Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

యూ ఆర్ మై డెస్టినీ

ఇది అక్క క్యూట్ స్వీట్ లవ్ స్టోరీ .
తన జీవితంలో పెళ్లి అనేది చేసుకోకూడదు అని బలంగా నిర్ణయించుకుంటుంది ప్రియా కానీ అనుకోని సంఘటన వల్ల  , తన బావతో తన పెళ్లి కుదురుతుంది. ఇది తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేనిది. 
ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి అనే ప్రయత్నంలో ప్రియ తన ఫ్రెండ్స్ చాలా ప్లాంట్స్ వేస్తూ ఉంటారు,  కానీ వాటి అన్నిటిని తిప్పికొడుతూ ఉంటాడు తన బావ.

ఇంతకీ మన ప్రియా పెళ్లి జరుగుతుందంటారా ? జరగదంటారా?  అలాగే ప్రియా తన ఫ్రెండ్స్ కలిసి చేసే గలాటా , వాటి అన్నిటిని తిప్పికొట్టే తన బావ ప్రయాణం, ప్రియా ఇంకా తన బావ లా ప్రేమ ప్రయాణం చూసేద్దామా,  మరి ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం రండి




ఒక అందమైన విల్లా… ఆధునిక ఇంటీరియర్‌తో మూడు అంతస్తులు గల ఒక అందమైన భవనం . దాదాపు పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విరాజిల్లుతూ, చుట్టూ అరుదైన మొక్కలతో నిండిన ఒక ఆకర్షణీయమైన తోట. ప్రతి మూలా తళుక్కున మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపిస్తోంది.

అది ఉదయం ఆరు  గంటల సమయం. కానీ ఇంట్లో అప్పటికే సందడి వాతావరణం. వివిధ రకాల డెకరేషన్ సామాన్లతో విల్లా అంతా అలంకరించడంలో అందరూ శ్రమిస్తున్నారు . ప్రతి ఒక్కరూ తమ పనిలో నిమగ్నమై ఉండగా, ఇంటి యజమాని జగదీష్ చంద్ర తాను చెప్పినట్టు పని జరుగుతోందా లేదా అని గమనిస్తూ, ప్రతి ఒక్కరికి ఏది ఎలా చేయాలో సూచనలు ఇస్తూ తిరుగుతున్నాడు.

ఆయన స్వభావం కాస్త కఠినంగా ఉండటంతో, పని చేసే వారు అంతా  టెన్షన్‌ లోనే ఉన్నారు. ఒక్క మాట తప్పినా ఆయన కోపానికి గురయ్యే పరిస్థితి. అందుకే ప్రతీ ఒక్కరూ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

ఇంతలో గోపీ — ఆ ఇంట్లోని సీనియర్ నౌకర్ — జగదీష్ పక్కనే నిలబడి, ఆయన చెప్పే ప్రతీ మాటను గౌరవంతో తల ఆడిస్తూ వింటూ ఉన్నాడు.

అలాగే అయ్యా ...తప్పకుండా చేస్తాను..... ఆ సరే ...అంటూ ఆయన చెప్పిన ప్రతి మాటకు తలాడిస్తూ ఉన్నాడు

ఆ విల్లా ఒకపక్క పని వాళ్ళతో పనుల్లో మునిగిపోయి, వంటవాళ్లు, పనివాళ్లు, డెకరేటర్లతో ప్రతి మూలలో వాళ్ల హడావిడిలో వాళ్ళు ఉన్నారు. అయితే మూడో అంతస్తులోని ఒక  గదిలో మాత్రం వేరే ప్రపంచమే కనిపిస్తోంది.

ఆ  గదిలో ఒక అందమైన అమ్మాయి తన కలల ప్రపంచలో కలలు కంటూ  నిద్రపోతుంది. ఆమె పొడవాటి  జుట్టు బెడ్డుపై విశాలంగా పడి ఉంది. మెత్తని తెల్లని చర్మం, ముత్యాల్లా మెరిసే మొహం… లిప్స్టిక్ అవసరం లేని ఎర్రని పెదాలు ఆమెను చూసినవాళ్లెవరికైనా ఒక్కసారిగా – “ఇది భూమిమీదికి దిగిన దేవతేనా?” అన్న భావన కలగకుండా ఉండదు.

పైనుంచి వినిపిస్తున్న కోలాహలంతో ఆమె కాస్త అసహనంగా నిద్ర మత్తులో నుంచి లేచింది. అసహనంగా బెడ్ మీద నుంచి కిందకి దిగి . చిందరవందరగా ఉన్న తన పొడవాటి జుట్టునంతటిని ఒక దగ్గరికి చేర్చి కొప్పుల తలమీద పెట్టింది అది జారిపోకుండా ప్లక్కర్ పెట్టింది. ఆవలిస్తూ కిటికీ తలపుల దగ్గరికి వెళ్లి కిటికీ తలుపు తీసింది.

