పూర్వకాలంలో ప్రతి ఇంట్లో అరుగులు ఉండేవి ఈ ఆధునిక యుగంలో అరుగులు కనుమరుగైపోయాయి కానీ మా తరం వారికి అవి మాత్రం హంస తూలికా తల్పాలు. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం లో గల మా నాన్న గారి ఇంట్లో మెట్లుకి ఇరుపక్కల ద్వారపాలకులులా రెండు అరుగులు దానిని ఆనుకుని ఒక మెట్టు ఎత్తులో ఎర్ర గచ్చు తో చేసిన వసారా ఉంది. సుమారు 70సంవత్సరాల క్రితం మా నాన్నగారు శ్రీ మధునాపంతుల వెంకట చలపతి రావు గారి చేత నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడం. చారిత్రాత్మక కట్టడం అని ఎందుకు అంటున్నాను అంటే ఎంతో మంది ఈ అరుగుమీద పుట్టిన ఆలోచనలను ఆచరణలో పెట్టి ఉన్నత స్థాయికి తమ తమ రంగాల్లో చేరుకోవడం జరిగి. తొలి రోజుల్లో మా ఇంటి మెట్లకిఎడమ పక్కన ఉండే గదిలో దాన్ని కొట్టు గది అంటాం పంచాయతీ బోర్డు వారి ఆఫీస్ ఉండేది.