Read love at first sight by Nani in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

పరిచయం

పరిచయం అనేది నాలుగు అక్షరాల పదమే అయినా ఎంతో మందిని కలుపుతున్న ఒక అద్బుతం. ఒక్క చిన్న పరిచయం ఎన్నో సంబంధ బాంధవ్యాలకి మూల కారణమవుతుంది. చిన్న చిన్న పరిచయాలే కొన్ని గొప్ప గొప్ప స్నేహాలు గా, మరికొన్ని ప్రేమగా, ఇంకొన్ని బంధుత్వాలుగా మారితాయి. పరిచయం అనేది ఒకరి నుండి మరొకరికి, వారి నుండి ఇంకొకరికి అలా అలా పెరుగుతూ పోతూ ఎక్కడో ఉన్న ఒకరిని, ఇంకెక్కడో ఉన్న మరొకరిని కలుపుతుంది. అలా ఏర్పడ్డ ఒక చిన్న పరిచయమే నా జీవితానికి ప్రేమని పరిచయం చేసి, తనని నా జీవితంలోకి ఆహ్వానించింది. ఆ చిన్న పరిచయం నా జీవితంలో చేసిన మార్పులని నేను మీతో పంచుకోబోతున్నాను.



నేను పీ.జీ చదువుతున్న రోజులవి. అప్పట్లో నాకు స్నేహం అన్నా స్నేహితులు అన్నా చాలా ఇష్టం. నాకు స్నేహితులు కూడా ఎక్కువే. అమ్మాయి, అబ్బాయి అని ఏ తేడా కూడా లేకుండా స్నేహం చేసేవాడిని. ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతా ఇచ్చి అందరితో సంతోషంగా ఉండేవాడిని. నా స్నేహితులకి నేనంటే కూడా అంతే ఇష్టం ఉండేది. కాకపోతే చిన్న చిన్న పరిచయాల ద్వారా కలిసిన వాళ్ళతో నేను ఎక్కువగా ఉండేవాడిని కాదు. వాళ్ళతో స్నేహం చేసేవాడిని కాదు. చిన్న చిన్న పరిచయాలు ఎక్కువ కాలం ఉండవు అని నమ్మేవాడిని. కానీ నా నమ్మకం నిజం కాదు అని చెప్పడానికి నా జీవితంలోకి వచ్చింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి నా జీవితంలోకి రావడమే కాదు తానే నా జీవితంగా మారిపోయింది. నాకున్న స్నేహితుల పిచ్చితో నాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో స్నేహితులు ఉండేవారు. అందులో ఒక డిపార్ట్మెంట్ అమ్మాయితో నా స్నేహం కొంచెం ఎక్కువగానే ఉండేది. తన పేరు లేఖ్య. నా ఖాళీ సమయాల్లో ఎక్కువగా లేఖ్య దగ్గరికి వెళ్ళి తనతో సమయాన్ని గడిపేవాడిని . నా గురించి నా జీవితం గురించి ప్రతి ఒక్కటి తనకి తెలుసు.



లేఖ్యకి తన ఇంటివద్ద చిన్ననాటి స్నేహితురాలు కీర్తి ఉండేది. ఇద్దరు చిన్నప్పటి నుండి చాలా మంచి స్నేహితులు. ఒకసారి లేఖ్య, కీర్తిని తీసుకుని మా కళాశాలకు వచ్చింది. నేను కీర్తి నీ మొదటి సారి చూసింది అక్కడే. లేఖ్య తన స్నేహితులు అందరికి కీర్తిని పరిచయం చేసింది. అప్పుడే నాకు తను పరిచయం అయ్యింది. ఆ క్షణం తనని అలానే చూస్తూ ఉండిపోవాలని అనిపించింది. తను అక్కడ ఉన్నంత సేపు నేను తననే చూస్తూ ఉండిపోయా. కాసేపటి తరువాత తను వెళ్లిపోయింది. ఇక అప్పటి నుండి నా మనసు నాలో లేదు, తనని చూడాలి మాట్లాడాలి అనే తపన నాలో పెరిగింది. లేఖ్య దగ్గరికి వెళ్ళి తన గురించి తెలుసుకుని, తన ఫోన్ నంబర్ అడగాలి అనిపించింది. కానీ అలా అడిగి తర్వాత నా వల్ల వారిద్దరి మధ్య ఏదైనా ఇబ్బంది వచ్చి, గొడవ రాకూడదు అని అడగకుండానే ఉండిపోయా. ఇక ఆ తర్వాత అప్పుడప్పుడు కీర్తి మా కళాశాలకు వచ్చేది, వచ్చిన ప్రతి సారి నేను ఏమి మాట్లాడకుండా తనని చూస్తూ ఉండేవాడిని. తను కూడా ఏమి మాట్లాడేది కాదు. అలా అలా కొన్ని రోజులు గడిచాయి, అయినా నేను తనని చూడడం, తను నన్ను చూడడంతోనే సరిపోయేది. కొన్ని రోజుల తర్వాత నేను మా స్నేహితులు, లేఖ్య అందరం కలిసి ఒక చిన్న విహార యాత్రకి వెళ్ళాలి అని నిర్ణయించుకుని వెళ్ళాం, అక్కడికి మాతో పాటు కీర్తి కూడా వచ్చేది. నాకు తనకి మధ్య మాటలు కలిశాయి. మెల్ల మెల్లగా మేమిద్దరం మాట్లాడుకోవడం ప్రారంభించాం. మేమందరం ఒకసారి విహారయాత్రకి వెళ్లాం.



