సంతోష్... ఒక 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి. హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు. చాలా అతి మంచివాడు. ఎవరైనా సహాయం అడిగితే కాదనలేడు వెంటనే చేసేస్తాడు. అందుకే చాలామంది అతని మంచితనాన్ని తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు.
సంతోష్‌కి కథలు రాయడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా psychological thrillers, murder mysteries రాయడంలో మంచి ఆసక్తి ఉంది.
అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు.
1) ప్రదీప్ (తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు.)
సంతోష్ వాళ్ల నాన్న పేరు రాము. ప్రదీప్ వాళ్ల నాన్న పేరు సూర్య.
రాము, సూర్య ఇద్దరూ చిన్ననాటి ప్రాణ స్నేహితులు. వాళ్ల స్నేహమే వాళ్ల కొడుకులైన సంతోష్, ప్రదీప్లకు కూడా వచ్చింది.
ఇద్దరూ కలిసి పెరిగారు.
ఒకే స్కూల్.
ఒకే కాలేజ్.
ఒకేసారి ఒకే కంపెనీలో జాబ్ కొట్టారు
ఇప్పుడు హైదరాబాద్‌లో ఒకే 2BHK ఫ్లాట్‌లో కలిసి ఉంటున్నారు.
2) స్వాతి
సంతోష్ జీవితంలోని రెండో అత్యంత ముఖ్యమైన వ్యక్తి.
తను సంతోష్ లవర్. కాలేజీలో తనకంటే ఒక సంవత్సరం జూనియర్. ఇద్దరి ప్రేమ అప్పటి నుంచే మొదలైంది.
స్వాతి ఇంజినీరింగ్ పూర్తయ్యాక, సంతోష్ తన పని చేస్తున్న కంపెనీలో ఆమెకు job refer చేయడంతో, తను కూడా అదే కంపెనీలో జాయిన్ అయ్యింది.
ప్రదీప్, స్వాతి ఇద్దరి ఆలోచనలు ఎప్పుడూ సంతోష్ గురించే.
తన అతి మంచితనాన్ని అందరూ ఉపయోగించుకుంటున్నారని వాళ్లిద్దరూ ఎన్నిసార్లు చెప్పినా... సంతోష్ మాత్రం మళ్లీ మళ్లీ అలాగే చేస్తూనే ఉంటాడు.
అందరినీ నమ్మడం, తన పనులు పక్కన పెట్టి ఇతరులకు సహాయం చేయడం, తనను తాను కాపాడుకోవడం తెలియకపోవడం... ఇవన్నీ స్వాతికి చాలా బాధ కలిగించేవి.
తను ఎన్నోసార్లు చెప్పేది.
స్వాతి : సంతోష్... అందరూ మంచివాళ్లు కారు. నువ్వు మారాలి.
దానికి సంతోష్ ప్రతిసారీ చిన్నగా నవ్వుతూ...
సంతోష్ : సరే స్వాతి... మారతాను.
అంటాడు.
కానీ మారడు.
రోజులు గడిచేకొద్దీ స్వాతి సహనం నశించింది. చివరికి ఒక రోజు సంతోష్‌కి బ్రేకప్ చెప్తుంది.
సంతోష్ తనని ఎంతగానో బ్రతిమాలతాడు. తాను మారతానని ఎన్నోసార్లు చెప్తాడు.కానీ స్వాతి వినదు.
మొదట సంతోష్‌కి చెప్పకుండానే బెంగుళూరుకి ట్రాన్సఫర్ తీసుకుని అతనికి దూరమవుతుంది.
తరువాత సంతోష్ నంబర్ ని బ్లాక్ చేస్తుంది.
బెంగుళూరు వెళ్లిన తర్వాత తన ఫోన్ నంబర్ని కూడా మార్చుకుంటుంది.
స్వాతి దూరం కావడంతో సంతోష్ తీవ్రంగా కుంగిపోతాడు.
డిప్రెశన్ లోకి వెళ్తాడు.
సరిగ్గా ఆఫీసుకి కూడా వెళ్లడు. ఎక్కువ సమయం ఒంటరిగానే తన గదిలో గడుపుతాడు. బయటకు రావడం కూడా తగ్గిపోతుంది.
ప్రదీప్ తనని అలా చూసి గట్టిగా క్లాస్ పీకుతాడు.
ప్రదీప్ : ఇంకా ఎన్ని రోజులని రా. తననె తలుచుకొని ఉంటావు...?