కింద ఓ రచ్చ… పని చేసే వాళ్లు పరుగులు పెడుతుంటే, ఆమె తండ్రి జగదీష్ చంద్ర అక్కడే నిలబడి అందరికీ ఆదేశాలు ఇస్తూ కనిపించాడు.

వాళ్ల నాన్నని అలా చూడగానే  "అబ్బా ...పొద్దున్నే డాడీ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ మా ఇంటిని ఏంటి అదే పనిగా కష్టపడి మరి డెకరేషన్ చేస్తున్నారు.
ఈరోజు.... ఈరోజు ఏంటబ్బా.. నాకు తెలిసి ఈ రోజు మమ్మీ డాడీ ల పెళ్లి రోజు కాదు నా పుట్టినరోజు అంతకన్నా కాదు ఈ రెండిటికి మించి ఈరోజు స్పెషల్ గా  ఏం జరుగుతుంది అబ్బా....."
ఏదైతే కనుక్కుంటే తెలిసిపోతుంది కదా అని తను ఇంట్లో రెగ్యులర్గా వేసుకుని చెప్పులు వేసుకుని ఆ నైట్ డ్రెస్ తోనే కిందకు వచ్చింది.

"గుడ్ మార్నింగ్ డాడీ .....""అంటూ వెనకనుంచి వచ్చి వాళ్ళ నాన్నని హాగ్ చేసుకోండి.

వెనకనుంచి అతన్ని హగ్ చేసుకున్న శృతి మెత్తని చేతులని చూడగానే అతను మార్నింగ్ నుంచి  పడుతున్న టెన్షన్ మొత్తం ఒక్కసారిగ మాయమైపోయింది.

జగదీష్ చంద్ర కూతుర్ని రిటర్న్ హగ్ చేసుకుని  " గుడ్ మార్నింగ్ తల్లి .. ఇప్పుడే లేచావా" . అని అంటూ తన కూతురి నుదుటిమీద  చిన్నగా ముద్దు పెట్టాడు.

ఇంతకు ముందు వరకు ఉన్న గంభీర స్వరం ఒక్కసారిగా తియ్యటి మధురస్వరంగా మారిపోయింది, ఇంతకుముందు ఉన్న కఠినత్వం ఇప్పుడు అతని గొంతులో లేదు. ఆయన ఆ తీరుగా మాట్లాడుతుండగానే, చుట్టూ ఉన్న పని చేసే వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఆయన వైపు తిరిగి చూశారు.ఇంతసేపు ఒక ఆదేశం తప్ప మరొకటి చెప్పని, ఒక్క పదం తప్పితే తిట్టిపోసే జగదీష్ చంద్ర ఇలా మృదువుగా మాట్లాడుతున్నాడంటే, అతడు ఎవరితో మాట్లాడుతున్నాడా అన్న ఆశ్చర్యం అందరిలో.

అందరి చూపులూ ఒక్కసారిగా జగదీష్ తో మాట్లాడుతున్నా అతని కూతురు పైన పడింది .
నైట్ డ్రెస్ లో ఉన్న ఆమెని చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఎవరబ్బా ఇంత అందమైన అమ్మాయి అని ఆలోచిస్తూ ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉండిపోయారు .

  మేకప్ లేకుండానే మెరిసిపోతున్న ఆమె అందమైన ముఖం, తెల్లని చర్మం ,ఎర్రని పెదాలు తీర్చి దిద్దినట్టుగా ఉన్న ఆమె కనుబొమ్మలు, చందమామ లాంటి ముఖ , బ్రహ్మదేవుడు శ్రద్ధ పెట్టి మరి ఆమె రూపాన్ని చెక్కినట్టు ఉన్నాడు , అంత అందంగా ఉంది  తను.

చుట్టూ డెకరేషన్ చేసే వాళ్ళందరూ సడన్ గా వచ్చిన ఆమెని అలా  చూసి ఒక్కసారిగా  పనులు మొత్తం ఆపేసి ఆమెనే చూస్తూ ఉండిపోయారు.

జగదీష్ చుట్టూ ఉన్న పని వాళ్ళని గమనించి  "ఏంట్రా పనులు ఆపి మరీ చూస్తున్నారు  ఎవరి పనులు వాళ్ళు చేయండి , వర్క్ లో ఏమాత్రం తేడా రాకూడదు  త్వరగా కానివ్వండి". అని అందరి మీద అరిచాడు.
యజమాని బేస్ వాయిస్ కి అందరూ భయపడి మళ్లీ ఎవరి  పనిలో వాళ్లు పడిపోయారు.

