Dollar stories books and stories free download online pdf in Telugu

డాలర్ డైలమా


"ఆస్ట్రేలియా లోని బ్రిస్బేన్ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు కుర్రాడు అనారోగ్యంతో మృతి"

"ఎంత బాధాకరం" అనిపించింది,ఇది చూడగానే అమ్మ నుండి ఫోన్ వస్తుంది అని అనుకున్నాడు కార్తిక్.

అనుకున్నట్టుగానే ఆఫీసు ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి అప్పటికే తుషారతో మాట్లాడుతుంది.

"ఇదిగో అత్తయ్యా ఈయన ఇప్పుడే వచ్చారు, చూపిస్తా ఉండండి" అని ఫోన్ ని కార్తిక్ వైపు తిప్పింది.

అటు నుండి దేవకి మాట్లాడుతుంది "హెల్లో, బంగారం, వెళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుని రా" అంది.

"వస్తున్నా, నువు తనతో మాట్లాడుతూ ఉండు" అని ఫ్రెష్ అయి వచ్చాడు.

"ఏమైనా తింటాడేమో చూడమ్మా! నేను తర్వాత చేస్తాలే.." అంటున్న దేవకి తో పర్లేదు అత్తయ్యా ఉండండి, అని స్నాక్స్ తెచ్చి అలాగే మంచినీళ్ళు తాగమని భర్త కి చెప్పి కూర్చుంది తుషార.

"ఆ న్యూస్ చూసావా అమ్మా, ఎంత జాలేసిందో పాపం, ఎక్కడో ఉంటున్నారు ఇక్కడ కన్నవాళ్ళకి

ఎంత బాధ..ఆ మాత్రం చదువులు, డబ్బులు ఇక్కడ లేవా!! మా వెదవని చదువుకుని వచ్చేయ్ రా అని పంపితే అక్కడే ఉద్యోగం తెచ్చుకున్నాడు..ఇప్పుడప్పుడే వస్తాడు అన్న నమ్మకం లేదు, మేమా ఈ వయసులో రాలేము, ఏ వృద్ధాశ్రమంలో ఉండిపోతే మంచిది, మీకు కుటుంబం పెరుగుతుంది, ఎవరికీ భారం కాకూడదు, ఇక్కడైతే అందరూ ఉంటారు" అని కోడలితో అంటున్న మాటలు అన్నీ వింటూ ఉన్న కార్తీక్ ఫోన్ తీసుకుని "నీ ఆరోగ్యం ఎలా ఉంది, మందులు బాగానే వేసుకుంటూ ఉన్నావా?" అని కుశల ప్రశ్నలు వేశాడు.

"ఒరేయ్, మాట మార్చకు, అన్నీ తండ్రి బుద్దులే" అంటున్న తల్లిని చూసి నవ్వాడు "మరి ఏం చేయమంటావు, క్రితం వారమే అయింది, మళ్ళీ ఈ వారం అదే మాట అంటున్నావ్" అన్నాడు.

"మొన్న చెప్పింది నీకు అర్దం కాలేదు ఏమో!! ఈసారి సరిగ్గా చెప్తా విను, నిన్ను నాన్నని ఇక్కడికి తీసుకు వచ్చేయాలి,ఇక్కడ తెలుగు వాళ్ళకి ఏమి తక్కువ లేదు, నీకేమి తేడా అనిపించదు, ఇంక బంధాలు, బంధుత్వాలు అంటావా, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చూసి వద్దాం.. అంత కన్నా ఎక్కువ ప్రేమలు మంచివి కావు ఈ రోజుల్లో, నీకో విషయం చెప్పనా ఎవరో మన వేలు విడిచిన చుట్టం నుండి ఫోన్ వచ్చింది మొన్న "అప్పు కావాలని".. అలా ఉన్నాయి బంధాలు..


మామూలుగా ఉన్నప్పుడు నిన్ను నాన్నని ఎవరైనా పట్టించుకున్నారా!! నేను ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తున్నా అనగానే అందరూ కలుపుకున్నారు మళ్ళీ, బంధం కన్నా స్టేటస్ కావాలి అందరికీ.." ఆవేశంగా అంటున్న కొడుకుని చూసి "అది కాదురా!! ఆ మాత్రం డబ్బులు ఇక్కడ రావా, మొన్న మన పక్క వీధిలో కృష్ణా రావు గారు చనిపోయారు, పిల్లలు రాము అని చెప్పేసారు, అవన్నీ చూస్తుంటే భయంగా ఉంది" అంది.

