ప్రొద్దున ఎండ కాస్త ప్రశాంతంగా ఉన్నా, రుద్రకోట శివార్లలోకి అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆ కోట ప్రవేశ ద్వారం దగ్గర పడి ఉన్న శిథిలాలు, శతాబ్దాల నాటి గాథలను మోస్తున్నట్టుగా నిశ్శబ్దంగా ఉన్నాయి. గాలిలో ఒక రకమైన పాత వాసన.. మట్టి, తడిసి ఆరిన రాయి, ఇంకా ఏదో తెలియని ప్రాచీన గంధం కలగలిసిన వాసన."గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయేది ఈ ప్రాంతంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశం.. రుద్రకోట!" అనన్య కెమెరా వైపు చూస్తూ ఉత్సాహంగా అరిచింది. ఆమె గొంతు ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ప్రతిధ్వనించింది.విక్కీ మాత్రం కెమెరాను భుజానికి తగిలించుకుని భయం భయంగా అడుగులు వేస్తున్నాడు. చుట్టూ ముసురుతున్న గబ్బిలాల చప్పుడు, నేల మీద పాకుతున్న పాముల పొలుసుల శబ్దం అతడిని వణికేలా చేస్తున్నాయి. "అనన్యా.. ప్లీజ్, నా మాట విను. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. గాలిలో నెగటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.