క్షంతవ్యులు – Part 15 చాప్టర్ 35 కళ్లుతెరచి చూసేటప్పటికి ఆస్పత్రి మంచం మీద పడుకుని వున్నాను. యశో నాకాళ్ల వద్ద కూర్చుని వుంది. లఖియా, సరళ మంచం వద్ద రెండు కుర్చీల్లో కూర్చొని వున్నారు. అప్పటికి సంగతి గ్రహించాను. రైల్లోంచి దిగే ప్రయత్నంలో కాస్త దెబ్బలు తగిలివుంటాయి. వారంతా పరధ్యానంగా వున్నారు. వారి వాడిపోయిన ముఖాలు చూసేక నా శరీరంలో నీరసం ఇంకా పెరిగిందనిపించింది . ‘‘మీ ప్రయాణం ఆపేశాను కదూ,’’ అన్నాను. అందరూ ఒక్కసారి తుళ్లిపడ్డారు. క్షణకాలం అంతా నివ్వెరపోయారు. యశో గబగబా లేచివచ్చి నాగుండెల మీద వెక్కివెక్కి ఏడుస్తూ పడిపోయింది. అంత దుఃఖాన్ని నేనింతవరకూ ఎప్పుడూ చూడలేదు. యశో తల హృదయం మీద వుండడంతో ఆయాసం కూడా పుట్టుకు వచ్చింది. ‘‘కాస్త తలతియ్యి యశో ఆయాసంగావుంది, ఎందుకు చెప్పు ఇంత ఏడుపు,’’ అన్నాను. లఖియా చటుక్కున లేచినించుని యశోని లేవదీసింది. యశో ముఖం చూస్తే నాకెంతో భయం వేసింది. ఎంత పాలిపోయింది?