"అది చాలా బాధాకరం ఒప్పుకుంటాను, అయితే ప్రతి బిడ్డ అలాగే చేస్తాడు అనుకోకూడదు!! ఇక్కడ డబ్బులో తేలియాడే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే కష్ట పడితేనే ఉద్యోగాలు, రికమండేషన్ కానీ కులం బట్టి కానీ ఆడ మగ తేడా బట్టి కానీ ఉద్యోగాలు రావు!! కష్టపడి తెచ్చుకోవాలి, ఎందుకంటే ఏది ఉచితంగా దొరకదు, నెల నెలా అద్దె కట్టకపోతే లీగల్ గొడవలు వస్తాయి, అందుకని ఒళ్ళు వంచి పని చేస్తారు.." మధ్యలో ఆపి "ఆ అంత కష్టపడాలి ఏంటి రా నువ్వు, మనకి ఉన్న ఇల్లు,అద్దెలు చూసుకుంటూ ఉంటే నెల ఇట్టే గడిచిపోతుంది"

"అది నువ్వలా ఆలోచిస్తావ్! పిల్లలు అలా ఆలోచించరు, మాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, మన ఇంటి పేరు, కులం వాడకుండా..అప్పుడే మర్చిపోయావా! మన పక్కింట్లో అబ్బాయికి 100 మార్కులు వచ్చినా సీట్ ఇచ్చారు, నాకు 139 వచ్చినా సీట్ రాలేదు..ఇప్పుడు అవన్నీ ఎందుకు అనకు, కష్టపడి చదివే వాళ్ళ మనసుల్లో అలాంటివి నాటుకు పోతాయి" "అలా అనను రా, అప్పుడు నువ్వెంత బాధ పడ్డావో నాకు తెలుసు"

"హ్మ్మ్ మరింకెందుకు, అస్తమానూ ఆ విషయం ఎత్తకు, నాకేమీ ఎవరి మీద ద్వేషం లేదు, నా పని నేను చేసుకుంటున్నా, ఒకరి మీద ఆధార పడకుండా, ఇంకెందుకు చెప్పు ఇవన్నీ"అన్నాడు కార్తీక్, తల్లి ముఖం చిన్న బోవడంతో తుషార "ఇంక ఆపండి" అన్నట్టు సైగ చేసింది పక్కన నుండి.

"సరే కానీ ఏం కూర ఈ రోజు" అంటూ మాట మార్చి కాసేపు మాట్లాడాడు.

ఆ రాత్రి భోజనాలు అయ్యాక "రేపు పొద్దున్నే డ్రైవింగ్ టెస్ట్ ఉంది, కొంచెం త్వరగా లేవాలి" అన్నాడు భార్యతో.

"ఆవిడ మీద ఎందుకు అలా నోరు వేసుకుని పడిపోతారు,చుట్టు పక్కల అన్నవి విన్నవి నీ దగ్గర చెప్తారు అంతే" అడిగింది తుషార.

"అది అమ్మ మీద కోపం కాదు, ఇక్కడ డబ్బు కోసమే ఉంటున్నాం, డాలర్ల లో పడి అందరినీ మర్చిపోతున్నారు అంటారు చూడు, వాళ్ళ మీద, మొన్నా మధ్య ఇండియా లో ముంబై లో ఉన్న ఫ్రెండు తో మాట్లాడితే పండగ కి వెళ్ళటం లేదు, సెలవు లేదు అన్నాడు, అలా ఉన్నారు కొందరు.. నాకే ఆశ్చర్యం వేసింది ప్రతి సంవత్సరం మనమే వెళ్తున్నాం, దగ్గర


ఉండి వాళ్ళు వెళ్ళటం లేదు, అంతే కాదు, ఇంట్లో ఇబ్బంది అని అమ్మా నాన్నను వృద్ధాశ్రమంలో వేశారు అంట!! ఎంత సేపు ఇక్కడ ఉన్నారు అని మనల్ని దెప్పీ పొడవటమే తప్ప, దాని వల్ల మనకి మానసికంగా బాధ కలగడం తప్ప ఉపయోగం లేదు" అన్నాడు.

"హ్మ్మ్, సరే పడుకోండి, రేపు లేవాలి పొద్దున్నే" అంది తుషార.

***

మర్నాడు టెస్టు అయ్యాక తల్లికి మెసేజ్ పెట్టాడు "డ్రైవింగ్ టెస్టు పాస్ అయ్యా అమ్మా" అని..

