“అంటే జీవితాంతం మీరు ఇలా భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటారా? మీరు ఒక తోడు, నీడ, వివాహం..” అని ఆపేశాడు. “మీ సందేహం నాకు అర్థంఅయ్యింది” అని ఆమె చిన్న నవ్వు నవ్వింది. ********************** “నన్ను ఇక్కడ నిత్య సుమంగళి గా గౌరవిస్తారు, ప్రతి పెళ్ళిలో నేను మంగళ సూత్రాన్ని తాకిన తరువాతే వధువుకి మాంగల్య ధారణ జరుగుతుంది. నాకు జీవితాంతం వైధవ్యం లేదు. స్వామి వారికి చేసే ప్రతి పూజా కార్యక్రమం నేను లేనిదే జరగదు. సమాజం నుండి గౌరవం, రాచ మర్యాదలతో కూడిన జీవితం. ఇంతకు మించి ఇంకేమి కావాలి?” అన్నది తనకు తాను సమాధాన పరుచుకునేటట్లు. “సమాజం గౌరవిస్తుందనో లేక రాజ్యం కావాలనుకుంటోందనో కాదు మీ కోసం మీరు ఆలోచించుకున్నారా? మీ బాధలు, సంతోషాలు మీతో పంచుకునే వ్యక్తి ఒకరు కావాలని, వీరే కావాలని మీకు ఎప్పుడూ అనిపించలేదా ” అని అసలు సందేహాన్ని బయట పెట్టాడు