వాళ్లకి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత  కూతురి చేయి
పట్టుకుని లోపలికి తీసుకు వెళ్లాడు. 

" ఏంట్రా తల్లి ఇంత పొద్దున్నే లేచావు .." అంటున్నా తండ్రి మాటలకి అడ్డుపడుతూ ప్రియా " ఏంటి నాన్న పొద్దు పొద్దున్నే  మన ఇంటిని ఇంతలా డెకరేట్ చేయిస్తున్నావు  ?. ఈరోజు ఏమైనా స్పెషల్ డే నా ? ఈ డెకరేషన్ అంతా ఎందుకు? " అని ఆత్రుతగా అడిగింది.

తన కూతురు అడిగిన ప్రశ్నకి చిన్నగా నవ్వుతూ
" ఈరోజు  మీ మేనత్త  అదే నా అక్క వస్తుంది  ఈరోజు , ఎన్నో సంవత్సరాల తర్వాత మీ మేనత్త మన ఇంటికి రాబోతుంది తల్లి నాకు ఎంతో సంతోషంగా ఉంది,  అందుకే ఈ డెకరేషన్ అంతా చేయిస్తున్నాను ఒక వెల్కమ్ పార్టీ లాగా నాకు తెలిసిన కొంతమందికి ఎర్లీ మార్నింగ్ ఇన్విటేషన్ పంపించాను . సో నువ్వు కూడా నీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు ఈరోజు మన ఇంట్లో వెల్కమ్ పార్టీ ఉంది అని ఓకేనా"  అని అంటూ తన కూతురి మొహం మీద పడుతున్న జుట్టును తన చెవి వెనక్కి తోసి తన కూతుర్ని అలా చిరునవ్వుతో చూస్తున్నారు .

అతని ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంటే  అప్పుడు అర్థం అయ్యింది ప్రియా కి ఈరోజు వాళ్ళ నాన్న ఎందుకు అంత హడావిడి చేస్తున్నాడు , ఎందుకు వాళ్ళ ఇంటిని అలా డెకరేట్ చేయిస్తున్నాడు అని.

తనకు తెలిసినంతవరకు వాళ్ల నాన్న వాళ్ళ అక్క కరెక్ట్ గా 27 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంటి నుండి వెళ్లిపోయింది . ఆవిడ ఆ రోజు ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు డాడీ కి వాళ్ల అక్క అంటే ప్రాణం .  వాళ్ల అత్తయ్య కోసం (జగదీష్ చంద్ర సిస్టర్)  వెతకాని ఊరు లేదు వెతకాని చోటు లేదు . 

చిన్నప్పటినుంచి వాళ్ళ డాడీ వాళ్ళ అక్క అంటే తనకు ఎంత ఇష్టమో చెప్తూ ఉండేవాడు  వాళ్ల  తాతయ్య తన కూతురి మీద ఉన్న కోపం తో వాళ్ళ అత్త ఫోటోలు ఏవి కూడా ఇంట్లో ఉండకుండా  చేశారు అని చాలాసార్లు చెప్పి బాధపడేవారు జగదీష్ చంద్ర.

ఫ్యూ డేస్ బ్యాక్ ఒక కంపెనీ మీటింగ్ లో అతని ఫ్రెండ్ ద్వారా వాళ్ళ అక్క ఎక్కడుందో తెలుసుకోగలిగారు. 
ఈ విషయం వాళ్ళ డాడీ , ప్రియా తో కూడా షేర్ చేసుకున్నారు. కానీ ఇంత సడన్ గా వాళ్ళ అత్తయ్య ఈరోజు వాళ్ళ ఇంటికి వస్తుందన్న సంగతి తనకు తెలీదు.

తాను తన ఆలోచనలో ఉండంగానే
" మీ నాన్నతో కబుర్లు తర్వాత గానీ మందు  వెళ్లి చక్కగా స్నానం చేసి రెడీగా ఉండు ఈ లోపల బ్యూటీషన్  వాళ్లు వస్తారు నిన్ను రెడీ చేయడానికి . మీ అత్త తన ఫ్యామిలీతో  ఏ టైం లో నైనా రావచ్చు." కానీ అంటూ మెల్లగా తన చేతి కర్ర సహాయంతో మెల్లగా మెట్లు దిగుతూ వచ్చి వాళ్ళ ఎదురుగా ఉన్న సోఫాలో  కూర్చుంది ఒక 60 ఏళ్ల ముసలావిడ . 

'  వాట్?  బ్యూటిషన్ తో పని ఏముంది ?  ఈ ముసలి దానికి చాదాస్తం బాగా పెరిగిపోయినట్లుంది .  అత్తయ్య వాళ్ళు వస్తే నేను అందంగా రెడీ అవ్వడం  ఏంటి దీని చాదస్తం కాకపోతే '  అని తనలో తాను అనుకుంటూ అయోమయంగా తన నానమ్మ వైపు చూసింది.