"చాలా సంతోషం నాన్న జాగ్రత్త" అని పెట్టింది లేవగానే చూసి.

"ఉదయమే ఏంటి తెగ మురిసిపోతున్నారు రాణి వారు" అన్నాడు మోహన రావు, మనవాడు డ్రైవింగ్ టెస్టు పాస్ అయ్యాడు అంట, అదా, అందులో ఏముంది వింత అన్నాడు నవ్వుతూ.

"మీకు లేదు నాకు ఉంది, వాడు చిన్నప్పుడు ఎవరితోనూ కలవడం లేదు,ఎక్కువ మాట్లాడడం లేదు అని వీడెంటి ఇలా ఉన్నాడు, ఇలా అయితే చాలా కష్టం అని అందరూ అంటే డాక్టరు దగ్గరకి తీసుకు వెళ్ళాను..

"ఆయన మాట మర్చిపోలేను, ఎక్కడ ఉన్నాడో కానీ మహానుభావుడు!! మాట ఏముంది అమ్మా!! ఎక్కువ మాట్లాడకుండా ఉంటేనే మంచిది, గొప్ప వాడు అవుతాడు వీడు" అన్నాడు.

"అది గుర్తొచ్చింది ఇప్పుడు, వాడి పొట్ట వాడు నింపుకుంటున్నాడు,ఎప్పుడూ రూపాయి అడగలేదు" అంది మురిసిపోతూ.

***

ఆ సంవత్సరం పండగ కి వచ్చారు కొడుకు, కోడలు.
ఇద్దరూ సరదాగా అత్త మామలు, తల్లి తండ్రుల గడిపారు.."అమ్మా, అత్తయ్య మమ్మల్ని తిరిగి వచ్చేయమని అంటున్నారు, మీరేమి అడగరే మమ్మల్ని" అంది తుషార తల్లితో. "అమ్మో, అక్కడే ఉండవే నువ్వు, నిన్ను వేధించిన వెదవ శుభ్రంగా తిరుగుతున్నాడు బయట,వాడిని చూసినప్పుడల్లా భయమే నాకు, నువ్వు, అల్లుడు గారు ఎక్కడ ఉన్నా సంతోషంగా, భద్రంగా ఉంటే అదే చాలు..పదివేలు..అదృష్టం కొద్దీ అర్దం చేసుకునే అత్త, మామలు, భర్త దొరికారు!!ఇక్కడ ఉంటే వాడింకేమి చేసేవాడో తలచుకుంటేనే భయంగా ఉంది" అంది తుషార తల్లి.

కొన్ని రోజులు అక్కడ సరదాగా గడిపి పండగ అయ్యాక ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అని దేవకి, మోహన రావు నీ కూర్చో పెట్టారు.

అది ఏమిటి అంటే పేరెంట్ విసా తో ఇద్దరినీ తీసుకు వెళ్ళే ప్రణాళిక వేస్తున్నాం అని..

"మేము అక్కడికి ఎందుకు రా ఈ వయసులో" అంటున్న తల్లిని "పూర్తిగా చెప్పనివ్వు, ఇక్కడ కొద్ది దూరంలో ఒక వెంచర్ ఉంది, అక్కడ ఒక ఫ్లాటు బుక్ చేద్దామని, అది ఎప్పటి నుండో ఉందట, అందులో వాళ్ళని కూడా కలిశాం, భోజనాలకు మెస్ ఉంది, రెండు గదుల ఇల్లు, యోగా, వ్యాయామం, దేవుడి పూజలు వంటివి చేయిస్తారు, ఆర్గానిక్ కాయగూరలు, ఆకు కూరలు వాళ్ళే పండిస్తున్నారు పేరు "ధ్యాన జగతి"..మనం వచ్చినపుడు ఉండడానికి ఎంతో బాగుంటుంది. ఇది వరకులా నెల మాత్రమే కాకుండా ఒక మూడు నాలుగు నెలలు వచ్చేలా చూసుకుంటాం నేను, తుషార.


