Read Naga bhandam - 12 by కమల శ్రీ

నాగ బంధం - 12

                  💎నాగ'బంధం'💎
                  (పన్నెండవ భాగం)

"మరుసటి దినం ఏకాదశి...  మంచి రోజు ఆ రోజు నాట్యము నేర్చుకునేందుకు గురువు దగ్గర కు వెళదాం" అన్నట్టు సైగ చేశాడు శైలేంద్ర.

"సరే...  నీ మాటే నా మాట"  అన్నాడు సదాశివ.

మరుసటి ఉదయం పూజాధికాలు ముగించి ఫలహారాలు చేసి శైలేంద్ర,సదాశివా బయలుదేరారు నాట్యం నేర్చుకునేందుకు.కాసేపు నడిచే సరికి సదాశివ అలసిపోయాడు.

"శైలా ! పొద్దున్ననగా నడవడం మొదలుపెట్టాము ఇంకా ఎంత సేపు నడవాలి" అన్నాడు ఆయాసం గా సదాశివ.

"వచ్చేస్తాం .... ఇంకొంచెం నడిస్తే "అన్నట్టు సైగ చేసాడు.

"అమ్మో ! ఇంకొంచెం సేపు నడవాలా నా వల్ల కాదు బాబు.ఇప్పుడే చేరిపోతాం అని చెప్పి కనీసం   ఫలహారం కూడా సరిగ్గా చేయనివ్వలేదు.. గంట నుంచి నడిపిస్తున్నావ్. ఇంక నడవడం నా వల్ల కాదు" అన్నాడు ఆయాసం గా.

"ఏంటి మిత్రమా నీ మిత్రుడు కాసేపు నడుచుటకే రొప్పుచుండిన మరి ప్రతిదినమూ నడుచునా!" అన్నాడు తక్షక, శైలేంద్ర భుజం పై నుండి.

శైలేంద్ర నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి

"మన్నించు మిత్రమా! నీ మిత్రునికి ఏమైనా అనినచో నీకు కోపము వచ్చును కదా.. సరి... అయినచో తనని మాటలలో పెట్టుము" అన్నాడు మళ్లీ.

"సరే" అన్నట్టు సైగ చేసి సదాశివ ని చేత్తో తట్టి పిలిచాడు.

"ఏంటి శైలా!" అన్నాడు సదాశివ.. 

తన దగ్గర ఉన్న మూట లో ఉన్న తినుబండారాలు అతనికి ఇచ్చి తినమని చెప్పాడు.

"నీవెంత మంచి మిత్రునివో ... నా మనసుని ఇట్టే చదివేస్తావు!" అన్నాడు సదాశివ అవి తీసుకుని తింటూ.

అలా వారిద్దరూ మాటల్లో ఉండగా తక్షక వారిరువురినీ తన మంత్ర శక్తి తో పద్మనాభపురానికి చేరేటట్టు తన చేశాడు.

మాటల్లోనుంచి తేరుకుని చూసేసరికి ఓ గ్రామంలో ఉండటం తో....

"శైలా! ఇది ఏ గ్రామం.మనమీ గురువు గారి గ్రామానికి చేరుకున్నామా. మాటల్లో పడి ఇంత దూరం నడుచుకుని వచ్చేసామా!"  అన్నాడు ఆశ్చర్యంగా సదాశివ.

"అవును" అన్నట్టు సైగ చేశాడు శైలేంద్ర.

తక్షక చెప్పిన అంచనాలను వింటూ శైలేంద్ర వెళ్లి ఓ ఇంటి తలుపు తట్టాడు.

అతని అడుగు ఆ ఇంటి ముందు పడిన మరుక్షణం పూజా మందిరంలోని  శివుని లింగం నుంచీ.... పంచలోహపు దేవీ ప్రతిమ నుంచి వింత కాంతి రావడం మొదలుపెట్టి ఇల్లంతా వ్యాపించింది.