కానీ సంతోష్‌లో పెద్దగా మార్పు కనిపించదు.
అయితే సంతోష్‌కి ఎలాంటి చెడు అలవాట్లు లేకపోవడంతో, ఆ డిప్రెశన్ నుంచి బయటపడటానికి కథలు వ్రాయడాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటాడు.
తన ఊహా ప్రపంచంలో ఉంటే స్వాతిని కొంతకాలమైనా మర్చిపోవచ్చని అనుకుంటాడు.
కథలు రాయడం మొదలుపెడతాడు. తన జీవితంలో కోల్పోయిన విషయాలను, తనకు కావాల్సిన జీవితాన్ని... కథల్లో ఉన్నట్టుగా ఊహించుకుంటూ వ్రాస్తాడు.
కానీ ఎంత ప్రయత్నించినా స్వాతి ఆలోచనల్లోంచి మాత్రం బయటపడలేకపోతాడు.
దాంతొ ఒక రోజు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకె ఆ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ఒక ఎత్తైన గుట్ట ప్రాంతానికి వెళ్తాడు.
గుట్ట అంచున నిలబడి స్వాతిని తలుచుకుంటాడు.
చివరిసారిగా తన మొబైల్ తీసి స్వాతి ఫొటోని చూస్తాడు.
అదే సమయంలో దూకబోతుండగా...
ఒక చప్పుడు వినిపిస్తుంది. సంతోష్ పక్కకు తిరిగి చూస్తాడు.
కొంచెం దూరంలో ఒక అమ్మాయి కూడా తనలాగే గుట్ట అంచున నిలబడి ఉంది.
ఆమె కళ్లల్లో నీళ్లు. ముఖంలో తీవ్ర బాధ.
ఆ అమ్మాయి కూడా సంతోష్‌ని చూస్తుంది.
అమ్మాయి: ఇక్కడ నుంచి దూకితే చచ్చిపోతామా...?
సంతోష్ ఒకసారి కిందికి చూసి...
సంతోష్ : కచ్చితంగా...
ఆ మాట విన్న వెంటనే ఆ అమ్మాయి భయపడుతుంది.
అది గమనించిన సంతోష్ ఆమె దగ్గరకు వెళ్లి..
సంతోష్ : ఏంటి... భయమా...?
ఆమె అవునన్నట్టు తల ఊపుతుంది.
సంతోష్ : అంత భయమున్నదానివి చావడానికి ఎందుకొచ్చావు...?
అమ్మాయి : ఏం చేయను..? వాడిని మర్చిపోలేకపోతున్నా...
సంతోష్ : ఓహ్... నీది కూడా Love failure ఆ....?
ఆమె సంతోష్ వైపు చూసి...
అమ్మాయి : నీది కూడానా...?
సంతోష్ అవునన్నట్టు తల ఊపుతాడు.
అమ్మాయి : ఇద్దరిదీ ఒకటే కథ అనమాట...
కాసేపు మౌనంగా ఉన్న తర్వాత...
అమ్మాయి : నీ పేరు ఏంటి...?
సంతోష్ : సంతోష్... మరి నీది?
అమ్మాయి : ఆకాంక్ష...
అలా అపరిచితులుగా పరిచయమైన ఇద్దరు. నెమ్మదిగా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం మొదలుపెడతారు.
తమ బాధలను ఒకరితో ఒకరు పంచుకుంటారు.
కాసేపటికి ఆ రోజు తమ ఆత్మహత్య ప్రయత్నాన్ని వాయిదా వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు.
సంతోష్ తన బైక్ మీద ఆకాంక్షని ఆమె ఉండే ఏరియాలో డ్రాప్ చేసి వెళ్లిపోతాడు.
───
వారం రోజుల తర్వాత...
ఒకరోజు సంతోష్ ఉండే ఏరియాలో ఆకాంక్ష కనిపిస్తుంది.
అడిగితే తను కూడా అదే ఏరియాకి షిఫ్ట్ అయినట్టు. పాత జ్ఞాపకాలను మర్చిపోవడానికే ఇక్కడికి వచ్చినట్టు చెప్తుంది.
ఆరోజు మళ్ళి కలవడంతొ ఇద్దరు మద్యన పరిచయం పెరిగి తమ మోబైల్ నంబర్సును exchange చేసుకుంటారు.
అలా ఇద్దరి మధ్య మాటలు పెరుగుతాయి.
