బ్లాస్ me
సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశమంతా ఎర్రటి వెలుగులు చిమ్ముతుండగా, ఇరువైపులా దట్టమైన అడవి మధ్యగా ఉన్న ఆ హైవేపై నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక కారు అత్యంత వేగంగా దూసుకుపోతోంది.
డ్రైవింగ్ సీట్లో ఉన్న అంజు ముఖంలో ఏదో తెలియని ఉత్సాహం, ఒక వింతైన ఆనందం కనిపిస్తున్నాయి. కానీ, పక్క సీట్లో కూర్చున్న రుద్ర పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. అతని ముఖం భయంతో పాలిపోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్లు కారు సీటును గట్టిగా పట్టుకుని, వణుకుతున్న గొంతుతో అన్నాడు...
"వద్దు అంజు.. అంత స్పీడ్ వద్దు! ప్లీజ్, నాకు చాలా భయంగా ఉంది. ఆపు..."
అంజు అతని మాటలు విని నవ్వింది. ఆమె ముఖంలో ఏమాత్రం భయం లేదు, పైగా ఒక వింతైన ధీమా ఉంది.
"భయం వద్దు రుద్ర.. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. ఈ అందాన్ని చూడు!" అంటూ స్టీరింగ్ మీద నుంచి తన ఒక చేతిని తీసి, రుద్ర చేతిని గట్టిగా పట్టుకుంది.
ఆమె స్పర్శ తగలగానే రుద్ర మెల్లగా కళ్ళు తెరిచాడు. కానీ అతని కళ్ళలో భయం ఇంకా పోలేదు. ఎదురుగా దూసుకువస్తున్న రోడ్డును చూడగానే అతనిలో భయం కట్టలు తెంచుకుంది.
"వద్దు! ఆపు.. ఆపు అంటున్నాను!!" అంటూ గట్టిగా అరిచాడు.
సరిగ్గా అదే క్షణంలో అకస్మాత్తుగా రోడ్డుపై ఏదో అడ్డుగా వచ్చింది. అంజు కళ్ళు పెద్దవి చేసి, ప్రాణాలన్నీ కూడదీసుకుని ఒక్కసారిగా బ్రేక్ వేసింది. టైర్లు రోడ్డును గీరుకుంటూ చేసిన భయంకరమైన రాపిడి శబ్దం, రెండు లోహపు ముక్కలు బలంగా ఢీకొట్టుకున్నట్లుగా కారు నుజ్జునుజ్జయిన శబ్దం ఆ అడవిలో ప్రతిధ్వనించాయి. కారు నియంత్రణ తప్పి గాలిలో పల్టీలు కొట్టింది.
కొద్ది క్షణాల తర్వాత...
కారు తలకిందులుగా పడిపోయి ఇంజిన్ లోంచి పొగలు వస్తున్నాయి. లోపల ఇద్దరూ మొదట స్పృహ కోల్పోయారు. రుద్ర మెల్లగా కళ్ళు తెరిచాడు. అతని తలకి ఎలాంటి గాయం కాలేదు కానీ, కళ్ళ నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. తన పక్కనే ఉన్న అంజు తల నుంచి రక్తం కారడం చూశాడు.
ఆ దృశ్యం చూడగానే రుద్ర గుండె ఆగినంత పనైంది.
"నేను చేశానా ఇదంతా? ఎందుకు అరిచాను? అనవసరంగా అరిచానా..?" వణుకుతున్న గొంతుతో ఏడుస్తూ తనని తాను నిందించుకున్నాడు.
కంపించిపోతున్న తన చేతులతో అంజు కళ్ళలో ఉన్న నీళ్లను, నుదుటి మీద రక్తాన్ని నెమ్మదిగా తుడిచాడు. ఆ స్పర్శకు అంజు కష్టంగా కళ్ళు తెరిచింది. ప్రాణం పోతున్న ఆ క్షణంలో కూడా ఆమె కళ్ళలో రుద్ర గురించిన ఆరాటమే.