అదే సమయంలో పంచాక్షరి అడవి లో కూడా అమ్మవారి ప్రతిరూపమైన రాయి నుంచీ, భైరవకోన లో ఉన్న  కాళీమాత విగ్రహం నుంచీ, నాగలోకం లో ఉన్న కర్కోటక పూజామందిరం లోని శివలింగం నుంచీ, చంద్రయ్య గూడెం లోని జోగయ్య స్వామి గుడిసె లోని శివలింగం నుంచీ,నందీశ్వర కొండ దగ్గర రుద్రాక్ష గురువు గారు ఉండే గుహ లోని శివలింగం నుంచి  వింత కాంతి ఆవిష్కృతమైంది.

తలుపు చప్పుడు కి ఇంట్లో పనులు చేసుకుంటున్న శతాక్షి వెళ్లి తలుపు తీసింది.

ఎదురుగా ఉన్న  ఆ ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ "ఎవరూ?" అంది....

"మేము...  మేము...."  అంటూ సణుగుతున్న సదాశివ ని చూస్తూ..

"ఆ...  ఏంటీ మీరు...  చెప్పండి... ఇంట్లో  పని  ఆపి మరీ వచ్చా.. " అంది శతాక్షి.. 

"అదీ ఇక్కడ నాట్యం.."  అంటున్న సదాశివ మాటలకు...

"ఏంటో..  చెప్పండి తొందరగా..  అలా ఒక్కో మాటా చెప్తుంటే మాకేం అర్థం మౌతుంది" అంది శతాక్షి.

వారిలా మాట్లాడుకుంటుండగా శంకరుడు బయటకు వచ్చాడు.పూజా గది నుంచి వెలుగు ఆవిష్కృతమైయ్యిందంటే గురువు గారు చెప్పినట్టే జరుగుతుందన్న మాట అనుకుంటూ.

"శైలా...  నేను చెప్పలేను కానీ నువ్వే చెప్పు" అన్నాడు సదాశివ, శైలేంద్ర నే చూస్తూ.

అంతవరకూ ఆమె నే కల్లార్పకుండా చూస్తున్న శైలేంద్ర సదాశివ మాటలతో మామూలుగా అయ్యి...

"మేము మీ వద్ద నాట్యము నేర్చుకునేందుకు వచ్చాము" అన్నట్టు సైగ చేశాడు.

ఆమె కి అతను ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు.

"ఏంటీ...  ఏం చెప్తున్నారో అర్థం కాలేదు" అంది.

"మాకు మీరు నాట్యము నేర్పించాలి" అన్నాడు సదాశివ భయంగానే, అంతవరకూ అతను నాట్యము నేర్పే గురువు అంటే ఎవరో మధ్యవయస్కుడు అనుకున్నాడు కానీ ఇలా ఓ అందమైన అమ్మాయి అనుకోలేదు.

"ఏంటీ...  నాట్యమా...  ఎవరికి నేర్పించాలి...మీకా.. నేను  చిన్నపిల్లలకైతే నేర్పిస్తా...  అదీ వీలు చూసుకుని..  అంతే కానీ పెద్దవాళ్లకీ...  అందునా మగ వాళ్లకీ అస్సలు నేర్పను" అంది... శతాక్షి,  శైలేంద్ర వైపు వింతగా చూస్తూ..

"అయ్యో!  అలా అంటే ఎలా సోదరీ వారు పాపం ఎంత ఆశతో నీ వద్ద నాట్యము నేర్చుకొనుటకు వచ్చితిరో పాపం.అయినా ఎంత దూరం నుంచి వచ్చినారో కనీసము ఇంటి లోకి కూడా రానీయకుండా అలా గుమ్మం వద్దనే మాట్లాడుతారా ఎవరైనా" అన్నాడు శంకరుడు.... తన గురువు గారు చెప్పిన వ్యక్తి ని చూసిన ఆనందం లో.