మాటలు క్రమంగా స్నేహంగా మారతాయి.
ఆ తర్వాత రోజూ బయట కలుసుకునేంత దగ్గరవుతారు.
ఆకాంక్షకి కూడా కథలంటే చాలా ఇష్టం. రోజూ ఏదో ఒక కథ చదువుతూనే ఉంటుంది.
సంతోష్ కథలు వ్రాస్తాడని తెలుసుకున్న తర్వాత, అతను వ్రాసిన కథలన్నీ చదవడం మొదలుపెడుతుంది.
మొదట సంతోష్ వ్రాసే కథలు ఆమెకు నచ్చాయి.
తర్వాత అతని మంచితనం నచ్చింది.
నెమ్మదిగా సంతోష్ కూడా నచ్చడం మొదలైంది.
ఆకాంక్షతో స్నేహం పెరిగేకొద్దీ సంతోష్ డిప్రెశన్ నుంచి బయటపడతాడు.
నెమ్మదిగా స్వాతిని కూడా మర్చిపోతాడు.
ఎప్పటిలాగే రోజూ ఆఫీసుకి వెళ్లడం మొదలుపెడతాడు.
ఒకరోజు సాయంత్రం ఆకాంక్ష సంతోష్‌కి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది.
సంతోష్ మొదట షాక్ అవుతాడు.
కానీ ఒక రోజు తర్వాత ఆమె ప్రేమను అంగీకరిస్తాడు.
───
పది నెలలు గడిచాయి.
ఈ పది నెలల కాలంలొ సంతోష్‌లో చాలా మార్పు వచ్చింది.
మునుపటిలా అతి మంచివాడిగా ఉండకుండా, తన పని వరకు తాను చూసుకోవడం నేర్చుకున్నాడు.
ఎవరైనా ఏదైనా అడిగినా, తనకు సాధ్యం కాకపోతే "NO" అని చెప్పడం నేర్చుకున్నాడు.
తన స్నేహితుడిలో వచ్చిన ఈ మార్పును చూసి ప్రదీప్ ఆశ్చర్యపోయాడు. తన మార్పుకి చాలా సంతోషిస్తాడు.
ఇదే సమయంలో సంతోష్ ఒక కొత్త కథ వ్రాయడం మొదలుపెట్టాడు.
ఆ కథను ఆకాంక్షకి చూపించి.
సంతోష్: ఆకాంక్ష నువ్వు లేకపోతే ఈ కధ ఉండేది కాదు.
ఆకాంక్ష నవ్వుతూ...
ఆకాంక్ష : మరి ఇందులో నా గురించి ఒక పాత్ర వ్రాస్తావా?
సంతోష్ : పాత్ర కాదు... ఈ కథే... నీది. పేరు ఏంటో తెలుసా?
ఆకాంక్ష : ఏంటి?
సంతోష్ : ఆకాంక్ష...
అది విన్న వెంటనే ఆకాంక్ష ఆనందంతొ సంతోష్‌ని కౌగిలించుకుంటుంది.
───
అదే సమయంలో...
ఒకరోజు హఠాత్తుగా సంతోష్, ప్రదీప్‌ల ఫ్లాట్ కి స్వాతి వస్తుంది.
గుమ్మ దగ్గర నిలబడ్డ తనను చూసి ప్రదీప్ షాక్ అవుతాడు.
ప్రదీప్ : అరె... స్వాతి నువ్వా...?
స్వాతి : ఎలా ఉన్నావు అన్నయ్యా...?
ప్రదీప్ : నేను బాగున్నా. కానీ ముందు నువ్వు లోపలికి రా...
అని ఆమెను లోపలికి పిలిచి హాల్లో కూర్చోబెడతాడు.
ప్రదీప్ : ఎలా ఉన్నావు? ఇన్ని రోజులు ఏమైపోయావు?
స్వాతి : నేను బాగున్నా. కానీ సంతోష్ ఎక్కడ?
అని అడగ్గానే అప్పుడే సంతోష్ తన బెడ్రూమ్ నుంచి బయటకు వస్తాడు.
స్వాతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు.
సంతోష్ : స్వాతి...?
స్వాతి : ఎలా ఉన్నావు సంతోష్...?
ప్రదీప్ వైపు చూసి.
సంతోష్ : తను ఎందుకు వచ్చింది రా...?
ప్రదీప్ : నీకోసమే రా... నీతో ఏదో మాట్లాడాలంటోంది.