విహారయాత్ర లో ఎంతో ఆనందంగా గడిపి తిరిగి ఇంటికి వచ్చేశాం. ఆ విహార యాత్ర నాకు జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని, జ్ఞాపకాలని ఇచ్చింది. ఎప్పుడు కుటుంబం తో, స్నేహితులతో వెళ్ళినా రాని సంతోషం ఎందుకో నాకు తెలియకుండానే ఈ విహారయాత్ర నాకు ఇచ్చింది, దానికి కారణం కీర్తి రాకనే అని నా మనసు చెప్పింది. ఇక బాగా ఆలోచించాను, కీర్తితో నేను చేసిన విహారయాత్ర నే నాకు అంత సంతోషాన్ని, ఆనందాన్ని, జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చినప్పుడు, నేను నా జీవితం మొత్తం కనుక కీర్తి తో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అనిపించింది. తను నాతో ఉన్న అన్ని రోజులు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, అదే తను నాతో జీవితాంతం ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటానో అనిపించింది.



ఇక ఆలస్యం చెయ్యకుండా కీర్తిని కలవాలి అనేలోపు కీర్తినే నన్ను కలవడానికి వచ్చింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కీర్తి తో నేను చెప్పేలోపు తానే నన్ను ప్రేమిస్తున్నాను అని, లేఖ్య నిన్ను పరిచయం చేసినప్పుడే, నీ గురించి ఏమీ తెలియకుండానే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను... అంతేకాకుండా మీ కళాశాలకు పదే పదే రావడానికి కారణం కూడా నిన్ను చూడడానికే. నీతో మాట్లాడాలి అని చాలా సార్లు ప్రయత్నించాను, కానీ ఎందుకో నా వల్ల కాలేదు. ప్రతి రోజు నీ గురించి లేఖ్యని అడిగి తెలుసుకునే దానిని. విహారయాత్ర లో నీతో గడిపిన ప్రతి రోజూ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అందుకే ఆ సంతోషం నాకు జీవితాంతం కావాలి అని నిర్ణయించుకుని నీ దగ్గరికి వచ్చాను. నన్ను పెళ్ళిచేసుకుని నాకు నా సంతోషాన్ని ఇస్తావా ?? అని అడిగింది. తను అలా అడిగేసరికి నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. నిజానికి నేను తనకి ఇదే విషయం చెప్పడానికి వచ్చాను అని నేను కూడా తనని ప్రేమిస్తున్నాను అని చెప్పేశాను.ఇక అలా మా ప్రేమ యాత్ర మొదలయింది. నాకు ఒక సాఫ్టువేర్ కంపెనీలో లో మంచి ఉద్యోగం వచ్చింది. వెంటనే నేను కీర్తి విషయం మా ఇంట్లో చెప్పి మా పెళ్లికి నా తల్లిదండ్రులని ఒప్పించాను. కానీ కీర్తి ఇంట్లో మాత్రం మా పెళ్ళికి ఒప్పుకోలేదు, అంతేకాకుండా కీర్తి కి మరో సంబంధం తెచ్చి పెళ్లి చెయ్యాలని చూశారు.


తన తల్లిదండ్రులకి ఎంత చెప్పినా వినకపోయేసరికి ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో కీర్తి ఉండిపోయింది. ఇక నేను నా తల్లిదండ్రుల అండతో కీర్తి దగ్గరికి వెళ్లి నాతో పాటు వస్తావా?? పెళ్లి చేసుకుని జీవితాంతం నిన్ను సంతోషంగా చూసుకుంటా అని అడిగాను. తను నాతో నా తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం నేను చేసుకోలేను, గడిపితే నీతోనే సంతోషంగా నా జీవితాన్ని పంచుకుంటాను, లేకుంటే నువ్వు లేని ఈ జీవితం నాకు వద్దు అని చెప్పేసింది. ఇదే విషయం తన ఇంట్లో వాళ్ళకి చెప్పి తను నాతో పాటు వచ్చేసింది. నా తల్లిదండ్రులు మా ఇద్దరి పెళ్లి చేసేశారు. అంతేకాకుండా తన తల్లిదండ్రులు తనతో లేరు అన్న లోటు తనకి తెలియకుండా నా తల్లిదండ్రులు కీర్తి నీ సంతోషంగా చూసుకుంటున్నారు. నన్ను నమ్మి నాకోసం తన తల్లిదండ్రులని వదులుకున్న కీర్తి కి నేను వాళ్ళని తిరిగి ఇవ్వ లేకపోవచ్చు కానీ, జీవితాంతం తనకి ఎలాంటి కష్టం రాకుండా, సంతోషంగా చూసుకుంటాను. ఇలా నా జీవితంలో ఏర్పడిన చిన్న పరిచయం కాస్తా ప్రేమగా మారి నాకు జీవితాంతం సంతోషాన్ని ఇస్తూ, నాతో జీవితాన్ని పంచుకుంది.