"అలా ఎలా ఇంట్లో కి రానిస్తాం అన్నయ్యా...  ఏమో వీళ్లు దోపిడీ దొంగలు అయినా కావచ్చు...  మనల్ని కొట్టి పడేసి మన ఇంట్లోని సొత్తంతా దోచుకుపోడానికి వచ్చారేమో..." అంది శతాక్షి.....  శైలేంద్ర వైపు నుంచి చూపు మరల్చకుండా...

ఏదో ఉంది ఈ అబ్బాయి లో.... అస్సలు చూపులు మరల్చకుండా ప్రతీక్షణం తనవైపే చూడాలనిపించేలా...  ఎప్పుడో చూసిన వ్యక్తి లా అనిపిస్తున్నాడామెకు...

ఆ చూపులకు అర్థం తెలిసిన తక్షక....  సోదరీ! నిన్ను బావ గారి వద్దకు చేర్చినాను..  ఇంక మీ ఇరువురికీ గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు రావడమే తరువాయి అనుకున్నాడు మనసులో..

ఆమె తమ ని దోపిడీ దొంగలు అనడం తో  శైలేంద్ర కి నవ్వూ, సదాశివకి కోపం ఒకేసారి వచ్చాయి.

"ఏంటీ...మేము దోపిడీ దొంగలమా...  ఎవరనుకున్నావు అసలు...  ఇదిగో ఇతను నా మిత్రుడు... శివశైలేంద్ర...  సాక్షాత్ ఆ పరమేశ్వరుని వరప్రసాదం.. అన్నాడు కోపంగా.

ఆ.. అతను పరమశివుని వరప్రసాదమా....  ఇదిగో నేనెవరనుకుంటున్నారు...  శతాక్షి...  నేను కూడా పరమేశ్వరుని వరప్రసాదాన్నే....

అందరూ..  అదే మాట చెప్తారు కానీ...ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే నాకు దోపిడీ దొంగల్లానే అనిపిస్తున్నారు..  నేను  మీకు నాట్యము నేర్పే ప్రసక్తే లేదు. మీరిక వెళ్లొచ్చు అన్నట్టు చేయి వీది వైపు చూపించింది.

"అదిగో మళ్లీ అదేమాటా...మా వాడు నీలకంఠపురం పెద జమీందారు గారు...  హరిహర రావు గారి ఏకైక సంతానం...సాక్షాత్ ఆ పరమశివుని వరప్రసాదం అని మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలలందరికీ తెలుసు.

మీరు మాకు నాట్యము నేర్పకపోయినా పరవాలేదు కానీ ఇలా నా స్నేహితుడిని, నన్ను దొంగ లా చూడవద్దు" అన్నాడు కోపంగా సదాశివ.

అంతవరకూ వారి సంభాషణ వంట గదిలో నుంచి వింటున్న కైవల్య...  మధ్య గది లో ఏవో పుస్తకాలు చూస్తున్న నాగేంద్ర గారూ విని... ఆనందంతో గుమ్మం వద్దకు వచ్చి...

"ఏంటీ! నీలకంఠ పురం నుంచి వచ్చారా...హరిహరరావు గారి కుమారుడా....  ఆ రోజు.... అంటూ ఏదో ఆలోచిస్తూ...  మాట మార్చి....

రండి బాబూ లోపలికి రండి.శతాక్షీ వారికి దారి విడు" అంటూ చిన్నగా మందలించారు నాగేంద్ర గారు శతాక్షి ని.

చేశేదేం లేక శతాక్షి వారిద్దరికీ దారిని ఇచ్చింది.

ఇద్దరూ ఇంట్లో కి అడుగు పెట్టారు.

"బాబూ...  మీరు  మా ఇంటికి రావడం మా అదృష్టం" అన్నారు నాగేంద్ర గారు,  శైలేంద్ర కీ..  సదాశివ కీ కూర్చోవడానికి  ఉచితాశనాలు చూపిస్తూ...

వారిద్దరూ ఆయనకు వినయ పూర్వకంగా నమస్కరించి ఆ ఆసనాలపైన కూర్చున్నారు.