"అమ్మ... నా కూతురికి అలాంటివి ఏమీ అవసరం లేదు తను నార్మల్ గానే ఎంతో అందంగా ఉంటుంది" అని అంటున్న జగదీష్ చంద్ర మాటలకి అడ్డుపడుతూ  " నాకు తెలుసు లేరా... అది అందంగా ఉంటుంది అని...ఈరోజు  నా కూతురు తన కుటుంబంతో కలిసి దాదాపు 27 ఏళ్లు తర్వాత మళ్లీ ఈ  ఇంట్లోకి అడుగు పెడుతుంది  దాని కొడుకుకి ఇది నచ్చితే .... పనిలో పనిగా ఈ రోజే ఎంగేజ్మెంట్ కూడా చేసేద్దాం ఏమంటావ్ .." . అని అంటూ ప్రియా వైపు చూసింది

నాన్నమ్మ మాటలకి కళ్ళు పెద్దవి చేసి వాళ్ళ నాన్నమ్మ వైపు చూస్తూ ఉండిపోయింది ప్రియా.

'ఈ మముసల్ది నాకు ఎలాగైనా సరే పెళ్లి చేసేసి ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి గట్టిగా ప్లాన్ వేసుకుని మరి  కూర్చున్నట్టుంది'  అని తన మనసులో అనుకుంటూ తన నానమ్మ వైపు కోపం నిండిన కళ్ళతో చూసింది. 

తన మనవరాలి చూపుకి "  ఏంటే ఆ చూపు అలా చూస్తున్నావ్ నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయావా లేకపోతే నన్ను గుర్తు చేయమంటావా " అని అంటూ కళ్ళు ఎగరేసి మరి తన మనవరాలు వైపు చూసింది.

' ఓహో... మర్చిపోయాను అవును కదా  మన నోటి దూల ఇంకా మన ఓవరాక్షన్ వల్ల దీనికి మాట ఇచ్చాను అత్త కొడుకుని.... పెళ్లి... చేసుకుంటాను ...అని,   అది పట్టుకుని ఈ ముసల్ది నన్ను వదలడం లేదు,  దానికి తోడు మా నాన్న కూడా  అదే మాట పట్టుకున్నాడు, పాపం వీళ్ళకి అత్త వచ్చాక అసలు నిజం తెలిస్తే ఏమైపోతారో ఏమో ...నేనైతే.. సేఫ్'  అని తనలో తాను అనుకుంది.

వాళ్ల నాన్నమ్మ మాటలకి 32 పళ్ళు బయటికి కనపడేలా నవ్వుతూ "  ఎందుకు గుర్తులేదు నానమ్మ అన్ని గుర్తున్నాయి , అలాగే నా కండిషన్స్ కూడా నీకు గుర్తున్నాయి కదా, ఒకవేళ నేను అనుకున్నట్టుగానే జరిగితే ఇంకెప్పుడు కూడా నా పెళ్లి విషయం ఈ ఇంట్లో చర్చించడానికి వీల్లేదు.. ఓకేనా" అని అంటూ వాళ్ల నాన్నమ్మ వైపు చూసి కళ్ళు ఎగరేసింది,  అచ్చు వాళ్ళ నాన్నమ్మ తనను చూసి ఎగరేసినట్లుగా .

తన అమ్మ కూతురి డిస్కషన్ చూసి చిన్నగా నవ్వుకుంటూ  జగదీష్ చంద్ర "  ఆ కృష్ణయ్య దయవల్ల అన్ని సవ్యంగా ఉండి వాడికి నువ్వు నచ్చితే,  నీ పెళ్లి అక్క కొడుకుతో జరిగితే , అల్లుడిని ఇల్లరికం తెచ్చుకొని ఇక్కడే మన ఇంట్లో ఉంచుకొని అలాగే మా అక్కని కూడా నాతో పాటు ఉంచుకోవచ్చు " అని సంతోషంగా అన్నాడు.

ఊర్మిళాదేవి తన కొడుకు సంతోషం చూస్తూ " అన్ని అనుకున్నట్లుగానే జరుగుతాయి రా నువ్వేమీ కంగారు పడకు నా కూతురిని ఇకపై ఎక్కడికి  వెళ్ళనివ్వను , దీని పెళ్లితో అది మన దగ్గర ఉండిపోయేలా ఆ కృష్ణయ్య చేస్తాడు , దీని పెళ్లి చేసి వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కూడా మన దగ్గరికి తెచ్చుకుందాం "  అని సంతోషంగా అంది.