"రుద్ర.. నీకు ఏం కాలేదు కదా..?" చాలా బలహీనంగా అడిగింది.
ఆ మాట అనగానే ఆమె కళ్లు మూసుకున్నాయి. "అంజు.. అంజు.." అని పిలుస్తూనే రుద్ర కూడా చీకట్లోకి జారుకున్నాడు... మళ్లీ స్పృహ కోల్పోయాడు.
రుద్ర కళ్ళు తెరిచేసరికి నిశ్శబ్దంగా ఉన్న ఒక పెద్ద గది. మంచం మీద తను ఒక్కడే ఉన్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. తన తల పట్టుకుని చూసుకున్నాడు, గాయాలేమీ లేవు. గదిలో ఎవరూ లేరు. మంచం దిగి బయటికి అడుగులు వేశాడు. కానీ ఆ నడకలో మునుపటి గాంభీర్యం లేదు. అప్పుడే నడక నేర్చుకుంటున్న ఒక పసివాడు అడుగులు వేస్తున్నట్లు, తూలుతూ మెల్లగా హాలులోకి వచ్చాడు.
అప్పుడే హడావిడిగా లోపలికి వస్తున్న శారద, ఎదురుగా నిలబడి ఉన్న తన కొడుకు రుద్రని చూడగానే ఆమె కళ్లలో పట్టలేని ఆనందం కట్టలు తెంచుకుంది. కన్నీళ్లతో పరుగున వచ్చి రుద్రని గట్టిగా పట్టుకుంది.
"నాన్న! లేచావా? నీకేం కాలేదు కదా నా తండ్రి? ఆకలిగా ఉందా?" అంటూ రుద్ర ముఖాన్ని నిమురుతూ, తల మీద ముద్దు పెట్టింది.
"దేవుడు ఉన్నాడు.. నా కొడుకుని బ్రతికించాడు. ఎలా ఉంది నాన్న? తలనొప్పిగా ఉందా?" అని ఆరాటంగా అడిగింది.
కానీ రుద్ర ఆమె వైపు చాలా అమాయకంగా, ఒక చిన్న పిల్లాడిలా చూశాడు.
"ఎవరు..? ఎవరిని నేను..?" అని తడబడుతూ అడిగాడు.
ఆ ఒక్క మాటతో శారద ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆమె కళ్లలో అప్పటిదాకా ఉన్న ఆనందం మాయమై, ఒక పెద్ద భయం ఆవహించింది. కన్నీళ్లు ధారగా కారుతుండగా, గుండె ముక్కలైనట్లు ఏడుస్తూ...
"నువ్వు నా కొడుకువి.. రుద్రవి! నేను నీ అమ్మను రుద్ర.. శారదని.." అంటూ వాడిని గట్టిగా హత్తుకుంది. శారద అలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే, రుద్ర మాత్రం ఏమీ తెలియనట్లు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు.
రుద్ర ఆ శూన్యంలోకి చూస్తూనే, శారద అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాడు.
"రుద్రా... నీకేమైనా గుర్తుందా? ఆ రోజు ఏమైంది నాన్నా?" అని శారద కన్నీళ్లతో అడగగానే.. రుద్ర తన తల పట్టుకుని, కళ్ళు గట్టిగా బిగించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అతని ముఖంలో భయం, విపరీతమైన నొప్పి ఒకేసారి కనిపించాయి.
"ఆ రోజు... ఆ రోజు... నువ్వు.. నేను.. నాన్న..." అని వణుకుతున్న గొంతుతో చెబుతుండగానే, రుద్ర ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. చేతులు గట్టిగా బిగుసుకుపోయాయి. "నాన్న..." అంటుండగానే కళ్ళు పైకి తేలేసి నేల మీద కుప్పకూలిపోయాడు.
"రుద్రా..!" అని గట్టిగా అరుస్తూ శారద అతని దగ్గరికి పరుగులు తీసింది.