శతాక్షీ...  అబ్బాయిద్దరికీ....  చల్ల తీసుకుని రా అన్నారు...

అలాగే నాన్న గారు అంటూ వెళ్ళి మజ్జిగ చిలికి రెండు  వెండి గ్లాసుల్లో వేసి తీసుకుని వచ్చింది.

ఆ గ్లాసు  అందుకుంటూ శైలేంద్ర ఆమె నే రెప్పలార్పకుండా చూస్తూ ఉన్నాడు.

వీడేంటి ఇలా ఆ అమ్మాయి వైపే చూస్తున్నాడు. ఇక్కడ కానీ స్థిరనివాసం ఏర్పాటు చేయాలని చూస్తున్నాడా ఏంటీ అని  మనసులో అనుకుంటూ....  శైలేంద్ర ని కొద్ది గా కదిపాడు సదాశివ.

💎💎💎

  అతడలా చేయడంతో మామూలు మనిషైన శైలేంద్ర                 
  "ఏంటీ?." అన్నట్టు చూశాడు సదాశివ వైపు...

"శైలా... ఆ చూపులు ఆమె పై నుంచి మరల్చు..." అన్నాడు మెల్లగా సదాశివ..

దానితో.. అతికష్టం మీద ఆమె వైపు నుంచి చూపు తిప్పుకుని ఆమె  అందించిన  చల్ల తీసుకుని తలపైకెత్తి తాగుతున్నప్పుడు అతని గొంతుపై ఉన్న మచ్చ ని గమనించింది శతాక్షి...

"ఏంటీ ఈ మచ్చ...  ఇలా ఉంది.శివుడు గరలాన్ని తాగాక అతని గొంతు నీలం రంగులో మారినట్టు.. ఇతని గొంతు నీలం రంగులో ఉంది...  కానీ అది కూడా చాలా బాగుంది.అందంగా ఉంది "అనుకుంది మనసులో.

"బాబూ ... ఏంటి ఇలా వచ్చారు.. ఏదైనా  విశేషమా! " అన్నారు నాగేంద్ర గారు.

"అలాంటిదేం లేదండీ. మీ అమ్మాయి వద్ద నాట్యము నేర్చుకోవాలని మా వాడి కోరిక. అన్ని కలల్లో ఆరితేరాడు. ఇదొక్కటే ఎందుకు వదిలేద్దామని అన్నాడు సదాశివ.

"నాట్యమా!మా  అమ్మాయి కి ఏదో వచ్చింది చేసుకుంటుంది.ఏగురువు వద్దా నేర్చుకోలేదు.చిన్నప్పటి నుంచి తనకి అబ్బిన విద్య అది.మీ లాంటి వ్యక్తులు స్వయంగా వచ్చి అడిగితే  కాదంటామా.కదూ  కైవల్యా!"  అన్నారు నాగేంద్ర  గారు.

"అవునండి.ఎప్పుడూ అనుకోవడమే కానీ ఇంతవరకూ  మిమ్మల్ని చూసింది లేదు.కానీ మీరే ఇలా మా ఇంటికి రావడం మేము చేసిన అదృష్టం " అంది కైవల్య.

"ఏంటట ఇతని గొప్ప మా వాళ్ళు తెగ పొగిడేస్తున్నారు తనని" అని  మనసులో అనుకుంది  శతాక్షి.

"ఏమ్మా ! అబ్బాయికి  నాట్యము  ఎప్పటి నుంచి నేర్పిస్తావో చెప్పు" అన్నారు నాగేంద్ర  గారు శతాక్షి ని  చూసి.

"ఇదేంటి ... ఇలా  అడుగుతారు  నేర్పించడం  ఇష్టమా అని   అడగాలి. కానీ ఎప్పటి నుంచి  నేర్పిస్తావు  అంటారేంటి అని  ఉడుక్కుంటూ వాళ్ళ  ఇష్టం  నాన్న  గారూ. ఎప్పటి నుంచి  నేర్చుకుంటారో" అంటూ  శైలేంద్ర  ని  క్రీగంట  చూస్తూ  అంది  శతాక్షి.