' వీళ్లు వీళ్ళ ఈ ఎక్స్పెక్టేషన్స్ అత్తకి కొడుకు ఉన్నాడు అని తెలుసు కానీ వాడికి పెళ్లయిందా , లవర్ ఉందా అని తెలుసుకున్నారా?  లేదు?  అసలు వాడు ఎలా ఉంటాడో కూడా ఆలోచించట్లేదు వీళ్ళు , నాలాంటి బ్యూటీ కి  వాడు అసలు సెట్ అవుతాడా ? నాకు తెలిసి అత్త చాలా అందంగా ఉంటుంది అని నానమ్మ మాటల్లో విన్నాను, అండ్ మా అత్త చేసుకున్నా మామయ్య కూడా అందగాడు అని బయట టాక్  . దీన్ని బట్టి చూస్తే   బావ  కూడా బాగానే ఉంటాడు కావచ్చు . వాడిని చూడకపోయినా వాడి బయోడేటా నా దగ్గర ఉంది అన్న విషయం వీళ్ళకి తెలీదు పాపం ,  అసలు వాడు ఎలా ఉంటాడు , వాడి మనస్సులో ఎవరున్నారు అని ఏమీ ఆలోచించకుండా ముందే నా పెళ్లి అనే ఫిక్స్ అయిపోయారు , నిజం తెలిస్తే ఏమైపోతారో ' తనలో తాను అనుకుంటూ వాళ్లని జాలిగా చూస్తూ కూర్చుంది

తన మనవరాలు చూపులు అర్థం కాక "  ఏంటే అలా చూస్తున్నావు"  అని అడిగింది ఊర్మిలాదేవి.

" ఏమీ లేదు నానమ్మ జస్ట్ ఊరికే చూస్తున్నాను అంతే.. సరేలే ...నేను వెళ్లి రెడీ అవుతాను అసలే ఈరోజు నేను చాలా అందంగా కనిపించాలి కదా"  అని అంటూ వంటగది వైపు చూస్తూ" మామ్ నేను పైకి వెళ్తున్నాను ... నాకు పాలు నా గదిలోకి పంపించవా" . అని వంట గదిలో వాళ్ళ అమ్మకి వినిపించేలా అరిచి పైకి వెళ్ళిపోయింది.

పైకి వెళ్తూ వెళ్తూ వాళ్ళ నాన్నమ్మ వైపు చూస్తూ అదోలా నవ్వుతూ పైకి వెళ్ళింది

ప్రియా నవ్వినా విధానానికి, చూసిన చూపులకి ఊర్మిళాదేవి ఏదో తేడా కొట్టినట్టు అనిపించింది 'దీని చూపు ఏంటి నాకు ఏదో తేడాగా ఉంది ' ఆలోచనలో పడింది.

'మామూలుగా ఇది పెళ్లి చేసుకోను అంటే చేసుకోను అని చెప్పేది నాలుగు సంవత్సరాల నుండి నేను ఎన్ని పెళ్లి సంబంధాలు తెచ్చినా సరే, అటువంటిది నాన్న సంతోషం కోసం ఈ ఒక్కసారికి నా మాట వింటాను అని చెప్పింది అది కూడా ఒక కండిషన్ మీద  నేను అత్త కొడుకుని చేసుకుంటాను ఒకవేళ వాడికి నేను  నచ్చితే , వాడికి నేను నచ్చకపోతే  నా పెళ్లి గురించి ఇంకెప్పుడు మాట్లాడకూడదు అని నాతో చాలెంజ్ చేసింది . దీన్ని నచ్చని వాళ్ళు అంటూ ఉంటారా అని ఆ ఛాలెంజ్ కి నేను ఓకే చెప్పాను ,  ఈ రకంగా అయినా నా కూతురిని నా దగ్గరికి తెచ్చుకోవచ్చు అని కోరికతో . ఈరోజు దీని చూపులు చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది నాకు , ఇది నా మనవరాలు అని కాదు గాని పెద్ద కంత్రిది ,  ఇంత సులువుగా పెళ్లికి ఒప్పుకొంది అంటే దీని వెనకాల ఏదో ...తిరకాసు ఉన్నట్లుంది,   కొంపతీసి దీనికి నా కూతురు గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ముందుగానే తెలిసి ఉంటుందా నా మనవడిని ఏమైనా బెదిరించి ఉంటుంది అంటావా, అలా చేసినా చేస్తుంది ఇది దాని బ్యాచ్ తో కలిసి.'