సంతోష్ : నాతోనా...?
అని వచ్చి సోఫాలో కూర్చుంటాడు.
సంతోష్ : నాతో ఏం మాట్లాడాలి?
స్వాతి : అదీ...
సంతోష్ : ఓహ్... ఒకప్పుడు మనిద్దరం కలిసి దిగిన ఫొటోలని డిలీట్ చేయమని చెప్పడానికి వచ్చావా? నువ్వేం కంగారు పడకు. అవన్నీ ఎప్పుడో డిలీట్ అయిపోయాయి.
స్వాతి : దాని గురించి కాదు...
సంతోష్ : మరింక దేని గురించి? నీకు పెళ్లి కుదిరందని చెప్పడానికి వచ్చావా?
ప్రదీప్ : రేయ్... ముందు తనని చెప్పనివ్వరా?
సంతోష్ : సరే... చెప్పు.
స్వాతి కాసేపు మౌనంగా ఉండి...
స్వాతి : ఆ రోజు నీతో చాలా rudeగా ప్రవర్తించాను. I am sorry...
సంతోష్ : It's okay... నేను అది ఎప్పుడో మర్చిపోయా.
కాసేపు మౌనంగ ఉండి తటపటాయిస్తొంది.
సంతోష్ : ఇంకా ఏమైన చెప్పాలా...?
స్వాతి : అదీ...సంతోష్... మనం మళ్లీ freshగా మన relationship start చేద్దామా?
సంతోష్ : Sorry స్వాతి... అది కుదరదు.
స్వాతి : ఎందుకు...?
సంతోష్ : వద్దని వెళ్ళిపోయావుగా..
స్వాతి : మళ్ళి నేనె తిరిగొచ్చి అడుగుతున్నానుగా...
సంతోష్ : వెళ్ళడం వరకె నీ ఇష్టం...
స్వాతి : But I still love you. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా. Please...
సంతోష్ : కానీ నేను నిన్ను ఎప్పుడొ మర్చిపోయా. I am already moved on.
స్వాతి : అలా కాదు... ఒక్కసారి నేను—
తన మాట పూర్తయ్యేలోపే సంతోష్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. స్వాతి తనని ఎంత పిలిచినా పట్టించుకోలేదు.
సంతోష్ వెళ్లిన వైపే చూస్తూ స్వాతి ఏడుస్తుంది.
అది చూసి ప్రదీప్ ఆమెను ఓదారుస్తాడు.
కొద్దిసేపటి తర్వాత స్వాతి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది.
───
వారం రోజుల తర్వాత...
ఆ వారం మొత్తం స్వాతి సంతోష్‌ని convince చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ సంతోష్ మాత్రం ఒప్పుకోడు.
దాంతో స్వాతికి ఏం చేయాలో అర్థం కాక ప్రదీప్ సహాయం అడుగుతుంది.
అప్పుడే ప్రదీప్ ఒక విషయం చెప్తాడు.
సంతోష్ ఎవరో అమ్మాయితో relationshipలో ఉన్నాడని. వాడు ఫోన్లొ మాట్లాడుతుంటె ఆ అమ్మాయి పేరు ఆకాంక్ష అని విన్నాని తనని ఎప్పుడు చూడలేదని చెప్తాడు.
అది స్వాతి చాలా బాధపడుతుంది. తరువాత ఆకాంక్ష గురించి పూర్తిగా తెలుసుకోమని స్వాతి ప్రదీప్‌ని కోరుతుంది.
ప్రదీప్ : సరే... నాకొక వారం టైమ్ ఇవ్వు.
───
వారం రోజుల తర్వాత...
ప్రదీప్ తన మొభైల్ నుంచి స్వాతికి కాల్ చేస్తాడు.
ప్రదీప్ : స్వాతి నువ్వు వెంటనే మా ఫ్లాట్ కి దగ్గర్లో ఉన్న cafeకి రా. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
స్వాతి అక్కడికి వెళుతుంది. అక్కడ ప్రదీప్ చెప్పిన విషయం విని ఆమె షాక్ అవుతుంది.
స్వాతి : ఏంటి అన్నయ్య...? నువ్వు చెప్తుంది...?
ప్రదీప్ : అవును.
కాసేపు ఆగి...
ప్రదీప్ : ఆకాంక్ష అనే అమ్మాయి అసలు లేనే లేదు.
