ఎపిసోడ్ 3: రహస్య వ్యూహం - సవతి చూపుల కరకుదనం!
భాగం 1: మహారాజు రహస్య వ్యూహాలు... తండ్రి కొండంత అండ!
అంతఃపురంలో దేవాసింహుడు వేసిన గండానికి మహారాజు తాత్కాలికంగా వెనక్కి తగ్గినప్పటికీ, అతని మనసులోని అహంకారం, కులగర్వం శాంతించలేదు.
"ఏ కులమో తెలియని ఆ అడవి బాలుడు నా రాజవంశానికి వారసుడు కావడం ఏంటి? నా ఏకైక కొడుకు దేవాసింహుడు వాడి కోసం రాజ్యాన్ని వదిలేస్తాననడం ఏంటి? ఎలాగైనా, దేవాసింహుడికి తెలియకుండా ఆ అడవి బాలుడిని ఈ రాజభవనం నుండి, ఈ రాజ్యం నుండి శాశ్వతంగా బయటకు పంపించేయాలి!"
అని మహారాజు తన నమ్మకస్థులైన మంత్రులతో కలిసి రహస్య వ్యూహాలు రచించడం మొదలు పెట్టాడు. అంతఃపురంలో ఒక నిగూఢమైన కుట్రల వలయం అల్లుకుంటోంది.
మరోవైపు, అవేమీ పట్టని యువరాజు దేవాసింహుడు తన ప్రత్యేక మందిరంలో తన ముద్దుల కుమారుడైన చిన్నారి విక్రమాదిత్యుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆ బిడ్డ కళ్లల్లో ఉన్న దైవిక తేజస్సును చూస్తూ, మురిసిపోతూ ఇలా అన్నాడు:
"నా చిన్నారి విక్రమాదిత్యుడా! ఈ లోకం నిన్ను ఏమని పిలిచినా సరే... ఈ సామ్రాజ్యానికి కాబోయే అసలైన యువరాజువు నువ్వే! ఈ తండ్రి కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను ఎవరు తాకలేరు... ఏ శక్తీ నిన్ను నా నుండి దూరం చేయలేదు!"
అంటూ ఆ పసిబిడ్డను తన విశాలమైన గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు దేవాసింహుడు. ఆ తండ్రి ఆలింగనంలో చిన్నారి విక్రమాదిత్యుడికి ఒక కొండంత అండ లభించినట్లయింది.
భాగం 2: అలకనంద ఆగమనం... కరకు చూపుల కాలసర్పం!
యువరాజు దేవాసింహుడు తన చిన్నారి విక్రమాదిత్యుడితో ఎంతో ప్రేమగా ఆడుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నాడు. ఆ మందిరమంతా ఆ పసివాడి నవ్వులతో ప్రతిధ్వనిస్తోంది. సరిగ్గా అదే సమయంలో... ఆ మందిర ద్వారాలు ధ్వనిస్తూ తెరుచుకున్నాయి. ఎవరి అనుమతి లేకుండా, తీవ్రమైన ఆవేశంతో, కోపంతో లోపలికి అడుగుపెట్టింది యువరాజు భార్య ‘అలకనంద’.
ఆమె ముఖంలో ఉన్న క్రోధం, కళ్లల్లో ఉన్న కరకుదనం చూసి... యువరాజు ఒడిలో ఉన్న చిన్నారి విక్రమాదిత్యుడు ఒక్కసారిగా భయపడిపోయాడు. వణికిపోతూ తన చిన్నారి చేతులతో తండ్రి దేవాసింహుని గట్టిగా హత్తుకుని, అతని వెనుక దాక్కున్నాడు.
అయితే, అలకనంద అలా హఠాత్తుగా రావడం చూసి దేవాసింహుడు ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే పరదా చాటున ఆమె అంతా విన్నదనే విషయం అతనికి ముందే తెలుసు. కానీ, ఒక పసివాడి మందిరంలోకి ఆమె అలా క్రోధంతో రావడం అతనికి నచ్చలేదు.
దేవాసింహుడు సింహంలా లేచి నిలబడి, గంభీరమైన స్వరంతో అన్నాడు:
"నా అనుమతి లేకుండా, ఈ రహస్య మందిరంలోకి నిన్ను లోపలికి ఎవరు అనుమతించారు?!"