"ఈ రోజు  నుంచే  నేర్చు కుంటాము. ఏకాదశి మంచి రోజు కదా!" అన్నట్టు సైగ చేసాడు శైలేంద్ర.

"అవును కదా మర్చే పోయాను సోదరి.. ఈ  రోజు మంచి రోజు. ఈ రోజు నుంచే  నేర్పించడం మొదలు పెట్టు" అన్నాడు శంకరుడు.

"ఓహ్.. అన్నయ్య కూడా వీరితోనే చేరిపోయాడు. అందరూ మరీ ఇంతలాఇతన్ని సమర్థించుకుంటున్నారు. ఏం  చేస్తాం నేర్పక చస్తానా!" అని మనసులో అనుకుని,

"సరే... నాన్న గారూ.. ఈ రోజు నుంచే నేర్పిస్తా" అంటూ  తను రోజూ నాట్యము చేసుకునే గది వైపు అతన్నీ, సదాశివనీ తీసుకుని వెళ్లింది.

ఆమె వెనుకే వెళుతున్న శైలేంద్ర "అహో! ఎంతటి సౌందర్యవతి.ఇంతవరకూ ఇటువంటి అపురూప సౌందర్య రాశి చూడలేదే.

అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను. పరాయి ఆడపిల్ల కోసం ఇలా అనుకోవడం కూడా తప్పేకదా... కానీ ఎందుకో ఎంత అదుపు చేసుకుంటున్నా నా చూపులు ఆమె నుంచి మరల్చుకోలేకపోతున్నాను.

ఇన్ని రోజులూ ఎందరో అమ్మాయిలు నా కళ్లెదుట తిరుగుతున్నా ఎప్పుడూ ఇలా అనిపించలేదు. కానీ ఎప్పుడైతే నా మిత్రుడు నాకు ఈమె ని చూపించాడో అప్పటినుంచీ ఈమె ని తలుచుకోకుండా ఉండలేకపోతున్నా... ప్రతీ నిముషం ఈమెనే చూడాలని అనిపిస్తుంది.

ఏముంది ఈమెలో. ఇంతలా నన్ను ఆమె ఎందుకు ఆకర్షిస్తోంది" అనుకుంటూ ఆమెనే అనుసరించాడు శైలేంద్ర.

అతని తలపులు తెలుసుకున్న తక్షక తనలో తనే నవ్వుకుంటూ మిత్రమా నీవే నా బావ అనీ.తను నా సోదరి అనీ.మీ ఇరువురికీ ఎప్పటికి అవగతమగునో. మీకు మీ గత జన్మ జ్ఞప్తి కి వచ్చేంతవరకునూ ఏమియునూ సేయలేమే.

నాకుగా నేను మీ ఇరువురికీ తెలుపకూడదు.. కానీ మీరు తెలుసుకునేలా కొన్ని ఘటనలు సేయవచ్చును. ప్రస్తుతము ఒకరినొకరు చూసుకొనినారు. ప్రతి దినమూ కలుసుకొందురు. ఇలా కలుసుకొనిన కొన్ని విషయములైననూ అవగతమగునేమో.

ఇది స్వ కార్యము కొరుకు నేను సేయుచున్న ప్రయత్నము కాదు. స్వామి కార్యము కూడా ఇమిడి వున్నది...  కావున ఆ మహేశ్వరుడు వీరిరువురికీ తమ గత జన్మ  జ్ఞాపకములు జ్ఞప్తి కి వచ్చేలా సేయును...  అనుకొని వారిని చూస్తున్నాడు రామచిలుక లా అక్కడే ఉన్న ఆ గది లోని దుంగ పై నుంచి గమనిస్తున్నాడు వారినే...

నాగలోకము :-

"ఏమి ఈ కాంతి పుంజము. ఎచుట నుంచి జనియించుచున్నది. ఇంత  వెలుగు రేఖ ను నేనిదివరకెన్నడూ  సూడనైనా సూడలేదే.

