, నాకు నిలకడ లేదు అంటున్నారు... నాకర్థం కావట్లేదు!

"అది పక్కన పెడితే, కష్టపడలేను అంటారు... ఒక్క సంవత్సరం కాలంలో మూడు పుస్తకాలు రాసాను. అవి చిన్నవే కావచ్చు... కానీ, బోల్డంత ఆలోచించాలి. అప్పట్లో ఆఫీస్ అయిపోయాక, ఆ ట్రాఫిక్ లో, కిక్కిరిసుకుపోయిన బస్ లలో ఎక్కి నలిగిపోతూ 40 నిమిషాలు ప్రయాణం చేసి, రూమ్ కి చేరుకునేసరికి 8 - 8:30 అయ్యేది... అప్పుడు స్నానం చేసి, భోజనం చేసి, రూమ్ లో మిగతా వాళ్ళు చేసే గందరగోళానికి దృష్టిని కేంద్రీకరించలేక.... వాళ్ళు పడుకునే వరకూ ఆగి, వాళ్ళు పడుకున్నాక 11:30 ప్రాంతంలో రాయటం మొదలుపెట్టి అర్థరాత్రి 2 - 2:30 వరకూ కథ రాసుకుని, ఆ టైం కి పడుకుని, మళ్ళీ ఉదయమే లేచి, రెడీ అయ్యి, టిఫిన్ చేసి ఆఫీస్ కి బయలుదేరేవాడిని... ఏ రోజూ ఆఫీస్ కి లేట్ గా వెళ్ళలేదు! ఇలాగే పూర్తి చేశా ఆ మూడు పుస్తకాలు! దీన్నేమంటారు? కష్టం కాదా? శారీరక కష్టమే కాదు, మానసిక కష్టం కూడా...! ఇవన్నీ మీకు తెలీదు, వచ్చి చూడనూ లేదు, కానీ, కష్టపడలేవు అని అనేస్తారు చాలా సింపుల్ గా!

"జీతం కాస్త ఎక్కువగా కనపడే ఉద్యోగాలకు అప్లై చేస్తే సరిపడా అనుభవం లేదని కనీసం నన్ను పరీక్షించను కూడా పరీక్షించకుండానే రిజెక్ట్ చేస్తారు. అసలు అవకాశాలు ఇవ్వకుండా అనుభవం ఎలా వస్తుంది? పోనీ, అనుభవం లేకుంటే, ప్రతిభ ఉంది కదా, బోల్డంత ప్రేమ ఉంది కదా నాకు దాని మీద, ఇచ్చి చూడచ్చు కదా... ప్యాషన్ కన్నా ఎక్స్పీరియన్స్ మిన్నా అంటారు...

"ఎన్నో కంపెనీలకు కాళ్ళు అరిగేలా తిరిగా, నా కష్టం నన్నా మహానగరంలో గైడ్ చేసిన గూగుల్ మ్యాప్స్ కి తెలుసు! ఇదంతా తెలీదు కానీ, మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది వినచ్చు కదా, వేరే జాబ్ చేయచ్చు కదా... ఇంకా ఖాళీగానే ఉన్నావా? ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తారు. అసలు నా సొంత మనుషులు కన్నా వీళ్ళ బాధ ఎక్కువైపోతోంది. అసలు ఎదుటి వక్తి ఎంత బాధ పడుతున్నాడనేది వీళ్ళకి అనవసరం!

"ఇన్ని అవమానాలు, దెప్పిపొడుపులు, హేళన మాటలు, వెక్కిరింపులు మధ్య కూడా నా కలాన్ని పట్టుకుని వేలాడుతున్న అంటే, నాకదంటే ఎంత ప్రేమో, మిగతా ఈ సాఫ్త్వేర్ ఉద్యోగాలు లాంటివంటే ఎంత చిరాకు అర్థం చేసుకోకుండా, నీకు seriousness లేదు, క్లారిటీ లేదు... నువ్వేంటో అర్థం కావట్లేదు అంటే ఎలా? నాకు క్లారిటీ, seriousness రెండూ ఉండబట్టే, ఎన్నొస్తున్నా నా మనసు చెప్పే మాట మీదే నేను నిలబడి ఉన్నాను!

"ఇన్ని గందరగోళాల మధ్యలో పడిపోయి, నా మనసుకెంతో దగ్గరైన అతి కొంతమంది నా స్నేహితులతో కూడా నేను సరిగ్గా మాట్లాడటం మానేసాను. దాంతో వాళ్ళు కూడా వీడు ఇదివరకులా మాట్లాడట్లేదు, ఎప్పుడు ఎక్కడికి పిలిచినా రాడు అని తీర్మానించేసుకున్నారు. కానీ, నాకు మనసులో వెళ్లాలని ఉంటుంది, వాళ్ళతో గడపాలని ఉంటుంది, కానీ, ప్రతీసారీ ఏవేవో అడ్డంకులు, ఒకోసారి మనసు బాగోదు. కానీ, ఎప్పటికీ వాళ్లంటే ఆ ఇష్టం, ప్రేమ ఉంటాయని చాలా సార్లు చెప్పాలనుకుంటాను... కానీ, నాకున్న జబ్బు ఏంటంటే... నేను ఏదైనా కాగితం మీద అక్షరాల ద్వారా చెప్పినంత ఇదిగా, నేరుగా నా భావాలను ఓ మనిషికి వ్యక్తపరచలేను... అసలు నాకు ఈ రోజుకీ సరిగ్గా మాట్లాడటం రాదు! దాంతో వాళ్లతో కూడా నాకు దూరం పెరుగుతూ వస్తుంది!