అందరం ఉండడానికి సరిపోతుంది. పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మీకు సమ్మతం అయితే ఒకసారి చూసి వద్దాం."అనగానే

"బోల్డు ఖర్చు, దారి ఖర్చులు అవసరమా" అంటున్న దేవకి వైపు మోహన రావు కూడా చిత్రంగా చూసాడు "నేను రిటైర్ అయిన ఉద్యోగిని, నా సంపాదన ఇంకా ఉంది దేవకీ,అది ఆస్తుల రూపంలో మార్చి పిల్లల్ని ఆశాపరులుగా మార్చే కన్నా మనమే ఉపయోగించుకుంటే మంచిది, నీ కొడుకు డబ్బులు ఖర్చు పెట్టమివ్వనులే" అన్నాడు నవ్వుతూ.. "ఈ వయసులో మీరు డబ్బుల గురించి ఆలోచన కాదు,పెద్ద ఎక్కువ ఖర్చు అవ్వదు, సంవత్సరానికి రెండు సార్లు ప్రయాణం అంతే కాబట్టి పిల్లలతో గడపడం, మీ వాళ్ళతో గడపడం అదే ముఖ్యం" అన్న పిల్లల మాటలు విని

"సరే, ఒకసారి చూద్దాం" అని వెళ్ళిన దేవకి, మోహన రావు కి అక్కడ వాతావరణం చాలా నచ్చింది.

కనుచూపు మేర పొలాలు, ఆవులు, మొక్కలు, ఏ రణ గొన ధ్వనులు లేవు, అక్కడ నుండి ఆసుపత్రి మూడు కిలోమీటర్లు మాత్రమే..ముందు ఉండే వాళ్ళతో మాట్లాడారు.. తిరిగి తమ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి వృద్ద జంటకి.

బుక్ చేసుకున్నారు.

***

ఆ తరువాత సంవత్సరం ఇద్దరికీ విసా అప్రూవ్ అవడంతో ఆస్ట్రేలియా తీసుకు వచ్చారు పిల్లలు.ఇక్కడ కూడా అవే వంటలు, దగ్గర లోనే గుడి ఉండడం, అక్కడ భజన బృందంతో పరిచయం, మరి కొంత మంది తమ లాగే వచ్చిన వాళ్ళతో స్నేహం తో కాలం ఇట్టే గడిచిపోయింది వాళ్ళకి.

అందరూ కలిసి పండుగ సమయానికి "ధ్యాన జగతి" వెళ్ళేందుకు సిద్దం అయ్యారు.

ఆ రోజు టికెట్స్ బుక్ చేశాక, వేరే నోటిఫికేషన్ రాగానే చూసి, ఇండియా లో వీధి బలలు సంరక్షణ సంస్థ అయిన "సేవ్ ద చిల్డ్రన్" కి విరాళం ఇచ్చాడు కార్తీక్, ప్రతీ నెలా చేసే పనుల్లో అదొకటి.

***

విదేశాలకు వెళ్ళి పోయి అమ్మా, నాన్నలను పట్టించుకోరు, సంప్రదాయాన్ని మర్చిపోయారు, దేశం అంటే విలువ లేదు, వచ్చి రాని భాష మాట్లాడతారు, గొప్పలకు పోతారు, డబ్బులో పడి విలువలు మర్చిపోయారు.

నాణేనికి మరో వైపు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా దేశాన్ని,సంప్రదాయాన్ని తల్లిదండ్రులను కూడా పట్టించుకుంటారు..బంధాలకు విలువ ఇస్తారు, కష్టపడి పని చేస్తారు, తెలుగులో మాట్లాడతారు.

వాళ్ళూ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సినిమాల్లో,సీరియల్లో, షార్ట్ ఫిల్మ్స్ లో చూపించేది నాణానికి ఒక వైపు మాత్రమే.

ఒక అమ్మాయి, అబ్బాయి విదేశంలో చనిపోతే వెంటనే "ఎక్కడికో వెళ్ళి ఎందుకు చస్తున్నారు" ఇవి సమీక్షలు..ఎంత దారుణం..అక్కడే ఉండి మర్డర్ అయి, రేప్ గురి అయిన వారు లేరా!! క్షమించండి..ప్రాణం ఎక్కడ పోయినా బాధాకరం, ఆ కుటుంబ, కన్న పేగు శోకం తీర్చలేనిది. అదే వాళ్ళు బతికి కష్టపడి పని చేసి ఐ ఫోన్ తెచ్చి ఇస్తే తీసుకునే వాళ్ళు కోకొల్లలు... మా అనుభవాల ఆధారంగా రాసినది. కేవలం నా అభిప్రాయం, అనుభవం, ఉద్దేశ్యం అంతే.

తప్పులు ఉంటే క్షమించండి!!ఓపికగా చదివిన వారికి ధన్యవాదాలు🙏🙏

"ధ్యాన జగతి" అనేది నిజంగా ఉన్నది, రాజమండ్రికి కొన్ని కిలో మీటర్ల దూరంలో.