పరమశివుని లింగము నుంచి ఇంతటి కాంతి పుంజము జనించుచున్నదనిన.. ఇది దేనికైననూ సంకేతమా. అటులే అయినచో దేనికి సంకేతము.." అని కర్కోటక  యోచన సేయుచూ...

"నేనిచటనే యుండిన ఏమియునూ తెలియకున్నది. భూలోకమునందే యుండుచూ అచ్చట ఏమి జరుగుచున్నదో తెలుసుకొనవలె.. తక్షణమే భూలోకముకము నకు ఏగెద" అని అనుకుంటూ తన మంత్ర ప్రభావము చేత భూలోకమున నందున చంద్రయ్య గూడేం నందు అడుగిడి...

పిదప కర్కోటక తన రూపము ను ఓ మార్జాలము వలె రూపాంతరము చెందించి... జోగయ్య గుడిసె వైపు పయనమయ్యాడు.

"ఆ మనుజుని గుడిసె యందే యున్నది నాగమణిమయ భూషితమగునట్టి నాగమణిహారము. సరియైన సమయము సూసి దాన్ని నా చెంతకు చేరునట్టు చేసుకొనవలె....

కానీ...ఆ దినమున నన్ను  ఆ గుడిసె లోపలకు పోకుండా అడ్డుపడిన ఆ కపట నాగలోకపు వాసియైన తక్షక కి సరియైన సమాధానము సెప్పెద...

ఈ కర్కోటక ను రెచ్చగొట్టిన ఏమి జరుగునో వానికి అవగతమగును. ఇప్పటికే అతని సోదరీ, ఆమె పతి దేవుడు నా వలన భూలోక వాసము సేయుచుంటిరి. ఇప్పుడు తనకునూ భూలోకవాసమనిన మోజు కలిగిన దేమో...

అతి బలవంతుడనూ, మహా శివునికి ప్రియమైన భక్తుడనూ, నాగలోకపు రాజైన నన్నే ఎదురించవలెనని యోచన సేయుసుంటివి కదూ.... అందుకు తగిన ప్రతిఫలం నీవు అనుభవింతువు..." అనుకొనుచూ..  అక్కడకి చేరి...  సరియైన సమయము కొరకు వేచియున్నాడు.

జోగయ్య తన గుడిసె లోని శివలింగము నుంచి వస్తున్న వెలుగును చూస్తూ...

సామీ!  ఏటీ ఎలుగూ... నీ లింగం నుంచి ఇంతవరకూ ఎప్పుడూ ఈ ఎలుగు రానేదే...  ఇది మాకు సుబమా అసుబమా సామీ.

సుబమైతే నీ మేలుని మరువము సామీ... అదే అసుబమైతే మాకు సావు తప్ప మరే దారీ లేదు....

ఆలిని ఎతుకుతూ ఎలుతున్న మా వోలి ని ఎల్లేలలా కాపాడు...  మేము సేసేడిది నీ పనే... కానీ సామీ...  ఆ దినమున నా గుడిసె కానికి వొచ్చిన ఆ ఇంత పామెక్కడిదీ...  నా సిన్నప్పటి సంది ఇయ్యాల దాంకా అసుంటి పాముని నే సూడలే..

అది నన్ను సంపనీకి వచ్చిందా.. నేదా దానికి ఇంక ఏదైనా...  అని అనుకున్నప్పుడు గుర్తొచ్చింది..

ఆ హారము శివ లింగము నుంచి జారి పడినది అని...  రచ్చించే వాలి జాడ ఎరుకైనాదనే సంబడం లో ఆ తప్పిదము జరిగిన ఎంత సేపటికీ పసి గట్ట లేకున్నాను...