"ఇలా సవాలక్ష ఆలోచనలతో సతమతమయ్యే మనసు నాది! ఎన్నోసార్లు ఎవరికైనా ఇవన్నీ చెప్పుకోవాలని చూసాను... కానీ, ప్రతీది చెప్పలేకపోయేవాడిని... ఎందుకో నాకు తెలీదు! కానీ ఈ బరువుని నేనొక్కడినే మోయలేకపోతున్నాను... ఇంత పెద్ద ప్రపంచంలో ఒక్కడినే ఉన్నానేమో అనే భావన... శ్రమకు తగ్గా జీతాన్ని ఇచ్చే నాకు నచ్చే ఉద్యోగం, నన్ను నన్నుగా అభిమానించే నా చుట్టూ ఓ నలుగురు మనుషులు, రేపటి రోజున నాకంటూ రచయితగా ఓ చిన్న గుర్తింపు... తప్ప నేను పెద్దగా ఏం కోరుకోవడంలేదు! అలాంటి సందర్భం ఇప్పటివరకూ నా జీవితంలో ఒక్కటి కూడా ఎదురవ్వలేదు... అయినా కూడా ఏదో మొండిగా ముందుకి వెళుతుంటే, ఇలా రకరకాల మాటలతో, శతకోటి శూలాలై నన్ను పొడుస్తుంటే ఎట్లా నా ప్రయాణాన్ని సాగించేది? ఎలా ముందుకు వెళ్ళను? ఎలా...?" అని ఆలోచనల లోతుల్లో కూరుకుపోయి అతను కూర్చుని ఉంటే... ఇంతలో అక్కడికి వచ్చిన ఓ పిల్లాడు ఆ చెట్టుకున్న పండుకి గురిచూసి ఓ రాయి విసురుతాడు. ఆ రాయి సరిగ్గా ఆ పండుకి తగిలి, అది కచ్చితంగా ఆ వ్యక్తి పక్కన పడుతుంది. ఆ శబ్దానికి అతను మళ్ళీ ఆలోచనల నుండి తేరుకుని ఈ ప్రపంచంలోకి వస్తాడు.

అప్పుడు తను చూస్తుండగానే, ఆ పిల్లాడు ఇంకో రాయితో ఇంకో పండుని కొట్టి, ఆ రెండు పళ్ళను తీసుకుని పోతాడు. అప్పుడు, అక్కడికి వచ్చి అంత సేపు గడిచాక, ఆ చెట్టుని పరిశీలనగా చూస్తాడు. అది చాలా పెద్దది, ఎంతో లావుగా, దృఢంగా ఉంది. అంతేకాదు దాని వేర్లు, కొమ్మలు చాలా విస్తీర్ణం విస్తరించి ఉన్నాయి... చెట్టు కొమ్మలు కొన్ని ఎవరో నరికేసినట్టుగా కనిపించింది. కాసిన కాయలు కూడా చాలా వరకు అందరూ కోసేసినట్టు ఉన్నారు... ఇంకా అక్కడక్కడా కొన్నే మిగిలాయి. అలాగే కొన్ని పక్షులు గుళ్ళు కట్టుకుని నివాసముంటున్నాయి. ఇలా, కొమ్మలు నరికేసిన, ఎవరెన్ని పళ్ళు కోసుకుని పోయినా అది అలానే గంభీరంగా నిలబడటం చూసి అతనకి ఆశ్చర్యం వేసింది.

"మనలానే దీనికీ ప్రాణం ఉంది, అయినా ఇది దేనికీ చెలించటం లేదు, పైగా ఇలాంటి ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఏ తోడూ లేకపోయినా దర్జాగా, హుందాగా బ్రతికేస్తుంది..." అని మనసులో అనుకున్నాడు. మళ్ళీ ఒక్కసారిగా తన బాధలన్నీ గుర్తుకొచ్చాయి... కళ్ళల్లో నీళ్లు గిర్రుని తిరిగాయి, ఇక దుఃఖం ఆగలేదు... వెంటనే, ఆ చెట్టుని గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు.... తన మనసులో ఉన్న భారాన్ని అంతా దించుకున్నాడు. అప్పుడు గాలికి తన భుజం మీదుగా ఉన్న కొమ్మ ఊగడంతో, ఆ కొమ్మకున్న ఆకులు తన వీపుని నిమిరాయి. మనసు తేలిక పడటంతో, కళ్ళు తుడుచుకుని, ఆ చెట్టుకి తన కళ్ళతోనే వీడ్కోలు చెబుతూ, వెనుతిరిగి తానొచ్చినా దారినే బయలుదేరాడు.

మళ్ళీ తనకు ఆ గొంతులు వినపడటం మొదలైంది... కానీ, వాటిని లెక్కచేయకుండా తను ముందుకి సాగాడు...

... మనస్ పూర్తిగా మీ హేమంత్!