ఆ గంభీరమైన కోపపు శబ్దానికి చిన్నారి విక్రమాదిత్యుడు మరింత బెదిరిపోయాడు. అది గమనించిన దేవాసింహుడు వెంటనే తన గొంతు తగ్గించుకుని, బిడ్డను ఓదారుస్తూ... అలకనంద వైపు కరకుగా చూస్తూ అన్నాడు:
"అలకనంద... ఎందుకు వచ్చావో, ఏం కావాలో త్వరగా చెప్పు!"
భాగం 3: అసూయ జ్వాల – నూరింతల సౌందర్యం!
దేవాసింహుడు అడుగుతున్నా అలకనంద నోరు విప్పలేదు. ఆమె చూపులన్నీ దేవాసింహుని వెనుక దాక్కున్న చిన్నారి విక్రమాదిత్యుడి మీదే ఉన్నాయి. ఆమె ఆ పసివాడిని నిశితంగా గమనించింది.
వాడు అడవిలో దొరికిన అనామకుడు కాదు... సాక్షాత్తు ఒక దేవతా కుమారుడిలా వెలిగిపోతున్నాడు. తన కడుపున పుట్టిన విశ్వంజేయుడి కంటే... ఈ విక్రమాదిత్యుడు వంద రెట్లు అందంగా, అమాయకంగా, ముద్దుగా ఉన్నాడు. ఆ పసివాడి ముఖంలో ఉన్న దైవిక ఆకర్షణ (మోహన అస్త్ర ప్రభావం) అలకనందను ఒక క్షణం భయపెట్టింది.
ఆమె మనసులో ఆవేశం, అసూయ నరనరాన పాకాయి:
"మహారాజు కనుక ఒక్కసారి ఈ బాలుడిని చూస్తే... కులగోత్రాలు పక్కన పెట్టి, వీడి అందానికి, తేజస్సుకు ముగ్ధుడై ఇతన్నే ఈ రాజ్యానికి యువరాజుగా అందరికీ ప్రకటించేస్తాడు! అప్పుడు నా కొడుకు విశ్వంజేయుడి పరిస్థితి ఏంటి?" నాకే ఈ బాలుడిని చూస్తూ ఉంటే ఎత్తుకొని ముద్దు చేయాలని అనిపిస్తుంది ఏంటి ? చీ చీ నేను ఏంటి ? నాకు ఇలా అనిపించడం ఏంటి అసలు పిల్లాడి తల్లి ఎవరు ? ఇన్ని సంవత్సరాలు ఎవరికి తెలియకుండా రహస్యంగా ఎందుకు పెంచుతున్నాడు ఏది ఏమైనా నా కుమారుడి ఉనికి ప్రమాదం లో పడుతుంది లేదు లేదు నేను అస్సలు అలా జరగనివ్వను
అని మనసులోనే రగిలిపోతూ, విక్రమాదిత్యుని వైపు నమిలేసేలా ఆవేశంగా చూసింది అలకనంద.
ఆమె కళ్లల్లోని క్రూరత్వాన్ని, తన బిడ్డపై ఉన్న కసిని దేవాసింహుడు గమనించాడు. వెంటనే తన బిడ్డను పూర్తిగా తన వెనుక రక్షణగా తీసుకుంటూ, అలకనందకు అడ్డంగా నిలబడ్డాడు. తన వీర చూపులతో ఆమెను హెచ్చరిస్తూ, గంభీరంగా అడిగాడు:
"అలకనంద... నా చిన్నారిని చూసి ఎందుకు అలా భయపెడుతున్నావు?! నీ ఉద్దేశం ఏంటి?!"
ఆ ప్రశ్నతో అంతఃపుర మందిరంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఒకవైపు దేవాసింహుడి పితృవాత్సల్యం... మరోవైపు అలకనంద మనసులోని సవతి తల్లి క్రోధం... మధ్యలో భయంతో వణుకుతున్న అస్త్రాల అధిపతి విక్రమాదిత్యుడు! అతని లోని శక్తి అస్త్రం మోల్కొనే సమయం ఆసన్నం అయింది. విక్రమాదిత్యుడు కళ్ళల్లో భయం కొద్ది కొద్దిగా మాయం అవుతూ ఉంది . ఆ చిన్నారి విక్రమాదిత్యుడు తనలో ఏం జరుగుతుందో తెలియని పసితనం లో తన తండ్రి చాటుగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు.
(మూడవ ఎపిసోడ్ సమాప్తం)