ఆ మాల ని సూపిస్తా ఓ పాలి మా తాత సెప్పిండూ.. " జోగా...  ఇది మామూలు మాల కాదు... సానా సత్తుంది దీనికి...  ఇది మన తాత ల నాటి నుంచి ప్రతీ తరము వోళ్లూ కాపాడుకుంటా వస్తుంటిమి..

రేపు నీవు ఈ గూడేం కి సామి అయినాక ఇట్టాగే సూసుకుంటా ఉండు...ఇది అట్టాంటిట్టాంటిది కాదు. మన గూడెము ఓలిని  కాపాడతా ఉంటంది..

కానీ అది గెప్పుడూ క్రింద పడనీకు.. అలా పడితే ఏమి జరుగుతాదో...  ఎవలూ తెలుసుకోలేరు... అంటూ జాగ్రత్తలు సెప్పినాడు...

నేనే బుద్ది మందగించి ఏమి సేత్తున్నానో ఒంటి మీన సతన్ లేక పోయి ఇట్టాంటి తప్పు సేసినాను...  ఇక ఎప్పుడూ ఇట్టాంటి పని సేయను...  అని  తనలో తానే అనుకుంటూ...

సామీ.. మన్నించు సామి... ఇట్టా ఎప్పుడూ జరగదు" అంటూ శివలింగానికి నమస్కరించాడు.

నందీశ్వర కొండ :-

ఆ...  ఎంత ప్రకాశవంతమైన వెలుగు... ఇది ఎందువల్ల ఉద్భవించింది...  ఆ వెలుగు నందు...  నా పరమేశ్వరుడు ఎంతందంగా అగుపించాడు నా కంటికి... 

కానీ...  ఇది ఎందువల్ల వచ్చింది.... పరమశివా...  దీనివల్ల  ఆమె కి  ఎటువంటి ఆపదా కలగదు కదా... సెలవీయు తండ్రీ అంటూ తన ఉపాసనా శక్తి తో ఏం జరిగిందో  తెలుసుకోవాలని...  పద్మాసనము వేసి తపో ముద్ర లోకి వెళ్లి....  శివున్ని ఆ వెలుగు కి కారణమేంటో చూపించ మని వేడుకున్నాడు...

అతనికి....  శతాక్షి తో పాటూ నాట్యము చేస్తున్న శైలేంద్ర కనపడ్డాడు.. అంటే...  వచ్చేసాడా అతను.శుభ సూచకం.

అయితే ఇక నుంచి వీరిద్దరూ అప్రమత్తంగా ఉండాలి...  ఆమె చేతిని అతను వీడనంతవరకూ వారిద్దరికీ ఏమీ కాదూ...  అలా జరగకుండా ఉండేలా చూడు స్వామీ అంటూ ఆ మహాశివునికి మనసులోనే అభివాదము చేసి... కళ్లు తెరిచినాడు...

💎💎💎

ఇంకా ఉంది... మరి మన క్షుద్ర ఏం చేయబోతున్నాడు...చంద్రయ్య గూడెం వారికి శతాక్షీ, శైలేంద్ర లు ఎక్కడ ఉందీ తెలుస్తుందా...

కర్కోటక చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా...వారికి తమ గతం ఎలా గుర్తుకు వస్తుంది...  మొదలైన ప్రశ్నలకు సమాధానం తరువాయి భాగంలో .......

ఎప్పటిలాగే చదివి మీ విలువైన సలహాలు సూచనలు సమీక్ష రూపంలో ఇస్తారని కోరుతూ

మీ🤗
కమల'శ్రీ '✍️.రేటింగ్ & రివ్యూ ఇవ్వండి

Veerendhra Narayana

Veerendhra Narayana 4 నెల క్రితం

Sneha Reddy

Sneha Reddy 6 నెల క్రితం

Krishh

Krishh 7 నెల క్రితం

ఈ నవల చదువుతుంటే మధుబాబు గారి కాళికాలయం గుర్తుకు వచ్చింది.

Shankar Reddy

Shankar Reddy 8 నెల క్రితం

chandrashekar reddy

chandrashekar reddy 8 నెల క్రితం