‘ప్రేమ’ చేతిలో ఓడిన ఓ ‘విజేత’ ..తిరుపతి నుంచి హైదరాబాదు వెళ్ళే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ మరికొద్దిసేపట్లో ఫ్లాట్‌ఫారం పైకి వస్తుందన్న అనౌన్స్‌మెంట్ విని ఉలిక్కిపడింది సౌందర్య. ‘సుందర్ ఇంకా రాలేదు’ అనుకుంది. చేతిలోని హ్యాండ్‌బ్యాగ్‌ని గట్టిగా రెండు చేతులతో పట్టుకుని చుట్టూ చూసింది. సుందర్ ఎక్కడా కనిపించలేదు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఊరు వదలి వెళ్తున్నందుకు ఆమెకు ఎంతో బాధగా మరెంతో భయంగా ఉంది. ఇప్పుడు సుందర్ కనపడకపోవడంతో ఆమెకి మనసులో ఏ మూలో ఆశ మొదలైంది.‘సుందర్ రాకపోతే తను ఇంటికి వెళ్ళిపోవచ్చు. అమ్మానాన్నలు ఎక్కడికెళ్ళావని అడిగితే ఏదో ఒక కారణం చెప్పి నమ్మించవచ్చు. తనను రమ్మని చెప్పి అతను రాకపోవడం సుందర్ తప్పు కనుక తనను నిందించడు’ అనుకుంది.ఆ ఆలోచన రాగానే ఆమెకి నిశ్చింతగా అనిపించింది. ఇంతలో ట్రైను వచ్చి ఫ్లాట్‌ఫారం పైన ఆగింది. తను ఎక్కవలసిన ‘ఎస్-టూ’ కంపార్ట్‌మెంట్ తన ఎదురుగానే ఉంది. ఆమె బెంచీపైనే కూర్చుని ఉరుకులు పరుగులు పెడుతూ ట్రైను