డాక్టర్ క్యాబిన్‌లో నిశ్శబ్దం అలుముకుంది. శారద ఏడుస్తూ డాక్టర్ వైపు చూస్తోంది. డాక్టర్ ముఖం చాలా సీరియస్‌గా ఉంది.
"చూడు శారద.. మీకు జరిగింది చాలా పెద్ద ప్రమాదం. అందులో మీరిద్దరూ ఎలాగో బ్రతికారు. కానీ... నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు కూడా తెలియదు. నీకు చెప్పడానికి కష్టంగా ఉన్నా.. మీ ఆయన చనిపోయినా నీ కొడుకు బ్రతికున్నాడు, అదే సంతోషం," అన్నాడు డాక్టర్.
శారద గుండె పగిలినట్లు ఏడుస్తుంటే, డాక్టర్ ఆమెను సముదాయిస్తూ ముందుకు వంగాడు.
"కానీ ఇక్కడ అసలైన ప్రాబ్లం ఏంటంటే... ఒకవేళ నువ్వు కానీ, ఇంకెవరైనా కానీ.. అతనికి ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేయాలని చూసిన మరుక్షణం అతని బ్రెయిన్ డెడ్ అవుతుంది. గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి అతని బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. వాడికి వాడే తెలుసుకున్నప్పుడు మాత్రమే వాడు బ్రతుకుతాడు. ఎవరైనా కొంచెం ప్రెషర్ పెట్టినా వాడి బ్రెయిన్ తట్టుకోలేదు. వాడు ఇప్పుడున్నది 25 ఏళ్ళ వయసులో కాదు.. 12, 13 సంవత్సరాల చిన్న పిల్లాడి మైండ్ సెట్‌తో ఉన్నాడు."
ఆ మాటలకు శారద షాక్ అయ్యింది. "ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్?" అని కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది.
"ఏమీ చేయలేం. ఎవరూ ప్రెషర్ పెట్టకూడదు. ఇంకో మాట... వాడికి నువ్వే ఒక ప్రపంచంలా మారకు. వాడి ప్రపంచం నువ్వే అయిన మరుక్షణం, వాడు నీతోనే అతుక్కుపోతాడు. అప్పుడు నీకు ఏమైనా జరిగితే, వాడి బ్రెయిన్ మళ్ళీ తట్టుకోలేదు. వాళ్ళ నాన్న చనిపోయిన విషయం వాడికి అస్సలు గుర్తులేదు. వాడు ఇప్పుడు నీ దగ్గర కేవలం ఒక చిన్న పిల్లాడు మాత్రమే," అని డాక్టర్ ఖరాఖండిగా చెప్పాడు. శారద కన్నీళ్లతోనే తల చిన్నగా ఊపింది.
హాస్పిటల్ వార్డ్‌లో రుద్ర మంచం మీద అపస్మారక స్థితిలో ఉన్నాడు. శారద మెల్లగా లోపలికి వచ్చి, రుద్ర చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుంది.
'నీకోసం నేను ఏదో ఒకటి చేస్తాను నాన్నా..' అని మనసులోనే అనుకుంటూ ఆ చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంది.
తల్లి ప్రేమగా పట్టుకున్న ఆ చెయ్యి... మరుక్షణం కరుకైన రోడ్డు మీద గట్టిగా రాసుకుంటున్నట్లు అనిపించింది! కాలం మారింది. అది వర్తమానం. చీకటి పడుతున్న సమయం.
హైవే మీద కారు తలకిందులుగా పడి ఉంది. ఇది మరో యాక్సిడెంట్! రుద్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. కానీ ఇప్పుడు అతను అమాయకుడైన పసివాడు కాదు... అమెరికా నుండి వచ్చిన అహంకారం ఉన్న మునుపటి రుద్ర! చుట్టూ ఉన్న వాతావరణాన్ని అయోమయంగా చూశాడు. పక్కనే స్పృహ తప్పి పడి ఉన్న అంజుని గమనించాడు.
"ఎవరు నువ్వు? ఇక్కడ ఏం జరిగింది?" అని గందరగోళంగా అనుకుంటూ తన తల పట్టుకున్నాడు. చిన్నగా నొప్పి. ఒక్కసారిగా ఒక కరెంట్ షాక్ తగిలినట్లు అనిపించింది. కళ్ళు మూసుకుని తెరిచి, అంజు ముఖాన్ని నిశితంగా గమనించాడు.
"ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే... ఓహ్, మా పనిమనిషి కూతురు కదా. చిన్నప్పుడు ఫోటోల్లో చూశాను. ఇప్పుడేంటి.. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది?" అని తనలో తాను అనుకున్నాడు. గతంలో పిల్లాడిగా ఉన్నప్పుడు ఆమెతో పంచుకున్న బంధం, పెళ్లి ఏవీ అతనికి ఇప్పుడు గుర్తులేవు.
ఖరీదైన కోట్, సూట్‌లో ఉన్న రుద్ర తన కారు డోర్‌ను గట్టిగా తన్ని బయటకు వచ్చాడు. చుట్టూ చూస్తే చీకటి పడుతోంది, ఎలాంటి వాహనాలు రావడం లేదు. వెంటనే అటు వైపు వెళ్లి, కష్టపడి డోర్ ఓపెన్ చేసి అంజుని బయటకు లాగాడు.
"హలో.. హలో.. మీ పేరు? హలో లేవండి," అంటూ ఆమె బుగ్గలు తట్టాడు. అంజు కదలలేదు. ఆమె ఊపిరి ఆడుతోందో లేదో చెక్ చేశాడు, శ్వాస ఆడుతోంది. కారు వెనకాల చూస్తే ఏదో పెద్ద కారు వేగంగా వచ్చి గుద్దిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతలో దూరంగా ఒక కారు లైట్లు కనిపించడంతో, రుద్ర వేగంగా రోడ్డు మధ్యలోకి వెళ్లి చేతులు ఊపుతూ ఆ కారును ఆపాడు.
కొత్త వ్యక్తి డ్రైవ్ చేస్తున్న ఆ కారు వెనుక సీట్లో అంజు స్పృహ లేకుండా పడి ఉంది. ముందు సీట్లో కూర్చున్న రుద్ర తన తలకు తగిలిన గాయం నుండి వస్తున్న రక్తాన్ని తుడుచుకోబోయి, తన జేబులో చెయ్యి పెట్టాడు. అక్కడ రుమాలు లేదు.
"ఏంటిది.. నేను ఎప్పుడూ కర్చీఫ్ మెయింటైన్ చేస్తాను కదా. యాక్సిడెంట్‌లో అక్కడ పడిపోయిందా?" అని ఆశ్చర్యంగా అనుకున్నాడు. ఆ వెంటనే పక్కన డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని చూసి, "హలో, మీ దగ్గర హ్యాండ్ కర్చీఫ్ ఉందా?" అని అడిగాడు.
ఆ వ్యక్తి తన జేబులోంచి కర్చీఫ్ తీసి ఇస్తూ, రుద్రని వింతగా గమనిస్తూ.. "ఉంది.. అసలు ఎలా జరిగింది ఇదంతా? ముందు మీ పేరు చెప్పండి, ఏం పేరు?" అని అడిగాడు.
రుద్ర కర్చీఫ్‌తో రక్తం తుడుచుకుంటూ, చాలా క్యాజువల్‌గా, ఒక ఫారిన్ యాక్సెంట్‌తో మాట్లాడటం మొదలుపెట్టాడు... ఒకప్పుడు అంజుకోసం ప్రాణాలు వదిలేంత ప్రేమను చూపించిన వాడేనా ఇతను అన్నంత నిర్లిప్తంగా!
😭