అప్పుడే కాఫీ ట్రే తీసుకొని కిచెన్ లో నుంచి వచ్చింది ప్రియా వాళ్ళ అమ్మ సునంద ,  వచ్చి వాళ్ళ అత్తగారికి కాఫీ ఇస్తూ"  అత్తయ్య గారు ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఇదిగోండి కాఫీ తీసుకోండి " అని అంటూ కాఫీ ఊర్మిళాదేవి చేతికి ఇచ్చింది

కాఫీ తీసుకొని కొడుకు వైపు చూసి"  ఏరా  మీ అక్క కుటుంబం గురించి నీకు ఎంతవరకు తెలుసు" అని అడిగింది .

జగదీష్ చంద్ర " నాకు అసలు అక్క గురించి ఎక్కువగా తెలియ‌దు. కానీ కొన్ని రోజుల క్రిత‌మే మా కంపెనీ మీటింగ్‌లో నా స్నేహితుడివ‌ల్ల ఆమె గురించి తెలుసుకోగ‌లిగాను అమ్మ .. భావ గారు నాలుగు సంవత్సరాల క్రితం  ఒక యాక్సిడెంట్లో కాళ్ళకి బలమైన గాయం తగలడం వల్ల వీల్ చైర్ కి అంకితం అయ్యారు అని తెలిసింది బిజినెస్ వ్యవహారాలు కొడుకు  చూసుకుంటున్నాడట.  సంవత్సరం క్రితం  ఈ ఊరికి వచ్చారు ఇక్కడే సెటిల్ అయ్యారు అని విన్నాను , అంతకు మించి వేరే వివరాలు ఏమీ అంతగా తెలియదు , నా ఫ్రెండ్ సహాయంతో అక్క ఫోన్ నెంబర్ తెలుసుకోగలిగాను .  అక్కకి మన మీద కోపం తగ్గిందో లేదో ఇంకా మనని కుటుంబంగా అనుకుంటుందో లేదో అన్న భయం , ఒకసారి ట్రై చేద్దాం అనుకోని నిన్న కాల్ చేశాను అదృష్టం కొద్దీ అక్క ఫోన్ లిఫ్ట్ చేసింది  నా వాయిస్ కూడా గుర్తుపట్టింది ఈరోజు పొద్దున్నే వస్తాను అని కూడా చెప్పింది తన ఫ్యామిలీతో కలిసి. ఎలాగో ఈ రోజు వస్తుంది కదా  అని వివరాలు ఏమి కనుక్కోలేదు" అని వివరంగా తనకు తెలిసిన వివరాలు అన్ని తల్లికి వివరించాడు. 

ఈ మాటలు విని ఊర్మిళాదేవి కళ్లలో నీరు మెదిలింది.ఒకపక్క కూతురి గురించి వివరాలు తెలుసుకొని మరో పక్క తన అల్లుడి పరిస్థితి విని బాధపడింది.
"ఇప్పుడు అల్లుడు గారికి ఎలా ఉందో కనుక్కున్నావా"  అని అడిగింది ఊర్మిళాదేవి.

"  లేదమ్మా అంతగా ఆ వివరాలు అయితే ఏమీ తెలియదు కానీ వీల్ చైర్ లో ఉన్నారు అని మాత్రం తెలిసింది ఈరోజు వస్తుందిగా అన్ని వివరంగా కనుక్కుందాం"   అని చెప్పారు జగదీష్ చంద్ర.

" దానికి ఎంతమంది పిల్లలు.. అది అయినా తెలుసా నీకు"  అని అడిగింది ఊర్మిలాదేవి.

జగదీష్ చంద్ర ఆలోచనలో పడి "  లేదమ్మా తెలియదు " అని అన్నారు. 

" అత్తయ్య గారు మీరేమీ కంగారు పడకండి ఎలాగో మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానే వస్తారు కదా అప్పుడు  కూర్చొని అన్ని వివరాలు వివరంగా కనుకొందురు గాని ముందైతే కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి " 

జగదీష్ చంద్ర "  ఈరోజు పొద్దున్నే అక్క ఫోన్ చేసింది    వాళ్ళ కుటుంబం అంతటితో కలిసి వస్తున్నాను అని ,నాకు తెలిసి ఇంకో గంటలో వాళ్ళు ఇక్కడికి రావచ్చు  అందుకే ఇంత హడావిడిగా ఇంటిని డెకరేట్  చేయిస్తున్నాను, అక్క వచ్చే లోపు తాను పుట్టి పెరిగిన ఇల్లు అందంగా కనిపించాలి సరే నేను వెళ్తున్నాను"  అని అంట అక్క డి నుంచి డెకరేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు.

" ఏవండీ ..కాఫీ తాగి వెళ్ళండి"  అని అంటున్న సునంద మాటలు పట్టించుకోకుండా "  నేను తర్వాత తాగుతాను మీరైతే ముందు స్నానం చేసి రెడీగా ఉండండి అక్క వచ్చేసరికి ఇలా జిడ్డు మొహాలు వేసుకొని ఉండకండి "  అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయారు.