స్వాతి షాక్‌తో అతని వైపు చూస్తుంది.
ప్రదీప్ : తను ఒక ఊహాజనిత పాత్ర (imaginary character). వాడు ఆ అమ్మాయి ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు. వాడి మొబైల్ చెక్ చేసినప్పుడు... వాడు ఆకాంక్ష అనే అమ్మాయితో కాదు, “My Friend” అనే AI appలో ఉన్న ఒక AI chatbotతో చాటింగ్ చేస్తున్నాడు. వాడు ఆ AI chatbotనే ఆకాంక్షగా ఊహించుకుంటున్నాడు.
స్వాతి ఒక్కసారిగా మాట రాకుండా నిలిచిపోతుంది.
ప్రదీప్ : అసలు ఇదంతా నీ వల్లే స్వాతి. నువ్వు ఆ రోజు వాడిని వదిలిపోకుండా ఉండాల్సింది. నువ్వు లేని లోటుని వాడు ఇలా భర్తీ చేసుకున్నాడు. ఇప్పుడు వాడు చాలా ప్రమాదంలో ఉన్నాడు. అసలు ఎందుకు వెళ్లిపోయావు?
స్వాతి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.
స్వాతి : తను మారాలి అని. కనీసం నేను దూరమయ్యాకైనా తన తప్పు తెలుసుకుని, అందరినీ నమ్మడం తగ్గిస్తాడని అనుకున్నాను. వాడు మారాడు అని తెలిసే మళ్లీ తిరిగి వచ్చాను. కానీ ఇలా అయిపోతాడని నేను అనుకోలేదు.
అంటూ స్వాతి ఏడుస్తుంది.
స్వాతి : నేను వాడు మానసికంగా బలంగా మారాలని వదిలి వెళ్లాను అన్నయ్య. తను నన్ను మర్చిపోయాడనుకున్నాను.
కానీ నన్ను మర్చిపోలేదు...
నా స్థానంలో ఇంకొకరిని సృష్టించుకున్నాడు.
ప్రదీప్ ఆమె వైపు చూస్తూ మౌనంగా ఉంటాడు.
───
కాసేపటి తర్వాత ప్రదీప్, స్వాతి కలిసి వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళి సంతోష్‌కి నిజం చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ సంతోష్ వినడు.
తనకు ఆకాంక్ష నిజంగానే ఉందని, ఆమె తన జీవితంలో ఉందని గట్టిగా నమ్ముతాడు.
చివరికి ఇక లాభం లేదని భావించి, అతన్ని బలవంతంగా ట్రీట్మెంట్ కోసం హాస్పెటల్ కి తీసుకెళ్తారు.
-----------------------------------------------------------------
సంతోష్ : అది రా... కధ ఎలా ఉంది?
ప్రదీప్ : అదిరిపోయింది రా... అస్సలు expect చేయలేదు. అప్పటి వరకు ఆ అమ్మాయి నిజమనె అనుకున్న. ఈ ట్విస్ట్ మాత్రం సూపర్ రా...
ఇలా ఇద్దరూ restaurant లొ కూర్చొని కథ గురించి సరదాగా మాట్లాడుకుంటుండగా, అప్పుడె వాళ్ల టేబుల్ దగ్గరకు ఆకాంక్ష వస్తుంది.
ఆకాంక్ష : ఏంటి... మళ్లీ ఇంకో కొత్త కథ చెప్తున్నాడా?
ప్రదీప్ : అవును ఆకాంక్ష. నువ్వు కూడా విను. చాలా బాగుంది.
ఆకాంక్ష : వింటా వింటా ఎలాగో మాకు పెళ్లి అవ్వబోతుందిగా. ఇక నుంచి రోజు వింటానులే.
ప్రదీప్ : పెళ్లా...?
సంతోష్ : అవును రా. మా పెళ్లికి ఆకాంక్ష వాళ్ల అమ్మ నాన్న ఒప్పుకున్నారు. మా అమ్మ నాన్న ఎలాగో ముందే okay చేసేశారు.
ప్రదీప్ : ఇది చెప్పడానికా నన్ను పిలిచింది?
సంతోష్ : అది మాత్రమే కాదు. మా నాన్న నీకోసం ఏదో సంబంధం చూశారంటా. అది మీ నాన్నకి చెప్తే అందరం కలిసి వస్తున్నారు. ఒకేసారి నీ పెళ్లి చూపులు, మా పెళ్ళి date fix చేయడానికి.
