మహేశ్వరుడు పరంధాముని కధనం ద్వారా ఈ విడ్డూరం తెలుసుకొని కుమారుని వారింప స్కందగిరిని దర్శిస్తాడు . తండ్రి ఆగమనం తనయునకు పరమానందభరితమవుతుంది . జనకుని ఆనతి మేరకు స్కందుడు సృష్టి కర్తను బంధవిముక్తుని చేస్తాడు . అజ్ఞానం తొలిగిన బ్రహ్మదేవుడు వినయశీలుడై , తన తప్పును గ్రహించి శివకుమారునకు శరణాగతుడవుతాడు . తండ్రికి తనయుడి పాండిత్య ప్రకర్ష తెలుసుకోవాలన్న పితృసహజమైన ఉబలాటం మదిని జనిస్తుంది . పరాత్పరుడు ప్రణవ రహస్యం వివరించమని షణ్ముఖుని ఆదేశిస్తాడు . మంత్ర రహస్యం బహిర్గతం చేయటం పధ్ధతి కాదు గనుక బాలుడైనా తాను గురు స్థానం లో ఉండి జగదీశ్వరుడికే తారక మంత్రం వివరించాలనుకుంటాడు సుబ్రహ్మణ్యుడు . తండ్రిని మించిన తనయుడి ఆలోచన అభయంకరుడికి ఆమోదయోగ్యం అవుతుంది . నేటి ‘ కుంభకోణం’ పట్టణానికి చేరువై యున్న ‘ స్వామి మల’ అను క్షేత్రమున సుబ్రహ్మణ్యుడు సదాశివునకు