******

ప్రియా తన గదిలోకి రాగానే తన మొబైల్ రింగ్ అవుతుంటే వెళ్లి లిఫ్ట్ చేసింది చేసింది తన ఫ్రెండ్ నితిన్ " హలో ఎక్కడికి వెళ్లావే ఇంతసేపు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయకుండా,  ఏంటి పొద్దున్నే మీ ఇంటి ముందు హడావిడి కొంపతీసి ఆ ముసలిది కానీ బకెట్ తన్నేసిందా" .

ప్రియా నితిన్ క్యూస్షన్స్ కి ఆన్సర్ చేద్దాం అనుకునే లోపు తన ఫోన్ కి సెకండ్ లైన్ వస్తుంది అది చేస్తుంది తన ఇంకో ఫ్రెండ్ అరుణ్ .

" ఒరేయ్ ఒక నిమిషం ఆగరా అరుణ్  ఫోన్ చేస్తున్నాడు వాడిని కూడా కాన్ఫరెన్స్ లో కలుపుతాను " అని చెప్పి ఇద్దరినీ కాన్ఫరెన్స్ కాల్ కలిపింది. 

"ప్రియా నితిన్ చెప్పేది నిజమేనా నిజంగా మీ నాన్నమ్మ..".  అని తన ఫ్లో లో  అతడు మాట్లాడుతూ ఉండగా. 

ప్రియా అరుణ్ క్యూస్షన్స్ కి  ఆన్సర్ చెప్పకుండా నితిన్ నీ క్వశ్చన్ చేసింది "  ఒరేయ్  మా ఇల్లు డెకరేట్ చేస్తున్న సంగతి ఎవరెవరికి చెప్పావు?".

"  మన ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేశాను మన వాట్సాప్ గ్రూప్ లో ..  నిజం చెప్పవే మీ నాన్నమ్మ  బకెట్ తన్నేసింది కాదు , లేకపోతే ఇంత హడావిడిగా మీ ఇంటిని అప్పటికప్పుడు ఎందుకు రెడీ చేస్తున్నారు" 

నితిన్ క్యూస్షన్స్ కి ఆన్సర్  చెప్పే లోపు మళ్లీ సెకండ్ లైన్ ఇంకోసారి వస్తుంది అది చేసింది తన ఇంకో ఫ్రెండ్ నిఖిల్ .

'ఈ నితిన్ గాడు ఉన్నచోట ఉండడు ' తనలో తానే అనుకుంటూ

" ఒక్క  నిమిషం  అందరికీ ఒకేసారి మీ కోషన్స్ కి ఆన్సర్ చెప్తాను " అని చెప్పి వాళ్ల ఫ్రెండ్స్ మరో ఇద్దరికి కలిపి అందరికీ కాన్ఫరెన్స్ కాల్ కలిపింది.

శైలు " ఏంటే పొద్దున్నే ఫోన్ చేసావ్ నా నిద్ర చెడగొట్టడానికి.... అంత కొంపలు ఏమి మునిగిపోయిన". అని అంది నిద్రమత్తులో ఆవలిస్తూ.

" ప్రియా వాళ్ళ నాన్నమ్మ బకెట్ తన్నేసినట్లుంది ....ఈరోజు దాని ఇంటి మొత్తం డెకరేషన్ చేయించారు అందుకే నేను ఫోన్ చేశాను"  అని అన్నాడు నితిన్ .

శైలు కి ఒక్కసారిగా నిద్ర మొత్తం వదిలిపోయింది ఒకసారి ఫోన్ చూస్తుంటే  అది కాన్ఫరెన్స్ కాల్ "వాట్  ?.  నిజంగానే మీ నానమ్మ... కానీ .... అయ్యో ఎలా .. నిన్నటి వరకు బాగానే ఉందిగా ..గుంటరాయిలాగా.. రాత్రికి రాత్రికి ఏమైపోయింది ...అయ్యో ఇప్పుడు ఎలా ఉన్నావే బానే ఉన్నావు కదా..?"  అని అంటూ శైలు తెగ బాధ పడిపోయింది.

అక్షయ "  అయ్యయ్యో..  ఎలా జరిగింది .. అంకుల్ ఎలా ఉన్నారు ?  నేను వస్తున్నా ఉండు.. నువ్వేం బాధపడకు " అని అంటూ తన కూడా తెగ బాధ పడిపోయింది.

"అరే నేను చెప్పేది.."  అని అంటున్న ప్రియ మాటలు ఎవరూ వినిపించుకోలేదు

అరుణ్"  నేను కూడా వస్తున్నాను స్వీటీ ఏమి బాధపడకు మేమందరం ఉన్నాం కదా నీకు,  అంకుల్ని వచ్చేవరకు జాగ్రత్తగా చూసుకో నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను"  అని  కార్ కేస్ కోసం వెతుకుతున్నాడు. 

" నేను కూడా స్టార్ట్ అవుతున్నాను స్వీటీ " అని  నితిన్ కూడా తన కార్ కి కోసం వెతికాడు. 

తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వారి వారు మాట్లాడుకుంటా తెగ బాధ పడిపోతుంటే ప్రియా కి ఏం చెప్పాలో అర్థం కాలేదు.

" హే...ఆపండి మీ ఎదవ గోల   మందు దాన్ని చెప్పనివ్వండి ఏం జరిగింది అనేది , ఒరేయ్ నితిన్ ఇంటిని  డెకరేట్ చేయిస్తే ఏదైనా ఫంక్షన్ అయినా అవ్వచ్చు కదా  ..  ముందు నువ్వు చెప్పరా స్వీటీ ఏం జరిగిందో ఎందుకు డెకరేట్ చేస్తున్నారు మీ ఇంటిని"  అన్నాడు నిఖిల్.

నిఖిల్ మాటలకి అందరూ ఆలోచనలో పడ్డారు నిజమే కదా అని అనుకున్నారు కొంచెం రిలాక్స్ అవుతూ. ఎందుకంటే ప్రియ వాయిస్ లో డల్నెస్ లేదు, ఎపుడు లాగానే మాట్లాడుతుంది , ఒకవేళ అలా జరిగితే తన వాయిస్ లో తేడా తెలుస్తుంది .

" నువ్వు ఒక్కడివే రా మన బ్యాచ్ లో బ్రెయిన్ ఉన్న వాడివి " అని అంటున్న ప్రియ మాటలకి.

" అంటే ఏంటే నీ ఉద్దేశం నాకు బ్రెయిన్ లేదన " అన్నాడు నితిన్ కోపంగా. 

" గుమ్మడికాయల దొంగ ఎవరని అంటే భుజాలు  తడుముకున్నట్లు నువ్వు ఎందుకురా రియాక్ట్ అవుతున్నావు  అంటే నిజంగానే నీకు బ్రెయిన్ లేదా " అని అంది అక్షయ నవ్వుతూ .

" అది నిజమే నిజంగా వీడికి అసలు ఆ దేవుడు బ్రెయిన్ అసలు ఇవ్వనే ఇవ్వలేదు "  అని అంది ప్రియ కొంచెం కోపంగా.

నితిన్ "  అంటే మీ నాన్నమ్మ ......నిజంగా బానే ఉందా.....? . మరి ఎందుకే  పొద్దున్నే మీ ఇంటిని అలా డెకరేట్ చేస్తున్నారు ? అలా సడన్గా డెకరేట్ చేయించేసరికి మీ నానమ్మ  బకెట్ తన్నేసిందేమో అనుకున్నాను".

" ఒరేయ్ ఇంకోసారి ఆ మాట అన్నావ్ అనుకో చంపేస్తా రా నిన్ను"  అని అంది కోపంగా ప్రియా.

" వాడి మాటలు వదిలేసి ముందు డెకరేట్ ఎందుకు చేస్తున్నారో అది చెప్పు ముందు " అని అంది శైలు మరొకసారి ఆవలిస్తూ మంచం మీద పడుకొని మళ్ళీ దుప్పటి కప్పుకుంటాం. 

' వీళ్ళకి ఇప్పుడొక ఝలక్ ఇద్దాం'  ప్రియా తనలో తన అనకంటూ.
" అదా ... ఏమీ లేదు ఈరోజు నా ఎంగేజ్మెంట్ మా బావతో అందుకే అలా డెకరేట్ చేస్తున్నారు" అని ఒక బాంబ్ వేసింది.

" వాట్???..... "అందరూ ఒకేసారి అరిచారు .

*****

హాయ్ ఫ్రెండ్స్ ! నా స్టోరీ మీకు నచ్చిందా ?  నేను రాసిన విధానం మీకు నచ్చిందా?

ఎక్కడైనా తపుళ్లు  లేక పొరపాట్లు రాసి ఉంటే దయచేసి మన్నించండి. నేను ఇంకా మెరుగ్గా రాయాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. 

నా స్టోరీ నచ్చితే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఓ చిన్న కామెంట్ ఎలా ఉంది అని కూడా రాయండి.
అలాగే నన్ను సపోర్ట్ చేయండి.
మీ ప్రతి మాట, ప్రతి ప్రోత్సాహం నన్ను ఇంకా ఉత్తమంగా రాయేందుకు ప్రేరణనిస్తుంది. 
థ్యాంక్యూ 
*****