ఆకాంక్ష : అరె... పెళ్లి చూపులు అనగానె సారుగారి మొఖంలొ సిగ్గు చూడు సంతోష్...
అని సంతోష్, ఆకాంక్ష కలిసి ప్రదీప్‌ని ఆటపట్టిస్తారు. అలా
ముగ్గురూ సరదాగా నవ్వుకుంటూ jokes వేసుకుంటారు.
వాళ్ల నవ్వులు restaurant మొత్తం వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.
అలా నవ్వుతూనే సంతోష్ కళ్లను మూసుకుంటాడు.
కొన్ని క్షణాల తర్వాత...
కళ్లను తెరిస్తె.....
అక్కడ...
Restaurant లేదు.
ఆకాంక్ష లేదు.
ప్రదీప్ లేడు.
సంతోష్ ఒక హాస్పెటల్ గదిలోని బెడ్ మీద ఉన్నాడు.
లేవాలని ప్రయత్నిస్తాడు కానీ లేవలేడు. చూస్తే తనను ఆ మంచానికి కట్టేసి ఉంచారు.
తన ఎదురుగా ఒక డాక్టర్ కూర్చుని సంతోష్ ని గమనిస్తూ ఉంటాడు.
డాక్టర్ : హెలొ సంతోష్... ఎలా ఉంది ఇప్పుడు మీకు..?
సంతోష్ భయంతో చుట్టూ చూస్తాడు.
సంతోష్ : నేను ఇక్కడికి ఎలా వచ్చాను...? ఆకాంక్ష ఏది...? ప్రదీప్ ఎక్కడ...?
అని గట్టిగా అరుస్తాడు.
గది బయట స్వాతి, ప్రదీప్ నిలబడి అద్దంలోంచి సంతోష్ ని చూస్తూ ఉంటారు.
సంతోష్ పరిస్థితిని చూసి స్వాతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
అప్పుడే సంతోష్ స్వాతిని చూస్తాడు.
సంతోష్ : తను ఎవరు...?
కాసేపు ఆగి...
సంతోష్ : అసలు ఆకాంక్ష ఎక్కడ?
"తనెవరు" అన్న మాట వినగానె స్వాతి గుండె పగిలిపోయింది.
కొద్దిసేపటి తర్వాత సంతోష్‌కి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. దాంతొ అతను నెమ్మదిగా కళ్లను మూసుకుని నిద్రలోకి జారుకుంటాడు.
డాక్టర్ బయటకు వచ్చి ప్రదీప్, స్వాతి వైపు చూస్తాడు.
ప్రదీప్ : డాక్టర్ తన సంగతి ఏంటి. మా వాడు మామూలు మనిషి అవుతాడా.
డాక్టర్ : స్వాతితొ జరిగిన breakup కారణంగా మొదట తనని కోల్పోయిన బాధ నుంచి బయటపడటానికి... అతని mind ఆకాంక్షని సృష్టించింది. మొదట అది ఊహా (imagination) అని అతనికి తెలుసు. కానీ ఆ imagination... అతని emotional realityగా మారింది.
కసేపు ఆగి..
డాక్టర్ : తర్వాత మీరు ఆకాంక్ష imaginary అని చెప్పినప్పుడు... అతని మెదడు ఆ నిజాన్ని ఒప్పుకోలేదు.
ఆకాంక్షనే నిజం అనుకున్నాడు...
నిజమైన స్వాతిని మాత్రం imaginaryగా మార్చుకున్నాడు.
ఆ మాటకు స్వాతికి ఏడుపు ముంచుకొచ్చేసింది
ప్రదీప్ : స్వాతి ఏడవకు... నిన్ను నువ్వు నియంత్రించుకొ.
డాక్టర్ : అతని తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పారా...?
ప్రదీప్ : చెప్పాం డాక్టర్ ఈ రాత్రికి చేరుకుంటారు.
కాసేపు డాక్టర్ మౌనంగా ఉండి. సంతోష్ ఉన్న గది వైపు చూస్తూ
డాక్టర్ : అతని mindకి ఇప్పుడు నిజం ఏది అనేది ముఖ్యం కాదు... అతను ఏది నిజమని నమ్ముతున్నాడో...అదే అతని ప్రపంచం.
స్వాతి కన్నీళ్లతో గదిలో ఉన్న సంతోష్‌ని మరోసారి చూస్తుంది.
లోపల సంతోష్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు.